Tags
#Farmers Protest, #Priyanka Chopra, #Rehne, Dia mirza, Narendra Modi, Priyanka Chopra, Rehne, tweets war on farmers agitation
ఎం కోటేశ్వరరావు
” మన రైతులు భారత ఆహార సైనికులు.వారి భయాలను పోగొట్టాల్సిన అవసరం ఉంది. వారి ఆశలను నెరవేర్చాల్సి ఉంది.వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్య వ్యవస్ధగా తరువాత అని కాకుండా త్వరలో ఈ సంక్షోభాన్ని పరిష్కరించేట్లు చూడాలి ” 2020 డిసెంబరు ఆరవ తేదీన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చేసిన ట్వీట్.
” మనం దీన్ని గురించి ఎందుకు మాట్లాడ కూడదు ” అని అమెరికా మీడియా సంస్ధ సిఎన్‌ఎన్‌లో మన రైతు ఉద్యమం గురించి వచ్చిన ఒక వ్యాసాన్ని, దానిలో చిత్రాన్ని ఉటంకిస్తూ హాలీవుడ్ నటి, గాయని రీఆనె 2021 ఫిబ్రవరి రెండున చేసిన ట్వీట్. రెండింటికీ నాలుగు రోజులు తక్కువగా రెండు నెలల తేడా !
ప్రియాంక ట్వీట్ అసలు చర్చనీయాంశమే కాలేదు. రీఆనె వ్యాఖ్య మీద ఇంత రచ్చ ఎందుకో తెలియదు. మొదటి దానిలో లేని అభ్యంతరం రెండవ ట్వీట్‌లో ఏముందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇద్దరూ సినీరంగానికి చెందిన వారే. ప్రియాంక ట్వీట్ మీద వివాదం రేగలేదు. పోనీ ఆమె కోరినట్లుగా సమస్యను పరిష్కరించారా అంటే అదీ లేదు. స్వయం కృతం- మేకులు కొట్టి, కాంక్రీటు పోసి మరింతగా గబ్బు పట్టారు. ఎందుకు నిర్లక్ష్యం వహించినట్లు ? సుదీర్ఘకాలం ఉద్యమం సాగిన తరువాతనే కదా ప్రపంచ మీడియా కేంద్రీకరించి వార్తలు రాసింది, ఢిల్లీ రోడ్ల మీద మేకుల ఫొటోలు, వీడియోలు చూపింది. విదేశాల్లోని సెలబ్రిటీలు వాటిని చదవరా ? స్పందించరా ? మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు అన్నట్లుగా సిఎన్‌ఎన్ రాసిన దాని మీద చేయని రచ్చ దాన్ని ఉటంకిస్తూ చేసిన ట్వీట్ మీదకు మళ్లించటం ఏమిటి ? ఒక మహిళ అన్న చులకనా ? భారత్‌లో ఉన్నారు కనుక, ఇక్కడ జరుగుతోంది ఏమిటో, దాని తీవ్రత ఏమిటో ప్రత్యక్షంగా చూశారు కనుక ప్రియాంక వెంటనే స్పందించారు. సుదూరంగా ఉన్నారు గనుక రీఆనె ఆలస్యంగా ట్వీట్ చేశారు. నిజంగా సచిన్ టెండూల్కర్ వంటి వారికి రైతుల మీద ఆసక్తి ఉంటే ప్రియాంక మాదిరి ఎందుకు స్పందించలేదు? పరిష్కరించమని కోరితే వారి సొమ్మేమైనా పోతుందా ? నోటి ముత్యాలు రాలతాయా ? వారికి సామాజిక బాధ్యత లేదా ?
ట్విటర్ కంపెనీ మీద వత్తిడి, బెదిరింపు !
రైతు ఉద్యమం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నిర్ధారించుకోకుండా అవాస్తవ సమచారంతో దేశద్రోహానికి పాల్పడ్డారంటూ అనేక మంది జర్నలిస్టుల మీద బిజెపి ప్రభుత్వాలు, అనుయాయులు కేసులను దాఖలు చేశారు. వాటి మీద సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూద్దాం. మరోవైపు ప్రభుత్వం సామాజిక మాధ్యమ సంస్ద అయిన ట్విటర్ కంపెనీకి 1,178 ఖాతాలను ఇచ్చి వాటిని మూసివేస్తారా మీ మీద చర్య తీసుకోమంటారా అని కత్తి పెట్టి కూర్చుంది. ఇవన్నీ పాకిస్దాన్, ఖలిస్తాన్ మద్దతుదారులకు చెందినవని చెబుతోంది. మా నిబంధనలకు విరుద్దంగా ఉన్న 500 ఖాతాలను నిలిపివేశాము, ఈ విషయం గురించి మాట్లాడదాము అంటే ససేమిరా కుదరదు, ముందు మేము చెప్పిన ఖాతాలను నిలిపివేయాల్సిందే అని చెబుతోంది. మాట్లాడితే పోయేదేముంది ? ట్విటర్ కంపెనీ తీసుకున్న చర్యల ప్రకారం కొన్ని ఖాతాల ట్వీట్లు మన దేశంలో కనిపించవు, ఇతర దేశాల వారికి అందుబాటులో ఉంటాయి. వార్తా సంస్దలు, జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నేతలకు సంబంధించి ఇంతవరకు ఎవరివీ నిలిపివేయలేదని, అలా చేయటం భారత చట్టాల ప్రకారం భావ ప్రకటనా స్వేచ్చను ఉల్లంఘించటమే అవుతుందని, అందువలన దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని ట్విటర్ పేర్కొన్నది. మన చట్టాల గురించి మన పాలకులకే విదేశీ కంపెనీ గుర్తు చేయాల్సిన దుస్ధితి ఎందుకు దాపురించిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దీన్నే మరో విధంగా చెప్పాలంటే భావ ప్రకటనా స్వేచ్చను లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ రోజు రైతు ఉద్యమం సాకు అయితే రేపు మరొక సాకు చూపుతారు. ప్రభుత్వ ప్రసార సాధనాలను ఆదేశాలతో, ప్రయివేటు మీడియాను పాకేజ్‌లు, అదిరింపులు బెదిరింపులతో ఇప్పటికే భజన కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు సామాజిక మాధ్యమం మీద కేంద్రీకరించారు. తమ ఆదేశాలను ధిక్కరించినట్లయితే జరిమానాతో పాటు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే సెక్షన్లను ఉటంకిస్తూ ట్విటర్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు.
బేటీల ఉద్యోగాలను పోగొట్టిన బిజెపి !
పాలకపార్టీని సంతృప్తి పరచేందుకు ట్విటర్ కంపెనీ భారత విధాన డైరెక్టర్‌గా ఉన్న మహిమా కౌల్‌ను ఇంటికి పంపింది. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు తప్ప తాజా వివాదానికి సంబంధం లేదని కంపెనీ ఒక ప్రకటన చేసింది. ఖాతాల తొలగింపు లేదా ప్రభుత్వ ఆదేశాల విషయంలో ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసి ఉండాలి. బిజెపికి లొంగని కారణంగా మహిమా కౌల్ ఉద్యోగాన్ని కోల్పోతే ఫేస్‌బుక్‌లో బిజెపికి తోడ్పడిన విషయం బహిర్గతం కావటంతో అంఖీదాస్ అనే బిజెపి మద్దతుదారు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బిజెపి కార్యకర్తల విద్వేష పూరిత ప్రచారాన్ని నిరోధించాలనే అంశం ముందుకు వచ్చినపుడు మోడీ పార్టీ, హిందూత్వ ముఠాల ఖాతాలపై చర్యలు తీసుకుంటే కంపెనీ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని అంఖీదాస్ అడ్డుపడ్డారని వెల్లడైంది. ముస్లింలు, ఇతర మైనారిటీల మీద విద్వేష పూరిత ప్రచారాన్ని అనుమతించారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఫేస్‌బుక్ పరువు మురికి గంగలో కలిసింది. ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా వ్యక్తిగత కారణాలతోనే వైదొలిగినట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.
లతా మంగేష్కర్, సచిన్ పరువు కంటే తన బండారం గురించే బిజెపి భయం !
వివిధ ట్విటర్ ఖాతాలలో ఒకే విధమైన మాటలు, సమాచారంతో ట్వీట్లు వెలువడటం తెలిసిందే. అవి భజన లేదా విద్వేష ప్రచారానికి సంబంధించినవి ఏవైనా కావచ్చు. సరిగ్గా అలాంటి ట్వీట్లే రైతు ఉద్యమానికి సంబంధించి భారత రత్నలు లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ మరికొందరు ప్రముఖుల పేరుతో వెలువడ్డాయి. తొంభై ఒక్క సంవత్సరాల వృద్ధాప్యంతో ఉన్న లతా మంగేష్కర్ పనిగట్టుకొని ట్వీట్ చేశారంటే నమ్మటం కష్టమే. ఒక వేళ ట్వీట్లు చేసిన వారందరూ దాదాపు ఒకే పదజాలాన్ని వారంతా ఎలా వినియోగించారన్నది ఆసక్తి కలిగించే అంశం. వాటిని బలవంతంగా వారి చేత ఇప్పించారనే అభిప్రాయం వెల్లడి కావటంతో దాని గురించి విచారణ జరపాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేముంది భారత రత్నలనే అవమానిస్తున్నారు కనుక కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలంటూ బిజెపి రంగంలోకి వచ్చింది.
విదేశీ తారల మద్దతుతో ప్రతిపక్ష పార్టీలు అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తున్నాయంటూ రుసురుసలాడుతూ బిజెపి ఎంఎల్‌ఏ ఒకరు బజారుకెక్కారు. కాంగ్రెస్ తరఫున తాను భారత రత్నలకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. మన నేల గురించి ఏమాత్రం తెలియని వారు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంటే ప్రముఖులు ఏకోన్ముఖ వైఖరి తీసుకొనేందుకు ముందుకు వచ్చారన్నారు. ముందే చెప్పుకున్నట్లు నిజానికి దేశానికి మాయని మచ్చ ఢిల్లీ శివార్లలో రోడ్ల మీద పాతిన ఇనుప మేకులు, కాంక్రీటుతో ఏర్పాటు చేసిన ఆటంకాల చిత్రాలు, వీడియోలు రావటానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే కదా ! భారత్‌లో ప్రజాందోళనల అణచివేతకు ఇలాంటి అనాగరిక ఏర్పాట్లు చేస్తారా అని సభ్యసమాజం యావత్తూ విస్తుపోతోంది.
కాంగ్రెస్ గానీ, మరొకరు గానీ లతా మంగేష్కర్ సంగీతం గురించి లేదా సచిన్ టెండూల్కర్ క్రికెట్, ఇతర రంగాలలో అనేక మంది చేసిన కృషికి గుర్తింపుగా భారత రత్నలుగా ప్రకటించటాన్ని ఎవరూ తప్పుపట్టలేదు, పట్టాల్సిన అవసరమూ లేదు. ప్రముఖులందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే రకమైన పదజాలాలను తమ ట్వీట్లలో ఎలా వినియోగించారన్నదే బయటకు రావాల్సిన అంశం.
నరేంద్రమోడీ బ్రాండ్ సృష్టికి ఎన్ని వందల కోట్లు వెచ్చించారు ?
ఎవరైనా తమను విమర్శిస్తే వారి వ్యక్తిగత, సంస్దల లోపాలు, తప్పులు వెతికి వాటిని ఆయుధాలుగా చేసుకొని దాడులు చేయటం తెలిసిందే. లేకపోతే కల్పిత ఆరోపణలతో అదే పని చేస్తారు. ఇటీవలి కాలంలో డబ్బులిచ్చి ఉద్యోగులను పెట్టుకొని పేరు, ప్రతిష్టలను తయారు చేయించుకొనే పెద్ద మనుషుల గురించి తెలిసిందే. రైతులకు మద్దతుగా, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేసిన వారందరూ డబ్బు తీసుకొన్నారనే నిందలను మోపారు. అదే ప్రాతిపదిక అయితే ప్రపంచం నరేంద్రమోడీ నాయకత్వం ఎదురు చూస్తోందన్న ట్వీట్ల వెనుకు ఎంత డబ్బు చేతులు మారి ఉండాలి? అసలు ప్రపంచ నాయకులు ఎవరూ లేరు. లేని గొప్పను ఆపాదిస్తూ ప్రచారం చేసుకోవటమే కదా ! ఆర్ధికవేత్తగా మన్మోహన్ సింగ్ ఏమిటో అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీగారు ఏమి చదివారో, ఆయన డిగ్రీ ఏమిటో తెలియదు. మా మోడీ ఎంత సాధారణ వ్యక్తో తెలుసుకోండి అంటూ మరుగుదొడ్లు, స్నానపు గదులు శుభ్రం చేస్తున్న చిత్రాలంటూ సామాజిక మాధ్యమంలో తిప్పిన వారెవరో తెలుసు. చైనాలో కూడా నరేంద్రమోడీకే ఎక్కువ ఆదరణ ఉందని ఆ దేశ పత్రిక సర్వే వెల్లడించిందనే తప్పుడు ప్రచారం చేసింది ఎవరు ? దానికి ఎంత సొమ్ము చెల్లించారు? ఎవరు చెల్లించారు ?
2014లోక్ సభ ఎన్నికలకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీకి ఒక ప్రతిష్టను సృష్టించేందుకు ఎన్ని సంస్దలను వినియోగించారో, ఎందరు నిపుణులు దానివెనుక ఉన్నారో ? అందుకు మోడీ టీమ్ ఎంత ఖర్చు చేసిందో అంచనా వేయలేము. ఇప్పుడు ప్రశాంత కిషోర్ వివిధ పార్టీలకు పని చేస్తున్నట్లుగానే మోడీ గారు కూడా అనేక సంస్ధలతో ఆపని చేయించారు. ఆసక్తి ఉన్నవారు దిగువ లింక్‌లోని విశ్లేషణ చదవ వచ్చు.https://www.businesstoday.in/magazine/case-study/case-study-strategy-tactics-behind-creation-of-brand-narendra-modi/story/206321.html
రైతుల ఉద్యమానికి మద్దతుగా పాప్ సంగీత గాయని రీఆనె ఇచ్చిన ట్వీట్‌తో దిమ్మ తిరిగింది. దాంతో ఒక సంస్ధ నుంచి ఆమె డబ్బు తీసుకుందనే ప్రచారం చేశారు. దానికి రుజువులు చూపాలంటూ ఆ సంస్ధ సవాలు చేసింది. ఇంతవరకు నోరు మెదపలేదు. బట్టకాల్చి ఎదుటి వారి వేయటమే అసలు లక్ష్యం. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వినరు జోషీ లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ పేరుతో ఒక స్వచ్చంద సంస్దను ఏర్పాటు చేశారు. కేసులు వేయటమే దాని పని. దాని లక్ష్యం ఏమిటన్నది తెలిసిందే.రీఆనె ట్వీట్ చేయగానే ఆ సంస్ధను రంగంలోకి దించారు. ఆమె కంపెనీ ఒకటి 2017 నుంచి తయారు చేస్తున్న సౌందర్య ఉత్పత్తులలో ఝార్కండ్‌లోని గనుల నుంచి సేకరిస్తున్న మైకా(అబ్రకం)కు అవసరమైన నిర్ధారణ పత్రాలు ఉన్నాయా, గనుల్లో బాల కార్మికుల వినియోగం గురించి దర్యాప్తు జరపాలంటూ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు లేఖ రాయించారు. ఒక వేళ నిజంగానే అదే జరుగుతోందని అనుకుందాం ! ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్ధ ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నది ? ఇతర అనేక రంగాలలో బాలకార్మికులను వినియోగిస్తున్న ఉదంతాలపై సదరు సంస్ధ ఎన్ని ఫిర్యాదులు చేసింది? ఇలాంటి వివాదాలను రేపటం వెనుక జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ తప్ప బాలకార్మికుల మీద ప్రేమ కాదు. మన దేశంలో సరైన తిండి లేక మరణిస్తున్న బాలలు, ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న తల్లులు, ఆకలి, వ్యాధులు, దిగజారుతున్న ప్రజాస్వామ్య సూచికల గురించి ప్రపంచ సంస్ధలు ఇస్తున్న నివేదికల కంటే ఎక్కువగా రైతు ఉద్యమం మీద చేసిన ట్వీట్లు మన దేశ పరువును తీశాయా ? వాటి గురించి భారత రత్నలు ఎప్పుడైనా పట్టించుకున్నారా ? ట్వీట్లతో దేశ పరువు కంటే కృత్రిమంగా తయారు చేసుకున్న నరేంద్రమోడీ, బిజెపి పరువు పోతోందన్నదే అసలు దుగ్ద !
యూ ట్యూబ్ మీద వత్తిడి, కమలా హారిస్ సోదరి కుమార్తె చిత్ర పటాల దగ్దం !
కేంద్ర ప్రభుత్వం ఒక్క ట్విటర్ మీదనే కాదు యూ ట్యూబ్ మీద కూడా వత్తిడి తెచ్చింది. రైతు ఉద్యమానికి మద్దతుగా తయారు చేసిన పాటలను తీసివేయించింది. అసీ వాద్దేంగే అనే గీతాన్ని తొలగించటానికి ముందు కోటీ 30లక్షల మంది చూశారు. అయిలాన్ అనే మరో పాటను కోటి మంది చూశారు. యూట్యూబ్ నుంచి అయితే తీసివేయించగలిగారు గానీ రైతుల హృదయాల నుంచి ఎలా తొలగిస్తారని రైతు నేతలు ప్రశ్నించారు. ఈ పాటలను ఎందుకు తొలగించారో యూట్యూబ్ ఒక్క ముక్క కూడా చెప్పలేదు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. ఆమె చెల్లెలు మాయ కుమార్తె మీనా హారిస్. ఆమె కూడా రైతుల ఉద్యమానికి సానుకూలంగా స్పందించారు. ఆమె మీద కాషాయ మరుగుజ్జులు దాడి చేశారు. బూతులు తిట్టారు, అనేక చోట్ల ఆమె ఫొటోలను తగులబెట్టారు.ఒక వేళ మేము భారత్‌లో ఉండి ఉంటే వారేమి చేసేవారో తగులబెట్టిన ఫొటోలు వెల్లడిస్తున్నాయి. అయినా నన్నెవరూ బెదరించలేరు, నోరు మూయించలేరు. ధైర్యవంతులైన భారత పురుషులు రైతులకు మద్దతుగా మాట్లాడిన ఒక మహిళ చిత్రాలను తగులబెట్టారు. అది వారికి సర్వసాధారణం అనుకుంటున్నాను అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.కార్మిక హక్కుల కార్యకర్త నవదీప్ కౌర్‌ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి లైంగికంగా దాడి చేశారు అని కూడా మీనా ట్వీట్లు చేశారు. కమలా హారిస్ కుమార్తె వరుస కావటంతో సహజంగానే మీనా ట్వీట్లకు కూడా పెద్ద స్పందన వెల్లడైంది.భారతీయ వారసత్వం ఉండి కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తుందా అన్న ఉక్రోషం తప్ప మరొకటి కాదు. ఎంత మంది నోరు మూయిస్తారు. అలాంటి చర్యల వలన మరింత మంది నోళ్లలో నానుతారనే విషయం పట్టించుకొనే స్ధితిలో లేరు.
వ్యవసాయం గురించి మాట్లాడే నరేంద్రమోడీ ఎప్పుడైనా మేడి పట్టారా -కాడి మోశారా !
సెలబ్రిటీలు నోరు తెరిస్తే మాకు భజన చేయాలి లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి అన్నట్లుగా ఉంది కాషాయ మరుగుజ్జుల తీరు. ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగా నది చమోలీ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు తీసింది. నదిపై నిర్మించిన అనేక ఆనకట్టల నిర్మాణం వరదలకు దారి తీసిందని, చమోలీ పౌరుల కోసం ప్రార్ధనలు జరపాలని బాలీవుడ్ నటి దియా మీర్జా ట్వీట్ చేసింది. దానిలో తప్పేముంది, నిజం అదిగాకపోతే కారణాలు వెల్లడైన తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. దేశానికి జరిగిన నష్టం ఏముంది ? అయినా ఎందుకు ఆమె మీద దాడి చేశారు ? నాలుగు పదుల వయస్సున్న దియా మీర్జా తండ్రి జర్మన్-తల్లి బెంగాలీ. హైదరాబాదులో పుట్టి పెరిగింది. తలిదండ్రులు విడిపోయిన తరువాత దియా తల్లి హైదరాబాదుకు చెందిన అహమ్మద్ మీర్జాను వివాహం చేసుకుంది. దియా తన మారు తండ్రి ఇంటి పేరునే తాను స్వీకరించింది.
దియా నటి, పర్యావరణ రక్షణ ఉద్యమ కార్యకర్త. గత పది సంవత్సరాలుగా దానికి సంబంధించిన అంశాల మీద ఆమె మాట్లాడుతోంది. ఆమె కృషికి గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నిర్దేశించిన నిరంతర అభివృద్ది లక్ష్యాల రాయబారిగా ఆమెను నియమించారు. ఇంతకంటే ఆమె కృషికి గుర్తింపు ఏమి కావాలి. మియా ఖలీఫా ఒక రైతు అయినట్లుగానే దియా ఒక పర్యావరణ వాది అంటూ హేళన చేశారు. మియా ఖలీఫా గానీ మరొక సినిమా నటిగానీ తాము రైతులమని ఎక్కడా చెప్పలేదు, రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు తప్ప మరొకటి కాదు. రైతుల గురించి మాట్లాడిన వారందరూ రైతులే కానవసరం లేదు. ఆమాటకు వస్తే నరేంద్రమోడీ రోజూ రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడైనా మేడి పట్టారా – కాడి మోశారా ? వేరుశనగ కాయలు ఎక్కడ కాస్తాయో తెలుసా ? అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? టీ అమ్మాను అని ఆయన చెప్పుకోవటమే గాక నేను చూశాను అని ఇంతవరకు ఒక్కరూ చెప్పలేదు. మోడీ గారు ఏమి చదువుకున్నారో తెలియదు గానీ, ఆయన మాట్లాడుతున్న ఆర్ధిక విషయాలకు మోడినోమిక్స్ అని పేరు పెట్టారు. అలాంటి ఆర్ధిక నిపుణుడి ఏలుబడిలో దేశం ఇంతగా ఎందుకు దిగజారినట్లు ? ఒక అంశం గురించి మాట్లాడాలంటే దాని డిగ్రీ కలిగి ఉండాలా ? పాలకులకు నచ్చని విషయాలను రాస్తే లేదా వ్యతిరేకంగా మాట్లాడిన మహిళల మీద నోరుబట్టని బూతులతో దాడి జరగటం చూస్తున్నాం. వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. రేప్ చేస్తామని బెదరిస్తారు. అవే నోళ్లు మహిళలను గౌరవించాలని, పూజించాలని మాట్లాడుతుంటే ఎంత అసహ్యంగా ఉంటోందో !
నాడు ఇందిరే ఇండియా – నేడు బిజెపి ప్రభుత్వమే దేశం !
గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన డికె బారువా ఇండియా అంటే ఇందిర- ఇందిర అంటే ఇండియా అని సెలవిచ్చి వ్యక్తి పూజకు తెరలేపి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ప్రభుత్వమంటే దేశం- దేశమంటే ప్రభుత్వం అనే పద్దతిలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్ వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే రైౖతు ఉద్యమం గురించి ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తే అది దేశ భక్తి- విమర్శిస్తే అది దేశద్రోహం అంటూ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం వేరు-దేశం వేరు అని కాషాయ దళాలకు తెలియకనా ? కానే కాదు. తమను గుడ్డిగా నమ్మే వారి మెదళ్లను తప్పుడు అవగాహనతో నింపే పెద్ద పధకంలో భాగమే అది.
రైతు ఉద్యమం గురించి తెలియని వారికి తెలియ చెప్పటంలో ఆ ఉద్యమాన్ని సమర్ధిస్తున్న పార్టీలు లేదా సంస్ధలు ఎంతవరకు జయప్రదమయ్యాయో తెలియదు గానీ బిజెపి మాత్రం ఇప్పుడు నిరంతరం అదే కార్యక్రమంలో ఉంది. అందుకు గాను ఆ పార్టీని ”అభినందించక ” తప్పదు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగం మీద ప్రధాని మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం మరింత గట్టిగా సాగేందుకు అవసరమైన పునాది వేశారు. ఆందోళనా జీవి అనే కొత్త పదాన్ని ప్రయోగించారు.సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణాలో ఒక కంపెనీ కొనుగోలు చేసిన భూ వివాదంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరును ఆందోళనా జీవి ఆవహించింది. హైదరాబాద్ నగరపాలక సంస్ధ ఎన్నికల సందర్భంగా రోహింగ్యాల మీద మెరుపుదాడులు చేస్తామని ఆ పెద్దమనిషి ప్రకటన చేశారు. నల్లగొండ జిల్లాలో గిరిజనుల కోసం ” కరసేవ ” చేస్తానంటూ రెచ్చగొడుతూ కంపెనీకి చెందిన ఒక షెడ్డును ధ్వంసం చేయించిన దృశ్యాలను చూశాము. భక్తి శివుడి మీద చిత్త బయట ఉన్న చెప్పుల మీద అన్నట్లుగా గుర్రంపోడు గిరిజనుల మీద కంటే సాగర్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని చేశారన్నది స్పష్టం. నిజానికి ప్రధాని లేదా బిజెపికి ఆందోళనలతో పనిలేకపోతే లేదా పట్టకపోతే ఆ పార్టీకి అనుబంధంగా అనేక సంఘాలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? నిత్యం అవి ఏదో ఒక ముట్టడి పేరుతో ఆందోళనలకు ఎందుకు దిగుతున్నట్లు ? వాటిని రద్దు చేస్తారా ?
పర్యావరణ ఉద్యమ కార్యకర్తగా అతి చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్న గ్రేటా టన్‌బెర్జ్ ఇలా చెప్పింది.” సైన్సు మరియు ప్రజాస్వామ్యం ఒకదానితో ఒకటి బలమైన సంబంధం కలిగినవి.అవి భావ ప్రకటనా స్వేచ్చ, స్వాతంత్య్రం, వాస్తవాలు మరియు పారదర్శకత మీద నిర్మితమౌతాయి. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే బహుశా మీరు సైన్సుకూ గౌరవం ఇవ్వరు. మీరు సైన్సును గౌరవించపోతే ప్రజాస్వామ్యాన్నీ గౌరవించరు ”.
గ్రేటా టన్‌బర్జ్ చెప్పిందే దేశంలో నేడు జరుగుతోం సైన్సును గౌరవిస్తున్నామని ఒక నోటితో చెబుతూ అదే నోటితో మహాభారత కాలంలోనే మన దేశంలో కృత్రిమ గర్భధారణతో పిల్లల్ని పుట్టించే ప్రక్రియ తెలుసనీ, పురాణ కాలంలోనే ఏనుగు తలను మనిషికి అంటించే ప్లాస్టిక్ సర్జరీ పరిజ్ఞానం ఉందనీ, ఎలాంటి ఇంధనం లేకుండానే ఎటు కావాలంటే అటు తిరిగే విమానాలు మన దేశంలో ఉండేవని చెబుతున్న వారెవరో మనకు తెలుసు. అలా చెప్పటం సైన్సును అవమానించటం తప్ప గౌరవించటం కాదు. దాన్ని గౌరవించని అధికారంలో ఉన్న ఆ పెద్దలు ప్రజాస్వామ్య వ్యవస్దను కరిమింగిన వెలగ పండులా మారుస్తున్న తీరూ తెలుసు ? ముసురుతున్న చీకట్లు, వేసుకున్న ముసుగులు తొలుగుతాయి. దేనికైనా తగు సమయం రావాలి !
Good sir
LikeLike