Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారు తన మూడవ, దేశ వందవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌ను రూపొందించేందుకు చేసిన కసరత్తు గతంలో ఎన్నడూ జరగలేదని ఆమె చెప్పారు. తీరా బడ్జెన్‌ను చూస్తే ఆరునెల్లు సాము గరిడీలు నేర్చుకొని పాతకుండలు పగలగొట్టారన్న సామెత గుర్తుకు వచ్చింది. దీన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు క్రియాశీల బడ్జెట్‌ అని వర్ణించారు.గతంలో ప్రతి ప్రధాని ప్రతి బడ్జెట్‌ను ఇలాగే పొగిడిన స్వంత డబ్బాల గురించి వేరే చెప్పనవసరం లేదు. గత బడ్జెట్‌ రూ.34,50,305 కోట్లుగా సవరిస్తే తాజా బడ్జెట్‌ను రూ.34,83,236 కోట్లతో ప్రతిపాదించారు. తేడా రూ.32,931 కోట్లు.విపరీతం గాకపోతే ఈ మాత్రానికి అంత ఆయాసపడాలా ?


బడ్జెట్‌లో చర్చించాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. ఈ బడ్జెట్‌లో కొట్ట వచ్చినట్లు కనిపించిన ఒక అంశానికి పరిమితం అవుదాం. కోవిడ్‌ సెస్‌ వేస్తారని బడ్జెట్‌కు ముందు వచ్చిన ఊహాగానాలకు తెరదించి కొత్త సెస్‌లను ముందుకు తెచ్చారు. అనేక పధకాలకు ప్రధాని అని తగిలించారు గనుక వీటికి కూడా ప్రధాని లేదా మోడీ సెస్‌లని పెట్టి ఉంటే అతికినట్లు ఉండేది. జనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఉదాహరణకు పెట్రోలు మీద లీటరుకు రూ.2.50, డీజిల్‌ మీద రూ.4.00ల కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను తగ్గించి ఆ మేరకు సెస్‌ విధించారు. నిర్మలమ్మ చెప్పినట్లు ఈ మాత్రం దానికి అంత మల్లగుల్లాలు పడాలా ? ఇలాగే బంగారం దిగుమతుల మీద కస్టమ్స్‌ సుంకాన్ని పన్నెండు నుంచి ఏడు శాతానికి తగ్గించి రెండున్నరశాతం సెస్‌ విధించారు. ఇలాగే మద్యం మరికొన్నింటి మీద ఇలాంటి కసరత్తే చేశారు. వినియోగదారుల మీద పెద్దగా ప్రభావం పడదు. అని చెబుతున్నారు. అసలు పెంచిన పన్నులు తగ్గించటమే చిల్లి కాదు తూటు అన్నట్లు కొత్త పేరుతో అవే భారాలను కొనసాగిస్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ఎందుకు తీసుకున్నట్లు ? పనీపాటాలేక ఇలాంటి పిచ్చిపని చేస్తున్నారా ?


కానే కాదు, కేంద్ర ప్రభుత్వ తెలివి, ఇంకా చెప్పాలంటే అతి తెలివితో రాష్ట్రాలకు శఠగోపం పెట్టే వ్యవహారం. ఎలా ? దీని గురించి చెప్పుకోబోయే ముందు కేంద్ర ప్రభుత్వం కాశ్మీరుకు మాత్రమే వర్తించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి తన దుశ్చర్యను బయటపెట్టుకుంది. నిజానికి దాని బదులు ఆర్టికల్‌ 270ని రద్దు లేదా రాష్ట్రాల కోరికలకు అనుగుణంగా సవరించి ఉంటే అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అభినందించి ఉండేవి. సదరు ఆర్టికల్‌లో కేంద్రం-రాష్ట్రాలు పంచుకోవాల్సిన పన్నుల జాబితా ఉంది. వాటిలో సెస్‌లు, సర్‌ఛార్జీలు లేవు. అందువలన ఆ పేరుతో పన్ను విధిస్తే మోడీ భక్తులతో సహా జనం అందరి జేబులు ఖాళీ అవుతాయి గాని రాష్ట్రాలకు వాటిలో వాటా ఇవ్వనవసరం లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని గతంలో కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభించిన రాష్ట్రాల వ్యతిరేక చర్యను ఇప్పుడు బిజెపి ఏలికలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు.

రాష్ట్రాలలో స్ధానిక సంస్ధలు పన్నులతో పాటు గ్రంధాలయ సెస్‌ను వసూలు చేస్తాయి. ఎందుకు ? గ్రంధాలయాలను ఏర్పాటు చేసి జనానికి పత్రికలు, పుస్తకాలను అందుబాటులోకి తేవటానికి. తెలంగాణాలో గత ఏడు సంవత్సరాలుగా ఆ సెస్‌ మొత్తాలతో ఒక్క పుస్తకమూ కొనలేదని పుస్తక ప్రచురణకర్తలు గ్రంధాలయ సంస్ధ చైర్మన్‌తో మొరపెట్టుకున్నారు. అంటే సదరు మొత్తాన్ని వేరే అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇది చట్టవ్యతిరేకం. ఇదే పని కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ఖాతాల లావాదేవీలను తనిఖీ చేయగా 2018-19లో వసూలు చేసిన సెస్‌ మొత్తంలో 40శాతం మొత్తాన్ని దేనికోసం వసూలు చేస్తున్నారో దానికి కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వ ఖాతాకు మరలించుకుంటున్నట్లు తేలింది. ఇదీ చట్టవ్యతిరేకమే. సెస్‌ అంటే పన్ను మీద విధించే పన్ను. సర్‌ఛార్జీ కూడా ఇలాంటిదే.2018వరకు కేంద్ర ఇలాంటివి 42సెస్‌లను విధించింది. తరువాత మరికొన్నింటిని జత చేసింది. తొలి సెస్‌ అగ్గిపెట్టెల మీద తరువాత ఉప్పు మీద కూడా విధించారు. అంటే ఆయా పరిశ్రమల అభివృద్ధితో పాటు కొన్ని రంగాలలో పని చేసే కార్మిక సంక్షేమానికి కూడా కొన్ని సెస్‌లను విధిస్తున్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిని తెచ్చిన తరువాత సెస్‌లన్నీ దానిలో కలసిపోయాయి.ప్రస్తుతం 35వరకు ఉన్నాయి. వాటిలో ఎగుమతులు, ముడిచమురు, ఆరోగ్యం-విద్య, రోడ్డు మరియు మౌలిక సదుపాయాలు, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం, జాతీయ విపత్తు, పొగాకు, దాని ఉత్పత్తులు, జిఎస్‌టి పరిహార సెస్‌, ఆరోగ్య పరికరాల సెస్‌, తాజాగా బడ్జెట్‌లో ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల వంటివి ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2013లో ” చట్ట విధాన నిమిత్త కేంద్రం పేరుతో- విధి ” అనే లాభాలతో నిమిత్తం లేని ఒక మేథో కంపెనీని ఏర్పాటు చేసింది. అది తయారు చేసి పదిహేనవ ఆర్ధిక సంఘానికి ఇచ్చిన వివరాల ప్రకారం 2012-13 నుంచి 2018-19 వరకు మొత్తం కేంద్ర పన్ను ఆదాయంలో సెస్‌ మరియు సర్‌ఛార్జీల మొత్తం 7-2శాతాల నుంచి 11.9-6.4శాతాలకు పెరిగాయి. 2002 తరువాత అప్పటికి ఇవి గరిష్ట మొత్తాలు. నగదు మొత్తాలలో చెప్పాలంటే 2017-18 నుంచి 2018-19 మధ్య సెస్‌ మొత్తం 2.2(11.1శాతం) లక్షల రూపాయల నుంచి రూ.2.7లక్షలకు, సర్‌ఛార్జీ రూ.99,049(5శాతం) నుంచి రూ.1.4లక్షలకు పెరిగింది.1980-81 కేంద్ర పన్ను ఆదాయంలో సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా కేవలం 2.3శాతం మాత్రమే ఉండేది.


సెస్‌లు, సర్‌ఛార్జీలు పెరుగుతున్న కారణంగా తమ నిధుల వాటా తగ్గుతోంది కనుక ఆర్టికల్‌ 270ని సవరించి వీటిలో కూడా వాటా కల్పించాలని రాష్ట్రాలు ఆర్ధిక సంఘాన్ని కోరాయి. తాజా సమాచారం ప్రకారం పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం 42శాతం పన్ను ఆదాయాన్ని అందచేస్తున్నది. పదిహేనవ ఆర్దిక సంఘం సిఫార్సు ప్రకారం ఈ మొత్తం 41శాతానికి తగ్గింది. అయితే వివరాల్లోకి వెళ్లినపుడు వాస్తవంగా మొత్తం పన్ను ఆదాయంలో 35శాతం కంటే తక్కువే బదలాయిస్తున్నట్లు తేలింది. ఇంతే కాదు కాగ్‌ నివేదిక ప్రకారం 2018-19 సంవత్సరానికి లెవీల ద్వారా రూ.2.7లక్షల కోట్ల రూపాయలకు గాను కేవలం రూ.1.64లక్షల రూపాయలు మాత్రమే దేనికోసమైతే సెస్‌,సర్‌ఛార్జీలు విధించారో అందుకు కేటాయించారని పేర్కన్నది. మిగిలినవి కేంద్ర నిధిలో వేసుకున్నది. ముడి చమురు మీద వసూలు చేసిన రూ.1.25లక్షల కోట్ల రూపాయలను చమురు పరిశ్రమ అభివృద్దికి ఖర్చు చేయలేదు. అదే విధంగా ఐదు శాతంగా వసూలు చేస్తున్న ఆరోగ్య మరియు విద్యా సెస్సులో పరిమితంగా విద్యకు కేటాయించారు తప్ప ఆరోగ్యానికి లేదని కాగ్‌ పేర్కొన్నది. పన్నులలో ఇస్తున్న వాటా మాదిరి సెస్‌ మరియు సర్‌చార్జీగా వసూలు చేస్తున్న మొత్తాన్ని కూడా రాష్ట్రాలు ఆయా రంగాలలో మాత్రమే ఖర్చు చేసే విధంగా కేటాయించాలి. జిఎస్‌టిని ప్రవేశపెట్టినపుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఐదు సంవత్సరాల పాటు నిర్ణీత జిఎస్‌టి మొత్తం రాష్ట్రాలకు వసూలు కానట్లయితే ఆయా సంవత్సరాలలో ఎంత తగ్గితే అంత చెల్లించేందుకు కేంద్రం జిఎస్‌టి సెస్‌ వసూలు చేస్తున్నది.

2018లో కేంద్రం లీటరుకు రెండు రూపాయల పన్ను తగ్గించి ఆ మేరకు సెస్‌ను పెంచింది. వినియోగదారుడికి ధరలో ఎలాంటి మార్పులేదు గానీ రాష్ట్రాలకు వచ్చే నిధులు తగ్గిపోయాయి. రెండు రూపాయల్లో 42శాతం అంటే లీటరుకు రూ.0.84పైసలు తగ్గింది. ఇప్పుడు పెట్రోలుకు రూ.2.50, డీజిలుకు రూ.4.00 అదే విధంగా మార్చారు దీని ఫలితంగా కాత్తగా నిర్ణయించిన 41శాతం వాటా ప్రకారం పెట్రోలు మీద రూ.1.03, డీజిలు మీద రూ.1.64 రాష్ట్రాలకు తగ్గుతుంది. ఇదే పద్దతి మిగతా సెస్‌లకూ వర్తిస్తుంది. 2017 ఏప్రిల్‌-2020 మే మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజు పన్నులో పెట్రోలు మీద సెస్‌ మరియు సర్‌ఛార్జీ 150శాతం పెంచితే, డీజిలు మీద 350శాతాన్ని పెంచింది. ఇదే సమయంలో పన్ను మొత్తాలు 69 మరియు 57శాతాలు మాత్రమే పెరిగాయి. ఇలాంటి గారడీ కారణంగా గతేడాది కరోనా సమయంలో ఏప్రిల్‌-నవంబరు మధ్య చమురు వినియోగం 18శాతం తగ్గినప్పటికీ కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఎనిమిది శాతం మాత్రమే తగ్గగా రాష్ట్రాలకు 21శాతం పడిపోయింది.కేంద్రం చేస్తున్న ఇలాంటి గారడీలే పద్నాలుగ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 32శాతం వాటాను 42శాతానికి పెంచటంలో ప్రభావం చూపాయనే అభిప్రాయం ఉంది.


కేంద్రం ఇలా రాష్ట్రాలకు తొండి చేయి చూపుతున్న మొత్తం తక్కువేమీ కాదు. ఈ తొండి బిజెపి పాలిత రాష్ట్రాలకూ జరుగుతోంది. వివిధ రకాల కేంద్ర సెస్‌లు, సర్‌ఛార్జీల మొత్తం వసూలు 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో రూ.58,797 కోట్ల నుంచి 256శాతం పెరిగి రూ.2,09,577 కోట్లకు చేరాయి. 2020-21లో జిఎస్‌టి, విద్య, ఆరోగ్య సెస్‌లు మినహా మిగిలిన సెస్‌ల మీద రూ.3,04,485 కోట్లు వస్తుందని అంచనా వేశారంటే వాటి పెరుగుదల ఎంత వేగంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.జిఎస్‌టి సెస్‌ విషయానికి వస్తే డిసెంబరు చివరి నాటికి బడ్జెట్‌ అంచనాలో 53.5శాతం రూ.59,081 కోట్లు వసూలైంది. ఐదేండ్ల పాటు వసూలైన మొత్తం నుంచి అవసరమైనపుడు రాష్ట్రాలకు పరిహారంగా చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని గడువు మీరిన తరువాత రాష్ట్రాలకు పంచాలన్నది నిర్ణయం. ఒక్క సెస్‌లే కాదు సర్‌ఛార్జీల మొత్తం కూడా రూ.31,879 కోట్ల నుంచి రూ.1,42,530 కోట్లకు పెరిగింది. 2020-21లో రూ.1,76,277 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.
కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌ఛార్జీల వైపు మొగ్గుచూపుతున్న కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల బదలాయింపు మొత్తం క్రమంగా తగ్గిపోతోంది.2019 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2020లో బదిలీ అయిన నిధుల శాతం 36.6 నుంచి 32.4కు తగ్గిపోయింది. జిఎస్‌టి ఉనికిలోకి వచ్చిన తరువాత రాష్ట్రాల పన్నుల వనరులు పరిమితం అవటంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


రానున్న ఐదు సంవత్సరాలలో 15వ ఆర్ధిక సంఘం కేటాయింపులలో తెలంగాణాకు కేంద్ర పన్ను వాటా 2.47 నుంచి 2.1శాతానికి తగ్గింపు కారణంగా ఆరువేల కోట్ల రూపాయల నష్టం జరగనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు నివేదించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విధమైన తగ్గుదల ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. కేంద్రం ఇదే మాదిరి పన్నుల స్ధానంలో సెస్‌లను పెంచుకుంటూ పోయినట్లయితే మరోసారి రాష్ట్రాల హక్కుల సమస్య ముందుకు రావటం అనివార్యం !