ఎం కోటేశ్వరరావు
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట
అన్న పోతన పద్యం తెలిసిందే. దానికి వికట కవితను చెప్పుకుంటే పలికెడిది వసుధైక కుటుంబమట, పలికించెడిది కాషాయదళమట అని రాయవచ్చు. వసుధైక కుటుంబం – సర్వజనులూ ఒకటే అని చెప్పేవారికి ఒకే నాలిక ఉంటుందని అనుకుంటాం. కానీ కొందరికి ఎన్ని నాలికలు ఉంటాయో, ఒకే నోటితో ఎన్ని మాటలు మాట్లాడతారో తెలియదు. కానీ వాటన్నింటినీ పలికించేది మెదడు లేదా నియంత్రించే మెదడు వంటి సంస్ధలు అని తెలిసిందే.
ఇక అసలు విషయానికి వస్తే బిజెపి ఏలుబడిలోని దేశ రాజధాని నగరంలో ఒకటైన దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈనెల 21న ఒక నిర్ణయం చేసింది. తమ పరిధిలోని హౌటళ్లలో సరఫరా చేసే మాంసం హలాల్ చేసిందా లేక ఝట్కానో తెలియ చేస్తూ హౌటళ్లలో విధిగా బోర్డులు పెట్టాలని ఆదేశించింది. ఉల్లంఘించిన వారి మీద కేసులు పెడతారని వేరే చెప్పనవసరం లేదు.
దీనికి కసరత్తు జరుగుతున్న సమయంలోనే కేరళలోని ఎర్నాకుళం జిల్లా కురమసెరీ అనే పట్టణంలో ఒక బేకరీ యజమాని తన దుకాణం ముందు తాము విక్రయించే తినుబండారాలలో ” హలాల్ ” చేసిన మాంసాన్ని వినియోగిస్తామని ఒక నోటీసు పెట్టారు. ఇంకేముంది హిందూమతానికి ముప్పు వచ్చింది అన్నట్లుగా అలా పెట్టటం అంటరానితనంతో సమానం-నేరపూరితమని దాన్ని తొలగించకపోతే ఆందోళన చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్ సంస్ధ అయిన హిందూ ఐక్యవేది ప్రతినిధులు నోటీసులు జారీ చేసి బెదిరించారు. వారెలాంటి వారో తెలిసిన ” మోడీ ” పేరుతో ఉన్న ఆ బేకరీ యజమాని వెంటనే నోటీసును తొలగించాడు. ఇది జనవరి మొదటి వారంలో జరిగింది.దాదాపు ఒకే సమయంలో, ఒకే సంస్ధ, ఒకే భావజాలానికి చెందిన వారు కేరళలో ఒకలా ఢిల్లీలో ఒకలా వ్యవహరించటాన్ని రెండు నాలికలనాలా నాలుగనాలా ?
సులభతర వాణిజ్య సూచికలో 2014లో 142వ స్దానంలో ఉన్న దేశాన్ని 2020 నాటికి 63కు తెచ్చామని బిజెపి నేతలు తమ విజయగానాల్లో ఒకటిగా పాడుకుంటారు. దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ జనవరి 21న చేసిన చేసిన నిర్ణయం తమను ఇబ్బందుల పాలు చేస్తుందని, సదరు ఆదేశాన్ని వెనక్కు తీసుకోవాలని హౌటళ్ల యజమానులు మొత్తుకుంటున్నారు. కరోనా కారణంగా దెబ్బతిన్న తమ వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని ఈ ఉత్తరువు ఆటంకంగా మారుతుందని ఫస్ట్ ఫిడిల్ కంపెనీ యజమాని ప్రియాంగ్ సుఖిజియా వాపోయారు.
ఇంతకీ హలాల్ – ఝట్కా అంటే ఏమిటి ? ప్రవక్త మహమ్మద్ ప్రవచనాలతో కూడిన ఖురాన్‌లో చెప్పిన పద్దతుల్లో కోళ్లు, మేకల వంటి వాటిని మాంసం కోసం వధించే క్రతువును హలాల్ అంటారు. ఇది అరబిక్ పదం, దీని అర్ధం అనుమతి. ముస్లిం మతం అనుమతించిన మేరకు అంటే ఒక ముస్లిం అల్లాను ప్రార్ధిస్తూ మత పవిత్ర స్ధలంగా భావించే కాబా వైపు పెట్టి జంతువుల మెడనరాన్ని కొద్దిగా కత్తిరించి రక్తం పూర్తిగా ఆగిపోయి చల్లబడేవరకు ఆగి తరువాత పూర్తి వధిస్తారు. అదే ఝట్కా అంటే ఒకే ఒక్క వేటుతో మెడనరకటం. ప్రత్యేకించి సిక్కులు ఒక్క వేటుతో తెగిపడిన జంతు మాంసాన్ని మాత్రమే భుజిస్తారు. ఒక వేళ ఒక వేటుకు పూర్తిగా తెగనట్లయితే దాన్ని పక్కన పడేస్తారు. మిగిలిన సామాజిక తరగతులకు అలాంటి ప్రత్యేక పద్దతులేవీ లేవు. నిజానికి ఏ ప్రక్రియలో అయినా జంతువు ప్రాణం పోయేదే. అందుకే సంత్ కబీర్‌దాస్ పద్దతి ఏదైనా హింసే కదా అంటాడు.
హౌటళ్లకు వచ్చే వినియోగదారులు అత్యధికులు ఏ పద్దతి మాంస వంటకాలు వడ్డిస్తున్నారని ఎవరూ అడగరని, ఉదారవాద విధానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ హౌటళ్లకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే బిజెపి ఆధ్వర్యంలోని కార్పొరేషన్ తమ మీద కఠిన ఆంక్షలను పెడుతున్నదని ప్రియాంక సుఖీజా విమర్శించారు. రెండు రకాల మాంసాలను నిల్వచేయటం, తెచ్చుకోవటంలో సమస్యలు వస్తాయని, వినియోగదారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సర్వర్లకు సమస్యలు వస్తాయని మరికొందరు యజమానులు వాపోయారు. ఇలాంటి ఉత్తరువులు ఢిల్లీ మొత్తానికి ఉంటే ఒక పద్దతి అలాగాక కొన్ని ప్రాంతాలకే వర్తింప చేస్తే గందరగోళం ఏర్పడుతుందని నగరంలోని అన్ని ప్రాంతాలలో హౌటళ్లు ఉన్న యజమానులు మొత్తుకుంటున్నారు.
ప్రతి అంశంలోనూ మతకోణాన్ని చొప్పిస్తున్న కాషాయదళాలు చివరికి మాంసాన్ని కూడా వివాదాస్పదం గావించాయి. ముస్లిం మత పద్దతిలో వధించే జంతు మాంసాన్ని ఇతర మతాల వారు ఎందుకు తినాలి అని రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. హలాల్ చేసిన ఆహారాన్ని తినటం సిక్కు, హిందూ మతాలకు వ్యతిరేకమని, నిషేధించారని దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఏ పద్దతిలో మాసం విక్రయిస్తున్నదీ తెలియ చేస్తూ విధిగా బోర్డులు పెట్టాలని నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. ఇస్లాంకంటే ఎన్నో వందల సంవత్సరాల ముందు ఉనికిలోకి వచ్చిన హిందూమతం తనకు తెలియని హలాల్‌కు వ్యతిరేకం అని ఎలా చెప్పగలదు ? ఎవరైనా ఇది ఇంతే అని చెబితే దాన్ని నోరుమూసుకొని అంగీకరించాలా ?
అక్రమంగా ఉన్న జంతు వధశాలలంటూ ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్ మూడు సంవత్సరాల క్రితం మూసివేత చర్యలు తీసుకుంది. ఆ వృత్తిలో ఉన్న ముస్లింల నోట్లో మట్టికొట్టటమే అసలు లక్ష్యం. ఒకవైపు జీవహింసకు వ్యతిరేకమని కబుర్లు చెబుతూ మరోవైపు గొడ్డుమాంసాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతిస్తూ నాలుగు డాలర్ల కోసం కక్కుర్తిపడుతున్నారనే విమర్శ నరేంద్రమోడీ సర్కారు మీద ఉంది. నిజానికి మన దేశం నుంచి గొడ్డు మాంసం ఎగుమతి చేసే వారిలో అత్యధికులు మతాల రీత్యా చెప్పాలంటే హిందువులదే ఆధిపత్యం. అది కూడా ఎలా ? తమ సంస్ధలకు ముస్లిం పేర్లు పెట్టుకొని !
తాజా గణాంకాల ప్రకారం 2020లో కోటీ ఆరులక్షల 57వేల టన్నుల గొడ్డు మాంసం ప్రపంచవ్యాపితంగా ఎగుమతి జరిగింది. దీనిలో 23.93శాతంతో బ్రెజిల్, ఆస్ట్రేలియా,భారత్, అమెరికాలు పదమూడు శాతం చొప్పున తొలి నాలుగు అగ్రస్ధానాల్లో ఉన్నాయి. పాకిస్దాన్ ఎగుమతులు కేవలం 0.52శాతమే. అమెరికా ఒకవైపు ఎగుమతులు చేస్తూనే మరోవైపు ప్రపంచంలో అత్యధిక దిగుమతి దేశంగా కూడా ఉంది. 2018లో 83లక్షల 80వేల టన్నులు వివిధ దేశాలు దిగుమతి చేసుకోగా వాటిలో అమెరికా 16.38, చైనా 14.32శాతాలతో తొలి రెండు స్ధానాల్లో ఉన్నాయి.
మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్న బడా కంపెనీలు, వాటి యజమానులెవరో చూద్దాం. దేశంలో అతి పెద్ద గొడ్డుమాంస ఎగుమతి సంస్ధ పేరు అల్ కబీర్ ఎక్స్‌పోర్ట్స్. ఇది హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో ఉంది. దీని యజమానులు సతీష్, అతుల్ సబర్వాల్. మరో కంపెనీ అరేబియన్ ఎక్స్‌పోర్ట్స్ యజమాని సునీల్ కపూర్, ఎంకెఆర్ ప్రోజన్ ఫుడ్స్ యజమాని మదన్ అబోట్, పిఎంఎల్ యజమాని ఎఎస్ బింద్రా (షఉటర్ అభినవ్ బింద్రా తండ్రి), ఆల్ నూర్ ఎక్స్‌పోర్ట్స్ యజమాని సునీల్ సూద్, ఎఓబి ఎక్స్‌పోర్ట్స్ యజమాని ఓపి అరోరా. స్టాండర్డ్ ప్రోజన్ ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ యజమాని కమల్ వర్మ, మహారాష్ట్ర ఫుడ్ ప్రోసెసింగ్ ఓనరు సన్నీ ఖట్టర్.
కావాలంటే దిగుమతి చేసుకొనే దేశాలను బట్టి హలాల్ మాంసం అని ముద్రవేసుకోవచ్చు, సర్టిఫికెట్లు తీసుకోవచ్చు తప్ప లేనట్లయితే విధిగా అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం జనవరి మొదటి వారంలో నిబంధనలను సవరించింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఎగుమతి చేస్తున్న మాంసం హలాల్ చేయబడినది అని అలిండియా జమాత్ ఉలేమాల ద్వారా నిర్ధారణ పత్రాలను తీసుకోవాలని కేంద్రం నిబంధనల్లో పేర్కొన్నది. ఇప్పుడు దాన్ని తొలగించింది.దిగుమతి చేసుకొనే దేశానికి అనుగుణ్యంగా జంతువులను వధిస్తారని పేర్కొన్నది. విశ్వహిందూపరిషత్, ఇతర హిందూత్వ సంస్దల నుంచి వచ్చిన వత్తిడి మేరకు ఈ మార్పులు చేశారు. విదేశాలకు ఎగుమతి చేసే వాటి మీద కావాలంటే హలాల్ అని ముద్రించుకోవచ్చు తప్ప దేశంలో వాటికి ఎందుకన్నది వాటి వాదన.
ఇలాంటి వాదనలన్నీ ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టే ఒక పధకంలో భాగమే. పోనీ వీరు ఒకే మాట, ఒకే వైఖరికి కట్టుబడి ఉంటారా ? అవకాశవాదం-పచ్చి అవకాశవాదం ! కేరళలోని హిందూ ఐక్యవేది ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన ఒక మతసంస్ధ. దాని ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కుమనం రాజశేఖర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అందువలన వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పనవసరం లేదు. ముందే చెప్పుకున్నట్లుగా దక్షిణ ఢిల్లీలో హౌటళ్లలో సరఫరా చేసే పదార్దాలు హలాల్ లేదా ఝట్కా పద్దతిలో చేసిన మాంసానివో బోర్డులు పెట్టాలని లేక పోతే శిక్షిస్తామని బిజెపి చెప్పింది. అలాంటి వాటిని తీసివేయకపోతే ఆందోళన చేస్తామని కేరళలోని బిజెపి సోదర సంస్ద హిందూ ఐక్యవేది బెదిరింపులకు దిగింది. ఒకే కుటుంబం నుంచి రెండు వైఖరులు. ఎంత తేడా !
కేరళ ఎర్నాకుళం జిల్లా కురమ్‌సెరీలో రెండు నెలల క్రితం ” మోడీ ” పేరుతో ఒక బేకరీని ఏర్పాటు చేశారు. హలాల్ చేసిన మాంసాన్ని తమ ఆహార పదార్ధాలలో వినియోగిస్తామని తెలిపే ఒక నోటీసును యాజమాన్యం బేకరీ ముందు ఏర్పాటు చేసింది. ఇష్టమైన వారు కొనుగోలు చేయవచ్చు, అభ్యంతరం ఉన్నవారు మరో బేకరికి వెళ్ల వచ్చు. ఆక్సిజన్ బదులు హిందుత్వ ప్రాణవాయువుతో జీవిస్తున్న హిందూ ఐక్యవేది ఆ ప్రాంతంలో మతోన్మాద బీజాలు వేసేందుకు ఆ నోటీసును ఎంచుకుంది. స్దానిక నేతలు డిసెంబరు 28న యజమానులకు ఒక లేఖ రాసి వారం రోజుల్లో దాన్ని తొలగించకపోతే కొనుగోళ్లను బహిష్కరించటంతో పాటు ఆందోళన చేస్తామని బెదిరించారు. అలా పేర్కొనటం అంటరానితనం వంటి నేరమని, భవిష్యత్‌లో కూడా ఇలాంటి వివక్షాపూరితమైన అంశాలతో దుకాణదారు ప్రచారం చేయకూడదని, చేస్తే ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు.
దానికి ముందు హిందూ ఐక్యవేది ప్రతినిధులు ఆ బేకరీకి వెళ్లి హలాల్ చేయని మాంసంతో చేసిన పదార్ధాలు కావాలని అడిగారు. కావాలంటే హలాల్ చేసింది ఉందా అని అడుగుతారు కదా అలాంటి బోర్డు ఎందుకు పెట్టారని నిలదీశారు. స్ధానికులే గాక ఆ వైపుగా రాకపోకలు సాగించే వారు కూడా ఉంటారని వారిని ఆకర్షించేందుకు ఆ నోటీసు పెట్టామని చెప్పిన బేకరీ యజమాని వెంటనే తొలగించాడు. ఈ ఉదంతాన్ని ఎవరూ తమ దృష్టికి తీసుకురాలేదని ఎల్‌డిఎఫ్‌కు చెందిన ఆ గ్రామ సర్పంచ్ ప్రతీష్ చెప్పారు. హిందూ ఐక్యవేది నోటీసు ఇవ్వటం అవాంఛనీయమని, దాని గురించి పరిశీలిస్తామని చెప్పారు.
విద్వేషం ఎంతగా పెరిగిపోయిందంటే 2019లో జొమాటో సంస్ధ తరఫున ఆహార పదార్ధాన్ని ఒక ముస్లిం యువకుడు సరఫరా చేశాడనే కారణంతో తిరస్కరించిన ఉదంతం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. గాల్వాన్‌లోయ ఉదంతం తరువాత చైనా యాప్‌లను నిషేధించినట్లుగా కొందరు జొమాటో ఆప్‌లను తొలగిస్తామని ఆ సమయంలో బెదిరింపులకు దిగారు. ఆహారానికి కులం, మతం, ప్రాంతం లేదు. కానీ వినియోగదారులను ఆకర్షించేందుకు,ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొన్ని విషయాలను సూచించేందుకు హౌటళ్ల యజమానులు పేర్లు పెట్టటం తెలిసిందే. ఆంధ్రా,ఉడిపి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, చౌదరి,క్షత్రియ, మిలిటరీ, జైన్, కోషర్(యూదు) హౌటల్స్ వంటివన్నీ ఆ కోవకే చెందుతాయి.
హైదరాబాద్, ఇతర అనేక చోట్ల బిర్యానీ హౌటల్స్‌కు , రంజాన్ సమయంలో హలీం కోసం వెళ్లే వారు అక్కడ పదార్ధాలు ఎంత రుచిగా ఉంటాయో చూస్తున్నారు తప్ప మాంసం హలాల్ చేసిందా లేదా అని చూస్తే, కాషాయ మతోన్మాదాన్ని తలకెక్కించుకుంటే అవన్నీ మూతపడతాయి లేదా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే. అయ్యప్పమాల ధారణ సమయంలో వారికి ప్రత్యేకం అనే బోర్డుల గురించి తెలిసిందే. ఇవేవీ ఎన్నడూ వివాదం కాలేదు.
ముస్లింల క్రతువు అయిన హలాల్ మీద ఇంత రాద్దాంతం అవసరం ఎందుకంటే దాని లక్ష్యం స్పష్టమే.హలాల్ నిర్ధారణ పత్రాలు తీసుకోవాలని బలవంతం చేయటం న్యాయమైన వాణిజ్య పద్దతి కాదని కొందరు సూత్రీకరిస్తున్నారు. ఎవరు బలవంతం చేశారు ? దిగుమతి చేసుకొనే వారు, వినియోగదారులకు అభ్యంతరం లేకపోతే ఎలాంటి ముద్రలు లేకుండానే ఎగుమతి చేయవచ్చు. ఒక మతానికి చెందిన వినియోగదారులను కూడా ఆకర్షించి నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే వ్యాపారులకు తప్ప సర్టిఫికెట్లు ఎవరికి అవసరం. ఉదాహరణకు బ్రాహ్మణ భోజన హౌటల్ అనే పేరు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆ సామాజిక తరగతివారు నిర్వహించే హౌటల్ కనుక వారు వచ్చి భోజనం చేయవచ్చనే సూచన దానిలో ఉంది. ఆ హౌటల్లో వండే, వడ్డించే, ప్లేట్లు లేదా ఆకులు ఎత్తేవారందరూ బ్రాహ్మణులే పనివారిగా ఉన్నారా లేదా అని ఎవరూ సర్టిఫికెట్లు అడగరు. ఆ పేరు పెట్టుకున్నదానికి వెళ్లి ఎవరైనా బిర్యానీ ఉందా అని అడుగుతారా ?
హలాల్, ఝట్కా, కోషర్, జైన్ అయినా అన్నీ మత కోవకు చెందినవే. ముస్లింల అసహనం, హలాల్ కావాలనే మంకు పట్టుతో లొంగని కారణంగానే హలాల్ నిర్దారణ పత్రాలు తీసుకోవాల్సి వస్తోందని సూత్రీకరించే మెజారిటీ అసహన శక్తుల వాదనలు కూడా మీడియాలో వచ్చాయి. ఇలా చెప్పేవారి అసలు లక్ష్యం ముస్లింలను లొంగదీసుకోవటమా ? వ్యాపారం చేసుకోవటమా ? వాటివలన అదనపు ఖర్చు అని కూడా లెక్కలు చెబుతున్నారు. పోనీ హలాల్ చేయని మాంసం వడ్డించే హౌటల్స్‌లో రేట్లు ఎక్కడైనా తక్కువ ఉంటున్నాయా ? హిందుత్వ గురించి కబుర్లు చెప్పే బాబారామ్ దేవ్ తన పతంజలి ఉత్పత్తులకు హలాల్ నిర్దారణ పత్రాలు తీసుకొనే అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఎంత మందికి తెలుసు ? ఆయన కంపెనీ మీద ఎవరు వత్తిడి తెచ్చారు ?
మతోన్మాదం వైరస్ ఒకసారి తలెత్తితే అది మెజారిటీ వారికే పరిమితం కాదు మైనారిటీలకూ పాకుతుంది.కేరళలో హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కొందరు కాసా పేరుతో ఉన్న క్రైస్తవ సంఘాల పేరుతో ఉన్నవారు పిలుపులు ఇచ్చారు.ఆ మాంసం లేదా వాటితో తయారైన వాటిని తినటం క్రైస్తవానికి వ్యతిరేకం అని చెప్పారు. అందువలన మాంసం కోసం మనమే జంతువులను కొనుగోలు చేసి మనమే వధించి తిందామని చెప్పారు. హలాల్ ఉత్పత్తులు అమ్మే, కొనుగోలు చేసే విధంగా వత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. వారికి హిందూ ఐక్యవేది మద్దతు ప్రకటించింది. తెల్లారితే క్రైస్తవులు, ముస్లింలు మతమార్పిడికి పాల్పడుతున్నారంటూ ఊదరగొడుతున్న హిందూ ఐక్యవేది లాంటి సంస్ధలు ఇలాంటి సమస్యలు వచ్చే సరికి క్రైస్తవుల మీద ఎక్కడ లేని ప్రేమను ఒలకపోస్తాయి. అయితే మతపరంగా తామెలాంటి అనుకూలతలు, వ్యతిరేకతలు వ్యక్తం చేయలేదని ఎవరి ఇష్టానికి వారికి వదలివేస్తున్నామని కొందరు చర్చినేతలు ప్రకటించారు. జంతువులు లేదా పక్షుల మాంసాన్ని తినేందుకు దేవుడు అనుమతించలేదని కొందరు క్రైస్తవ పెద్దలు భాష్యాలు చెబుతున్నవారూ ఉన్నారు.
అవకాశవాదానికి అడ్డదారులు వెతకటంలో, అతితెలివి ప్రదర్శనలో ఎవరైనా బిజెపి తరువాతే. ఒకవైపు ఇతర పార్టీలన్నీ సంతుష్ట రాజకీయాలు చేస్తున్నాయని, తాము మాత్రమే మాట తప్పని, మడమ తిప్పని ముక్కుసూటి వారమని చెప్పుకుంటారు. గోవా, ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి వారికి గొడ్డుమాంసం మహా ప్రియం.లొట్టలు వేసుకుంటూ తింటారు. అక్కడి వారి ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు పెట్టవు. పెట్టేందుకు తిరస్కరిస్తాయి, ఎందుకంటే పెడితే ఓట్లు రావు కదా ? అందుకే సంతుష్టీకరణ, ఓట్ల రాజకీయాల్లో భాగంగా ఆ రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు. స్ధానిక ఆహారపు అలవాట్లను తాము గౌరవిస్తామని చెప్పుకున్నారు. గో వధ నిషేధానికి సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయించుకొనే వెసులుబాటు కల్పించామని బిజెపి ప్రకటించటం సంతుష్టీకరణ తప్ప ఏమిటి ? ఆ వెసులు బాటు, ఆహారపు అలవాట్లు దేశమంతటా ఎందుకు వర్తించదు, ఎందుకు గౌరవించరు ? గో మాంసం కలిగి ఉన్నారనే పేరుతో కొట్టి చంపటం ఎందుకు ? పాలకోసం గోవులను తరలిస్తున్నా వధకే అంటూ దాడులు ఎందుకు చేస్తున్నట్లు ?
ఎన్నికల్లో బిజెపి ఓట్ల కక్కుర్తి ఎలా ఉందో కేరళలో చూశాము. అక్కడి మలప్పురం జిల్లాలో 65శాతం మంది ముస్లింలు, ఐదుశాతం క్రైస్తవులు. మిగిలినవారు ఇతరులు. కేరళలో గొడ్డు మాంసంపై ఎలాంటి ఆంక్షలు లేవు. 2017లో మలప్పురం లోక్‌సభ స్దానం ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ బిజెపి తరఫున శ్రీ ప్రకాష్ పోటీ చేశారు. కేరళలో ఎలాంటి నిషేధం లేదు కనుక తనను ఎన్నుకుంటే నాణ్యమైన గొడ్డు మాంసం అందచేయిస్తానని ఎన్నికల్లో ప్రచారం చేశారు. అంటే బిజెపి గొడ్డు మాంస దుకాణాలను ప్రారంభిస్తుందా ? గొడ్డు మాంసంపై నిషేధం గురించి తమ పార్టీని చెడుగా చిత్రిస్తున్నారని, తనను ఎన్నుకుంటే మంచి నాణ్యమైన గొడ్డుమాంసం దొరికేట్లు చేస్తా నన్ను నమ్మండి అన్నట్లుగా మాట్లాడారు. అంతకు ముందు రోజే నాడు చత్తీస్‌ఘర్ ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత రామన్ సింగ్ ఆవులను వధించిన వారికి ఉరిశిక్ష వేయాలని ప్రతిపాదించారు. దీన్నే ఏ రోటి కాడ ఆ పాట పాడటం అంటారు. వీరు విలువలు, వలువల గురించి జనానికి నీతులు చెబుతారు.
మాంసమైనా మరొకటైనా ఆరోగ్యానికి హాని లేని ప్రమాణాలతో ఉన్నదా లేదా అన్నది ముఖ్యం తప్ప దాన్ని ఏ మత క్రతువు ప్రకారం కోశారన్నది కాదు. ఆగ్ మార్క్, ఐఎస్‌ఐ ప్రమాణాలకు బదులు కాషాయ దళాలు మాంసానికి మత ముద్రలు వేయటం ద్వారా సమాజాన్ని ఎక్కడకు తీసుకుపోతున్నారో, ఎందుకీ ఉన్మాదమో, వారి ద్వంద్వ ప్రమాణాలేమిటో ప్రతివారూ ఆలోచించాలి.