Tags
#Pinarayi Vijayan, Bjp support to Congress caste slur on Chief Minister Pinarayi Vijayan, CPI(M), Kerala BJP, Kerala Politics, LDF, Pinarayi Vijayan, UDF
ఎం కోటేశ్వరరావు
ఏ రాజకీయ పార్టీ అయినా అధికారాన్ని కోరుకోవటంలో, అందుకోసం గౌరవ ప్రదమైన, ప్రజాస్వామిక పద్దతుల్లో పని చేjటం, ప్రవర్తించటంలో తప్పు లేదు. కేరళలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఒక సారి కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ అధికారానికి వస్తే తరువాత సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ అధికారానికి రావటాన్ని చూస్తున్నాము. తాజాగా పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లను బట్టి గత పరంపరకు భిన్నంగా వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్ అధికారానికి వస్తుందని అంకెలు చెబుతున్నాయి. మళయాల మనోరమ అనే పత్రిక 101 సీట్లు వస్తాయని విశ్లేషించింది. అదే పత్రిక సిపిఎం సమీక్షలో 98 వస్తాయనే అంచనాకు వచ్చినట్లు మరొక వార్తను రాసింది. ఇంతవరకు ఎల్‌డిఎఫ్ నేతలు మాకు ఇన్ని సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలేదు.
ఏప్రిల్ లేదా మే మాసాల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమౌతున్నాయి. ఎల్‌డిఎఫ్ అన్నింటికంటే ముందు వుందని, ఓట్లు తగ్గిన, ఓడిపోయిన చోట ఎందుకలా జరిగిందో ప్రతిపార్టీ పరిశీలించుకుంటున్నది, సిపిఎం కూడా అదే చేస్తున్నదని మీడియాలో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. మొత్తంగా కేరళ పరిణామాలను చూసినపుడు సిపిఎం వ్యతిరేక రాజకీయ పార్టీల కంటే తన వ్యతిరేక ప్రచార శ్రమ వృధా అయింది, జనం ఎందుకు పట్టించుకోలేదనే ఉడుకుమోత్తనంతో మీడియా వుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో తిరిగి తన పాత అలవాట్లను ప్రదర్శిస్తోంది.
మరోవైపున పండుగాడి మాదిరి సిపిఎం కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు చౌకబారు, చివరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలకూ దిగజారాయి. గీత వృత్తిదారు కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది తప్ప వారి వ్యాఖ్యలను అవమానించేవిగా భావించటం లేదని విజయన్ ఎంతో హుందాగా ప్రతిస్పందించారు. కల్లుగీత కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తు పెట్టుకుంటారు అని కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అయిన కె సురేంద్రన్ నోరు పారవేసుకున్నారు.
కేరళ ఐశ్వర్య యాత్ర పేరుతో ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయ యాత్ర జరుపుతోంది. కేరళ అభివృద్ది మినహా మిగిలిన అంశాలన్నింటినీ ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ సందర్భంగా కన్నూరు జిల్లా తలసెరీలో సురేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాయి.అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని వాటితో తమకు సంబంధం లేదని శాసనసభా పక్షనేత రమేష్ చెన్నితల వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ ఏకైక మహిళా ఎంఎల్‌ఏ షనిమోల్ ఉస్మాన్ ఘాటుగా సురేంద్రన్ తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. సురేంద్రన్ చేసిన వ్యాఖ్యల కంటే ఇవి మరింత నష్టదాయకంగా మారటంతో పాటు ముఠా తగాదాలు బయటకు వచ్చాయి. తన ప్రత్యర్ధుల ప్రోద్బలంతో ఎంఎల్‌ఏ అలా ప్రకటించారని సుధాకరన్ మండిపడ్డారు. దీంతో నష్ట నివారణ చర్యగా పూర్తిగా తెలుసుకోకుండా తాను వ్యాఖ్యానించానని రమేష్ చెన్నితల, ఎవరి ప్రమేయం లేకుండా తానే ఆ ప్రకటన చేశానని ఎంఎల్‌ఏ తన మాటలను తానే మింగారు. సుధాకరన్‌కు క్షమాపణ చెప్పారు. దీంతో రెచ్చి పోయిన సురేంద్రన్ తన వ్యాఖ్యలను పార్టీ సమర్ధించిందని, అన్నదానిలో తప్పులేదంటూ పదే పదే సమర్ధించుకుంటున్నారు.
” సురేంద్రన్ నాకు కాలేజీ రోజుల నుంచీ తెలుసు. నా తండ్రి ఒక కల్లుగీత కార్మికుడని నేను గతంలో కూడా చెప్పాను. మా అన్న కూడా గీత కార్మికుడే, వయస్సు మీద పడి వృత్తి మానుకున్నాడు. రెండో సోదరుడికీీ వృత్తి తెలుసు, అయితే ఒక బేకరీని పెట్టుకున్నాడు.మాది ఒక వ్యవసాయ కుటుంబం, సురేంద్రన్ చేసిన వ్యాఖ్యలతో నేనేమీ నొచ్చుకోలేదు, వాటిని తిట్టుగా భావించటం లేదు.నేను ఒక గీత కార్మికుడి కొడుకును, అందుకు గర్విస్తాను ఎందుకంటే నేను ఒక కష్టజీవి కొడుకును.ఈ అంశాన్ని వివాదాస్పదం గావించారని అలపూజ ఎంఎల్‌ఏ షనిమోల్ ఉస్మాన్ మీద సుధాకరన్ మండి పడ్డారు. ఈ అంశంలో చివరికి రమేష్ చెన్నితల కూడా తన వైఖరిని మార్చుకున్నారు. నా జీవన శైలి ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిందే.” అని విజయన్ విలేకర్లతో చెప్పారు.
బిజెపిలో చేరతానని బెదిరించి అధిష్టానాన్ని బెదిరించిన సురేంద్రన్ ?
సురేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టించటంతో వాటిని వ్యతిరేకించటం కంటే సమర్దించటమే మంచిదని కాంగ్రెస్ భావించింది. అందుకే మాట మార్చింది.కాంగ్రెస్ క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ నేత కెసి వేణుగోపాల్ సమర్ధించారు. ఏదో వాడుక భాషలో అన్నారు. సుధాకరన్ అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదని ఏదో సాధారణంగా చెప్పాను. తరువాత ఇది నిజమేనా అని ఆయనతో మాట్లాడితే కాదన్నారు. ఆయన ప్రజానాయకుడు, కాంగ్రెస్ పార్టీకి ఒక సంపద వంటి వారు అని చెన్నితల సమర్ధించారు. అయితే కాంగ్రెస్ నేతలు ఇలా మాట మార్చటం వెనుక తాను బిజెపిలో చేరతానని సురేంద్రన్ పార్టీ అధిష్టానాన్ని బెదిరించటమే కారణమని కొందరు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి విలాస జీవితం గురించి చెబుతూ ఆయన కుటుంబ వృత్తి పేరు ప్రస్తావించాను తప్ప మరొకటి కాదని ఢిల్లీలో కూడా సుధాకరన్ సమర్ధించుకున్నారు. అనేక మంది నేతలు తామూ కూలీ బిడ్డలమని చెప్పుకుంటారని ఇది కూడా అంతే అన్నారు. నేను వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తరువాత కూడా సిపిఎం స్పందించలేదని, వారికి బదులు తమ కాంగ్రెస్ వారే స్పందించారనే అదే సమస్య అన్నారు. అంతకు ముందు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో వివరించాలని సిపిఎం డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ నేతల కుల దూషణను బిజెపి సమర్ధించింది. కల్లు గీసే వారు అన్ని కులాల్లో ఉన్నారని అందువలన ఒక కులాన్ని నిందించినట్లుగా తాము భావించటం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ సమర్ధించారు. సిపిఎం వారు దాన్నొక ఆయుధంగా చేసుకున్నారు తప్ప తప్పేమీ లేదన్నారు.
మరోసారి శబరిమలను ముందుకు తెచ్చిన కాంగ్రెస్ !
స్దానిక సంస్దల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్, బిజెపి, వాటికి మద్దతుగా మీడియా ఎల్‌డిఎఫ్ ప్రత్యేకించి సిపిఎంకు వ్యతిరేకంగా ముందుకు తెచ్చిన ఆరోపణలను జనం పట్టించులేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. దాంతో తిరిగి మరోసారి శబరిమల సమస్యను ముందుకు తెచ్చేందుకు కాంగ్రెస్ పూనుకుంది. మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు, దాన్ని అమలు చేసేందుకు పూనుకున్న ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్, బిజెపి వివాదాస్పదం కావించి శాంతి భద్రల సమస్యను సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ తీర్పు మీద సుప్రీం కోర్టులో పునర్విచారణ పిటీషన్ ఉంది. అలాంటివే ఇతర వివాదాలు, పిటీషన్లను కలిపి కోర్టు విచారించింది. ఇంతవరకు ఎలాంటి తీర్పు వెలువడలేదు. సుప్రీం కోర్టు తీర్పుతో సమాజంలో సృష్టించిన గాయాలను మాన్పేందుకు తీర్పుకు వ్యతిరేకంగా చట్టం చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాము అధికారానికి వస్తే చేయబోయే చట్టం ఇలా ఉంటుందంటూ ఒక ముసాయిదాను కూడా విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకున్నారు. శబరిమల సంప్రదాయాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయటంతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుదని దానిలో పేర్కొన్నారు.ఈ ప్రచారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన తరువాత సమాజంలోని అన్ని తరగతుల అభిప్రాయాలను తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సుప్రీం కోర్టు ముందు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సమీక్షిస్తామని చెప్పింది అంతిమ నిర్ణయం వచ్చిన తరువాతే కదా జోక్యం చేసుకొనే సమస్య ఉదయించేది అని విజయన్ అన్నారు.
శబరిమల సమస్య ద్వారా లబ్దిపొందాలని చూస్తున్న మరో పార్టీ బిజెపి కూడా ఓట్లకోసమే కాంగ్రెస్ ఇలా చెబుతోందని విమర్శించింది. ఆ సమస్య మీద ఉద్యమించినపుడు కాంగ్రెస్ ఎక్కడుంది ? అప్పుడు ఎందుకు చట్టం గురించి మాట్లాడలేదు అని ప్రశ్నించింది. తాము అధికారానికి వస్తే దేవాలయ బోర్డులను రద్దు చేస్తామని బిజెపి చెప్పుకుంది.
తండ్రి వారసుడిగా రంగంలోకి వచ్చేందుకు సిద్దం అవుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు చాండీ ఊమెన్ క్రైస్తవ బిషప్పుల కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యాడు.అతగాడు చేసిన వ్యాఖ్యలను మరొకరు చేసి ఉంటే ఈ పాటికి రచ్చ రచ్చ గావించి ఉండే వారు.యూత్‌లీగ్ ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఐరోపాలో చర్చ్‌లు నృత్య కేంద్రాలు, మద్యం బార్లుగా మారిపోయాయని చాండీ అన్నారు. ఆ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. చాండీకి అసలు కేరళ చర్చ్‌ల చరిత్ర తెలియదని బిషప్పుల సంఘం వ్యాఖ్యానించింది.
బిజెపి మిత్రపక్షమైన కేరళ భారత ధర్మ జనసేన(బిడిజెఎస్) పార్టీలో చీలిక వచ్చింది. బిజెపి నేతలు ఎల్‌డిఎఫ్‌తో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని దానికి నిరసనగా తాము భారత జనసేన (బిజెఎస్) పేరుతో కొత్త పార్టీని పెట్టి యుడిఎఫ్‌ను సమర్ధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే వీరికి బలమేమీ లేదని బిడిజెస్ నేతలు తోసి పుచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అసలు ఉమ్మడిగా ఉన్న పార్టీకే బలమేమీ లేదని వెల్లడైంది.
స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు బిజెపి నేతల తీరు తెన్నులు చూస్తే కేరళలో వచ్చే ఎన్నికలలో తాము అధికారానికి రాకపోయినా గణనీయ సంఖ్యలో సీట్లు తెచ్చుకొని చక్రం ఇప్పుతామన్నట్లుగా ఉంది. ఫలితాలు వెలువడిన తరువాత కొన్ని సీట్లలో ఓట్లను గణనీయంగా ఎలా పెంచుకోవాలా అని చూస్తోంది, అదే పెద్ద గొప్ప అన్నట్లుగా మీడియా చిత్రిస్తోంది. నూట నలభై స్ధానాలకు గాను 48 చోట్ల 30వేలకు పైగా ఓట్లు వస్తాయని, వాటిలో కూడా 20 చోట్ల గెలిచే అవకాశాలున్నందున అలాంటి స్ధానాల మీద కేంద్రీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి నిర్ణయించినట్లు మళయాళ మనోరమ వ్యాఖ్యాత పేర్కొన్నారు. కేరళలో బిజెపి ఎన్ని ఊపులు ఊపినా దాని ఓటింగ్ శాతం పదిహేనుశాతానికి లోపుగానే ఉంది తప్ప పెరగలేదు. ఈసారి చూడండి ఈ సారి చూడండి అంటూ ప్రతిసారీ కబుర్లు చెబుతూనే ఉంది. ఇప్పుడూ అదే పల్లవి, అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు తమకూ మధ్యనే పోటీ ఉంటుందని చెబుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అనేక మంది నేతలు అసెంబ్లీ బరిలో దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నారు, సాకులు వెతుకుతున్నారు. కొందరు వెనక్కు తగ్గినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రతిపక్షాలు, మీడియా ఎలాంటి కుయుక్తులు పన్నినా, వక్రీకరణలు చేసినా ఎల్‌డిఎఫ్ తన కార్యక్రమంతో ముందుకుపోతోంది. మరో విజయాన్ని స్వంతం చేసుకోగలమనే ధీమా వ్యక్తం అవుతోంది.