Tags
Farmers agitations, India - 1991 Country economic memorandum, India-World Bank, indian farmers, Narendra Modi
ఎం కోటేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరూతూ ప్రారంభమైన ఆందోళన సోమవారం నాటికి 48 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేయాలని ఉన్నత న్యాయ స్ధానం అదే రోజు సలహాయిచ్చింది, లేనట్లయితే తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే చేసిన చట్టాల ప్రకారం రెండువేల మంది రైతులు ఒప్పందాలు చేసుకున్నారని, వాటిని నిలిపివేస్తే వారికి నష్టం జరుగుతుంది కనుక నిలిపివేయటం కుదరదని, నిలిపివేసే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదించారు. అయితే 2018లో మహారాష్ట్ర చేసిన చట్టాన్ని నిలిపివేసిన విషయాన్ని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఉటంకించింది.
సుప్రీం కోర్టు ముందు ఉన్న ఈ కేసు ఏ విధంగా పరిష్కారం అవుతుంది, కోర్టు హితవును నరేంద్రమోడీ సర్కార్ పట్టించుకుంటుందా ? ఒక వేళ ఏదో ఒక కారణాన్ని పేర్కొని ఆందోళనను విరమించాలని కోర్టు గనుక తీర్పు ఇస్తే రైతులు విరమించుకుంటారా ? పరిష్కారం ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు. తమ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల మేళ్ల గురించి చెప్పేందుకు హర్యానా బిజెపి ప్రభుత్వం కర్నాల్ జిల్లా కైమ్లా గ్రామంలో ఆదివారం నాడు ఒక సభను ఏర్పాటు చేసింది.కిసాన్ పంచాయత్ పేరుతో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పాల్గొనాల్సిన ఆ సభ జరగకుండా రైతులు అడ్డుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లే వారి మీద పోలీసులు నీటిఫిరంగులు, బాష్పవాయు ప్రయోగం జరిపి అడ్డుకోవాలని చూసినా రైతులు వెనక్కు తగ్గలేదు. సభా ప్రాంగణం, హెలిపాడ్‌ను స్వాధీనం చేసుకోవటంతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తాను సవరించిన చట్టాలను ఎలాగైనా అమలు జరిపేందుకు కేంద్రం- వాటిని ఎలాగైనా సరే అడ్డుకోవాలని రైతులు పట్టుదలగా ఉన్నారని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో జరుపుతున్న తతంగం ఈనెల 15వ తేదీన కూడా జరగనుంది. రైతులను రహదారుల మీద నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి తాజాగా మరొక పిటీషన్ వేశాడు. ఢిల్లీలో షాహిన్‌బాగ్ ఆందోళన కారులను తొలగించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రైతుల విషయంలో కూడా అమలు జరపాలని కోరాడు. సుప్రీం కోర్టు ఏమి చేయనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇక్కడ న్యాయమూర్తులు, న్యాయవ్యవస్ధకు దురుద్ధేశ్యాలను అంటకట్టటం లేదు, ఈ రచయితకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. అయితే గతంలో వివిధ ఉద్యమాల సమయంలో ఇలాంటి పిటీషన్లే దాఖలైనపుడు వివిధ కోర్టుల న్యాయమూర్తులు విచారణ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ తీర్పుల విషయానికి వస్తే ఆందోళన చేస్తున్నవారికి వ్యతిరేకంగానే వచ్చాయి. రైతుల విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందా, రైతులు అంగీకరిస్తారా, ప్రభుత్వం బలప్రయోగానికి పూనుకుంటుందా? అన్నవి ఊహాజనిత ప్రశ్నలే.
కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అని పదే పదే ప్రశ్నలు వేస్తున్నా సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్ మొండి పట్టుదలను అర్ధం చేసుకోలేము. దేశానికి కాంగ్రెస్‌నుంచి విముక్తి కలిగించామని పదే పదే చెప్పుకుంటుంది బిజెపి, కానీ దాని విధానాలను మరింత పట్టుదలతో అమలు జరుపుతోందన్నది నమ్మలేని నిజం.
ప్రపంచబ్యాంకుతో ఒప్పందాలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బ్యాంకు పధకాలను తమవిగానే నమ్మించేందుకు నానా పాట్లు పడ్డాయి, పడుతున్నాయి. ఆక్రమంలోనే అందుకే పలు కమిటీలను వేసి సిఫార్సులను ఆహ్వానించాయి. వాటిలో అనేకం ఉంటాయి, కానీ తమకు అనుకూలమైన వాటినే తీసుకుంటారు, మిగిలిన వాటి గురించి అసలు ఏమాత్రం తెలియనట్లు అమాయకంగా ఫోజు పెడతారు.
2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్ సేన్ కమిటీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అని దానిలో అడిగారు.ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల సారాంశం ఇలా ఉంది. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, విపత్తు యాజమాన్య కార్యక్రమాలు ఎఫ్‌సిఐ పనిగా ఉండకూడదు. వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి, నిల్వపద్దతులను నవీకరించాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.
దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్ అభిజిత్ సేన్ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.
గతంలో ప్రపంచ షరతులలో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి సర్కార్ ముందుకు తెచ్చిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన పెద్ద ఉద్యమం గురించి తెలిసినదే.డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్ సేన్, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది.
ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్ మెమోరాండం( రిపోర్ట్ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్ 12న బహిర్గతం చేశారు. వీటిలో ఉన్న అన్ని అంశాలను ఇక్కడ ఉటంకించటం సాధ్యం కాదు కనుక ముఖ్యమైన సిఫార్సుల గురించే చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో గతేడాది జూన్‌లో ఆర్డినెన్స్, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు.
1991లో అమలు ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాలు పారిశ్రామిక రంగంలో తీవ్ర సమస్యలకు దారి తీయటంతో మిగిలిన సిఫార్సుల అమలుకు తటపటాయించటం, ఒక్కొక్కదాన్ని అమలు జరుపుతున్నారు తప్ప వెనక్కు తగ్గటం లేదు. వాటిలో భాగమే ప్రయివేటీకరణ. ముందు నష్టాలు వచ్చే కంపెనీలని జనానికి చెప్పి సరే అనిపించారు. అవి పూర్తయిన తరువాత ప్రభుత్వాలు పాలనా వ్యవహారాలు చూడాలే తప్ప వ్యాపారాలు చేయకూడదు అనే సన్నాయి నొక్కులతో లాభాలు వచ్చేవాటిని ఇప్పుడు వదిలించుకోచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. తాజా వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు.
మన దేశీ కార్పొరేట్‌లు, విదేశీ కార్పొరేట్ కంపెనీలలో వివిధ రూపాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. వాటి అవసరాలకు అనుగుణ్యంగా ప్రభుత్వాలు మన మార్కెట్లను తెరుస్తున్నాయి. వాటి ద్వారా ఉపాధి రాదా, దేశానికి ప్రయోజనం కలగదా అనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఒకసారి అమలు జరిపి చూస్తే పోలా అంటున్నారు. కరవులు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా లబ్ది కలిగే వారు ఉన్నారు. అంతమాత్రాన వాటిని కోరుకుంటామా ? నిప్పును ముట్టుకున్నా, నీళ్లలో మునిగినా, కొండ మీద నుంచి దూకినా చస్తామని తెలిసినా ఒకసారి ఎలా ఉంటుందో చూస్తే పోలా అని ఎవరైనా అంటే ఆపని చేస్తారా ? విదేశీ పెట్టుబడులు, ద్రవ్యపెట్టుబడులు పెట్టేవారికి – వినియోగించుకొనే దేశాలకూ లబ్ది చేకూరే విధంగా ఉంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. స్ధూలంగా చెప్పాలంటే చైనాలో జరుగుతున్నది అదే. మన దేశంలో సామాన్యుల కంటే ధనికులు, కార్పొరేట్లే బాగుపడుతున్నారు. సంపదతారతమ్యాలు పెరుగుతున్నాయి. అందుకే వ్యతిరేకత.ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ?
అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి.( అనివార్యమైన స్దితిలో కేంద్ర ప్రభుత్వం 1991లో జిడిపిలో 0.85శాతంగా ఉన్న ఎరువుల సబ్సిడీని 2008-09నాటికి 1.52శాతానికి పెంచాల్సి వచ్చింది. ఆ తరువాత చూస్తే ” రైతు బంధు ” నరేంద్రమోడీ గారి ఏలుబడి ప్రారంభంలో 2014నాటికి 0.6శాతానికి తగ్గింది.2016లో 0.5, తరువాత 2019వరకు 0.4శాతానికి పడిపోయింది. తరువాత సంవత్సరం కూడా కేటాయింపుల మొత్తం పెరగని కారణంగా జిడిపిలో శాతం ఇంకా తగ్గిపోతుంది తప్ప పెరగదు.)
బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.( తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్దలు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది కనుక, ఇప్పటికే ఉన్న ప్రయివేటు బ్యాంకులకు, వాటికి ప్రాధాన్యతా రంగాలు ఉండవు)
సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.
డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.
ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.
ఎఫ్) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్ ఛార్జీలను కూడా పెంచాలి.
2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.
ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.
సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు.
డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి.
పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్ శక్తులు గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ వ్యవహరించిన తీరేమిటో తెలుసు గనుక మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము. ఇక్కడ మోడీగారు లేదా బిజెపి, కేంద్రప్రభుత్వ చర్యలను గుడ్డిగా బలపరుస్తున్న ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఒక్కటే. భారత రైతు ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే కల్మషం, కాపట్యం లేని వ్యక్తి కావచ్చుగానీ ఆమాయకుడు కాదు ! జిమ్మిక్కులు ప్రదర్శిస్తే చెల్లవు !!