ఎం కోటేశ్వరరావు
తలచినదే జరిగినదా దైవం ఎందులకు !
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు !
అన్నారు మనసు కవి ఆచార్య ఆత్రేయ. దేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీ తలచినట్లే జరుగుతున్నాయా ? లేక జరిగినది తలచుకొని శాంతి లేకుండా ఉన్నారా ? ఒక్కటైతే వాస్తవం బిజెపి అజెండాకు అనుగుణ్యంగా పరిణామాలు-పర్యవసానాలు లేవు. సామాన్య జనాన్ని అడ్డుకొనేందుకు రోడ్ల మీద మేకులు కొట్టాల్సి వస్తుంది-కాంక్రీటు పోసి ఆటంకాలు కల్పించాల్సి వస్తుంది అని ఎవరైనా కలగంటారా ! లేదన్నది అందరికీ కనిపిస్తున్న వాస్తవం. సంతోషం – దుఖం కలిగినా వచ్చేది కన్నీళ్లే కదా ! నరేంద్రమోడీ గారిలో అలాంటి లక్షణాలేవీ కనిపించటం లేదు. వాటికి అతీతులైన వారి కోవకు చెందిన వారని అనుకుందామా ?
రికార్డు స్ధాయిలో మాంద్యంలో ఉన్న దేశ ఆర్ధిక వ్యవస్ధను ప్రధాని నరేంద్రమోడీ ఏ మంత్ర దండంతో మామూలు స్ధితికి తీసుకు వస్తారు ? రైతు ఉద్యమాన్ని ఏమి చేయబోతున్నారు ? తదుపరి సంస్కరణలు ఎవరి మెడకు బిగుసుకోనున్నాయి ? రైతుల మాదిరి వీధులకు ఎక్కే ఆందోళనా జీవులు ఎవరు ? ప్రధాని ప్రతిపక్షాలను, ఆందోళన చేస్తున్న వారిని ఎకసెక్కాలాడి తనకు తానే కార్పొరేట్ జీవిగా లోకానికి ప్రదర్శించుకున్నారని విమర్శిస్తే విమర్శించవచ్చుగాక, ఆందోళనా జీవులకు ఎక్కడో మండితే మండవచ్చు గాక ! తమ నేత ఆ మాట అన్నారు గనుక బిఎంఎస్,ఎబివిపి,భారతీయ కిసాన్ సంఫ్‌ు వంటి సంఘపరివార్ సంస్దలు తమ ఆందోళన కార్యక్రమాలను వదలివేయటం గురించి జనానికి చెప్పాలి. దేశాన్ని మోడీ ఏం చేస్తారో అని ప్రతిపక్షాలు భయపడుతుంటే, తమ ప్రియతమ నేత మోడీ సమస్యల వలయం నుంచి ఎలా బయటపడతారు అనే ఆందోళన బిజెపిలో ప్రారంభమైంది. మోడీని నమ్ముకొని రైతు ఉద్యమానికి దూరంగా, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న తమ భవిష్యత్ గురించి మిత్రపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బను ఒప్పుకోలేని స్ధితి ఎలా ఉంటుందో తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ను చూస్తే తెలుస్తోంది కదా !
ఆగస్టు 30న తన 68వ మనసులోని మాట ప్రసంగం సమయంలో దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్దాయిలో ఉంది. జనం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.ఉపాధి లేదు, ఆదాయం లేదు. సరిహద్దులో యుద్ద మేఘాలు కమ్ముకున్నట్లు మీడియా తెలియచేసింది. అంతకు ముందే చప్పట్లు, దీపాల ఆర్పటం- కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఆ స్దితిలో మనసులోని మాటలుగా చెప్పింది ఏమిటి ? పిల్లలు ఆడుకొనే బొమ్మలు, వాటి తయారీ, భారతీయ జాతి కుక్కలను పెంచమని చెప్పారు.దానికి కొద్ది రోజుల ముందు నెమళ్లతో కాలక్షేపం ఎలా చేస్తారో వీడియోలను చూపించిన విషయం తెలిసిందే. వాటిని విన్నవారు,కన్నవారు ఏమనుకుంటారు ? అంతటి నరేంద్రమోడీకి సైతం దిక్కుతోచని క్షణాలు ఉంటాయని తెలియటం లేదూ !
ఈ మధ్య నరేంద్రమోడీని చూస్తే నిరంతరాయగా పెంచుతున్న గడ్డం, జులపాలను కత్తిరిస్తారా లేదా అన్న చర్చ కూడా ప్రారంభమైంది. మొదటి నుంచి బైరు గడ్డాల యోగులు లేదా యోగి ఆదిత్యనాధ్ వంటి వారి పరంపరను పాటిస్తే అదొక తీరు. లాక్‌డౌన్ సమయంలో క్షౌరశాలలను మూసివేయటం, క్షురకులు ఇండ్లకు వచ్చినా చేయించుకొనేవారు ముందుకు రాకపోవటంతో పురుషులందరూ లాక్‌డౌన్ స్టైయిల్లో దర్శనమిచ్చారు. అందరితో పాటు నరేంద్రమోడీ కూడా అలాగే పెంచి ఉంటారని తొలి నెలల్లో చాలా మంది పెద్దగా ఆసక్తి చూపలేదు. కొందరు ముందుకు వచ్చినా దాని మీద చర్చలు నిర్వహించే ధైర్యం టీవీ ఛానళ్లకు లేదు. ఎవరు ముందు మొదలు పెడితే ఏమౌతుందో అన్న భయం కావచ్చు.
చిత్రం ఏమిటంటే నరేంద్రమోడీ తన ట్విటర్ చిరునామాకు చౌకీదారు అని తగిలించుకోగానే ఆయన వీరాభిóమానులు తమ పేర్ల చివర చౌకీదారు అని తగిలించుకోవటం చూశాము. కానీ ఇప్పుడు గడ్డం, మీసాలు, జులపాలు ( ముందు ముందు వాటి ప్రస్తావన వచ్చినపుడు -ఆ మూడింటిని- అందాం) ఎవరూ పెంచటం లేదు. ఏ బిజెపినేతా మోడీ గారిని అనుసరించటం లేదంటే మోజు తీరిందనుకోవాలా గౌరవం పోయిందనుకోవాలా ? నరేంద్రమోడీ నిరంకుశబాటలో ఉన్నారని కొందరు విమర్శిస్తున్నారు, ఎక్కువ మంది దైవదూత అన్నట్లు చూస్తున్నారు గనుక ఏ తరగతిలో చేర్చాలా అన్నది కొంతకాలం పక్కన పెడదాం. చరిత్రలో నియంతలెవరూ ఆలోచనా స్వేచ్చను అణచలేకపోయారు. కనుక ఆ మూడింటి గురించి ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. రోజులు బాగో లేవు గనుక బయటకు చెప్పకండి ! మోడీ ప్రముఖులు, ప్రజాజీవనంలో ఉన్నారు. గతంలో ఆయన వేసుకున్న కోటు, సూటు, బూటు గురించి అనుకూలంగానో ప్రతికూలంగానో చర్చ జరిగింది. అలాంటపుడు ఆ మూడింటి గురించి చర్చించకుండా జనం గానీ మీడియా గానీ ఎంతకాలం ఉంటుంది ? మోడీ గడ్డాన్ని చూసి పాకిస్ధాన్ భయపడుతోందనే కథనాలు కూడా ప్రారంభమయ్యాయి !
పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు మాదిరి ఏక్షణంలో అయినా ఆకస్మికంగా తన గడ్డం గురించి ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేయవచ్చు గుట్టు చప్పుడు కాకుండా తీయించుకోవచ్చు అనుకోవచ్చా ! కర్ణాటకలోని ఉడిపి పెజావర మఠం స్వామీజీ విశ్వప్రసన్న తీర్ధ చెప్పినదాన్ని బట్టి దానికి అవకాశం లేదు. రామ మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు వాటిని తొలగించకూడదనే సంకల్పంలో భాగం ఆ పెంపుదల కావచ్చన్నది విలేకర్ల సమావేశంలో స్వామీజీ మాటల సారాంశం.
ఆ మూడూ పెద్దగా పెరగనపుడే గతేడాది ఆగస్టులో జర్నలిస్టు బర్ఖాదత్, లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ వాటి గురించి చర్చించారు.అయోధ్య తీర్పు వచ్చిన నాటి నుంచీ మోడీ తన గడ్డాన్ని చేసుకోకపోవటాన్ని మీరు గమనించవచ్చు. అది రోజు రోజుకూ పెరుగుతోంది, చూస్తుంటే కాషాయ దుస్తుల్లో ఉండే రాజరుషి మాదిరి తయారవుతున్నారనిపిస్తోందని ఎంపీ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భాగంగానే అలా చేస్తున్నట్లుగా మీ మాటలు ధ్వనిస్తున్నాయని బర్ఖాదత్ అనగా ఒక్క ముస్లింలు ధరించే టోపీ మినహా అన్ని రకాల తలపాగలను మోడీకి బహుకరించారని ధరూర్ చెప్పారు.దేశంలో ఉపాధికి బదులు మోడీ తన గడ్డాన్ని పెంచుతున్నారని అసోం కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా వ్యాఖ్యానించారు. గడ్డం మీద గాక ఆర్ధిక వ్యవస్ద పెంపుదల మీద శ్రద్ద పెట్టండని ట్విటర్లు కొందరు వ్యాఖ్యానించారు.
రైతుల ఉద్యమం గురించి అంతర్జాతీయంగా చర్చించకూడదన్నది బిజెపి అభిమతం. విధి వైపరీత్యం అంటారు కదా ! ఏ సామాజిక మాధ్యమాన్ని అయితే బిజెపి అందరి కంటే ఎక్కువగా ఉపయోగించుకుందో అదే సామాజిక మాధ్యమం ఆ పార్టీని ప్రపంచవ్యాపితంగా జనం నోళ్లలో నానేట్లు చేసింది. రైతు ఉద్యమం గురించి విదేశీ పత్రికల్లో వచ్చింది, కెనడా ప్రధాని దాని గురించి ప్రస్తావించారు. అయినా ఒక పాప్ గాయని, విద్యార్ధిని అయిన ఒక పర్యావరణ ఉద్యమ కార్యకర్త చేసిన ట్వీట్లతో రచ్చ రచ్చైంది.
గడ్డం గురించి ఇప్పుడు నరేంద్రమోడీ ప్రస్తావన వస్తోంది గానీ, ఆయనకంటే సీనియర్‌ను అని చెప్పుకొనే చంద్రబాబు నాయుడి గడ్డం గురించి ఎలాంటి వ్యాఖ్యలు వెలువడ్డాయో తెలుసు కదా ! ఎన్నడూ ఆయన దాని గురించి స్పందించలేదు. అయినా ఒకరి గడ్డం మరొకరికి అడ్డం కాదు కనుక అంతగా ఆందోళన పడాల్సిన లేదా ఎవరైనా ఏమన్నా స్పందించాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్ సమయంలో ప్రారంభించిన ఆ మూడింటి గురించి నరేంద్రమోడీ ఇంతవరకు ఏమీ చెప్పకపోయినా జనం పరిపరి విధాలుగా అనుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు మౌనంగా ఎలా ఉంటారు ? మోడీగారి తీరుతెన్నులను చూస్తే ఒక మహానటుడిలో ఉండే లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పవచ్చు.బహుశా అందుకే తన పాఠశాల రోజుల్లో నటన ఇష్టమైన అంశమని మోడీ ఒక జర్నలిస్టుకు స్వయంగా చెప్పారు.మోడీగారు ఎప్పుడెలాంటి హావభావాలు ప్రదర్శించారో కార్టూనిస్టులు ఇప్పటికే గీసి చూపించారు. ఒక శైలిని సాధించాలంటే అంత తేలిక కాదు. మనం సామాన్యులం గనుక, జులపాలను చూడలేక చస్తున్నాం అని ఇంట్లో వాళ్లు పోరు పెట్టటం, పిల్లలు గుర్తు పట్టలేకపోవటం వంటి సమస్యల కారణంగా లాక్‌డౌన్ ఎత్తివేయగానే కాస్త ఖర్చు ఎక్కువే అయినా పొలోమంటూ క్షౌరశాలల బాట పట్టాం. మోడీగారు ఆపని చేయలేదు. ప్రధాని పదవిలో ఉన్నందున రాబోయే రోజుల్లో వివిధ దేశాధినేతలతో భేటీ కావాల్సి ఉంటుంది. ఆ మూడింటి పట్ల మరింత శ్రద్ద, సహాయకుల అవసరం ఎక్కువగా ఉంటుంది.
కరోనా సమయంలో సామాజిక దూరం పాటించాలని చెప్పారు గనుక నరేంద్రమోడీ తన క్షురకుడికి దూరంగా దాన్ని పాటించారన్నవారు కొందరు. అయితే కొందరు తుంటరి వారు నిజమే అనుకుందాం మరి అడ్డదిడ్డంగా పెరగకుండా వాటిని ఎవరు కత్తిరించారు అన్న ప్రశ్నలు వేశారు. అనేక అంశాలలో నిష్ణాతుడైన మోడీ గారికి ఆ మాత్రం చేతకాదా అన్న సమాధానం టకీమని వచ్చింది.పశ్చిమబెంగాల్లో ఎలాగైనా అధికారం సంపాదించాలనుకుంటున్నారు గనుక బెంగాలీల అభిమాన పాత్రుడైన విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ మాదిరి గడ్డం పెంచితే వారు అభిమానిస్తారు అని అలా చేస్తున్నారని చెప్పిన వారు మరికొందరు. ఆ మూడింటిని పెంచటం ప్రారంభమై ఇంకా ఏడాది గడవ లేదు. ఈ లోగా సామాజిక మాధ్యమంలో ఉన్నవారు ఎవరికి ఎలా కనిపిస్తే అలా వర్ణించారు.క్రిస్మస్ సమయంలో కొందరికి తాత శాంతా క్లాజ్ మాదిరి కనిపించారు.
లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో టీవీల్లో బాగా కత్తిరించుకున్న గడ్డంతో కనిపించారు. తరువాత గడ్డాన్ని చూసి జనాలు క్వారంటైన్ గడ్డం అన్నారు. బాబరీ మసీదును కట్టించిన బాబరులా ఉన్నారని కొందరంటే హారీ పోటర్ టీవీ సీరియల్స్‌లోని అల్బస్ డంబెల్డోర్ మాదిరి కొందరికి కనిపించారు. భార్య గర్భంతో ఉన్నపుడు ప్రసవించే వరకు తెలుగు వారిలో కొందరు గడ్డాలూ, మీసాలను తొలగించరన్న అంశం తెలిసిందే.శుభ్రంగా గడ్డం చేసుకొనే వ్యక్తి ఆకస్మికంగా దాన్ని పెంచుతూ కనిపించాడంటే ఏదో సమస్య లేదా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా భావించటం తెలిసిందే. అందుకే గర్భిణీ గడ్డం లేదా గండాల గడ్డం ఇలా సందర్భానికి తగిన విధంగా అనుకుంటాం. కరోనా సమయంలో పెరిగిన వాటిని కరోనా గడ్డం లేదా కరోనా జులపాలు అన్నారు. కొంత మంది రాజకీయనేతలు తాము విజయం సాధించే వరకు లేదా ఎదుటివారిని గద్దె దింపే వరకు లేదా వ్యాపారంలో విజయం సాధించే వరకూ గడ్డాలూ మీసాలూ తీయను అని వీర ప్రతిజ్ఞలు చేసేవారు మనకు దర్శనమిస్తుంటారు. ఐరోపాలో గడ్డాల చరిత్ర గురించి రాసిన ఒక రచయిత సంక్షోభ సమయాల్లో పెంచిన గడ్డాల గురించి కూడా రాశారు. రాజకీయంగా కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, ఆపని చేశారు.ప్రతిపక్షంలోనూ స్వంత పార్టీలోనూ ప్రత్యర్ధి లేరు . మరి నరేంద్రమోడీ గడ్డం వెనుక ఉన్నది ఏ సంక్షోభం అయి ఉంటుంది ? కరోనా అయితే దాని మీద విజయం సాధించామని ప్రకటించారు గనుక ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నట్లు ?
ప్రపంచ నేత అంటున్నారు గనుక సహజంగానే మోడీ గారి మూడింటి గురించి ప్రపంచం పట్టించుకోకుండా ఎలా ఉంటుంది. ఆయన దైవదూత అని స్వయంగా వెంకయ్యనాయుడు గారే చెప్పారు. కనుకనే 16వ శతాబ్దంలోనే ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రోడోమస్ మోడీ గురించి చెప్పారని బిజెపి టాంటాం వేసిన విషయం తెలిసిందే.ఒక తెల్లజాతి మహిళను ఓడిస్తారని, ఇంకా ఏవేవో చేస్తారని చెప్పినట్లుగా ప్రచారం చేయటాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. నోస్ట్రోడోమస్ నిజంగా చెప్పారా ? అసలేం చెప్పారు అనే అంశాల మీద గతంలోనే చర్చ జరిగింది. ప్రశాంత కిషోర్ లాంటి నిపుణుల పధకం ప్రకారం ఎప్పటికప్పుడు కొత్త వాటిని చెప్పాలి తప్ప పాడిందే పాడి అసలుకే మోసం తేకూడదు. అందుకే చూడండి నరేంద్రమోడీ గారు ఒకసారి చెప్పిందాన్ని మరోసారి ఎప్పుడైనా చెప్పారా ? గుర్తుకు తెచ్చుకోండి ! ఉదాహరణకు తొలిసారి ఎన్నికలకు ముందు అచ్చే దిన్- దేశమంతటా గుజరాత్ నమూనా అభివృద్ది అన్నారు. తరువాత ఎప్పుడైనా మోడీ నోట అవి వినిపించాయా ? అ దేవుడికి భక్తుడికీ మధ్య వారధిగా ఉన్న వాట్సాప్ చెప్పిందాన్ని పనిగట్టుకొని పంచుతుంటే నిజమే అని జనం నమ్ముతున్నారు.
ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలన్నీ ఒక వైపు, మరో వైపు గురించి కూడా చూద్దాం. పాకిస్దాన్ మీడియాలో నరేంద్రమోడీ గడ్డం గురించి చర్చ జరుగుతోంది. ఆ చర్చ అంశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అక్కడి జ్యోతిష్కులు నరేంద్రమోడీని కల్కి అవతారమంటున్నారు. అఖండ భారత్ నిర్మాణం కోసం మోడీ గడ్డం పెంచారంటున్నారు.పాక్ జ్యోతిష్కుడు చెప్పిన అంశాలను నియో టీవీ నెట్‌వర్క్ డిసెంబరు 31న ప్రసారం చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోందని బిజెపి నిధులతో నడిపే ఓపి ఇండియా వెబ్‌సైట్ రాసింది. 2019 నవంబరు నుంచి నరేంద్రమోడీకి చెడుకాలం దాపురించిందని, అఖండభారత్ నిర్మాణం కోసం వేసిన పధకాలు నెరవేరలేదని, దాని కోసం కావాలనే ఆయన గడ్డం తీయటం లేదని, హౌమాలు చేస్తున్నారని అతగాడు చెప్పాడు. నరేంద్రమోడీకి జ్యోతిష్కం చెప్పేందుకు మురళీ మనోహర జోషి ఒక బృందాన్ని నిర్వహిస్తున్నారని, జోషి జ్యోతిష్కుడు కాదు, ఫిజిక్స్ ప్రొఫెసర్ అయినప్పటికీ జోశ్యం చెబుతున్నారని చెప్పాడు. ఆయన చెప్పినదాని మేరకే మోడీ ఆ మూడూ పెంచుతున్నారన్నాడు. ( మార్గదర్శక మండల్ పేరుతో అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పటమే తప్ప, అది ఇంతవరకు ఎన్నిసార్లు సమావేశమైందో మార్గదర్శనం ఏమి చేసిందో తెలియదు ) వైరల్ అవుతున్న మరొక వీడియోలో పాక్ వ్యాఖ్యాత వ్యాఖ్యానంలో మరో అంశం చోటు చేసుకుంది. మరాఠా వీరుడు శివాజీ మాదిరి కనిపించేందుకు నరేంద్రమోడీ గడ్డం పెంచుతున్నారు.ఔరంగజేబ్‌కు వ్యతిరేకంగా పోరాడిన శివాజీని అనుకరించాలని మోడీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అఖండ భారత్‌ను ఏర్పాటు చేయనందుకు శని, గురు లేదా బృహస్పతి గ్రహాలు భారత్ మీద ఆగ్రహంతో ఉన్నాయని, అందుకోసం మోడీ గడ్డం పెంచుతున్నారని కూడా చెప్పారు.
పాకిస్ధాన్ మీడియాలో మోడీ గడ్డం గురించిన చర్చ మీద మన దేశంలో అనేక మంది గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమంలో స్పందిస్తున్నారు. మోడీని చూసి ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్, చైనా హడలిపోతున్నాయని బిజెపి నేతలు చెబుతుంటారు. ఇప్పుడు మోడీ చేతలతో గాక తన గడ్డంతో పాక్‌ను భయపెడుతున్నారనే రీతిలో చర్చ జరుగుతోంది. నియో, జియో అనే పాక్ టీవీలు గడ్డం మీద జ్యోతిషం గురించి చర్చలు జరపటం వెనుక పాకిస్ధాన్ భయమే కనిపిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభాత్ ఖబర్ అనే హిందీ పత్రిక ఈనెల 13న అదే రాసింది. అంతే కాదు, ఆర్‌ఎస్‌ఎస్ నేత గోల్వాల్కర్‌కు పెద్ద గడ్డం ఉంటుందన్న విషయం తెలిసిందే. మోడీ, శివాజీ, గోల్వాల్కర్ల గడ్డాలను పోల్చుతూ, శివాజీ మాదిరి నరేంద్రమోడీని చూపుతూ చిత్రాలను కూడా ప్రచురించింది. గడ్డం బొమ్మలతో భయపెట్టటమే కాదు, ఇంతకు ముందు అధునాతన యుద్ద టాంకు ముందు నిలబడిన మోడీ చిత్రం కూడా భయపెట్టిందని , పాక్ పార్లమెంట్ సభ్యుల్లో భయం పుడుతోందని ఆ పత్రిక పేర్కొన్నది. తన గడ్డం మీద మరింత చర్చ జరగముందే దాని గురించి ప్రధాని నోరు విప్పటం మంచిదేమో !