ఎం కోటేశ్వరరావు
అన్నీ వివాదం అవుతున్నాయి, ఛీ ఛీ, చివరికి కరోనా వాక్సిన్ కూడా అనుకుంటున్నారా ! అవును, ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. వాక్సిన్ తయారీ తన ఆత్మనిర్భర కలను నిజం చేయటంలో శాస్త్రవేత్తల ఆతురత కనిపించిందని అని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే ఎదుటి వారి మీద తప్పుడు ముద్రలు వేసేందుకు కూడా అతీతంగా ఏవీ కనిపించటం లేదు. ఒక కంపెనీ వాక్సిన్ నీటి మాదిరి సురక్షితమైనది అని ఒకరు ఎత్తిపొడిచింది. మరో కంపెనీ వాక్సిన్‌కు 60శాతం దుష్ప్రభావాలు ఉన్నా పారాసిటమాల్ వేసి కనపడకుండా చేసినట్లు మేం చేయం, కేవలం వంద మంది మీదనే పరీక్షించి మా ఉత్పత్తి సురక్షితం అంటే ఎలా అన్నారు మరొకరు. ఇద్దరూ కరోనా వాక్సిన్ తయారు చేసే బడా కంపెనీల అధిపతులే, రోడ్డెక్కి చెప్పిన మాటలే కనుక ఒకరు సీరం సిఎండి అదర్ పూనావాలా అయితే మరొకరు భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్ల అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడనవసరం లేదు. ఏమిటీ లొల్లి, ఎవరి మాట నమ్మాలి, ఎవరిని అనుమానించాలి ? కేంద్ర ప్రభుత్వం రెండు వాక్సిన్లను అత్యవసర పరిస్ధితిలో వినియోగానికి అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకదాని ప్రభావం, పరీక్షా ఫలితాల గురించి ప్రశ్నించిన వారి మీద దాడి చేస్తున్నారు.
ఔషధం, వాక్సిన్ ఏదైనా సరే జీవుల ప్రాణాలను కాపాడాలి తప్ప తీయకూడదు. రోగాలు, మహమ్మారుల నుంచి కూడా లాభాలు పిండుకోవటమే పరమార్ధంగా ఉండకూడదు. ఏ కంపెనీ అయినా పూర్తి వివరాలు ప్రకటించనపుడు అనేక మందికి అనుమానాలు కలగటం, వాటిని బహిరంగంగా వ్యక్తం చేయటం సహజం. అది కూడా తప్పేనా ? ఏమిటీ ఉన్మాదం ! భారత్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి వలన ప్రయోజనం-హానీ రెండు లేవని ప్రత్యర్ధి కంపెనీ సీరం సంస్ధ ప్రతినిధి చెప్పారు. అది ఆరోపణో, నిజమో జనానికి తెలియదు. దాని మీద స్పందించిన భారత్ బయోటెక్ అధిపతి కృష్ణ తన ప్రత్యర్ధి కంపెనీ ఉత్పత్తి 60శాతం దుష్ప్రభావాలు కలిగిస్తుందని చెబుతున్నారు. నిజానికి జనం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే వారు ఇలాంటి సమాచారాన్ని ఇప్పటి వరకు ఎందుకు దాచినట్లు ? తన ఉత్పత్తి మీద విమర్శచేసిన తరువాతనే స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు వాక్సిన్ల గురించి కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. దొంగల మధ్య పంపిణీలో తేడాలు వచ్చినపుడు దొంగతనం విషయం బయటకు వచ్చినట్లుగా లేదీ వ్యవహారం !
గర్భవిచ్చిత్తి జరిగిన మానవ పిండాల నుంచి తీసిన కణాలతో తయారు చేసిన వాక్సిన్లను మన క్రైస్తవులు వేసుకోకూడదని కొందరు, పంది మాంసం నుంచి తీసి కణాలతో చేసిన వాక్సిన్లు ముస్లింలు వేసుకోకూడదని మరికొందరు టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. వీరందరికంటే ముందే వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పిన వారు ఆవు మూత్రం తాగి, ఆవు పేడ పూసుకుంటే కరోనా ప్రభావం ఉండదని, దీపాలు వెలిగిస్తే వైరస్ నశిస్తుందని చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. గోమూత్ర సేవనం సర్వరోగ నివారిణి అని ఊరందరికీ చెప్పిన పెద్దలు తమవద్దకు వచ్చే సరికి ఆ పని చేయకుండా బతుకు జీవుడా అంటూ కరోనా సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. అదే మాదిరి క్రైస్తవ, ఇస్లామిక్ మత పెద్దలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాక్సిన్లు తీసుకోవచ్చని ముక్తాయింపులు పలికారు. మతాలవారు చెప్పారని వాక్సిన్లు తీసుకోకుండా జనం ఆగుతారా ?
మన దేశంలో కరోనా వాక్సిన్ ఎందుకు రాజకీయ వివాదంగా మారింది ? ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను మన దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసేందుకు అనుమతులు పొందింది. మరోవైపు దేశీయంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న భారతబయోటెక్స్ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఐసిఎంఆర్ మరియు వైరాలజీ జాతీయ సంస్ధతో కలసి రూపొందించి కోవాగ్జిన్ పేరుతో వాక్సిన్ ప్రయోగాలు జరుపుతున్నది. కోవిషీల్డ్ మూడు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుంది. కోవాగ్జిన్ మూడవ దశ ప్రయోగాలు పూర్తయినట్లు చెబుతున్నా ఇంకా ఫలితాలు ఇంకా వెలువడలేదు. అలాంటి వాక్సిన్ వినియోగానికి ముందుగానే అనుమతివ్వటం ఏమిటన్న ప్రశ్నను కొందరు లేవనెత్తారు. ఇది వివాదాస్పదమైంది. దీని మీద సమర్ధనలూ, విమర్శలూ వెలువడుతున్నాయి. జనంలో గందరగోళం, వాక్సిన్ల సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తాయి. కొందరు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నారు.ఇదొక అవాంఛనీయ పరిణామం. వాక్సిన్ల తయారీ కంపెనీల మధ్య వాణిజ్య పోరుగా రాబోయే రోజుల్లో బయటపడనుందా ?
కోవాగ్జిన్ వాక్సిన్ ప్రత్యామ్నాం అని పేర్కొనటం,వినియోగానికి సంబంధించి అనేక పరిమితులను పేర్కొని అనుమతులు ఇచ్చారు. ప్రత్యామ్నాయం అంటే ఏదీ దొరకనపుడు అనే అర్ధం కూడా ఉంది. అందువలన ఈ రెండు వాక్సిన్లలో దేనిని ఎవరు వేసుకోవాలి? నిర్ణయించేది ఎవరు ? మూడవ దశ ప్రయోగాల ఫలితాలు పూర్తిగాక ముందే కోవాగ్జిన్‌కు అనుమతులు ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తొలుత మన సైనికుల పరాక్రమాన్ని ఇప్పుడు వాక్సిన్ తయారీని శంకిస్తున్నారంటూ కేంద్ర మంత్రి హర్దేవ్‌సింగ్ పూరీ, ఇతర బిజెపి నేతలు ప్రతిపక్షాలు, ఇతరుల మీద ఎదురుదాడికి దిగటం విస్మయం కలిగిస్తోంది. అసలు ఆ కంపెనీ తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవటం ఏమిటి ? ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడతారా ? కోవాగ్జిన్ సామర్ధ్యం గురించి ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు, వివరాలు వెల్లడించకుండా నమ్మటం ఎలా అన్నదే అసలు సమస్య.
కోవాగ్జిన్ గతేడాది ఆగస్టు 15నాటికే అది సిద్దం అవుతుందని స్వయంగా ఐసిఎంఆర్ లేఖలు రాసింది. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ గడువు పోయింది, రిపబ్లిక్ దినోత్సవం లోపు అయినా పరిశోధనా ఫలితాలు వస్తాయా అన్న అనుమానాలు ఉన్న సమయంలో రాకముందే ఏకంగా ముందస్తు అనుమతి ఇచ్చేశారు. కొంత మంది చెబుతున్నట్లు ఇప్పటికే దాదాపు 7 కోట్ల డోసులు తయారు చేసిన సీరం సంస్ధ నుంచి కొనుగోలు బేరసారాల వత్తిడిలో భాగంగా కోవాగ్జిన్ పరీక్షలు పూర్తి కాకుండానే అనుమతులు ఇచ్చారా అన్న కోణం కూడా ఉంది. ఒకవేళ అదే వాస్తవం అయితే అలాంటి విషయాలు దాగవు.
కోవాగ్జిన్‌పై అనుమానాలు వ్యక్తం చేయటమే దేశ ద్రోహం అన్నట్లుగా వ్యాఖ్యానించి బిజెపి వాక్సిన్ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చింది. టీవీ ఛానల్స్ పెద్దలు కూడా ముందూ వెనుకా చూడకుండా నిర్దారణ చేసుకోకుండా తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా వెల్లడైంది. ఎవరో ఒక చిన్న విలేకరి పొరపాటు లేదా అత్యుత్సాహం ప్రదర్శించాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇండియా టీవీ అధిపతి, ప్రధాన సంపాదకుడు అయిన రజత్ శర్మ ఏకంగా కోవాగ్జిన్ టీకాను ముందుగానే 190 దేశాలు ఆర్డర్ ఇచ్చాయని సెలవిచ్చారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించి చెప్పే వారి మాదిరి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారో చూడండి.” మన దేశంలో వృద్ది చేసిన ఈ వాక్సిన్ బాగా పని చేస్తుంది, ధర తక్కువ, నిల్వచేయటం సులభం. ఎందుకంటే నరేంద్రమోడీ విధానాలు మన శ్స్తావేత్తల నైపుణ్యం దీనికి కారణం. వాక్సిన్ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ముందుగానే 190 దేశాలు దీని కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయని తెలుసుకోవాలి ” అని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. దాన్ని బిజెపి మరుగుజ్జులు పెద్ద ఎత్తున రీ ట్వీట్ చేశారు.
తమ ఉత్పత్తి కేంద్రాన్ని 70దేశాల ప్రతినిధులు సందర్శించారని చెప్పారు తప్ప ఆర్డర్లు బుక్ చేశారని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా ఎక్కడా చెప్పలేదు. అలా సందర్శించిన వారు ఆర్డర్లు పెట్టినట్లు వార్తలు కూడా లేవు. మరి రజత్ శర్మగారికి 190 దేశాల సమాచారం ఎలా తెలిసింది? అనేక మంది సామాన్యులు భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ వాక్సిన్, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కార్యక్రమమైన కోవాక్స్‌తో గందరగోళపడుతున్నారు.ప్రపంచ దేశాలన్నింటికీ చౌకగా వాక్సిన్ అందించేందుకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో 190 దేశాలు పాలుపంచుకుంటున్నాయని, భాగస్వామ్య దేశాలన్నింటికీ రెండువందల కోట్ల డోసుల వాక్సిన్ అందచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిసెంబరు 19న ప్రకటించారు. వీటిలో అనేక దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్దారించిన వాక్సిన్లన్నీ ఉన్నాయి. ఇరవై కోట్ల డోసులు అందించేందుకు వాక్సిన్ అలయన్స్ గవీ, ఇతర సంస్ధలు ఒప్పందం చేసుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన పది వాక్సిన్‌లను ఉటంకిస్తూ అవి ఏ దశలో ఉన్నాయో కూడా ప్రకటనలో తెలిపారు. చిత్రం ఏమిటంటే వీటిలో భారత బయోటెక్స్ కోవాగ్జిన్ లేదు. త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొంది ఇది కూడా చేరుతుందా లేదా అన్నది వేరే విషయం. ఇప్పటికైతే ఎగుమతి వార్తలు లేవు.
కోవాక్స్ కార్యక్రమం ప్రకారం దానిలో భాగస్వామ్య దేశాలకు ఆ కార్యక్రమం కింద పంపిణీ చేసే వాక్సిన్‌లో ఆయా దేశాల జనాభాను బట్టి 20శాతం డోసులను వారికి అందచేస్తారు. వాటిని ఆయా దేశాలు ఎలా ఉపయోగించుకుంటాయి, ఎవరికైనా అందచేస్తాయా అన్నది వారిష్టం. ఉదాహరణకు చైనాలో కరోనా కేసులు లేని కారణంగా చైనా రూపొందించిన వాక్సిన్లను బ్రెజిల్‌లో ఉన్న రోగుల మీద ప్రయోగాలు చేశారు. కోవాక్స్ కార్యక్రమంలో చైనా భాగస్వామి కనుక దానికి వచ్చే వాటాను ఇతర దేశాలకు అందచేయవచ్చు. అమెరికా దానిలో భాగం కాదు కనుక దానికి వాక్సిన్ల కోటా ఉండదు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం పేద దేశాలకు సబ్సిడీ ధరలకు వాక్సిన్ అందచేస్తారు. బిల్‌గేట్స్ కూడా ఈ పధకంలో భాగస్వామి కనుక తనకు వచ్చే వాక్సిన్ తన సంస్ధ ద్వారా ఎవరికైనా అందచేయవచ్చు.
సమాజవాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తెలివి తక్కువ ప్రకటన చేసి శాస్త్రవేత్తలను అవమానించటం తన ఉద్దేశ్యం కాదంటూ తరువాత నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్ బిజెపిదని దాన్ని తాను వేసుకోనని అఖిలేష్ వ్యాఖ్యానించారు. నిజానికి సర్వరోగనివాణి బిజెపి వాక్సిన్ లేదా ఔషధం ఆవు పేడ లేదా మూత్రం అన్నది అందరికీ తెలిసిందే . ఆవు మూత్ర సేవన కార్యక్రమాల సమయంలో ఆ ప్రకటన చేసి ఉంటే అర్ధం ఉండేది. ఆవు మూత్రం, పేడ కరోనాను నివారిస్తుందని చెప్పిన బిజెపి పెద్దలు అనేక చోట్ల వాటి సేవన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా మన వైద్యులు, శాస్త్రవేత్తలను అవమానించిందీ, ఇప్పటికీ అవమానిస్తున్నదీ కాషాయ దళాలే.
భారత బయోటెక్‌లో తయారు చేస్తున్నది ఆవు (మూత్రపు) శాస్త్రవేత్తలు కాదు. దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇంకా రాలేదు కనుక వేసుకోను అన్నా అదొకరకం. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఊపుమీద ఉండటం, వాక్సిన్ తయారీని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు భ్రమ కల్పించేందుకు నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌లోని ఆ సంస్దలను సందర్శించిన నేపధ్యంలో సమాజవాద పార్టీ నేత బిజెపి వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఆ వ్యాఖ్య పనికి వస్తుందని భావించి ఉండవచ్చేమోగాని, శాస్త్రవేత్తలను కించపరచాలనే ఉద్దేశ్యం ఉంటుందని చెప్పలేము. అఖిలేష్ యాదవ్ తెలివి తక్కువ ప్రకటన చేస్తే బిజెపి నేతలు తక్కువేమీ తినలేదు. వివరాలు లేని వాక్సిన్ సామర్ద్యాన్ని ప్రశ్నించటం దేశద్రోహం అనేంతవరకు వెళ్లారు.
వాక్సిన్లను స్వదేశీ-విదేశీ అని వర్ణించటం అర్ధంలేని విషయం. విదేశాల్లో రూపొందించిన వాక్సిన్లు, ఔషధాలను మన దేశంలోని సంస్ధలు తయారు చేయటమే కాదు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.ఇదొక వ్యాపారం. భారత్ బయోటెక్ సంస్ధకు ప్రపంచంలో అతి పెద్ద వాక్సిన్ వ్యాపారి బిల్ గేట్స్‌కు, అంతర్జాతీయ ఫార్మా లాబీకి ఉన్న వ్యాపార లావాదేవీల వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ వారి సంబంధాలు బహిర్గతమే. ఏదో ఒక రూపంలో ఆ సంస్ధ బిల్‌గేట్స్, ఇతర సంస్ధల నుంచి నిధులు పొందింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం భారత్ బయోటెక్ తయారు చేస్తున్న డయేరియాకు ఉపయోగించే రోటోవాక్ వాక్సిన్ సామర్ధ్యం 56శాతమే అని, దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇప్పటికీ అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ వాక్సిన్ కొనుగోలుకు ఆ సంస్దతో బిల్ గేట్స్ ఒప్పందం ఉంది. దాన్ని ప్రభుత్వాలకు అంటగట్టి ప్రజారోగ్య కార్యమ్రాలలో వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. బిల్ గేట్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ వాక్సిన్ లాబీ కంపెనీలు సరఫరా చేస్తున్న నాసిరకం లేదా ప్రభావం లేని వాక్సిన్ల కారణంగా ప్రపంచ వ్యాపితంగా 3.8కోట్ల మంది శిశువులు పుట్టక ముందే మరణించారనే విమర్శలు ఉన్నాయి.మన దేశంతో సహా అనేక దేశాలలో వాక్సిన్ల దుష్ప్రభావాలకు తయారీ కంపెనీల నుంచి పరిహారాన్ని కోరే చట్టాలు లేవు. ఈ నేపధ్యంలోనే కోట్లాది మందికి వేయదలచిన వాక్సిన్ గురించి భారత్ బయోటెక్ వివరాలు వెల్లడి చేయక ముందే అనుమతి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి.
వాక్సిన్‌పై తలెత్తిన వివాదం ”సమాచార మహమ్మారి ” ని మరింత ఎక్కువ చేయనుందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎన్ని మహమ్మారులను అయినా ఎదుర్కొనగలంగానీ అంతకంటే వేగంగా తప్పుడు, నకిలీ వార్తలను వ్యాపింప చేసే సమాచార మహమ్మారి వైరస్ ఎంతో ప్రమాదకరమని ఆ రంగంలోని పెద్దలు చెబుతున్నారు. దీని గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. ఇప్పుడు కరోనా-వాక్సిన్ కూడా వివాదం అయింది కనుక దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని సవినయమనవి. చివరిగా ఒక విషయం మరచి పోకూడదు. కరోనా వైరస్ గురించి తెలిసిన వెంటనే ప్రపంచంలోని అనేక మంది దాని నివారణకు వాక్సిన్ తయారీకి పూనుకున్నారు. మన దేశంలో తొలి వైరస్ కేసు బయటపడి, లాక్‌డౌన్ విధించిన రెండు నెలల తరువాత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించింది. అది ఆర్ధిక ఉద్దీపన కార్యక్రమం అని అందరికీ తెలుసు. ఇప్పుడు వాక్సిన్ తయారీ ఆ కార్యక్రమ కల అని దాన్ని శాస్త్రవేత్తలు నెరవేర్చారని ప్రధాని చెప్పటంలో నిజాయితీ ఎంతో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు మన వాక్సిన్ సామర్ధ్యాన్ని ప్రశ్నించటం దేశవ్యతిరేక వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, మరొక మంత్రి హరదేవ్ సింగ్ పూరీ వ్యాఖ్యానించారు. కలికాలం, వైపరీత్యం గాకపోతే బిజెపికి నచ్చని వారందరికీ ఈ ముద్ర తగిలిస్తారా ! ఏమిటీ అనారోగ్యపు వ్యాఖ్యలు !!