Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


రైెతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ శివార్లలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శాశ్వత ఆటంకాలు(బారికేడ్లు), ముళ్ల కంచెలు, గోడలు, రోడ్ల మీద ఇనుప ముళ్ల ఏర్పాట్లను చూస్తుంటే వారితో తాడోపేడో తేల్చుకొనేందుకే నరేంద్రమోడీ సర్కార్‌ సన్నద్దం అవుతున్న భావన కలుగుతోంది. అంతకు తెగిస్తారా ? రాజకీయ వ్యాపార లాభ నష్టాలను బేరీజు వేసుకొని తాత్కాలికంగా వెనక్కు తగ్గుతారా ? ముందుకు పోతే రాజకీయంగా రోజులు దగ్గర పడతాయి. వెనక్కు తగ్గితే మరిన్ని ఉద్యమాలు ముందుకు వస్తాయి. నరేంద్రమోడీ సంస్కరణల పులిని ఎక్కారు, ఏం చేస్తారో, ఏం జరగనుందో చూద్దాం !


గోముఖ వ్యాఘ్రాల నిజస్వరూపం అసలు సమయం వచ్చినపుడే బయటపడుతుంది. ఇక్కడ గోవు ప్రస్తావన తెచ్చినందుకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షంతవ్యుడను. గోముఖ వ్యాఘ్రం అనే పదాన్ని సృష్టించిన వారికి వీరతాళ్లు వేస్తారో లేక మరణానంతరం దేశద్రోహ నేరం కింద శిక్షించమని సిఫార్సు చేస్తారో వారిష్టం. గోముఖ వ్యాఘ్రాల గురించి చెప్పటానికి ఈ పదం తప్ప ఆత్మనిర్భరత లేదా మేకిన్‌ ఇండియా, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ వంటి పదాలను సృష్టించిన వారు ప్రత్యామ్నాయం చూపేంత వరకు దాన్ని ఉపయోగించక తప్పటం లేదు.


ఆవులను మోసం చేసేందుకే వ్యాఘ్రాలు గోముఖాలతో వస్తాయి. ఇప్పుడు రైతులనే ఆమాయకులను మోసం చేసేందుకు అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అదే. అన్నీ మీరే చేశారు అని కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నట్లుగానే అన్నీ రైతుల కోసమే అనేట్లుగా రైతు ఉద్యమ నేపధ్యంలో బడ్జెట్‌ ప్రసంగం, భాష్యాలు సాగాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోత పెట్టటం ఒకటైతే పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం, ఇతర దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ది సెస్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతుల ఉత్పత్తులకు అధిక ధరలు వస్తాయని ఆర్ధిక మంత్రి చెప్పారు. మరొకటి వచ్చే ఏడాదిలో రూ.16.5లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు నిర్మలమ్మ చెప్పారు. చాలా మంది దీన్ని బడ్జెట్‌ కేటాయింపు అనుకున్నారు. బడ్జెట్‌ మొత్తమే 34.83లక్షల కోట్లయితే దానిలో దాదాపు సగం రైతులకు రుణాలుగా ఇస్తారా ? బ్యాంకుల నుంచి ఇప్పించే అప్పులు మాత్రమే అవి. మాట్లాడే మేక అంటూ ఎలా బురిడీ కొట్టిస్తారో అందరికీ తెలిసిందే. ఏప్రిల్‌ తరువాత వచ్చే నెల ఏదీ-జూన్‌కు ముందు వచ్చే నెల ఏదీ అని అడిగి మేకను గిల్లిలే ” మే ” అని అరుస్తుంది.రైతుల ఆదాయాలు పెంచే యత్నంలో భాగంగా ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులను జాతీయం చేసినప్పటి నుంచి రైతులకు ఇస్తూనే ఉన్నారు, అవేవీ రైతుల ఆదాయాలను పెంచలేదు. గత సంవత్సరం పదిహేను లక్షల కోట్లుగా నిర్ణయించారు, అంతకు ముందు పదమూడున్నర లక్షల కోట్లు ఉంది. ఈ లెక్కన శాతాల్లో చూస్తే వచ్చే ఏడాది తగ్గినట్లా – పెరిగినట్లా !


ఎంతైనా నిర్మలమ్మ తెలుగింటి ఆడపడుచు కనుక తక్కువే అని చెప్పి ఆమెను తప్పుపట్టదలచ లేదు. అధికారులు రాసి ఇచ్చింది చదువుతారు తప్ప ఆమె రాసి ఉండరు అనుకోవాలి. రైతులకు చేకూర్చిన ప్రయోజనాల గురించి నిర్మలా సీతారామన్‌ చాలా కబుర్లు చెప్పారు. బహుశా రాత్రి ఇంటికి వెళ్లి ఇదేంటబ్బా ఇలా మాట్లాడాను అనుకొని ఉంటారు. ఎందుకంటే గతంలో మాదిరి ప్రసంగం చదువుతుంటే బల్లలు చరచటాలు, ఆహా ఓహౌ అంటూ అధికార పక్ష ప్రశంశలూ లేవు. గతేడాది కంటే మొత్తం బడ్జెట్లో పెంపుదల కేవలం 33వేల కోట్ల రూపాయలు మాత్రమే. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ బడ్జెట్‌ తగ్గుతుంది అనే ఊహ ఆమెకు నిద్రను దూరం చేసి ఉండాలి.

స్వామినాధన్‌ కమిషన్‌ నివేదికను గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేస్తే తాము బయటకు తీసి అమలు జరిపామని బిజెపి వారు చెబుతున్నారు. ఎంత మోసం !! ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ దాన్ని అమలు జరపలేమంటూ సుప్రీం కోర్టుకు నివేదించిన విషయం జనం మరచి పోతారా ? 2019-20 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 130వేల కోట్లు చూపి ఖర్చు చేసింది రూ.94,251 కోట్లు మాత్రమే. గత ఏడాది 134వేల కోట్లు చూపి దాన్ని 117వేలకోట్లకు సవరించారు. తాజా బడ్జెట్‌లో 123వేల కోట్లను చూపి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ప్రధాని కిసాన్‌ నిధి పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇస్తున్నదానిని పదివేలకు పెంచుతారనే లీకు వార్తలు వచ్చాయి. దానికి బదులు గత ఏడాది ఉన్న 75వేల కోట్ల బడ్జెట్‌ను 65వేలకు కుదించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పది వేల కోట్లు పెంచారని జబ్బలు చరుచుకున్నారు బానే ఉంది మరి ఈ తగ్గింపు సంగతేమిటి ? కొత్తగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి 900 కోట్లు కేటాయించామని చెబుతూనే వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పధకానికి 1700 కోట్లు, ధరల స్ధిరీకరణ నిధికి 500 కోట్ల కోత పెట్టారు. మొత్తంగా చూసినపుడు వ్యవసాయ సంబంధ బడ్జెట్‌ మొత్తాలను 8.5శాతం తగ్గించినట్లు తేలింది. అయినా రైతులకు ఎంతో మేలు చేశామని ప్రసంగంలో ఊదరగొట్టారు. నిజానికి వ్యవసాయ లేదా గ్రామీణ మౌలిక సదుపాయాల నిధులు కొత్తవేమీ కాదు, గతంలో ఉన్నవే. వాటి ద్వారా రైతులకు కలిగించిన లబ్ది ఏమిటో చెప్పరు.

కనీస మద్దతు ధరల కొనుగోలు ద్వారా రైతులకు 2020-21లో 2.47లక్షల కోట్లు చెల్లించామని ఆర్దిక మంత్రి గొప్పగా చెప్పారు.ఉత్తిపుణ్యానికే చెల్లించారా ? వరి, గోధుమలను తీసుకొని వాటికేగా చెల్లించారు. దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటారా ? ఫసల్‌ బీమా యోజన ఎంత మందికి కల్పించారని కాదు, ఎంత మందికి ఉపయోగపడిందనన్నది ముఖ్యం.2018-19లో 5.76 కోట్ల మందికి కల్పించామని చెప్పారు. మరుసటి ఏడాది లబ్దిదారులు 2.15 కోట్లన్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో లబ్దిపొందింది 70లక్షల మంది అని ఆర్ధిక సర్వేలో చెప్పారు. కిసాన్‌ నిధి కింద సన్న, చిన్నకారు రైతులు 9.43కోట్ల మంది ఆరువేల రూపాయల చొప్పున పొందారని చెబుతున్నారు. అంటే బీమా పధకం ఎంత మందికి ఉపయోగపడుతున్నదో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు.ధాన్యసేకరణ ద్వారా లబ్ది పొందింది 2.2 కోట్ల మంది అన్నారు. ఇవన్నీ చెబుతున్నదేమిటి ? ప్రచారం ఎక్కువ ప్రయోజనం తక్కువ అనే కదా ! వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి లక్ష కోట్లు, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల నిధి పదిహేను వేల కోట్ల రూపాయలు కరోనా ఉద్దీపన పేరుతో ఇప్పటికే ఉంది. దాన్నుంచి రుణాలుగా సూత్రరీత్యా మంజూరు చేసిన మొత్తం జనవరి నాటికి రూ.2,991 కోట్లు మాత్రమే.


భారత ఆహార సంస్ద(ఎఫ్‌సిఐ)కి జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి(ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) నుంచి రుణం తీసుకోవటాన్ని నిలిపివేస్తున్నామని ఆర్దిక మంత్రి తన ప్రసంగంలో ప్రకటించారు. ఇదేమీ విప్లవాత్మక నిర్ణయం కాదు. అసలు ప్రభుత్వ నియంత్రణ, నిధులతో నడిచే సంస్ద మరొక ప్రభుత్వ సంస్ద నుంచి రుణం తీసుకోవాల్సిన అగత్యం ఏమి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అతి పెద్ద సంస్కరణగా కార్పొరేట్‌ ప్రతినిధులు వర్ణించారు. నిజమే వారి లెక్కలు వారికి ఉన్నాయి. మనకు అర్ధం కావాల్సింది ఏమిటి ? ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ విధించిన షరతుల్లో భాగంగా రుణాలు, ద్రవ్యలోటు వంటి అంశాలకు సంబంధించి పరిమితులు విధించారు. వాటిని తప్పించుకొనేందుకు దొడ్డి దారులు వెతికారు. ప్రభుత్వ రుణాల మొత్తాన్ని తక్కువగా చూపేందుకు గాను ప్రభుత్వ సంస్ధలు తీసుకొనే రుణాలను విడిగా చూపుతున్నారు. రెండవది ఈ రుణం, దానికయ్యే ఖర్చును చూపి ఎఫ్‌సిఐని అసమర్ధమైందిగా చిత్రించి దాన్ని వదిలించుకొనే ఎత్తుగడ దీని వెనుక ఉంది. ఎఫ్‌సిఐలో అవినీతి లేదని కాదు, ఆ మాటకు వస్తే పోలీసు, మిలిటరీ కొనుగోళ్లలోనే అవినీతి జరుగుతోంది.


ఎఫ్‌సిఐ సేకరించే ఆహార ధాన్యాలు, పప్పు, నూనె గింజలను ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ ధరలకు వినియోగదారులకు అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీ మొత్తాలతో పాటు సంస్ధ నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆహార సబ్సిడీ పేరుతో ప్రతి ఏటా అందచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మొత్తాలను సకాలంలో విడుదల చేయని కారణంగా ఎఫ్‌సిఐకి నిధుల సమస్య ఏర్పడింది. దాంతో అవసరమైన మొత్తాలను తాత్కాలిక సర్దుబాటుగా ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ నుంచి రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సకాలంలో, పూర్తిగా సబ్సిడీ మొత్తాలను విడుదల చేయని కారణంగా బకాయిల మొత్తం పెరిగిపోయింది.ఈ మొత్తాలపై 8.8శాతం వడ్డీ చెల్లించాలి. ప్రభుత్వ చేతగాని తనం కారణంగా ఈ భారాన్ని కూడా జనానికి ఇచ్చే ఆహార సబ్సిడీ ఖాతాలో చూపుతున్నారు.2019-20 సంవత్సరానికి ఎఫ్‌సిఐకి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.3,17,905 కోట్లకు చేరింది. దీనికి గాను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.75వేల కోట్లు మాత్రమే.2020మార్చి 31నాటికి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌కు ఎఫ్‌సిఐ చెల్లించాల్సిన రుణం రు.2,54,600 కోట్లు. ఈ రుణానికి హామీదారు ప్రభుత్వమే అయినా ఈ మొత్తం ప్రభుత్వ రుణఖాతాలో కనిపించదు.2020-21బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ద్రవ్యలోటు మొత్తం రూ.7.96లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అయితే అప్పటికి ఎఫ్‌సిఐ అప్పు రూ.3,08,680 కోట్లుగా ఉన్నప్పటికీ బడ్జెట్‌లో సబ్సిడీ పేరుతో ప్రతిపాదించింది రూ.1.16లక్షల కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రుణం లేదా ద్రవ్యలోటులోనూ చూపలేదు. ద్రవ్యలోటును ప్రభుత్వం అప్పులు చేయటం లేదా అదనపు కరెన్సీ ముద్రించటం ద్వారా పూడ్చుకొంటుంది. గతేడాది కరోనా కారణంగా ద్రవ్యలోటు పైన పేర్కొన్న రూ.7.96 నుంచి 18.49లక్షల కోట్లకు పెరిగింది. కరోనా సహాయచర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందచేసిన ఉచిత ఆహార ధాన్యాల కారణంగా ఎఫ్‌సిఐ సబ్సిడీ మొత్తం 2020-21లో పాతబకాయిలతో సహా రూ.4,22,618 కోట్లకు పెరిగింది. దీన్ని 281 శాతం పెరపుదలగా గొప్పగా చెప్పుకున్నారు. 2021-22 బడ్జెట్లో ఎఫ్‌సిఐ సబ్సిడీగా రూ.2,06,616 కోట్లను ప్రతిపాదించారు.

ఆర్ధిక మంత్రి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ రుణాలకు స్వస్ధి చెబుతున్నామని ప్రకటించటం వెనుక అప్పులన్నీ ఒక్కసారిగా తీర్చివేసి భారాన్ని తగ్గించటం అనుకుంటే తప్పులో కాలేసినట్లే ? రాబోయే రోజుల్లో ఎఫ్‌సిఐ సిబ్బందిని గణనీయంగా తగ్గించి ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ బాధ్యతను ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించబోతున్నారు. తెలివి తక్కువ వాడు ఇల్లు కట్టుకుంటాడు – తెలివిగల వాడు ఆ ఇంట్లో అద్దెకు ఉంటాడన్న లోకోక్తిని ఇక్కడ అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన గోడవున్లను తక్కువ అద్దె రేట్లకు ప్రయివేటు వారికి అప్పగించనున్నారు. ఈ చర్య ద్వారా మిగిలే మొత్తంతో రైతులను ఉద్దరిస్తామని చెబుతారన్నది తెలిసిందే.

ఎఫ్‌సిఐ బకాయిలను తీర్చి దాన్నే పెద్ద సాయంగా చెప్పినట్లుగానే ఎరువుల సబ్సిడీని కూడా గొప్పగా చిత్రించారు. గత బడ్జెట్‌లో చూపిన రూ.71,309 కోట్లను రూ.1,33,947 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. మరి అంతపెంచిన వారు తాజా బడ్జెట్లో రూ.79,530 కోట్లకు ఎందుకు తగ్గించినట్లు ? పాత బకాయిలు తీర్చారు తప్ప బడ్జెట్‌ను పెంచలేదు. గత ఏడు సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ 70-80వేల కోట్ల మధ్యనే ఉంటోంది. భారత ఆహార సంస్ధను వదిలించుకొనే చర్యల్లో భాగంగానే దానికి ఉన్న అప్పులన్నీ తీర్చేందుకు పెద్ద మొత్తంలో గతేడాది బడ్జెట్లో కేటాయించారు. అదే బాటలో ఎరువుల సబ్సిడీ విధానంలో కూడా పెద్ద మార్పును తలపెట్టారు. అందుకే కంపెనీలకు పాతబకాయిలను పూర్తిగా చెల్లించారు. ఇప్పుడు రైతులు ఎంత వినియోగిస్తే అంత మేరకు సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం రాబోయే రోజుల్లో భూయజమానులకు నేరుగా సబ్సిడీ మొత్తాలను భూమిని బట్టి వారి ఖాతాల్లో వేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది కొన్ని రాష్ట్రాల రైతాంగం మీద పెనుభారం మోపుతుంది. కౌలురైతులకు మొండి చేయి చూపుతుంది. ఎరువుల వాడకం తక్కువగా ఉన్న రైతులకు- ఎక్కువగా ఉన్నవారికీ ఒకే రకంగా పంపిణీ అవుతుంది. పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హెక్టారుకు సగటున 224.5కిలోల ఎరువులు(2018-19) వాడగా ఒడిషాలో 70.6, కాశ్మీరులో 61.9కిలోలు మాత్రమే ఉంది. అందువలన అందరికీ ఒకే పద్దతి అయితే పంజాబ్‌, హర్యానా రైతులు నష్టపోతారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరు సాగుతోంది గనుక మోడీ సర్కార్‌ సమయం కోసం చూస్తోంది తప్ప లేకుంటే నిర్మలమ్మ నోట ఇవి కూడా వెలువడి ఉండేవి. గతంలో బడ్జెట్ల సమయంలో కొత్త పన్నులు, విధాన నిర్ణయాలు ప్రకటించేవారు. ఇప్పుడు ఇతర రోజుల్లో చేస్తున్నారు. అందువలన ఎప్పుడైనా వెలువడవచ్చు.


అన్ని రంగాలలో పరిశోధన-అభివృద్ధికి పెద్ద పీటవేస్తేనే జనానికి, దేశానికి లాభం ఉంటుంది. వ్యవసాయ రంగంలో సంక్షోభానికి అనేక దేశాలతో పోల్చుకున్నపుడు మన దిగుబడులు, ఉత్పత్తుల నాణ్యత తక్కువగా ఉండటం ఒక కారణం. చైనా వంటి దేశాలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. మనం మాత్రం ఆవు మూత్రం-పేడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. పరిశోధనకు కేటాయిస్తున్నదే తక్కువ అయితే దానిలో ఆవు మూత్రంలో ఏముందో కనుగొనేందుకు మళ్లింపు ఒకటి. బేయర్‌ కంపెనీ ఏటా ఇరవైవేల కోట్ల రూపాయలు వ్యవసాయ పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే 2023 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని చెబుతున్న మోడీ సర్కార్‌ గతేడాది రూ.7,762 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.8,514 కోట్లు ప్రతిపాదించింది.


చివరిగా ఒక్క మాట. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను నిలువరించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలు, నేల మీద పాతిన ఇనుప ముళ్లు, పోలీసుల చేతుల్లో ఇనుపరాడ్లను చూస్తుంటే రైతాంగాన్ని అణచివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారా అనిపిస్తోంది.సరిహద్దుల్లో శత్రువును ఎదుర్కొనేందుకు కూడా బహుశా ఇంత సన్నద్దత లేదేమో ! ఉంటే పాకిస్ధాన్‌ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రవేశించి మన సైనిక స్ధావరాల మీద దాడులు, సరిహద్దుల్లో సొరంగాలు తవ్వటం సాధ్యమై ఉండేది కాదు.


త్వరలో జరగబోయే నాలుగు ముఖ్యమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాదిన రగిలిపోతున్న రైతన్నలను చూసి గౌరవ ప్రదంగా వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటారా అనే ఆశతో ఉన్నవారు కూడా లేకపోలేదు. ఇప్పటికే రైతాంగం నిరాశతో ఉన్న అనేక మందిని ఉద్యమాలకు ఉద్యుక్తులను గావిస్తోంది. తమ మెడకు ఉరిగా మారనున్న సంస్కరణలకు వ్యతిరేకంగా కార్మికులు తదుపరి పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో రైతు యువకులకు కూడా ముల్లుగర్రల గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎద్దులు, దున్నలతో వ్యవసాయం బాగా తగ్గిపోయింది. వాటితో వ్యవసాయ చేసే సమయంలో దున్నకం వేగంగా సాగేందుకు సన్నటి వెదురు కర్రల చివరన ఇనుప ముల్లు వంటి ఇనుప మేకు గుచ్చి దానితో ఎద్దులు, దున్నల వెనుక భాగాల మీద సున్నితంగా పొడిచి వేగంగా కదిలేట్లు చేసే వారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఇనుప ముళ్లను చూస్తుంటే ఇంకా ఉద్యమాలకు కదలకుండా ఉన్న రైతాంగాన్ని పొడిచి కదిలించేందుకు పూనుకున్నట్లుగా అనిపిస్తోంది. చరిత్రను చూసినపుడు తిరుగుబాట్లకు కారణం పాలకుల చర్యలే తప్ప ఎల్లవేళలా ప్రశాంతతను కోరుకొనే పౌరులు కాదు. ఇప్పుడూ అదే జరుగుతోందా ?