Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


బీహార్‌లో బిజెపి-జెడియు కూటమి కొత్త ప్రభుత్వం వంద రోజులు కూడా పూర్తి చేసుకోక ముందే దాని మనుగడపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నిప్పులేనిదే పొగరాదు. రెండు పార్టీల మధ్య అనుమానాలు తలెత్తాయా ? తనకు ముఖ్యమంత్రి కావాలని లేకపోయినా వత్తిడి చేశారని, కొనసాగాలనే ఆసక్తి లేదని, కొత్త నేతను ఎన్నుకోవచ్చని డిసెంబరు 27వ తేదీన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాలలో పరిపరి ఆలోచనలను రేకెత్తించింది. ఇది బిజెపిని బెదిరించించేందుకే చేసినట్లు కూడా భావించవచ్చు. నిజంగానే నితీష్‌ కుమార్‌కు సిఎం పదవిపై ఆసక్తి లేదని, అయితే బిజెపి ఇతర ప్రముఖులు వత్తిడి చేసి ఒప్పించారని, ఆయన పూర్తి కాలం కొనసాగుతారని బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ ప్రకటించి నష్టనివారణకు పూనుకున్నారు. మరోవైపు బీహార్‌ మహాకూటమిలో ఆర్‌జెడి, కాంగ్రెస్‌నేతలు ఈ పరిణామం గురించి వ్యాఖ్యానిస్తూ ఎన్‌డిఏ కూటమి నుంచి నితీష్‌ కుమార్‌ బయటకు రావాలని కోరారు. తమ నేత తేజస్వియాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు తోడ్పడితే వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవికి నితీష్‌ను బలపరుస్తామని ఆర్‌జెడి నేతలు చెప్పారు. ఎన్‌డిఏ నుంచి బయటకు రావటానికి ఇది సరైన సమయమని, బిజెపి లౌకిక పార్టీ కాదని, తాను లౌకిక వాదినని నితీష్‌ భావిస్తే బయటకు రావాలని కాంగ్రెస్‌ నేత శర్మ వ్యాఖ్యానించారు.


జెడియు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. మాజీ అయ్యేఎస్‌ అధికారి, పార్టీ నేతగా ఉన్న ఆర్‌సిపి సింగ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజానికి 2022 వరకు నితీష్‌ కుమార్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది వారాలుగా బిజెపి-జెడియు మధ్య పొరపొచ్చాలు తలెత్తాయనే వార్తలు వస్తున్నాయి. బిజెపికి చెందిన వారు స్పీకర్‌గా, ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు. గతంలో పెద్ద పార్టీనేతగా తన మాట నెగ్గించుకున్న నితీష్‌ కుమార్‌ ఇప్పుడు జూనియర్‌ భాగస్వామిగా ప్రతిదానికీ బిజెపి వైపు చూడాల్సి వస్తోంది. ఆరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఏడుగురు ఎంఎల్‌ఏలలో ఆరుగురిని బిజెపి లాగివేసుకోవటం తాజా వ్యాఖ్యలకు మూలం. అయితే బీహార్‌లో కూడా జెడియులో చీలిక తెచ్చేందుకు బిజెపి చేస్తున్న యత్నాలు కూడా కారణం కావచ్చని కొందరు భావిస్తున్నారు. కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను బలపరచాలని, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వాల మాదిరి లవ్‌ జీహాద్‌ బిల్లును తేవాలని బిజెపి వత్తిడి చేస్తోంది. లవ్‌ జీహాద్‌ పేరుతో దేశంలో విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వాటికి తాము వ్యతిరేకమని జెడియు ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి ఘాటుగా స్పందించారు.

గతేడాది నవంబరు 16న నితీష్‌ కుమార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బిజెపి నేతలు ఏదో ఒక వ్యాఖ్యలతో తలనొప్పి కలిగిస్తున్నారు. అవినీతిని ఏమాత్రం సహించనని ముఖ్యమంత్రి ప్రకటించగా ఆయన నిర్వహిస్తున్న శాఖల్లోనే అవినీతి తాండవమాడుతోందని బిజెపి మంత్రులు వ్యాఖ్యానించారు.తమకు వ్యతిరేకంగా పోటీ చేసి అనేక చోట్ల ఓటమికి కారణమైన ఎల్‌జెపిని ఎన్‌డిఏ నుంచి బయటకు పంపాలని నితీష్‌ కుమార్‌ చేసిన డిమాండ్‌ను బిజెపి ఖాతరు చేయలేదు. పదిహేను మంది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు ఎల్‌జెపి తరఫున గత ఎన్నికల్లో పోటీ చేశారు. మంత్రివర్గ విస్తరణ గురించి కూడా రెండు పార్టీల మధ్య వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం విస్తరణకు అవకాశం లేదని, బిజెపి నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని, ఒక వేళ వస్తే అప్పుడు ఉమ్మడిగా అలోచిస్తామని నితీష్‌ కుమార్‌ చెప్పారు. హౌంశాఖ వంటి ముఖ్యమైన పదవులను తమకు ఇవ్వాలని బిజెపి చేస్తున్న డిమాండ్‌కు నితీష్‌ కుమార్‌ తలొగ్గటం లేదు.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో తమ పార్టీ ఎంఎల్‌ఏలను లాగివేసుకోవటం సంకీర్ణ ధర్మ విరుద్దమని జెడియు చెబుతోంది. అయితే వారంతటవారే చేరితే తామేమీ చేయగలమని బిజెపి అమాయకంగా ప్రశ్నిస్తోంది. అక్కడి పరిణామాలకు బీహార్‌లో కూటమికి ఎలాంటి సంబంధం లేదని సుశీల్‌ కుమార్‌ మోడీ వ్యాఖ్యానించారు. జెడియు అధ్యక్షుడిగా ఆర్‌సిపి సింగ్‌ నియామకం వెనుక కారణాల గురించి భిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నితీష్‌ కుమార్‌కు నమ్మిన బంటు అన్నది అసలైన కారణం. బీహార్‌ ఎన్నికల్లో జెడియు రెండవ స్దానానికి దిగజారిన తరువాత గతంలో మాదిరి నరేంద్రమోడీ, అమిత్‌ షా నేరుగా కాకుండా ఇతర నేతలతో నితీష్‌ కుమార్‌తో మాట్లాడించటాన్ని అవమానకరంగా భావించారని, తనతో నేరుగా కాకుండా పార్టీ అధ్యక్షుడితో ముందు మాట్లాడాలనే సంకేతం ఇచ్చేందుకు ఆర్‌సిపి సింగ్‌ను నియమించారన్నది ఒక అభిప్రాయం.

బీహార్‌ మరో కర్ణాటక, మధ్య ప్రదేశ్‌ కానుందా ? పరిణామాలను చూస్తుంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా బిజెపి అనుసరించిన ఎత్తుగడలే బీహార్‌లో బిజెపి-జెడియు కూటమి ప్రభుత్వానికి ఎదురు కానున్నాయా ? తనకు పదవిపై ఆసక్తి లేదని నితీష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇంకా చెవుల్లో వినిపిస్తుండగా జెడియు ఎంఎల్‌ఏలు 17 మంది తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆర్‌జెడి నేతలు ప్రకటించటంతో పరిణామాలు మరో మలుపు తిరిగాయి.తమ పార్టీలో చేరేందుకు 17 మంది ఎంఎల్‌ఏలు సిద్దంగా ఉన్నారని అయితే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తాము ఉల్లంఘించాలను కోవటం లేదు కనుక 28 మంది వస్తే స్వాగతిస్తామని, త్వరలో అది జరగనుందని ఆర్‌జెడి నేత శ్యామ్‌ రజాక్‌ చెప్పారు. జెడియు చీలిక ఖాయమని సత్తా ఉంటే నివారించుకోవచ్చని ఆర్‌జెడి నేత మృత్యుంజయ తివారీ సవాలు విసిరారు. రాష్ట్ర ప్రజలు అన్నింటికీ సిద్దంగా ఉండాలని, మరోసారి ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదు, సిద్దంగా ఉండాలని డిసెంబరు మొదటి వారంలో ఒక సందర్భంలో ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యకు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది.


గతంలో మూడోవంతు సభ్యులు ఫిరాయిస్తే దానిని చీలికగా గుర్తించే నిబంధన ఉండేది. తరువాత దాన్ని సవరించటంతో ఇప్పుడు మూడింట రెండువంతుల మంది బయటకు వస్తేనే గుర్తిస్తున్నారు. కర్ణాట, మధ్య ప్రదేశ్‌లో అధికారానికి దగ్గరగా వచ్చిన బిజెపి అవసరమైన సీట్లు లేకపోవటంతో ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే ప్రత్యర్ధి పార్టీలలో చీలికకు అవసరమైన సంఖ్య లేకపోవటంతో ఎంఎల్‌ఏలతో రాజీనామా చేయించి ప్రభుత్వాలను మైనారిటీలో పడవేసి తాను గద్దెనెక్కింది. తరువాత జరిగిన ఎన్నికలలో ఆ సీట్లును గెలుచుకొని రెండు రాష్ట్రాలలో పాలన సాగిస్తోంది. ఇప్పుడు అదే అనుభవం బీహార్‌లో బిజెపి-జెడియు సంకీర్ణ కూటమికి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2020 అక్టోబరు, నవంబరు నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్ధానాలకు గాను బిజెపి-జెడియు కూటమికి 125, ఆర్‌జెడి-కాంగ్రెస్‌-వామపక్షాల కూటమికి 110, ఇతరులకు ఎనిమిది స్దానాలు వచ్చాయి. వీటిలో ఒకటి బిజెపిని బలపరిచే ఎల్‌జెపికి, మరొక స్వతంత్ర సభ్యుడు, ఐదుగురు మజ్లిస్‌ సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్ధానాలు అవసరం. పదిహేడు మంది జెడియు సభ్యులు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని, అందువలన అధికారయుతంగా చీలికకు అవసరమైన 28 మంది వచ్చిన తరువాత బయటకు రావచ్చని ఆర్‌జెడి నేతలు చెప్పారు. ఈ వార్తలకు ప్రాతిపదిక లేదని ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ఒక వేళ 28 మంది వచ్చే అవకాశం లేకపోయినా 17 మంది బయటకు వచ్చి మరో పార్టీలో చేరితే స్పీకర్‌గా బిజెపి నేత ఉన్నందున వెంటనే వారి సభ్యత్వం రద్దవుతుంది, రాజీనామా చేస్తే ఆ స్దానాలు ఖాళీ అవుతాయి. సంకీర్ణ కూటమి సర్కార్‌ మైనారిటీలో పడుతుంది. ఆర్‌జెడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం దొరుకుతుంది.మజ్లిస్‌ సభ్యులు బిజెపికి మద్దతు ఇచ్చినా- లేదా కొత్తగా ఏర్పడే ఆర్‌జెడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసినా మజ్లిస్‌ – బిజెపి మధ్య ఉన్న లోపాయికారీ సంబంధాలు వాస్తవమే అని రుజువు చేసినట్లు అవుతుంది. గతంలో నితీష్‌ కుమార్‌ అటు ఆర్‌జెడిని ఇటు బిజెపిని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా అసెంబ్లీ ఎన్నికలలో అలాంటి అవకాశం మూసుకుపోయింది. మరోసారి ఆర్‌జెడి నాయకత్వం నితీష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే అవకాశం లేదు. నితీష్‌ నిస్సహాయతను గమనించే అరుణాచల్‌ ప్రదేశ్‌లో జెడియు ఎంఎల్‌ఏలు ఏడుగురిలో ఆరుగురిని బిజెపి తనవైపుకు తిప్పుకుంది. నితీష్‌ కుమార్‌ను డమ్మీ చేసి అధికారం చెలాయించాలన్నది బిజెపి ఎత్తుగడ.


నిజానికి నితీష్‌ను అడ్డుతొలగించుకోవటం దానికి ఒక సమస్య కాదు. అయితే రాజకీయ నాటకం రంజుగా కొనసాగాలంటే అలాంటి పాత్రలు అవసరం. ఇప్పటికే బిజెపి నమ్మిన బంటు అనుకున్న ఆకాలీదళ్‌ స్నేహానికి స్వస్తి చెప్పింది. అంతకు ముందే మహారాష్ట్రలో శివసేన ఏమి చేసిందో చూశాము. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో అన్నాడిఎంకె నాయకత్వాన్ని బెదిరించే యత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. మాతో ఉంటారో లేదో తేల్చుకోండి అన్నట్లుగా అన్నాడిఎంకె నేతలు ప్రకటించారు. నితీష్‌ కుమార్‌ కూడా లేకపోతే రాజకీయంగా అది ఒంటరి పాటు కావటమే కాదు, తమనెక్కడ మింగివేస్తుందో అన్న భయంతో రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు దరికి చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి. అందువలన తనంతటతానుగా నితీష్‌ కుమార్‌కు బిజెపి పొగపెట్టకపోయినా, జెడియు ఎంఎల్‌లు ప్రభుత్వంలో రెండవ తరగతి వారిగా సహజీవనం చేయగలరా అన్నది ప్రశ్న. బీహార్‌లో తలెత్తిన ఈ పరిణామం టీ కప్పులో తుపానులా సమసిపోతుందా ? కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లేదా ఏకంగా అసెంబ్లీ రద్దుకే దారి తీస్తుందా ? అధికార రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు !