Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
నిర్ధారించుకోకుండా వార్తలు రాశారు, ప్రసారం చేశారు లేదా ట్వీట్‌ చేశారు అని కొంత మంది జర్నలిస్టుల మీద క్రిమినల్‌ కేసులు పెట్టారు. నిజమే అలా చేయకూడదు. ఎవరూ అలాంటి ధోరణులు, పని తీరును సమర్ధించరు. మీడియా ప్రభుత్వ గెజెట్‌ కాదు. కొన్ని సందర్భాలలో నిర్ధారణ కాని వార్తలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ వాస్తవం కానట్లయితే ఆయా మీడియా సంస్దల విశ్వసనీయత దెబ్బతింటుంది, నష్టపోయేది వారే. అందువలన ఎవరూ తమ కొమ్మలను తామే నరుక్కోరు. లేదూ చేస్తే ఏమౌతుంది ?


ప్రభుత్వం లేదా ప్రభుత్వ శాఖలు ఆయా ఉదంతాలకు సంబంధించి వివరణ ఇచ్చి తాము చెప్పిందాన్ని కూడా ప్రచురణ లేదా ప్రసారం చేయమంటాయి. చేయలేదనుకోండి,వివరణ కోరవచ్చు, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు, ఇతర చర్యలకు ఉపక్రమించవచ్చు.అదేమీ లేకుండానే ఏకపక్షంగా దేశద్రోహం కేసులా ? ఇది ప్రజాస్వామ్య పాలనా, నిరంకుశ ఏలుబడా ? జనవరి 26 ఉదంతాల విషయంలో జరిగిందేమిటి ? జర్నలిస్టులు, ఒక కాంగ్రెస్‌ ఎంపీ మీద దేశద్రోహం వంటి తీవ్ర నేరపూరితమైన కేసుల దాఖలు చేశారు. వారంతా సుప్రీం కోర్టు తలుపు తట్టారు. రెండు వారాల తరువాత కేసులను విచారణకు తీసుకుంటామని ఇప్పటికైతే అరెస్టు చేయవద్దని మంగళవారం నాడు ఉన్నత న్యాయస్ధానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే జర్నలిస్టుల మీద కత్తి వేలాడుతూనే ఉంది? రెండు వారాల తరువాతేం జరగనుందో తెలియదు.
నిర్దారణ కాని వార్తల ఆధారంగా అంటే ఒక జనవరి 26న ఒక యువకుడి మృతి వార్త గురించి తెలుసుకోకుండా ఆరుగురు జర్నలిస్టులు, ఎంపీ శశిధరూర్‌ ట్వీట్లు చేశారన్నది అభియోగం. పోలీసు కాల్పుల్లో గాయపడి అతను మరణించాడన్నది ఆ సమయంలో అక్కడున్నవారి నివేదన, కాదు ట్రాక్టరు తిరుగబడి మరణించాడన్నది పోలీసుల కధనం. మొదటి కథనాన్ని ట్వీట్‌ చేశారు. కానీ పోలీసులు ఏం చెబుతారో తెలుసుకోకుండా వారి మీద నిందలు మోపే విధంగా, జనాన్ని రెచ్చగొట్టే రీతిలో ట్వీట్‌ చేశారు లేదా తమకు వచ్చిన దాన్ని ఇతరులకు పంచారు(షేర్‌), అది నేరం అని మోడీ సర్కార్‌ అంటోంది. ఈ కేసుపై దాఖలైన పిటీషన్లను ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నాయకత్వంలోని బెంచ్‌ విచారిస్తున్నది.


కోర్టుకు ఎక్కిన వారిలో కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌, ఇండియా టుడే సంపాదకుడు రాజదీప్‌ సర్దేశారు,కాంగ్రెస్‌ దినపత్రిక నేషనల్‌ హెరాల్డ్‌ సీనియర్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ మృణాల్‌ పాండే, క్వామీ అవాజ్‌ సంపాదకుడు జాఫర్‌ ఆఘా, కారవాన్‌ స్దాపకుడు పరేష్‌ నాధ్‌, సంపాదకులు అనంత నాధ్‌, వినోకే కె జోస్‌ ఉన్నారు. వారి మీద దేశద్రోహం, మత సామరస్యతను దెబ్బతీసే సమాచార వ్యాప్తి, రైతుల నిరసన గురించి తప్పుడు వార్తలు తదితర నేరాలు మోపారు. జర్నలిస్టుల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ నిరంకుశ చర్యల నుంచి పిటీషనర్లకు తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరారు. వివిధ రాష్ట్రాల పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వస్తారని పేర్కొన్నారు. కోర్టు తొలుత విముఖత చూపింది. మీరు వారిని అరెస్టు చేయబోతున్నారా అని ఢిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. బుధవారం నాడు దీని గురించి వినాలని మెహతా చెప్పారు. బుధవారం నాడు కాదు, రెండు వారాల తరువాత వింటాం, అప్పటి వరకు వారి అరెస్టు నిలిపివేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.


కారవాన్‌ సంపాదకుడు వినోద్‌ కె జోస్‌ తరఫున వాదించిన సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహతగీ ఆధారాల్లేకుండా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని, రిపోర్టింగ్‌లో నేరం ఎక్కడుంది, మత మనోభావాలు గాయపడేదెక్కడ అని ప్రశ్నించారు. దాని మీద స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ వారి ట్వీట్లను అనుసరించే లక్షలాది మంది మీద భయంకరమైన ప్రభావం పడుతుందని నేను మీకు చూపగలను అన్నారు. ఢిల్లీలో కేంద్రప్రపభుత్వానికి చెందిన న్యాయవాది ఒకరు, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ పోలీసులు, గురుగ్రామ్‌, బెంగళూరు, నోయిడాలలో కూడా కేసులు దాఖలు చేశారు. నిందితులు కుట్రపూరితంగా ఒక పధకం ప్రకారం తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని ఆరోపించారు. ఈ కేసులను డియుజె, ఎన్‌ఏజె,మహిళా జర్నలిస్టు సంఘం, ఎడిటర్స్‌ గిల్డు తదితర సంఘాలు ఖండించాయి.


ప్రభుత్వం చేస్తున్న వాదన ప్రకారం ఎర్రకోట దగ్గర మరో చోట జరిగిన ఉదంతాలను మీడియా ఎలా నివేదించాలి. పోలీసులు జెండా ఆవిష్కరించిన నిందితులను పారిపోనిచ్చేంతవరకు, కొన్ని గంటల తరువాత తాపీగా వచ్చి జెండాలను తొలగించే వరకు ఎలాంటి వార్తలు మీడియా ఇవ్వకూడదు. ఎందుకంటే నిర్ధారించుకోవాలి కదా ! ఆ ఉదంతానికి బాధ్యుడు దీప్‌ సిద్దూ అనే సినిమా నటుడైన బిజెపి కార్యకర్త అని అందరికీ తెలిసినా పోలీసులకు మాత్రం తెలియదు. అతగాడు తాపీగా వెళ్లిపోతుంటే కనీసం ఆపి ఎవరు ఏమిటి అని ప్రశ్నించటం కూడా పోలీసులకు తెలియదు. ఈ తీరు మీద నిర్ధారించుకోకుండా ట్వీట్‌ చేయకూడదు, వార్త రాయకూడు ! తాపీగా వెళ్లిపోయిన అతని మీద అనివార్యమై కేసు పెట్టి 14రోజుల పాటు స్వేచ్చగా తిరగనిచ్చి అరెస్టు చేసేంత వరకు, దాన్ని అధికారికంగా పోలీసులు నిర్దారించి మీడియాకు చెప్పేంత వరకు వార్తలు రాయకూడదు. ట్వీట్‌ చేయకూడదు. దీన్నీ కూడా అంగీకరిద్దాం !


ఇక్కడే మరో దృశ్యాన్ని మనం చూడాలి. తమ్ముడు తమ్ముడే ధర్మం ధర్మమే అనే దేశం కదా మనది. దాన్ని నాలుగు పాదాలతో నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా ! అలాంటపుడు దేశద్రోహం, మతసామరస్యతను దెబ్బతీసినందుకు కేసులూ గట్రా అందరి మీదా పెట్టాలా లేక కేవలం ఎంపిక చేసుకున్న జర్నలిస్టులు, ఇతరులకేనా ? అదీ రైతు ఉద్యమం పట్ల విమర్శనాత్మకంగా లేదా రైతుల పట్ల సానుకూలంగా రాస్తున్న వారిమీదేనా ! ఇదే అసలు సమస్య. జనవరి 26న ఢిల్లీ ఎర్రకోట దగ్గర వందలాది మంది అమిత్‌ షా పోలీసులు కళ్లప్పగించి చూస్తుండగా ఒక యువకుడు అనుమతి లేకుండా సిక్కు మత జెండాను ఎగురవేశాడు. వెంటనే జరిగిందేమిటి ?

రైతులు ఎర్రకోట మీద ఉన్న జాతీయ జెండాను తొలగించి ఖలిస్తానీ పతాకాన్ని ఎగురవేశారు. అని వార్తలు గుప్పుమన్నాయి. టౌమ్స్‌ నౌ ప్రధాన సంపాదకుడు రాహుల్‌ శివశంకర్‌ జాతీయ జెండాను తొలగించారని చెబుతూ ఒక మత లేదా రైతు సంఘం పతాకాన్ని ఆవిష్కరించారని ముక్తాయింపు ఇచ్చారు. ఇది చిన్న నేరమా ? కాదు. ఆ ఛానల్‌ ఏదో గల్లీకి పరిమితం కాదు,సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పినట్లు సంపాదకుడి ట్వీట్లు, ఇచ్చిన వార్తలతో భయంకరమైన ప్రభావం మీద వేసుకొనే జనం కోట్లాది మంది ఉంటారు. దేశ ప్రజలను తప్పుదారి పట్టించి ఉద్యమిస్తున్న రైతుల మీద, సిక్కుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్య ! కాదా ? అయినా అతగాడి మీద ఎలాంటి కేసూ లేదు. ఎందుకని ?


ఒపిఇండియా అనే ఒక వెబ్‌సైట్‌ ఉంది.నిరసనకారులు ఖలిస్తానీ జెండాను ఎగురవేశారని ఒక వార్తను రాసింది. దాని సంపాదకుడు లేదా రాసిన జర్నలిస్టు మీద కూడా కేసు లేదు. ఇది తప్పుడు వార్తలు, విద్వేష పూరిత ప్రచారానికి పెట్టింది పేరు. కాషాయ తాలిబాన్లు నడుపుతున్న ఒక అబద్దాల, వక్రీకరణల ఫ్యాక్టరీ. ఢిల్లీ బిజెపి ప్రతినిధి హరీష్‌ ఖురానా, పార్లమెంటరీ కార్యదర్శి వరుణ్‌ గాంధీ ఇంకా కొంత మంది బిజెపి నేతలు, కార్యకర్తలు జాతీయ జెండాను అవమానించారని, ఖలిస్తానీ జెండాను ఎగురవేశారని సామాజిక, సాంప్రదాయ మాధ్యమాల్లో ప్రచారం చేశారు. సిక్కుల మీద విద్వేషం రెచ్చగొట్టారు. నిర్దారించుకోకుండా వారు చేసిన దానిలో ఎలాంటి నేరం కనిపించలేదా ? కేసులు ఎందుకు పెట్టరు ? దున్న ఈనిందంటే గాటన కట్టేయండి అన్నట్లుగా ఈ తప్పుడు వార్తను తెలుగు మీడియాతో సహా దేశమంతటా ప్రచారం, ప్రసారం చేశారు. నిర్దారించుకోకుండా ఆపని చేసినందుకు వీరిలో ఎందరి మీద కేసులు పెట్టారు ?


ఎర్రకోట దగ్గర సిక్కు మత జెండాను ఎగురవేసిన యువకుడి పేరు జుగరాజ్‌ సింగ్‌, పంజాబ్‌ నివాసి. అతను రైతుల ఉద్యమంలో పాల్గనేందుకు వచ్చాడు. అనేక మందితో పాటు ఎర్రకోట వద్దకు వెళ్లాడు. ఒకరు ఒక జెండాను ఇచ్చి అక్కడున్న జెండా దిమ్మ మీద ఎగురవేయమని చెప్పారు. ఎవరూ ఎక్కలేకపోయారు, జగరాజ్‌ సింగ్‌ ఎక్కాడు, ఎగురవేశాడు. దిగి వచ్చాడు. ఇదంతా పోలీసుల ముందే జరిగింది. వారెందుకు నివారించలేదు ? తన మనవడు అమాయకుడని, ఎవరో ఇచ్చిన జెండాను ఎగురవేశాడు తప్ప అతనికి ఇంకేమీ తెలియదని జగరాజ్‌ తాత చెబుతున్నాడు. అ జెండా ఇచ్చిన లేదా ఇప్పించిన వ్యక్తి దీప్‌ సిద్దూ అనే సినిమా నటుడని, ధర్మేంద్ర తీసిన సినిమాల్లో నటించాడని, ధర్మేంద్ర కొడుకు సన్నీ డియోల్‌ బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసినపుడు ప్రచారం చేశాడని, బిజెపి అగ్రనేతలతో ఫొటోలు దిగే సాన్నిహిత్యం కలవాడని తరువాత వెల్లడైంది. అతగాడు అనేక మందికి తెలిసిన వాడు, అక్కడ అందరికీ కనిపించచాడు గనుక పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. అదే కుట్రలో భాగంగా మరొకరి చేత జండాను తెచ్చి ఇచ్చి ఉంటే మొత్తం రైతుల మీదుగా పోయేదికాదా ?

నవరీత్‌ సింగ్‌ అనే 25 ఏండ్ల యువకుడు జనవరి 26 సంఘటనల్లో మరణించాడు. పోలీసులు ఏర్పాటు చేసిన ఆటంకాలను ట్రాక్టరుతో తొలగించేందుకు ప్రయత్నించిన నవరీత్‌ అదే ట్రాక్టరు తిరగబడి ప్రమాదవశాత్తూ మరణించాడని పోలీసులు చెబుతున్నారు. ఆ ఉదంతాన్ని చిత్రించిన వీడియోలో, పోస్టు మార్గం నివేదికలో అతని తల మీద ఒక తుపాకీ తూటా గాయం ఉందని తేలింది. ఆ ఉదంతాన్ని చిత్రించిన వారు చెబుతున్నదాని ప్రకారం పోలీసులు కాల్పులు జరిపిన తరువాత మాత్రమే ట్రాక్టర్‌ బోల్తాపడింది, కాల్పుల కారణంగానే అతను చనిపోయాడని అంటున్నారు. వైద్యులు తమతో ఆ విషయం మౌఖికంగా చెప్పారని, నివేదికలో ఆ విషయాన్ని రాయలేమమని ఒక వైద్యుడు చెప్పారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ విషయాన్ని నిర్దారించుకోకుండా వార్తలు ఇచ్చి పోలీసుల మీద నిందమోపారంటూ కేసు దాఖలు చేశారు. పోస్టు మార్టం నివేదికలో తూటా ప్రస్తావనే లేదని, ట్రాక్టర్‌ తిరగబడే మరణించాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసు కాల్పులు జరపటం అసాధారణమేమీ కాదు. కాల్పుల్లోనే మరణించాడని ట్వీట్‌ చేశారు లేదా వార్త ఇచ్చారు. దాన్ని వార్తగా ఇవ్వకపోతే కదా సమస్య ? కాశ్మీరులోయలో ఉగ్రవాదులు మరణించారని పోలీసులు చెబుతారు. అనేక ఉదంతాల్లో మరణించిన వారు ఉగ్రవాదులు కాదు సామాన్య యువకులు, ఉట్టి పుణ్యానికే చంపారని బంధువులు చెబుతారు. ఆ వార్తలను ఇవ్వాలా లేదా ? అలాంటి ఫేక్‌ ఎన్‌కౌంటర్ల గురించి మిలిటరీ కోర్టులు విచారణ జరిపిన ఉదంతాలు లేవా ? వార్తలు సరైనవా తప్పుడువా అన్నది తప్ప దేశద్రోహ అంశం ఏముంది అక్కడ ?


మీడియాలో వచ్చిన వార్తలకు భిన్నంగా జరిగితే పోలీసులైనా మరొకరైనా ఖండనలు లేదా వివరణలు ఇచ్చినపుడు వాటిని ప్రచురించకపోయినా, ప్రసారం చేయకపోయినా ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు, ఇతరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ నేరపూరితమైన సెక్షన్లతో కేసులు బనాయించటం రైతుల ఆందోళనల వార్తలను ఇస్తున్నందుకు తీర్చుకుంటున్న కక్ష తప్ప మరొకటి కాదు. కానట్లయితే నిర్దారించుకోకుండా వార్తలు రాసిన ఇతరులు, తప్పుడు ప్రచారం చేసిన బిజెపి పెద్దల మీద కూడా అలాంటి కేసులే ఎందుకు బనాయించలేదు ? తప్పుడు వార్తలను తయారు చేసేందుకు బిజెపి, దాని అనుయాయులు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక సంస్దలను ఏర్పాటు చేసి పుంఖాను పుంఖాలుగా ఉత్పత్తి చేస్తున్న విషయం అందరికీ విదితమే. అవి సమాజంలో ఎంత విద్వేషం రగిలిస్తున్నాయో అందరికీ తెలిసిందే ! రైతుల ఉద్యమంలో ఖలిస్తానీలున్నారని కొందరు, నక్సల్స్‌ ఉన్నారని మరి కొందరు, విదేశీ నిధులతో ఆందోళన చేస్తున్నారని, కమిషన్‌ ఏజంట్లు డబ్బు ఇస్తున్నారని, సిక్కుల వేషాల్లో ముస్లింలు చేరారని ఇలా చేయని తప్పుడు ఆరోపణలు, నకిలీ వార్తలను ఎవరు సృష్టించారు.ఉద్యమాన్ని వ్యతిరేకించే బిజెపి, దాని మిత్రపక్షాలు, వాటి నేతలు, కార్యకర్తలే కదా ? పర్యవసానంగా సిక్కులను, ఉద్యమంలో పాల్గొంటున్న రైతులను ఎలా నిందిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆ ప్రచారం సమాజంలో ఐక్యతకు తోడ్పడుతుందా విద్వేషాలకు ఆజ్యం పోస్తుందా ? ఇలాంటి అంశాలన్నీ ట్విటర్లలో, ఫేస్‌బుక్‌లో వస్తున్నపుడు వాటిని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కోరలేదు. అనేక ఉదంతాలలో న్యాయమూర్తులు స్వయంగా పత్రికా వార్తలను తీసుకొని విచారించిన ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి వార్తల మీద ఎవరూ స్పందించటం లేదు. మరోవైపు వ్యవసాయ చట్టాలకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నారని వేలాది ట్విటర్‌ ఖాతాలను స్ధంభింప చేయాలని కేంద్రం ఆదేశిస్తోంది ? ధర్మం ఒంటి కాలు మీదనా నాలుగు పాదాల నడుస్తోందా ? ఒకే పనిని తమ వారు చేస్తే దేశభక్తి, వ్యతిరేకులు చేస్తే ద్రోహమా ? ఏమిటీ విపరీతం !