Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


గ్రామం నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ కార్యాలయాలను ఆవు మూత్రంతో తయారు చేసిన ఫినాయిల్‌తోనే శుద్ది చేయాలని మధ్య ప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వం జనవరి నెల చివరిలో ఆదేశాలు జారీ చేసింది. ఆవు మూత్ర ఫినాయిల్‌ తయారీకి ముందే గిరాకీని సృష్టించామని అందువలన మూత్రం వృధా కాకుండా యజమానులు ఒట్టి పోయిన ఆవులను ఇండ్ల దగ్గరే ఉంచుతారని తద్వారా ఆవుల పరిస్ధితి మెరుగుపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రేమ్‌ సింగ్‌ పటేల్‌ ప్రకటించారు. తమ ప్రభుత్వ చర్యను చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన చర్యలు తీసుకుంటారని బిజెపి ప్రతినిధి రాహుల్‌ కొఠారీ సమర్ధించారు.


ఇప్పటికే రామ్‌ దేవ్‌ బాబా పతంజలి కంపెనీ గోనైల్‌ పేరుతో ఆవు మూత్ర ఫినాయిల్‌ తయారు చేస్తున్నది. దానికి లబ్ది చేకూర్చేందుకే ఈ చర్య తీసుకున్నారన్న ఆరోపణ కూడా ఉంది. అయితే పెద్ద ఎత్తున గోమూత్ర సేకరణ చేయాల్సి ఉన్నందున ప్రభుత్వమే గ్రామాల్లో పాలకేంద్రాల మాదిరి ఆవు మూత్ర కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సేకరించిన మూత్రంతో ఫినాయిల్‌ తయారీకి సహకరించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులకు సరఫరా చేసేందుకు బహుశా మేకిన్‌ ఇండియా పధకం కింద ఎగుమతులు కూడా చేసే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మధ్య ప్రదేశలో ప్రత్యేకంగా ” ఆవు మంత్రి వర్గం ” కూడా ఉంది. వాటి రక్షణ కోసం పశుసంవర్దక, అటవీ, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, హౌం మరియు రైతు సంక్షేమ శాఖల మంత్రులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గతేడాది నవంబరు 18న ప్రకటించారు. రాజు తలచుకోవాలే గానీ డబ్బులకు – దెబ్బలకూ కొదవేముంటుంది ! బిజెపి తలచుకోవాలే గానీ ఆశ్రితులకు జనం సొమ్ము అప్పగించేందుకు కొత్త పుంతలు ఎన్నో. చివరకు ఆవు మూత్రాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుంది. ఆవు మూత్రం తాగే జనం ఉన్న దేశం మనది.(ఎవరి మనోభావాన్ని కించపరచటం లేదు. ఎవరిష్టం వారిది) అలాంటిది అదీ దేశీయ ఆవు మూత్రంతో ఇండ్లు, ఆఫీసులను తుడిచే ఫినాయిల్‌ తయారు చేస్తామంటే ఎవరైనా అభ్యంతరపెడతారా ?


బిజెపి ప్రభుత్వ నిర్ణయం మీద సామాజిక మాధ్యమాల్లో జనాలు హాస్యాన్ని పండిస్తున్నారు.సంవాదాలు, రాజకీయ విసుర్లు, విమర్శించిన వారి మీద దాడి సరే సరి ! ప్రస్తుతం రసాయనాలతో ఫినాయిల్‌ తయారు చేస్తున్నారు. దానికి రకరకాల రంగులు, వాసనలు జోడిస్తున్నారు. ప్రపంచంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోంది. చిరుతిండ్లు దానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అందువలన వాటి వాడకాన్ని నిరుత్సాహపరచేందుకు ” కొవ్వు ” లేదా ఉప్పు పన్ను వేస్తున్నారు. ఈనేపధ్యంలో కొన్ని వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయో చూద్దాం !

తదుపరి ఫాస్ట్‌ ఫుడ్స్‌, డ్రింకులకు కృత్రిమ వాసనల బదులు విధిగా గో మూత్ర వాసన జోడించాలని ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యం లేదు. అలా చేస్తే పన్నుతో నిమిత్తం లేకుండానే జనాలు చిరుతిండ్లు మాని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. డబ్బుకు డబ్బు ఆదా !
ముందు గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, ఇళ్లతో ప్రారంభించాలి ! మూత్ర తంత్రం ఎంత గొప్పగా ఉందో కదా !
తరువాత మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఉదయాన్నే టీ బదులు గోమూత్రం తాగాలనే ఆదేశాలు జారీ అవుతాయి !
ఇళ్ల నుంచి పని చేసేందుకు ఉద్యోగులకు ఇది పెద్ద ప్రోత్సాహం అవుతుంది !
ఉత్తర ప్రదేశ్‌కు మధ్య ప్రదేశ్‌ గట్టి పోటీనిస్తోంది ! చూద్దాం 2024నాటికి ఎవరు ఎక్కువ గోమూత్రం తాగుతారో !
ఎంపీ, యూపీలలో ఉన్న వారి పట్ల విచారంగా ఉంది !
ఇది ఆవు ప్రభుత్వం, ఆవుల కోసం ఆవులు పని చేస్తున్నాయి ! మోడీ-అమిత్‌ షా బ్రాండ్‌ ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు !
ప్రపంచంలో మన దేశాన్ని అపహాస్యం పాలు చేయటానికి ఈ పాలకులు రోజుకు ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు !
దానితో ఇబ్బంది ఏముంది ? రసాయన పరిశ్రమల కంటే కుటీర పరిశ్రమ వృద్ది చెందుతుంది !
మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆవు మూత్రంతో పాటు మనుషుల మూత్రంతో కూడా ఫినాయిల్‌ తయారు చేయించవచ్చు, సులభంగా కూడా దొరుకుతుంది !
మిత్రోం వద్దు – మూత్రోం ముద్దు ! ప్రతిదీ ఆవు పేడ వాసన రావాల్సిందే !
బీఫ్‌ తినే వారు ఆవు మూత్రం గురించి అభ్యంతర పెట్టే నైతిక హక్కులేదు !
నేను బీఫ్‌ తింటా దానికి ఉచ్చతో చేసిన సాస్‌ బదులు మిరియాల సాస్‌ వాడతా, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ఉచ్చ సాస్‌ పంపుతా !
జనానికి అభ్యంతరం లేనంత వరకు మనకు సమస్య ఏముంది ?
” పప్పు ” పార్టీ కంటే గోమూత్ర పార్టీలో మెదళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయబ్బా ! ఆవు మూత్రంతో వాహనాలు నడపవచ్చేమో అన్న ఆలోచన వస్తోంది !
ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ ఇది గోమూత్ర సర్కార్‌ అని వ్యాఖ్యానించారు.
వారేమీ దాచుకోవటం లేదని తెలుసుకోవటం సంతోషంగా ఉంది. మాకు అవకాశం వచ్చింది గనుక గోమూత్రాన్ని వాడుతున్నాం. మీకు అవకాశం వస్తే ఒంటె మూత్రాన్ని వాడండి, అది లౌకిక పద్దతి, మీరు కూడా తాగవచ్చు !


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హానికరమైన రేడియో ధార్మికశక్తిని ఆవు పేడ 60శాతం మేరకు నిరోధిస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు గుజరాత్‌లోని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం జనవరి చివరిలో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరిపినట్లు ప్రకటించారు. దీని గురించి గత అక్టోబరులోనే సంస్ధ అధ్యక్షుడు, క్యాన్సర్‌ చికిత్స నిపుణుడైన డాక్టర్‌ వల్లభారు కథిరియా ప్రకటించారు. దాన్ని అప్పుడే దేశంలోని ఆరువందల మంది శాస్త్రవేత్తలు సవాలు చేశారు. దాన్ని నిర్ధారిస్తూ ఇటీవల విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర అధ్యాపకుల నుంచి ప్రకటన రావటం విచారం కలిగిస్తున్నదని కొందరు శాస్త్రవేత్తలు తాజాగా ఒక ప్రకటనలో విమర్శించారు. ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది. దానికి రేడియో ధార్మికతను నిరోధించే గుణం ఉంది.అది ఇంట్లో ఉంటే రేడియేషన్‌ ఉండదు, ఇది సైన్సులో రుజువైందని వల్లభారు గతంలో చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఒక పరికరాన్ని చూపుతూ సెల్‌ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్‌ను అది నిరోధిస్తుందన్నారు.

సౌరాష్ట్ర విశ్వవిద్యాలయ ప్రకటనను సవాలు చేసిన శాస్త్రవేత్తలు అసలా పరిశోధనా పద్దతిలోనే లోపం ఉందన్నారు. రేడియేషన్‌ కొలవటానికి వీలైనది, భిన్నమైన మందాలు గల ఆవు పేడ పిడకలతో ఎంత తేడాతో రేడియేషన్‌ ఉన్నదో కొలవ వచ్చు, కానీ ఆపని చేయకుండా ఒకసారి మాత్రమే కొలిస్తే అసలు పరిశోధన ఎలా అవుతుందన్నారు. ఆవు పేడ కాకుండా ఒంటె లేదా గాడిద పెంటతో ప్రయోగాలు చేసి ఉంటే ఏమి జరిగేదో చెప్పాలన్నారు. పరిశోధనలో లోపాల గురించి వారికి తెలిసి ఉండకపోవచ్చు లేదా ఎవరికోసమో తప్పుడు సమాచారాన్ని తయారు చేసి ఇచ్చి ఉండవచ్చన్నారు. బోధనా రంగంలో ఉన్న కొంత మంది కుహనా శాస్త్రాన్ని బలవంతంగా రుద్దటాన్ని తాము నిరసిస్తున్నామన్నారు. ఆవు పేడ రేడియేషన్‌ నిరోధకత కలిగి ఉందని శాస్త్రవేత్తల ముసుగు వేసుకున్న కుహనా బృందాల నుంచి నుంచి గాక ప్రభుత్వ సంస్ధ నుంచి వచ్చినందున దీన్ని తేలికగా తీసుకో కూడదని కొల్‌కతాలోని ఐఐఎస్‌ఇఆర్‌ సంస్ధ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌ సౌమిత్ర బెనర్జీ అన్నారు. ఆవు పేడ మీద పరిశోధనలకు నిధులు పొందటం సులభమని కొంత మంది శాస్త్రవేత్తలు దృష్టి మళ్లిస్తారని అయితే ఇది శాస్త్ర ఆరోగ్యానికే హానికరమని అన్నారు.


ఆవు సైన్సును ప్రోత్సహించే పేరుతో ఫిబ్రవరి 25న దేశవ్యాపితంగా తొలిసారిగా ఆలిండియా ఆన్‌లైన్‌ కామధేను గో విజ్ఞాన ప్రచార-ప్రసార పరీక్ష పెడుతున్నారు. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు, చదువు సంధ్యలతో, వయస్సుతో పనిలేదు. ఆవు గురించి తెలిస్తే చాలు. పరీక్ష రాసిన వారందరికీ అందరికీ ఆవు ” శాస్త్రవేత్తలు ” గా సర్టిఫికెట్లు ఇస్తారు, అధిక మార్కులు వచ్చిన వారికి అదనంగా బహుమతులు ఇస్తారు. పశుసంవర్ధన ఆధునిక, శాస్త్రీయ పద్దతుల్లో నిర్వహించేందుకు గాను రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆచరణలో అది కుహనా శాస్త్ర ప్రచారాన్ని చేస్తున్నది. ఆ సంస్ధ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ వల్లభారు కథిరియా రాసిన ఒక బహిరంగలేఖలో ఒక వ్యాక్యం చదివితే అదేం చేస్తున్నదో అర్దం చేసుకోవచ్చు. ” ఈ రోజు మనం రామాయణం, మహాభారత్‌, కృష్ణ, చాణక్య, ఉపనిషత్‌ గంగ వంటి సీరియల్స్‌ను చూసినపుడు సామాజిక జీవనంలో మన ఊహకు సైతం అందని అసమాన సాంకేతిక ప్రక్రియలను ఉపయోగించినట్లు తెలుసుకోవచ్చు ” అని పేర్కొన్నారు. అంతేకాదు నేను క్యాన్సర్‌ ఆపరేషన్ల గురించి చెప్పగలను గానీ ఇతర విషయాలు నాకు తెలియవు, అలాగే ఆవు శాస్త్రం గురించి అందరికీ తెలియకపోవచ్చు అన్నారు.

ఒక వైపు ఆధునిక శాస్త్ర పరిశోధనలు అవసరమని లోకం కోడై కూస్తున్నది.మరోవైపు మన దేశంలో శాస్త్ర పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కోత పెడుతున్నారు.ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 1996లో మన జిడిపిలో 0.64 శాతం కేటాయించారు. అది 2008 నాటికి 0.86శాతానికి పెరిగింది. నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలో 2018లో 0.65శాతానికి దిగజారింది. తాజాగా ఆర్ధిక సర్వేలో ఖర్చును 0.7 నుంచి రెండుశాతానికి పెంచాలని వ్యాఖ్యానించారు. తాజా బడ్జెట్‌లో అలాంటి సూచనలేమీ లేవు. ప్రపంచ నవకల్పన 2020 సూచీలో మనదేశం 131దేశాలలో 48వ స్ధానంలో ఉందని పేర్కొన్నది. కొందరైతే 2014లో 76వ స్దానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 28 స్ధానాలు పెంచి 48కి తెచ్చారని పొగడ్తలు కురిపించారు. మనతో సమానమైన వారితో పోటీ-పోలిక గౌరవంగా ఉంటుంది.మన దేశం 2014లో 33.7 పాయింట్లతో 76వ స్ధానంలో ఉంది. అది 2020కి 48లోకి వచ్చినా పాయింట్లు 35.6 మాత్రమే. ఇదే కాలంలో చైనా 46 నుంచి 29వ స్ధానానికి 17 స్ధానాలు మెరుగుపరచుకుంది, పాయింట్ల వారీ చూస్తే 46.6 నుంచి 53.3కు పెంచుకుంది. పైకి పోతున్న కొద్దీ పోటీ తీవ్రత పెరుగుతుందన్నది తెలిసిందే. సౌమిత్ర బెనర్జీ చెప్పినట్లు మన పరిశోధనలన్నీ ఆవు పేడ, మూత్రం చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలలో దాని పట్ల మక్కువ ఉన్న పాలకులు ఉన్న కారణంగా నిధుల కోసం అలాంటి పరిశోధనల చుట్టూ కొందరు శాస్త్రవేత్తలు ప్రదక్షణలు చేస్తున్నారు. గోమాతలను ప్రార్ధిస్తున్నారు.