Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా మీద ఎవరికైనా అంతగా మోజు ఉంటే తీర్చుకోవచ్చు. సరే దాని ఫలితాలు-పర్యవసానాలను కూడా అనుభవించేందుకు సిద్దపడాలి. ఎక్కడో పదమూడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని కోసం మూడున్నరవేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న పొరుగు దేశం చైనాతో సఖ్యత లేకపోతే పో(పా)యే ! విరోధం లేకుండా అన్నా ఉండాలని చెప్పినవారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. పోనీ దాన్ని కూడా భరించవచ్చు- తామే సిసలైన దేశభక్తులమని చెప్పుకుంటున్నవారి ఆచరణ ఏమిటి అన్నది అసలు సమస్య ! ఈ మధ్యనే వచ్చిన వార్తల ప్రకారం సూటిగా నిషేధించే దమ్మూ ధైర్యం లేక చైనా నుంచి వచ్చే వారిని చట్టపరంగా నిషేధించలేము గానీ విమాన టిక్కెట్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని సదరు కంపెనీలను కోరినట్లు చదివాము. అంతకు ముందు అమెరికా ప్రభుత్వం చైనా జాతీయులందరినీ కమ్యూనిస్టులుగా పరిగణించి నిషేధం విధించింది. వారిని సంతుష్టీకరించేందుకు ఇంత డొంక తిరుగుడు అవసరమా ?


లడఖ్‌ సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో గత ఏడాది జూన్‌లో జరిగిన ఉదంతం తరువాత చైనా పెట్టుబడులు, వస్తువులను అడ్డుకుంటామంటూ వీర,శూర ప్రతిజ్ఞలు చేశారు. అనేక యాప్‌లను నిషేధించారు. దేశభక్తి అని చెప్పారు గనుక ఎవరూ తప్పు పట్టలేదు. ఉల్లిపాయలు తినొద్దని ఊరందరికీ చెప్పాను గానీ నిన్ను కూరల్లో వేయవద్దని చెప్పానా అని ఒక కథకుడు ఇంట్లో భార్యమీద మండిపడ్డాడట. నరేంద్రమోడీ నాయకత్వం పరిహాసం పాలైందని ఎవరైనా అంటే కాషాయ మరుగుజ్జులు గుంజుకుంటారు.తలరాత లేదా విధి మీద నమ్మకం ఉండేవారి ఆలోచన ప్రకారమైతే గతేడాది ఏప్రిల్‌-నవంబరు మాసాల మధ్య మన దేశ దిగుమతులు మొత్తంగా 32.6శాతం పడిపోతే చైనా నుంచి 17.2శాతమే తగ్గటం విధి వైపరీత్యం, నరేంద్రమోడీకి తలవంపులు గాకపోతే మరేమిటి ?

చైనా వస్తువులను దిగుమతులు చేసుకొనే లేదా వాటిని నియంత్రించే అధికార వ్యవస్దలో సీతారామ్‌ ఏచూరీ, పినరయి విజయన్‌, బృందాకరత్‌ల కుటుంబ సభ్యులు, బంధువులు లేదా వారి పార్టీ వారు గానీ లేరు, ఉన్నదంతా ” అసలు సిసలు ” ” దేశభక్తులు, జాతీయవాదు ” లైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలే కదా ? మరి ఎందుకు చైనా ఉత్పత్తులు నిలిపివేయలేకపోయారు ? నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చూసీ చూడనట్లు ఉన్నట్లు ? జనాలను బకరాలను చేద్దామనా ?
దిగుమతులు తగ్గటంలో ప్రధానంగా చమురు, బంగారం ఉన్నాయని ఎవరైనా సమర్ధించుకోవచ్చు. అవి మినహాయిస్తే పైన చెప్పిన నెలల్లో దిగుమతులు 25.6శాతం తగ్గాయి, వాటితో పోల్చినా చైనా వాటా తక్కువే కదా ! చైనా నుంచి టీవీల దిగుమతి గణనీయంగా పడిపోయింది, అంతకంటే ఎక్కువశాతం వియత్నాం నుంచి పడిపోయిందని అంకెలు చెబుతున్నాయి. ఈ కాలంలో చైనా నుంచి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్ల వంటివి గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. చైనా నుంచి నేరుగా తగ్గితే మరొక మార్గంలో వయా హాంకాంగ్‌ నుంచి భారత్‌కు చేరుతున్నాయి. చిల్లి కాదు తూటు అంటే ఇదే. చైనా నుంచి దిగుమతులు 80.8శాతం నుంచి 65.1శాతానికి పడిపోతే ఇదే సమయంలో హాంకాంగ్‌ నుంచి 9.8 నుంచి 23.4శాతానికి పెరిగాయి. రెండింటినీ కలిపి చూస్తే 90.6 నుంచి 88.5శాతానికి తగ్గాయి. సంఖ్యపరంగా తగ్గింది తక్కువే అయినా విలువ పరంగా 24.7శాతం పెరిగింది. అసలు కారణం ఇంటి నుంచి పని చేసే వారు, వారి అవసరాలు పెరగటమే. ఈ కాలంలో చైనా నుంచి మనం 38.82 బిలియన్‌ డాలర్ల విలువగలవి దిగుమతి చేసుకుంటే 13.64 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేశాము. చైనా వ్యతిరేకత, దేశభక్తి రేటింగ్స్‌ను పెంచుకొనే టీవీ ఛానల్స్‌, కాషాయ దళాల కబుర్లలో తప్ప ఆచరణలో పెద్దగా లేదని, యాప్‌లను నిషేధించినా వాటి ప్రభావం పెద్దగా లేదని అంకెలు చెబుతున్నాయి. విదేశీ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులను అడ్డుకొనే ధైర్యం దేశభక్తులకు లేనట్టా ? ఉన్నట్లా ! ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగుపడుతున్నది కనుక రాబోయే రోజుల్లో దిగుమతులు పూర్వ స్ధాయికి చేరుకుంటాయా ?


చైనా, మరొక దేశం దేనికైనా ఏ దేశమూ లొంగిపోనవసరం లేదు. ఎవరి ప్రయోజనాలను వారు కాపాడుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో స్వంత విధానాలను కలిగి ఉండాలి తప్ప ఇతరుల పాటలకు మరొకరు నృత్యం చేయటం తగనిపని. మన కోసం పశ్చిమ దేశాలు చైనాతో పోరాడుతాయి లేదా చైనా మెడలు వంచుతాయి అనుకుంటే అంతకంటే భ్రమ, అత్యాశ మరొకటి ఉండదు. వాటి ప్రయోజనాల కోసం మనతో పాటు ఎవరినైనా వినియోగించుకుంటాయి.
ఉదాహరణకు అమెరికా గత కొద్ది దశాబ్దాలుగా చైనాలో మానవహక్కులు లేవంటూ ప్రచారం చేయటం తెలిసిందే. కానీ చైనాతో వాణిజ్యం పెంచుకున్నదే తప్ప తెంచుకోలేదు. దానిబాటలోనే ఐరోపా యూనియన్‌ కూడా నానా యాగీ చేసింది. అదంతా రాయితీలు పొందేందుకు ఆడిన నాటకం.తాజాగా చైనా-ఐరోపా యూనియన్‌ మధ్య కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం అందుకు నిదర్శనం. ఒప్పంద చర్చల ప్రారంభం-అంగీకారం మధ్య కాలంలో చైనాలో మారిందేమీ లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మనకు మద్దతు ఇస్తామన్నట్లుగా మాట్లాడిన ఐరోపా యూనియన్‌ మనకు కబుర్లు చెప్పి తీరా చైనాతో ఒప్పందం చేసుకుంది.


అమెరికాలో ఈనెల 20 అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్‌ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా నియమితులౌతాడని భావిస్తున్న ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పిన మాటలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. చైనాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవటం మరియు అంతిమంగా ప్రతికూల ఫలితాలనిస్తుంది, అదొక తప్పిదమౌతుంది అన్నాడు. కొన్ని అంచనాల ప్రకారం 2028 నాటికి అమెరికాను పక్కకు నెట్టి చైనా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారనుంది, ఇప్పటికే 140 కోట్ల జనాభాతో పెద్ద మార్కెట్‌, వారి జీవితాలు మరింతగా పెరిగితే మార్కెట్‌ ఎంతో విస్తరిస్తుంది. ఈ విషయం ధనిక దేశాల కార్పొరేట్లన్నింటికీ తెలుసు గనుకనే చైనాతో తెగేదాకా లాగటం లేదు. మన భుజం మీద తుపాకి పెట్టి చైనా నుంచి రాయితీలు పొందాలన్నది అమెరికా లేదా చతుష్టయంలోని జపాన్‌, ఆస్ట్రేలియా ఎత్తుగడ. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా అదే చేస్తారు. ఒప్పందం ప్రకారం 2049 నాటికి హాంకాంగ్‌ చైనాలో పూర్తిగా విలీనం కానుంది, అదే సమయానికి తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమైనా ఆశ్చర్యం లేదు. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే ఏ దేశానికి ఆ దేశం తన వ్యూహాలను నిర్ణయించుకుంటుంది.

కొందరు చెబుతున్నట్లుగా పశ్చిమ దేశాలు చైనాను కట్టడి చేయగలవని గానీ లేదా వాటితో కలసి మనం అదుపు చేయగలమనే పగటి కలలు కనటం మానుకుంటే మంచిది. మన కోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా వచ్చి యుద్దం చేస్తాయని ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఇప్పటివరకు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం తమ గుత్త సొమ్ము అన్నట్లుగా ఉన్న ధనిక పశ్చిమ దేశాలు చైనా పురోగమనాన్ని చూసి విస్తుపోతున్నాయి, తేరుకొని సాధ్యమైన మేరకు అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. అందుకు 5జి టెలికాం వ్యవస్ధ పెద్ద ఉదాహరణ. దాన్ని అడ్డుకుంటూనే మిగతా రంగాలలో చైనాతో సంబంధాలను వదులుకోరాదని నిర్ణయించుకుంటున్నాయి. మన మాదిరి వాటికవి దూరం కావటం లేదు. వాస్తవ పరిస్దితులకు అనుగుణ్యంగా వ్యవహరించటం రాజనీతి లక్షణం.


దిగజారుతున్న ఆర్ధిక పరిస్దితులు, తగులుతున్న ఎదురుదెబ్బల కారణంగా గత నాలుగు సంవత్సరాలలో ప్రపంచ నాయకత్వ పాత్ర నుంచి ట్రంప్‌ నాయకత్వంలో అమెరికా పదికిపైగా బహుళపక్ష ఒప్పందాల నుంచి తనకు తానే వైదొలిగింది. అవి ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వైదొలగటం వరకు ఉన్నాయి. ఇదే సమయంలో చైనాను బూచిగా చూపుతూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. దాని వలలో పడిన దేశాలన్నీ తమ వనరులను సమర్పించుకోవటం తప్ప పొందేదేమీ ఉండదు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాను సృష్టించిన తాలిబాన్లను అది వదిలించుకొని మనకు అంటగట్టింది. వారు పాక్‌ మిలిటరీ అదుపులో ఉంటారని తెలుసు. ఉగ్రవాదం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడతామని చెబుతున్న నరేంద్రమోడీ తాలిబాన్లలో రాజకీయ కోణాన్ని చూపుతూ వారితో వ్యవహరించేందుకు పూనుకున్నారు. ఆప్ఘనిస్తాన్‌ ఒకవైపు ఉన్న ఇరాన్‌, మరో వైపు ఉన్న పాకిస్ధాన్‌తో మనం కొత్త సమస్యలను తెచ్చుకోవటం తప్ప మరొకటి కాదు. మన అభివృద్ది మనం చూసుకుంటూ ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతగా ఉంటూ మిలిటరీ ఖర్చు తగ్గించుకొని దాన్ని అభివృద్ధి వైపు మళ్లించటం శ్రేయస్కరం !