ఎం కోటేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతాంగం ఉద్యమం సాగిస్తున్నది. రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ తీరును గమనించి ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ప్రదర్శనకు రైతులు సన్నద్దం అవుతున్నారు.వారికి వ్యతిరేకంగా పాలకులు, కార్పొరేట్‌లు, వత్తాసుగా వాస్తవాలను మూసిపెట్టాలని గోడీ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.మూసిపెడితే పాచిపోతుందన్నది తెలిసిందే. వాస్తవాలను వక్రీకరిస్తున్నకొద్దీ ఏదో ఒక రూపంలో కొన్ని అంశాలైనా వెలుగు చూస్తున్నాయి. కేంద్రం ఎందుకు మొండిగా ఉందన్న చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది.
ఉపాధి కల్పిస్తున్నాయనే పేరుతో కార్పొరేట్లకు పాలకులు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు వాటికి రక్షణ కల్పించాలంటూ విదేశీ దిగుమతులపై పన్నులు, ఇతర ఆంక్షలతో కాపు కాస్తున్నారు. నిజంగా మేలు జరిగితే ఇవ్వండి, ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాకులను కొట్టి గద్దలకు వేయవద్దని చెప్పటం తప్పు కాదు కదా ! చైనా నుంచి దిగుమతుల మన కొర్పొరేట్లు, పారిశ్రామికవేత్తల లాభాలకు గండిపెడుతున్నాయంటూ అనేక ఉత్పత్తులను నిలిపివేశారు. దానికి గాల్వాన్ లోయ ఉదంతాన్ని సాకుగా చూపి దేశభక్తి మేకప్ వేశారు. చైనా ఉత్పత్తులు నరేంద్రమోడీ హయాంలో ఇబ్బడి ముబ్బడి అయ్యాయన్నది వేరే విషయం. కరోనాకు ముందే పారిశ్రామిక, వాణిజ్య రంగాలు దిగజారటం ప్రారంభమైంది. నిలకడగా ఉన్నది వ్యవసాయ రంగమే. దాన్నుంచి లాభాలు పిండుకోవాలన్న కార్పొరేట్ల కన్ను పడింది కనుకనే వ్యవసాయ చట్టాలను సవరించారు. రైతుల ఉత్పత్తులకు ఆంక్షలు లేని స్వేచ్చా మార్కెట్ కబుర్లు చెబుతున్నారు. అన్ని రక్షణలు ఉన్నకారణంగానే కార్పొరేట్‌లు ఎక్కడా రోడ్ల మీద కనిపించరు.నోరు మెదపరు. రైతులు మాత్రం వీధులకు ఎక్కాల్సి వస్తోంది. గళం విప్పక తప్పటం లేదు.
వరుసగా రైతులకు ఉన్న రక్షణలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్లకు లేని ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు రైతుల విషయాలకు మాత్రమే గుర్తుకు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల పేరుతో 2019-20లో టారిఫ్ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి 50శాతం ఉన్న పన్నును తగ్గించి కేవలం 15శాతంతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువకే గిట్టుబాటు అవుతున్న కారణంగా వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపున మన దేశం నుంచి బంగ్లాదేశ్‌కు మన కనీస మద్దతు ధరల కంటే తక్కువకు బంగ్లాదేశ్‌కు మన వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 కాగా ఎగుమతి ద్వారా తాము 1500 నుంచి 1550వరకు పొందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారు వివిధ రాష్ట్రాలలో రైతుల నుంచి 12 నుంచి 1400 మధ్య కొనుగోలు చేస్తున్నారు(డిసెంబరు 25 మనీకంట్రోలు వార్త). దేశమంతటా ఇదే స్ధితి, ఏ ఒక్క ప్రయివేటు వ్యాపారీ వచ్చి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. ఏ రైతూ తన పంటను పరాయి రాష్ట్రాలకు తీసుకుపోయి తనకు గిట్టుబాటు ధరకు అమ్ముకొనే పరిస్దితీ లేదు. ఎగుమతి చేస్తున్నా ధరలు రావటం లేదన్నది చేదునిజం.
2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో 2019 ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం మొక్కజొన్నలు, గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు.చైనా నుంచి వస్తున్న పారిశ్రామిక వస్తువులకు అది వర్తించదా ? రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? పప్పుధాన్యాల రైతులను ప్రోత్సహిస్తున్నామని ఒక వైపు చెబుతారు. మరోవైపు వాటి మీద ఉన్న దిగుమతి పన్నును 30 నుంచి 20శాతానికి తగ్గించారు.అది విదేశీ రైతులకు ఉపయోగపడింది తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా విదేశీ పామ్ ఆయిల్ దిగుమతులపై పన్ను పదిశాతం తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచ వాణిజ్య సంస్ధ ఉనికిలోకి రాక ముందు ఉనికిలో ఉన్న పన్నులు, వాణిజ్యాలపై సాధారణ ఒప్పందం(గాట్) ఉరుగ్వే దఫా చర్చలకు ముందు వ్యవసాయం లేదు. ఆ దఫా చర్చలలోనే ముందుకు తెచ్చారు. దాని ప్రకారం ధనిక దేశాలు తమ రైతాంగానికి ఇచ్చే ఎగుమతి రాయితీలు, సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలి. ఇదే సమయంలో మిగిలిన దేశాలు దిగుమతులపై ఉన్న పన్నులు, ఇతర ఆంక్షలను ఎత్తివేయాలి, విదేశాలకు మార్కెట్లను తెరవాలి, రైతాంగానికి మద్దతు ధరల, ప్రజాపంపిణీ వ్యవస్దలను నిలిపివేయాలి. అయితే అమెరికా, ఐరోపా యూనియన్ ధనిక దేశాలు గ్రీన్ బాక్స్ పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. మిగతా దేశాలు ఒప్పందాన్ని అమలు చేయాలని వత్తిడి చేస్తున్నాయి. ఆ వివాదమే గత రెండు దశాబ్దాలుగా దోహా దఫా ఒప్పందం కుదరకపోవటానికి కారణం.
బిల్‌క్లింటన్ హయాంలో రైతాంగానికి 1530 కోట్ల డాలర్ల మొత్తాన్ని నేరుగా అందించారు. ఎలా అంటే టన్ను సోయా ధర మార్కెట్లో 155 డాలర్లు ఉంటే ప్రభుత్వం 193 డాలర్లు చెల్లించింది. వాటిని మన వంటి దేశాలకు ఎగుమతి చేయటంతో మన రైతాంగం నాశనమైంది. అతల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా వత్తిడికి లొంగిపోయి 2001లో 719 వస్తువులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేశారు. గత ఏడాది డోనాల్డ్ ట్రంప్ అమెరికా రైతులకు 4600 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇచ్చాడు. అయితే వీటిలో ఎక్కువ మొత్తం బడా రైతులకు, కార్పొరేట్లకు చేరాయన్నది మరో అంశం. ఒక శాతం కంపెనీలు 26శాతం పొందితే, పదిశాతం పెద్ద బడా రైతులు, కంపెనీలకు 78శాతం దక్కాయి.
తాజాగా డిసెంబరు చివరి వారంలో ప్రపంచ పత్తి సలహా కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్క పత్తికే 2018-19లో వివిధ దేశాలు ఇచ్చిన పలు రకాల రాయితీల మొత్తం 570 బిలియన్ డాలర్ల నుంచి 2019-20లో ఈమొత్తం 800కోట్ల డాలర్లకు పెరిగింది.గడచిన నాలుగు సంవత్సరాలలో పత్తి ధరలు తగ్గిన కారణంగా సబ్సిడీల మొత్తం 450 నుంచి 800 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరాలలో గరిష్టంగా 1,700 కోట్లు చెల్లించిన రికార్డు ఉంది.2010-11 సంవత్సరాలలో ప్రపంచ పత్తి మార్కెట్లో ధర పౌండుకు(454 గ్రాముల గింజలు తీసిన దూది) 165 సెంట్లు పలకగా 2019-20లో 72సెంట్లకు తగ్గింది. ప్రస్తుతం 80 సెంట్లకు అటూ ఇటూగా కదలాడుతోంది.2019-20లో వివిధ దేశాలు ఇచ్చిన రాయితీల మొత్తాలు ఇలా ఉన్నాయి. ఆయా దేశాల పత్తి ఉత్పత్తిని సబ్సిడీ మొత్తాలతో భాగిస్తే సెంట్ల వారీ చూస్తే కొన్ని దేశాల స్ధానాలు మారతాయి.
దేశం×× కోట్ల డాలర్లు ×× పౌనుకు సెంట్లలో
చైనా×××× 471.1 ××××× 37
అమెరికా×× 202.2 ××××× 21
భారత్×××× 59 ××××× 4.4
టర్కీ ×××× 23.2 ××××× 13
గ్రీస్ ××××× 20.7 ××××× 32
మాలి ×××× 8.2 ××××× 12
స్పెయిన్ ××× 6.7 ××××× 46
కోట్ డి ఐవరీ × 3.8 ××××× 13
బుర్కినాఫాసో×× 2.4 ××××× 6
మన దేశ సబ్సిడీ విషయానికి వస్తే కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేసిన పత్తికి చెల్లించిన మొత్తం- దాన్ని తిరిగి మిల్లర్లకు లేదా ఎగుమతులు చేయగా వచ్చిన మొత్తాలకు ఉన్న తేడాను సబ్సిడీగా పరిగణిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలలో సిసిఐ నామ మాత్రపు కొనుగోళ్లు జరిపింది. కొన్ని సంవత్సరాలలో దానికి ఎలాంటి నష్టాలు లేవు. అందువలన దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే సబ్సిడీ అసలు లేనట్లే అని చెప్పవచ్చు. ఉదాహరణకు 2017-18 పత్తి సంవత్సరంలో సిసిఐ 66,313 టన్నులు కొనుగోలు చేయగా 2018-19లో 1,81,970 టన్నులు, 2019-20లో (గడచిన ఐదేండ్లలో రికార్డు స్ధాయిలో) 17.9లక్షల టన్నులు సిసిఐ కొనుగోలు చేసింది. 2018-19లో సిసిఐకి వచ్చిన నష్టం 4.6 కోట్ల డాలర్లు, కాగా 2019-20లో 2020 నవంబరు నాటికి 12లక్షల టన్నులు విక్రయించగా మిగిలిన మొత్తం నిల్వ ఉంది. అయితే అమ్మినదాని మీద వచ్చిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తంగా నష్టం 59 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంస్ద తన నివేదికలో పేర్కొన్నది. దీన్ని సబ్సిడీగా పరిగణించింది.నిజానికి దీన్ని పత్తి రైతులకు ఇచ్చిన సబ్సిడీగా పరిగణించాలా లేక మిల్లర్లకు, ఎగుమతులకు ఇచ్చిన రాయితీలు మరియు సిసిఐ అవినీతి, అక్రమాల మొత్తంగా చూడాలా ?
పత్తితో పాటు ఇతర కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలను సబ్సిడీలుగా అమెరికా తదితర దేశాలు పరిగణిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసులు దాఖలు చేశాయి. ఆ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఓయిసిడి సంస్ధ ప్రకటించిన వివరాల ప్రకారం అమెరికా, ఐరోపా యూనియన్, జపాన్ ధనిక దేశాల రైతాంగ ఆదాయాల్లో 40 నుంచి 65శాతం మొత్తాలు ఆయా ప్రభుత్వాలు అందచేస్తున్న సబ్సిడీల ద్వారా సమకూరుతున్నవే.
ఈ ఏడాది పత్తి రైతాంగం కనీస మద్దతు ధరలను పొందటం లేదని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో క్వింటాలుకు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయవరకు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా సిసిఐ కేంద్రాలకు పెద్ద మొత్తంలో పత్తి వస్తోంది. కొనుగోలును తగ్గించేందుకు అనేక నిబంధనలు పెట్టటంతో పాటు పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకు రావద్దని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు ( ప్రతి ఏటా అక్టోబరు ఒకటవ తేదీన పత్తి సంవత్సరం ప్రారంభమై మరుసటి ఏడాది సెప్టెంబరులో ముగుస్తుంది) కొనుగోళ్లు జరుపుతూనే ఉంటామని సిసిఐ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సాధ్యమేనా ? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా ? పంజాబ్‌లో ప్రతి రోజూ మండీలకు 50వేల క్వింటాళ్ల పత్తి వస్తుంటే తాము రోజుకు పన్నెండున్నరవేలకు మించి కొనుగోలు చేసేది లేదని సిసిఐ చెబుతున్నదని ప్రయివేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదలి వేస్తున్నదని అకాలీదళ్‌నేత హర్‌సిమ్రత్ కౌర్ వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులు భయపడుతున్నది న్యాయమే అని ఈ పరిణామం వెల్లడిస్తున్నదన్నారు.
పత్తికి కనీస మద్దతు ధరలు ఉంటాయని తెలిసిన రైతాంగం 25శాతంలోపే అని, ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో వారు 12 నుంచి 27శాతంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు. తెలిసిన వారిలో కూడా 34.34 నుంచి 37.5 శాతం మాత్రమే సేకరణ సంస్ధలకు విక్రయిస్తున్నారని తేలింది. అందుకే కాస్త ఎక్కువ తెలిసిన ప్రాంతాల రైతులు ముందుగా మేలుకున్నారు, తెలియని వారు తెలుసుకొని రంగంలోకి దిగుతారు. వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఒరగబెడతామని చెబుతున్న పాలకులు, వారికి వంత పాడుతున్న మేధావులూ ఈ అంశాల గురించి ఏమంటారో !