Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


మన పొరుగు దేశమైన మయన్మార్‌( గతంలో బర్మా అని పిలిచేవారు)లో ఫిబ్రవరి ఒకటవ తేదీన తిరుగుబాటు చేసిన మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. నవంబరు 8న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినందున నూతన పార్లమెంట్‌ను ఏర్పాటు చేయవద్దని చేసిన హెచ్చరికలను ఖాతరు చేయనందున ఏడాది పాటు అత్యవసర పరిస్ధితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాది తరువాత ఎన్నికలు జరుపుతామని విజేతలకు అధికారాన్ని అప్పగిస్తామని పేర్కొన్నది. అధికార పార్టీ ఎన్‌ఎల్‌డి నేత, ప్రధాని పదవితో సమానమైన రాజ్య కౌన్సిలర్‌గా ఉన్న అంగ్‌సాన్‌ సూకీ, అధ్యక్షుడు యు విన్‌ మైయింట్‌ తదితరులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగంపై అనేక ఆంక్షలు విధించారు. సాధారణ జనజీవితం సాఫీగానే సాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు అక్కడేం జరుగుతోందో పూర్తిగా తెలియటం లేదు.


మిలిటరీ ప్రధాన కమాండర్‌ మిన్‌ అంగ్‌ లైయింగ్‌ అధికారాన్ని చేపట్టారని మిలిటరీ టీవీ ప్రకటించింది. ఏడాదిలోపల ఎన్నికల సంస్కరణలు తీసుకు వస్తామని తరువాత ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించింది. గత నవంబరు ఎనిమిదిన జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయని మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్‌మెంట్‌ పార్టీ ఆరోపించింది. మిలిటరీ కూడా అదే ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలోనే కొత్త పార్లమెంట్‌ కొలువు తీరటాన్ని వాయిదా వేయాలని కోరామని అంగీకరించకపోవటంతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నట్లు, గత ఎన్నికలను రద్దు చేసినట్లు మిలిటరీ ప్రకటించింది. ఎన్నికల అక్రమాల ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది.


మయన్మార్‌ పరిణామాల గురించి పలు వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అక్కడ జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, విజేత జో బైడెన్‌ విజయాన్ని గుర్తించేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. బైడెన్‌ విజయాన్ని ఖరారు చేసే పార్లమెంట్‌ సమావేశం మీద జనవరి ఆరున తన మద్దతుదారులతో దాడి చేయించి ఎన్నికను వమ్ము చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ స్ఫూర్తితో మయన్మార్‌ మిలిటరీ కూడా సరిగ్గా కొత్త పార్లమెంట్‌ తొలి సమావేశమై పదవీ బాధ్యతలు చేపట్టే రోజునే తిరుగుబాటు చేసిందనే వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. తమ చర్యకు ఎన్నికల అక్రమాలే కారణమని మిలిటరీ ప్రకటించింది.


నవంబరు ఎనిమిదిన జరిగిన ఎన్నికలలో ప్రజా ప్రతినిధుల సభలోని 440కిగాను 315, జాతులకు ప్రాతినిధ్యం వహించే ఎగువ సభలోని 224కిగాను 161స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్దానాలను ఎన్‌ఎల్‌డి సాధించింది. ప్రజాప్రతినిధుల సభలో 258, జాతుల సభలో 138 సీట్లు పొంది పూర్తి మెజారిటీని సాధించింది. మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్‌మెంట్‌ పార్టీకి 26, 7 రాగా మిగిలిన స్ధానాలను చిన్న పార్టీలు పొందాయి.రాష్ట్ర, ప్రాంతీయ ఎన్నికల్లో కూడా ఎన్‌ఎల్‌డి ఇదే మాదిరి ఘనవిజయం సాధించింది.


అక్కడి రాజ్యాంగం ప్రకారం ఎన్నికలలో మయన్మార్‌ పౌరులు మాత్రమే అర్హులు. జాతీయ, రాష్ట్రాల చట్ట సభల్లో మూడోవంతు సీట్లు మిలిటరీకి రిజర్వు చేశారు. ఎన్నికల అనంతరం ఏర్పడే జాతీయ ప్రభుత్వంలో రక్షణ, సరిహద్దులు, హౌం శాఖల మంత్రులుగా మిలిటరీ నియమించిన వారే ఉండాలి. కొత్త పార్లమెంటు కొలువు తీరిన తరువాత అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులను ఎన్నుకొనేందుకు ఎలక్ట్రరల్‌ కాలేజిని ఏర్పాటు చేస్తారు. ఉభయ సభల నుంచి, అదే విధంగా మిలిటరీ నియమించిన సభ్యులతో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో కమిటీ నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. వారిలో అత్యధిక ఓట్లు వచ్చిన వారిని అధ్యక్షుడిగా, మిగిలిన రెండు కమిటీలలో వచ్చిన ఓట్లను బట్టి ఎక్కువ తెచ్చుకున్న ప్రతినిధి తొలి ఉపాధ్యక్షుడు, రెండవ ఉపాధ్యక్షుడు అవుతారు. మయన్మార్‌ జాతీయులను కాని వారిని వివాహం చేసుకున్న వారు,మయన్మార్‌ పౌరసత్వం లేని వారి పిల్లలు గానీ ఈ పదవులకు అనర్హులు. ఈ నిబంధన కారణంగా బ్రిటీష్‌ జాతీయుడిని వివాహం చేసుకున్న అంగ్‌సాన్‌ సూకీ ఎంపీగా, ఇతర పదవులను మాత్రమే చేపట్టవచ్చు తప్ప అధ్యక్షురాలయ్యే అవకాశం లేదు. ఆమె పిల్లలకు మయన్మార్‌ పౌరసత్వం లేనందున వారు కూడా అనర్హులే. ఈక్రమంలో ఎన్నికైన వారు మార్చి 21న పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అలాంటి ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని మిలిటరీ చేసిన సూచనను మెజారిటీ సీట్లు తెచ్చుకున్న ఎన్‌ఎల్‌డి తిరస్కరించి పార్లమెంటు సమావేశ నిర్వహణకు పూనుకున్నది. దీంతో తాము అధికారాన్ని హస్తగతం చేసుకున్నట్లు మిలిటరీ ప్రకటించింది.

మయన్మార్‌ చరిత్రను చూసినా దాని ప్రస్తుతం రాజ్యాంగాన్ని చూసినప్పటికీ మిలిటరీదే పైచేయిగా ఉందని చెప్పవచ్చు.1948 జనవరి నాలుగవ తేదీ బ్రిటీష్‌ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1962వరకు పౌరపాలనలో ఉంది. ఆ ఏడాది మార్చి రెండవ తేదీన తిరుగుబాటుతో మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్ధిర పరిస్ధితులు, మిలిటరీ పట్టులోనే ఉంది.1988 వరకు మిలిటరీ లేదా దాని మద్దతు ఉన్న ఏకపార్టీ పాలనే కొనసాగింది. దీనికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి అంగ్‌సాన్‌ సూకీ నాయకత్వం వహించారు. ఆమె తండ్రి అంగ్‌సాన్‌ జాతీయవాది. బర్మా కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలను ఏర్పాటు చేశారు. అధికారాన్ని అప్పగించేందుకు అంగీకరించిన బ్రిటీష్‌ ప్రభుత్వం కుట్ర చేసి స్వాతంత్య్రానికి ఆరునెలల ముందు అంగ్‌సాన్‌ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వ మంత్రివర్గ సభ్యులను మొత్తంగా సామూహికంగా హత్య చేయించింది. అంగ్‌సాన్‌ను బర్మా జాతిపితగా పరిగణిస్తారు.


1945లో జన్మించిన సూకీ తండ్రి మరణించినప్పటికీ రెండు సంవత్సరాల పసిపిల్ల. బాల్యమంతా బ్రిటన్‌లోనే గడిచింది. అక్కడే విద్యాభ్యాసం తరువాత తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన సూకీ దేశంలో ప్రజాస్వామ్యం కోసం సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. విధిలేని పరిస్ధితిలో మిలిటరీ ఎన్నికలకు అంగీకరించింది. 1990లో మూడు దశాబ్దాల తరువాత జరిగిన ఎన్నికల్లో సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి 492 స్దానాలకు 392 సాధించింది. ఆ ఎన్నికలను మిలిటరీ గుర్తించలేదు.దాని పాలనే కొనసాగింది.2010లో జరిగిన ఎన్నికలలో మిలిటరీ అనుకూల పార్టీకి అత్యధిక స్దానాలు వచ్చినట్లు ప్రకటించారు. దాన్ని ఎవరూ గుర్తించలేదు. చివరకు 2011లో మిలిటరీ ఆ ఎన్నికను రద్దు చేసింది. తరువాత అంగ్‌సాన్‌ సూకీని గృహనిర్బంధం నుంచి విడుదల చేయటంతో పాటు కొంత మేరకు మిలిటరీ చర్యలను సడలించింది.2015లో జరిగిన ఎన్నికలు స్వేచ్చగా నిర్వహించటంతో అంగ్‌సానీ సూకీ నాయకత్వంలోని పార్టీ అధికారానికి వచ్చింది.ఆమె దేశపాలనా పగ్గాలు చేపట్టేందుకు అనర్హురాలు కావటంతో 2016లో ప్రధానితో సమానమైన రాజ్య కౌన్సిలర్‌ అనే పదవిని సృష్టించి ఆమెను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి తాజాగా అరెస్టు అయ్యేంతవరకు దానిలో కొనసాగుతున్నారు.

తాజాగా జరిగిన పరిణామాలు మయన్మార్‌ ప్రజాస్వామ్య ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి జనంలో నిరసన వ్యక్తం అయినట్లు తెలియదు, అయితే మిలిటరీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తారని చెప్పలేము. ప్రభుత్వ టీవి ప్రసారాలను మిలిటరీ నిలిపివేసింది. రాజ్యాంగం ప్రకారం ఒక ఏడాది పాటు మాత్రమే అత్యవసర పరిస్ధితి విధించేందుకు అవకాశం ఉంది. మిలిటరీ అధిపతికి ఆమేరకు ఏడాది పాటు మిలిటరీ, న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు దఖలు పడ్డాయి. ప్రస్తుతం మిలిటరీ ప్రతిపాదించిన ఉపాధ్యక్షుడు మిలిటరీ మాజీ జనరల్‌ అయిన యు మియింట్‌ స్వే ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. నూతన ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసి కొత్తగా ఎన్నికలను నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.


అంతర్గతంగా తలెత్తిన సమస్యలను బయటి జోక్యం లేకుండా మయన్మార్‌ పరిష్కరించుకోగలదని చైనా వ్యాఖ్యానించింది. సరిహద్దుతో పాటు వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న మయన్మార్‌ పరిణామాల మీద ఆచితూచి వ్యాఖ్యానించింది. తక్షణమే మిలిటరీ తన అధికారాన్ని వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ డిమాండ్‌ చేశారు. లేనట్లయితే తీవ్రమైన కొత్త ఆంక్షలను విధిస్తామని హెచ్చరించారు.మయన్మార్‌లో జరిగిన పరిణామాలకు చైనా మద్దతు ఉన్నట్లు చిత్రించే యత్నం కనిపిస్తోంది. మూడు వారాల క్రితం మిలిటరీ కమాండర్‌ ఒకరు చైనా ప్రతినిధి వాంగ్‌ ఇతో మయన్మార్‌ రాజధానిలో సమావేశమయ్యారని, ఒక వేళ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తే తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు, నవంబరుఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నివేదించారనే వార్తలు వచ్చాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో అమెరికా నాయకత్వంలో జపాన్‌, ఆస్ట్రేలియా, మన దేశమూ క్వాడ్‌పేరుతో వివాదపడుతున్న విషయం తెలిసిందే. మయన్మార్‌ ఒక కీలక ప్రాంతంలో ఉన్నందున అక్కడ జరిగే ప్రతిపరిణామానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపధ్యంలో పశ్చిమ దేశాలు, వాటి కనుసన్నలలో నడిచే మీడియా ఇచ్చే వార్తల పట్ల జాగ్రత్త వహించటం అవసరం.