Tags

, ,


ఎం కోటేశ్వరరావు
” సానుభూతి పరులుగా దగ్గరకు చేరి రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్న వారికి భవిష్యత్‌లో జనం పాఠం చెబుతారు ” ఈ మాటలు చెప్పింది పోతులూరి వీరబ్రహ్మంగారు కాదు. మన ప్రధాని నరేంద్రమోడీ కొలువులోని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పని ఎవరు చేస్తే వారికి నిజంగానే జనం బుద్ది చెబుతారు. అది మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకూ, వారి ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీల పెద్దలూ, ఇతర భజన బృందం ఎవరైనా కావచ్చు. డిసెంబరు 25నాటికి రైతాంగ నిరవధిక ఆందోళనకు నెల రోజులు నిండాయి. మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని ” సుపరిపాలనా రోజు ”గా పాటిస్తూ రైతులు దుష్పరిపాలనా చర్యగా పరిగణిస్తున్న వ్యవసాయ చట్టాలను సమర్ధించుకొనేందుకు నరేంద్రమోడీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఒక విడత పంపిణీ పేరుతో ఆరు రాష్ట్రాల రైతులు కొందరిని పోగుచేసి ప్రధాని నరేంద్రమోడీ, ఆయన గణం రైతుల ఉద్యమం మీద దాడి చేశారు. ఎవరి పాత్రను వారు రక్తికట్టించారు. మరోవైపు నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ వినిపించే సమయంలో జన్‌కీ బాత్‌ను జనం దృష్టికి తెచ్చేందుకు డిసెంబరు 27వ తేదీన తాలీ బజావ్‌ (చప్పట్లు కొట్టటం) కార్యక్రమానికి రైతులు పిలుపు నిచ్చారు. అంబానీ-అదానీ ఉత్పత్తులను బహిష్కరించటం, ఇంకా మరికొన్ని కార్యక్రమాలను రైతు సంఘాలు ప్రకటించాయి.


సంస్కరణల పేరుతో జనానికి వ్యతిరేకమైన చర్యలకు పూనుకోవటం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. అంతకంటే ముందు అనేక దేశాల్లో పాలకులు అదేపని చేశారు. జనం చేత పాఠాలు చెప్పించుకొని ఇంటిదారి పట్టారు. నిజానికి ఇది తెలుసుకొనేందుకు ఇతర దేశాలకు పోనవసరం లేదు. ఏ నినాదాలు ఇచ్చినా పేర్లు ఏమి పెట్టినా కాంగ్రెస్‌ పాలనలో జరిగిందంతా ప్రజావ్యతిరేకమైన చర్యలే, అనుసరించినవి దివాలాకోరు విధానాలే.దీని అర్ధం నూటికి నూరూ అవే అని కాదు. బేరీజు వేసినపుడు త్రాసు ఎటు మొగ్గిందన్నదే గీటు రాయి. కొన్ని క్రతువుల సమయంలో మేకలు, గొర్రెలు, ఇతర పశువులను బలి ఇవ్వబోయే ముందు వాటిని ఎన్నడూ లేని విధంగా మేత పెట్టి, శుభ్రం చేసి, అలంకరించి, పూజలు మరీ చేసి బలి ఇస్తారు. ఇక్కడ బలి క్రతువు ముఖ్యం. ప్రభుత్వ విధానాలూ, సంక్షేమ చర్యలు కూడా అంతే.


నరేంద్రమోడీ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ 50ఏండ్లలో చేయలేని వాటిని తాము ఐదేండ్లలో చేశామని ప్రాసకోసం ప్రసంగాలు చేశారు. అంతవేగంగా పని చేస్తున్నవారికి జనం మరో యాభైయేండ్లు అవకాశం ఇవ్వరు. అందువలన కేంద్రమంత్రి తోమర్‌ చెప్పినట్లుగా రైతులు తమకు మద్దతు ఇచ్చిన వారికా లేదా తమను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు, కమిషన్‌ వ్యాపారుల సొమ్ముతీసుకొని కిరాయి ఉద్యమం నడుపుతున్నారని నిందించిన బిజెపికా ఎవరికి పాఠం చెబుతారో తొందరపడనవసరం లేదు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పంపిణీని గతంలో ఎన్నడూ ఇలా ఆర్భాటంగా జరపలేదు. ఇదేదో అదనపు మొత్తం అని రైతులు భ్రమ పడేవిధంగా హడావుడి చేసి రైతులతో మాట్లాడే పేరుతో ప్రధాని, మంత్రులు రైతు ఉద్యమం మీద విరుచుకుపడ్డారు. పోనీ కొత్త విషయాలు ఏమైనా చెప్పారా ? పాడిందే పాడరా అన్నట్లుగా వేసిన నిందనలే వేశారు, పసలేని వాదనలే చేశారు. వ్యవసాయ చట్టాల మీద వెనక్కు తగ్గేది లేదని చెప్పకనే చెప్పారు. నిజానికి కేంద్రానికి, బిజెపికి చిత్తశుద్ది ఉంటే మరోసారి చర్చలకు ఆహ్వానించి ఇలా చేయటాన్ని ఏమంటారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎదుటి వారికి ఇంకా మండుతుంది అన్న విషయం తెలిసిందే.


కొన్ని పార్టీలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తమ రాజకీయ అజెండాను ముందుకు తెస్తున్నాయని ప్రధాని చెప్పారు. నిన్నగాక మొన్న బీహార్‌ ఎన్నికల సందర్భంగా తమకు ఓటేస్తే కరోనా వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పి కరోనాను కూడా రాజకీయం చేసిన పార్టీ నేత మోడీ. ఇలా చెప్పటానికి ఆయనకు 56 అంగుళాల ఛాతీతో పాటు దానితో పాటు పెంచుకుంటున్న బారు గడ్డం, జులపాలు ఉండటమే అన్నది స్పష్టం. రైతు ఉద్యమాన్ని సమర్ధిస్తున్న ఏ పార్టీ అయినా ఆ పేరుతో ఎక్కడైనా ఓట్లడిగిందా ? కేంద్ర ప్రభుత్వం తర్కబద్దమైన పరిష్కారానికి సిద్దంగా ఉందని, ఇతర సమస్యలేవైనా ఉంటే చెప్పాలని మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి రైతు సంఘాలకు లేఖ రాశారు. తర్క వితర్కాలు జరపాల్సిన సర్వోన్నత ప్రజాప్రతినిధుల సభ పార్లమెంటులో అలాంటి అస్కారం ఇవ్వకుండా ఆమోదతతంగం జరిపిన ప్రభుత్వం, కరోనా పేరుతో ఏకంగా శీతాకాల సమావేశాలనే రద్దు చేసిన పాలకులు తర్కానికి తావిస్తారంటే నమ్మేదెలా ? అసలు దానిలో తర్కం ఏముంది. సావిత్రీ నీపతి ప్రాణంబుదక్క వరాలు కోరుకో అన్నట్లుగా చట్టాల గురించి మాట్లాడుతున్నారు.


గతంలో రైతులు అనేక సమస్యలను ముందుకు తెచ్చారు. ఇతర సమస్యలుంటే రైతులు సందర్భం వచ్చినపుడు చెబుతారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్‌గా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత చేకూర్చాలని చేసిన సిఫార్సును ఇప్పుడెందుకు తిరస్కరిస్తున్నారో చెప్పేందుకు నోరెత్తరా ? కౌలు మొత్తాన్ని కూడా మద్దతు ధర నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సు సంగతి తెలియని అమాయకుల్లా ఫోజు పెడతారా ? వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ఎత్తుగడలో భాగంగా ఎవరికైనా విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి రాయితీ ఇవ్వకూడదన్న ప్రతిపాదన గురించి అసలేమీ ఎరగని నంగనాచిలా ప్రవర్తిస్తారా ? రైతులు ఏడుదశాబ్దాల క్రితం మట్టి పిసుక్కొనే స్ధితిలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు, అంత అమాయకులు కాదని తెలుసుకుంటే మంచిది.

కేంద్ర మంత్రులు ఏమి మాట్లాడుతున్నారో,ఎందుకు మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ముందు ఒక ఏడాది పాటు అమలు జరగనివ్వండి, ఫలితం లేదనుకుంటే అప్పుడు సవరించుకుందాం అని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సెలవిచ్చారు. దీని అర్ధం ఏమిటి ? వారు చేసిన దాని మీద వారికే నమ్మకం లేకపోవటం, రైతుల ఉద్యమాన్ని నీరు కార్చే వాదన. ఈ ప్రయోగం చేసేందుకు ఆర్డినెన్స్‌, చర్చ కూడా లేకుండా పార్లమెంటులో ఆమోద ముద్రకోసం ఎందుకు తాపత్రయపడినట్లు ? ఎవరి మెప్పుకోసం ఇది ? కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అవాస్తవాలు చెబుతున్నారని, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా చెప్పారు. అవేంటో నిజమేమిటో చెప్పకుండా మీ బావ రైతుల భూమిని ఆక్రమించుకున్నాడు, మీరు మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా ఆ మాట అంటే కేంద్ర మంత్రి సూటిగానే ఆరోపించారు. నిజంగా అదే జరిగితే చర్య తీసుకోండి-దానికి రైతుల సమస్యకు సంబంధం ఏమిటి ?


తాము అమలు జరుపుతున్న రైతు అనుకూల విధానాలను 2019 కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదా అని మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ నడుపుతున్న ఉద్యమం కాదు, అందువలన ఆ పార్టీ ఏమి చెప్పిందన్నది రైతులకు అనవసరం. ఆ పార్టీని రైతులు ఇందుకే తిరస్కరించారని, రైతులకు అనుకూలంగా ఉంటారని బిజెపిని ఎన్నుకున్నారని అనుకోవచ్చు కదా ! కాంగ్రెస్‌ సంస్కరణల గురించి చెప్పింది తప్ప చట్టాలు ఇలా ఉంటాయని నమూనాను ప్రదర్శించలేదే. పోనీ ఇలాంటి చట్టాలను తెస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళికలో చెప్పి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో బిజెపి నేతలు ఆదిత్య 369 చూస్తే మంచిది.


గతంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులను వారి పాటికి వారిని వదలి వేశారని ప్రధాని చెప్పారు. నిజమే, వారు వదలివేశారు. కానీ మోడీగారు తమను తీసుకుపోయి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగిస్తున్నారని కదా ఇప్పుడు రైతులు భయపడుతోంది. అసలు మార్కెట్‌ కమిటీలే లేని కేరళలో అధికారంలో ఉన్న వారు ఫొటోల కోసం పంజాబ్‌ రైతులతో చేతులు కలుపుతున్నారని మరొక విసురు. అసలు కేరళలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల వ్యవస్ధ లేదు.బీహార్‌లో ఉన్న కమిటీలను రద్దు చేయటాన్ని బిజెపి సమర్ధించింది. దేశంలో మిగతా చోట్ల ఉన్నవాటిని నామమాత్రం చేసేందుకు, పనికిరాకుండా చేసేందుకు పూనుకున్న పెద్దలు కేరళలో మార్కెట్‌ యార్డుల కోసం ఎందుకు ఆందోళన చేయటం లేదని ప్రశ్నించటమే అసలు రాజకీయం. అనేక రాష్ట్రాలలో అనేకం లేవు. కేరళ స్ధానిక సంస్ధలకు ఇచ్చిన అధికారాలు మరొక రాష్ట్రంలో లేవని అందరూ చెబుతున్నారు. ఆరు సంవత్సరాలుగా, అంతకు ముందు ఒక దఫా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం లేదా పార్టీ ఎన్నడైనా కేరళలో మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎందుకు అడగలేదో చెప్పగలవా ?


కేంద్రం సవరించిన మూడు చట్టాలు కేవలం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సంబంధించినవే కాదు, అదొక ముఖ్య అంశం మాత్రమే, కనుక ప్రధాని ఢిల్లీ నుంచి గల్లీ స్ధాయికి దిగి విమర్శ చేశారనుకోవాలి. చట్టాలలోని అంశాలు రైతులకు హానికరం కనుక కేరళ ప్రభుత్వం ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరింది. రాష్ట్ర మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్దంగా గవర్నర్‌ తిరస్కరించారు. కేరళ గురించి చెప్పే ముందు ఎవరైనా కొన్ని విషయాలు గమనంలో ఉంచుకోవాలి. గతేడాది అక్కడి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,695 రూపాయలు చెల్లించగా ఈ సంవత్సరం రూ.2,748 రూపాయలకు పెంచి రైతుల నుంచి కొనుగోలు చేసింది. కేంద్రం నిర్ణయించిన ధర రూ.1,868 కాగా అదనంగా ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ రూ.880 అదనంగా ఇస్తోంది. ఎక్కడైనా ఇంతధర ఇస్తున్నారా ?( ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలకు కొనుగోలు చేస్తే అందుకయ్యే వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని, ఎఫ్‌సిఐకి ఇవ్వాల్సిన కోటా మేరకే మద్దతు ధరకు తీసుకుంటారని, మిగతా సేకరణతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 18న ఎఫ్‌సిఐ చైర్మన్‌కు పంపిన ఫైల్‌లో స్పష్టం చేసింది.) మార్కెట్‌ కమిటీలు లేవని, మాకేమీ సంబంధం లేదని, నిధుల కొరత అనిగానీ వదలివేయలేదు, రైతాంగాన్ని ఆదుకోవటం ముఖ్యం.


నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్ని రైతువ్యతిరేక చర్యలు తీసుకున్నా తమను ఆదుకొనే వామపక్ష ప్రభుత్వం ఉందన భరోసా అక్కడి రైతుల్లో ఉండవచ్చు. అయినా ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతు తెలపటం తప్పెలా అవుతుంది. అన్నింటికీ మించి కేరళలో ప్రధానమయిన పంటలు వరి, గోధుమలు కాదు.అక్కడి భౌగోళిక పరిస్ధితుల్లో తోట పంటలు, టీ, కాఫీ, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పంటలు ఎక్కువ. వాటికోసం దేశమంతటి నుంచి వ్యాపారులే రావటం లేదా తమ ఏజంట్లను ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేస్తారు. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దిగుమతి, పన్ను విధానాలు రైతాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ వ్యవసాయ మార్కెట్‌ యార్డులు లేవు. మోడీ సర్కార్‌ చెబుతున్నదాని ప్రకారం కార్పొరేట్‌ సంస్దలు లేదా వ్యాపారులు పోటీపడి అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అలాంటి ప్రత్యేక లావాదేవీలేమీ అక్కడ లేవు. కేరళ లేదా యార్డులను రద్దు చేసిన బీహారుకు గానీ ప్రయివేటు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. రబ్బరు పారిశ్రామికవేత్తల వత్తిడి కారణంగా పన్నుతగ్గింపుతో రబ్బరు దిగుమతులు రబ్బరు ధరల పతనానికి, ఖాద్య తైలాల దిగుమతులతో కొబ్బరి ధర పతనం, వేరేదేశాల నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న సుగంధ ద్రవ్యాల కారణంగా వాటి ధరలు పడిపోతున్నాయి. ఇవేవీ మార్కెట్‌ యార్డుల పరిధిలోని అంశాలు కాదు. అందుకే అక్కడి రైతులకు మార్కెట్‌ యార్డులు ఉన్నాయా లేవా అన్నదాని కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ముఖ్యం. కేంద్రానికి చిత్తశుద్ది, శ్రద్ద ఉంటే నరేంద్రమోడీ వాటి గురించి మాట్లాడి ఉంటే విస్వసనీయత ఉండేది.


తాను తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల ఫలితాలు రావటం ఆరంభమైందని నరేంద్రమోడీ చెబుతున్నారు. రైతుల్ని నమ్మమంటున్నారు. నెల రోజుల క్రితం క్వింటాలు బంగాళాదుంపలను రూ.3,400కు అమ్ముకున్న రైతులు ఇప్పుడు 700కు అమ్ముకుంటున్నారు. మొక్కజొన్నల కనీస మద్దతు ధర 1850 ఉండగా కొన్ని చోట్ల నాలుగైదు వందలకు తక్కువకు రైతులు అమ్ముకుంటున్నారిప్పుడు.పత్తి కూడా తక్కువకే ఆమ్ముకున్నారు. ఈ కారణంగానే కనీస మద్దతు ధరలకంటే ఎవరూ తక్కువకు కొనకూడదు, కొంటే నేరం అనే విధంగా చట్టం చేయాలని రైతులు అడుగుతున్నారు. నిజానికి ఇప్పుడు చేసిన చట్టసవరణలు నిజంగా కార్పొరేట్లు,ఇతర వ్యాపారుల మధ్య పోటీని పెంచి రైతాంగానికి కనీస మద్దతు ధరల కంటే ఎక్కువే వస్తే రైతుల కంటే ఎక్కువ లబ్ది పొందేది ప్రభుత్వాలే. పంటల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, వాటిని నిలువ చేసేందుకు గోదాములతో పని లేదు, సిబ్బందీ అవసరం ఉండదు. కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు తక్కువ ఉన్నపుడే, చట్టబద్దత కల్పించిన చట్టంతో పని ఉంటుంది తప్ప ఎక్కువ ఉంటే దాని అమలు కోసం ఏ రైతూ ముట్టడి ఉద్యమాలకు పూనుకోరు కదా ? అలాంటపుడు కనీస మద్దతు ధరల చట్టం కుదరదు అని కేంద్రం అడ్డం తిరిగి ఎందుకు మాట్లాడుతోంది ? పోనీ ఆటంకం ఏమిటో చెప్పాలి కదా !