Tags
Farmers agitations, India oil price, Narendra Modi Failures, OPEC oil war, unabated oil prices in India
ఎం కోటేశ్వరరావు
ఒక వైపు పట్టువీడని రైతు ఉద్యమం-మరో వైపు ఎగబాకుతున్న చమురు ధరలు. గడ్డ కట్టే చలిలో కూడా కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి నేతృత్వంలోని పాలక ఎన్‌డిఏ కూటమికి చెమటలు పట్టిస్తున్నాయి. ఇవి ఏ పరిణామాలకు దారి తీస్తాయో చెప్పలేము. ఇది రాస్తున్న సమయానికి రైతులూ పట్టువిడుపు లేకుండా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా జనం భరిస్తారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎక్కడా ప్రతిఘటన లేదు కనుక ప్రతి రోజూ పెంచుతూనే ఉంది. పన్నుల తగ్గింపు ఆలోచన చేయటం లేదు.
చిత్రం ఏమిటంటే పెరుగుతున్న చమురు ధరల గురించి గతంలో బిజెపి నేత స్మృతి ఇరానీ మాదిరి ఎవరూ గ్యాస్ బండల ధర్నాలు లేవు, ఎడ్ల బండ్ల మీద మోటారు సైకిళ్లను పెట్టి ప్రదర్శనలు, ఆటోలను చేత్తో లాగే విన్యాసాల దృశ్యాలు కనిపించటం లేదు. ప్రతిపక్షాలు కిమ్మనటం లేదు గానీ కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారే మండి పడ్డారు. చమురు ధరల పెరుగుదలకు సౌదీ అరేబియా కారణమని కొద్ది రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీలను కూడా తప్పుపట్టలేము. ఎవరైనా ధర్నా చేస్తుంటే మాకు అడ్డుగా ఉన్నారంటూ విసుక్కొని పక్కదారులలో పోయే జనం ఉన్నపుడు కందకు లేని దురద కత్తిపీటలకెందుకు అన్నట్లుగా ఎవరికి మాత్రం ఎందుకు ? చమురును కొనుగోలు చేసేది మెజారిటీ బిజెపి అభిమానులే కదా ! ఎందుకంటే మెజారిటీ రాష్ట్రాల్లో వారే కదా అధికారంలో ఉంది. ఇంక ఆ పార్టీ తమది మెజారిటీ హిందువుల పార్టీ అని చెప్పుకుంటున్నది కనుక అధిక భారం పడుతున్నదీ, మోస్తున్నదీ హిందువులే, కాదంటారా ? ఇష్టమైనపుడు సుత్తితో మోదినా దెబ్బ అనిపించదు. లేనపుడు తమలపాకుతో తాటించినా భరించలేని బాధ అనిపిస్తుంది- తరతరాల మానవ సహజం !
ఇంతకీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి సౌదీ అరేబియా మీద ఎందుకు కోపం వచ్చింది ? మౌన యోగి ప్రధాని నరేంద్రమోడీ గారి మాదిరి మాట్లాడకుండా ఉంటే నాటకం రక్తి కట్టదు కదా ! నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన కొత్తలో పీపా చమురు ధర 107 డాలర్లు ఉన్నది కాస్తా తరువాత గణనీయంగా పడిపోయింది. గత ఏడాది ఒక దశలో 23 డాలర్లకు తగ్గింది. ఇప్పుడు 55-56డాలర్ల మధ్య ఉంది. మన్మోహన్ సింగ్ గారి ” చెడు ” రోజుల చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా చమురు ధరలు తగ్గినపుడు కరోనా ఉన్నా కరుణ చూపలేదు. పెరిగినపుడు మాత్రం మడమ తిప్పకుండా వాయించేస్తున్నారని పదే పదే చెప్పుకోనవసరం లేదు.
ఏడాది క్రితం గణనీయంగా ధరలు తగ్గినపుడు కేంద్ర ప్రభుత్వం మూడు రూపాయల పన్ను పెంచటంతో వినియోగదారుడికి ఎలాంటి ఉపశమనం లేకుండా పోయింది. జనాల జేబులు కొట్టి మార్కెటింగ్ కంపెనీలకు లబ్ది చేకూర్చారు. కేంద్ర ప్రభుత్వానికి 43వేల కోట్ల మేరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఒక రూపాయి పన్ను పెంచితే ఏడాదికి 14వేల కోట్ల రూపాయలు వస్తుంది. మరి మంత్రిగారికి కోపం ఎందుకు వచ్చిందంటే ఇప్పటికే చమురు ధరలు 73 సంవత్సరాల రికార్డులను బద్దలు కొట్టాయి, రైతుల ఉద్యమ స్ఫూర్తితో చమురు మీద కూడా ఆందోళనలు ప్రారంభమైతే అన్న గగుర్పాటు మంత్రిగారికి కలిగి ఉండాలి. భజన గోడీ మీడియా, సానుకూల కాషాయ మేథావుల కోళ్లు కూయకుండా మూసుకుంటే తెల్లవారకుండా ఆగుతుందా ? రైతుల ఉద్యమాన్ని ఆపగలిగారా ? రైతులకు భయపడి శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రద్దు చేయగలిగారు గానీ బడ్జెట్ సమావేశాలను అలా చేయగలరా ? భజన చేసే తెలుగుదేశం, టిఆర్‌ఎస్, వైసిపి వంటి మరికొన్ని ప్రాంతీయ పార్టీలు మౌనంగా ఉన్నా ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రభుత్వాన్ని చమురు ధరల మీద నిలదీయకుండా ఉంటారా? అందుకే మంత్రిగారు నేరం మాది కాదు సౌదీది అనే చెప్పేందుకు ముందస్తుగానే వాదన సిద్దం చేసుకున్నారనిపిస్తోంది.
గతేడాది కొన్ని దేశాల మధ్య చమురు యుద్దం కారణంగా పోటీపడి చమురు ఉత్పత్తిని పెంచిన విషయం, వద్దురా బాబు నిల్వచేసేందుకు ఖాళీలేదు, ఒప్పందం చేసుకున్నాం గనుక మీకే ఎంతో కొంత ఎదురు ఇస్తాం సరకు పంపకండి అన్న పరిస్ధితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మన యుద్దం మనకే నష్టం అని గమనించిన చమురు దేశాలు తమ లాభం తాము చూసుకుంటున్నాయి. డిమాండ్ పడిపోయింది కదా అని ఉత్పత్తిని తగ్గిస్తే చమురు ఎగుమతి దేశాల మార్కెట్‌ను అమెరికా వంటి దేశాలు ఆక్రమిస్తే పరిస్దితి ఏమిటన్న గుంజాటన మీద తర్జన భర్జనలు జరిగాయి. ముఖ్యంగా రష్యా ఈ వాదనను ముందుకు తెచ్చింది. అయితే కరోనా నుంచి కాస్త కోలుకుంటున్నందున ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి.
గతంలో చమురు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రోజుకు 97లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంది. దానికి అదనంగా ఫిబ్రవరి, మార్చి నెలలో రోజుకు పదిలక్షల పీపాల చమురు ఉత్పత్తిని స్వచ్చందంగా తగ్గిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పడిపోతే దానికి విరుద్దంగా చైనాలో పరిస్ధితి ఉండటంతో చమురు దేశాలు కాస్త నిలబడ్డాయి. అంతర్జాతీయ చమురు సంస్ధ తాజా అంచనా ప్రకారం ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో డిమాండ్ తగ్గనుంది.
మన దేశం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే దిగుమతి ఇంకా తక్కువే ఉన్నప్పటికీ గత కొద్ది నెలలుగా పెరుగుతున్నది. ఇలా ధరలు పెరిగేట్లు చేస్తే మేము ప్రత్యామ్నాయం, కొత్త వ్యాపార విధానాలను చూసుకోవాల్సి ఉంటుందని మన మంత్రి హెచ్చరించారు. దీనికీ కారణం లేకపోలేదు. ఇప్పుడున్న స్దితి నుంచి ఏమాత్రం పెరిగినా అమెరికాలోని షేల్ ఆయిల్ వెలికి తీత లాభదాయకంగా మారుతుంది. అందువలన అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, కనుక మీ దగ్గర బదులు అక్కడి నుంచే కొంటాం అన్న బెదిరింపు కూడా లేకపోలేదు. ఇప్పటికే నరేంద్రమోడీ నాయకత్వం అమెరికాతో స్నేహం పేరుతో దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు ప్రారంభించింది. ఎక్కడన్నా బావే గానీ చమురు దగ్గర కాదన్నట్లుగా ఇతర దేశాల ధరకే మనకు ఇస్తున్నారు తప్ప మోడీ గారి గడ్డం పొడుగు చూసి ఒక్క సెంటు కూడా మాజీ డోనాల్డ్ ట్రంప్ తగ్గించలేదు, తాజా జో బైడెన్ తగ్గించేది లేదు. పశ్చిమాసియా, ఇతర దారులు మూసుకుపోతే అమెరికా కాళ్ల మీద పడాలి. పోటీదారులను పడగొట్టిన తరువాత రిలయన్స్ జియో ధరలు పెంచిన మాదిరే అమెరికా కూడా చేస్తే ?
ఇవన్నీ మంత్రిగారి తెలియవా ? జనానికంటే ఎక్కువ తెలుసు ! సౌదీని విమర్శించి, ప్రత్యామ్నాయం చూసుకుంటామని బెదిరిస్తే ప్రయోజనం ఉంటుందా ? చెరువు మీద అలిగితే ఏం జరుగుతుందో అదే అవుతుంది. మంత్రిగారి ప్రకటన వెనుక ప్రభుత్వ భయం కనిపిస్తోంది. ధరలు పెంచుకుంటూ పోతే భరించే జనంలో అసంతృప్తి తలెత్తుతుంది. అభిమానులు సైతం ఎంతకాలం భజన చేస్తారు, ఎంతైనా భరిస్తామని గొప్పలు చెబుతారు. మిగతా దేశాలతో ముఖ్యంగా పాకిస్ధాన్‌తో పోల్చుకుంటే పరువు తక్కువ. కేంద్ర ప్రభుత్వం పన్నులు ఎందుకు తగ్గించదు అనే సమస్య ముందుకు వస్తుంది. అదే జరిగితే తగ్గించే స్దితిలో మోడీ సర్కార్ ఉందా ? చమురు ధరలు పెరిగిపోతే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తయారు చేస్తుున్న బడ్జెట్ హల్వా తినటానికి వస్తుందా ?
మార్చినెలాఖరుతో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో లోటు ఎంత ఉంటుందో, దేనికి కోత పెడతారో తెలియదు. ప్రభుత్వ రంగ సంస్దల వాటాలను అమ్మి 2.1లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ లోటు నింపుకోవాలనుకున్నది కుదరలేదు. అయినా చమురు పన్నుల బాదుడుతో 1.4లక్షల కోట్ల రూపాయలను జనం నుంచి వసూలు చేసి కొంత మేర ఆ లోటును పూడ్చుకున్నారని సరిగ్గా బడ్జెట్ సమయంలో క్రిసిల్ రేటింగ్ సంస్ద నివేదికలో చెప్పటం, అది మీడియాలో రావటం, కొందరైనా చదవటం కేంద్ర ప్రభుత్వానికి మింగుడు పడని విషయమే. శుద్దమైన చమురు సాకుతో పన్నుల తగ్గింపు జరిగే అవకాశాలు లేవని మరోవైపు వార్తలు.2020 జూన్ తొమ్మిదవ తేదీన హిందూస్దాన్ పెట్రోలియం వెల్లడించిన సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.73.04 ఉంటే దానిలో డీలరుకు విక్రయించిన ధర రూ.19.63 అయితే కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్ పన్ను రూ.32.98, డీలర్లకు కమిషన్ రూ.3.57, ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌రూ.16.86 ఉంది. ఈ ఏడాది న్యూఢిల్లీలో జనవరి ఒకటవ తేదీన నీతి మార్గ్‌లోని హెచ్‌పిసిఎల్ బంకులో లీటరు పెట్రోలు ధరలో ఏవేవి ఎంత ఉన్నాయో దిగువ చూడవచ్చు.
డీలర్లకు ఇస్తున్న ధర ××××××× రూ.27.25
కేంద్ర ఎక్సయిజు డ్యూటీ ×××× రూ.32.98
డీలరు కమిషన్ ××××××××× రూ.3.67
ఢిల్లీ రాష్ట్ర వ్యాట్ ××××××××× రూ.19.32
వినియోగదారుడి ధర ×××××× రూ.83.71
వివిధ రాష్ట్రాలలో వ్యాట్ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. డీలరు కమిషన్ మీద కూడా ఢిల్లీలో వ్యాట్ 30శాతం వసూలు చేస్తున్నారు. ముంబైలో గతంలో బిజెపి సర్కార్ విధించిన 39.12శాతం వ్యాట్‌ను తరువాత అధికారానికి వచ్చిన శివసేన సంకీర్ణ కూటమి కూడా కొనసాగిస్తున్నది. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఈ కారణంగానే జనవరి 18న ముంబైలో రూ.91.80 ఉంటే చెన్నరులో రూ.87.85 ఉంది. జనవరి 18న కొన్ని దేశాలలో పెట్రోలు, డీజిలు లీటరు ధరలు ఇలా ఉన్నాయి. ధర డాలర్లు, సెంట్లలో(బ్రాకెట్లలోని ధరలు మన రూపాయల్లో అని గమనించాలి
దేశం××××××××××పెట్రోలు×××× ×××× డీజిలు
వెనెజులా×××××× 0.020 (1.46) ×××× 0.000 (0000)
సౌదీ అరేబియా×× 0.467 (34.07) ×××× 0.139 (10.14)
మయన్మార్ ×××× 0.627 (45.74) ×××× 0.556 (40.56)
భూటాన్ × ×××× 0.677 (49.39) ×××× 0.633 (46.17)
పాకిస్ధాన్× ×××× 0.682 (49.75) ×××× 0.706 (51.50)
శ్రీలంక ×××××× 0.839 (61.20) ×××× 0.542 (39.54)
నేపాల్ ×× ×××× 0.941 (68.64) ×××× 0.795 (57.99)
చైనా ××× ×××× 1.013 (73.89) ×××× 0.882 (64.34)
బంగ్లాదేశ్ ×××× 1.052 (76.74) ×××× 0.769 (56.09)
భారత్ ×× ×××× 1.201 (87.61) ×××× 1.083 (79.00)
అనేక దేశాల్లో మన కంటే పన్నులు తక్కువ ఉన్నాయి, మరికొన్నింటిలో ఎక్కువ ఉన్నాయి. కొన్ని చోట్ల చెల్లింపు శక్తిని బట్టి ధరలు వసూలు చేస్తున్నారు. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ? క్రిసిల్ సంస్ధ అధ్యయనం ప్రకారం 2020లో ఉన్న బ్రెంట్ రకం ముడి చమురు ధర సగటున 42.3 డాలర్లు ఉంటే 2021లో అది 50-55 డాలర్ల మధ్య ఉంటుందని పేర్కొన్నది. దానికి అనుగుణ్యంగానే మనం కొనే చమురు ధరలు కూడా ఉంటాయి. ఈ మేరకు పెరిగినా లేక అనూహ్యంగా ఇంకా పెరిగినా మన విదేశీమారక నిల్వలు, బడ్జెట్ అంచనాలు తప్పుతాయి. అందుకే మంత్రిగారు ఆందోళన, ఆక్రోశం వెలిబుచ్చారు తప్ప వినియోగదారులకు మేలు చేకూర్చుదామని కాదు.
ఇది రాసిన సమయానికి మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు పీపా ధర 55-56 డాలర్ల మధ్య నడుస్తున్నది. ప్రతి పెరుగుదలనూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ కంపెనీలు జనం మీద ఏ రోజుకు ఆరోజు రుద్దుతున్నాయి. ఎవరూ ఏమీ ప్రశ్నించకుండా వాటిని చెల్లించి కొనుగోలు చేస్తున్నాము. వినియోగదారులెవరూ పట్టించుకోవటం లేదు, రైతుల మాదిరి చమురు వినియోగదారులు కూడా ఉద్యమించే రోజులు వస్తాయా ? ఇప్పుడు దేశభక్తి మత్తులో ముంచారు గనుక దేశం కోసం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడటం లేదు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా ? అనూహ్య పరిణామాలు ఏ రూపంలో ఉంటాయో తెలియదు. ఎవరి దగ్గరైనా చిత్రగుప్తుడి చిట్టా ఉంటే నరేంద్రమోడీనో జనాన్నో కాపాడేందుకు బయటపెడితే మంచిదేమో !
రైతు ఉద్యమం రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి నిస్తోందనటంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్ర పునరావృతం అవుతుందన్నది నిజం, అయితే గతం మాదిరే అయిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఉద్యమాలు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. గతంలో రైతులు బోట్ క్లబ్ వద్ద తిష్టవేశారు. ఆ అనుభవంతో బిజెపి సర్కార్ ఇప్పుడు అసలు ఢిల్లీలో ప్రవేశించకుండా శివార్లలోనే అడ్డుకుంది. రైతులు అక్కడే నిరవధిక ఆందోళన ప్రారంభిస్తారని ఊహించలేదు. దేశమంతటా ఉద్యమించే విధంగా ఒక్క రైతులనే కాదు, వివిధ తరగతుల వారిని మేల్కొలిపింది. దోపిడీ శక్తులు తమ భూమి, పరిశ్రమలు, కార్యాలయాల్లో పని చేసే వారినే కాదు, తమ దోపిడీని అంతం చేసే శ్రామిక శక్తులను కూడా తయారు చేస్తాయి. సుత్తీ, కొడవళ్లు పనిసాధానాలుగానే కాదు, అవసరమైతే దోపిడీ శక్తుల పని పట్టే సాధానాలుగా కూడా మారతాయి ! 1975లో అత్యవసర పరిస్థితిని విధించటం ద్వారా కాంగ్రెస్ తన వ్యతిరేకశక్తులందరినీ ప్రజాస్వామ్య పరిరక్షణ సమస్య మీద ఐక్యం చేసింది. ఇప్పుడు రైతాంగ సమస్యల మీద అదే మాదిరి ఐక్యతను ప్రదర్శించటానికి వ్యవసాయ సంస్కరణల పేరుతో మోడీ సర్కార్ తెచ్చిన చట్టాలు దోహదం చేశాయి. దీనికి నరేంద్రమోడీ ఆయనను నడిపిస్తున్న సంఘపరివార్‌కు ఒక విధంగా ” అభినందనలు ” చెప్పాలి.