Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
డోనాల్డ్‌ ట్రంప్‌ ! అతగాడిని ఇప్పుడెలా వర్ణించాలో తెలియటం లేదు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యముంటేనే లేకపోతేనేం, ట్రంపూ అంతే ! నిర్ణీత వ్యవధి జనవరి 20వరకు పదవిలో ఉంటాడా, అభిశంసన లేదా మరో ప్రక్రియ ద్వారా మెడపట్టి వైట్‌ హౌస్‌ నుంచి గెంటి వేస్తారా అన్నది పెద్దగా ఆసక్తి కలిగించే అంశం కాదు. నిండా మునిగిన వారికి చలేమిటి-కొత్తగా పోయే పరువేమిటి ! ట్రంప్‌ అంటే ఏమిటో ఇంకా తెలియని వారు ఉండవచ్చు. తెలిసిన వారు అతగాడి స్నేహితుల గురించి ఆలోచించాలి, ఆందోళనపడాలి !


ఆ పిచ్చోడు ఏమి చేస్తాడో తెలియదు కనుక మిలటరీ పరంగా ఎలాంటి నిర్ణయాలనూ ఆమోదించవద్దు, అణ్వాయుధాల మీటల దగ్గరకు రానివ్వవద్దంటూ మిలిటరీ అధికారులకు అమెరికన్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ లేఖ రాసి జాగ్రత్తలు చేప్పారు. ఏ విద్వేషాలు రెచ్చగొట్టి మరింతగా ముప్పు తలపెడతాడో అని సామాజిక మాధ్యమాలు తాత్కాలికంగా అతని ఖాతాలను నిలిపివేశాయి. ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్దం, ట్రంప్‌ భావ ప్రకటనా స్వేచ్చకు విఘాతం అంటూ బిజెపి నేతలు మీడియాకు ఎక్కటం వారేమిటో తెలియనివారికి తెలుస్తున్నది, వీరు కూడా ట్రంప్‌ బాటలో పయనిస్తారా అన్న ఆందోళనకు తావిస్తోంది.


జనవరి ఆరవ తేదీన వాషింగ్టన్‌ డిసిలోని అమెరికా అధికార పీఠం ఉన్న కాపిటల్‌ హిల్స్‌ భవనంలో అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలలో పోలైన ఓట్ల లెక్కింపు- విజేతల నిర్ధారణకు పార్లమెంట్‌ ఉభయ సభలు సమావేశం జరిపాయి. ఆ ఎన్నికలను గుర్తించవద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ట్రంప్‌ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలతో ఆ సమావేశం మీద ఒక్కసారిగా డోనాల్డ్‌ ట్రంప్‌ మూకలు దాడికి దిగాయి, ఎంపీలు బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీశారు. నేల మాళిగలో దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి. మూకదాడిలో ఐదుగురు మరణించగా 50 మందికి పైగా పోలీసులు గాయపడినట్లు వార్తలు వచ్చాయి.


అమెరికాలో, ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టగల వేగు యంత్రాంగం, అత్యాధునిక పరికరాలు కలిగినవని చెప్పుకొనే వారికి ఇది తలవంపులు తెస్తున్నది, వారి సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు, భద్రతా సిబ్బంది ఏకంగా తమ కాపిటల్‌ మీద జరగనున్న దాడిని ఎలా పసిగట్టలేకపోయారు? వీరు ప్రపంచాన్ని రక్షిస్తామంటే, సమాచారాన్ని అందిస్తామంటే నమ్మటం ఎలా ? భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది ? మూకలను పురికొల్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ మీద, మూకల కుట్రను పసిగట్టలేకపోయిన యంత్రాంగం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ట్రంప్‌ను ఈ పాటికే పదవి నుంచి తొలగించి ఉగ్రవాద చట్టం కింద అరెస్టు చేసి ఉండాల్సింది.
బొలీవియా, వెనెజులా వంటి దేశాలలో గెలిచిన వారిని గుర్తించేది లేదని ప్రకటించినపుడు వారు వామపక్ష శక్తులు గనుక ఏమైపోతే మనకేమిలే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించారు. ఇప్పుడు తాము నిజంగా ఓటువేసిన ఎన్నికలను గుర్తించేది లేదంటూ, ఆ ప్రక్రియను వమ్ము చేసేందుకు మూకలను పంపి అధికార కేంద్రంపై దాడికి ట్రంప్‌ ఉసిగొల్పటాన్ని చూసి వారు, యావత్‌ ప్రపంచం విస్తుపోతోంది. విదేశాల్లో అమెరికా దుశ్చర్యలను ప్రజాస్వామిక వాదులందరూ గట్టిగా ఖండించి ఉంటే ట్రంప్‌ ఇంతకు బరితెగించి ఉండేవాడా ?

తాను ఓడిపోతే ఓటమిని అంగీకరించను అని ఎన్నికలకు ముందే తెగేసి తేల్చి చెప్పిన అపర ప్రజాస్వామికవాది ట్రంప్‌. తోటకూర నాడే అన్నట్లుగా అప్పుడే ప్రియమైన స్నేహితుడా ఇది నీకు తగదు అని నరేంద్రమోడీ చెప్పి ఉంటే ఇంతటి దురాగతానికి పాల్పడి ఉండేవాడు కాదేమో ! అతగాడి చర్యలను చూస్తూ దు:ఖితుడనయ్యానని చెప్పుకోవాల్సిన దుస్ధితి వచ్చేది కాదేమో ! అలా చెప్పాల్సిన అవసరం మోడీకి ఏమిటి అని మరుగుజ్జులు ఎగిరి పడవచ్చు. ట్రంప్‌ మద్దతుదార్ల దాడిని చూసిన తరువాత అనేక మంది దేశాధినేతలు అధికారమార్పిడి సజావుగా జరగాలంటూ సుభాషితాలు చెప్పారు. కానీ నరేంద్రమోడీగారికి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఏడాది క్రితమే తిరిగి వచ్చేది ట్రంప్‌ సర్కారే (అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌) అని, మీరంతా మద్దతు ఇవ్వండని అమెరికాలోని భారతీయులకు చెప్పి, తరువాత అహమ్మదాబాద్‌కు తీసుకు వచ్చి ఊరేగించిన మోడీగారు కూడా ఇతరుల మాదిరే సుభాషితాలు చెబితే ? కొట్టినా, తిట్టినా, ముద్దు పెట్టుకున్నా ఇష్టమై కౌగిలించుకున్నవారికే కదా అవకాశం ఉండేది.


మన పార్లమెంట్‌ మీద జరిగిన దానిని ఉగ్రవాద దాడి అన్నాము. కాపిటల్‌ భవనం మీద ట్రంప్‌ మద్దతుదార్లు చేసిన దాడి, హత్యలను మూర్తీభవించిన ప్రజాస్వామిక పరిరక్షక మహత్తర కర్తవ్యంలో భాగం అంటారా ? తనకు ఓటు వేసిన వారిని దేశభక్తులు అని ట్రంప్‌ వర్ణించారు, వారిలో కొందరు దాడికి పాల్పడ్డారు కనుక వారిని కూడా దేశ భక్తులుగానే పరిగణించాలా ? లేకపోతే మోడీ నోట దు:ఖం తప్ప ఖండన మాట రాలేదేం !


ప్రపంచంలో ట్రంపు ముఖ్యస్నేహితులు కొద్ది మందిలో జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, మన ప్రధాని నరేంద్రమోడీ సరేసరి. వీరి మధ్య ఉన్న ఉల్లాసం, సరసత గురించి పదే పదే చెప్పుకోనవసరం లేదు. ఆ చెట్టపట్టాలు-ఆ కౌగిలింతలను చూసిన తరువాత అదొక అనిర్వచనీయ బంధం వాటిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం అందరికీ కలగదు కదా అని ఎందరో మురిసిపోవటాన్ని చూశాము.

ఎంతలో ఎంత మార్పు ! ” వాషింగ్టన్‌ డిసి.లో కొట్లాటలు మరియు హింసా కాండ వార్తలు చూడాలంటే దు:ఖం కలిగింది. అధికార మార్పిడి పద్దతి ప్రకారం మరియు శాంతియుత పద్దతుల్లో కొనసాగాలి. చట్టవిరుద్దమైన నిరసనలతో ప్రజాస్వామిక ప్రక్రియను కూలదోయకూడదు ” అని నరేంద్రమోడీ నోటి నుంచి అదే లెండి ట్విటర్‌ ద్వారా స్పందన వెలువడుతుందని ఎవరైనా, ఎప్పుడైనా ఊహించారా ? దీన్ని విధిరాత అందామా ? లేక మోడీ గారి సిబ్బంది రాసింది అనుకోవాలా ? దు:ఖితులైన సామాన్యులు కోలుకోవాలంటే సమయం పడుతుంది. నరేంద్రమోడీ అసామాన్య వ్యక్తి గనుక త్వరలోనే మామూలు మనిషి కావచ్చు. అయినా ప్రపంచమంతా చీత్కరించుకుంటున్న వ్యక్తి ప్రేరేపిత చర్యల గురించి ఒక ప్రధాని దు:ఖితులు కావటంలో నిజాయితీ ఉందా అని ఎవరికైనా అనుమానం వస్తే… చెప్పలేం !


అమెరికా అధికార కేంద్రంపై తన మద్దతుదార్లను ఉసిగొల్పిన ట్రంప్‌ వైఖరి మీద ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తం కావటంతో విధిలేక మాట మాత్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన చేశాడు.చిత్రం ఏమంటే మన నరేంద్రమోడీ గారి నోట ఖండన రాలేదు. నిజానికి ట్రంప్‌ ఖండన కూడా ఒక నాటకమే. కాపిటల్‌ మీద మూక దాడికి సిద్దమౌతున్న సమయంలో కూడా ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఎన్నిక అపహరణను అడ్డుకోవాలని, తనకు మద్దతు ఇవ్వాలని, ఎన్నికలను అంగీకరించేది లేదని గతంలో చేసిన ఆరోపణలను పునశ్చరణ గావిస్తూ ట్రంప్‌ ఉపన్యాసం చేశాడు. నా అద్భుతమైన మద్దతుదారులారా మీరు ఆశాభంగం చెందుతారని నాకు తెలుసు. నమ్మశక్యం కాని మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని మీరు తెలుసుకోవాలి అంటూ మాట్లాడాడు. దాడులకు పాల్పడిన వారి ఆశాభంగానికి నా సానుభూతి అని ఒక వీడియో ద్వారా తొలి స్పందనలో పేర్కొన్నాడు. (మరుసటి రోజు మాట మార్చాడు.)

కాపిటల్‌ మీద దాడి జరుగుతున్న సమయంలో ఒక తాత్కాలిక గుడారంలో ట్రంప్‌ తన చుట్టూ ఉన్నవారితో నృత్యాలు చేయటం, దాడుల దృశ్యాలను టీవీల్లో ఉత్సాహంతో చూసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ట్రంప్‌తో పాటు కుమారుడు ఎరిక్‌, కుమార్తె ఇవాంక, సలహాదారు కింబర్లే గుయిల్‌ ఫోయిల్‌, అధ్యక్ష భవన సిబ్బంది ప్రధాన అధికారి మార్క్‌ మెడోస్‌ తదితర సీనియర్‌ అధికారులందరూ అక్కడే టీవీల ముందు ఉన్నారు. అయితే ఆ వీడియోలు మూకలను రెచ్చగొడుతూ పోరాడాలని, తాను కూడా వస్తానంటూ ట్రంప్‌ ప్రసంగం చేయటానికి ముందు చిత్రీకరించినవని ఒక కధనం.
పిచ్చి పట్టిన ట్రంప్‌ అధికారపు చివరి రోజుల్లో మిలటరీ లేదా అణుదాడికి పాల్పడకుండా అణ్వాయుధాల సంకేతాలు అందకుండా చూడాలని మిలిటరీ ఉన్నతాధికారి మార్క్‌ కెలీకి చెప్పినట్లు అమెరికన్‌ కాంగ్రెస్‌(మన లోక్‌సభ వంటిది) స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెల్లడించారంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు ప్రయివేటు కంపెనీల చేతుల్లో ఉన్నాయి. వాటితో అవి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. ప్యాకేజీలు ఇవ్వని వారికి వ్యతిరేకంగా ఇచ్చిన వారికి అనుకూలంగా పని చేస్తాయి. కాపిటల్‌పై దాడి తరువాత ట్రంప్‌ ఖాతాలను పూర్తిగా స్ధంభింప చేశారని, తాత్కాలికంగా నిలిపివేశారని భిన్నమైన వార్తలు వచ్చాయి. ఆ చర్యలు ప్రజాస్వామ్య బద్దమా కాదా అన్న చర్చను కొందరు లేవదీశారు. ట్రంప్‌ ఖాతాలను నిలిపివేయటం అక్రమం అని గుండెలు బాదుకుంటున్నారు. ట్రంప్‌కు పిచ్చి పట్టింది పట్టించుకోవద్దు, ఎలాంటి కీలకాంశాలు అందుబాటులో ఉంచవద్దని నాన్సీ పెలోసీ వంటి వారు మిలిటరీ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. అలాంటి పిచ్చివాడు జనాన్ని మరింతగా రెచ్చగొట్టకుండా ఖాతాలను నిలిపివేసి కట్టడి చేయకుండా ఇంకా అగ్నికి ఆజ్యం పోసేందుకు అనుమతించాలా ?అనుమతించాలనే సంఘపరివార్‌ కోరుతోంది. ఎందుకంటే వారికి ఆ స్వేచ్చ అవసరం కదా !


తన ట్వీట్లను తొలగించగానే స్పందిస్తూ ట్రంప్‌ చేసిన ట్వీట్లలో మరో ప్రత్నామ్నాయ సామాజిక వేదికలను ఏర్పాటు చేయాలని చెప్పాడు. ” నన్ను అడిగే వారందరికీ ఇదే చెబుతున్నా జనవరి 20వ తేదీ ప్రారంభోత్సవానికి నేను వెళ్లటం లేదు. ఏడున్నర కోట్ల మంది అమెరికన్‌ దేశ భక్తులు నాకు ఓటు వేశారు. అమెరికాదే అగ్రస్ధానం, మరోసారి అమెరికాను గొప్పదిగా చేయండి, భవిష్యత్‌లో మరింత పెద్ద గొంతుకను కలిగి ఉండబోతున్నాం. వారు ఏవిధంగానూ, ఏ రూపంలోనూ మనల్ని కించపరలేరు ” అని పేర్కొన్నాడు. తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ కూడా ఇదే మాదిరి హైదరాబాద్‌ ఎన్నికల సమయంలో దేశభక్తులు కావాలో దేశద్రోహులు కావాలో తేల్చుకోమని ఓటర్లకు సవాలు విసిరిన విషయం తెలిసిందే. తమకు ఓటు వేస్తే ఓటర్లు దేశభక్తులు, ఇతరులకు వేస్తే దేశద్రోహులు. ట్రంపు – సంజయ ఇద్దరూ ఎన్నడూ మాట్లాడుకొని ఉండరు,కానీ చెట్టుమీది కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్లు భావజాలం ఎలా కలుపుతుందో, కలుస్తుందో చూడండి.
ఈ రోజు ట్రంప్‌ ఖాతాలను మూసివేసిన వారు రేపు ఎవరి దాన్నయినా అదే చేసే ప్రమాదం ఉందంటూ బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఈ చర్య మేలుకొలుపు, నియంత్రణలేని బడా కంపెనీల నుంచి పొంచి ఉన్న ముప్పు అని గుండెలు బాదుకున్నారు. పొద్దున లేస్తే అసత్యాలు, అర్ధసత్యాలు, నకిలీ వార్తలను పుంఖాను పుంఖాలుగా సృష్టించే కాషాయ ఫ్యాక్టరీల పర్యవేక్షకుడు అమిత్‌ మాలవీయ, బిజెపి ఎంపీ తేజస్వీ సూర్య ఇప్పుడు ట్రంప్‌ హక్కులు హరించారంటూ నానా యాగీ చేస్తున్నారు. ఒక వేళ సామాజిక మాధ్యమాలు తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తే తక్షణమే ” అమిత్‌ మాల్‌వేర్‌ ” మీద తీసుకోవాలని ట్విటరైట్స్‌ స్పందించారు.(మాల్‌వేర్‌ అంటే కంప్యూటర్‌ వైరస్‌ ) అమెరికా అధ్యక్షుడి విషయంలోనే వారా పని చేయగలిగితే ఎవరినైనా అదే చేస్తారు. మన ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచేందుకు త్వరలో భారత్‌ వీటిని సమీక్షంచ నుంది అని బిజెపి యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య పేర్కొన్నారు.

అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాల నిలిపివేత ప్రమాదకరమైన సంప్రదాయం అని బిజెపి ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ పేర్కొన్నారు. విద్వేషాన్ని రెచ్చగొట్టటం, తప్పుడు వార్తలను ప్రచారంలో బెట్టటంలో దేశంలో ముందున్నది ఎవరో అందరికీ తెలిసిందే. కనుకనే మాలవీయ వంటి వారు రేపు తమ మీద కూడా అదే డిమాండ్‌ వస్తుందేమో అని ఆందోళన పడుతున్నారు. ట్రంప్‌ అభిప్రాయాల మీద చేయగలిగింది తక్కువే అయినా విభేదించే వాటిని సహించకపోవటం ఎక్కువ కావచ్చు అని అమిత్‌ మాలవీయ చెప్పారు. సహనం గురించి ఆ పెద్దమనిషి చెప్పటాన్ని చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా లేదూ ! ప్రజాస్వామ్యంలో అసమ్మతి ప్రాధమికమైనది, ప్రభుత్వం దాన్ని స్వాగతిస్తుంది(బిజెపి ?) అయితే దాని సహేతుకతను రాజ్యాంగబద్దమైన అధికారవ్యవస్ధలే నిర్ణయించగలవు. బడా టెక్‌ కంపెనీలు ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకున్నాయి, వాటిని నియంత్రించేందుకు సమయం ఆసన్నమైంది అని తేజస్వి సూర్య చెప్పారు. ఉపయోగించుకున్నంత కాలం ఉపయోగించుకోవటం, మాట విననపుడు తమదారికి తెచ్చుకోవటం-పాలన నియంత్రణ తక్కువ, స్వేచ్చ ఎక్కువ అని కబుర్లు చెప్పిన వారి సిజరూపం ఇది.

అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేసిన ట్రంపు ప్రేరేపిత నేరగాండ్ల మీద బిజెపి నేతలు ” తమలపాకుల ”తో కొడుతున్నారు ఎందుకు అన్న అనుమానం రావచ్చు. 2001 డిసెంబరు 13న పాక్‌ ప్రేరేపిత జైషే మహమ్మద్‌, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఢిల్లీలోని మన పార్లమెంట్‌ భవనం మీద దాడి చేశారు. ఆ దుండగుల స్ఫూర్తితో మూడు రోజుల తరువాత 16వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టించిన విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌, దుర్గావాహినీ సంస్ధలకు చెందిన వారు ఒడిషా అసెంబ్లీ భవనం మీద దాడి చేశారు. అంతకు ముందు రోజు అసెంబ్లీలో కొందరు ఎంఎల్‌ఏలు విశ్వహిందూ పరిషత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారట. అందువలన వాటిని ఉపసంహరించుకోవాలని, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిని అప్పగించాలని, తమ నేత గిరిరాజ కిషోర్‌ను విడుదల చేయాలనే నినాదాలతో త్రిశూలాలు, కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి జై శ్రీరామ్‌, వాజ్‌పేయి జిందాబాద్‌ నినాదాలతో అరగంటపాటు విధ్వంసం సృష్టించారు. అనేక మంది మీద దాడి చేశారు. దీనికి నాయకత్వం వహించిన వారిలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతాప సారంగితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు. ఈ దాడిని అంతకు ముందు మూడు రోజలు ముందు పార్లమెంట్‌ మీద జరిగిన దాడిని ఒకే విధంగా చూడకూడదని,అంతకు ముందు కొన్ని సంస్ధల వారు వివిధ సందర్భాలలో అసెంబ్లీని ముట్టడించారని బిజెపి నేతలు అప్పుడు సమర్ధించుకున్నారు. ఇప్పుడు ట్రంప్‌ సామాజిక మాధ్యమ ఖాతాల నిలిపివేత తగదని చెప్పటంలో కూడా రేపు తమకూ అదే ప్రాప్తించవచ్చనే ముందు చూపు ఉందేమో ?