Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. చెల్లించాల్సిన మొత్తాలను ఈక్విటీలుగా మార్చిన విషయం తెలిసిందే. జనాలకు చెవుల్లో పూలు పెట్టదలచుకున్నవారు నటించటం తప్ప 2010వరకు అంతకు ముందున్న ప్రభుత్వాలన్నీ చమురు బాండ్లను జారీ చేశాయనే విషయం తెలుసు. అసలు చమురు బాండ్లంటే ఏమిటి ? ఏమీ లేదండీ . ప్రభుత్వాలు వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే అంతర్జాతీయ భాషలో బాండ్లు అంటున్నారు. అంటే అసలు చెల్లించేంతవరకు వడ్డీ కూడా చెల్లించాలి కదా ? ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు నిర్ణీత తేదీల ప్రకారం వడ్డీ, గడువు మీరిన వాటికి అసలు చెల్లిస్తారు. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.ఈ బాండ్లను చమురు కంపెనీలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు లేదా ఇతర సంస్ధలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.

చమురు బాండ్లను వాజ్‌పేయి సర్కార్‌ జారీ చేయలేదా ? జనానికి ఇచ్చిన దానికి ఏడుపెందుకు ?


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. మోడీ అధికారానికి వచ్చిన తరువాత చమురు ధరలు విపరీతంగా పడిపోయినప్పటికీ చమురు బాండ్లు, మరొక సాకుతో పెద్ద మొత్తంలో పన్నులు పెంచిన కారణంగా వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇలా చెప్పారు.” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి ఇంకా చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. మంత్రి చెప్పింది అర్ధ సత్యం. ఒక వేళ నిజమే అనుకున్నా, ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బిజెపి మంత్రి ఏడవటం, అంతకంటే ఎక్కువగా జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు.

చమురు బాండ్ల బాజా వదలి సరిహద్దు పాట అందుకున్నారు !


చమురు బాండ్లకు సంబంధించి ఇప్పటి వరకు యుపిఏ సర్కార్‌ చెల్లించిందే ఎక్కువ అన్నది అసలు నిజం. ఇప్పటి వరకు 1750 కోట్ల చొప్పున ఉన్న రెండు బాండ్లు మాత్రమే గడువు తీరినందున మోడీ సర్కార్‌ 3500 కోట్లు చెల్లించింది. మిగిలిన మొత్తాలను చెల్లించాల్సి ఉంది. తదుపరి చెల్లింపు 2021 అక్టోబరులో ఉంది. ఈ బాండ్లకు వడ్డీగా చెల్లించిన మొత్తం 40,226 కోట్లని మంత్రి పియూష్‌ గోయల్‌ మూడు సంవత్సరాల క్రితం చెప్పారు.2014-15 నుంచి 2017-18 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వానికి 11.04లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు 7.19 లక్షల కోట్ల రూపాయల ఆదాయం చమురు రంగం నుంచి వచ్చింది. ఇంత ఆదాయ బిజెపి పెద్దలు చెబుతున్నట్లుగా చమురు బాండ్ల అప్పు తీరిపోతే ఆ పేరుతో విధించిన అదనపు భారం ఎందుకు కొనసాగిస్తున్నట్లు ?చమురు బాండ్ల గురించి మరీ ఎక్కువ చెబితే జనానికి అనుమానాలు తలెత్తుతాయనే భయంతో ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు.


సరిహద్దులో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనం గాక ఎవరు భరించాలి ? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదిస్తున్నారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అలాంటపుడు సరిహద్దుల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి అమెరికా,ఇజ్రాయెల్‌, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి కరోనా కష్టకాలంలో జనాన్ని ఇబ్బంది పెట్టటం అవసరమా ? ప్రతిపైసాకు జవాబుదారీ అని చెప్పుకున్న మోడీ గారికి తగినపనేనా ?
చమురు ధరలు పెరగటానికి మరొక కారణం రూపాయి విలువ పతనం.చమురు బాండ్లు, సరిహద్దులో ఖర్చు అంటే కాసేపు అంగీకరిద్దాం. మరి రూపాయి పతనానికి బాధ్యత ఎవరిది ? మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 58 రూపాయలుగా ఉన్నది ఇప్పుడు 72-73కు పతనమైంది. గతంలో ముఖ్యమంత్రిగా మోడీ రూపాయి విలువ పతనానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్ధతే అని చెప్పారు. ఇప్పుడు మరి తన మాటలను తనకే వర్తింప చేసుకొనే నిజాయితీని ప్రదర్శిస్తారా ? కేంద్ర బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్న సమాచారం ప్రకారం 2012 మార్చి-సెప్టెంబరు నెలల మధ్య యుపిఏ సర్కార్‌ రు.9,762.85 కోట్ల రూపాయలను చెల్లించింది. తరువాత మోడీ సర్కార్‌ 2015 మార్చినెలలో 3,500 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో పదివేల కోట్లు చెల్లించాలి.తిరిగి 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో 26,150 కోట్లు, 2024 ఫిబ్రవరి-డిసెంబరు మాసాల మధ్య 37,306.33 కోట్లు, 2025లో 20,553.84 కోట్లు, చివరిగా 2026లో 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాస్తవం ఇది కాగా ఈ మొత్తాలను, వడ్డీ చెల్లించామని, అందుకోసమే అదనంగా పన్నులు వేశామని చెప్పటం గుండెలు తీసే బంట్లకు తప్ప మరొకరికి సాధ్యమా ?


దీనిలో కూడా జనాలను ముఖ్యంగా విద్యావంతులను ఎందుకంటే ఇతరులకు బడ్జెట్‌ పత్రాలు అందుబాటులో ఉండవు కనుక తప్పుదారి పట్టించారు. పోనీ విద్యావంతులు తాము తెలుసుకొని వాస్తవాలను జనాలకు చెప్పారా అంటే వాట్సాప్‌లో వచ్చిన తప్పుడు సమాచారాన్ని తాము నమ్మి ఇతరులను నమ్మించేందుకు వాటిని ఇతరులకు కరోనా వైరస్‌ కంటే వేగంగా అందిస్తున్నారు. వాస్తవాలు చెప్పే వారికి ప్రధాన స్రవంతి మీడియాలో చోటు లేదు కనుక వారి గళం వినపడదు, బొమ్మ కనపడదు. వాస్తవ సమాచారాన్ని ఇచ్చే మీడియాను జనం ఆదరించటం లేదు. మోడీ సర్కార్‌ అందచేసిన బడ్జెట్‌ పత్రాలు వాజ్‌పాయి హయాంలో కూడా చమురు బాండ్లు జారీ చేశారనే వాస్తవాన్ని బయటపెట్టాయి.సంవత్సరాల వారీగా ఎప్పుడు ఎంత వడ్డీ చెల్లించారో దిగువ చూడండి, ఏది నిజమో ఎవరు పచ్చి అవాస్తవాలు చెబుతున్నారో అర్ధం చేసుకోండి !


సంవత్సరం××××× వడ్డీ మొత్తం కోట్ల రు.
అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఏలుబడి
1998-99××××× 1,050
1999-2000××× 224
2000-01××××× 40
2001-02××××× 40
2002-03××××× 667
2003-04××××× 667
మొత్తం××××× 2688
మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి
2004-05××××× 684
2005-06××××× 846
2006-07××××× 1,899
2007-08××××× 3,853
2008-09××××× 5,529
2009-10××××× 10,535
2010-11××××× 10,958
2011-12××××× 10,958
2012-13××××× 10,458
2013-14××××× 10,256
మొత్తం××××× 45,536
నరేంద్రమోడీ ఏలుబడి
2014-15××××× 10,256
2015-16××××× 9,990
2016-17××××× 9,990
2017-18××××× 9,990
2018-19××××× 9,990
2019-20××××× 9,990
2020-21××××× 9,990
మొత్తం××××× 70,196
ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన సబ్సిడీ బదులు జారీ చేసిన చమురు బాండ్లను తప్పు పడుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ ఇతర అవసరాలకు అసలు అప్పులే చేయటం లేదా ? వడ్డీ చెల్లించటం లేదా ? మరి ఆ నిర్వాకానికి ఎందుకు పాల్పడుతున్నట్లు ? ద్రవ్యలోటును కప్పి పుచ్చి అదుపులోనే ఉందని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌,ఇతర అంతర్జాతీయ సంస్ధలను నమ్మించేందుకు( నిజానికి వాటికి తెలియని జిమ్మిక్కులేమీ కాదు- అందరూ ” పెద్దమనుషులు ” కనుక ఎవరూ ఏమీ తెలియనట్లు నటిస్తారు) అంకెల గారడీ చేస్తారు. నగదు చెల్లింపు కాదు గనుక ఈ బాండ్లు ప్రభుత్వ లోటులో కనిపించవు.ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన డివిడెండ్‌, ఆదాయపన్ను మొత్తం రు.2,11,026 కోట్లు. ఇదే సమయంలో వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీ మొత్తం 1.7లక్షల కోట్లు. పన్ను సంగతి సరే లాభం కంటే తక్కువే కదా ? ఎప్పుడో తీర్చాల్సిన చమురు బాండ్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలను జనం మీద బాదటం మంచి రోజులకు, జవాబుదారీ పాలనకు నిదర్శనమా ?

మొదటి భాగం ” ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1” లో చదవండి.