ఎం కోటేశ్వరరావు
వ్యవసాయ చట్టాలకు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతాంగాన్ని నగర ప్రవేశానికి నిరాకరించటంతో ప్రారంభమైన ఢిల్లీ శివార్లలో తిష్టకు మూడు నెలలు నిండాయి. నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించినట్లు అన్న సామెత తెలిసిందే. చర్చలకు సిద్దమే అన్న ప్రధాని నరేంద్రమోడీ ఆందోళనా జీవులంటూ రైతులను కించపరిచారు. తాము సిద్దంగానే ఉన్నామని రైతులు చెప్పినా జనవరి 22 తరువాత చర్చలు జరగలేదు. చట్టాల అమలు వాయిదా వేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని, చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని అయితే చర్చలకు తాము సిద్దమే అని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు.రైతులు గుమికూడినంత మాత్రానే చట్టాలు రద్దవుతాయా అని తనలోనూ తల్లి వైపు నుంచి రైతు రక్తం ఉందని చెప్పుకున్న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులను తాజాగా ఎద్దేవా చేశారు.ఆవు చేలో మేస్తుంటే దూడలు గట్టున ఉంటాయా ? జనాలు గుమికూడితే చట్టాలేం ఖర్మ ప్రభుత్వాలే మారిపోతాయని మతులు పోగొట్టుకున్న వారికి అర్ధం కాదు అని రైతు నేత రాకేష్ తికాయత్ కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి వాటిని ఎన్నింటిని చూడాలో !
బేటీ బచావో అన్న నోటితో ఉచ్చరించరాని బూతులా ? హవ్వ !!
మరోవైపున సామాజిక, సంప్రదాయ మాధ్యమాల్లో, పోలీసు యంత్రాంగం వైపు నుంచి ఉద్యమం మీద, రైతులకు మద్దతు ఇచ్చిన వారి మీద ఎడతెగని ముమ్మర దాడి సాగుతూనే ఉంది. భిన్నాభిప్రాయం లేదా నిరసన తెలిపిన మహిళలను సామాజిక మాధ్యమంలో బజారు…..లని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. తమ సంఘపరివార్ సంస్ధలకు చెందిన మహిళలు, యువతులు కూడా అనేక ఆందోళనల్లో పాల్గొంటున్నారు అనే స్పృహ వారిలో ఉందా లేక ఉన్మాదంలో ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. శీలము,ఏకత అంటూ కబుర్లు చెప్పేవారు ఇంతగా నోరుపారవేసుకోవాలా ? వారి నిజస్వరూపం ఏమిటో ఇప్పుడు బయటపడుతున్నంతగా గతంలో ఎన్నడూ లేదన్నది నిజం.తమను వ్యతిరేకించే వారిని ఇలాంటి పదజాలంతో తిట్టే బాపతు తమను కూడా వదలరు అని బిజెపి మహిళా అభిమానులు, కార్యకర్తలు గ్రహించటం అవసరం.
ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా రైతులు మనం చెప్పేది వినటం లేదు. వ్యవసాయ చట్టాల మీద వారిని మాయపుచ్చేందుకు కొన్ని చిట్కాలు చెప్పండి అంటూ ఫిబ్రవరి 22న హర్యానాలోని గురుగామ్‌లో జరిగిన సమావేశంలో కార్యకర్తలు బిజెపి రాష్ట్ర నేతలను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓపి ధనకర్, క్రీడల మంత్రి సందీప్ సింగ్, హిసార్ ఎంపీ బ్రిజేందర్ సింగ్ తదితరులు హాజరైన సమావేశ దృశ్యాలతో ఉన్న ఒక వీడియోను కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా షేర్ చేశారు.
ప్రజా ఉద్యమాల అనుభవం ఏమిటి ? పాలకులను బట్టే కొత్త ఎత్తుగడలు !
మూడు నెలల తరువాత రైతు ఉద్యమ భవిష్యత్ ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.నిజానికి ఇదొక కొత్త అనుభవం. రైతాంగ ఆవేదన నుంచి ఉద్బవించిన ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోయే దారిని కనుగొనగలదు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 2011నాటి వాల్‌స్ట్రీట్ ఆక్రమణ ఉద్యమాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సెప్టెంబరు 17 ప్రారంభమైన ఆందోళనను పారిశుధ్య పరిస్ధితి దిగజారిందనే పేరుతో నవంబరు 15న నిరసనకారులను బలవంతంగా పోలీసులతో బయటకు గెంటివేశారు. కొన్ని వందల మంది మాత్రమే జుకొట్టి పార్కులో ఉన్నారు గనుక తొలగించగలిగారు. ఢిల్లీ సరిహద్దుల్లో కూడా తాత్కాలిక మరుగుదొడ్లను తొలగించటం, నీటి సరఫరా, విద్యుత్ నిలిపివేయటం వంటి చౌకబారు చర్యలకు పాల్పడినా స్ధానిక జనం మద్దతుతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు తప్ప వెనక్కు తగ్గలేదు.
ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రను చూస్తే విజయాలకంటే అపజయాలే ఎక్కువ. ఇలా చెప్పటం అంటే నిరాశావాదమూ, నిరుత్సాహపరచటమూ కాదు. మన దేశంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదుల అణచివేతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం 1857 నుంచి 1947వరకూ సాగింది.ఉవ్వెత్తున ఉద్యమించటం,నీరసించటాన్ని చూశాము. బ్రిటీష్ పాలకులు తమ ఎత్తుగడలను ఎన్నింటినో మార్చుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమం కూడా అదే పద్దతిలో తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగింది తప్ప వెనక్కు పోలేదు. సంఘపరివార్ మినహా కమ్యూనిస్టులతో సహా అన్ని శక్తులూ ఆ ఉద్యమంలో భాగస్వాములే, వారసులే.తమ చరిత్రను,త్యాగాలను మరచిపోయి ప్రజావ్యతిరేకిగా మారిన స్వాతంత్య్రానంతర కాంగ్రెస్ నిజస్వరూపాన్ని గుర్తించేందుకు జనానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. అలాంటిది విద్రోహ చరిత్ర తప్ప మరొకటి లేని సంఘపరివార్ సంస్ధ బిజెపి నిజస్వరూపం తెలుసుకొనేందుకు ఒక దశాబ్దం కూడా పట్టలేదు. మన శరీర ధర్మాలకు దేనికీ పనికి రాని క్రిమిక(అపెండిసైటిస్) ప్రతివారిలో ఉంటుంది.అది కొందరికి ప్రాణాంతకం అయినపుడు సకాలంలో గుర్తిస్తే ముప్పుతొలుగుతుంది.లేనపుడు కొనసాగితే ఎలాంటి హాని ఉండదు. బ్రిటీష్ వారు దేశం వదలి పోయిన తరువాత కూడా వారి పాలనను పొగిడిన జనం ఉన్నారు. అలాగే హిట్లర్ దుర్మార్గాలు తెలిసిన తరువాత కూడా సమర్దించిన వారు ఉన్నారు. వారు క్రిమికలాంటి వారే ఏ పార్టీకి అయినా అలాగే ఉంటారు.ఇలా ఎందుకున్నారు అని గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు.
ఉద్యమాన్ని ఎంతకాలం సహిస్తారు ?
ఢిల్లీ శివార్లలో మూడు వైపుల ఉన్న లక్షలాది మంది రైతులను వాల్‌స్ట్రీట్ ఆక్రమణదారుల మాదిరి తొలగించటం సాధ్యం కాదు గనుక మోడీసర్కార్ ఆపని చేయలేదు.కారణాలు ఏవైనా సుప్రీం కోర్టు రైతు ఉద్యమం పట్ల అనుసరించిన వైఖరి సానుకూలం అని చెప్పకపోయినా అణచేందుకు తాత్కాలికంగా అయినా ప్రభుత్వానికి ఆయుధాన్ని ఇవ్వలేదు. ఇదొక ప్రధాన అంశం, తరువాత కూడా ఇలాగే ఉంటుందని చెప్పలేము. ఢిల్లీ అన్ని వైపులా బిజెపి ఏలుబడే ఉంది, కనుక పోలీసులను, ప్రత్యేక దళాలను రప్పించటం పెద్ద పని కాదు. సాధ్యంగాకనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోడ్ల మీద మేకులు కొట్టించి, కాంక్రీటుతో ఆటంకాలను ఏర్పాటు చేశారు. ఎంతకాలం ఇలా అనుమతిస్తారు.తరువాతేం జరుగుతుందో తెలియదు గానీ అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎలాంటి బల ప్రయోగానికి పూనుకోకపోవచ్చు. ఇప్పటికే పంజాబ్ మున్సిపల్ ఎన్నికలలో బిజెపికి జనం చుక్కలు చూపించారు.
ఒక వైపు పంజాబ్, హర్యానా, యుపిలో రబీ గోధుమ పంట చేతికి వచ్చే తరుణం. కొంత మంది రైతులు తమ స్వస్ధలాలకు పోవటం అనివార్యం. అందువలన ఢిల్లీ శివార్లలో ఉన్నవారి సంఖ్య కొంత మేరకు తగ్గవచ్చు కూడా. దీన్ని చూపి ఉద్యమం వెనుక పట్టు పట్టిందనే ప్రచారం జరిపేందుకు బిజెపిశ్రేణులు సిద్దంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఉద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరించటం, కిసాన్ పంచాయత్‌లు, మహాపంచాయత్‌ల పేరుతో నిర్వహిస్తున్న సభలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న రైతాంగంలో మోడీ సర్కార్ మీద ఆగ్రహం పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు.ఫిబ్రవరి 21వ పంజాబ్‌లోని బర్నాలాలో లక్ష మందితో జరిగిన మజ్దూర్ కిసాన్ మహా ర్యాలీలో రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు కూడా గణనీయంగా పొల్గొన్నారు. ఒక్క రైతులే కాదు, వ్యవసాయంతో పెనవేసుకున్న వ్యవసాయ కార్మికులను కూడా భాగస్వాములను చేయటం ద్వారా ఒక ప్రజా ఉద్యమంగా మార్చే యత్నం ఇది. రైతులు-వ్యవసాయ కార్మికులు పరస్పర ఆధారితులు. వ్యవసాయ కార్మికులకు రెక్కల కష్టం తప్ప మరొక ఆదాయం ఉండదు తప్ప వేతనాలు పెంచాలని అడుగుతారు. తమకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి వేతనాలు కారణం కాదని అర్ధం చేసుకోలేని రైతులు వ్యతిరేకిస్తారు. వ్యవసాయ సంస్కరణలు రెండు తరగతులకూ నష్టం చేకూర్చేవి గనుక ఐక్యంగా పోరాడాల్సిన అవసరం వుంది. వారి మధ్య ఉన్నది మిత్రవైరుధ్యమే తప్ప శత్రువైరుధ్యం కాదుగనుక సర్దుబాటు చేసుకోవచ్చు.
తమ మూడవ దశ ఉద్యమం గురించి ఫిబ్రవరి 28న వెల్లడిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.ఇరవై ఆరవ తేదీన యువ రైతుల దినం పాటిస్తున్నారు.మరుసటి రోజు స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర అజాద్ ప్రాణార్పణం చేసిన రోజు, సంత్ రవిదాస్ జయంతి రోజును కలిపి కిసాన్ మజ్దూర్ ఏక్తా దినం-రైతు, వ్యవసాయ కార్మిక ఐక్యతా దినం- పాటించాలని పిలుపునిచ్చినట్లు డాక్టర్ దర్శన్ పాల్ వెల్లడించారు.మార్చి ఎనిమిదిన ఢిల్లీ సరిహద్దుల్లో మహిళాదినోత్సవం సందర్భంగా ఉద్యమంలో మహిళల పాత్రను గుర్తిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోధుమ కోతలను గమనంలో ఉంచుకొనే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. స్ధానిక కిసాన్ పంచాయత్‌లు వాటిలో భాగమే. సభలకు హాజరవుతూనే రైతులు తమపని తాము చేసుకుంటారు. వెసులుబాటు కుదరగానే తిరిగి ఢిల్లీ ముట్టడిలో చేరతారని భావిస్తున్నారు.
వ్యవసాయ చట్టాల నిలిపివేత ఓ ప్రహసనం !
రైతు ఉద్యమం ఒక అనూహ్య పరిణామం. ప్రభుత్వ నిఘా సంస్ధలు,లేదా దిగువ స్దాయిలో ఉన్న సంఘపరివార్ కార్యకర్తలు కూడా దీన్ని పసిగట్టలేకపోయారు. లక్షల మంది రైతుల మీద బలప్రయోగం సాధ్యం కాదు, ఒక వేళ పశుబలాన్ని ప్రయోగిస్తే అది మోడీ సర్కార్ అంతానికి ఆరంభం అవుతుంది. చట్టాల అమలు నిలిపివేసినట్లు ప్రకటించిన సుప్రీం కోర్టు రైతులతో చర్చించాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మేకలతో చర్చలకు తోడేళ్లను మధ్యవర్తులుగా పంపినట్లుగా వ్యవసాయ చట్టాలను సమర్దించేవారితో కూడిన కమిటీ అది. దానికి ఇచ్చే నివేదనలు ఎలా ఉన్నా, అంతిమంగా ఎలాంటి నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పిస్తారో ఊహించుకోవటం కష్టం కాదు.ఆ కమిటీ నివేదిక సుప్రీం కోర్టుకు అంది దాని మీద ఒక నిర్ణయం తీసుకొనే వరకు లేదా పద్దెనిమిది నెలలపాటు చట్టాల అమలు నిలిపివేస్తామని కేంద్రం చెబుతోంది. నిజానికి నిలిపివేసినట్లు కాదు. చట్టాల సవరణకు ముందున్న పరిస్దితిని పునరుద్దరించకుండా చట్టాల అమలు నిలిపివేత అంటే మోసం తప్ప మరొకటి కాదు. ఆర్డినెన్స్ తెచ్చిన గతేడాది జూన్ నుంచే అమలు జరుగుతోంది అని ప్రభుత్వమే చెప్పింది.దాన్ని నిలిపివేయటం అంటే అర్ధం ఏమిటి ? అంటే ఇప్పుడు అసలే చట్టమూ లేదా ? చట్టరహిత పాలన ఎవరికి ఉపయోగం ? నిజానికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన నిలిపివేత ప్రకటనలో నిజాయితీ లేదు. రైతు ఉద్యమం గురించి చర్చించేందుకు భయపడిన సర్కార్ శీతాకాల సమావేశాలను రద్దు చేసి నేరుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకే పోయింది. ప్రభుత్వాన్ని నిలదీస్తే సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు, నిలిపివేతను చూపుతూ చర్చ లేకుండా చేస్తారు. ఒక వేళ అనూహ్య పరిస్దితిలో సుప్రీం కోర్టు చట్టాలను శాశ్వతంగా నిలిపివేయాలని తీర్పునిస్తే అప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ల పరేడ్‌కు అనుమతివ్వాలా లేదా అనే అంశం తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే అని సుప్రీం కోర్టు చెప్పటం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఇష్టం లేకున్నా ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన అనుమతిని ఎలా వినియోగించుకుందో చూశాము.
రైతుల కంటే హిందూత్వ గురించే ఆర్‌ఎస్‌ఎస్ బెంగ !
ఇరు పక్షాలూ ఒక మధ్యేమార్గంలో పరిష్కారానికి రావాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి బహిరంగంగానే రైతు ఉద్యమం-ప్రభుత్వ తీరు గురించి ఒక ప్రకటన చేశారు. ఉద్యమ సెగ వారికి కూడా తగిలిందన్నది స్పష్టం. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. బిజెపికి మార్గదర్శనం చేసేది, ప్రభుత్వాన్ని పర్యవేక్షించేది కూడా ఆర్‌ఎస్‌ఎస్ అన్నది స్పష్టం. సాంస్కృతిక సంస్ద ముసుగులో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందన్నది బహిరంగ రహస్యం.వ్యవసాయ చట్టాల గురించి ఆర్డినెన్స్ తెచ్చినపుడే అనేక రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి, ఆందోళనలు చేసినా వారికి పట్టలేదు, ఆందోళనా జీవులను నెట్టవతల పడవేయవచ్చన్న అతి అంచనా కావచ్చు. రైతుల ఆందోళనను బలప్రయోగంతో అణచివేస్తే దాని అసలైన హిందూత్వ అజెండా ముందుకు పోకపోగా వ్యతిరేకత ముందుకు వస్తుంది. ఆ కారణంతో జాగ్రత్తపడమని మధ్యేమార్గం చూడమని చెప్పింది తప్ప చిత్తశుద్ది, రైతుల పట్ల దానికి ఆసక్తి అనుమానమే.దాన్ని దాచిపెట్టి ప్రభుత్వం పట్ల సంఫ్‌ు సంతృప్తిగా లేదంటూ లీకుల ద్వారా దాని మంచితనం గురించి ప్రచారం చేశారు.
రైతు ఉద్యమం గురించి చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా రాకేష్ తికాయత్ – ఇతర నేతల మధ్య తేడా ఉన్నట్లు చూపే ప్రయత్నం కూడా జరిగింది. భారతీయ కిసాన్ యూనియన్ నేత మహేంద్రసింగ్ తికాయత్ కుమారుడిగా రాకేష్‌కు గుర్తింపు ఉంది. ఉత్తర భారత్‌లోని వ్యవసాయ సామాజిక తరగతి జాట్‌ల పలుకుబడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పంజాబ్‌లో వీరు సిక్కు మతాన్ని ఇతర చోట్ల హిందూమతాన్ని పాటిస్తారు. అందువలన హర్యానా, ఉత్తర ప్రదేశ్ జాట్ ప్రాంతాలలో తికాయత్‌కు పరిచయం అవసరం లేదు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో జరిగిన ఉదంతాల తరువాత ఆయన కన్నీళ్లు పెట్టుకోవటం గురించి భిన్న కథనాలున్నా లక్షలాది మంది రైతులను కదిలించింది.ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చింది. ప్రారంభంలో తికాయత్ ప్రభావం పరిమితమే. ఆయనను విడిగా కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవటంలో కూడా విభజించి పాలించాలనే ఎత్తుగడ ఉంది. దాన్ని గ్రహించి వెనక్కు తగ్గారనుకోండి. తికాయత్ కొన్ని వ్యక్తిగతమైన నిర్ణయాలు ప్రకటిస్తున్నారనే అభిప్రాయం ఉంది. మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబరు రెండు వరకు రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తారని చేసిన ప్రకటన అలాంటిదే. ఇలాంటి వాటిని చూపే బిజెపి రాజకీయ దాడి చేస్తున్నది. కార్యాచరణ కమిటీలో దాన్ని గురించి చర్చించలేదని ఒక నేత చెప్పాల్సి వచ్చింది.ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇలాంటి ఉద్యమాలలో ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు చెబితే ప్రతిదానికీ దురుద్ధేశ్యాలను ఆపాదించనవసరం లేదు. అన్నా హజారే అంటే ఇప్పటికీ గౌరవం ఉంది, కానీ ఆ పెద్దమనిషి ఉద్యమానికి మద్దతు ప్రకటించి తరువాత ప్రభుత్వం వేసిన కమిటీ గురించి సంతృప్తి ప్రకటించారు. ఇలాంటి వారి గురించి రైతులు ఆలోచించుకోవాలి.
ఉద్యమ బలం – బలహీనతలూ !
నెల రోజులుగా ప్రభుత్వం చర్చలకు పిలవటం లేదని కొందరు రైతు నేతలు ఆందోళన పడుతున్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు.పదకొండు కాదు, పదకొండు వందల సార్లు పిలిచినా ఇంతకు ముందు చెప్పిందే చెబుతారు. తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే. అయితే ఆందోళనా జీవి అంటూ ఎద్దేవా చేసిన ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని చూస్తే ఢిల్లీ శివార్లలో ఎన్ని నెలలు కూర్చుంటారో కూర్చోనివ్వండి, విసిగిపోయి వారే లేచిపోతారనే భావంతా ఉన్నారని కూడా కొందరు వ్యాఖ్యానించారు.
ఒక ఉద్యమం, అదీ స్వచ్చందంగా ప్రారంభించిన ఉద్యమం. ప్రతి ఉద్యమానికి బలం-బలహీనతలు రెండూ ఉంటాయి. రెండోదాన్ని అధిగమించి ముందుకు పోవటమే ఉద్యమ లక్షణం.ఒక కొండ ఎక్కేందుకు ముందు చాలా ఉత్సాహంగా ప్రారంభం అవుతాము. అదే పైకిపోయే కొలదీ ఎక్కటానికి ఎంత ఇబ్బంది పడాలో తెలిసిందే. ఒక ఉద్యమం కూడా అలాంటిదే. రోజులు గడిచే కొద్దీ కొంత మందిలో తొలుత ఉన్న ఉత్సాహం, పట్టుదల సడలుతుంది.నలుగురితో పాటూ మనమూ అంటూ సాదాసీదాగా ప్రారంభమైన వారిలో పట్టుదల రెట్టించటం కూడా తెలిసిందే.
రైతులపై ముప్పేట దాడి !
రైతులు కష్టపడి దుక్కి దున్ని నాట్లు వేసి కోత కోసి పంటను తేగలరు తప్ప మధ్యలో వచ్చే తెగుళ్లను తట్టుకోవటం అంత తేలిక కాదు. ఉద్యమం ప్రారంభంలోనే ఖలిస్తానీ, ఉగ్రవాద ముద్రవేశారు. దీని వెనుక జాతి వ్యతిరేక శక్తులున్నారని ప్రచారం చేశారు. అంతర్జాతీయంగా సమన్వయ పరుస్తున్నారని అతిశయోక్తులు చెప్పారు.ఇప్పటి వరకు పాలకుల అణచివేతకంటే ఏ ఉద్యమం ఎరగని విధంగా మాధ్యమాల ముట్టడి- తప్పుడు ప్రచారదాడిని రైతాంగం ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇంకా కొనసాగుతూనే ఉంది.యుద్దంలో ఒక్క అంగుళాన్ని కూడా వదలకుండా బాంబులతో నాశనం చేయటాన్ని కార్పెట్ బాంబింగ్ అంటారు. వియత్నాంలో అమెరికా దురాక్రమణ-దాడి సమయంలో ఈ పదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రచార దాడి జరుగుతోంది. ఇన్ని నెలల ఉద్యమం, ప్రపంచవ్యాపితంగా ప్రాచుర్యం పొందిన తరువాత అంతర్జాతీయంగా ప్రముఖులు స్పందించకుండా ఎలా ఉంటారు. రీఆనె, గ్రేటా టన్‌బెర్జ్, మీనా హారిస్ వంటి వారు ట్వీట్లు చేయగానే మన దేశంలో ప్రముఖులుగా ఉన్నప్పటికీ దేనికీ స్పందించని వారందరితో ట్వీట్ల మీద ట్వీట్లు చేయించి మరో యుద్దరంగాన్ని తెరిచారు.మన దేశం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు విదేశీయులకు టూల్‌కిట్ సరఫరా చేశారనే పేరుతో దిశారవి మరికొందరి మీద దేశద్రోహం నేరం వంటివి ఆపాదించి అరెస్టులు చేశారు. ఇలాంటి ఎదురుదాడి, రిపబ్లిక్ డే రోజున జరిగిన కుట్రలను నిజంగానే రైతాంగం ఊహించలేదు. దిశారవి టూల్‌కిట్‌లో దేశద్రోహమూ లేదు, హింస ప్రేరేపణా లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది.
నిజానికి అంత ముప్పేగనుక వస్తే దాన్ని మరింత రచ్చ చేయటం ఎందుకు ? కుట్రలు వాస్తవమే అనుకుంటే వాటిని వమ్ము చేసేందుకు చట్టాలను రద్దు చేస్తే పోలా ? నరేంద్రమోడీకి దేశమా ? మరొకటా ! ఏది ముఖ్యం ! ముందు చట్టాలను రద్దు చేసి అంతర్జాతీయ కుట్రలను వమ్ము చేసి అంతగా అయితే అన్ని తరగతులతో చర్చించి ఆమోదయోగ్యమైన సంస్కరణలు తెచ్చి నిజంగా రైతాంగాన్ని ఉద్దరిస్తామంటే ఎవరు వద్దంటారు ?
పాలకులను బట్టే ఉద్యమ స్వభావంలో మార్పు !
ఉద్యమం సాగుతున్నకొద్దీ, పాలకుల వైఖరిని అర్ధం చేసుకున్న కొద్దీ ఏ కష్టజీవుల ఉద్యమం అయినా తమ సమస్యలకే పరిమితం కాదు. కాంగ్రెస్ 1895లో ప్రారంభమైనపుడు దానికి రాజకీయాల్లేవు.భారతీయుల ప్రయోజనాలను కాపాడాలని, చదుకున్న భారతీయులకు ప్రభుత్వంలో ఎక్కువ అవకాశాలివ్వాలనే కోర్కెలతోనే ఉద్యోగవిరమణ చేసిన బ్రిటీష్ జాతీయుడు ఎఓ హ్యూమ్ ఒక ఉద్యమంగా ప్రారంభించాడు.నిజాం సంస్ధానంలో తెలుగును బతికించాలనే కోర్కెతోనే ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది. చివరికి ఆ కాంగ్రెస్ బ్రిటీష్ వారు దేశం వదలి పోవాలనే వైఖరితో, నైజాం సంస్దానాన్ని కూల్చివేసే విధంగా కమ్యూనిస్టుల నాయకత్వాన ఆంధ్రమహాసభ తయారయ్యాయి. అలాగే ఇప్పుడు రైతు ఉద్యమం పట్ల బిజెపి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి నేతలను బహిష్కరించాలనే పిలుపులు వెలువడుతున్నాయి,వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక పాఠం చెప్పాలనే ఆలోచనలు ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి.వీటిని చూసి ఆ పార్టీ కూడా పంజాబ్, రాజస్ధాన్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో తమ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి రాజకీయ దాడికి సిద్దం అవుతోంది. దానిలో భాగమే పైన చెప్పుకున్న హర్యానా గురుగామ్ సమావేశం. చూశారా మేము ముందే చెప్పాం ఇది రైతుల ఉద్యమం కాదు, ఆపేరుతో బిజెపి వ్యతిరేక ఉద్యమం అని ప్రచారం ప్రారంభించవచ్చు.కానివ్వండి ఆ పార్టీకి ఆ హక్కు ఉంది. జనమే తేల్చుకుంటారు. బిజెపికి ఏ రాజకీయ పార్టీ వద్దలేనంత డబ్బు ఉంది, దాన్ని నిలబెట్టేందుకు అదానీ,అంబానీల వంటి వారు ఎంతైనా ఇంకా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.తప్పుడు ప్రచారాన్ని గుడ్డిగా చేసే యంత్రాంగం ఎలాగూ ఉంది.నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు గోవిందా అన్నట్లు జనం తలచుకోవాలేగానీ ఏదీ ఆగదు. రైతు పోరు కొత్త దిశ, కొత్త దశలో ప్రవేశించనుంది. ప్రభుత్వంతో చర్చల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మరింతగా రైతులను, వారికి మద్దతు ఇచ్చే వారిని సమీకరించటం, దేశ వ్యాపితంగా విస్తరించటమే చేయాల్సి ఉంది.
8 .