Tags
# Metro Man Sreedharan, #Kerala CPI(M), Jacobite church, Kerala BJP, Kerala political scene, LDF, UDF Kerala
ఎం కోటేశ్వరరావు
ఇప్పుడున్న ఒక స్ధానాన్ని డెబ్బయి ఒకటికి పెంచాలని ప్రధాని నరేంద్రమోడీ కేరళ బిజెపి నేతలకు ఉద్బోధ చేశారు. దాన్ని నిజమే అని నమ్మినట్లున్నారు మెట్రోమాన్‌గా ప్రసిద్ది చెందిన ఇ శ్రీధరన్. ఇంకేముంది కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దం సుమతీ అంటూ మీడియాకు ఎక్కారు. దీన్నే ముది మది తప్పటం అంటారేమో ! అసంఖ్యాక అభిమానుల నీరాజనాలు అందుకున్న ఏడు పదుల సూపర్ స్టార్ రజనీకాంతే ఆ దేవుడు వద్దన్నాడు ఈ రజనీ పార్టీ రద్దన్నాడు అన్నట్లుగా తమిళనాడులో చేతులెత్తేశాడు. అలాంటిది 88ఏండ్ల వయస్సులో శ్రీధరన్ కేరళలో నేను రెడీ అంటున్నారు. అయితే తాను, లేకపోతే కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ మరోసారి ముఖ్యమంత్రి అయినా తనకు సంతోషమే అన్నారు. కాంగ్రెస్ నేతలు రమేష్ చెన్నితల, ముస్లింలీగు నేత కున్హాలీ కుట్టి తనను మంచిగా చూసుకున్నారని, వామపక్షాల నుంచి అలాంటిది లేదన్నారు.పాలక్కాడ్ జిల్లా జన్మస్దలం అయినా ప్రస్తుతం మలప్పురం జిల్లాలో ఉంటున్నారు. అక్కడి నుంచే పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. అందుకే ముస్లిం లీగు నేతను కూడా ఉబ్బించే యత్నం చేశారు. నేను గాని ఈల వేస్తే అన్నట్లుగా నేను గనుక బిజెపిలో చేరితే ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఓట్లు రెట్టింపు అవుతాయి అని శ్రీధరన్ చెప్పుకున్నారు. అది దేశభక్తి సంస్ద తప్ప మతతత్వపార్టీ కాదు, అది తప్ప మిగతా పార్టీలేవీ అభివృద్దిని పట్టించుకోవు అన్నారు.
ఇప్పటి వరకు ఒక ఇంజనీరుగా గౌరవం పొందిన ఆ పెద్దమనిషి జీవిత చరమాంకంలో కాషాయతాలిబాన్‌గా తన అంతరంగాన్ని బయటపెట్టుకున్నారు. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నంత వరకు ఏ పార్టీ పట్ల అభిమానం చూపకూడదు, ఇప్పుడు తనకు అలాంటివేమీ లేవు గనుక బిజెపిలో చేరుతున్నా అన్నారు. కాకినాడ జెఎన్‌టియు ఇంజనీరింగ్ విద్యార్ధిగా, తదుపరి మంచి ఇంజనీరుగా తన ప్రతిభను చూపారు. ఆ విషయంలో ఎవరూ వేలెత్తి చూపటం లేదు. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి టిఎన్ శేషన్‌కూ అదే ఇంజనీరింగ్ కాలేజీలో ఒకేసారి సీటు వచ్చింది. అయితే శేషన్ ఇంజనీరింగ్ వద్దని సివిల్స్‌ను ఎంచుకొన్నారు. ఇద్దరూ ప్రస్తుత కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందినవారే.శేషన్ 1997 రాష్ట్రపతి ఎన్నికలలో కెఆర్ నారాయణన్ మీద పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయంగా ఇద్దరూ మితవాదులే.
బిజెపి నిర్వహిస్తున్న యాత్ర మలప్పురం జిల్లాలో ప్రవేశించే 21వ తేదీన శ్రీధరన్ ఆ పార్టీలో చేరే తతంగం పూర్తి చేస్తారు. ఈ రోజుల్లో బిజెపిలో పార్టీలో చేరాలంటే తాము పచ్చి హిందూత్వవాదులమని ప్రకటించుకోవటం మొదటి అర్హత. శ్రీధరన్ బీఫ్ నుంచి లవ్ జీహాద్ వరకు దేన్నీ వదలకుండా అన్నింటినీ వల్లిస్తూ దాన్ని జయప్రదంగా పూర్తి చేశారు. కేరళ అభివృద్ది కావాలంటే తాను ముఖ్యమంత్రి అయితే తప్ప సాధ్యం కాదన్నారు. అధికారాల్లేని గవర్నర్ పదవి తనకు అవసరం లేదని కూడా ముందే చెప్పారు. రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే ప్రశ్నలు అడగటం తప్ప వేరే ఏమీ ఉండదన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కనుక తాను ఆ పార్టీలో చేరితే రాష్ట్రానికి ఉపయోగం అన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం పొందిన బిజెపి కేరళ నేత కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయనే చేయలేనిది శ్రీధరన్ చేయగలరా ?
ఇక బిజెపి గురించి ఆ తాతయ్య లేదా ముత్తాత పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. బిజెపి స్వయంగా విధించుకున్న నిబంధన ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారు ఎలాంటి పాలనా పదవుల్లో ఉండకూడదు. ఆ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌ను మార్చివేశారు. అయితే కర్ణాటక వచ్చేసరికి తనకు పదవి లేకపోతే అసలు పార్టీయే ఉండదని బెదిరించిన కారణంగా అబ్బే తూచ్ అదేమీ మాటతప్పని-మడమ తిప్పని సూత్రమేం కాదు, అవసరమైనపుడు మినహాయింపు ఇస్తాం అన్నట్లుగా 77 ఏండ్ల యడియూరప్పను కొనసాగిస్తున్నారు. శ్రీధరన్ ఇంజనీరుగా తన అనుభవంతో రైళ్లను నడిపించగలరు తప్ప రాజకీయవేత్తగా ఈ వయస్సులో బిజెపిని అదీ కేరళలో ? పెద్దాయన, ఎందుకు లెండి !
ఊమెన్ చాందీ ఊపేస్తున్నారంటున్న కాంగ్రెస్ !
కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని ఎన్నికల పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడిగా నియమించటం, ప్రస్తుతం యాత్ర చేస్తున్న రమేష్ చెన్నితలతో ఆయన పర్యటిస్తుండటంతో స్దానిక ఎన్నికల తరువాత ఊపు వచ్చిందని, ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌తో పోటా పోటీ స్ధితికి చేరుకున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని కాంగ్రెస్ ఏఐసిసి ప్రకటించుకుంది. స్దానిక సంస్దలలో కూడా గణనీయంగా గెలిచినట్లు చెప్పుకున్న విషయం తెలిసిందే. ఎల్‌డిఎఫ్ సర్కార్ మీద బట్టకాల్చివేసే కార్యక్రమాన్ని ముమ్మురం చేసింది. ఈనెల 24న రాహుల్ గాంధీతో మత్స్యకారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సముద్రంలోని లోతు ప్రాంతాలలో చేపల వేటకు ఒక అమెరికన్ కంపెనీతో ఎల్‌డిఎఫ్ సర్కార్ ఒప్పందం చేసుకుందని, మంత్రి మెర్సీకుట్టి కంపెనీ ప్రతినిధులను కలుసుకున్నారని రమేష్ చెన్నితల ఒక నిరాధార ఆరోపణ చేశారు. నిజానికి ఆ కంపెనీ ప్రవాస కేరళీయులు అమెరికాలో ఏర్పాటు చేసుకున్నది. చేపల వేట గురించి ఒక పధకాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందచేశార తప్ప ఆలూ లేదు చూలూ లేదని కంపెనీ స్వయంగా ఖండించింది. మత్స్యకారులను దెబ్బతీసే లోతు ప్రాంత చేపల వేటకు అనుమతిస్తూ గత యుపిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం వ్యతిరేకించిందని, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిందని, అయితే తాము అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. మత్స్యకారులు, స్దానిక కంపెనీల ప్రయోజనాలను కాపాడతామని పేర్కొన్నారు. అమెరికన్ కంపెనీ ప్రతినిధులు తొలుత అమెరికాలో మంత్రిని కలిశారని ఆరోపించిన చెన్నితల తరువాత తన మాటలను తానే దిగమించి కాదు, సచివాలయంలో కలిశారంటూ కంపెనీ ప్రతిపాదనలు అందచేసిన సమావేశ చిత్రాలను విడుదల చేసి ఇంతకంటే రుజువు ఏమి కావాలని అడ్డు సవాళ్లు విసిరారు. మంత్రిగా తనను అనేక మంది కలుస్తుంటారని అంత మాత్రాన ఒప్పందం జరిగిందనటం పచ్చి అవాస్తవం, రమేష్ చెన్నితల క్షమాపణ చెప్పాలని మెర్సికుట్టి డిమాండ్ చేశారు.
ఎన్‌సిపి నుంచి బయటకు వచ్చి యుడిఎఫ్‌లో చేరిన ఎంఎల్‌ఏ కప్పన్ పరిస్ధితి అయోమయంగా తయారైంది. తమ పార్టీ గుర్తు మీదే పోటీ చేయాలని, ఫ్రంట్ భాగస్వామిగా చేరటం గురించి ఎన్నికల తరువాతే చూద్దాం అని కొంత మంది కాంగ్రెస్ నేతలు షరతు పెడుతుండగా, అలా చేస్తే ఆయన తప్ప వెంట నీడ కూడా రాదని అందువలన అలాంటి తీవ్ర షరతు పెట్టకూడదని మరికొందరు అంటున్నారు. కేరళ కాంగ్రెస్ నుంచి బలమైన మణి వర్గం చీలి ఎల్‌డిఎఫ్‌లో చేరినందున గతంలో కేటాయించినన్ని సీట్లు ఈ సారి ఇచ్చేది లేదని జోసెఫ్ వర్గానికి కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. అవమానాన్ని తట్టుకొని అంగీకరిస్తారా ? మరేం చేస్తారో తెలియదు.
అదీ సిపిఎం నిబద్దత !
కొన్ని పంచాయతీలలో అడగకుండానే యుడిఎఫ్, బిజెపి, ఇతర పార్టీల సభ్యులు స్ధానిక రాజకీయాలు, ఎత్తుగడల్లో భాగంగా సిపిఎం సభ్యులకు ఓటు వేసి సర్పంచ్‌లు అయ్యేందుకు దోహదం చేశారు. అలాంటి చోట్ల ఆ పదవులు తమకు అవసరం లేదంటూ సిపిఎం సర్పంచ్‌లు రాజీనామా చేశారు. ఒక చోట ఎల్‌డిఎఫ్‌లోని మరో పార్టీ సర్పంచ్ అందుకు నిరాకరించటంతో ఫ్రంట్ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. మలప్పురం జిల్లా వెట్టం పంచాయతీలో సంక్షేమ స్టాండింగ్ కమిటీలో సిపిఎంకు రెండు, యుడిఎఫ్‌కు రెండు, వెల్ఫేర్ పార్టీకి ఒక స్ధానం ఉంది. దాని చైర్‌పర్సన్ ఎన్నికలో వెల్ఫేర్ పార్టీ సభ్యుడు సిపిఎంకు ఓటు వేయటంతో కెటి రుబీనా ఎన్నికయ్యారు. అయితే తాము ఎవరి మద్దతూ కోరలేదని, అందువలన ఆ పదవి తనకు అవసరం లేదని రుబీనా రాజీనామా చేశారు. మతతత్వ వెల్ఫేర్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటం స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజకీయ దుమారం రేపింది. దాన్ని సిపిఎంకు అంటించేందుకు వేసిన ఎత్తుగడను పార్టీ ఇలా తిప్పికొట్టింది.పంచాయతీలోని 20 వార్డులకు గాను యుడిఎఫ్‌కు 10, ఎల్‌డిఎఫ్‌కు తొమ్మిది, వెల్ఫేర్ పార్టీకి ఒకటి ఉంది. సర్పంచ్ ఎన్నికను వెల్ఫేర్ పార్టీ బహిష్కరించింది.
బెదిరింపులకు దిగిన జాకోబైట్ చర్చ్ !
కేరళలోని మలంకర చర్చి వివాదంలో సుప్రీం కోర్టులో ఓడిపోయిన జాకోబైట్ చర్చ్ పెద్దలు బెదిరింపులకు దిగారు. సుప్రీం కోర్టు 2017లో ఇచ్చిన తీర్పు మేరకు 800 సంవత్సరాల నాటి చర్చి నిర్వహణ బాధ్యతను ఆర్డోడాక్స్ వర్గానికి అప్పగించాల్సి ఉంది. అయితే వివాద పడుతున్న రెండు వర్గాలు సామరస్యంగా పరిష్కరించుకుంటాయనే వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూనుకోలేదు. అయితే ఆర్దోడాక్స్ వర్గం వారు కోర్టు తీర్పును అమలు జరపటం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ ఫిర్యాదులు చేయటంతో గత ఏడాది స్వాధీనం చేసుకొని అప్పగించారు. సుప్రీం కోర్టు తీర్పును వమ్ము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చి తిరిగి తమకు స్వాధీనం చేయాలని జాకోబైట్స్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. గత 50 రోజులుగా నిరసన తెలుపుతున్న ఆ వర్గం దాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించింది. అధికార, ప్రతిపక్షం రెండూ తమను పట్టించుకోలేదని, తామింక ఏ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండదలచలేదని, తమ రాజకీయ కార్యాచరణ రెండు వారాల్లో ప్రకటిస్తామని, అది ఎన్నికల ఫలితాలలో కనిపిస్తుందని ఆవర్గ పెద్దలు ప్రకటించారు. తమ మద్దతు కోసం ఎవరినీ బిషప్ బంగ్లాల్లోకి రానివ్వబోమన్నారు. ఈవర్గపు పెద్దలు కొద్ది వారాల క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. బిజెపి, ట్వంటీ20 పార్టీతో సహా తమ 15లక్షల ఓట్లను ఏ పార్టీకి వేయాలనేదీ తాము నిర్ణయిస్తామని జాకోబైట్ వర్గాలు తెలిపాయి. నిత్యం క్రైస్తవ, ఇస్లాం మతాలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే బిజెపి ఈ చర్చి వివాదంలో సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా జాకోబైట్‌లను సమర్ధించి ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మత ప్రాతిపదికన ఓట్లు పొందేందుకు సంతుష్టీకరణ చర్యలకు ఎల్‌డిఎఫ్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
.