డాక్టర్ కొల్లారాజమోహన్
రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్స్ పెరేడ్ లో లక్షకు పైగా ట్రాక్టర్లతో , అంతకుమించిన సంఖ్యలో రైతులు ప్రశాంతంగా పాల్గొని అపూర్వ ప్రదర్శన చేశారు. రైతువ్యతిరేక చట్టాలను రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ నగర వీధులలో కదం తొక్కారు. ఢిల్లీ నగరవాసులు ఈ అపూర్వ ప్రదర్శనకు సంఘీభావంగా పూలవర్షం కురిపించారు. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినప్పటినుండీ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేష్, రాజస్ధాన్, బీహార్ లలో తీవ్ర స్ధాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఉద్యమం ఏఒక్క రైతు సంఘమో లేక ఏ ఒక్కరి నాయకత్వం కాకుండా 500 రైతుసంఘాలన్నీ సమైక్యంగా పోరాడుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులలో ఎముకలు కొరికే చలి ని ఎదుర్కొంటూ, రోడ్డు పై గుడారాలలో 2 నెలలుగా చేస్తున్నఆందోళనను ప్రభుత్వం ఆలకించనందున, ప్రభుత్వం పై వత్తిడి తేవటానికి రిపబ్లిక్ దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్లతో మహా ప్రదర్శన తలపెట్టారు. ఈ మహా ప్రదర్శనను విఫలం చేయడానికి, ఉద్యమాన్ని విచ్చిన్నం చేయటానికి ప్రభుత్వం పన్నిన కుట్రలను కుతంత్రాలను రైతాంగం అడుగడుగునా తిప్పికొట్టింది. జనవరి 26 న వివిధ రాష్ట్రాల రాజధానులలో, జిల్లా కేంద్రాలలో భారీ ప్రదర్శనలు జరిగాయి.
రిపబ్లిక్ డే ట్రాక్టర్స్ పెరేడ్ ను అప్రతిష్టపాలు చేయటానికి ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనకు చాలా ఎక్కువ ప్రచారంచేశారు. ట్రాక్టర్లను సామూహిక విధ్వంస ఆయుధాలుగా ”టైమ్స్ ఆఫ్ ఇండియా” పత్రిక చిత్రించింది. ట్రాక్టర్ లు ఎక్కడా విధ్వంసానికి పాల్పడలేదు. రోడ్లను ధ్వంసం చేయలేదు. ప్రభుత్వ సంస్ధలను, ప్రైవేటు సంస్ధలను ఎక్కడా తాకలేదు. అల్లర్లను, భయోత్పాతాన్ని స ష్టించలేదు. పౌరుల ఆస్దులను ధ్వంసం చేయలేదు. దొంగిలించలేదు. అనుమతించిన మార్గాలలో కూడా రైతులు ఢిల్లీ లోకి రాకుండా బారికేడ్డ్లను ఎందుకు పెట్టారు ?. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్డ్లను తొలగించటానికి ట్రాక్టర్లను ఉపయోగించారు. వారు హింసాత్మకంగా వుంటే ప్రజలు పువ్వులతో స్వాగతించేవారా ?
దీప్ సింగ్ సిధ్దు ఎవరు?
రిపబ్లిక్ డే ట్రాక్టర్స్ పెరేడ్ ను అప్రతిష్టపాలు చేయాలని ఫ్రభుత్వం ప్రయత్నించింది. సినీ నటుడు, గాయకుడు ఐన దీప్ సింగ్ సిద్దును సాధనంగా ఎన్నుకున్నారు. బీజేపీ యమ్ పీ. సన్నీ డయోల్ కి దీపు సిద్దు సన్నిహితుడు. 2019 ఎన్నికలలో సన్నీ డయోల్ గెలుపు కోసం క షిచేశాడు. ప్రధానమంత్రి మోడీ గారితో ఫొటోలు దిగేటంత సాన్నిహిత్యం వుంది. ”ఆందోళనకారులను రెచ్చగొట్టి దారి తప్పించి ఎర్రకోట వైపు నడిపించాడు ” అని హర్యానా బీకేయూ నాయకుడు గుర్నామ్ సింగ్ ఛాదుని అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి సన్నిహితుడైన బీజేపీ సభ్యుడొకరు ఏజెంట్ ప్రొవోకేటర్ గా ఎర్రకోట వద్ద అల్లర్లను రెచ్చగొట్తున్న వార్తను పరిశీలించమని ఉదయం 10 గంటలకే ట్విట్టర్ లో రాజ్యసభసభ్యులు శ్రీ సుబ్రమణ్యస్వామి గారు పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే పెరేడ్ పూర్తయిన తరువాత రైతుల ట్రాక్టర్ రాలీ ప్రారంభంకావాలని రైతు సంఘాలన్నీ అంగీకరించాయి. మార్గాన్ని కూడా నిర్దేశించాయి. సింఘూ సరిహద్దు వద్ద నుండి నిర్దేశించిన సమయానికన్నా ముందే, ఉదయం 8గంటలకే దీప్ సింగ్ సిద్దూనాయకత్వాన ఒక చిన్న బ ందం బయల్దేరింది. నిర్దేశించిన మార్గాన్ని వదిలేసి ఎర్రకోట వైపు దూసుకెళ్ళారు. కిసాన్ సంయుక్త కమిటీ వద్దని నివారించినా వారిమాటను వినలేదు.ఎర్రకోట వైపు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు ముందురాత్రే తెలుసు. అయినాపోలీసులు వారిని నివారించే ప్రయత్నాలు చేయలేదని యోగేంద్రయాదవ్ తెలిపారు. రైతుల ట్రాక్టర్ రాలీలకు అడుగడుగునా అడ్డంకులను సృష్టించిన పోలీసులు దీపు సిద్దూ బ ందానికి ఎర్రకోటకు దారి చూపారు. ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ఎర్రకోట వైపు దూసుకెళ్ళారు. జాతీయ జెండాకు దగ్గరలో ఒక మతానికి చెందిన నిషాన్ జెండాను ఎర్రకోటపై ఎగరేశారు.టీవీ ఛానల్స్ జెండా ఎగరవేసిన ఘటనను పదే పదే చూపించాయి. ఈ ఘటన జరిగే సమయంలో అక్కడనే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మిలిటరీ, పారామిలిటరీ దళాల నిరంతర పర్యవేక్షణ క్రింద వుండే ఎర్రకోటను ఎక్కి, ఒక జెండాను ఎగరవేయటానికి ముందే అనుమతిని పొందారా ? లేక ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇలా చేశారా? అనేది చర్చనీయాంశం. వారి తప్పు లేకపోయినా రైతుసంఘాల సమన్వయ సమితి నైతిక బాధ్యత వహించింది. ఎర్రకోట సంఘటన మినహాయించి మరెక్కడా చెప్పుకోదగ్గ ఘటనలు జరగలేదన్న సంగతి గుర్తించాలి.
మంచి నీరు, కరెంటు, ఇంటర్నెట్, ట్విట్టర్ అకౌంట్లను ఆపేశారు. కర్రలతో, రాళ్ళతో దాడులు చేసినా ఉద్యమాన్ని ఆపలేకపోయారు. రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ల పెరేడ్ విజయవంతం కావటం ఒక చారిత్రాత్మక ఘటన. రైతాంగ ఆందోళనను అప్రతిష్ట పరచటానికి ఎర్రకోట ఘటనను సాకుగా ఛూపించిన మీడియా కొంతమందిని గందరగోళపరచగల్గింది. త్రివర్ణ పతాకాన్ని తొలగించారనే తప్పుడు వార్తలు కూడా ప్రచారమయ్యాయి. లక్షలాదిమంది రైతుల ప్రదర్శనను మీడియా చూపలేదు. సోషల్ మీడియా ద్వారా రైతులు కొన్నివార్తలనందుకున్నారు. క్రమశిక్షణ తో విజయవంతంగా చేసిన రైతుల ప్రదర్శనను చూసి కేంద్ర ప్రభుత్వ కళ్ళు తిరిగాయి. చర్చలకు స్వస్తిచెప్పి సామ దాన బేధ దండోపాయాలలో చివరి అస్త్రాన్ని ఉపయోగించ పూనుకున్నారు. దాడులు, అరెస్టులు, కేసులు మొదలుపెట్టారు. శిబిరాలలో ఉన్నవారికి కనీస సౌకర్యాలు అందకుండా చేస్తున్నారు.రైతు ఉద్యమకారుల శిబిరాలపై దాడులు చేసి గుడారాలను ధ్వంసం చేస్తున్నారు. సైనికుల కవాతులను నిర్వహిస్తున్నారు. ఆందోళనకారులను భయభ్రాంతులను చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఎర్రకోటవద్ద జరిగిన ఘటనలపై 44 మంది రైతు నాయకులపై దేశద్రోహ కేసులను బనాయించారు. రైతులు నివసిస్తున్న సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు ఆపేశారు. మంచి నీటి వాహనాలను కూడాఆపేశారు. అర్ధరాత్రిలోగా ఖాళీచేయాలంటూ అల్టిమేటంను ప్రభుత్వ అధికారులు జారీ చేశారు. అక్కడినుండి వెళ్ళిపోని పక్షంలో తామే తొలగిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించాడు.ప్రజలు గుమికూడకుండా సెక్షన్ 144 విధించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారు. మూడు సరిహద్దుప్రాంతాలలో ఇంటర్నేట్ ను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆపేసింది. రైతులు సమాచారాలను పంచుకోవటానికి వీలులేకుండా ఇంటర్నెట్ కట్ చేశారు. ప్రవాహంగా వస్తున్న రైతులు రాకుండా సింఘూ వద్ద ప్రభుత్వం బారికేడ్లతోపాటు ముళ్ళకంచె వేసి తాత్కాలికంగా గోడను నిర్మిస్తున్నారు.ప్రజలు అందోళనా ప్రాంతాలకు రాకుండా రైళ్లను దారి మళ్ళించారు. రైతులను, జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారు.
స్ధానికుల పేరున గూండాల దాడి- బీబీసీ ప్రత్యక్ష కధనం.
స్ధానికుల పేరున కొంతమంది వాహనాలలో తరలివస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. పోలీసుల కళ్ళముందే గుడారాలను పీకేస్తుంటే నివారించటానికి ప్రయత్నించలేదు. పైగా రైతులపై లాఠీఛార్జి చేశారు. స్ధానికుల పేరున వచ్చిన బీజేపీ కార్యకర్తలు రాళ్ళతోనూ కర్రలతోనూ రైతులపై దాడిచేశారు. రైతులు వారి ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రతిఘటించారు. అయినా నాయకుల మాటలు విని ప్రశాంతంగా దెబ్బలు తిన్నారు. ఆందోళనను ఎట్టిపరిస్ధితులలోనూ విరమించేది లేదని తేలిó చెప్పారు.
. సింఘూ ప్రాంతాన్ని సందర్శించిన బీబీసీ ప్రతినిధి దిలీప్ సింగ్ టిక్రీ గ్రామస్ధులతో మాట్లాడాడు. ” మరి వాళ్ళు నిజంగా స్దానికులేనా? అని అడిగితే .. ఈ రోజు వచ్చిన వాళ్ళంతా బీజేపీ పంపించిన గూండాలే” అని గ్రామస్ధులు చెప్పారు. ” ఉద్యమం శాంతియుతంగా సాగుతోంది. క్రమశిక్షణతో సాగుతోంది. స్ధానికులు వ్యతిరేకిస్తున్నారనేది అబద్ధం. టిక్రీ గ్రామ పంచాయితీ ప్రజలందరూ వచ్చి మద్దతు ప్రకటించి వెళ్ళారు.ఏది అవసరమయినా మేమున్నామని టిక్రీ గ్రామంరైతులు హామీ ఇచ్చి వెళ్ళారు. ఇప్పటికి 51 వేల రూపాయలు విరాళంఇచ్చారు. ఇంకా పాలు, లస్సీ ,డబ్బులు, ఏది కావాలన్నా సేకరించి ఇస్తామన్నారు. చుట్టుపక్కలగ్రామాల ప్రజలకు ఈ ధర్నాతో ఎలాంటి సమస్యా లేదు. తాము పస్తులుండైనా సరే ,రోడ్డుపక్కన పూరిగుడెసెలలో వుండే పేదలకు మూడుపూటలా అన్నందొరికేలా చూస్తున్నారు.ఈ నల్లచట్టాలను వెనక్కి తీసుకునేంతవరకూ రైతులు వెనక్కి వెళ్ళరు. మేంకూడా వెనక్కి వెళ్ళేదిలేదు.” అని ఒక పెద్దాయన చెప్పాడు. ” నేను రైతు బిడ్డను. కొందరు జాతీయజెండాలను పట్టుకు రావటం కనిపించింది.ఇందులో మాప్రాంతం వారు ఎవరున్నారో చూద్దామని అక్కడకు వెళ్ళాను. అక్కడ బీజేపీ కార్యకర్త గజేంద్రసింగ్ కన్పించాడు. నీకు సిగ్గు అనిపించటంలేదా నువ్వు ఈ ప్రాంతం వాడివికూడాకాదు,ద్వారకా వాడివి, రైతువి కాదు , ప్రాపర్టీ డీలర్ వి కదా? చెడగొట్టటానికే వచ్చావా? అని అతనిని మందలించాను.అంతలో ఒక యువకుడు నేను గేవ్రా గ్రామంవాడినన్నాడు..అబద్ధం చెప్పకు ఈప్రాంతంలో ప్రతి ఒక్కవ్యక్తీ నాకు తెలుసు అన్నాను.ఈ ప్రాంతం వాళ్ళు ఒక్కళ్ళుకూడాలేరు. ఉంటే చూపండి అని సవాల్ చేశాను.ఈ మోసాలు సాగవు. మేం సహించము అని హెచ్చరించాను” అని ఒక స్థానిక రైతు చెప్పాడు. మరొక మహిళ ఇలా చెప్పింది,”ఎవరికీ ఏసమస్యాలేదు. ఉద్యమంవలన ఎవరూ ఇబ్బందిపడటంలేదు. ఇక్కడ టిక్రీ, లేకారాం పార్క్,మమా చౌక్, చోటూరామ్ నగర్,గ్రామాలన్నీ మార్కెట్ కోసం ఇక్కడికే వస్తురీంటారు. కానీ ఈ గ్రామాలలో ఎవరికీ ఇబ్బందిలేదు” అని ఆమెచెప్పింది
ఘాజీపూర్ బోర్డర్ -బీ బీ సీ. వార్త
ఘాజీపూర్ బోర్డర్ లో ధర్నా ఎలా కొనసాగుతోందో బీబీసీ ప్రతినిది సమీర్ ఆత్మ మిశ్రా ఇలా వివరించారు.
” గురువారం ఘాజీపూర్ బోర్డర్ లో రైతులను ఖాళీ చేయించటానికి అధికారయంత్రాంగం ప్రయత్నించింది. రాకేష్ తికాయత్ పైకేసు నమోదయంది. అరెస్టుకావటానికి కూడా తయారయ్యారు.” స్ధానికులపేరున కొంతమందిని తెచ్చి ఖాళీచేయించ ప్రయత్నంపై తికాయత్ ఆవేదన పొందారు. మంచినీటిని కూడా ఆపేశారు. దానికి స్పందనగా రాకేష్ తికాయత్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ”మావూరునుండి మంచినీరు వచ్చిందాకా మంచినీరు ముట్టనని ” శపధం చేసి, నిరాహార దీక్షకు కూర్చున్నారు. అప్పటికపుడు మహాపంచాయత్ నిర్వహణకు పిలుపునిచ్చారు. ముజఫర్పూర్ లో రైతు సంఘాల నేతలు రైతులతో మహా పంచాయతీ నిర్వహించారు. ఢిల్లీకి 150 కి మీ దూరంలో వున్న ఈ ప్రాంతం రైతాంగఉద్యమాలకు పెట్టని కోట. రైతునేత మహేంద్ర తికాయత్ స్వస్ధలం సిసోలీ గ్రామం. మహేంద్రతికాయత్ కుమారుడు నరేష్ తికాయత్ బీకేయూకి అధ్యక్షుడిగా వున్నాడు. రాకేష్ తికాయత్ మరొక కుమారుడు. ఇద్దరూ ప్రస్తుతం రైతు ఉద్యమంలో భారత్ కిసాన్ యూనియన్ కి నాయకత్వం వహిస్తున్నారు.ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని మహా పంచాయత్ నిర్ణయం తీసుకున్నది. మీరట్, షామ్లీ, షాహన్పూర్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ల లోని రైతులందరూ ఘాజీపూర్ సరిహద్దు లో జరుగుతున్న ధర్నా లో ఇక పై ప్రతిరోజూ పాల్గొనాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని, ప్రతి ఇంటినుంచీ ధర్నాలో పాల్గోవాలని నిర?యమైంది. ధర్నా ముగిసిపోయినట్లు కనిపించిన స్ధలం ప్రజలతో కిటకిట లాడుతోంది. నినాదాలతో హౌరెత్తిపోతోంది.ప్రధాన రోడ్డులకు అడ్డంగా బస్సులు నిలిపారు. పోలీసులకు ఇనుప లాఠీలను సరఫరా చేస్తున్నారు. అయినా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ల తోపాటుగా ఉత్తరప్రదేశ్ రైతులు తికాయత్ సోదరుల నాయకత్వాన ఉద్యమం లోకి ఉరుకుతున్నారు. పంజాబ్- హర్యానా లనుంచి ప్రయాణించే పంజాబ్ మెయిల్ తో సహా రెండు రైళ్ళను దారి మళ్ళించారు.
అధికారుల వేధింపులకు, నిర్భంధాలకు నిరసనగా , కనీస మద్దతు ధర కావాలనీ, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ దేశవ్యాప్తంగా ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలనుండి 3 గంటలవరకు రహదారులను దిగÄంధించాలని రైతుసంఘాల సమన్వయ సంఘం పిలిపునిచ్చింది. ప్రజలందరూ పాల్గొన ప్రార్ధన.
వ్యాసరచయిత డాక్టర్ కొల్లారాజమోహన్, నల్లమడ రైతు సంఘం, గుంటూరు.