Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


2021 జనవరి 20కి అమెరికాయే కాదు ప్రపంచ చరిత్రలో ఒక ప్రాముఖ్యత ఉంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. నూటయాభై సంవత్సరాలలో తొలిసారిగా నూతనంగా ఎన్నికైన వారికి పదవీ బాధ్యతలు అప్పగించే కనీస మర్యాదను పాటించకుండా అధ్యక్ష భవనం నుంచి నిష్క్రమించిన వ్యక్తిగా డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రకెక్కాడు. ట్రంప్‌ చేసిన పనులకు ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలను చూడాల్సి వస్తుందో ట్రంప్‌ చివరి రోజుల్లో సూచన ప్రాయంగా వెల్లడించాడని చెప్పవచ్చు.


మరో రూపంలో తాను తిరిగి వస్తానని ట్రంప్‌ తన మద్దతుదార్లకు సందేశమిచ్చాడు. రిపబ్లికన్‌ పార్టీని వీడి పేట్రియాటిక్‌ పార్టీ(దేశ భక్త పార్టీ) పేరుతో కొత్త దుకాణం తెరుస్తారనే వార్తలు వచ్చాయి. నిజంగానే పెడతారా లేక తన మద్దతుదార్లను సంతృప్తి పరచేందుకు అలా చెప్పారా, ఒక వేళ ముందుకు పోతే ఏ సమస్యలు-సవాళ్లు ఎదురవుతాయి అన్నది చూడాల్సి ఉంది. ఒక పార్టీ పెట్టటానికి అవసరమైన నిధులతో పాటు ట్రంప్‌ను గుడ్డిగా అనుసరించే వారు కూడా గణనీయంగా ఉన్నట్లు ఇటీవలి ఎన్నికలు, అనంతర పరిణామాలు రుజువు చేశాయి. అయితే ట్రంప్‌కు ప్రధాన సవాలు రిపబ్లికన్‌ పార్టీ నుంచే ఎదురు కానుంది.


అమెరికాలో శతాబ్దాల తరబడి అధికారం రెండు పార్టీల మధ్యనే అధికారం చేతులు మారుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా కార్పొరేట్‌ ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా ఉండటం లేదు. అందువలన ఒకసారి మూడో పార్టీ రంగంలోకి వస్తే అది మరికొన్ని పార్టీలు ఉనికిలోకి వచ్చేందుకు దారితీయవచ్చు. డెమోక్రటిక్‌ పార్టీలో కార్పొరేట్లను వ్యతిరేకించే పురోగామి శక్తులు బలపడుతున్నాయి. ఈ పరిణామాన్ని అడ్డుకొనేందుకు కార్పొరేట్‌, మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది ఇప్పటికీ అంతర్గత మధన స్ధాయిలో ఉంది తప్ప పరిణామాత్మక మార్పుకు దారి తీసే స్దితిలో లేదు. రిపబ్లికన్‌ పార్టీలో అలాంటి పరిణామం సంభవిస్తే డెమోక్రటిక్‌ పార్టీ ఉన్నది ఉన్నట్లుగా ఉంటుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.
ఇప్పటి వరకు అధికారంలో ఎవరు ఉన్నా తమ ప్రయోజనాలకు తోడ్పడుతున్నందున యధాతధ స్ధితిని కొనసాగించాలనే కార్పొరేట్‌లు కోరుకుంటాయి. ట్రంప్‌ పార్టీ తమకు దెబ్బ అని గనుక భావిస్తే ఇప్పటి వరకు బలపరచిన కార్పొరేట్లే అడ్డుకున్నా ఆశ్చర్యం లేదు. ట్రంప్‌ పెద్ద వ్యాపారి కనుక ఈ లాభనష్టాలన్నింటినీ బేరీజు వేసుకొనే ముందుకు సాగుతాడన్నది స్పష్టం. ప్రధాన పశ్చిమ దేశాల్లో రెండు పార్టీల వ్యవస్ధ స్ధిరపడింది. దీని అర్ధం అక్కడ ఇతర పార్టీలు లేవని కాదు. ఎన్నికల్లో అదో ఇదో మాత్రమే వచ్చే రెండు పెద్ద పార్టీలే ఉనికిలో ఉన్నాయి.కార్పొరేట్‌ సంస్ధలు లేదా మీడియా కూడా వాటినే తప్ప మిగిలిన వాటిని పట్టించుకోదు. జనం కూడా అంతే తయారయ్యారు.


ఇటీవలి కాలంలో ప్రపంచం మొత్తం మీద మితవాద శక్తులు బలం పుంజుకోవటం గమనించాల్సిన పరిణామం. లాటిన్‌ అమెరికా అయినా, ఐరోపాలోని పూర్వపు సోషలిస్టు దేశాలైనా అదే జరుగుతోంది. రెండు పార్టీల వ్యవస్ధ స్ధిరపడిందని అనుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి చోట్ల ఇటీవలి కాలంలో మూడో పక్షాలు ఉనికిలోకి రావటమే కాదు, బలపడుతున్నాయి. అయితే అవన్నీ పచ్చిమితవాద లేదా ఫాసిస్టు తరహా పార్టీలు. అందువలన అమెరికాలో కూడా అలాంటి శక్తులు డోనాల్డ్‌ ట్రంప్‌ వారి నాయకత్వాన సంఘటితం కావటం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. తాను విజయం సాధించకపోతే ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లే అని, ఓటమిని అంగీకరించను అని ముందే చెప్పిన, ఎన్నికల ఫలితాన్ని ఖరారు చేయకుండా అడ్డుకోవాలని దాడికి పురికొల్పిన ట్రంప్‌ను చూశాము. అధికార కుమ్ములాటలు మరింత ముదిరితే రేపు ట్రంప్‌గాకపోతే మరొక ఫాసిస్టు తిరుగుబాట్లనే రెచ్చగొట్టరన్న హామీ ఏముంది ?

నియంతలు, నరహంతకులు శాశ్వతం కాదు గానీ వారి ధోరణులు శాశ్వతమే కదా ! ఫాసిజం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన జర్మన్లే జర్మనీకి ప్రత్యామ్నాయం(ఎఎఫ్‌డి) అనే పేరుతో 2013లో ఏర్పడిన ఫాసిస్టు పార్టీకి 2017 పార్లమెంటు ఎన్నికలలో 709 స్ధానాలకు గాను 94, 12.6శాతం ఓట్లు వేశారు. అందువలన అమెరికాలో శ్వేతజాతి దురహంకారం నరనరానా జీర్ణించుకుపోయిన సమాజంలో ఫాసిస్టు శక్తులు బలం వేగంగా పుంజుకోవటం ఆశ్చర్యం కలిగించదు. ఆర్ధిక సమస్యలు తీవ్రతరం అవుతున్న దశలో అలాంటి శక్తులు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. జర్మన్‌ నాజీలు రెండవ ప్రపంచ యుద్దానికి, అనేక దేశాలను ఆక్రమించుకొనేందుకు కారకులు.వారికి వ్యతిరేకంగా జరిగిన పోరులో సోవియట్‌ యూనియన్‌ నాయకత్వాన కమ్యూనిస్టులు ముందున్నారు. ఇది దాస్తే దాగేది కాదు. దీన్ని దాచి పెట్టి రెండవ ప్రపంచ యుద్దంలో ప్రాణనష్టానికి నాజీలు-కమ్యూనిస్టులూ ఇద్దరూ కారకులే అనే తప్పుడు ప్రచారాన్ని చేయటమే కాదు. ఐక్యరాజ్యసమితిలో నాజీజంపై విజయాన్ని అంగీకరించేందుకు కూడా అమెరికా, ఐరోపా ధనికదేశాలు సిద్దంగా లేవు.


జో బైడెన్‌ అధికారాన్ని స్వీకరిస్తూ చేసిన ప్రసంగం సాధారణమైనదే. ఒక్క అమెరికాయే కాదు, యావత్‌ పెట్టుబడిదారీ సమాజం గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలను ఎదుర్కొంటోంది. గతంలో సోషలిజం విఫలమైంది అని ప్రచారం చేసే పెద్దలు ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలం అయింది అనే భావనకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.డెమోక్రటిక్‌ పార్టీలోని లక్షలాది మంది యువత అలాంటి భావనతోనే డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ వెనుక సమీకృతులైన విషయం తెలిసిందే.శాండర్స్‌ను వెనక్కు నెట్టి డెమోక్రటిక్‌ పార్టీ వెనుక ఉన్న కార్పొరేట్‌ శక్తులు తమ ప్రతినిధిగా జో బైడెన్‌ను ముందుకు తెచ్చారు. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీలోని సాంప్రదాయ మితవాదుల కంటే ముదుర్లయిన ఫాసిస్టు శక్తులు తలెత్తుతున్నాయనే అంశం గతం కంటే ఇప్పుడు మరింత స్పష్టంగా ట్రంప్‌ రూపంలో వెల్లడైంది. అతగాడి ప్రోద్బలంతో జనవరి ఆరవ తేదీన దేశరాజధాని కేంద్రంలో సమావేశమైన పార్లమెంట్‌ ఉభయ సభల మీద దాడి చేసిన వారందరూ ఫాసిస్టు భావజాలం కలిగిన సంస్ధలకు చెందినవారే.అనేక మంది అధికారాంతమందు అనేక మంది నేరగాండ్లకు క్షమాభిక్ష పెట్టిన ట్రంప్‌ రాజధాని మీద దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు జారీ చేసినట్లు మనకు ఎక్కడా కనపడదు-వినపడదు.


దేశ చరిత్రలో బహుశా రాజధాని ప్రాంతంలో అప్రకటిత లాక్‌డౌన్‌ ప్రకటించి వేలాది మంది సాయుధ, గూఢచారుల నడుమ అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయటం ఇదే ప్రధమం అని చెప్పవచ్చు. అక్కడ ఎలాంటి పరిస్ధితులు ఏర్పడుతున్నాయో ఇది వెల్లడిస్తోంది. జో బైడెన్‌ పేరును ఉచ్చరించటానికి కూడా అధ్యక్షుడిగా చివరి ప్రసంగంలో కూడా ట్రంప్‌ సిద్దపడలేదు. అమెరికా రాజకీయ వ్యవస్ధను కూల్చివేసేందుకు జరిగిన కుట్ర వెనుక ఉన్న ట్రంప్‌ దుశ్చర్యలను జో బైడెన్‌ కూడా ఖండించలేదు.తన ఎన్నికను వమ్ము చేసేందుకు జరిగిన ఉదంతాన్ని కుట్ర అనేందుకు కూడా ఆ పెద్దమనిషి ముందుకు రాలేదు, కేవలం ‘హింస’ అని మాట్లాడారు. దానికి పాల్పడిన శక్తులను కూడా సంతుష్టీకరించేందుకు ఐక్యతా మంత్రాన్ని పఠించారు. అయినా తోడేళ్ల వంటి కార్పొరేట్లు మేక పిల్లల వంటి సామాన్యులు అందరూ ఒకటే అంటే అర్ధం ఏమిటి ?

చివరి నిముషంలో డోనాల్డ్‌ ట్రంప్‌ క్షమాభిక్ష పెట్టింది ఎవరికి ? స్టీఫెన్‌ బనాన్‌ అనే ఒక ఫాసిస్టు ట్రంప్‌ 2016ఎన్నికల బాధ్యతలను చూశాడు.తరువాత అధ్యక్ష భవనంలో పని చేశాడు. మితవాదులారా(ఫాసిస్టు) ఏకం కండు అనే నినాదంతో 2017లో చార్లోట్స్‌విలేలో ప్రదర్శన నిర్వహించినందుకు పదవిని పోగొట్టుకున్నాడు. ట్రంప్‌తో ఎన్నడూ సంబంధాలను వదులుకోలేదు. తాజాగా కాపిటల్‌ మీద జరిగిన దాడిలో అతని హస్తం ఉంది. ఆ రోజు కాపిటల్‌కు రావాలని నాలుగు లక్షల మందికి వర్తమానాలు పంపాడు. అందువలన భవిష్యత్‌లో తనతో కలసి రావాల్సిన వ్యక్తి అనే ముందుచూపుతో అతన్ని క్షమించాడు. పెద్ద అవినీతి కేసులో అరెస్టయిన ఇలియట్‌ బ్రోయిడీ మరొకడు. 2016 ఎన్నికల్లో ట్రంప్‌కు మిలియన్ల డాలర్లు విరాళాల రూపంలో సంపాదించాడు.మలేసియా బిలియనీర్‌ ఝా లోవ్‌ మీద జరుగుతున్న దర్యాప్తు దర్యాప్తు నిలిపివేయిస్తానంటూ 90లక్షల డాలర్లు లంచంగా తీసుకున్నాడు. డెమోక్రటిక్‌ పార్టీ మాజీ ఎంపీ, డెట్రాయిట్‌ మేయర్‌గా పని చేసిన క్వామే కిల్‌పాట్రిక్‌ ప్రతి అవకాశాన్ని డాలర్లుగా మార్చుకున్న అవినీతిపరుడు. ఇరవై ఎనిమిదేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జార్జి గిల్‌మోర్‌ అనేవాడు న్యూ జెర్సీలో రిపబ్లికన్‌ పార్టీ రాజకీయ బ్రోకర్‌. అవినీతి, అక్రమాలకేసులో జైల్లో ఉన్నాడు. ప్లోరిడా రాష్ట్రంలో వృద్ద రోగుల వైద్య సంరక్షణ పేరుతో 730లక్షల డాలర్లు కొట్టేసిన కంటి వైద్యుడు సలోమాన్‌ మెల్‌జెన్‌ ఒకడు.పదిహేడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకా అనేక మందిని తన పదవీ కాలంలో ట్రంప్‌ క్షమాభిక్షతో విడుదల చేశాడు. వారంతా ట్రంప్‌తో సంబంధాలు ఉన్నవారు, భవిష్యత్‌లో ఉపయోగపడతారనే ముందుచూపుతోనే చేశాడు. తాజా ఎన్నికల్లో ఉపయోగించుకున్నాడు.


ట్రంప్‌ ఏర్పాటు చేస్తారని చెబుతున్న పేట్రియాట్‌ పార్టీ నమోదుకు ఆటంకాలు ఏర్పడతాయనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే కొందరు పేట్రియాట్‌ పార్టీ పేరుతో తమ ఉత్పత్తులకు ట్రేడ్‌ మార్క్‌ను నమోదు చేసుకున్నారు.2007లోనే అలాంటి పార్టీ ఒకదానిని నమోదు చేసి ఉన్నారు. అయితే కార్యకలాపాలు లేకపోవటంతో పదేండ్ల తరువాత అది రద్దయింది. మూడు సంవత్సరాల క్రితం మరో రెండు నమోదయ్యాయి. వారు తమ హక్కు వదులుకొని బదలాయిస్తేనే ట్రంప్‌కు లభిస్తుంది లేకుంటే ఆ పేరుకు చట్టపరమైన ఆటంకాలు ఏర్పడతాయన్నది ఒక అభిప్రాయం. ట్రంప్‌ కుటుంబ సభ్యుల పేరుతో వెయ్యికిపైగా ట్రేడ్‌ మార్క్‌లు నమోదై ఉన్నాయి. ఒక వాణిజ్యవేత్తగా వాటి మంచి చెడ్డలు లేక చట్టపరమైన ఆటంకాలు ట్రంప్‌కు తెలియవని అనుకోలేము. ఒక వేళ ఆ పేరుతో పార్టీ ఏర్పడినా ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేక మీడియాలో ప్రచారానికి మాత్రమే వినియోగిస్తారా అన్నది కూడా తెలియదు.ఈ పేరుతో పాటు మూడవ పక్షం, కొత్త పక్షం అనే పేర్లను కూడా ట్రంప్‌ పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు బయటికి రాగానే పేట్రియాట్‌ పార్టీ పేరుతో ఇప్పటికే ఉన్న సామాజిక మాధ్యమ ఖాతాను అనుసరించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఆలూ చూలూ లేని ఈ పార్టీకి ఇప్పటికే కొందరు పార్టీ చిహ్నాలను కూడా పోస్టు చేస్తున్నారు.


రాజధానిపై జరిగిన తీవ్ర హింసాకాండకు ట్రంపే బాధ్యుడని సెనెట్‌లో రిపబ్లికన్‌ పార్టీ నేతగా ఉన్న మిట్చ్‌ మెకనెల్‌ బహిరంగంగానే విమర్శించాడు. ఇతగాడు ట్రంప్‌ చివరి రోజుల్లో తీవ్రంగా వ్యతిరేకించాడని వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ట్రంప్‌ను గుడ్డిగా సమర్ధించిన వారు కూడా మరోవైపు తారసిల్లారు. ఒక వేళ ట్రంప్‌ కొత్త పార్టీ పెడితే తొలుత రిపబ్లికన్‌ పార్టీతోనే వైరుధ్యాలు తలెత్తే అవకాశం ఉంది. కాలూనేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తే మొగ్గలోనే తుంచి వేసేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తారు. కొత్త పార్టీ ఏర్పడితే రిపబ్లికన్లు లేదా ట్రంప్‌ పార్టీ గానీ సమీప భవిష్యత్‌లో అధికారానికి వచ్చే అవకాశం ఉండదని చెప్పవచ్చు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌-నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడే చెప్పలేము.


వివిధ దేశాలతో అనుసరించే వైఖరి, ఒక సామ్రాజ్యవాదిగా అమెరికా పాలకవర్గం తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఏమి చేయనుందో త్వరలోనే స్పష్టం అవుతుంది. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా కార్పొరేట్ల సేవలో ఉండేవారే తప్ప మరొకటి కాదు. అనుసరించే పద్దతులు, ప్రవర్తనలో తేడా తప్ప మౌలిక మార్పులు ఉండవు. తాను అనుసరించిన విధానాలను బైడెన్‌ అనుసరిస్తాడా లేదా అనేందుకు ట్రంప్‌ చివరి రోజుల్లో ప్రాతిపదిక వేశాడు. అమెరికా రహస్య వ్యూహాలు, ఎత్తుగడలను వాటి అవసరం తీరిపోయి, కొత్తవి ఉనికిలోకి వచ్చినపుడు రెండు దశాబ్దాల తరువాతనే బహిర్గతం చేస్తారు. అలాంది అనేక పత్రాలను ముందుగానే లీకుల ద్వారా లేదా అధికారయుతంగానే విడుదల చేశారు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని వినియోగించుకోవాలనే వ్యూహ పత్రాన్ని కూడా అనూహ్యంగా ట్రంప్‌ సర్కార్‌ బహిర్గతం కావించింది. ఆ వ్యూహం తరువాతనే నరేంద్రమోడీ వైఖరిలో వచ్చిన చైనా వ్యతిరేకత, అమెరికా చంకనెక్కిన తీరుతెన్నులు చూశాము.లాభం లేనిదే వ్యాపారి వరదలోకి వెళ్లడు అన్న సామెత తెలిసిందే.తాను అనుసరించిన విధానాల నుంచి వైదొలగకుండా చేసే ముందస్తు ఎత్తుగడా లేక స్వల్ప మార్పులు ఉంటే అదిగో చూడండి నేను ముందే చెప్పా అనే రాజకీయ దాడికి ప్రాతిపదిక కూడా కావచ్చు. అందువలన వీటి వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి అన్నది ముందు ముందు వెల్లడి అవుతుంది.