Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
” ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో వాడే పండు గాడు ” దీని గురించి వేరే చెప్పనవసరం లేదు కదా ! బిజెపి నేతలు, వారి అనుయాయులకు చమురు పండుగాడి దెబ్బ తగిలినట్లుంది. లేకపోతే చమురు ధరల మీద గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట, ప్రధాని, ఆర్ధిక మంత్రి, చమురు మంత్రి ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు తలా ఒక మాట ఎలా మాట్లాడతారు ? రాజకీయ పార్టీల నేతలు (వామపక్షాలు దీనికి మినహాయింపు-వారు కూడా అలాంటివి పెట్టినట్లు ఎవరైనా నిరూపిస్తే సవరించుకుంటానని మనవి) జనానికి చెవుల్లో పూలు పెట్టాలను కోవటం నిత్యకృత్యం. అందులోనూ కమలం పువ్వు బిజెపిదే కనుక వారికి మేథోపరమైన, ప్రత్యేక హక్కులు కూడా ఉంటాయి.
” చమురు బంకుల దగ్గర బోర్డులు పెట్టాలి. కేంద్రం, రాష్ట్రాలు ఎంతెంత పన్ను విధిస్తున్నాయో, కేంద్రం విధించే పన్నుల్లో తిరిగి రాష్ట్రాలకు ఎంత వస్తున్నదో వాస్తవ భారం ఎంతో వివరిస్తూ ఆ బోర్డుల్లో రాస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి.” అని కొంతకాలం క్రితం మోడీ భక్తులు ప్రచారం చేశారు. బారు గడ్డంతో చిదానంద స్వామిలా ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా ఉన్న నిలువెత్తు నరేంద్రమోడీ చిత్రంతో ప్రతి బంకు వద్ద ఇప్పటికైనా భక్తులు స్వచ్చందంగా పెట్టినా ఇబ్బంది లేదు.లేదా జియోకు ఎలాగూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు గనుక ముకేష్‌ అంబానీ లేదా అదానీ అయినా తమ ప్రచార అంశాన్ని కిందో పైనో పెట్టి చమురు గురించి బోర్డులు పెట్టి రుణం తీర్చుకోవాలి.జనానికి వాస్తవాలను తెలియపరచాలి.

చమురు ధర వందడాలర్ల గురించి చర్చ ప్రారంభం !

ఇక పండుగాడి దెబ్బ గురించి చూద్దాం.కొద్ది రోజుల క్రితం బ్రెంట్‌ ముడి చమురు ధర 67-68 డాలర్ల వరకు ఊగిసలాడి ఆదివారం సాయంత్రం 66.13డాలర్ల దగ్గర, మన చమురు 65.70 డాలర్ల వద్ద ఉంది. మరోవైపున 2022 నాటికి వందడాలర్ల గురించి వ్యాపారులు ఆలోచిస్తున్నారు. త్వరలో 75-80 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరి జోశ్యం. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నది తెలిసిందే. చమురు ధరల చెలగాటం జనానికి అలవాటైపోయింది. ఎంత చెబితే అంత చెల్లించటం దేశభక్తిగా భావిస్తున్నారు.తాము చెల్లించేది కార్పొరేట్లకు రాయితీల రూపంలో సమర్పిస్తున్నారనేది తెలియటం లేదు. నరేంద్రమోడీ గారికి ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. ఎందుకంటే ఆయన అధికారానికి వచ్చిన నాటి నుంచి బహుశా ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండానే అంతర్జాతీయ మార్కెట్‌ను నియంత్రించి ఉండాలి. లేకపోతే రికార్డు స్దాయిలో సంవత్సరాల తరబడి ధరలు ఎందుకు తగ్గి ఉంటాయి. ఇప్పుడు కాక మొదలైంది కనుక చమురు పండు గాడు గుర్తుకు వస్తున్నట్లుంది.

ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా ! సమన్వయం ఉండదా !

ఫిబ్రవరి 17వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ చమురు ధరలు వందరూపాయలు(బ్రాండెడ్‌) దాటాయన్న వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ధరలు ఆకాశాన్ని తాకటానికి గత పాలకులే కారణమంటూ గడ్డాన్ని సవరించుకున్నారు. వారు గనుక (తమ నేత వాజ్‌పాయి గారు కూడా ఆరేండ్లు అధికారంలో ఉన్న విషయం గుర్తు లేనట్లుంది) దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రీకరించి ఉంటే మధ్యతరగతికి ఈ భారం ఉండేది కాదు అంటూనే అబ్బే నేను ఎవరినీ విమర్శించటానికి కాదు గానీ ఈ విషయం చెప్పక తప్పదు అన్నారు. ఏ స్కూలు విద్యార్ధిని అడిగినా గత ఏడు సంవత్సరాల కాలంలో చమురు దిగుమతులు పెరిగాయో తరిగాయో, స్వదేశీ ఉత్పత్తి ఎలా దిగజారిందో మోడీ గారికి పాఠంగా చెబుతారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కబుర్లు ఆయన గడ్డం పెరుగుదల కంటే ఎక్కువగా ఉన్నాయి.పెట్రోల్లో ఇథనాల్‌ను ప్రస్తుతం 8.5శాతం కలుపుతున్నామని, 2025 నాటికి దాన్ని 20శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామని అది జరిగితే దిగుమతులు తగ్గుతాయి, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయాలు పెరుగుతాయి. మధ్యతరగతి గురించి తాము ఎంతో సున్నితంగా వున్నామన్నారు. అసలు విషయం ఏమంటే చక్కెర పరిశ్రమలు ఇథనాల్‌ సరఫరా చేస్తుంటే వాటిని నిల్వచేసే ట్యాంకులను కూడా చమురు సంస్దలు ఏర్పాటు చేయలేదు. మోడీ గారు ఏమి చేస్తున్నారో తెలియదు.


చలికాలం తరువాత చమురు ధరలు తగ్గుతాయని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఫిబ్రవరి 26న చెప్పారు.అయినా ఇది అంతర్జాతీయ వ్యవహారం, గిరాకీ పెరిగిన కారణంగా ధరలు పెరిగాయని సెలవిచ్చారు. చలికాలంలో ధరలు పెరగటం తరువాత తగ్గటం మామూలే అన్నారు. గత ఏడు సంవత్సరాల కాలంలో అలా ఎప్పుడైనా జరిగిందా ? ఒక దేశంలో చలికాలం అయితే మరో దేశంలో మరో వాతావరణం ఉంటుందని జనానికి తెలియదా అని అడిగితే దేశద్రోహం కేసు బనాయిస్తారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చమురు ధరలు అత్యంత కనిష్టానికి పడిపోయిన సమయంలో దానికి అనుగుణ్యంగా 86 రోజుల పాటు ధరలను ఎందుకు తగ్గించలేదో మంత్రిగారు చెబుతారా ? చమురేమైనా టమాటాల్లాంటివా ! సీజన్‌లో కొనేవారు లేక రైతులు పారపోస్తారు లేదా కిలో రూపాయికి లోపే అమ్ముకుంటారు. చమురు అలాంటిది కాదే.


మరోవైపున ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చమురు ధరలు తగ్గుతాయని తాను చెప్పలేనని,అదొక ధర్మ సంకటమని చెప్పారు. ఉల్లిధరల గురించి అడిగినపుడు నేను వాటిని తినను కనుక తెలియదని, జిఎస్‌టి నష్టాలకు దేవుడి విధి అని కేంద్రం ఏమీ చేయలేదని గతంలో చెప్పిన ఆమె నుంచి అంతకు మించి ఏమి ఆశించగలదు దేశం. ఇదే సమయంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ చమురుపై పన్నులు తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని కోరారు.ఎవరేం మాట్లాడుతున్నారో గమనించే స్ధితిలో ఉన్నారా ? పెట్రోలియం మంత్రి ఫిబ్రవరి పదవ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ గత మూడు వందల రోజుల్లో కేవలం 60 రోజులు మాత్రమే ధరలు పెంచామని పెట్రోలు ఏడు, డీజిలు 21 రోజులు తగ్గించామని, 250 రోజులు, పెంచలేదు తగ్గించలేదు అన్నారు. అంటే ఆ రోజుల్లో అంతర్జాతీయ ధరల్లో ఎలాంటి మార్పు లేదా ? ఎవరిని మభ్యపెట్టేందుకు ఇలాంటి మాటలు చెబుతారు.

మతిమరపు నటిస్తున్న బిజెపి పెద్దలు ! చంద్రబాబుకు మోకాళ్ల నొప్పులు !

ఇప్పుడు జనానికి సుభాషితాలు చెబుతున్న బిజెపి నేతలు గతంలో చమురు ధరలు పెరిగి నపుడు ఏమి సెలవిచ్చారో మతిమరపు నటిస్తున్న కారణంగా వారేమీ చెప్పలేరు గాని వారిని అభిమానించే వారు తెలుసుకోవాలి. వీధుల్లో వేసిన వేషాలు, చేసిన ప్రదర్శనలు, అన్నట్లు మరిచాను చంద్రబాబు నాయుడు కూడా బిజెపితో జతకట్టిన కారణంగా యుపిఏకు వ్యతిరేకంగా సైకిలు తొక్కి నిరసన తెలియచేశారు. ఇప్పుడు బహుశా మోకాళ్ల నొప్పులు వచ్చి ఉంటాయి అనుకుంటే కుర్రవాడైన కొడుకు లోకేష్‌ ఎందుకు తొక్కటం లేదు ?


2006లో ముడిచమురు ధర పీపా 55 నుంచి 70 డాలర్లకు పెరిగినపడు బిజెపి డ్రామాలను జనం చూశారు.లీటరుకు 4,2 రూపాయల చొప్పున పెట్రోలు, డీజిలు మీద పెంచిన యుపిఏ సర్కార్‌ దానికి చెప్పిన కారణం అలా పెంచకపోతే చమురు కంపెనీలు కుప్పకూలిపోతాయని.గత సంవత్సరం చమురు ధర 20 డాలర్లకు పడిపోయినపుడు తరువాత 40 డాలర్లయినపుడు కూడా అంతకు ముందు ఉన్న ధరలను తగ్గించలేదు. ఎందుకంటే కరోనా సమయంలో చమురు వినియోగం పడిపోయింది తప్ప కంపెనీల, పెట్రోలు బంకుల ఖర్చులు తగ్గలేదు కనుక తగ్గిన మేరకు ధరలు తగ్గించలేదని బిజెపి నేతలు చెప్పటం తెలిసిందే. మరి సామాన్య జన ఆదాయాలు తగ్గకుండా ఏం చేశారంటే మాత్రం నోరు పెగలదు. నాడు మాజీ ప్రధాని వాజ్‌పాయి గారు యుపిఏ సర్కార్‌ క్రూరమైన పరిహాస మాడుతోందన్నారు.కేంద్రం, రాష్ట్రాలు పన్నులు తగ్గించాలన్నారు. గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ రాజధర్మం పాటించాలని వాజ్‌పాయి చెప్పారు. ఆయన బతికి ఉండగానే ఆ మాటల మీద చల్‌ అన్నట్లుగా పట్టించుకోని నరేంద్రమోడీ ఇప్పుడు దివంగత నేతకు ప్రమాణాలు చేయటం తప్ప ఆయన మాటలను పట్టించుకుంటారా, పాటిస్తారా !


ఇప్పుడు బిజెపిఏతర పాలిత రాష్ట్రాలు పన్నులు తగ్గించవచ్చు కదా అంటున్న బిజెపి వారు అప్పుడు తమ ఏలుబడిలో ఎంత మేరకు తగ్గించారో చెప్పగలరా ? అప్పుడు పెట్రోలు లీటరు ధర 47.51, డీజిలు ధర 23.52 ఉండేది. నిజంగా క్రూరమైన పరిహాసం ఏమంటే వాజ్‌పారు నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ ఆరు సంవత్సరాలలో 33 సార్లు ధరలను పెంచింది. 2002-06 మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 24 నుంచి 75 డాలర్లకు పెరిగింది. చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ ధరలను వసూలు చేయాలని నిర్ణయించింది. అధికారం పోగానే మర్యాదస్తుడని అనేక మంది భావించే వాజ్‌పేయి నాయకత్వంలోనే బిజెపి ధరల పెరుగుదల వ్యతిరేక నిరసన నాటకాలాడింది నిజం కాదా ?

పన్నుల విధింపులో ఔరంగజేబు ఆదర్శమా !


2020 ఏప్రిల్‌-నవంబరు మాసాల్లో (లాక్‌డౌన్‌ సమయం) కేంద్ర ఎక్సయిజు పన్ను చమురు ఖాతా నుంచి 1,96,342 కోట్లు వస్తే అంతకు ముందు సంవత్సరంలో అదే వ్యవధిలో వచ్చిన మొత్తం 1,32,899 కోట్లు మాత్రమే.చమురు కంపెనీలతో పాటు మోడీ సర్కార్‌ జనం నుంచి పిండిన తీరు ఇది. అంతకు ముందుతో పోల్చితే వినియోగం తగ్గినప్పటికీ ఔరంగజేబు మాదిరి పన్నులతో పీల్చిన ఫలితమిది.ఇదే సమయంలో జిఎస్‌టి ఆదాయం గణనీయంగా తగ్గి రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. నిద్రపోయే వారిని లేపి ఈ విషయాలన్నీ చెప్పగలం తప్ప నటించేవారికి చెప్పలేము.


జనానికి బుర్రలుండవని, ఉన్నా ఉపయోగించలేని బద్దకం బలిసిపోయిందని బిజెపికి అనుకుంటున్నట్లుగా మరొక పార్టీ భావించదని అంగీకరించకతప్పదు. లేకపోతే పెరిగిన ధరలను సమర్ధించేందుకు ఎంత ధైర్యం ఉండాలి. స్మృతి ఇరానీ పెద్ద నటి అన్న విషయం తెలిసిందే. ఆమె బిజెపి నేతగా 2011 జూన్‌ 24న గ్యాస్‌ బండ మీద 50 రూపాయల పెంపుదల మీద చేసిన ట్వీట్‌లో ఏమన్నారో తెలుసా ? మాది సామాన్యుల ప్రభుత్వం అని చెప్పుకుంటారు, గ్యాస్‌ ధర 50 పెంపా, ఎంత సిగ్గు చేటు అన్నారు. ఇప్పుడు ఆమె గౌరవనీయమైన కేంద్ర మంత్రి. డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 150 రూపాయలు పెంచారు. మంత్రిగారు గనుక ఆమె వంటశాలకు దూరంగా ఉంటారు గనుక తెలిసి ఉండదు. లేకపోతే గతంలో మాదిరి వీధుల్లో వచ్చి ఉండేవారు. బిజెపి ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ జగమెరిగిన ఫేకిస్టు.2012 అక్టోబరు ఆరున ఒక ట్వీట్‌ చేశారు. అదేమంటే అప్పటి యుపిఏ సర్కార్‌ గ్యాస్‌ బండమీద రు.11.42పైసలు పెంచింది. దానికి వ్యతిరేకంగా సామాన్యులు, మహిళల మీద కాంగ్రెస్‌ బ్యాండ్‌ మోత మోగించింది అన్నారు. ఇప్పుడు జరిగిందేమిటి ? లెక్కలు చెప్పాలా ?ఒక సంఖ్య చెబితే మరుసటి రోజుకో వారానికో మారిపోతున్నందున ఎవరికి వారు బండను బుక్‌ చేసినపుడు ఎంత ఉందో తెలుసుకొని మోడీ సర్కార్‌కు భజన చేయాలో బ్యాండ్‌ బజాయించాలో నిర్ణయించుకోవచ్చు.


సిఎంగా మోడీ నాడేమన్నారు-ప్రధానిగా నేడేం చేస్తున్నారు !


2012 మే నెలలో పెట్రోలు ధరను లీటరుకు రూ.7.54 పెంచారు. దాంతో ఢిల్లీలో రు.73.18కి పెరిగింది. దాని మీద నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ మండిపడ్డారు.అది కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి ఒక ముఖ్య ఉదాహరణ అన్నారు.తొమ్మిది సంవత్సరాల తప్పుడు ఆర్ధిక విధానాల పర్యవసానం అన్నారు బిజెపి నేతలు. ఆర్ధిక వ్యవస్ధను బలంగా ఉంచే విధంగా సరైన విధానాలను యుపిఏ అనుసరించి ఉంటే అది చమురు సబ్సిడీలను ఇచ్చే స్ధితిలో ఉండేది అన్నారు. తరువాత వామపక్షాలతో పాటు బిజెపి కూడా చమురు ధరలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌లో పాల్గొన్నది. ఇప్పుడు బిజెపి నేతలు ఏం చేస్తున్నారు ? సబ్సిడీలన్నీ ఎత్తివేశారు. మోడీ అధికారానికి రాక ముందు మే 2014లో 113 డాలర్లు ఉన్న ముడిచమురు ధర మరుసటి ఏడాది జనవరి నాటికి 50 డాలర్లకు పడిపోయింది.


2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనేమన్నారు. నిజమే నేను అదృష్టవంతుడనే, కానీ మీకు డబ్బు ఆదాఅవుతోంది. మోడీ అదృష్టం జనానికి లబ్ది చేకూర్చుతుంటే అంతకంటే కావాల్సిందేముంది ? నా అదృష్టం కారణంగా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గితే సామాన్యుల పొదుపు ఎక్కువ అవుతుంది. అందువలన అదృష్టవంతులు కాని వారిని తీసుకురావాల్సిన(ఎన్నుకోవాల్సిన) అవసరం ఏముంది అంటూ కాంగ్రెస్‌ మీద వ్యాఖ్యానించారు. ఆ అదృష్టం ఇంకా పెరిగి 2016లో ఒక దశలో ముడిచమురు ధర 29 డాలర్లకు పడిపోయింది. సదరు అదృష్టవంతుడు చేసిందేమిటి ? వినియోగదారులకు దరిద్రాన్ని పట్టించటం కాదా ? 2014 మే నుంచి ఇప్పటి వరకు వరకు వంద రూపాయలు పెంచి ఒక్క రూపాయి తగ్గించిన మాదిరి ఉదారత్వాలను పరిగణనలోకి తీసుకుంటే భారం ఎలా ఉందో చూద్దాం.
సం ××సరకు ×× ఎక్సయిజ్‌×××డీలరు ధర××వినియోగదారు ధర
2014 ×× పెట్రోల్‌ ×××× 9.48 ××× 49.50 ××××× 73.20
2021 ×× పెట్రోల్‌ ×××× 32.98 ××× 27.75 ××××× 83.71
2014 ×× డీజిలు ×××× 3.56 ××× 52.68 ××××× 55.48
2021 ×× డీజిలు ×××× 31.80 ××× 33.74 ××××× 79.74
(గమనిక 2014డీజిలు, పెట్రోలు ధరలు మార్చి ఒకటవ తేదీ ఢిల్లీ, 2021 డీజిలు ధర ఫిబ్రవరి 16, పెట్రోలు ధర జనవరి ఒకటవ తేదీ ఢిల్లీకి చెందినవి, హిందూస్దాన్‌ పెట్రోలియం కంపెనీ ధరలుగా గమనించాలి.2014 మార్చిలో పెట్రోలు మీద సబ్సిడీ లేదు, డీజిలు మీద లీటరుకు రూ.8.37 సబ్సిడీ ఉంది.)

అమెజాన్‌ ”టూల్‌ కిట్‌ ” లో ప్రధాని నరేంద్రమోడీ గురించి ఉన్నది ఏమిటి ?


విదేశీయులు లేదా స్వదేశీయులు ఒక ప్రధాని లేదా ముఖ్యమంత్రులను పొగడుతున్నారు అంటే వారిలో రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి. దానికి ఎవరూ మినహాయింపు కాదు. ఒకటి ప్రయోజనం కోసం చెప్పే మెరమెచ్చు మాటలు, రెండోది అంతర్గతంగా ఉన్న అభిప్రాయం.2012 ఫిబ్రవరి 18వ తేదీన బిజినెస్‌ టుడే అనే పత్రిక రాయిటర్‌ సంస్ధ ఇచ్చిన వార్తను ప్రచురించింది. ” మోడీ ఒక మేథావి కాదు: ప్రధాని గురించి అంతర్గత పత్రాల్లో అమెజాన్‌ వర్ణణ ” అన్నది దాని శీర్షిక. ప్రముఖులు ఇతరులతో సంభాషించే సమయంలో మాట్లాడాల్సినవి ఏవి, మాట్లాడకూడనివి ఏవి, బలం ఏమిటి బలహీనతలు ఏమిటి అని కంపెనీ సిబ్బంది ఒక నోట్‌ తయారు చేస్తారు. దానికి అనుగుణ్యంగానే అమెరికాలోని భారత రాయబారితో 2019లో అమెజాన్‌ డాట్‌కామ్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ జే కార్నే మాట్లాడేందుకు వెళ్లినపుడు సిబ్బంది ఒక పత్రంలో కొన్ని విషయాలు రాశారు.అప్పుడు కార్నే మోడీని బహిరంగంగా ఇలా వర్ణించాడు ” సీదా సాదాగా, తర్కబద్దంగా, ముక్కుసూటిగా ఉంటారు” అని పేర్కొన్నాడు. అమెజాన్‌ కంపెనీ 2012 నుంచి 2019వరకు రూపొందించిన ఇలాంటి పత్రాలు రాయిటర్‌ వార్తా సంస్దకు దొరికాయి. ఒకదానిలో మోడీ ముక్కుసూటి తనం, ఆలోచించే తీరు ఆయన ఒక మేథావి స్దాయికి తగినదిగా ఉండదు అని పేర్కొన్నారు. ఒక మేథావీకాదు, ఒక పండితుడు కాదు గానీ బలమైన పాలనా, యంత్రాంగంతో విజయవంతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు.అలాంటి పత్రాలను రూపొందించిన వారిలో మన దేశానికి చెందిన అమెజాన్‌ కంపెనీ ప్రతినిధి అమిత్‌ అగర్వాల్‌ వంటి స్వదేశీయులే ఉన్నారు. టూల్‌కిట్‌తో మన పరువు పోయిందని గగ్గోలు పెడుతున్నవారు ఇలాంటి టూల్‌కిట్ల గురించి కూడా తెలుసుకుంటే మంచిదేమో ?