Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ఇప్పుడు బిజెపిలో తిరుగులేని నేత, ప్రధాని నరేంద్రమోడీకి కూడా అదే జరుగుతోందా ?ఎవరికి ఎలా తోస్తే అలా అనుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేకపోతే ఏమిటి ? వ్యవసాయ చట్టాల సవరణకు ఏ దయ్యాల ముహూర్తంలో శ్రీకారం చుట్టారో తెలియదు గానీ అనూహ్యమైన ప్రతిఘటన ఎదురైంది. దాన్ని ఇతర దేశాల్లో నియంతల మాదిరి అణచివేస్తారా ? ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నవారి మాదిరి గౌరవ ప్రదంగా ఉపసంహరించుకుంటారా, ఏం జరుగుతుంది అన్నది చెప్పలేము. ఈ లోగా ప్రపంచ వ్యాపితంగా రైతు ఉద్యమం గురించి విదేశీ నేతల ఆరా, మరింతగా చర్చ జరగటం మాత్రం ఖాయం.
దేశీయంగా దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వ్యవసాయ చట్టాల మీద చర్చలు లేవన్నారు. దిగి వచ్చారు. సావిత్రీ నీపతి ప్రాణంబు తప్ప అన్న యముడి మాదిరి చట్టాల ఉపసంహరణ మినహా దేన్నయినా చర్చిస్తామన్నారు. రైతులు కోరకపోయినా ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామన్నారు. జనవరి 26 రైతుల పరేడ్‌ మీద కోర్టు ద్వారా అనుమతి రాకుండా చూడాలనుకున్నారు. అనుమతి ఇవ్వక తప్పలేదు. కొంత మంది రైతు ఉద్యమ వ్యతిరేకులతో ఎర్రకోట దగ్గర జెండాలు ఎగుర వేయించి రైతుల మీద నెపాన్ని మోపాలని చూశారు. అదెలా ఎదురు తన్నిందో తెలిసిందే. మీడియా అనివార్యంగా చర్చించాల్సి వచ్చింది, దాంతో అనేక మంది కొత్తగా రైతు ఉద్యమం గురించి-కేంద్ర పాలకుల నిజస్వరూపం తెలుసుకోగలిగారు. తాజాగా అన్నింటికీ మించి, నిజం- ఏమాట కామాటే చెప్పుకోవాలి. ట్వీటా ఎంత పని చేశావే అని బిజెపి నేతలు తలపట్టుకొనే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

స్వీట్లు – ట్వీట్లు ఇంత పని చేస్తాయనుకోలేదు నాయనో !
వర్తమాన చరిత్రలో సాంప్రదాయ మీడియాను-సామాజిక మాధ్యమాన్ని మన దేశంలో నరేంద్రమోడీ, బిజెపి ఉపయోగించుకున్నంతగా మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంలో మోడీకి సాటి రాగలిగింది ఆయనకు అత్యంత ఆప్తుడు, అధికారం పోయిన తరువాత కూడా భుజాల మీద చేతులు వేసుకొని తిరగ్గలిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే. ట్వీట్లతో అతగాడు ఎంత ప్రాచుర్యం – గబ్బు పట్టాడో యావత్‌ ప్రపంచం చూసింది. చివరికి ట్విటర్‌ శాశ్వతంగా ఖాతా మూసివేసినట్లు ప్రకటించగా మిగిలినవి పరిమితం కాలం, రకరకాలుగా ఆంక్షలు విధించాయి.చరిత్ర చెత్తబుట్టలో పడిన అతనికి తరువాత పునరుద్దించినా ఒకటే లేకున్నా ఒకటే.
సామాజిక మాధ్యమం ఎంత శక్తివంతమైనదో తాజాగా రైతు ఉద్యమం కూడా నిరూపించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం, మన ప్రధాన స్రవంతి మీడియా మూసిపెట్టాలని చూసి పాచిపోయేట్లు చేసింది. జనవరి 26 పరేడ్‌కు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు వెనుదిరిగి పోతుంటే ఇంకేముంది ఉద్యమాన్ని ముగించేశారని పదే పదే ప్రసారం చేశారు. ఇది రైతులను రెచ్చగొట్టింది. దానికి తోడు రైతు నేత రాకేష్‌ తికాయత్‌ కన్నీళ్ల వీడియో వైరల్‌ కావటంతో కొత్తగా రైతులు ఢిల్లీ సరిహద్దులకు రావటం ప్రారంభించారు. స్వీట్లు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో చక్కెర వ్యాధి ఉన్నవారికే కాదు లేని వారికి కూడా తెలుసు. ఇప్పుడు ట్విటర్‌లో ఉన్నవారికే కాదు లేని వారికి కూడా అవెంత పని చేస్తాయో తెలుస్తోంది. వ్యాసాలు చేయలేని పనిని నాలుగు ముక్కల ట్వీట్లు చేస్తున్నాయి. అందుకే కొందరు ఎంత పని చేశావే ట్వీటూ అని నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

రైతులు పొలాల్లో విత్తనాలు- రోడ్ల మీద మోడీ ఇనుప మేకులు నాటిస్తున్నారు !
తాజా విషయానికి వస్తే రైతులు పొలాల్లో విత్తనాలు నాటుతుంటే నరేంద్రమోడీ రోడ్ల మీద మేకులు నాటిస్తున్నారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అవి ఆగ్రహానికి కారణం కావటంతో వాటిని తొలగించారు. ప్రభుత్వం తోక ముడిచిందంటూ సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావటంతో లేదు లేదు, వేరే విధంగా అమర్చేందుకు తొలగించాం తప్ప మరొకటి కాదని ప్రకటించారు. ఇదిలా ఉండగా రైతుల ఆందోళన గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు అంటూ అంతర్జాతీయంగా పేరున్న ప్రఖ్యాత పాప్‌ గాయని, నటి రీఅనే చేసిన ట్వీట్‌ కేంద్ర ప్రభుత్వానికి కాక పుట్టించింది. రైతుల నిరసన ప్రాంతంలో ఇంటర్నెట్‌ను ఎందుకు నిలిపివేశారని కూడా ఆమె ప్రశ్నించారు. సామాజిక మాధ్యమంలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అనుచరులను కలిగి ఉన్న తొలి 50 మందిలో 6.5 కోట్ల మందితో మన నరేంద్రమోడీ పన్నెండవ స్ధానంలో ఉన్నారు. పది కోట్ల పది లక్షల మందితో మోడీ కంటే ఎగువన రీఆనె నాలుగవ స్ధానంలో ఉన్నారు. అందువలన ఆమె ట్వీట్‌తో రైతు ఉద్యమం గురించి ప్రపంచ వ్యాపితంగా చర్చించే వారు పెరిగారు.

పర్యావరణమే కాదు, రైతులూ నాకు ముఖ్యమే అంటున్న గ్రేటా టన్‌బెర్జ్‌ !
రీఆనె ట్వీట్‌ ఒక సంచలనం అయితే అంతకంటే స్వీడన్‌కు చెందిన 18 ఏండ్ల గ్రేటా టన్‌బెర్జ్‌ ట్వీట్‌ ప్రచారాన్ని మరో మలుపు తిప్పింది.ఆమె తన ట్వీట్‌తో పాటు రైతు ఉద్యమానికి సంబంధించిన సమాచారంతో ఒక కిట్‌ను కూడా తోడు చేసింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం మండి పడింది. అంతేనా ఢిల్లీ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేశారు. అయినా ఖాతరు చేయకుండా కిట్‌ను సవరించి మరో ట్వీట్‌ చేస్తూ తాను ఉద్యమానికి ప్రకటించిన మద్దతుకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేసింది. విద్యార్దినిగా పర్యావరణ పరిరక్షణ కోరుతూ ఆమె ప్రారంభించిన సామాజిక మాధ్యమ ప్రచారం ప్రపంచనేతలను ఆకర్షించింది. అతి చిన్న వయస్సులోనే ఒక ప్రముఖ వ్యక్తిగా మారింది. 2019 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీకి కూడా వీడియో ద్వారా ఇతర దేశాధినేతలతో పాటు తన వినతిని పంపింది. దానిలో ఇలా ఉంది.” ప్రియమైన మోడీ గారూ, వాతావరణ సంక్షోభానికి సంబంధించి మీరు చర్య తీసుకోవాలి. కేవలం దాని గురించి మాట్లాడితే చాలదు, ఎందుకంటే మీరు ఇప్పటి మాదిరే మాట్లాడుతూ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తే, పరిమితమైన విజయాల గురించి బేరమాడుతుంటే మీరు వైఫల్యం చెందుతారు. మరియు మీరు గనుక విఫలమైతే భవిష్యత్‌ మానవ చరిత్రలో మిమ్మల్ని కూడా ఒక ప్రతినాయకుడిగా చూస్తారు. మీరు దాన్ని కోరుకోవద్దు ” ఇప్పుడు అదే నరేంద్రమోడీ గారిని ఉద్దేశించి ఇంకా ట్వీట్‌ లేదా వీడియో వినతి చేయకపోయినా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించటమంటే మోడీ గారిని ఒక విధంగా నిలదీసినట్లే !
రీఆనె, గ్రేటా టన్‌బెర్జ్‌ ట్వీట్లు వివాదాస్పదం గాక మందు వారి గురించి మన దేశంలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. నరేంద్రమోడీ సర్కార్‌ చర్యతో ఎవర్రా ఆ ఆమ్మాయిలు అని రైతులు చర్చించుకొనేట్లు చేశారు. విదేశీ యువతులకు కలిగిన స్పందన మనకెందుకు రాలేదు అని ఉద్యమం గురించి పట్టని యువతులు కొందరైనా ఆలోచిస్తున్నారు. రీఆనె ట్వీట్‌తో దిమ్మతిరిగిన కాషాయ మరుగుజ్జులు తమ సాధారణ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆమె గతంలో వెస్టీండీస్‌ క్రికెట్‌ పతాకాన్ని ప్రదర్శించిన ఫొటోను పాకిస్ధాన్‌తో పతాకంగా మార్చి సామాజిక మాధ్యమంలో తిప్పుతున్నారు. విమర్శిస్తే ప్రతి విమర్శ చేయటం వేరు. మహిళల మాన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు పలికే కాషాయ దళం నోరు పట్టని బూతులతో ఆమె ట్వీట్లు పెడుతున్నారు. భారతీయులు ఇంత లేకిగా కూడా స్పందిస్తారా అని ప్రపంచ నోరు వెళ్లబెట్టేట్లు చేస్తున్నారు.

కంగన నోటి తుత్తర – వాతలు వేసిన తాప్పీ !
గతంలో రైతులను ఉగ్రవాదులంటూ తూలనాడిన సినిమా హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నోటి తుత్తర ట్వీట్ల రచ్చలో లేకుండా ఉంటుందా ? బూతు నటి అంటూ రీఅనెను తిట్టిపోసింది. వామపక్ష పాత్రకు ఆదర్శం అంది. ఆమె స్పందనకు అభినందనగా ఒక పాటను అంకితం చేసిన పంజాబీ గాయకుడు, రచయిత దల్జీత్‌ దోసాంజ్‌ మీద విరుచుకుపడుతూ ఖలిస్తానీ అని తిట్టిపోసింది. అంతేనా అనేక మంది క్రెకెటర్లను ఉద్దేశించి ” రజకుడి కుక్కలు ” అంటూ నోరు పారవేసుకుంది. దాంతో ట్విటర్‌ నిర్వాహకులకే సిగ్గువేసి దాన్ని తొలగించారు. మీరు ఎటువైపో (నరేంద్రమోడీకి అనుకూలమో వ్యతిరేకమో ) తేల్చుకోలేకపోతే రజకుడి కుక్క మాదిరి అటు ఇంట్లోనో ఇటు చాకిరేవు దగ్గరో కాకుండా అటూ ఇటూ తిరుగుతుంటారు అన్నది దాని అర్ధం. ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే వారి మీద దేశద్రోహ ముద్ర వేస్తున్నారు. దాంతో మనకెందుకులే నోరు మూసుకుంటే పోలా అన్నట్లు అనేక మంది మేథావులు- ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలను గుడ్లప్పగించి చూడటం తప్ప స్పందించటం లేదు. అలాంటి వారిని కూడా వారి మానాన వారిని ఉండనివ్వరు. తమకు మద్దతు ప్రకటించకపోవటం కూడా దేశద్రోహమే అని దాడి చేసే రోజులు ముందున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కంగన రనౌత్‌ ట్వీట్‌ భావమదే, ఎటూ తేల్చుకోని వారిని తూలనాడటమే. మేథావుల మౌనం ఏ సమాజానికీ మంచిది కాదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు మేథావులలో ఏటికి ఎదురీదే వారూ ఉన్నారు. చచ్చిన చేపల మాదిరి నీటి వాలున కొట్టుకుపోయే వారూ ఉంటారు. ఇలాంటి సమయాలలో ఎవరెటు ఉన్నారో జనానికి స్పష్టంగా తెలుస్తుంది.
వృత్తి వైరమో లేక రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటమో తెలియదు గానీ మరో హీరోయిన్‌ తాప్సీ కంగనాను పరోక్షంగా ట్వీట్లతో ఆడుకుంది.మనం ఇతరులకు ప్రబోధం చేసే బోధకులుగా మారకూడదు అని వ్యాఖ్యానించారు. ” ఒక ట్వీట్‌ మీ ఐక్యతకు దడ పుట్టించినా, ఒక జోక్‌ లేదా ఒక ప్రదర్శన మీ మతవిశ్వాసాన్ని దడదడలాడించినా మీ విలువల వ్యవస్ధను పటిష్టపరుచుకొనేందుకు పని చేసుకోవాలి గానీ ఇతరులకు ప్రబోధించే టీచరుగా మారకూడదు ” అని తన ట్వీట్లలో పేర్కొన్నారు.

అవి నోళ్లా ? మురికి కాలువలా ?
కొందరివి నోళ్లో మురిక్కాలువలో తెలియదు, తెరిస్తే కంపు భరించలేము. రీఆనె గురించి కంగనా చేసిన ట్వీట్లో ” ఆమె ప్రత్యేకత ఏమిటంటా పాటలు పాడుతూ కెమెరా ముందు తన పిరుదులు కదిలిస్తుంది-ముందున్న…ని ప్రదర్శిస్తుంది. అంతకు మించి ఏముంది ? ఇక గ్రేటా అదొక ఎలుక, బడికి పోవాలనుకోదు, చదువంటే ద్వేషం, అంతర్జాతీయ కుట్రలో ఆమె ఒక భాగం అని పేర్కొన్నది. నేను కంగన సినిమాలను చూడలేదు కనుక ఆమె ఏమి చూపిందో తెలియదు, ఒక వేళ చూసినా ఆ స్ధాయికి దిగజారలేను.
ట్వీట్ల మీద మండిపడిన కంగన పరోక్షంగా తాప్సీని తూలనాడుతూ ” చౌకబారు వ్యక్తి, బుద్దిలేని, ఊరికే తినిపోయే రకం ” అంటూ విరుచుకుపడింది. ” అవన్నీ కొంత మంది డిఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ మౌలిక లక్షణాలు లేదా చివరికి రక్తకణాలైనా మనం ఏం చేయగలం ” అంటూ తాప్సీ బదులిచ్చింది. ఈ వివాదాన్ని గమనించిన వారిలో మీరు ” క్వీన్‌ ” అండీ అని ఒకరు తాప్సీని వర్ణించారు. ” హ హ హ అరె ఉంగరాల జుత్తు, నోరేసుకొని పడిపోవటం మాదిరి ఈ పదం ఒకరి స్వంతం కదా ” అని తాప్సీ స్పందించింది. క్వీన్‌ అనే సినిమాలో కంగన హీరోయిన్‌, ఆమెకు ఉంగరాల జుట్టు ఉన్న విషయం తెలిస్తే తాప్సీ చెప్పిందేమిటో వివరించనవసరం లేదు.
గుక్క తిప్పుకోలేని కంగన హిందీలో తిట్టిపోసింది.(తరువాత వాటిని సిగ్గుపడి లేదా మరొక కారణంతో తానే ట్విటర్‌ నుంచి తొలగించింది) ” నేను జాతీయ వేదికల మీ అమ్మను అవమానిస్తే నీ విశ్వాసం గడగడలాడుతుందే బుద్దిలేని దానా, పెంపుడు జంతువుల మాదిరి రొట్టె ముక్కల కోసం నీవు ప్రేమను చూపుతావని నాకు తెలుసు. అవి అంతకు మించి మరేమీ చెయ్యవు, నోరు మూసుకుంటే మంచిది ” అని వ్యాఖ్యానించింది. అంతటితో ఆగలేదు ” చౌకబారు వారి ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది. ఎవరైనా మాతృదేశం మీద కుటుంబం మీద విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అది మన పెద్ద బాధ్యత, దేశానికి భారం కావద్దు, అందుకే అలాంటి వారిని నేను చౌకబారు అని పిలుస్తాను… ఇలాంటి ఊరికే తినే రకాలను పట్టించుకోవద్దు ” అని కూడా సెలవిచ్చింది.
ఒక సారి ఎవరైనా ప్రజా జీవితంలో వ్యాఖ్యానించటం మొదలు పెట్టిన తరువాత మిగతావారికీ స్పందించే హక్కుంది. రాణికి ఎదురు దెబ్బ తగిలింది అంటూ పరోక్షంగా కంగన గురించి మరో నటి కుబ్రా సేథ్‌ ట్వీట్‌ చేసింది. గతేడాది కుబ్రా చేసిన ట్వీట్‌ మీద ఆగ్రహించిన కంగనా ఆమెను తన జాబితాలో లేకుండా నిలిపివేసింది. ముంబై పర్యటన సమయంలో కేంద్ర ప్రభుత్వం కంగనకు వై ప్లస్‌ తరగతిలో భద్రతా సిబ్బందిని కేటాయించిన విషయం తెలిసిందే. దాని మీద స్పందిస్తూ వేరే ఏమీ లేదు నేను చెల్లించిన పన్ను నుంచి అందుకోసం ఏమైనా ఖర్చు చేస్తున్నారా అని తనిఖీ చేస్తున్నా అంటూ కుబ్రా సేథ్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది.

సినిమాల్లో నిషేధించినా సరే మద్దతు ప్రకటిస్తా అంటున్న అమందా !
అమందా చెర్నీ అనే హాలీవుడ్‌ నటి కూడా రైతులకు మద్దతుగా ట్వీట్‌ చేసింది. అలా చేసినందుకు నేను క్షమాపణ చెప్పను. మీరు సినిమాలను అభిమానించండి. కనీస మానవ హక్కుల అవసరం గురించి గళమెత్తినందుకు గాను బాలీవుడ్‌ (హిందీ) నిషేధించాలనుకుంటే నన్ను సినిమాల్లో చూడలేరు అని ఊహించుకోగలను.తన మద్దతును పునరుద్ఘాటిస్తూ మరో ట్వీట్‌ చేసింది. అంతే కాదు భారత్‌ను నాశనం చేసేందుకు డబ్బు తీసుకొని కొందరు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ మీద మండి పడింది.రీఆనె చేసిన ట్వీట్లకు సొమ్ము పుచ్చుకుందన్న ఆరోపణలను తిప్పికొట్టింది. ఆమె ఇప్పటికే ధనవంతురాలు, మీరు చెబుతున్నజాబితాలోని వారందరికీ సొమ్ము చెల్లించినట్లయితే నేను కూడా సమాచారం వెల్లడించేందుకు డబ్బు తీసుకొనేందుకు సిద్దమే, వెంటనే అందుకు ఏర్పాట్లు చేయండి అని ట్వీటింది. అంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో రైతుల ఉద్యమ స్ధలంలో ఉన్న ఒక వృద్దురాలి ఫొటోను షేర్‌ (పంచటం) చేస్తూ సమస్యను అర్ధం చేసుకోవటానికి మీరు ఇండియన్‌, పంజాబీ లేదా దక్షిణ ఆసియన్‌ అయి ఉండనవసరం లేదు. మీరంతా మానవత్వాన్ని పట్టించుకోండి. పౌర హక్కులు, సమానత్వం, కార్మికులకు గౌరవం,మరియు కనీస మానవ హక్కుల కోసం భావ ప్రకటనా, పత్రికా స్వేచ్చను డిమాండ్‌ చేయండి అని అమందా పేర్కొన్నది.
రైతు ఉద్యమానికి మద్దతుగా రీఆనె చేసిన ట్వీట్ల మీద దేశంలో కాషాయ మరుగుజ్జు దళాలు దాడి చేస్తుంటే ట్విటర్‌ సిఇఓ జాక్‌ డోర్సే ప్రశంసించటం కొసమెరుపు. వాషింగ్టన్‌ పోస్టు జర్నలిస్టు కరేన్‌ అటియా దీని గురించి రాస్తూ గతంలో సూడాన్‌, నైజీరియా, ఇప్పుడు భారత్‌, మయన్మార్‌లో సామాజిక న్యాయ ఉద్యమాల గురించి రీఆనె స్పందించారని, నిజమైన కార్యకర్త అని ఆమె పేర్కొన్నారు. రైతుల ఉద్యమం చారిత్రాత్మక అంతర్జాతీయ నిరసనగా మారినందున దానికి సూచికగా ఒక ఎమోజీ (చిత్రాన్ని) రూపొందించాలని ట్విటర్‌ యాజమాన్యాన్ని కోరారు.

అక్షయ కుమార్‌ ఇప్పుడు భారతీయుడే కాదు ! ట్వీట్‌కు డబ్బు తీసుకున్నాడా ?
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తొలిసారిగా రైతుల ఉద్యమం మీద స్పందించారు. కొద్ది రోజుల క్రితం దాని మీద మీ వైఖరి ఏమిటని మీడియా వెంటపడింది. ” మంచి పని తప్పకుండా చేయాలి. అత్యంత సరైన పని చేయాలి. అత్యంత మహత్తరమైన దానిని చేయాలి” అని చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అటో ఇటో తెలియకుండా ఉంది అని చెప్పవచ్చు. దీని మీద కూడా కంగన్‌ స్పందిస్తారేమో తెలియదు.
ప్రభుత్వానికి మద్దతుగా రైతులకు వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటులు అక్షయ కుమార్‌, అజయ దేవగన్‌, కరణ్‌ జోహార్‌, సునీల్‌ షెట్టి వంటి వారు రీఆనె ట్వీట్ల మీద ద్వజమెత్తారు. అక్షయ కుమార్‌ ఇప్పుడు అసలు భారతీయుడు కాదు, కెనడా పౌరుడు, మన అంతర్గత వ్యవహారాల మీద అతనికి పనేమిటి ? సినిమాల్లో నటించినందుకు పారితోషికం తీసుకున్నట్లుగానే ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్లు, ప్రకటన చేసినందుకు డబ్బు తీసుకుంటున్నాడా ? ఇలాంటి వారు ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన ప్రకటనను సినీ రంగానికి చెందిన తాప్సీ పన్ను, స్వర భాస్కర్‌, సోనాక్షి సిన్హా, ఓనిర్‌, అర్జున్‌ మాధుర్‌ వంటి వారు ఖండించారు.

మన చేస్తే సంసారం -ఇతరులు చేస్తే మరొకటా ! అసలు మనం మడి కట్టుకున్నామా !
మన అంతర్గత విషయాల మీద స్పందించటానికి బయటి వారెవరు అని జాతీయ ఉన్మాదాన్ని రేపేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతోంది. మీడియా తన రేటింగ్‌ పెంచుకొనేందుకు పూనుకుంది. రైతు ఉద్యమాన్ని అంతర్జాతీయం గావించింది ప్రభుత్వమూ, బిజెపి అన్నది తెలిసిందే. దీని వెనుక విదేశాల్లోని ఖలిస్తానీ సంస్ధలు ఉన్నాయని ఆరోపించింది తొలుత బిజెపి నేతలే కదా ! మన అంతర్గత విషయాల గురించి విదేశాలు, విదేశీయుల కెందుకు అన్న ప్రశ్నను ముందుకు తెస్తున్నారు. లక్ష ట్రాక్టర్లతో ప్రపంచంలో ఏదేశ రాజధానిలో అయినా రైతులు ప్రదర్శన జరిపారా ? అది ఢిల్లీలో జరిగింది, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించకుండా ఎలా ఉంటుంది.అమెరికా ఎన్నికలకు ముందు మన ప్రధాని నరేంద్రమోడీ హౌడీమోడీ కార్యక్రమం పేరుతో హూస్టన్‌ నగరంలో ఏర్పాటు చేసిన సభలో అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా ప్రకటించటం అమెరికా ఎన్నికలు, అంతర్గత వ్యహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా ? ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నవారు అప్పుడు నరేంద్రమోడీ చేసింది తప్పని ఎందుకు చెప్పలేకపోయారు ?
హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో ఐక్యరాజ్యసమితి వేదిక మీద మన ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. అంతెందుకు తాజాగా పక్కనే ఉన్న మయన్మార్‌లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అది ఆ దేశ అంతర్గత వ్యవహారం. మరి మన విదేశాంగ శాఖ ఆందోళన ప్రకటిస్తూ ప్రకటన ఎందుకు చేసినట్లు ? అక్కడేం జరిగితే మనకేంటి ?
చైనాలో అంతర్భాగం టిబెట్‌. అక్కడ ఉంటున్న మతాధికారి దలైలామా చైనా సర్కారు మీద తిరుగుబాటు చేశాడు.పారిపోయి మనదేశం వస్తే మనం ఎందుకు ఆశ్రయం కల్పించినట్లు ? ఒక్క ఆశ్రయమేనా ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చామా లేదా ? గత ఆరు దశాబ్దాలుగా దలైలామా, అతగాడి పరివారాన్ని పోషిస్తున్నామా లేదా ? ఇది చైనా అంతర్గత వ్యవహారంలో వేలు పెట్టటం కాదా ?

మన వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు జోక్యం కాదా ?
వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన చట్టాలు మన అంతర్గత విషయాలు అనుకుందాం కాసేపు. వాటి మీద ఇంత ఆందోళన, రచ్చ జరుగుతున్న సమయంలో వాటికి తాము మద్దతు ఇస్తున్నట్లు అమెరికా ఎందుకు ప్రకటించింది. ఇది ప్రభుత్వ అనుకూల జోక్యం కాదా ? దీనికి మోడీ సర్కార్‌ ఏ రూపంలో ప్రతిఫలం చెల్లించినట్లు ? ఇదే ప్రకటన గతేడాది ఆర్డినెన్స్‌ ద్వారా సవరణలు తెచ్చినపుడు వెంటనే అమెరికా ఆ విధంగా స్పందించి ఉంటే అదొక దారి. మరి ఇప్పుడెందుకు ప్రకటించినట్లు ? రైతుల ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రకటన కాదా ? ఒక వేళ జోక్యంగా పరిగణిస్తే దాన్ని మన ప్రభుత్వం, కంగనా రనౌత్‌, సచిన్‌ టెండూల్కర్‌, సామాజిక మాధ్యమ మరుగుజ్జులు కానీ ఎందుకు ఖండించటం లేదు. మనం తీసుకున్న చర్యలు దేశ మార్కెట్ల సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తాయని, ప్రయివేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తాయని అమెరికా ఆహ్వానించింది అని మన విదేశాంగ శాఖ ప్రతినిధి సమర్ధించారు. ఒక్క అమెరికానే కాదు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద కూడా వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించింది. దానికేం పని ? అది జోక్యం కాదా ?

రైతులకు మద్దతు తప్ప మోడీ సర్కార్‌ను కూల్చాలని ఎవరూ చెప్పలేదే !
అమెరికా చేసిన వ్యాఖ్యలను మొత్తంగా చూడాలి తప్ప విడి విడిగా చూడకూడని మన విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఇదే వైఖరిని రైతులకు మద్దతు ప్రకటించిన వారి విషయంలో ఎందుకు చూడటం లేదు ? వారు కూడా ప్రజాస్వామ్యానికి అనుగుణ్యంగానే రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు తప్ప మోడీ సర్కార్‌ను కూల్చివేయాలని రెచ్చగొట్టలేదే ? దాన్ని కూడా సహించరా ? ఆ మాటకు వస్తే అనేక మంది అమెరికా పార్లమెంటు సభ్యులు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మేనకోడలు మీనా హారిస్‌ కూడా రైతుల ఉద్యమంపై ప్రభుత్వ వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ? ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని మీనా హారిస్‌ వ్యాఖ్యానించారు. ఇంతకంటే మోడీ సర్కార్‌కు అవమానం మరేమి ఉంటుంది ? మరి వారి మీద కూడా కేసులు పెడతారా ?
అమెరికా ప్రభుత్వం ఏమి చెప్పింది ? విబేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, శాంతియుత నిరసన ప్రజాస్వామ్యానికి ప్రామాణికమని చెప్పింది. ఇది జోక్యం కాదా ? ఎలా పరిష్కరించుకోవాలో వారు చెప్పకపోతే మన నరేంద్రమోడీకి తెలియదా ? మోడీ నాయకత్వం కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని బిజెపి వారు చెబుతారు, అలాంటపుడు అమెరికాతో, అదీ తాను వ్యతిరేకించిన జో బైడెన్‌ యంత్రాంగంతో చెప్పించుకోవటం ఏమిటి ? ఇంతవరకు మోడీ స్వయంగా చర్చలకు పూనుకోలేదని ఎత్తిపొడవటంగా ఆ ప్రకటనను చూడాలా ?
ట్వీట్లు చేసిన వారు జత చేసి కిట్‌ ఎక్కడ తయారైందో తెలుసుకొనేందుకు కేసు పెట్టామని, కెనడా, అమెరికా సాయం కోరుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇదంతా సమస్యను పక్కదారి పట్టించే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఎర్రకోట వద్ద ఒక మత జెండాను ఎగురవేస్తుంటే ప్రేక్షకపాత్ర వహించిన నరేంద్రమోడీ పోలీసుల మీద చర్యలు తీసుకోలేదు, అందుకు బాధ్యులైన వ్యక్తులను పట్టుకోవాల్సిన పోలీసులు దానికి బదులు రోడ్ల మీద మేకులు కొడుతూ కూర్చున్నారు. అలాంటి వారు మరింతగా ఈ సమస్యను రచ్చ చేసి ప్రపంచ మీడియాలో గబ్బు పట్టటం తప్ప బార్బడోస్‌, స్వీడన్‌, ఇతర దేశాలకు చెందిన వారి ట్వీట్ల మీద తీసుకొనే చర్యలేమిటి ? సాధించేదేమిటి ?