Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఏకైక స్ధానం తిరిగి వస్తుందా రాదా అన్న సమస్య ఉంటే ఆ ఒకటిని 71చెయ్యాలని కొద్ది రోజుల క్రితం కేరళలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు మీడియా వార్తలు వెల్లడించాయి. ఫిబ్రవరి 14న బిజెపి ముఖ్యనేతల సమావేశంలో మోడీ ఈ మేరకు దిశానిర్దేశం గావించినట్లు వార్తలు వచ్చాయి. పార్టీకి మద్దతు కూడగట్టేందుకు అవసరమైన ప్రధాని మోడీ సూచనలు చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలను జనం వద్దకు తీసుకుపోవాలని ప్రధాని కోరారన్నారు. అన్ని తరగతులను పార్టీలోకి వచ్చేట్లు చూడాలని ప్రధాని కోరినట్లు బిజెపి నేతలు చెప్పారు. ఒకటి నుంచి 71సీట్లకు పెరిగేట్లుగా పార్టీ పని ఉండాలని ప్రధాని చెప్పినట్లు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పికె కృష్ణదాస్‌ చెప్పారు.

కేరళలో బిజెపి ప్రభావం-పని చేయని నరేంద్రమోడీ ఆకర్షణ !

బిజెపి నేతలు కేరళ గురించి ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, బలం గురించి అతిశయోక్తులు చెప్పుకున్నా అంకెలు వాస్తవాలను వెల్లడిస్తాయి. నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన తరువాత జరిగిన 2015స్దానిక సంస్ధలు, 2016 అసెంబ్లీ, 2019లోక్‌సభ ఎన్నికలు, తాజా 2020 స్ధానిక సంస్ధల ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూటమి××××× 2015 ×××× 2016×××× 2019×××× 2020
ఎల్‌డిఎఫ్‌×××× 37.4 ×××× 43.48 ××× 36.29 ××× 41.6
యుడిఎఫ్‌×××× 37.2 ×××× 38.81 ××× 47.48 ××× 37.1
బిజెపి ××× 13.3 ×××× 14.96 ××× 15.64 ××× 14.5
ఇతరులు ×××× 12.1 ×××× 2.75 ××× —– ××× 6.8
పైన పేర్కొన్న వివరాల ప్రకారం గత నాలుగు ఎన్నికలలో బిజెపి ఓట్లశాతాలలో పెద్ద మార్పు లేదు.(2011 అసెంబ్లీ ఎన్నికలలో 138 స్ధానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి 6.06శాతం ఓట్లు వచ్చాయి) అయినా స్ధానిక ఎన్నికలలో గతం కంటే అదనంగా వచ్చిన కొన్ని స్ధానాలను చూపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ తమకు ఎల్‌డిఎఫ్‌కు మధ్యనే ఉంటుందని బిజెపి నేతలు చెప్పుకోవటం గమనించాల్సిన అంశం. ఇప్పుడు ఒకటి నుంచి 71కి చేరుకోవాలని ప్రధాని సూచించారు. అసెంబ్లీలో మొత్తం స్దానాలు 140, దానిలో అధికారానికి రావాలంటే 71 కావాలి, ఈ కారణంగానే అన్ని స్దానాల గురించి చెప్పారన్నది స్పష్టం.

విజయన్ను గట్టిగా వ్యతిరేకించమంటారు, అదెలా సాధ్యం అన్న బిజెపి ఏకైక ఎంఎల్‌ఏ !

ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ను గట్టిగా వ్యతిరేకించాలని కొంత మంది నన్ను కోరారు, అదెలా సాధ్యం అని కేరళ శాసనసభలో బిజెపి తొలి శాసనసభ్యుడిగా ఉన్న 91 సంవత్సరాల ఓ రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు. నీమమ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తాను పోటి చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న వారు కూడా మన వైపు రావాలని, గుడ్డిగా వ్యతిరేకిస్తే లాభం లేదన్నారు. ప్రతివారితోనూ స్నేహంగా ఉండాలని అది రాజకీయాల్లో లాభిస్తుందని తాను ఆ దిశగా పనిచేస్తానని అన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలలో విజయాలు సాధించినా ఆశించిన మేరకు బిజెపి పని తీరు లేదన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాజగోపాల్‌ బలపరిచిన విషయం తెలిసిందే ?

మళయాల సమాజం పూర్తిగా హిందూత్వకు లొంగలేదు -రచయిత హరీష్‌

తన నవల ” మీషా ”కు 2019 సాహిత్య అకాడమీ అవార్డు రావటం అంటే మళయాల సమాజం హిందూత్వకు పూర్తిగా లొంగలేదనేందుకు నిదర్శనం అని ప్రముఖ రచయిత ఎస్‌ హరీష్‌ వ్యాఖ్యానించారు. అలాంటి రాజకీయ ప్రాముఖ్యత ఉన్నందున అవార్డును స్వీకరించటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన నవలను ఒక పత్రిక అర్ధంతరంగా నిలిపివేయటం, తరువాత జరిగినదాన్ని చూస్తే సాహితీవేత్తలను తనవైపు తిప్పుకొనేందుకు హిందూత్వ శక్తులు ఒక ప్రయత్నం చేసినట్లు కనిపించిందన్నారు. 2018లో మాతృభూమి వారపత్రికలో ధారవాహికగా ప్రారంభమైన ఈ నవలలో ఒక పాత్రతో రచయిత చెప్పించిన మాటలపై బిజెపి, హిందూ ఐక్యవేది, ఇతర హిందూత్వ సంస్దలు వివాదం రేపాయి. ఈ నవలకు అవార్డు ఇవ్వటం హిందువులకు ఒక సవాలు అని, పినరయి విజయన్‌ ప్రభుత్వానికి హిందువుల మీద ఇంకా కోపం తగ్గలేదని, శబరిమలలో కూడా అదే చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు.


వివాదాస్పదం కావించిన నవలలోని రెండు పాత్రల మధ్య సంభాషణ ఇలా నడుస్తుంది.
” స్నానం చేసి ఉన్నంతలో మంచి దుస్తులు వేసుకొని ఈ అమ్మాయిలు దేవాలయాలకు వెళ్లేది ఎందుకు ?
ప్రార్ధన చేసేందుకు !
కాదు, నువ్వు జాగ్రత్తగా చూడు. ప్రార్ధన చేసేందుకు అయితే వారు మంచి దుస్తులు వేసుకొని అందంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది ? తమకు తెలియకుండానే తాము శృంగారానికి సిద్దంగా ఉన్నామని సూచించటమే !
కానట్లయితే వారు నెలకు నాలుగైదు రోజులు దేవాలయాలకు ఎందుకు రారు ? ఆ రోజుల్లో తాము అందుబాటులో ఉండం అని చెప్పటమే. ప్రత్యేకించి పూజారులకు తెలియచేయటమే ! గతంలో పూజార్లు ఈ విషయాల్లో ముదుర్లు కదా ! ”
దేవాలయాలకు వెళ్లే హిందూ యువతులను, పూజార్లను అవమానించటమే ఇదంటూ కొందరు వివాదాస్పదం కావించటమే కాదు, రచయిత, కుటుంబ సభ్యులను బెదిరించారు. దాంతో తాను నవలను నిలిపివేస్తున్నట్లు రచయిత హరీష్‌ ప్రకటించారు. దేశాన్ని పాలిస్తున్నవారిని ఎదుర్కొనేందుకు తాను ఎంతో బలహీనుడినని అని వారపత్రికలో ప్రచురుణ నిలిపివేత సమయంలో చెప్పారు.రచయితల భావ ప్రకటనా స్వేచ్చకు తాము మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.
2018లో ఈ నవల మాతృభూమి పత్రికలో నిలిపివేసిన తరువాత డిసి బుక్స్‌ అనే సంస్ద వివాదాస్పద భాగాలతో సహా మొత్తం నవలను ప్రచురించింది. దీన్ని నిషేధించాలని కోరుతూ అదే ఏడాది కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్‌ దాన్ని విచారించి పిటీషన్ను కొట్టివేసింది. ఇంటర్నెట్‌ యుగంలో మీరు ఇలాంటి అంశాలకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారు.ఒక సమస్యగా చేస్తున్నారు. దీన్ని మరచి పోవటం మంచిది అంటూ భావ ప్రకటనా స్వేచ్చ కింద దీన్ని పరిగణిస్తున్నామన్నారు.

ఓట్ల కోసం కాంగ్రెస్‌ -బిజెపి అయ్యప్ప నామజపం !


వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి మరోసారి అయ్యప్ప నామజపం ప్రారంభించాయి. అయితే తామే అసలు సిసలు అయ్యప్ప పరిరక్షకులమని చెప్పుకుంటూ పోటీ పడుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలలో శబరిమల అంశం తమకు లబ్ది చేకూర్చిందని కాంగ్రెస్‌ భావిస్తున్నది. స్ధానిక సంస్ధలలో అది పని చేయలేదని గమనించిన తరువాత మరోసారి దాన్ని రేపేందుకు పూనుకుంది. ఈ విషయంలో నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) బిజెపితో గొంతు కలిపింది. ఆందోళనలో ముందున్నది, కేసుల్లో ఇరుక్కున్నది తామే అని చెబుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే భక్తులు కోరుకున్న విధంగా శబరిమల దేవస్దానం గురించి ఒక చట్టం తెస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దేవస్ధానం బోర్డు ఆధీనంలో 1,300ల దేవాలయాలుండగా ఒక్క శబరిమల గురించి మాత్రమే చట్టం చేస్తామనటం హాస్యాస్పదంగా ఉందని బిజెపి నేత కుమనమ్‌ రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అనేక మంది నిరుద్యోగ యువకుల మీద శబరిమల కేసులు ఉన్నాయని, వారంతా అమాయక భక్తులని కేసులను ప్రభుత్వం రద్దు చేయాలంటూ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ నిందితుల మీద సానుభూతిని కల్పించేందుకు ప్రయత్నించారు.కేసులు ఎత్తివేయకపోతే భక్తులంటే ద్వేషం అని రుజువు అయినట్లే అన్నారు. అసెంబ్లీలో, అదే విధంగా పార్లమెంటులో శబరిమల మీద కాంగ్రెస్‌ సభ్యులు బిల్లును ప్రతిపాదించటానికి అనుమతి లభించలేదని, దాని గురించి కాంగ్రెస్‌ నేతలు చెప్పినదానితో సంతృప్తి చెందామన్నారు.


చిన్న పార్టీలు -చీలికలు !


అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాజకీయ సమీకరణలలో మార్పులు వస్తున్నాయి, అయితే అవి ఎల్‌డిఎఫ్‌ విజయావకాశాల మీద ఎలాంటి ప్రభావం చూపేవిగా లేవు. యుడిఎఫ్‌ నుంచి బయటకు వచ్చిన ఒక పెద్ద పార్టీ కేరళ కాంగ్రెస్‌ (ఎం). ఆ పార్టీలో చీలికవర్గం యుడిఎఫ్‌లో కొనసాగుతుండగా, స్దానిక సంస్ధల ఎన్నికలకు ముందు పెద్ద వర్గం ఎల్‌డిఎఫ్‌లో చేరింది. అనేక చోట్ల ఎల్‌డిఎఫ్‌ విజయావకాశాలను మెరుగుపరచింది.
ఎల్‌డిఎఫ్‌లో భాగస్వామిగా ఉన్న ఎన్‌సిపి చీలిపోయింది. ఉప ఎన్నికల్లో కేరళ కాంగ్రెస్‌(ఎం) మీద గెలిచిన కప్పన్‌ యుడిఎఫ్‌ శిబిరంలో చేరారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలా నియోజకవర్గం కేరళ కాంగ్రెస్‌(ఎం)కు బలమైన నియోజకవర్గం. ఆ పార్టీ నేత మణి ఐదు దశాబ్దాల పాటు దానికి ప్రాతినిధ్యం వహించారు. మణి మరణంతో ఉప ఎన్నికలో ఎల్‌డిఎఫ్‌ తరఫున కప్పన్‌ విజయం సాధించారు. ఆ స్దానాన్ని తనకు ఇస్తేనే కూటమిలో కొనసాగుతానన్న బెదిరింపులను ఎల్‌డిఎఫ్‌ ఖాతరు చేయలేదు. మరొక స్దానం కేటాయిస్తామని చెప్పినా దానికోసమే పట్టుబట్టారు. యుడిఎఫ్‌లో చేరినప్పటికీ తమ గుర్తుమీదనే పోటీ చేయాలని, కప్పన్‌కు పాలా స్దానం తప్ప మరొక స్ధానం ఎవరికీ కేటాయించేది లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఎల్‌డిఎఫ్‌లో ఉన్న మరో చిన్న పార్టీ కేరళ కాంగ్రెస్‌(బి), దీనిలో అంతర్గత సమస్యల కారణంగా కొందరు యుడిఎఫ్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.కేరళ కాంగ్రెస్‌, మరో చిన్న పార్టీ ఎల్‌డిఎఫ్‌లో చేరిన కారణంగా వాటికి సీట్లు కేటాయించేందుకు భాగస్వామ్య పక్షాలు కొన్ని సీట్లను వదలుకోవాలని ఎల్‌డిఎఫ్‌ నాయకత్వం కోరింది. ఆమేరకు కొన్ని సీట్లు తగ్గటం, స్దానాలు మారటం వంటివి చోటు చేసుకుంటాయి. మూడు సార్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారికి ఈ సారి అవకాశం ఇవ్వకూడదని సిపిఐ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఉద్యోగాల భర్తీలో ఎల్‌డిఎఫ్‌ ఘనత !


కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకపోవటం చూస్తున్నాం అలాంటిది కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కొత్తగా 3,151 పోస్టులను సృష్టించాలని బుధవారం నాడు ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 3000 వరకు ఆరోగ్యశాఖలో ఉన్నాయి.ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ నిబద్దతకు ఇది పెద్ద నిదర్శనం. దొడ్దిదారిన ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఖండించారు. ఆయన విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్‌డిఎఫ్‌ అధికారానికి రాకముందు యుడిఎఫ్‌ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలతో పోలిక దిగువ విధంగా ఉంది.
ప్రభుత్వశాఖలు ××××× యుడిఎఫ్‌ ××××ఎల్‌డిఎఫ్‌
పోలీసు శాఖ ××××××××× 4,791 ×××× 13,825
ఎల్‌డిసి ××××××××× 17,771 ×××× 19,120
ఎల్‌పి స్కూల్‌అసిస్టెంట్స్‌ × 1,630 ×××× 7,322
యుపి స్కూల్‌అసిస్టెంట్స్‌ × 802 ×××× 4,446
స్టాఫ్‌ నర్సు(ఆరోగ్య) ×× ×1,608 ×××× 3,324
స్టాఫ్‌ నర్సు(మెడికల్‌) ×× 924 ×××× 2,200
అ.సర్జన్స్‌ (ఆరోగ్య) ×× ×2,435 ×××× 3,324