Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీజాతి నిండు గౌరవము
అని ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు రాసిన జన్మభూమి గీతాన్ని ఎవరు మరచి పోరు.మేరా భారత్‌ మహాన్‌, నిజమే ! నా దేశం గొప్పది. అందులో ఎలాంటి సందేహం లేదు. నా దేశమే గొప్పది, తరువాతే మిగతావి అంటేనేే తేడా వస్తుంది. వసుధైక కుటుంబం అన్న మహత్తర భావన మన దేశంలో తరతరాలుగా జనంలో నాటుకుపోయింది. అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే వారితో ఎలాంటి పేచీ లేదు. ఒకవైపు ఆ మాట చెబుతూనే మరోవైపు దానికి విరుద్దమైన ఆచరణతోనే అసలు సమస్య.


తాజాగా సామాజిక మాధ్యమంలో కొన్ని పోస్టులు తిరుగుతున్నాయి. ఒకదానిలో ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే ముందుస్తుగా కోవాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం, నరేంద్రమోడీగారికే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలో సాధించిన విజయాలను ఎవరైనా పొగిడితే పోయేదేమీ లేదు. అబద్దాల ప్రచారాన్ని చూసి ప్రపంచమంతా నవ్వితే ఎవరికి నష్టం. అన్నీ ఉన్న ఆకు అణగిమణగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. కరోనా పోరులో ఉన్న మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఇతరులకు ఉచితంగా వేస్తామని, అందుకయ్యే ఖర్చును రాష్ట్రాలు భరించలేకపోతే కేంద్రమే భరిస్తుందని ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. సాధారణ పౌరులకూ అలాగే వేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో వెనకో ముందో అనేక దేశాల్లో కరోనా పోరులో 200 వరకు వాక్సిన్ల తయారీకి కసరత్తు జరుగుతోంది. వాటిలో మన దేశంలో హైదరాబాదు కేంద్రంగా భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ పేరుతో ఒక దాన్ని తయారు చేస్తున్నది.


ఇక ఇతర దేశాల విషయానికి వస్తే ఉచిత వ్యాక్సిన్‌ వేయాలని జపాన్‌ పార్లమెంటులో చట్టపరమైన నిర్ణయం చేశారు.ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌ , నార్వే వంటి అనేక దేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి. అన్నింటి కంటే చైనాలో ఉచితంగా, ప్రయోగాత్మకంగా వాక్సిన్‌ ఇవ్వటం గతేడాదే ప్రారంభించారు. ప్రచార కండూతి లేదని ఒక వైపు చెప్పుకుంటూనే బిజెపి తన ప్రచార సేన ద్వారా సామాజిక మాధ్యమంలో ఇలాంటి పోస్టులు పెట్టించుకోవటం ఎవరెరుగనిది. గుడ్డిగా నమ్మేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు.

మరో పోస్టు కూడా తిరుగుతోంది. ప్రపంచానికి అమెరికా ఆయుధాలు ఇచ్చింది చంపుకోమని, పాకిస్తాన్‌ ఉగ్రవాదులను ఇచ్చింది చంపమని,చైనా కరోనాను ఇచ్చింది అందరూ చావాలని, నా భారత దేశం మాత్రమే మెడిసిన్‌ ఇస్తుంది అందరూ బతకాలని, అని దానిలో రాశారు. ఇది కాషాయ దళాల ఫ్యాక్టరీ ఉత్పత్తి అని వేరే చెప్పనవసరం లేదు. 2010-14 సంవత్సరాలతో పోల్చితే 2015-19 మధ్య (ట్రంప్‌ ఏలుబడి) అమెరికా అమ్మిన ఆయుధాలు 23శాతం పెరిగాయి. అనేక దేశాల మీద యుద్దాలు చేస్తూ, చేయిస్తూ ఆయుధ పరిశ్రమలకు లాభాల పంట పండిస్తున్న అమెరికా మనల్ని కూడా వదల్లేదు. చైనా మీదకు మనల్ని ఉసిగొల్పటం, చైనాను బూచిగా చూపి దాని ఆయుధాలను మనకూ అంటగడుతోంది. తన దగ్గర కాకుండా రష్యా దగ్గర కొనుగోలు చేస్తామంటే ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తోంది.అలాంటి ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన పెద్దమనిషి నరేంద్రమోడీ, అలాంటి అమెరికా మనకు భాగస్వామి అని, ఎలా కౌగిలింతలతో గడిపారో తెలిసిందే. మన అదృష్టం కొద్దీ ట్రంప్‌ ఓడిపోయాడు గానీ లేకుంటే పరిస్ధితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే !


ప్రపంచానికి భారత్‌ మాత్రమే మెడిసిన్స్‌ ఇస్తుందా ? 2019లో బ్లూమ్‌బెర్గ్‌ అనే అమెరికా కార్పొరేట్‌ సంస్ధ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన దేశాల సూచిక అంటూ 169 దేశాల జాబితా ఇచ్చింది. దానిలో మన స్ధానం 2017తో పోల్చితే 119 నుంచి 120కి పడిపోయింది. ఈసూచికకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మన దేశం ఎన్ని ఔషధాలు తయారు చేస్తున్నది అని కాదు, మోడీ పాలనలో జనాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచారో అని గర్వపడాలి. ఎందుకంటే కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది బిజెపినే కనుక ఆ ఖ్యాతి కూడా మోడీగారి ఖాతాకే జమకావాలి !


ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో చైనా మూడు స్ధానాలను పెంచుకొని 52వ స్ధానంలో ఉంది. మన పక్కనే ఉన్న శ్రీలంక 66, బంగ్లాదేశ్‌ 110 స్ధానాల్లో ఉండగా మన 120వ స్ధానానికి దగ్గరగా పాకిస్ధాన్‌ 124లో ఉంది. ఆరుదశాబ్దాలకు పైగా అష్టదిగ్బంధనలో ఉన్న క్యూబా 31 నుంచి 30వ స్ధానానికి ఎదగ్గా, దాన్ని నాశనం చేయాలని చూస్తున్న అమెరికా 34నుంచి 35కు పడిపోయింది. జనం ఆరోగ్యానికి తోడ్పడని ఔషధాలు ఎన్ని తయారు చేస్తే ప్రయోజనం ఏముంది ?అదేదో సినిమాలో అన్నట్లు దీనమ్మ జీవితం ఏది మాట్లాడినా నరేంద్రమోడీకే తగులుతోంది.


ఇక నరేంద్రమోడీ గారి ఖాతాలో జమ కావాల్సిన మరో ఘనత కూడా ఉంది. 1995 నుంచి నేటి వరకు గుజరాత్‌ బిజెపి ఏలుబడిలో ఉంది.దానిలో సగం కాలం నరేంద్రమోడీ గారు పన్నెండు సంవత్సరాల 227 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ప్రధాని అయ్యారు. 1990-2016 సంవత్సరాల మధ్య వ్యాధుల భారం గురించి ఒక విశ్లేషణ జరిగింది.దాని ప్రకారం 1990లో గుజరాత్‌లో వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలకు కారణాలలో ప్రధమ స్ధానంలో 36.1శాతం పోషకాహార లేమిగా తేలింది.2016 నాటికి 14.6శాశాతానికి తగ్గినా ప్రధమ స్ధానం దానిదే. ఇదే సమయంలో కేరళ వ్యాధుల భారం అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా ప్రధమ స్ధానంలో ఉంది. అక్కడ పైన పేర్కొన్న విశ్లేషణ కాలంలో మరణాల కారణాలలో ప్రధమ స్ధానంలో ఉన్న పోషకాహార లేమి 17.4 నుంచి 4.4శాతానికి, ప్రధమ స్దానం నుంచి తొమ్మిదికి తగ్గింది. మందులు ఎన్ని ఉత్పత్తి చేస్తున్నామన్నది కాదు, వాటి అవసరం లేకుండా ఏ చర్యలు తీసుకున్నారన్నది ముఖ్యం.


మన దేశం ఔషధాల ఉత్పత్తిలో ముఖ్యంగా వాక్సిన్లు, జనరిక్‌ ఔషధాల ఉత్పత్తిలో అగ్రస్ధానంలో ఉన్నమాట వాస్తవం. అదేదో ఆరున్నరేండ్ల నరేంద్రమోడీ పాలనలోనే సాధించినట్లు చిత్రిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఔషధాల ప్రయోగాలకు దొరికే వలంటీర్ల ఖర్చు మన దగ్గర చాలా తక్కువ, సకల రోగాలకు నిలయంగా ఉంది గనుక ప్రయోగాలూ ఇక్కడ ఎక్కువే. నిపుణులు ఉండటం, ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండటం వంటి అంశాలు మన దేశంలో ఔషధ పరిశ్రమ అభివృద్దికి తోడ్పడ్డాయి.అయితే ప్రపంచంలో మన స్ధానం ఎక్కడ అని చూస్తే మొదటి 15దేశాలలో 2018 సమాచారం ప్రకారం 16.8శాతంతో జర్మనీ ప్రధమ స్ధానంలో ఉండగా 12.2, 7.5 శాతాలతో స్విడ్జర్లాండ్‌, బెల్జియం తరువాత ఉన్నాయి. మన దేశం 3.8శాతంతో 12పన్నెండవ స్ధానంలో ఉంది. మొదటి స్ధానంలో ఉన్న జర్మనీ ఎగుమతుల విలువ 62.3 బిలియన్‌ డాలర్లు కాగా మన విలువ 14.5బి.డాలర్లు. మన ఈ స్ధానానికి చైనా కూడా ఒక కారణం. మన ఔషధ ఉత్పత్తులకు అవసరమైన ముడి సరకుల్లో చైనా నుంచి 60నుంచి 70శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాము. మిగతా దేశాలతో పోలిస్తే అవి చౌక గనుకనే ఆ దిగుమతులు అన్నది గమనించాలి. అందువలన గొప్పలు చెప్పేవారు ఇంటా బయటా నిజంగా నరేంద్రమోడీ పరువు పెంచాలనుకుంటున్నారా తుంచాలనుకుంటున్నారో ఆలోచించుకుంటే మంచిది. ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకుంటే నరేంద్రమోడీ గారికి గౌరవం, మర్యాద మిగులుతాయి.ప్రతిపక్షాలు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాయి. భక్తులే వాటిని సమర్పించుకుంటుంటే ?

మన గతం ఘనమైనదా కాదా ? దాన్ని అంగీకరిస్తారా లేదా ? గతం, వర్తమానం దేనిలో అయినా ఘనమైనవే కాదు, హీనమైనవి కూడా ఉంటాయి. కులాల కుంపట్లు, ప్రపంచంలో ఎక్కడా లేని అంటరాని తనం వంటివి ఎన్నో ! రెండోవాటిని ఎప్పటికప్పుడు వదిలించుకోకపోతే ఘనత పాతాళానికి పోతుంది.మత సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వంలో ఏకత్వంలో భిన్న భావజాలాలను సహించటంలో మన గతం ఘనమైనదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా ? ప్రపంచంలో ఫాసిస్టు శక్తుల చరిత్రను చూసినపుడు ఊహాజనిత లేదా కల్పితమైన వాటిని రాబట్టేందుకు ప్రయత్నించటం, విభజన తీసుకురావటం, ఆధారాలు లేని వాటిని కీర్తించటం, లేనిగొప్పలు వర్తింప చేయటం, వైఫల్యాలకు కొందరిని బూచిగా చూపటం, వ్యక్తుల మీద కేంద్రీకరించటం ఒక లక్షణం.


కరోనా వాక్సిన్‌ మన దేశంలో తయారు చేసినా మరో దేశంలో రూపొందించినా అది శాస్త్రీయ ప్రాతిపదికన తయారు చేస్తున్నది తప్ప మాయలు మంత్రాలతో కాదు. వేదాల్లో అన్నీ ఉన్నాయష అని గతంలో చెబితే ఇప్పుడు ఆవు మూత్రం-పేడలో లేనిదేమీ లేదు అని చెప్పటాన్ని చూస్తున్నాము. మానవ జాతి చరిత్రలో కనీవినీ ఎరుగని కరోనా మహమ్మారి ముంచుకువచ్చినా దాన్నుంచి రక్షించేందుకు వాటినేవీ బయటకు తీయలేదంటే ఉన్నాయని చెబుతున్నవారినేమనాలి ? నిజంగా అవి ఉండీ ఉపయోగం ఏముందీ !


ఊహలను వాస్తవాలుగా సాక్షాత్తూ నరేంద్రమోడీయే చెప్పటాన్ని చూశాము.వినాయకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి ఏనుగుతల అంటించటం,కృత్రిమ గర్భం ద్వారా కర్ణుడిని కనటం వేల సంవత్సరాల క్రితమే ఉందని నరేంద్రమోడీయే సెలవిచ్చారు. గురుత్వాకర్షణ, అణు సిద్దాంతం అన్నీ పాతవే, మనవే అని చెప్పిన తీరు చూశాము. ఇన్ని చెప్పిన వారు ఆవు మూత్రంలో ఏమున్నాయో తెలుసుకొనేందుకు పరిశోధనలు జరపమని పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటాన్ని ఏమనాలి. వేదాల్లో, సంస్కృత గ్రంధాల్లో అన్నింటి గురించీ చెప్పారు గానీ ఆవు మూత్రంలో ఏమున్నాయో చెప్పలేదా ! పోనీ ఆవు మూత్రం నుంచి కరోనా వాక్సిన్నూ రూపొందించలేదూ ?

ప్రపంచమంతా కరోనా కల్లోలం గురించి ఆందోళన పడుతుంటే బిజెపి, ఇతర కాషాయ పెద్దలు చెప్పిందేమిటి ? గతంలో ఆవు మూత్రం తాగితే క్యాన్సరే మాయం అవుతుందన్నారు, తాజాగా దాన్ని కరోనా వైరస్‌కు ఆపాదించారు. దీపాలు వెలిగిస్తే వైరస్‌ భస్మం అవుతుందన్నారు. జనం అవన్నీ మరచిపోయారని కాబోలు ఇప్పుడు తమ నరేంద్రమోడీయే దగ్గరుండి వాక్సిన్‌ తయారు చేయిస్తే ఓర్చుకోలేకపోతున్నారని ఎదురుదాడికి దిగారు. ” ఆర్ధికంగా, వైద్యపరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాస్కులు, శానిటైజర్లు వాడని హిందూ వ్యతిరేక మతాల మధ్య భారత్‌ కరోనా భరతం పట్టిందని, రెండు టీకాలు కనిపెట్టిందని ” తిప్పుతున్న పోస్టులో మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అనుమతించిన రెండింటిలో భారత్‌ బయోటెక్‌ వాక్సిన్‌ మాత్రమే మనది. మన దేశంలో సీరం సంస్ధ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ-ఆస్ట్రజెనికా తయారు చేసిందనే కనీస పరిజ్ఞానం కూడా కొరవడిన పోస్టు అది.


ముస్లిం మత పెద్దలు కూడా తక్కువ తినలేదు. ఐదుసార్లు కడుక్కుంటే కరోనా అంటుకోదన్నారు. మసీదులను మూసివేస్తే దేవుడికి ఆగ్రహం వస్తుందన్నారు.మహిళల చెడునడత కారణంగా దేవుడికి కోపం వచ్చి కరోనా రూపంలో శిక్షిస్తున్నాడన్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు చైనా వారే వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలారని చెప్పారు.మనుషుల బుర్రలను నియంత్రించేందుకు యూదులు కరోనా వాక్సిన్‌ ఉన్న చిప్స్‌ ద్వారా ప్రయత్నిస్తున్నారన్నారని ముస్లిం మతోన్మాదులు చెబుతున్నారు.


ఇంటా బయటా మతశాస్త్రాల బోధన – విద్యాలయాల్లో విజ్ఞానశాస్త్ర బోధన జరుగుతున్నా మూఢత్వం వదలని కారణంగా మొదటిదాని మీద ఉన్న విశ్వాసం రెండవదాని మీద లేదు. ఒక వేళ ఉంటే మోడీ వంటి పెద్దలు ఆశాస్త్రీయ, ఊహాజనిత అంశాలను ప్రచారం చేయగలరా ? ఆవు చేలో ఉంటే దూడలు గట్టున ఉంటాయా ? బిజెపి ఎంపీ, మాలెగావ్‌ పేలుళ్ల కేసు ముద్దాయి ప్రజ్ఞాసింగ్‌ ఒక టీవీలో మాట్లాడుతూ ఆవు మూత్రం కలిపినదానిని తాగితే తన రొమ్ముక్యాన్సర్‌ నయమైనట్లు చెప్పారు. పాలకులకు తాన తందాన పలికే ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ జి నాగేశ్వరరావు కొన్నివేల సంవత్సరాల క్రితమే కణ పరిశోధనలు జరిపారని, వంద మంది కౌరవులు ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే పుట్టారని సైన్స్‌ కాంగ్రెస్‌ సభలోనే సెలవిచ్చారు. అంతటితోనే ఆగలేదు నియంత్రిత క్షిపణులంటే వేరే ఏమీ కాదు విష్ణు చక్రం అన్నారు, రావణుడు24 రకాల విమానాలను వివిధ విమానాశ్రయాలకు నడిపినట్లు చెప్పారు. రాముడు-రావణుడు ఒకే కాలం నాటి వారు రావణుడికి విమానాలు ఉంటే రాముడికి లారీలు, జీపులు కూడా ఎందుకు లేవు ? రావణుడిని చంపే రహస్యాన్ని తెలుసుకున్న రాముడి పరివారం విమానాల టెక్నాలజీ గురించి తెలుసుకోలేకపోయిందా ? బ్రహ్మ డైనోసార్లను కనుగొన్నట్లు చెబుతారు. త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవదేవ్‌ అయితే మహాభారత కాలం నాడు ఇంటర్నెట్‌ ఉండబట్టే యుద్ధంలో ఏం జరిగిందో ఎప్పటి కప్పుడు సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు తెలుసుకోగలిగినట్లు చెప్పారు.నెమళ్లు ఎన్నడూ జతకూడవని, మగనెమలి కన్నీటితో ఆడనెమలి పునరుత్పత్తిలో భాగంగా గుడ్లు పెడుతుందని ఒక న్యాయమూర్తి సెలవిచ్చిన విషయం తెలిసిందే. పురాతన భారత్‌ను పొగిడే పేరుతో మత రాజ్యాలవరకు జనాన్ని తీసుకుపోవటమే లక్ష్యం. కాలుష్య నివారణకు యజ్ఞాల గురించి చెప్పేవారిని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, లక్ష సంవత్సరాల నాడే హిందూ రుషులు అణుపరీక్షలను జరిపారని చెప్పే శాస్త్రవేత్తలను, అప్పడాలు తింటే కరోనా పోతుందని చెప్పిన వారినీ చూశాము. కరోనా దెబ్బతో అలాంటి సొల్లు కబుర్లు చెప్పేవారి నోళ్లు కొంత మేరకు మూతపడ్డాయి. అలాంటి వారికి కరోనా సోకినపుడు ఆసుపత్రుల్లో చేరి ఉపశమనం పొందారు తప్ప ఆవు మూత్రం, అప్పడాల మీద ఆధారపడలేదు.


ప్రతిదానికి ప్రధాని నరేంద్రమోడీని ఎందుకు విమర్శిస్తున్నారు అనే ప్రశ్న ముందుకు వస్తున్నది. దీనిలో రెండు రకాలు అసలు మోడీ ఏం చేసినా విమర్శించకూడదు అనే ఒక ప్రమాదకరమైన ధోరణితో కావాలని అడిగేవారు ఒక తరగతి. ఏదో చేస్తున్నారు కదా కాస్త సమయం ఇవ్వాలి కదా అప్పుడే విమర్శలెందుకు అని అడిగేవారు మరికొందరు.రెండో తరగతి కల్మషం లేని వారు. విమర్శకు పెద్ద పీట వేసేది ప్రజాస్వామ్యం. నియంతృత్వ లక్షణాల్లో భజనకు అగ్రపీఠం ఉంటుంది. అన్నీ నెహ్రూ, కాంగ్రెసే చేసింది అని కాషాయ దళాలు ఎలా విమర్శిస్తున్నాయో, వారు చేసిన తప్పిదాలను సరిచేసే పేరుతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ, బిజెపి అంతకంటే దారుణంగా వ్యవహరించింది అనే రోజులు రావని ఎవరు చెప్పగలరు? ఆ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించటమే దేశద్రోహం అయితే మొదటి ద్రోహి బిజెపినే అని చెప్పాలి. ఎవరైనా అవ్వతో వసంతమాడతారా ? ప్రయోజనం ఏముంది, అందుకే అధికారంలో ఉన్న నరేంద్రమోడీ నాయకత్వాన్ని గాక ఇతరులను విమర్శిస్తే అర్ధం ఏముంది ? ఏమైనా సరే మా మోడీని విమర్శిస్తే సహించం అంటే కుదరదు. గతంలో ఇందిరే ఇండియా – ఇండియా ఇందిర అన్న కాంగ్రెస్‌ భజన బృందం కంటే ఇప్పుడు మోడీ దళం ఎక్కువ చేస్తోంది. అది మోడీకే నష్టం కాదంటారా ? కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినన్ని దశాబ్దాలు బిజెపికి జనం ఇవ్వరు !