Tags

, ,


ఎం కోటేశ్వరరావు


చప్పట్లు కొట్టించి – దీపాలు వెలిగించగానే కరోనా పోలేదు. పోనీ మోడినోమిక్స్‌తో అయినా దేశం ముందుకు పోతోందా ? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించామని కరోనాను అధిగమించి ఆర్ధికంగా ముందుకు పోతామని చెప్పారు. నరేంద్రమోడీ కారణంగానే దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిందన్న విజయగానాలు మూగపోయాయి. ఈ మధ్యకాలంలో కొత్తవేమీ దొరక్క వంది మాగధులకు ఉపాధిపోయింది. ఆర్దిక వ్యవస్ధ మరింత దిగజారకుండా అన్నదాతలు నిలబెట్టారు. కానీ వారి వెన్ను విరిచే వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలో నెల రోజులకు పైగా తిష్టవేసి వాటిని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నారు. సరైన సమాధానం లేక ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు పిల్లిమొగ్గలు వేస్తూ రైతులను బదనాం చేసేందుకు పూనుకున్నారు.


సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచ జిడిపిలో ఐదవ స్దానానికి దేశం ఎదగటానికి నరేంద్రమోడీ నాయకత్వమే కారణమన్న భజనను ఐదేండ్లు ఆపివేయాలని లండన్‌ మేథో సంస్ధ సెంటర్‌ ఫర్‌ ఎకనోమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసర్చ్‌(సిఇబిఆర్‌) డిసెంబరు 26న తన నివేదికలో చెప్పింది. జిడిపి ముందుకు పోవటానికి తమ గొప్ప అన్నవారు వెనక్కు పోయినందుకు బాధ్యత ఎవరిదో చెబుతారో కరోనా మీద నెడతారో చూద్దాం. మనం ఐదు నుంచి ఆరవ స్ధానంలోకి ఎందుకు పడిపోయాం ? మన కరెన్సీ విలువ బలహీనంగా ఉండటం ఒక కారణం అని సిఇబిఆర్‌ చెప్పింది. దీనికి తోడు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, భారత్‌ మధ్య పెద్ద తేడాలు లేకపోవటమే దీనికి కారణం. 2017వ సంవత్సర వివరాల ప్రకారం భారత్‌ జిడిపి విలువ 2.651లక్షల కోట్ల డాలర్లు కాగా బ్రిటన్‌ 2.638, ఫ్రాన్స్‌ 2.583 లక్షల కోట్ల డాలర్లు.


సిఇబిఆర్‌ విశ్లేషణ ప్రకారం అంచనా వేసినదానికంటే ఐదు సంవత్సరాలు ముందుగానే చైనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అగ్రస్ధానాన్ని చేరుకుంటుందని చెప్పింది. ఇదే సమయంలో గతంలో సాధించిన ఐదవ స్ధానాన్ని కోల్పోయిన భారత్‌ తిరిగి దాన్ని 2025లో పొందనుందని అంచనా వేసింది. చైనాను వెనక్కు నెట్టేసి దేశాన్ని వేగంగా అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామని చెబుతున్న బిజెపి మరి దీన్ని గురించి ఏమి చెబుతుందో తెలియదు. 2019లో బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ఐదవ స్ధానానికి ఎదిగిన భారత్‌ ఆరవ స్ధానానికి దిగజారిందని,2025లో తిరిగి ఐదవ స్ధానం, 2030 నాటికి మూడవ స్దానంలోకి రావచ్చని సిఐబిఆర్‌ వార్షిక నివేదికలో జోశ్యం చెప్పింది. ఆ సంస్ధ చెప్పిన అంచనాలు ఇలా ఉన్నాయి. భారత ఆర్దిక వ్యవస్ధ 2021లో తొమ్మిది, 2022లో ఏడుశాతం చొప్పున విస్తరిస్తుంది. ఆర్ధికంగా పురోగమించే కాలదీ సహజంగానే వేగం తగ్గి 2035నాటికి వృద్ది రేటు 5.8శాతానికి పడిపోతుంది. 2025 నాటికి బ్రిటన్‌, 2027నాటికి జర్మనీ, 2030నాటికి జపాన్‌ను వెనక్కు నెట్టి భారత్‌ మూడవ స్ధానానికి చేరుతుంది.


గతంలో వేసిన అంచనాకు భిన్నంగా చైనా 2028 నాటికే అమెరికాను వెనక్కు నెట్టి ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ద స్ధానానికి చేరనుంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకోవటంలో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం దీనికి కారణం.జపాన్‌ 2030వరకూ మూడవ స్ధానంలో ఉండి, అప్పటికి నాలుగవ స్దానంలో ఉన్న జర్మనీని దిగువకు నెట్టి నాలుగవ స్ధానంలో ఉంటుంది.కరోనాతో నిమిత్తం లేకుండానే దానికి ముందే భారత ఆర్ధిక వ్యవస్ద వేగాన్ని కోల్పోతున్నది. 2016లో 8.3శాతం, 2018లో 6.1శాతం కాగా 2019లో పదేండ్ల కనిష్టమైన 4.2శాతం నమోదైంది.


దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంత ఎదిగిందని కాదు, జన జీవితాల నాణ్యత ఎంత పెరిగిందన్నది ముఖ్యం. ఆ విధంగా చూసినపుడు అంతర్జాతీయ సంస్దలు రూపొందించిన అనేక సూచికల్లో మన దేశం నరేంద్రమోడీ హయాంలో మొత్తం మీద దిగజారింది తప్ప పెరగలేదు. అందువలన ఒక దేశాన్ని వెనక్కు నెట్టేశామా, ఏ దేశం మీద ఎన్ని గంతులు వేశామన్నది ముఖ్యం కాదు. వెనకటికి ఎవడో బజార్లో మాది 101 అరకల వ్యవసాయం అని కోతలు కోశాడట. మీది అంటున్నావు, ఎంత మంది ఉన్నారు, నీది ఎంత అని అడిగితే మా అయ్యగారివి వంద, నాది ఒకటి అన్నాడట. ప్రత్యేక విమానాల్లో తిరిగే అంబానీ ఒక వైపు, కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్దాలకు వెళ్లిన వలస కార్మికులను మరోవైపు కరోనా కాలంలో చూశాము. అందువలన అంబానీలుాఅభ్యాగ్యులను కలిపి చెబితే పైన చెప్పిన కోతలరాయుడి మాదిరి గొప్పగానే ఉండవచ్చు. 138 కోట్లు దాటిన మన జనాభా జీవితాలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. సిఇబిఆర్‌ అంచనా ప్రకారం 2021-25 మధ్య చైనా వార్షిక వృద్దిరేటు 5.7శాతం, 2026-30 మధ్య 4.5శాతంగానూ, ఇదే అమెరికా విషయానికి వస్తే 2022-24 మధ్య 1.9శాతం తరువాత 1.6శాతం వృద్దిరేటు ఉంటుంది.

చైనా వృద్ధి రేటు పైన చెప్పిన మాదిరి ఉంటుందా లేదా తగ్గుతుందా-పెరుగుతుందా, 2028 నాటికి అమెరికాను అధిగమిస్తుందా అన్నది పక్కన పెడితే వృద్ది రేటు అమెరికా కంటే ఎక్కువ అన్నది స్పష్టం. దీన్నే అంటే అభివృద్దినే తనకు ముప్పుగా అమెరికా ప్రపంచానికి చూపుతోంది. కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తోంది. కొన్ని అంతర్జాతీయ సంస్ధలు చెబుతున్నట్లు చైనా నిజానికి అమెరికాను అధిగమించటం అంత తేలిక కాదు. వైఫల్యంతో అమెరికా దిగజారితే అది అసాధ్యమూ కాదు. మన కాషాయ మరుగుజ్జుల మాదిరి గొప్పల కోసం, ప్రధమ స్దానం గురించి చైనీయులు తాపత్రయ పడటం లేదు. గత నాలుగు దశాబ్దాల సంస్కరణల చరిత్ర, తీరుతెన్నులు చూసినపుడు జనజీవితాలు ఎంతగా మెరుగుపడ్డాయన్నదే కీలకంగా భావించారు. 2049లో చైనా విప్లవానికి వందేండ్లు నిండే సమయానికి మరింతగా ఎలా మెరుగుపరచాలా అన్నదాని మీదే కేంద్రీకరణ ఉంది. ఇటీవలనే 2021లో ప్రారంభమయ్యే 14వ వార్షిక ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది.


ఇదే సమయంలో తమ వృద్ది రేట్లను ఎలా పెంచుకోవాలా అన్నదాని కంటే అమెరికా, ఇతర దేశాలు, వాటితో కలసి మన పాలకులు చైనాను ఆర్దికంగా, ఇతర విధాలుగా దెబ్బతీసేందుకు ఏమి చేయాలా అన్నదాని మీద ఎక్కువ కేంద్రీకరించారు. చైనా స్వంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటుంటే మనం జన కష్టార్జితాన్ని అమెరికా ఆయుధాల కొనుగోలుకు వెచ్చిస్తున్నాం. గుజరాత్‌ తరహా అభివృద్ది అన్నారు. మేడిన్‌ ఇండియా పిలుపునిచ్చారు. మోడినోమిక్స్‌ అని చెప్పారు. ప్రపంచాభివృద్దికి చేసిన కృషికి గాను నరేంద్రమోడీ సియోల్‌ అవార్డును కూడా పొందారు. బయట పల్లకీ మోతను చూసి మోడీ గొప్ప అని చెప్పిన వారు ఇంట్లో ఈగల మోతకు కారణం ఏమిటో చెప్పరు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడటాన్ని ఊహించలేకపోయినట్లుగా మోడీ పాలనలో దేశ ఆర్ధిక వృద్ది దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.

జనానికి జ్ఞాపకశక్తి తగ్గిపోతోందో లేక పాలకుల మీద భ్రమలు పెరుగుతున్నాయో తెలియటం లేదు. దేశ ఎగుమతులను 2015-20 సంవత్సరాలలో 900 బిలియన్‌ డాలర్లకు పెంచుతానని మోడీ సర్కార్‌ ప్రకటించింది. వికీపీడియా అంకెల మేరకు 2014 నుంచి 2020 మధ్య ఏడు సంవత్సరాల కాలంలో వార్షిక సగటు ఎగుమతులు 302 బిలియన్‌ డాలర్లు.2014లో 318.2బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరిగితే 2020లో 314.31 బిలియన్‌ డాలర్లు. లక్ష్యం ఎంత ? సాధించింది ఎంత ? ఈ పరిస్ధితికి కారణం ఏమిటో కనీసం ఏకపక్ష ప్రసంగమైన మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ఇదే సమయంలో మన దిగుమతుల వార్షిక సగటు 446 బిలియన్‌ డాలర్లు.2014లో 462.9 బి.డాలర్లు ఉంటే 2020లో 467.19 బి.డాలర్లు. మేక్‌(తయారు) ఇన్‌ ఇండియా కాస్తా మెస్‌ (తారు మారు లేదా గందరగోళం) ఇన్‌ ఇండియాగా మారింది. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేస్తే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని చెప్పారు.అదే చేశారు. ఏమైంది ?


తమ విదేశీ వాణిజ్యం (ఎగుమతులుాదిగుమతుల విలువ) నిమిషానికి 91.9లక్షల డాలర్లు దాటిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ డిసెంబరు 25న ప్రకటించింది.2015తో పోల్చితే 2020లో 30శాతం పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్ద వివరాల ప్రకారం 2015లో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 13.8శాతం ఉంది. ఇప్పుడు ఇంకా పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేసినా వారి ఎగుమతుల మీద పెద్ద ప్రభావం చూపలేదు. నవంబరు నెలలో ఎగుమతులు 21.1శాతం పెరిగితే దిగుమతులు 4.5శాతం పెరిగాయి.(చైనా చెప్పేది ఎలా నమ్మగలం అనేవారికి సమాధానం లేదు) కరోనా వైరస్‌ తొలుత బయట పడింది చైనాలో అన్నది తెలిసిందే. దాన్ని నిర్ణయాత్మకంగా నిరోధించింది కూడా అక్కడే. నిర్లక్ష్యం చేసి ఇప్పటికి కోటీ 85లక్షల మందికి అంటించిన అమెరికా, కోటి మంది దాటిన మన దేశం, ఇతర ధనిక దేశాలూ వైఫల్యానికి నిదర్శనాలు. మిగిలిన అగ్రశ్రేణి దేశాలన్నీ మాంద్యంలో కూరుకుపోతే రెండుశాతం వృద్దితో చైనా తన ప్రత్యేకతను ప్రదర్శించింది.

మన ఆర్దిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో, అనుసరించిన విధానాలు ఎంత దివాలాకోరుగా ఉన్నాయో కరోనాకు ముందే వెల్లడైంది. కరోనా కారణంగా తలెత్తిన విపత్కర పరిస్ధితుల్లో వినియోగాన్ని పెంచేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలన్న అనేక మంది ఆర్ధికవేత్తల సూచనలను నరేంద్రమోడీ సర్కార్‌ విస్మరించింది. పేదలకు డబ్బు ఇవ్వకూడదన్నవారు చెప్పిన తర్కం ఏమిటి ? జనం చేతుల్లో డబ్బులు పెడితే సమస్య పరిష్కారం కాదు. జనం ఇప్పటికీ దేనికి ఖర్చు చేయాలో చేయకూడదో అని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. డబ్బు ఇస్తే రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. జనం పాత రుణాలను చెల్లించటానికి దాన్ని వినియోగించవచ్చు లేదా భవిష్యత్‌లో తలెత్తే అనిశ్చిత అవసరాలకు పొదుపు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి డబ్బూపోయి, జనం ఖర్చు చేయక దగ్గర దాచుకుంటే కొనుగోళ్లు పెరగ ఆర్ధిక వ్యవస్ధకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇలా సాగింది.


దీన్ని మరో విధంగా చెప్పాలంటే కరోనాకు ముందే జనం అప్పులపాలయ్యారు( ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటారు అంటే అర్దం అదే కదా ) కడుపు కాల్చుకొని డబ్బు ఎప్పుడు దాచుకుంటారు అంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందో అన్న విశ్వాసం లేనపుడు, దారీ తెన్నూ కనిపించనపుడే. అంటే ఆరేండ్ల మోడీ పాలన అలాంటి పరిస్ధితిని తయారు చేసింది. కరోనా వస్తే చికిత్సకు అయ్యే ఖర్చు గురించి జనం ఎంత ఆందోళన చెందారో అందరికీ తెలిసిందే. సిఎంఐయి సమాచారం ప్రకారం 2019లో వేతన జీవులు 8.7 కోట్ల మంది ఉన్నారు.2020 నవంబరులో ఆ సంఖ్య 6.8కోట్లకు తగ్గింది. అంటే ప్రతి వంద మందిలో 21 మంది ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాల్లో ఉన్నవారి వేతనాల్లో కోతల గురించి తెలిసిందే.


అంతా ముగిసిపోయింది, మామూలు పరిస్ధితులు ఏర్పడ్డాయి అని చెబుతున్నవారికి రిజర్వుబ్యాంకు సమాచారం రుచించకపోవచ్చు. నవంబరు ఆర్‌బిఐ సర్వేలో 63శాతం మంది తమ ఆదాయాల్లో ఈ ఏడాది కోతపడిందని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే తమ ఉపాధి పరిస్ధితి దిగజారిందని 80శాతం చెప్పారు. ఏడాది క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు పెరిగాయని 90శాతం చెప్పారు.లాక్‌డౌన్‌కు ముందు తాము వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తామని 25ా30శాతం మంది గృహస్తులు చెబితే, మేనెలలో అది 1.25శాతానికి పడిపోతే అక్టోబరులో 7.4శాతానికి పెరిగింది తప్ప కరోనా ముందు స్ధాయికి రాలేదు. ఉన్న పొదుపును తప్పని సరి అవసరాలకే వినియోగిస్తారు. ఆదాయం లేక పోయినా వినిమయ వస్తువుల కొనుగోలు రద్దు లేదా వాయిదా వేసుకుంటారు. ధరలు పెరిగితే అంతకు ముందు పొదుపు చేసుకున్న మొత్తాలు హరించుకుపోతాయి లేదా అప్పులపాలు అవుతారు.

లాక్‌డౌన్‌ సడలించిన తరువాత దసరా, దీపావళి ఇతర పండుగలు వచ్చాయి. ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటుంది, పెద్ద మొత్తంలో జనాలు కొనుగోలు చేస్తారనే వాతావరణం కల్పించారు. కానీ జరిగిందేమిటి ? అంతసీన్‌ లేదు. పెద్ద సంఖ్యలో నిలువ చేసిన వస్తువులు పెరిగాయి. కార్లు, ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా ఉన్నాయని నవంబరు లెక్కలు చెప్పాయి. గృహౌపకరణాల పరిస్దితీ అంతే. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా ఉందని చెప్పేందుకు కార్పొరేట్‌ కంపెనీల లాభాలు పెరగటాన్ని కొందరు చూపుతున్నారు. దీనికి ఉద్దీపనల పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన రాయితీలు ఒక కారణం. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచవ్యాపితంగా వివిధ ముడివస్తువులు, ఇతర పారిశ్రామిక వినియోగ వస్తువుల ధరలు పడిపోయి, ఉత్పాదక ఖర్చు తగ్గటం. ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత, ఇతర ఖర్చుల తగ్గుదల అందుకు దోహదం చేశాయి. వడ్డీ రేట్లను తగ్గించేది లేదని రిజర్వుబ్యాంకు చెబుతోంది. అలాంటపుడు పారిశ్రామిక, వాణిజ్య సంస్దలు ఖర్చు తగ్గింపులో భాగంగా సిబ్బందిని తగ్గించి లేదా పని భారం పెంచి వేతన బిల్లును తగ్గించుకుంటారు. అది మరొక ఆర్ధిక దిగజారుడుకు నాంది అవుతుంది.


2021-25 మధ్య బ్రిటన్‌ నాలుగుశాతం వృద్ది రేటుతో అభివృద్ది చెందనుందనే అంచనాతో అప్పటికి మన దేశం దాన్ని అధిగమిస్తుందని సిఇబిఆర్‌ విశ్లేషకులు చెప్పారు. అక్టోబరులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద చెప్పిన జోస్యం ప్రకారం మన ఆర్ధిక వ్యవస్ధ 2021 నుంచి 2025 మధ్య 8.8 నుంచి 7.2శాతం వృద్ది రేటుతో అభివృద్ధి చెందుతుంది. ఒక వేళ అదే నిజమైతే కోల్పోయిన మన జిడిపి ఇంకా ముందుగానే పెరగవచ్చు. మరి సిఇబిఆర్‌ నిపుణులకు ఐఎంఎఫ్‌ అంచనాలు తెలియవా? వాటిని పరిగణనలోకి తీసుకోలేదా ? అంతకంటే తక్కువ వృద్ధి రేటు అంచనా ఎందుకు వేసినట్లు ? కోల్పోయిన ఐదవ స్దానాన్ని సాధించటానికే ఐదేండ్లు పడుతుందని జోస్యం చెబుతుంటే మరి రెట్టింపుతో 2024నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని చెప్పిన మాటల సంగతి ఏమిటి ? మోడినోమిక్స్‌ విఫలమైందని అనేక మంది విశ్లేషకులు, ఆర్ధికవేత్తలు ఎప్పుడో చెప్పారు. కరోనా నుంచి దేశం బతికి బట్ట కట్టగలదని రుజువైంది గానీ మోడినోమిక్స్‌తో కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్‌ను ఉద్దరించినట్లు ఊదరగొట్టారు. దాన్నే దేశమంతటా అమలు చేస్తానని 2014 ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు. 2016 నవంబరు ఎనిమిదిన మోడీ పెద్ద నోట్ల రద్దు షాక్‌ నుంచే ఇంకా తేరుకోలేదు. తరువాత జిఎస్‌టితో చిన్న పరిశ్రమలు, వ్యాపారాల వారిని ఎంత ఇబ్బంది పెట్టారో దాని ప్రతికూల పర్యవసానాలు ఏమిటో చూస్తున్నాము. కనుక ఏడు సంవత్సరాల క్రితం అచ్చే దిన్‌ గురించి నరేంద్రమోడీ చెప్పిన అంశాలను జనం మరచిపోయారు. ప్రయివేటు రంగం గురించి నరేంద్రమోడీ సర్కార్‌ పెద్ద ఆశలు పెట్టుకుంది. వారికి ఇవ్వని రాయితీలు లేవు. నిజానికి మన బడా ప్రయివేటు రంగం ఎంత అసమర్ధంగా ఉందో జనానికి తెలియదు. యాభై కోట్ల డాలర్లకు పైబడి ఆదాయం వచ్చే పెద్ద కంపెనీలు తత్సమానమైన చైనా, మలేసియా వంటి దేశాల్లోని కంపెనీలతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు, దక్షిణ కొరియా వాటితో పోల్చితే మూడున్నర రెట్లు తక్కువగా జిడిపికి జమ చేస్తున్నాయి. అదే విధంగా ఉత్పాదకత స్దాయిలు చూస్తే 10-25శాతం మధ్య ఉన్నాయి. కేవలం 20శాతం కంపెనీలు మాత్రమే 80శాతం లాభాలను సమకూర్చుతున్నాయి.


జిడిపిలో ఐదవ స్ధానాన్ని తిరిగి సంపాదించటం గురించి లండన్‌ సంస్ద చెప్పిన అంశం ఒకటైతే అంతకంటే ముఖ్యమైనవి ఉన్నాయి.2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. వాటిలో ఆరు కోట్ల కొత్త వారికైతే, మూడు కోట్లు వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు మారే వారికోసం సృష్టించాల్సి ఉంది. ఇది సాధ్యం కావాలంటే నిఖర ఉపాధిని కల్పించే అభివృద్ధి రానున్న పది సంవత్సరాలలో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరశాతం చొప్పన అభివృద్ధి రేటు ఉండాలి. చైనా జిడిపితో పాటు అక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నది తిరుగులేని సత్యం. కనుక మోడినోమిక్స్‌ అన్నా మరొకటి అన్నా జిడిపి పెరుగుదల జనానికి ఉపయోగపడే విధంగా ఉంటుందా లేదా అన్నదే ముఖ్యం. గత ఆరున్నర సంవత్సరాలలో వీటి జాడలు లేవు. సంపదల పంపిణీ అసమానత పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఎండమావుల వెంట పరుగుపెడుతున్నట్లుగా జనం ఉన్నారు !