Tags
#Kerala CPI(M), Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala LDF, Kerala political love jihad, UDF Kerala
ఎం కోటేశ్వరరావు
ఏప్రిల్ ఆరవ తేదీన కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనతో రాజకీయ సమీకరణలు, సర్దుబాట్లు త్వరలో ఒక కొలిక్కి రానున్నాయి. గత నాలుగు దశాబ్దాల చరిత్రను చూసినపుడు ఒక సారి కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారానికి వస్తే మరోసారి సిపిఎం నాయకత్వంలోని కూటమి రావటం తెలిసిందే. దానికి భిన్నంగా ఈ సారి మరోసారి అధికారాన్ని నిలుపుకొనేందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ కూటమి ప్రయత్నిస్తుంటే, అధికారానికి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ చేయని ప్రయత్నం లేదు. కేవలం ఒక స్ధానం ఉన్న బిజెపి తాము కూడా అధికారంలోకి వచ్చేందుకు సిద్దం అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. తాను చేరితే బిజెపి ఓట్లు రెట్టింపు అవుతాయని, అధికారానికి వస్తే తాను ముఖ్యమంత్రి పదవికి సిద్దంగా ఉన్నానని మెట్రో మాన్ ఇ శ్రీధరన్ చెప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌లో 14 పార్టీలు, యుడిఎఫ్‌లో ఐదు ఉన్నాయి. ఎన్‌డిఏలో బిజెపితో పాటు మరో నాలుగు చిన్న పార్టీలు ఉన్నాయి. మొత్తం 140 స్దానాలకు గాను ఎల్‌డిఎఫ్‌కు 91 స్ధానాలు, యుడిఎఫ్‌కు 47, బిజెపికి ఒకటి, ఆ పార్టీతో జత కట్టిన మరో పార్టీకి ఒక స్ధానం ఉన్నాయి.
ఎల్‌డిఎఫ్‌లో కొత్తగా చేరిన కేరళ కాంగ్రెస్(ఎం), లోక్‌తాంత్రిక్ జనతాదళ్ యుడిఎఫ్‌లో ఉండగా గత ఎన్నికల్లో 11, 7 స్దానాల చొప్పున పోటీ చేశాయి. ఇప్పుడు వాటికి ఎల్‌డిఎఫ్‌లోని భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా సిపిఎం, సిపిఐ తమ స్దానాల సంఖ్యను తగ్గించుకొని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు యుడిఎఫ్‌లో ఖాళీ అవుతున్న సీట్లలో మిగిలిపోయిన కేరళ కాంగ్రెస్(జె)కు ఏడు సీట్లు పోను మిగిలిన వాటిని కాంగ్రెస్-ముస్లిం లీగు పంచుకుంటాయని వార్తలు వచ్చాయి. కొద్ది వారాల క్రితం పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి ఎల్‌డిఎఫ్‌కు 101 స్ధానాలు వస్తాయని, మళయాల మనోరమ విశ్లేషించగా, 98వస్తాయని సిపిఎం సమీక్షలో తేలిందని అదే ప త్రిక రాసింది. స్దానిక సంస్ధల ఎన్నికలకు ముందు ఎల్‌డిఎఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ఆ ఎన్నికలలో ఓటర్లు వాటిని తిప్పికొట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కూడా తిరిగి అదే ప్రచారం ప్రారంభమైంది.మీడియా వాటికి వంతపాడుతున్నది.
ఓట్లకోసం చర్చిల చుట్టూ ప్రదక్షిణలు చేయనున్న బిజెపి -ముస్లిం లీగుకూ ఆహ్వానం !
కేరళలో సీట్లు వచ్చినా రాకపోయినా కనీసం ఓట్లయినా పెంచుకోవాలని, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకోవాలన్నది బిజెపి ఆత్రం. అత్రగాడికి బుద్ది మట్టు అన్న సామెత తెలిసిందే. నిత్యం మత మార్పిడుల గురించి క్రైస్తవ మతాన్ని తిట్టిపోసే బిజెపి నేతలు ఇప్పుడు కేరళలో చర్చ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు, ఆ మత పెద్దలను సంతుష్టీకరించి ఓట్లు పొందేందుకు నిర్ణయించుకున్నారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ త్వరలో అందుకోసం బయలుదేర నున్నారని కేరళలో అగ్రశ్రేణి దినపత్రిక మళయాల మనోరమ రాసింది.కర్ణాటక నుంచి కేరళ బిజెపి అభ్యర్ధులకు అవసరమైన డబ్బుతో పాటు ఇతరత్రా సాయం చేసేందుకు అక్కడి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు నడుంకట్టారు. కేరళలో సమస్యలు, బిజెపి ఎత్తుగడల గురించి చర్చించేందుకు బెంగళూరులోని వంద మంది మళయాలీ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారట.
కేరళ రాజకీయాల్లో ఏది వాటంగా ఉంటే దాన్ని అనుసరించే సీనియర్ ఎంఎల్‌ఏ పిసి జార్జి. కాంగ్రెస్‌తో జీవితాన్ని ప్రారంభించి స్వతంత్రుడిగా, కేరళ కాంగ్రెస్‌లోని రెండు ప్రధాన గ్రూపుల్లో చేరి తరువాత దాన్నుంచి బయటకు వచ్చి జనపక్షం పేరుతో స్వంత పార్టీని పెట్టుకున్నారు. ఏ పేరుతో పోటీ చేసినా మంచి మెజారిటీలతో ఏడు విజయాలతో ఒక ప్రత్యేకత సాధించారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. తాజా వార్తల ప్రకారం మరోసారి బిజెపితో చేతులు కలపబోతున్నారు. రెండు సీట్లు కేటాయించేందుకు అంగీకరించినట్లు వార్తలు. ఇటీవల ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన బహిరంగ ప్రకటనలు, అంతర్గతంగా బిజెపితో సంబంధాలు నెరపటంతో జార్జిని చేర్చుకుంటే చేర్చుకుంటే సంగతి తేలుస్తాం అంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం హెచ్చరించింది. ఒక వేళ చేర్చుకొని సీటు ఇస్తే పోటీగా ఒక స్వతంత్ర అభ్యర్ధిని రంగంలోకి దింపుతామని కొట్టాయం జిల్లా నేతలు హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్ధితిలో ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా కొన్ని వేల ఓట్లు కూడా ఎంతో కీలకమైనవి కనుక చేర్చుకోవాలన్న వర్గం వాదనలను మెజారిటీ అంగీకరించలేదు.
ఎల్‌డిఎఫ్ ఎలాగూ చేర్చుకోదు గనుక పిసి జార్జి బిజెపి వైపు చేరనున్నారు. ఆ పార్టీని మంచి చేసుకునేందుకు ముందుగానే చెప్పినట్లు ముస్లింలను విమర్శించి మెప్పు పొందేందుకు ప్రయత్నించారు. మరోవైపు రామాలయ నిర్మాణానికి నిధులు కూడా ఇచ్చినట్లుగా మాతృభూమి పత్రిక రాసింది. బిజెపితో కలసిన మరొక పార్టీ కేరళ కాంగ్రెస్(థామస్). దీని నేత పిసి థామస్ గతంలో వాజ్‌పేయి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. పిసి జార్జిని బిజెపి వైపు తీసుకురావటంలో సంధానకర్తగా పనిచేశారని వార్తలు.జార్జి వస్తే కొట్టాయం జిల్లాలో ప్రతిష్ఠాత్మక స్ధానంగా మారిన పాలా నియోజకవర్గంలో బిజెపి గెలవవచ్చనే అంచనాతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఐదు దశాబ్దాల పాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కేరళ కాంగ్రెస్ (ఎం) నేత మణి మరణించిన తరువాత జరిగిన ఉప ఎన్నికలో ఎల్‌డిఎఫ్ తరఫున్ ఎన్‌సిపి అభ్యర్ధి ఎంసి కప్పన్ విజయం సాధించారు. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు యుడిఎఫ్ నుంచి కేరళ కాంగ్రెస్(ఎం) బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరింది.దాంతో పాలా నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయించాలని సిపిఎం నిర్ణయించింది. కప్పన్‌కు వేరే చోట కేటాయిస్తామని చెప్పినప్పటికీ వినలేదు. దాంతో ఎన్‌సిపి అతగాడిని పార్టీ నుంచి బహిష్కరించటంతో యుడిఎఫ్‌లో చేరారు. పిసి జార్జి గతంలో కేరళ కాంగ్రెస్(ఎం)లో ఉన్నపుడు దివంగతనేత మణి కుమారుడు ప్రస్తుత నేత జోస్‌కె మణితో విబేధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తిరిగి మణి పాలాలో పోటీ చేస్తారన్న వార్తల పూర్వరంగంలో పిసి జార్జి కాంగ్రెస్‌లో చేరి దెబ్బకొట్టాలని చూశారు. అది సాధ్యంగాకపోవటంతో బిజెపితో చేతులు కలుపుతున్నారు. పాలాలో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
మరొక ముఖ్యమైన పరిణామం ముస్లిం లీగ్‌ను ఎన్‌డిఏలోకి ఆహ్వానించారు. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు శోభా సురేంద్రన్ మాతృభూమి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముస్లిం లీగ్ జాతీయవాదాన్ని అంగీకరించి ఎన్‌డిఏలోకి రావాలని అది లీగ్ నేతలకు, ముస్లింలకూ ఉపయోగం అని ఆమె వ్యాఖ్యానించారు. అది జరిగినా ఆశ్చర్యం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. శోభ వ్యాఖ్యలు సంచలనం సృష్టించటంతో కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్ మాట్లాడుతూ తాము ముస్లింలీగ్‌తో ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదన్నారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ మైనారిటీ కమ్యూనిటీ ప్రతినిధులు కాదని, ఎవరైనా తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పుకున్నారు. సిపిఎం, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను వారు గుర్తించాలన్నారు. మరోవైపున కేరళలో తాము అధికారానికి రావాలంటే 35-40 స్ధానాలు వస్తే చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ చెప్పారు.
బిజెపి రిక్రూట్‌మెంట్ ఏజంట్‌గా రాహుల్ గాంధీ !
కాంగ్రెస్ నిర్వహించిన కేరళ ఐశ్వర్య యాత్ర ముగింపు సభకు వచ్చిన రాహుల్ గాంధీ ప్రసంగ తీరుతెన్నులు బిజెపి రిక్రూటింగ్ ఏజంట్ మాదిరిగా ఉన్నాయని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గం విమర్శించింది. బిజెపిపై పల్లెత్తు విమర్శకూడా చేయకుండా వామపక్షాలపై బిజెపి చేస్తున్న విమర్శల పదజాలాన్నే పునశ్చరణ గావించారని, ఆ కారణంగానే అనేక చోట్ల కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు ఏకంగా బిజెపిలోనే చేరేందుకు ఉత్తేజం పొందుతున్నారని సిపిఎం పేర్కొన్నది. బిజెపి అమలు చేస్తున్న వ్యవసాయ సంస్కరణలు అమలు జరుపుతామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ వైనాడ్‌లో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన రాహుల్ గాంధీ చిత్తశుద్ది ఏమిటని సిపిఎం ప్రశ్నించింది.
ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని విస్మరించిన రాహుల్ గాంధీ కేరళ వచ్చి మద్దతు ప్రకటించటం అసాధారణమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు.1990 దశకంలో కాంగ్రెస్ అమలు జరిపిన ఉదారవిధానాలు వ్యవసాయ సంక్షోభానికి కారణమని, ఆ పార్టీ చేతులు రైతుల రక్తంతో తడిచాయని, అందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గం వైనాడ్‌లో గతంలో ఏమి జరిగిందో, కాఫీ, మిరియాల రైతులు ఎలా నాశనమయ్యారో తెలుసుకొనేందుకు సిద్దపడాలని అన్నారు. రెండు దశాబ్దాల నాడు కాంగ్రెస్ అమలు జరిపిన విధానాల కారణంగా వైనాడ్‌లోని ఆ పంటల రైతులు రెండు మూడు సంవత్సరాలలో ఆరువేల కోట్ల రూపాయలు నష్టపోయారని జర్నలిస్టు శాయినాధ్ పేర్కొన్న విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలన్నారు.ఆ విధానాల ఫలితంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారని అందుకుగాను రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. సిపిఎం పట్ల రాహుల్ గాంధీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఒకే విధమైన వైఖరితో ఉన్నందున వారి మధ్య ఐక్యత ఏర్పడిందన్నారు.