Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇల్లలకగానే పండగ కాదు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా ! హాం ఫట్‌ అంటే బంగాళాఖాతం కేరళపక్కకు వస్తుందా ? కస్టమ్స్‌ శాఖ దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్లు కేరళ సిపిఎంను దెబ్బతీస్తాయా ? యుఏయి నుంచి దౌత్య సంచిలో వచ్చిన దొంగబంగారం కేసులో అరెస్టయి జైల్లో ఉన్నవారిలో స్వప్న సురేష్‌ ప్రధాన నిందితురాలు. లక్షా 90వేల డాలర్ల( కోటీ ముప్పయి లక్షల రూపాయలకు సమానం)ను అక్రమంగా తరలించటంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్‌ మరికొందరు మంత్రులు, ఇతరులకు సంబంధం ఉందని ఆమె చెప్పిందంటూ ఆ విషయాలను కస్టమ్స్‌ శాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఇంకేముంది దున్నఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా ముఖ్యమంత్రి విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ శనివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఎన్నికలలో దెబ్బతీసేందుకు జరిపిన కుట్రలో భాగంగా కస్టమ్స్‌ శాఖ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయటాన్ని నిరసిస్తూ కస్టమ్స్‌ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని సిపిఎం, ఇతర పక్షాలు పిలుపునిచ్చాయి. స్ధానిక సంస్దల ఎన్నికలను అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌, బిజెపి వాటితో జతకలసిన మీడియా పెద్దలు పెద్ద ఎత్తున దొంగ బంగారం, ఇతర కేసులు, ఆరోపణలతో సిపిఎంను దెబ్బతీసేందుకు చేసిన తప్పుడు ప్రచారాన్ని అక్కడి జనం పట్టించుకోలేదు. ఎల్‌డిఎఫ్‌ పక్షాలను గెలిపించారు.


మరోసారి అధికారానికి వచ్చి ఎల్‌డిఎఫ్‌ చరిత్ర సృష్టించనుందంటూ స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్ల తీరు తెన్నులు, ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించటంతో కేంద్రంలోని బిజెపి పెద్దలకు బుర్ర ఖరాబై (సామాన్యుల భాషలో మైండ్‌ దొబ్బి) కస్టమ్స్‌ శాఖ ద్వారా ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడిందని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గం వర్ణించింది. కేంద్ర సంస్దలు బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావటం తప్ప దీనిలో పసలేదని పేర్కొన్నది. నిజానికి ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని విమర్శించింది.ఈ అంశం మీద యుడిఎఫ్‌, బిజెపి ముందుకు తెచ్చిన సవాలును తగిన విధంగా ఎదుర్కొంటామని, స్ధానిక సంస్దల ఎన్నికలలో వారి దిగజారుడు యత్నాలను జనం వమ్ము చేశారంటూ, చౌకబారు వ్యవహారాలకు పాల్పడే వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అదేమంటే ఇది కేరళ అని సిపిఎం పేర్కొన్నది.


నిజానికి స్వప్ప సురేష్‌ చెప్పింది అంటూ కస్టమ్స్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు కొద్ది నెలలుగా కేరళలో తిరుగుతున్నవే.ఒక మెజిస్ట్రేట్‌ ముందు నిందితురాలు ఒక ముఖ్యవిషయం వెల్లడించిందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమైంది. ఇప్పుడు వాటినే రాజకీయ అవసరాల కోసం అఫిడవిట్‌ రూపంలో సమర్పించి సంచలనాత్మక అంశంగా మార్చారు. ఇంకేముంది దీంతో సిపిఎం ఢమాల్‌ అన్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు. ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

బిజెపి కూడా సిగ్గుపడిన అంశాన్ని కాంగ్రెస్‌ చెబుతోంది !

కరోనా మహమ్మారి సమయంలో వామపక్ష సంఘటన సర్కార్‌ పౌరులను ఆదుకున్న తీరును జనం మెచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఆహార కిట్‌ ఎంతగానో ఆదరణ పొందింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్ప రాష్ట్రం చేసిందేమిటని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తాజాగా ఆరోపించారు. గతేడాది నవంబరు నెలవరకు కేంద్ర ప్రభుత్వం నెలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు కరోనా సమయంలో ఇచ్చింది. కేరళ ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్‌లో 17రకాల వస్తువులు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. దాన్ని మరో ఐదు నెలల వరకు అంటే మే నెల వరకు పొడిగించింది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన సరకులను రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి కొనుగోలు చేసిన సంచులలో నింపి జనానికి ఇచ్చిందని, సంచుల కొనుగోలులో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తే అవే సరకులను తమ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎందుకు పంపిణీ చేయలేదో సురేంద్రన్‌ చెప్పి ఉంటే అసలు బండారం బయటపడేది. తమ కేంద్ర పభుత్వం ఇచ్చిన సరకులను విజయన్‌ సర్కార్‌ పంపిణీ చేసిందని స్దానిక ఎన్నికల ప్రచారంలో చెప్పుకొనేందుకు బిజెపి కూడా సిగ్గుపడి నోరుమూసుకుంది. అలాంటిది కాంగ్రెస్‌ ఎంపీ నోట వెలువడింది. ఇలాంటి నోటి ముత్యాలు ఏం చేస్తాయో ,ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

కాంగ్రెస్‌ ఓడిపోబోతోంది అంటున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు !


ఆహార కిట్‌లో సరకులు కేంద్రమే ఇచ్చిందన్న కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మరో మాట కూడా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోనుందని, బలమైన కాంగ్రెస్‌ వర్గం బిజెపిలో చేరనుందని కూడా చెప్పినట్టు కేరళ కౌముది పత్రిక పేర్కొన్నది. ఈ పెద్దమనిషే బిజెపిలో చేరనున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో గనుక అధికారానికి రానట్లయితే కేరళలో కాంగ్రెస్‌ చరిత్రలో కలసినట్లే అని కాసరగోడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాజమోహన్‌ ఉన్నితన్‌ చెప్పారు. పార్టీలో ముఠాలు పెద్ద శాపంగా ఉన్నాయని వాటిని అదుపు చేయనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదన్నారు. పార్టీ కంటే కేరళలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ముఠాలనే ఎక్కువగా ప్రేమిస్తారు. అది పార్టీ వైఫల్యం. ఈ ఎన్నికల్లో దానిలో మార్పు వస్తుందనుకుంటున్నా , లేనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదు. అసెంబ్లీ నామినేషన్ల సమయంలోనే కుట్రలు జరుగుతాయి అన్నారు.


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌కు రాష్ట్రం గురించి తెలియదని, అది కాంగ్రెస్‌ పార్టీకి బలహీనత అని మాజీ మంత్రి వయలార్‌ రవి ఆసియా నెట్‌ ఛానల్‌తో చెప్పారు. వ్యక్తిగతంగా కె సుధాకరన్‌(కన్నూరు ఎంపీ) ఉండాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. పార్టీలో ఇప్పటికీ ముఠాతత్వం ఉందని, అందువల్లనే వాటి ప్రాతిపదికన గాక పార్టీ ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక జరగాలన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌ కూడా కన్నూరుకు చెందిన నాయకుడే అయినప్పటికీ కేరళలో తిరిగిన అనుభవం లేదని, తనకు, ఎకె ఆంటోని, ఊమెన్‌ చాందీకి మాత్రమే కన్నూరుకు రైళ్లలో తిరిగిన అనుభవం ఉందన్నారు. ఇక్కడ ఉన్నవారందరూ, రాజకీయాలు కూడా తెలుసు, ముళ్లపల్లిని ఢిల్లీలో నేతను చేశారు, ఇది పార్టీకి ఎంతో చెడు, ఊమెన్‌ చాందీని నాయకత్వ స్దాయికి తీసుకురావటం ఎంతో ప్రాధాన్యత కలిగిందని వయలార్‌ రవి చెప్పారు.

ఉన్న ఒక్కటీ దక్కుతుందో లేదో…. కేరళలో బిజెపి సిఎం అభ్యర్ధి ప్రహసనం !


కేరళలో బిజెపికి ఉన్నది ఒకే ఒక అసెంబ్లీ స్ధానం. దాని ప్రతినిధి ఓ రాజగోపాల్‌. వివిధ కారణాలతో గత అసెంబ్లీ ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. రాజగోపాల్‌ను గెలిపించేందుకు అక్కడ కాంగ్రెస్‌ బలహీన అభ్యర్ధిని నిలిపిందన్నది బహిరంగ రహస్యం. ఈ సారి ఆయన పోటీ చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఎవరు పోటీ చేస్తారో, ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. ఆ స్ధానంలో పోటీ చేసి గెలవాలని అనేక మంది తాపత్రయ పడుతున్నారు. సినిమా స్టార్లు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారుల్లో ఒకరైన శ్రీధరన్‌ లాంటి వారిని బిజెపి తన టూల్‌కిట్‌లో అలంకార వస్తువులుగా, ఎన్నికల సమయంలో ప్రచారానికి, ఫొటోలకు మాత్రమే ఉపయోగించుకోవటం తెలిసిందే. టూరిస్టు పాకేజి ముసిగిన తరువాత ఎక్కడా కనపడరు. అలాంటి వారిలో ఒకరిగా భావించిన మెట్రోమాన్‌ 88 సంవత్సరాల ఇ శ్రీధరన్‌ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి సిద్దంగా ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేస్తే బిజెపికి గతంలో వచ్చిన వాటికంటే రెట్టింపు ఓట్లు వస్తాయని, పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు సార్లు దేశంలో బిజెపిని వరుసగా అధికారానికి తెచ్చిన నరేంద్రమోడీకే కేరళ కొరకరాని కొయ్యగా ఉంది. అలాంటి స్దితిలో రెట్టింపు ఓట్ల వస్తాయని చెప్పటం పరోక్షంగా నరేంద్రమోడీ పలుకుబడిని కించపరచటమే. నాలుగు ఓట్లు వస్తాయి కదా అని శ్రీధరన్‌కు కాషాయ కండువా కప్పారు.


కేరళ ఓటర్లను మరీ అంత అమాయకులుగా భావించారో లేక ఆత్రత వారిని అలా ముందుకు తోసిందో లేక ఇతరంగా ఏ నేతను ముందుకు తెస్తే ఏమిసమస్యలు వస్తాయో తెలియదుగానీ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ ప్రకటించారు. వెంటనే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వి. మురళీ ధరన్‌ కూడా నిర్ధారించారు.అసెంబ్లీ ఎన్నికలకు స్ధానిక సంస్ధల ఫలితాలకు సంబంధం లేదని, ఎన్నికల ముందు వెలువడే సర్వేలను తాము విశ్వసించబోమని, ఈ సారి తమకు ఎక్కువ స్ధానాలు వస్తాయని కేంద్ర మంత్రి మురళీధరన్‌ చెబుతున్నారు. అధికారానికి వస్తామని కలలు కంటున్న చోటే సిఎం అభ్యర్ధిని ప్రకటించే స్ధితిలో లేని బిజెపి ప్రకటన కేరళ, దేశ వ్యాపితంగా నవ్వులు పండించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కేంద్ర నాయకత్వం ఇదేమి పిచ్చి ప్రకటన అంటూ రాష్ట్ర నాయకులకు బుద్దిశుద్ది చేయటంతో కొద్ది గంటల్లోనే అబ్బే మీడియాలో వార్తలను చూసి నిజమే అనుకున్నా తప్ప నిజం కాదు అని కేంద్ర మంత్రి తన మాటలను తానే దిగమింగారు. సురేంద్రన్‌ కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ జారుకున్నారు. ఈలోగా శ్రధరన్‌ తానే కాబోయే ముఖ్యమంత్రిని అని తెగ ఫీలయిపోయి రైల్వే సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పరువు కాపాడుకొనేందుకు ఒక ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని, అయితే ఎన్నికల్లో ప్రచార బాధ్యత నిర్వహిస్తానని అన్నారు. ఆ పార్టీలో ఇంకే పరిణామాలు వస్తాయో, ఏప్రిల్‌ ఆరున ఎన్నికల్లో కేరళలో బిజెపికి ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !