Tags
Farmers agitations, Farmers Delhi protest, India Republic Day, Indo-US trade agreement, Kisaan tractor parade
ఎం కోటేశ్వరరావు
రైతుల న్యాయమైన డిమాండ్లపై సాగుతున్న ఉద్యమాన్ని నీరు గార్చేందుకు, దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం, సంఘపరివార్ సంస్ధలు చేస్తున్న యత్నాలను చూస్తున్నాము. అవి ఫలించకపోతే ఉక్కు పాదంతో అణచివేస్తారా ? ఇప్పటికి ఊహాజనితమైన ప్రశ్నే కావచ్చు గానీ, ఏం జరుగుతుందో చెప్పలేము.డిసెంబరు 30న జరిగిన చర్చలలో ముసాయిదా విద్యుత్ సంస్కరణల బిల్లును ఎత్తివేస్తామని, పంజాబ్, హర్యానా, మరికొన్ని ప్రాంతాలలో పనికిరాని గడ్డిని తగులబెడుతున్న కారణంగా పర్యావరణానికి హాని పేరుతో శిక్షించే ఆర్డినెన్స్ నుంచి రైతులను మినహాయిస్తామని కేంద్ర ప్రభుత్వం నోటి మాటగా అంగీకరించింది. ఇతర ముఖ్యమైన డిమాండ్ల విషయంలో అదే మొండి పట్టుదల కనిపిస్తోంది. ఈ రెండు అంశాలను అంగీకరించటానికి(అమలు జరుపుతారో లేదో ఇంకా తెలియదు) ప్రభుత్వానికి నెల రోజులకు పైగా పట్టిందంటే ఎంత మొండిగా, బండగా ఉందో అర్ధం అవుతోంది.
మిగిలిన తమ డిమాండ్ల పట్ల రైతన్నలు పట్టువీడే అవకాశాలు కనిపించటం లేదు.జనవరి నాలుగవ తేదీన జరిగే చర్చలలో ఎలాంటి ఫలితం రానట్లయితే తదుపరి కార్యాచరణను రైతు సంఘాల కార్యాచరణ కమిటీ శనివారం నాడు ప్రకటించింది. జనవరి ఐదవ తేదీన సుప్రీం కోర్టు రైతుల ఆందోళన సంబంధిత కేసుల విచారణ జరపనున్నది. ఆరవ తేదీన హర్యానాలోని కుండిలి-మనేసర్-పాలవాల్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు మీద ట్రాక్టర్లతో ప్రదర్శన, 15 రోజుల పాటు నిరసన, జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా హర్యానా గవర్నర్ నివాసం ఎదుట నిరసన, ఆందోళనకు రెండు నెలలు పూర్తయ్యే సందర్భంగా 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో ప్రదర్శన జరుపుతామని, అదే రోజు రాష్ట్రాల రాజధానులన్నింటా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతుల కార్యాచరణ కమిటీ నేతలలో ఒకరైన డాక్టర్ ధర్నన్‌పాల్ విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. తమ ఆందోళన శాంతియుతంగా కొనసాగుతుందని, మేము చాలా రోజుల క్రితమే చెప్పినట్లు ప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి మూడు చట్టాలను వెనక్కు తీసుకోవటం లేదా బల ప్రయోగంతో మమ్మల్ని ఖాళీ చేయించటం అని దర్శన్ పాల్ చెప్పారు.
ఇది రాస్తున్న సమయానికి రైతుల నిరసన 38వ రోజు నడుస్తున్నది. ఇప్పటికీ సామాన్యులకు అంతుబట్టని-బిజెపి లేదా ఆందోళనను తప్పు పడుతున్న వారు వివరించేందుకు సిద్దపడని అంశం ఏమంటే, మూడు చట్టాలకు ముందు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన, తెచ్చినదాని మీద పార్లమెంట్‌లో తగిన చర్చకూడా లేకుండా ఆదరాబాదరా ఆమోద ముద్ర వేయాల్సినంత అత్యవసరం ఏమి వచ్చింది అన్నది. ఇవేమీ కొత్తవి కాదు, ఎప్పటి నుంచో చర్చలో ఉన్న అంశాలని చెబుతున్నవారు ఆర్డినెన్స్ అవసరం గురించి మాత్రం చెప్పరు. బహుశా వారి నోటి వెంట ఆ వివరాలు రావనే చెప్పవచ్చు. మూడు చట్టాలవలన రైతాంగానికి హాని ఉందంటూ వాటిని వెనక్కు తీసుకోవాలని కొందరు మేథావులు ప్రకటనలు చేశారు. దానికి పోటీగా మేలు జరుగుతుంది, కొనసాగించాల్సిందేనంటూ అంతకంటే ఎక్కువ మంది మేథావుల సంతకాలతో ఒక ప్రకటన చేయించారు. వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక అన్నట్లుగా ఎవరు చెప్పినా వినాల్సిందే, ఆలోచించాల్సిందే. క్షీరసాగర మధనం మాదిరి మధించి ఎవరు చెప్పిన దానిలో హాలాహలం ఉంది, ఎవరు చెప్పినదానిలో అమృతం ఉందన్నది తేల్చుకోవాలి.శివుడు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు కనుక విషాన్ని పక్కన పెట్టేసి దాన్ని తాగించ చూసిన మేథావులెవరైతే వారికి స్ధానం లేదని చెప్పాలి.
జరిగిన పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే మాలల్లో బయటకు కనిపించని దారం మాదిరి సంబంధాన్ని చూడవచ్చు. అన్ని రంగాలను కార్పొరేట్లకు అప్పగించిన తరువాత మిగిలింది వ్యవసాయమే. కరోనా సమయంలో అన్ని రంగాలు కుప్పకూలిపోగా మూడుశాతంపైగా వృద్ధి రేటు నమోదు చేసింది ఇదే. అందువలన దాన్నుంచి కూడా లాభాలు పిండుకోవాలని స్వదేశీ-విదేశీ కార్పొరేట్లు ఎప్పటి నుంచో చూస్తున్నాయి. అందుకు గాను వ్యవసాయ రంగాన్ని వారికి అప్పగించటం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాల వ్యవసాయ ఉత్పత్తులను గుమ్మరించేందుకు అనుమతించటం ఒకటి. మూడు చట్టాల ద్వారా మొదటి కోరికను తీర్చారు. ఇప్పుడు రెండవ కోర్కెను తీర్చాలని విదేశాలు ముఖ్యంగా అమెరికా వత్తిడి చేస్తోంది.
అమెరికన్ కార్పొరేట్లు మన వ్యవసాయరంగంలో రెండు రకాలుగా ప్రయత్నించాలని చూస్తున్నాయి. ఒకటి ఉత్పత్తుల కొనుగోలు వ్యాపారంలో గణనీయమైన వాటాను దక్కించుకోవటం. రెండవది తమ ఉత్పత్తులను గుమ్మరించటం. రైతుల ప్రతిఘటన ఎలా ముగుస్తుందో తెలియదు, దాన్నిబట్టి కార్పొరేట్లు తమ పధకాలను రూపొందించుకుంటాయి. మొదటిది ఎంత సంక్లిష్ట సమస్యో రెండవది కూడా అలాంటిదే. అందుకే గతంలో మన్మోహన్ సింగ్ సర్కార్-ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్ కూడా గుంజాటనలో ఉన్నాయి.
అమెరికాలో నవంబరు ఎన్నికల్లోపే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నరేంద్రమోడీ-డోనాల్డ్ ట్రంప్ తెగ ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే అమెరికాకు ఎలాంటి పాత్ర లేని, చైనా, ఇతర ఆసియా దేశాలు ప్రధాన పాత్రధారులుగా ఉన్న ఆర్‌సిఇపి ఒప్పందం నుంచి అమెరికా వత్తిడి మేరకు మన దేశం వెనక్కు తగ్గిందన్నది ఒక అభిప్రాయం. అయితే దానిలో చేరితే మన వ్యవసాయ, పాడి పరిశ్రమ, పారిశ్రామిక రంగాలకు ముప్పు కనుక ఆ రంగాల నుంచి వచ్చిన తీవ్రమైన వత్తిడి కూడా వెనక్కు తగ్గటానికి ప్రధాన కారణం గనుక అమెరికా పాత్ర కనిపించలేదని చెబుతారు.
తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకోకపోయినా చిన్న ఒప్పందం అయినా చేసుకోవాలని అమెరికా వత్తిడి తెచ్చింది. దానిలో భాగంగానే 2019 ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ పర్యటన సందర్భంగా డోనాల్డ్ ట్రంప్-నరేంద్రమోడీ చేసిన ప్రకటనలో కుదిరితే ఒక కప్పు కాఫీ అన్నట్లుగా ఏడాది ముగిసేలోగా మొదటి దశ ఒప్పందాన్ని చేసుకోవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చటాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనాను కూడా లెక్క చేయకుండా ట్రంప్ రావటానికి ఇదొక కారణం. ఎన్నికల్లోగా అనేక దేశాలతో చిన్న వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని వాటిని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్నది ట్రంప్ దూరాలోచన.(హౌడీమోడీ కార్యక్రమం కూడా దానిలో భాగమే). చిన్న ఒప్పందాలకు అక్కడి పార్లమెంట్ ఆమోదం అవసరం ఉండదు. ఎన్నికల తరువాత రాజెవరో రెడ్డెవరో అప్పుడు చూసుకోవచ్చు అన్నది ట్రంప్ దురాలోచన.
పది సంవత్సరాల క్రితం 2010లో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాన్ కిర్క్ అమెరికా సెనెట్‌లో వచ్చిన ఒక ప్రశ్నకు స్పందించిన తీరు ఎలా ఉందో చూడండి.” మనం తీవ్ర ఆశాభంగం చెందాం. సాధారణంగా మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎక్కడా బయటకు చెప్పం. కానీ వ్యవసాయ అంశాలలో వారి మార్కెట్‌ను తెరిచే అంశంపై భారత్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ పరిశీలిస్తున్నాం.” అన్నాడు. పది సంవత్సరాల తరువాత జరిగిందేమిటి ? 2019లో నరేంద్రమోడీ సెప్టెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు భారత్‌కు ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. నవంబరులో నరేంద్రమోడీ సర్కార్ ఆర్‌సిఇపి నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించింది.
అమెరికాతో ఒప్పందాలు చేసుకున్న దేశాలు-పర్యవసానాలను క్లుప్తంగా చూద్దాం.ఎవరో అమెరికాతో కలసి తొడ కోసుకున్నారని మనం మెడకోసుకోలేము. ఒప్పందాలు కూడా అంతే. అన్ని దేశాలకూ ఒకే సూత్రం వర్తించదు.అమెరికాతో చైనా ఒప్పందం చేసుకుంటే లేని తప్పు మనం చేసుకుంటే ఉంటుందా అని కాషాయ దళాలు వెంటనే దాడికి దిగుతాయి. త్వరలో అమెరికా జిడిపిని అధిగమించే దిశ, దశలో చైనా ఉంది, మనం ప్రస్తుతానికి పగటి కలలో కూడా ఆ పరిస్ధితిని ఊహించుకోలేమని గ్రహించాలి. ఆర్‌సిఇపి ఒప్పందం కటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరింత ప్రమాదకరం. ఎందుకంటే అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలు ప్రపంచంలో మరే దేశమూ ఇవ్వటం లేదు.
మన దేశంలో ఒక కమతపు సగటు విస్తీర్ణం ఒక హెక్టారు. అదే అమెరికాలో 176 ఉంటుంది, అంటే ఆ రైతులతో మనం పోటీ పడాలి. అక్కడ మొత్తం కమతాలు 21లక్షలు, వ్యవసాయం మీద ఆధారపడే జనం కేవలం రెండుశాతం. అదే మన దేశంలో 14 కోట్ల 60లక్షలు. సగం మంది జనం వ్యవసాయం మీదే బతుకు. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్ 2018లో పాడి ఉత్పత్తుల మీద ప్రమాణాలను సడలించి అమెరికా నుంచి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 30 నుంచి 60శాతం వరకు ఉన్న దిగుమతి పన్నును ఐదుశాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వెయ్యి ఆవుల లోపు డైరీల నుంచి 45శాతం, రెండున్నరవేల ఆవులకు పైగా ఉన్న డైరీల నుంచి అమెరికాలో 35శాతం పాల ఉత్పత్తి ఉంది. పెద్ద డైరీల్లో 30వేల వరకు ఉన్నాయి. అక్కడి డైరీ యాజమాన్యాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాడి ఉత్పత్తుల మీద 15, 20 సంవత్సరాల వ్యవధిలో 40శాతంగా ఉన్న పన్ను మొత్తాన్ని ఐదు శాతానికి తగ్గిస్తామని 2019లో జపాన్ ఒప్పందం చేసుకుంది. దేశంలో పాడి పరిశ్రమలో కార్పొరేట్ శక్తులు గుత్తాధిపత్యం వహించటం మీరెక్కడైనా చూశారా అని ఇటీవల రైతులతో సమావేశం పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఇప్పుడు లేదు, రేపు విదేశీ ఉత్పత్తులను అనుమతిస్తే పరిస్ధితి ఏమిటి ?
కోడి కాళ్ల దిగుమతులకు మన దేశం మీద అమెరికా తీవ్ర వత్తిడి తెస్తోంది. అది కోరుతున్నట్లుగా పదిశాతం పన్నుతో దిగుమతులకు అనుమతిస్తే 40లక్షల మందికి ఉపాధి ఉండదు. అది ఒక్క కోళ్ల పరిశ్రమనే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయాబీన్ పండిస్తున్న రైతులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అమెరికాలో కోళ్ల పరిశ్రమను ఐదు బడా కార్పొరేషన్లు అదుపు చేస్తున్నాయి.2016లో కోడి, గొడ్డు, పంది మాంస మార్కెట్లో సగం వాటా వాటిదే. అక్కడి రైతులతో అవి ఒప్పందాలు చేసుకుంటాయి. బ్రెజిల్ తరువాత కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్న రెండవ దేశం అమెరికా. ఆ రెండు ప్రపంచంలో సగం కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నాయి.
అమెరికాతో త్వరలో ఒక వాణిజ్య ఒప్పందాలకు ముందే అమెరికా కార్పొరేట్లను సంతృప్తి పరచటం లేదా విశ్వాసం కలిగించటానికే కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవసాయ చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణలను ఆర్డినెన్సులుగా తీసుకు వచ్చి పార్లమెంటులో ఆమోదింప చేయించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. విద్యుత్ సంస్కరణలకు ముసాయిదా బిల్లును రూపొందించి విడుదల చేశారు, అభిప్రాయాలను కోరారు. అదే మాదిరి ఉమ్మడి జాబితాలో అంశాల మీద రాష్ట్రాలను సంప్రదించకుండా, రైతు సంఘాలు, పార్టీలతో చర్చించకుండా అసలు పార్లమెంటుతో కూడా నిమిత్తం లేకుండా ముందే ఒక నిర్ణయం చేసి వ్యవసాయ బిల్లులకు తరువాత పార్లమెంట్ ఆమోద ముద్ర వేయించటం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్దం.
అడ్డదారి, దొడ్డిదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నది అమెరికా అన్నది స్పష్టం. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ చట్టం మేరకు పది సంవత్సరాల కాలంలో 956 బిలియన్ డాలర్ల సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత 2019లో మరో పదేండ్ల పాటు(2034వరకు) 867 బిలియన్ డాలర్లు అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. చైనాతో వాణిజ్య యుద్దం ప్రారంభించిన అమెరికన్లు దానిలో ముందుకు పోలేక- వెనక్కు రాలేక ఇతర దేశాలకు తమ వస్తువులను అమ్ముకొనేందుకు పూనుకున్నారు.
మన దేశంలో సోయాను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాతో సాగిస్తున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా సోయా ఎగుమతులు పదకొండు శాతం పడిపోయాయి. దాన్ని మన దేశానికి ఎగుమతులు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని అమెరికా ఆత్రంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల మేరకు 2019-20లో టారిఫ్ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మెక్సికోతో వాణిజ్యం ఒప్పందం చేసుకున్న అమెరికా తన సబ్సిడీ మొక్కజొన్నలను అక్కడ గుమ్మరించటంతో 20లక్షల మంది తమ జీవనాధారాన్ని కోల్పోయారు.
2016 డిసెంబరులో మోడీ పభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో గత ఏడాది ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? విదేశీ గోధుమలతో మన దేశంలో డిమాండ్ తగ్గి ధరలు తగ్గితే పరిస్దితి ఏమిటి ? పంజాబ్, హర్యానా, ఇతరంగా గోధుమలు ఎక్కువగా పండే ప్రాంతాల రైతాంగం ఆందోళనలో ముందు ఉన్నదంటే ఇలాంటి అనుభవాలే కారణం.
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ధాన్య సేకరణ వివరాల ప్రకారం డిసెంబరు 30 నాటికి 479.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా వాటిలో 42.3శాతం పంజాబ్, 11.7శాతం హర్యానా నుంచే ఉన్నాయి. అక్కడి రైతాంగం ఎందుకు ముందుగా స్పందించిందో ఇవి కూడా వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య సంప్రదింపుల స్వభావం ఏమిటి ? మన దిగుమతి పన్నులను తగ్గించేందుకు బేరమాడుతోంది. బెదిరింపులకు దిగింది. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ప్రాధాన్యత పధకం (జనరలైజ్‌డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ాజిఎస్‌పి) కింద ఇస్తున్న పన్ను రాయితీలను డోనాల్డ్ ట్రంప్ ఎత్తివేశాడు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తుల మీద అదనంగా దిగుమతి పన్ను విధించాడు. ఇవన్నీ మనలను లొంగదీసుకొనేందుకు అమెరికా అనుసరిస్తున్న బెదిరింపు ఎత్తుగడల్లో భాగమే. మన ప్రధాని నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నప్పటికీ ట్రంప్ మనకు చేసిన మేలేమీ లేదు. ఇప్పుడా పెద్దమనిషి ఇంటిదారి పట్టాడు. త్వరలో అధికారం చేపట్టనున్న జో బైడెన్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలియదు. అమెరికా అధ్యక్ష పీఠం మీద ఎవరు కూర్చున్నా అమెరికాకే అగ్రస్ధానం కోసం ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనలను మరింత ఇరకాటంలో పెట్టేందుకు అమెరికన్లకు అవకాశాలు పెరిగాయి. వారి వత్తిడికి లొంగి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు వ్యవసాయ చట్టాల వలన వచ్చే ముప్పు మరింత పెరుగుతుంది. కోళ్లు, పాడి వంటి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితం కావటం అనివార్యం. మన పాడి పరిశ్రమ సమస్యలను పట్టించుకోని కారణంగానే ఆర్‌సిఇపిలో చేరలేదని మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అదే పెద్దలు ఇప్పుడు ఉద్యమిస్తున్న రైతుల ఆందోళనను పట్టించుకొనేందుకు, వద్దంటున్న చట్టాలను వెనక్కు తీసుకొనేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు ? రేపు ఏదో ఒకసాకుతో అమెరికాకు, ఇతర ధనిక దేశాలకు లొంగిపోరన్న హామీ ఏముంది ?