Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐరోపాను ఒక భూతం వెన్నాడుతున్నది. ఆ భూతమే కమ్యూనిజం అంటూ 1848లో కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ తొలిసారిగా వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక రచన ప్రారంభం అవుతుంది. ప్రచ్చన్న యుద్దంగా వర్ణించిన సమయంలో అది తీవ్రమైంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు కమ్యూనిజంపై విజయం సాధించాం అని ప్రకటించారు. అలా చెప్పిన వారే ఇప్పుడు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాల పుస్తకాల దుమ్ము దులిపి మరోసారి జనాన్ని భయపెట్టేందుకు పూనుకున్నారు. ఎరుపును భూతంగా చూపిన తొలి రోజుల్లోనే ఎరుపంటే భయం భయం కొందరికి-పసిపిల్లలు వారికన్నా నయం నయం అన్న కవిత్వం తెలుగునాట వచ్చింది. వర్తమానంలో కవులు ఎలా స్పందిస్తారో చూద్దాం.


ఇప్పుడు అమెరికాలో ఇంకా అనేక చోట్ల ప్రతిదీ ఎరుపుమయంగా కనిపిస్తోంది, అనేక మంది కలవరింతలతో ఉలిక్కిపడుతున్నారు. వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసి పుంఖాను పుంఖాలుగా సినిమాలు, సీరియల్స్‌, రచనలను జనం మీదకు వదులుతున్నారు. సామాజిక మాధ్యమం, వాట్సాప్‌ ఫేక్‌ యూనివర్సిటీ బోధన ఎలాగూ ఉంది.
అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన డెమోక్రటిక్‌ పార్టీని సోషలిస్టులు, కమ్యూనిస్టులు నడుపుతున్నారని ముద్రవేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అమెరికాను ఆక్రమించినట్లు చెబుతున్నారు. నూతన అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కమ్యూనిస్టులంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేకిగా ఉన్న డెమోక్రటిక్‌ పార్టీకీ ఇప్పటికీ అసలు పోలికే లేదని, ఆ పార్టీలో ఇప్పుడు సోషలిస్టులు, కమ్యూనిస్టులు నిండిపోయారని, దానిలో సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన బెర్నీశాండర్స్‌ చివరికి అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి పోటీ పడ్డారని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ డెవిన్‌ న్యూన్స్‌ ఒక రాజకీయ కరపత్రంలో పేర్కొన్నాడు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక చైనా నుంచి నిధులు పొందుతూ 2011 నుంచి నెలకు ఒక అనుబంధం ప్రచురిస్తున్నదని ( అది డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చే పత్రిక) ఆరోపించాడు. నల్లజాతీయుల విషయాల ఉద్యమానికి గతేడాది జూన్‌లో పది కోట్ల డాలర్లు విరాళంగా వచ్చాయని, వారి హింసాకాండలో ఎందరో మరణించగా వంద నుంచి రెండువందల కోట్ల డాలర్ల ఆస్ధి నష్టం జరిగిందన్నాడు. ఎన్నికలలో అక్రమాల గురించి ట్రంప్‌ చేసిన ఆరోపణలన్నింటినీ పునశ్చరణ కావించాడు. రిపబ్లికన్లు లేదా మితవాదులెవరూ ప్రధాన స్రవంతి మీడియాతో మాట్లాడవద్దన్నాడు. డెమోక్రాట్లు అధ్యక్ష భవనం, పార్లమెంట్‌ ఉభయసభలను అదుపులోకి తెచ్చుకున్నారని వాపోయాడు.


ఈనెలలో జార్జియా రాష్ట్ర సెనెట్‌కు జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా ఇద్దరూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులే ఎన్నికయ్యారు. దాంతో సెనెట్‌పై ఆధిపత్యం వహించి జో బైడెన్‌కు ఆటంకాలు కల్పించాలన్న ఆశలు అడియాసలయ్యాయి. కొత్తగా ఎన్నికైన సెనెటర్లిద్దరూ కమ్యూనిస్టులే అని సౌత్‌ డకోటా రాష్ట్ర గవర్నర్‌ క్రిస్టి నియోమ్‌ (రిపబ్లికన్‌) వర్ణించారు. గత 33 సంవత్సరాలుగా రిపబ్లికన్లు తప్ప మరొకరు అక్కడి నుంచి ఎన్నిక అవలేదు. జార్జియా నుంచి ఇద్దరు కమ్యూనిస్టులు సెనెట్‌కు ఎన్నిక అవుతారని ఊహించుకోవటమే పరిహాసాస్పదంగా ఉంది అని ఆమె ఒక వ్యాసంలో వాపోయింది.
అమెరికా మీడియాలో, రిపబ్లికన్‌ పార్టీలో, ఇతర మితవాద శక్తులలో ఈ ధోరణి పెరిగిపోయింది కనుకనే పార్లమెంట్‌, దేశ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌పై దాడికి తన అనుచరులను డోనాల్డ్‌ ట్రంప్‌ పురికొల్పాడు. అలాంటి శక్తులు రేపు సైనిక తిరుగుబాటును ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు.


మలేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేక ఉలికిపాటు !
మలేసియాలోని పదమూడింటిలో ఒక రాష్ట్రం పెనాంగ్‌, దాని జనాభా పద్దెనిమిది లక్షలు.ఆ దీవిలోని పులావ్‌ టైకుస్‌ మరియు జురు అనే రెండు చోట్ల ఓ 40 ఏండ్ల వ్యక్తి చిన్న రెస్టారెంట్లను ఏర్పాటు చేశాడు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్తగా ఏం చేయాలబ్బా అని ఆలోచించాడు. మలేసియా బహుళ జాతుల నిలయం. ఆ రెస్టారెంట్‌ యజమాని చైనా జాతీయుడు. ఆహార పదార్దాలకు హాస్యం పుట్టించే విధంగా చైనా పేర్లతో పాటు మావో, ఇతర కమ్యూనిస్టు బొమ్మలను కూడా వాల్‌ పేపర్ల మీద ముద్రించి అందంగా ఏర్పాటు చేశాడు. ఇంకేముంది మలేసియాలో తిరిగి కమ్యూనిస్టులు తలెత్తారు, లేకపోతే ఆ గుర్తులతో హౌటల్‌ ఎలా ఏర్పాటు చేస్తారంటూ కొందరు కమ్యూనిస్టు వ్యతిరేకులు గగ్గోలు పెట్టారు. జనవరి మొదటి వారంలో పోలీసులు దాని మీద దాడి చేసి పోస్టర్లన్నీ చింపివేశారు. కమ్యూనిజానికి-యజమానికి సంబంధం ఏమిటి ? దీని వెనుక కమ్యూనిస్టులున్నారా అంటూ పరిపరివిధాలా బుర్రలు చెడగొట్టుకుంటున్నారు. ఇక రాజకీయ నేతలు సరేసరి. పెనాంగ్‌లో కమ్యూనిస్టు ఉద్యమం ఉందనటానికి హౌటలే నిదర్శనం అని కమ్యూనిస్టు వ్యతిరేక ”ఉమనో ” గా పిలిచే ఒక పార్టీ నేత బహిరంగ ప్రకటన చేశాడు. చైనాతో మలేసియాకు సంబంధం ఉన్న కారణంగానే ఇది జరిగిందని ఆరోపించాడు. ఇది అత్యంత బాధ్యతా రహిత ప్రకటన అంటూ ప్రత్యర్ధి పార్టీలు రంగంలోకి దిగాయి. పోలీసులు దాడి చేసిన సమయంలో ఆ అలంకరణ చేసిన హౌటల్‌ యజమాని కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉన్నాడు. కమ్యూనిజమూ లేదు ఏమీ లేదు, అందంగా ఆకర్షణీయంగా ఉంటుందని అలా చేశానని మొత్తుకున్నాడు. అతడు చైనా జాతీయుడు కనుక ఇంత రచ్చ చేశారన్నది స్పష్టం.ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఎలా చెప్పగలుగుతున్నారన్న ప్రశ్న వస్తుంది. జనవరి 13వ తేదీన పోలీసులు రెస్టారెంట్ల యజమానిని విచారించగా తాను ఒక చోట రెండు సంవత్సరాల క్రితం మరోచోట నాలుగేండ్ల నుంచి ఆ అలంకరణలతో నడుపుతున్నానని అప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం పెట్టలేదు ఇప్పుడేమిటని అడిగాడట.


మలేసియా, సింగపూర్‌, ఇండోనేసియా వంటి దేశాలలో గణనీయ సంఖ్యలో చైనా జాతీయులున్నారు.ఉడిపి హౌటల్‌, ఆంధ్రా భోజన హౌటల్‌ పేరుతో తెలుగు ప్రాంతాల్లో ఉన్నట్లుగానే మావో జన్మించిన చైనాలోని హునాన్‌ రాష్ట్రంలో మావో జియా కారు లేదా మావో కుటుంబ వంటలు అంటే ఎంతో ప్రాచుర్యం ఉంది. ఆపేరుతో అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి.దానిలో భాగంగానే పెనాంగ్‌ రెస్టారెంట్‌ అన్నది స్పష్టం.దీన్ని వివాదాస్పదం చేసిన వారు బుద్ధిహీనులు అని అనేక మంది నిరసించారు.జపనీస్‌ రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన జపాన్‌ ఆక్రమణను ప్రోత్సహించినట్లు, పశ్చిమ దేశాల రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన ఆ దేశాల అలవాట్లను ప్రోత్సహిస్తున్నట్లా అని గడ్డి పెట్టారు. మలేసియాలో చైనా యాత్రీకులు మావో చిత్రం ఉన్న కరెన్సీ యువాన్లు ఇస్తే తీసుకోవటం లేదా ? అది కమ్యూనిజాన్ని ప్రోత్సహించినట్లా? దాడి చేయబోయే ముందు పోలీసులు ఇలాంటివన్నీ ఆలోచించరా అన్నవారూ లేకపోలేదు. హౌటల్‌ అలంకరణలో కమ్యూనిస్టు సిద్దాంతాలేవీ లేవని, ఒకవేళ ఉన్నా కూడా తప్పేమిటి, కమ్యూనిస్టు చైనా నుంచి అనేకం నేర్చుకోవటం లేదా దానితో వాణిజ్యం చేయటం లేదా అని ప్రశ్నించిన విశ్లేషకులూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కమ్యూనిజాన్ని ముందుకు తెచ్చే చౌకబారు ఎత్తుగడ అన్న వ్యాక్యానాలు వెలువడ్డాయి. 1930లో ఏర్పడిన మలయా కమ్యూనిస్టు పార్టీ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ దురాక్రమణకు,తరువాత బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేసింది.1957లో స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా బ్రిటీష్‌ పాలనలో విధించిన నిషేధం కొనసాగటంతో సాయుధపోరాటాన్ని కొనసాగించింది.1989లో సాయుధ పోరాటాన్ని విరమించింది.ఈకాలంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన నేపధ్యంలో రెస్టారెంట్‌ అలంకరణ వివాదాస్పదమైంది.


ఇండోనేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత !
కొద్ది సంవత్సరాల క్రితం ఎరుపు రంగు టీ షర్టులు అమ్ముతున్నవారిని కమ్యూనిస్టులని, కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నారని ఇండోనేసియాలో అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడి పశ్చిమ జావా ప్రాంతంలో సుత్తీ కొడవలి చిహ్నాలతో నిర్మించిన ఒక బస్టాప్‌ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టుచేసి ఇంకే ముంది ఇండోనేసియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేశారు. తీరా చూస్తే ఇదే చిత్రాన్ని నాలుగు సంవత్సరాల క్రితం అనేక మంది సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నారని తేలింది. అసలు విషయం ఏమంటే 2015లో కేరళలోని కొల్లం జిల్లాలో ఒక చోట ఏర్పాటు చేసిన బస్టాప్‌ చిత్రం అది. అంటే కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు వ్యతిరేకులు ప్రతి అవకాశాన్ని ఎంతగా ఎలా వినియోగించుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కమ్యూనిస్టులు పనిగట్టుకొని ఓడించారని కాషాయ దళాలు చేసే ప్రచారం ఇలాంటిదే. అంబేద్కర్‌ బొంబాయిలోని ఒక రిజర్వుడు-జనరల్‌ ద్వంద్వ లోక్‌సభ స్దానం నుంచి పోటీ చేశారు. జనరల్‌ సీటులో నాటి కమ్యూనిస్టు నేత ఎస్‌ఏ డాంగే, రిజర్వుడు సీటులో అంబేద్కర్‌ పోటీ చేశారు.

రైతులకు కమ్యూనిస్టు ముద్రవేసిన హర్యానా బిజెపి సిఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ !
రైతాంగ ఉద్యమం వెనుక కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆరోపించారు. కిసాన్‌ మాహాపంచాయత్‌ పేరుతో కేంద్ర చట్టాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఒక సభలో ముఖ్యమంత్రి పాల్గనాల్సి ఉంది. అయితే రైతులు ఆ సభను వ్యతిరేకిస్తూ ప్రదర్శనగా వెళ్లి సభా స్ధలిని, హెలిపాడ్‌ను ఆక్రమించుకోవటంతో ఆ సభ రద్దయింది. దాంతో ముఖ్యమంత్రి ఆరోపణలకు దిగారు. నిజంగా రైతులు ఆ పని చేయరని వారి ముసుగులో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వారే చేశారన్నారు.


కాపిటల్‌ హిల్‌ దాడిలో కమ్యూనిస్టు వ్యతిరేకులు !
అమెరికా అధికార కేంద్రం వాషింగ్టన్‌ డిసిలోని కాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి చేసిన దుండగులందరూ పచ్చిమితవాద, కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులే.వారిలో కొందరు లాయర్లు,ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారిలో ఒకడి పేరు మెకాల్‌ కాల్‌హౌన్‌. మూడు దశాబ్దాలుగా లాయర్‌గా పని చేస్తున్నాడు. అతగాడి ట్విటర్‌ వివరాల్లో తాను ఒక కమ్యూనిస్టు వ్యతిరేకిని అని చచ్చేంత వరకు డెమోక్రాట్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తా అని రాసుకున్నాడు. అమెరికా మీద ప్రేమతో తామీ చర్యకు పాల్పడ్డామని, దానిని దాడి అనకూడదు, అక్రమంగా ప్రవేశించటం అనాలి, నేను ఆ పని చేశాను అని చెప్పుకున్నాడు.


ఒక వస్తువును నాశనం చేయగలరు గానీ ఒక భావజాలాన్ని పాతిపెట్టి విజయం సాధించిన వారెవరూ లేరు. అది కష్టజీవులకు సంబంధించింది అయితే ఎంతగా అణచివేయాలని చూస్తే అంతగా తిరిగి లేస్తుంది.శక్తి రూపం మార్చగలం తప్ప నశింపచేయలేము. కమ్యూనిజమూ అంతే. ప్రచ్చన్న యుద్దంలో కమ్యూనిస్టులను ఓడించామని చెప్పిన తరువాత అమెరికాలో సోషలిజం పట్ల మక్కువ పెరిగింది. కమ్యూనిస్టులు లేదా సోషలిస్టులుగా ముద్రపడిన అనేక మంది స్ధానిక, జాతీయ ఎన్నికలలో విజయం సాధించారు. వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించగలిగినదే అయినప్పటికీ మరింత పెరుగుతుందేమో అని భయపడుతున్నారు. ఒక వైపు యువత కమ్యూనిస్టు పుస్తకాల దుమ్ముదులిపి అధ్యయం చేసేందుకు ఆసక్తి చూపుతుంటే మరోవైపు దానికి ప్రతిగా దోపిడీదారులు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార పుస్తకాల దుమ్ముదులుపుతున్నారు. 1996 తరువాత అమెరికాలో పుట్టిన వారిలో పెట్టుబడిదారీ విధానం మీద ఆసక్తి తగ్గిపోతుండగా సోషలిజం మీద పెరుగుతున్నది. గతంలో కమ్యూనిజం విఫలం అయిందనే మాటే వినిపించేది. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందనే అభిప్రాయం పెరుగుతోంది. సోషలిస్టుచైనా ఆర్ధిక రంగంలో అనేక విజయాలు సాధిస్తుండగా అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎందుకు వెనుకబడుతున్నాయన్న మధనం ఆ సమాజాల్లో ప్రారంభం కావటం దోపిడీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.