ఎం కోటేశ్వరరావు
దిశా రవి అనే రెండు పదుల యువతి మనం సమాజానికి టూల్‌కిట్టు అనే పదాన్ని ఎంతగానో పరిచయం చేసింది. అసలు టూల్‌కిట్టు అంటే ఏమిటి ? రోజూ మనం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాం. ఇవి అనేక రకాలు. స్ధల, కాలాలను బట్టి వాటి స్వభావం మారుతూ ఉంటుంది. ప్రధానంగా రెండు తరగతులుగా చూస్తే ఒకటి జనాలకు ఉపయోగపడేవి. రెండవ రకం హాని చేసేవి. చాకు వంటింట్లో ఉంటే పండ్లు, కూరలు, ఉల్లి వంటి వాటిని కోస్తాము. అదే సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో ఉంటే ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియదు.
పాండవుల అరణ్యవాసం ముగిసిన తరువాత ఏడాది అజ్ఞాతవాసం చేసే సమయంలో తమ ఆయుధాలన్నింటినీ కట్టగట్టి జమ్మి చెట్టు మీద పెట్టారని చదువుకున్నాము. అదీ టూల్‌కిట్టే. అందుకే దసరా రోజున అనేక ప్రాంతాలలో ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్దలలో వినియోగించే పరికరాలకు పూజలు కూడా చేస్తారు. పాత సినిమాలలో వైద్యులు ఒక పెట్టె లేదా సంచి వంటిదానిని తీసుకువస్తారు. అది వైద్యుల టూల్‌కిట్టు, కొన్నిదశాబ్దాల క్రితం క్షురకులు తమ టూల్‌కిట్టును తీసుకొని ఇండ్లకు వచ్చి క్షవరాలు చేసేవారు. ఇప్పుడు కూడా పెత్తందారులకు అలా చేస్తూ ఉండవచ్చు. దాన్నే పొది అని పిలిచేవారు. వివిధ సేవలు చేసే మెకానికల్‌లు తమ వెంట తెచ్చే పరికరాలను ఒక బాక్సులో లేదా సంచిలో వేసుకొని వస్తారు. అదీ టూలుకిట్టే. పాములను ఆడించే వారు తమ టూల్‌కిట్టులో పాములతో పాటు, నాగస్వరం వంటివి ఉంటాయి.ఒక మతోన్మాదుల టూల్‌కిట్టులో మిగతావాటితో పాటు ఆవు మాంసం ఉంటే, మరో మతోన్మాదుల దానిలో పంది మాంసం ఉంటుంది. రెండు మతాల వాటిలో కుట్ర సిద్దాంతాలు, విద్వేష, ఉన్మాద ప్రచార సామగ్రి కోకొల్లలు. పట్టణాలలో పెద్ద పెద్ద ఉత్సవాలు, బహిరంగ సభలు జరిగే సమయాల్లో ఏ మార్గాల్లో ప్రయాణించాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం లేదా నిర్వాహకులు ప్రకటిస్తారు. అది కూడా టూల్‌కిట్టే.
దిశ రవి టూలుకిట్టులో ఏముంది ?
రైతు ఉద్యమం సందర్భంగా దానికి మద్దతుగా దిశరవి, ఇతరులు రూపొందించిన అంశాలనే ప్రపంచవ్యాపితంగా తెలిసిన భాషలో టూల్‌కిట్ అన్నారు. దానిలో ఎక్కడా నరేంద్రమోడీ లేదా బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేయాలనే అంశాలే లేవు. అయినా దేశద్రోహ నేరం మోపి అన్యాయంగా దిశ రవితో పాటు మరికొందరిని కేసుల్లో ఇరికించారు. దిశ రవికి బెయిలు మంజూరు చేస్తూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అనేక మందికి కనువిప్పు కలిగించాయి. దేశంలో మతోన్మాద సంస్దలు అవి మెజారిటీ అయినా మైనారిటీ అయినా విద్వేషాలను ఎలా రెచ్చగొట్టాలి, ఘర్షణలు ఎలా సృష్టించాలి, దాడులు ఎలా చేయాలి తదితర అంశాలతో అనేక టూలుకిట్లను ఉపయోగిస్తున్నాయి. వాటికోసం రకరకాల సంస్దలను ఏర్పాటు చేస్తున్నాయి. అన్నింటినీ సమన్వయం పరిచేది ఒక కేంద్రమే. రాజకీయ పార్టీల టూలుకిట్లకు కొదవే లేదు. మరి అవన్నీ నేరం కానపుడు రైతు ఉద్యమానికి మద్దతుగా తయారు చేసిన టూలుకిట్టునే ఎందుకు దేశ ద్రోహంగా పాలకులు భావిస్తున్నారు ? అదే దేశద్రోహం అయితే రైతుల కోసం ఆ టూల్‌కిట్‌ను అందరూ ఇతరులకు పంచాలి. టూలుకిట్టు అంటే పరికరాలతో కూడిన ఒక సంచి లేదా పెట్టె అని అనుకున్నాం. ఇంద్రజాల-మహేంద్రజాల కనికట్టు విద్యలు ప్రదర్శించేవారి దగ్గర కూడా టూలుకిట్టు ఉంటుంది.
బిజెపి అబద్దాల అక్షయ టూలుకిట్టు !
ఇలాంటి కనికట్టు విద్యలో రాజకీయ పార్టీలు తలమునకలుగా ఉన్నాయి. వీటిలో వామపక్షాలు మినహా కాంగ్రెస్, బిజెపి, వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్ ఇలాంటి పార్టీలన్నీ ఒకేతానులో ముక్కలు. వాటి దగ్గర పరికరాల కంటే ప్రచార అస్త్రాలు ఉంటాయి. వాటిలో బిజెపి ఒకటి. నిత్యం ఉదయం ఆరుగంటలకు చమురు ధరలు పెరిగితే పెంచే, తగ్గితే తగ్గించే ప్రకటన వెలువడుతుంది. ధరలు భారంగా మారుతున్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేనంత పన్ను మొత్తాన్ని మన దేశంలో విధిస్తున్నారు. ఆ చేదు గుళికను మింగించేందుకు బిజెపి తన అక్షయ తూణీరంలోని అబద్దాల ఆయుధాలను నిత్యం ప్రయోగిస్తున్నది. గతేడాది నవంబరు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరల గురించి జనం ముందు గుండెలు బాదుకుంటూ మహా నటి నటులను మరపిస్తున్నది.వాటిని మనం ఎందుకు నిలదీయలేకపోతున్నాం ?
దిగువ ఇస్తున్న అంకెలన్నీ కేంద్ర పెట్రోలియం శాఖలోని పిపిఏసి విభాగ నివేదికల నుంచి సేకరించినవి.2014 మార్చి ఒకటవ తేదీ( నరేంద్రమోడీ ఏలుబడిలోకి రాక ముందు),2015 నవంబరు ఏడవ తేదీన, 2020నవంబరు ఒకటవ తేదీన న్యూఢిల్లీలో పెట్రోలు ధరల్లో ఏ భాగం ఎంత శాతం ఉన్నదో వివరాలు ఇలా ఉన్నాయి
వివరాలు ×× ఏడాది×× డీలరుకు లీటరు ధర ×××× చిల్లర ధరలో శాతం
సరకు ధర × 2014-49.50×67.6×2015- 26.73×44 × 2020×25.73× 31.74
కేందప్రన్ను×× 2014-9.48 × 13 × 2015-19.56 ×32.2× 2020-32.98×40.68
రాష్ట్రపన్ను ××× 2014-12.20× 16 × 2015-12.14 × 20 × 2020-18.71×23.1
మొత్తం పన్నులు ×2014-21.68×29.61×2015-31.70×52.2× 2020-52.2 ×63.76
2015 నవంబరు ఏడవ తేదీన న్యూఢిల్లీలో డీజిలు ధరల్లో ఏ భాగం ఎంత శాతం, బ్రాకెట్లలో ఉన్న అంకెలు 2020 నవంబరు ఒకటవ తేదీ నాటివని గమనించాలి. 2014లో డీజిలు మీద ఎనిమిది రూపాయల సబ్సిడీ ఉంది.
వివరాలు × సంవత్సరం×× డీలరుకు లీటరు ధర ××× చిల్లర ధరలో శాతం
సరకు ధర ×2014-44.31×2015-26.55×57.8×2020-25.75×36.5
కేందప్రన్ను×2014-3.56×6.4× 2015-11.16×24.29× 2020-31.83×45.17
రాష్ట్రపన్ను ×2014-6.41×11.55×2015-6.79×14.8 × 2020-10.36×14.7
మొత్తంపన్ను×2014-9.97×18 ×2015-17.95×39.1×2020-42.19 × 63.45
మధ్య ప్రదేశ్ సంగతి ఏమిటి ?
పైన పేర్కొన్న వివరాలను గమనించినపుడు ఏ రీత్యా చూసినా కేంద్ర పన్నుల భారం పెరిగింది.ఆ దామాషాలో రాష్ట్రాల భారం పెరగలేదన్నది స్పష్టం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేంద్ర పన్నులు ఏక మొత్తం. వాటిని సవరించేంతవరకు ధరలతో నిమిత్తం లేకుండా స్ధిరంగా ఉంటాయి. రాష్ట్రాల పన్నులు శాతాల మేరకు పెరుగుతాయి. నెలలో కేంద్రం 30 రోజుల పాటు పెట్రోలు, డీజిలు ధరలు పెంచినా కేంద్ర పన్ను మొత్తం పెరగదు.ఈ మధ్య బిజెపి నేతలు పెట్రోలు ధర విషయంలో కాంగ్రెస్ పాలిత రాజస్ధాన్ రాష్ట్రాన్ని చూపి చూశారా అక్కడ ఎంత ఉందో అని చెబుతున్నారు. ఎదుటి వారి కంట్లో నలుసులను వెతికేవారు తమ సంగతి చూసుకోరు. కేంద్ర పెట్రోలియం శాఖ నివేదిక ప్రకారం 2020నవంబరు ఒకటవ తేదీన రాజస్ధాన్‌లో పెట్రోలు ధర రు.88.21 ఉంటే తమ ఏలుబడిలోని మధ్య ప్రదేశ్‌లో రు.88.70 ఉందని సదరు నివేదిక ఒక్కాణించి మరీ చూపింది. ఆ తరువాత ధరలు అదే స్ధాయిలో పెరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల వివరాలు తీసుకుంటే అసలు కథను కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. అనేక రాష్ట్రాలలో స్ధానిక ప్రభుత్వాలు స్దానిక సెస్‌లు, ప్రత్యేక పన్నులను విధిస్తున్నాయి.
మధ్య ప్రదేశ్ పెట్రోలు ×వ్యాట్ 33శాతం+లీటరుకురూ.4.50 వీటి మీద ఒకశాతం సెస్
రాజస్దాన్ పెట్రోలు ×వ్యాట్ 36శాతం+లీటరుకురూ.1.50 రోడ్ సెస్
మధ్య ప్రదేశ్ డీజిలు ×వ్యాట్ 23శాతం+లీటరుకురూ.3.00 వీటి మీద ఒకశాతం సెస్
రాజస్దాన్ డీజిలు ×వ్యాట్ 26శాతం+లీటరుకురూ.1.75 రోడ్ సెస్
చమురు బంకుల దగ్గర బోర్డులు పెడితే బండారం బయటపడుతుంది !
బిజెపి నేతలు చెప్పే మరొక అబద్దం, గారడీ ఏమంటే కేంద్రం వసూలు చేస్తున్న పన్నులలో రాష్ట్రాలకు 42శాతం(అది ఇప్పుడు 41శాతం) బదలాయిస్తున్నది కనుక కేంద్ర పన్నుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ కనుక రాష్ట్రాలే ధరలు తగ్గించాలని చెబుతారు. మెజారిటీ రాష్ట్రాలు తమ ఏలుబడిలోనివేగా ఎన్ని తగ్గించాయి? ఈ వాదన వెనుక కూడా మోసం ఉంది. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం పెట్రోలు, డీజిలు మీద వసూలు చేస్తున్న రూ.32.98, 31.83లలో రాష్ట్రాలకు 41శాతం కేటాయిస్తే ఆ వాదనను సమర్ధించవచ్చు ? ఈ మొత్తాలలో రెండు భాగాలు ఉంటాయి. ఎక్సయిజు పన్ను మరియు సర్‌ఛార్జీలు,సెస్‌లు. వీటిలో పన్నుల్లోనే రాష్ట్రాలకు 41శాతం వాటా. రెండో భాగంలో ఇచ్చేదేమీ ఉండదు. అందుకే కేంద్రం ఏటేటా రెండో భాగాన్ని పెంచుతున్నది. రాష్ట్రాలు ఆందోళన చేస్తున్నాయి గనుక పన్ను వాటాను 32 నుంచి 42శాతానికి పెంచినట్లు అంకెల గారడీ చేశారు.
2017ఏప్రిల్-2020 మే నెల మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద సెస్, సర్‌ఛార్జీ 150శాతం, డీజిలు మీద 350శాతం పెంచితే ఇదే సమయంలో పన్ను మొత్తాలు 69, 57శాతాలను మాత్రమే పెంచింది.తాజాగా బడ్జెట్‌లో పెట్రోలు మీద రూ.2.50, డీజిలుకు రు.4.00 వ్యవసాయ సెస్ విధించారు. ఇది అదనం కాదు, ఈ మేరకు పన్ను తగ్గించి దాన్ని సెస్‌గా చూపారు. వినియోగదారులకు భారం లేనప్పటికీ రాష్ట్రాలకు కోత పడుతుంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సెస్‌లు, సర్‌ఛార్జీల నుంచి రాష్ట్రాలకు వాటా లేదు. ఇలాంటి జిమ్మిక్కు కారణంగా ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా వాస్తవంలో రాష్ట్రాలకు బదలాయించిన నిధులు 2019తో పోల్చితే 2020లో 36.6 నుంచి 32.4శాతానికి పడిపోయాయి. అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలనే బిజెపి వాదన అసంబద్దం మోసపూరితం.
రోడ్డు సెస్-టోలు టాక్సు వెరసి గోడ దెబ్బ చెంపదెబ్బ !
చమురు మీద రోడ్డు సెస్ వసూలు చేస్తున్న కేంద్రం మరోవైపు ఆ రోడ్లను వినియోగించినందుకు టోలుపన్ను వసూలు చేస్తున్నది. అంటే మన నుంచి వసూలు చేసిన సొమ్ముతో రోడ్లు వేస్తూ తిరిగి మన నుంచి టోలు వసూలు చేయటం వినియోగదారులకు గోడదెబ్బ చెంపదెబ్బ కాదా ? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తమ నేత అతల్ బిహారీ వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధికి నాంది పలికారని బిజెపి గొప్పగా చెప్పుకుంటుంది. నిజమే, అదే వాజ్‌పేయి ఆ రోడ్లకు నిధులను జనం నుంచి వసూలు చేసే పధకానికి కూడా నాంది పలికారు.
ప్రస్తుతం మనకందరికీ మీడియాలో లేదా ప్రభుత్వం కూడా చెబుతున్న ఎక్సయిజు పన్ను పెట్రోల మీద లీటరుకు రు.32.98. దీనిలో వాస్తవానికి మౌలిక ఎక్సయిజ్ పన్ను(బెడ్) రు.2.98 మాత్రమే.మిగిలిన రూ.30లో ప్రత్యేక అదనపు ఎక్సయిజ్ పన్ను(సీడ్) రూ.12, రోడ్డు మరియు మౌలిక సదుపాయాల పన్ను రు.18. తాజాగా విధించిన వ్యవసాయ సెస్‌ను సర్దుబాటు చేసేందుకు బెడ్‌ను రు.1.41కి సీడ్‌ను రూ.11కు తగ్గించారు. డీజిలు విషయానికి వస్తే వ్యవసాయ సెస్‌కోసం బెడ్‌ను రు.4.83 నుంచి రూ.1.80కి సీడ్‌ను 9నుంచి 8కి తగ్గించారు. బెడ్, సీడ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆమేరకు తగ్గిపోతుంది. కేంద్ర పన్నుల పెంపుదల రాష్ట్రాలకు వరమా శాపమా ?
బిజెపి పక్కా విదేశీ – లేకుంటే గోబెల్స్‌ను ఎలా అనుకరిస్తారు ?
దిశా రవి టూల్‌కిట్టు గురించి నానాయాగీ చేసిన సంఘపరివార్ మరుగుజ్జులు(ట్రోల్స్) చమురు బాండ్ల గురించి జనాల మెదళ్లను ఖరాబు చేశారంటే అతిశయోక్తి కాదు. పక్కా భారతీయతను పాటిస్తున్నామంటారు గాని నిజానికి పక్కా విదేశీ, అందునా నాజీ హిట్లర్ మంత్రి పక్కా అబద్దాలను ప్రచారం చేసిన గోబెల్స్ వీరికి ఆరాధ్యదైవం, నిత్యం కొలుస్తూ ఉంటారు. అసలు ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటే విదేశీ సంస్ధల అనుకరణ లేదా అరువు తెచ్చుకున్నది అనుకోండి.
గత కాంగ్రెస్ పాలకులు చమురు బాండ్లు చేసి చమురు ఖాతాను గుదిబండగా చేశారని, తమ నేత నరేంద్రమోడీ వచ్చి వాటన్నింటినీ తీర్చాల్సి వచ్చినందున కేంద్ర పన్నులు పెంచాల్సి వచ్చిందని ఒక పిట్టకథ వినిపిస్తారు. ఒక వేళ అదే నిజమనుకోండి. ఆయిల్ బాండ్ సెస్ అనే పేరుతో వసూలు చేసి వాటిని తీర్చివేయవచ్చు. అప్పు తీరగానే నిలిపివేయవచ్చు, కానీ ఆపని చేయలేదే ? అయినా ఒక ప్రభుత్వం చేసిన అప్పు తరువాత వచ్చే మరొక ప్రభుత్వానికి గుదిబండ ఎలా అవుతుంది. పార్టీలు, పాలకులు మారతారు తప్ప ప్రభుత్వం కొనసాగుతుంది కదా ?
అర్ధ సత్యాలను, అసత్యాలను చెప్పటంలో బిజెపి ఆరితేరింది. గత యుపిఏ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లకు గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని గతంలో ప్రచారం చేశారు, చమురు మంత్రిగారయితే 1.5లక్షల కోట్లన్నారు. బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దాని ప్రకారం 40వేల కోట్ల రూపాయల వడ్డీ, 1.3లక్షల కోట్ల అప్పుకు చెల్లించినట్లు ఒక బొమ్మను చూపారు. తీరా 2018లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇదే పాలకులు చెప్పిందేమిటి చెల్లించిన మొత్తం రూ.3,500 కోట్లు. గత ఏడు సంవత్సరాలుగా ఆ పేరుతో జనాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ఏమి చేశారు ? కరోనా సమయంలో జనమంతా దివాలా తీస్తే బిలియనీర్లు మరింత బలిశారు, కొత్తగా 40 మంది చేరి 177కు చేరారు. జనాన్ని కొట్టి పోగేసిందంతా ఇలాంటి వారికి కట్టబెట్టకపోతే అది సాధ్యమయ్యేనా ? ఇంతకూ చమురు బాండ్ల అప్పును మొత్తం తీర్చినట్లేనా ? నిజం ఏమిటి ?
మిగతా – ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2 లో చదవండి