Tags

, , , , , ,ఎం కోటేశ్వరరావు


దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒక పాట గుర్తుకు వస్తోంది. నేను పుట్టాను లోకం మెచ్చిందీ-నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది..నాకింకా లోకంతో పని ఏముంది… అలా సాగుతూ ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి… ఐ డోన్ట్‌ కేర్‌ ….అని బాగా ప్రాచుర్యం పొందిన ప్రేమనగర్‌ సినిమాలోని యాభై సంవత్సరాల నాటి పాట ఇది.


ఈ మధ్య కార్పొరేట్‌లు దేశభక్తులు, వారు లేకపోతే సెల్‌ఫోన్లు లేవు, ఉపాధి లేదు, అసలు మన జీవితమే లేదు, వారిని విమర్శించేవారు దేశద్రోహులు అనే ధోరణి పెరిగిపోతోంది. కార్పొరేట్లే అన్నింటినీ జనానికి అందుబాటులోకి తెచ్చాయి అన్నది వారి వాదన. అరే నీకు తెలుసా లండన్‌లో చిన్న పిల్లలు, చివరికి కూరగాయలు అమ్మేవారు, రోడ్లు ఊడ్చేవారు కూడా ఇంగ్లీషు మాట్లాడతారంట అంటే అవునా అని చిన్న తనంలో ఎబిసిడిలు నేర్చుకోవటానికి కష్టపడిన సమయంలో ఆశ్చర్యపోయిన రోజులు గుర్తుకు వచ్చాయి. అందువలన ఇప్పుడా స్దితి కాదు గనుక అన్నీ కార్పొరేట్లే చేశారు అనే దానితో ఏకీభవించినా లేకున్నా వారి మనోభావాలను గాయపరచకూడదు కదా ! కనుక కార్పొరేట్‌లను, వారికి వెన్నుదన్నుగా ఉన్న వారిని దేశభక్తులుగా పేర్కొంటున్నాను. అలాంటి దేశభక్తులు నువ్వు ద్రోహం చేస్తున్నావంటే అసలు నువ్వు పెద్ద ద్రోహివని వీధులకు ఎక్కుతున్నారు. జనానికి తెలియని విషయాలను చెబుతున్నారు. కోవాక్స్‌ పేరుతో విదేశాల్లో రూపొందించిన కరోనా వాక్సిన్‌ను మన దేశంలో తయారు చేస్తున్న సీరం సంస్ధ-స్వయంగా రూపొందించి తయారు చేస్తున్న భారత బయోటెక్‌ యజమానులు ఎలా అసలు విషయాలు చెప్పిందీ చూశాము. నీది హానిలేని నీటితో సమానమైందని ఒకరంటే, అసలు నీ వాక్సిన్‌తో వచ్చే దుష్ప్రభావాల గురించి నువ్వు దాచి పెట్టలేదా అని ఇద్దరూ గోదాలోకి దిగారు. మీ రెండు వాక్సిన్లను జనానికి అంటగట్టేందుకు మై హూనా అంటూ మీలో మీకు గొడవెందుకని తెరవెనుక ఉన్న కేంద్రంలోని పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. దాంతో ఇద్దరం గొడవ పడకుండా ఎవరిది వారు అమ్ముకుందా అని రాజీపడ్డారు. జనం కళ్ల ముందే ఇది ఇద్దరు కార్పొరేట్‌ కరోనా వాక్సిన్‌ దేశభక్తులు-వారికి వెన్నుదన్నుగా ఉన్న వారి వాస్తవ కధ !


ఇటీవల సిమెంట్‌, ఇనుము ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వస్తున్నవార్తల గురించి తెలిసిందే. ముడి ఇనుప ఖనిజపు ధరలు రెట్టింపు అయ్యాయి. పదేండ్ల నాటి రికార్డులతో పోటీ పడ్డాయి. ఎగుమతిదార్లతో పాటు ఆ పేరు చెప్పి ఉక్కు ఉత్పత్తిదారులూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ ధరలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే కార్పొరేట్‌ కంపెనీలు పోటీ పడి వినియోగదారుడి కాళ్లను నెత్తిమీద పెట్టుకుంటాయని కథలు చెప్పినవారు, దానికి ఉదాహరణగా సెల్‌ ఫోన్‌ కంపెనీలను ఉదాహరించే వారు గానీ మనకు ఎక్కడా కనిపించటం లేదు. కంపెనీలన్నీ కుమ్మక్కై ధరలు పెంచేశాయని ఏకంగా కేంద్ర మంత్రులే గగ్గోలు పెడుతున్నారు. ఇక గృహనిర్మాణ కంపెనీల దేశభక్తులు సిమెంట్‌, ఉక్కు కంపెనీలే కారణమని గగ్గోలు పెడుతుంటే మీరు మాత్రం తక్కువగా మీ నిర్మాణంలో మా సిమెంటు పాలెంత మీరు ఎంతకు అమ్ముతున్నారో ఎలా సొమ్ము చేసుకుంటున్నారో మాకు తెలియదా, లెక్కలు చెప్పమంటారా అని సిమెంట్‌ దేశభక్తులు ఎదురుదాడికి దిగారు. ఇది ఇంతటితో ఆగలా !


ఇనుప ఖనిజం తవ్వకం,ఎగుమతి-ఉక్కుతయారీ దేశభక్తులు కూడా తక్కువ తినలేదు. రాజకీయ నేతలు మనోభావాలను వాడుకుంటున్నపుడు మనం ఎందుకు తగ్గాలంటూ వారు కూడా నీ దేశభక్తి ఎంత అంటే నీది ఎంత అని దెబ్బలాడుకున్నారు. ఇద్దరూ తమ కోవెల అయినా ప్రధాని కార్యాలయంలో కొలువు తీరిన పెద్దాయనకు లేఖలు రాస్తున్నారు. తమ దేశభక్తిని శంకించటం ఉక్కుకు( ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌-ఐఎస్‌ఏ) తగని పని అని ఇనుపఖనిజం (భారతీయ ఖనిజ పరిశ్రమల ఫెడరేషన్‌-ఫిమి) మండిపండింది. ఒకవైపు చైనాతో వాణిజ్యం సాగిస్తున్న ఉక్కుగాళ్లు మేము ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేస్తున్నామంటూ మా దేశభక్తిని శంకించటం తగిని పని అని ఫిమి పేర్కొన్నది. లడఖ్‌ సరిహద్దులో తలెత్తిన వివాదం తరువాత చైనాతో లావాదేవీల విషయంలో అనేక ఆంక్షలు ఉండగా గనుల యజమానులు ఏప్రిల్‌-ఆగస్టు మధ్య 92శాతం ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేశారని ప్రధానికి ఉక్కు రాసిన లేఖలో మనోభావాన్ని గుర్తు చేసింది.

ఇనుప ఖనిజం నుంచి వేరు చేసిన ముడి ఇనుప గుళికలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్ద కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీకి మాత్రమే అనుమతి ఉంది. గత ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో 7.52 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని గనుల యజమానులు ఎగుమతి చేశారు. వాటిపై నిషేధం విధించాలంటున్న ప్రాధమిక ఉక్కు తయారీ(గుళికలు)దారులు గతేడాది అక్రమంగా 10.63 మిలియన్‌ టన్నులు ఎగుమతి చేశారని, ఇనుప ఖనిజానికి దేశంలో కొరత లేదని ఇది వెల్లడించటం లేదా అని ఫిమి వాదించింది. ఏప్రిల్‌-అక్టోబరు మధ్య ఎగుమతి చేసిన 33 మిలియన్‌ టన్నుల ఖనిజంలో 19మి.టన్నులు 58శాతం లోపు ఇనుము ఉండే ముడి ఖనిజం ఎగుమతి అయిందని, మన ఉక్కు కంపెనీలు 63శాతంపైగా ఇనుము ఉన్న ఖనిజాన్నే వినియోగిస్తాయని అందువలన తాము ఎగుమతి చేయటం వలన కొరత అనటం అర్ధం లేదని ఫిమి చెబుతోంది. అంతేనా గత ఆరునెలల్లో ఇనుప ఖనిజం ధరలు టన్నుకు రూ.1,950 నుంచి 4,110కి పెరిగితో మరోవైపు ఉక్కు రూ.16,700 నుంచి 51,590కి పెరగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.ఉక్కు పరిశ్రమ యజమానులు తమ స్వంత లేదా స్దానిక గనుల నుంచి ఉన్నతస్దాయి ఖనిజాన్ని పొందుతూ ధరలు మాత్రం అంతర్జాతీయ స్ధాయిలో వసూలు చేస్తూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారని ఫిమి పేర్కొన్నది.

ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది ? ఎవరు చెబుతున్నది, ఏది నిజం ? జనం జేబుల ఖాళీ పచ్చినిజం. మేం ఇటు జనానికి దేశభక్తి , లవ్‌ జీహాద్‌, హిందూత్వను ఎక్కిస్తుంటాం, వారు వెంటనే ఈ మత్తునుంచి తేరుకోలేరు గనుక మీరు అటు చైనాతో ఎగుమతి వ్యాపారం ద్వారా, ఇటు జనానికి ధరలు పెంచి రెండు చేతులా లాభాలు పిండుకోండి, ఎన్నికల సమయంలో మా సంగతి చూడండి అని ఖనిజ,ఉక్కు కార్పొరేట్‌ దేశభక్తులకు చెప్పారన్నది అర్ధం కావటం లేదూ !


ఇలాంటి పరిస్ధితి ఉంటే ఏమౌతుంది ? రికార్డు స్ధాయిలో పెట్రోలు, డీజిలు ధరలు పెరిగాయి, ఏమైంది ? మోడీభక్తితో సమర్పించుకోవటంలా ? ఉక్కు ధరలు పెరగటం, తరచూ మారటం ఒక సమస్య అని వీల్స్‌ ఇండియా( ఆటోమొబైల్స్‌ పరిశ్రమకు అవసరమైన ఉక్కు విడిభాగాలు తయారు చేసే కంపెనీ) ఎండీ శ్రీవత్స రామ్‌ అంటున్నారు. వాణిజ్య పధకాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది, మోడీగారి ఎగుమతి పధకమైన మేకిన్‌ ఇండియా మూలనపడుతుంది. ప్రాజెక్టులు, ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతాయి, నిరుద్యోగం పెరుగుతుంది,కొనుగోలు శక్తి తగ్గుతుంది. దరిద్రం పెరుగుతుంది. ఇంతకంటే ఏం జరగదు. కార్పొరేట్‌ లాభాలకు కరోనా కాలంలోనే ఢోకా లేదు గనుక ఇప్పుడు ఏమీ కాదు.


చైనా ప్రపంచమంతటి నుంచి చేసుకుంటున్న వస్తు దిగుమతులు 2020 సంవత్సరాన్ని కాపాడాయని, ఇదొక చారిత్రక పాఠం, హెచ్చరికగా తీసుకోవాలని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచమంతటా గిరాకీ పడిపోతే ఒక పెద్ద దేశంగా సహజ వనరులను కొనుగోలు చేసిన తీరు చరిత్ర. అయితే చైనా తాజాగా విడుదల చేసిన డిసెంబరు గణాంకాలను చూస్తే దాని కొనుగోళ్లు తగ్గిపోయే అవకాశాలు వెల్లడయ్యాయి. ఇది వస్తుమార్కెట్‌కు పొంచి ఉన్న ముప్పుగా పరిణమిస్తున్నారు. నవంబరుతో పోలిస్తే డిసెంబరులో దిగుమతులు తగ్గిపోయాయి. వీటిలో చమురు, రాగితో పాటు ఇనుప ఖనిజం కూడా ఉంది. చైనా వారు ఆకలితో మాడుతున్నారు గనుక మన దేశం నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేవారు మనకు కోకొల్లలుగా కనిపిస్తారు. ఆకలితో మాడేవారు ఇనుపఖనిజం ఏం చేసుకుంటారు అంటే ఏం చెబుతారో తెలియదు.

ఇక మన ఇనుప ఖనిజ ఎగుమతి దేశ భక్తులు ఖజానాకు చెల్లించాల్సిన 7,08,000 కోట్ల రూపాయల డ్యూటీ ఎగవేసి చైనాకు ఎగుమతులు చేశారని, 61 సంస్ధల నుంచి ఆ మొత్తాలను వసూలు చేయాలని సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజం దాఖలైంది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి, ఎగుమతి సంస్ధలకు నోటీసులు జారీ చేసి చేసింది. డ్యూటీని ఎగవేసేందుకు తప్పుడు టారిఫ్‌ కోడ్‌ను చూపి 2015 నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన సంస్దలలో ఎస్సార్‌ స్టీల్‌, జిందాల్‌ స్టీలు మరియు పవర్‌ కంపెనీ ఉన్నాయని, 30శాతం డ్యూటీ వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించి ఈ అక్రమాలకు పాల్పడిన వారి మీద నిర్ణీత వ్యవధిలోపల విచారణ పూర్తి చేయాలని వారి నుంచి ఎగవేసిన డ్యూటీ, జరిమానా వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. ఇప్పుడున్న విధాన ప్రకారం ముడిఖనిజంలో 58శాతం లోపు ఇనుము ఉంటే ఎలాంటి పన్నులు లేకుండా చైనా, జపాన్‌, కొరియా వంటి దేశాలకు ఎగుమతులు చేయవచ్చు. అంతకు మించితే 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.


దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ఇనుప ఖనిజ ఎగుమతులపై స్వల్పకాలం పాటు నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నవంబరు చివరివారంలో చెప్పారు. సిమెంట్‌, ఉక్కు ఉత్పత్తిదారులు కూటములుగా ఏర్పడి ధరలు పెంచారని మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దీని వలన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రోడ్ల వంటి మౌలికసదుపాయాల ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిందేమంటే నాణ్యత తక్కువ ఉన్న ఖనిజం నుంచి కూడా గరిష్టంగా ఇనుము ఉత్పత్తి చేయగల నైపుణ్యం చైనాతో సహా విదేశాల్లో ఉందన్నది ఒక అంశం. టెక్నాలజీలో ఎంతో ముందున్నాం అని చెప్పుకొనే మనం ఎందుకు వినియోగించటం లేదు ? అభివృద్ది గురించి చైనా చెప్పే లెక్కలను నమ్మలేం అని చెప్పే నిత్య శంకితులు ప్రతి తరంలోనూ శాశ్వతంగా ఉంటారు. అదే నిజమైతే మన దేశం నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేసి వారేమి చేసుకుంటారు అంటే నోరు విప్పరు. 2020లో కూడా గణనీయంగా దిగుమతులు చేసుకున్నదంటే అక్కడ కరోనాను కట్టడి చేసి సాధారణ కార్యకలాపాలను పునరుద్దరించటం, డిమాండ్‌ పెరగటమే కారణం. ప్రపంచ ఉక్కు సమాఖ్య సమాచారం ప్రకారం గతేడాది జనవరి-నవంబరు మధ్య 64దేశాల్లో ఉక్కు ఉత్పత్తి 1.3శాతం తగ్గితే చైనాలో 5.5శాతం పెరిగింది. చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలు కూడా దీనికి దోహదం చేశాయి. అనేక దేశాలు కూడా ఉద్దీపన ప్రకటించినా అక్కడ డిమాండ్‌ పెరగలేదు.


నీతి, దేశభక్తి, దేశద్రోహం వంటివి ఇప్పుడు మన దేశంలో బాగా అమ్ముడు పోతున్న సరకులు. అంటే లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అవి ఎంతకాలం అనేది వేరే విషయం. చైనాను వ్యతిరేకించటం దేశభక్తుడి విధి. చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవటం నేటి మహత్తర కర్తవ్యం అంటూ సామాజిక మాధ్యమంలో, సంప్రదాయ మాధ్యమాల్లో మనం వింటున్నామా-చూస్తున్నామా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా కుమ్మరిస్తున్నారు. గతేడాది జూన్‌లో లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత-చైనా సైన్యం మధ్య జరిగిన సంఘటనలో మన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ఇది మరీ ఎక్కువైంది. మధ్యలో మన నరేంద్రమోడీ కౌగిలింతల భాగస్వామి అమెరికా ట్రంపు కంపు కారణంగా కాస్త తగ్గింది గానీ లేకపోతేనా…..రేటింగ్స్‌ కోసం టీవీ ఛానల్స్‌ ఇంకా రెచ్చిపోతుండేవి.

చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి చైనీయులను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చెప్పటాన్ని దేశభక్తిగా చిత్రిస్తున్నారు. చైనాతో ఇనుప ఖనిజం ఎగుమతులకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు.అడ్డా మీదకు వచ్చి మాకు ఇనుప ఖనిజం ఎంతకు సరఫరా చేస్తారు అని ఎప్పటికప్పుడు బేరమాడి చైనీయులు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్‌లో మన అవసరాలకు ఖనిజాన్ని నిల్వ చేసుకోవటం అవసరమా లేక చైనా నుంచి వచ్చే నాలుగు డాలర్లు ముఖ్యమా ? చైనా మాదిరి ఉక్కు తయారీ మనకు చేతకాదా ? మనం ఎగుమతులు చేయలేమా ? వారికి అవసరమైన ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసి మరింతగా బలపడేట్లు చేస్తున్నట్లా కాదా ? చైనాకు ఎగుమతులు చేయటం ఎందుకు ? దాంతో మన దేశంలో ఉక్కు ధరలు పెరగటం ఎందుకు ? జనం గగ్గోలు పెడుతుంటే అచేతనంగా చూస్తూ కూర్చోవటం శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్న బిజెపికి మేలు చేస్తుందా ?తనదైన ప్రత్యేక ఆర్ధిక శాస్త్రం(మోడినోమిక్స్‌)తో దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ గారికి ఈ చిన్న లాజిక్కు తెలియదా లేక కార్పొరేట్ల చేతిలో బందీ అయ్యారా ? అనేక మంది అంటున్నట్లు ఆయనకు గడ్డం, జులపాల మీద శ్రద్ద పెరిగిపోయి దేశం మీద తగ్గిందా ? దేశ భక్తి నీతులు కేవలం సామాన్యులకేనా ? కార్పొరేట్లకు ఉండవా ? అసలేం జరుగుతోంది ? అర్ధం కావటం లేదా, కానట్లు నటిస్తున్నారా ? సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! ఎంతకాలమో !!