Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


గురువు గారూ నా సందేహాలు కొన్నింటిని నివృత్తి చేసుకోవాలని ఉంది… వదలమంటారా ?
శిష్యా అత్యవసరం అయితే అడుగు… చెబుతా ! ఇప్పుడు నేను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి దుర్భిణీ వేస్తున్నా !!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా ఇంకా పొత్తులు జిత్తులు ఖరారు కాలేదు కనుక వాటి గురించి మరోసారి అడుగుతా.
సరే శిష్యా బిజెపి గ్రహగతులు కూడా బాగున్నట్లు లేదు, అంతా మసకమసకగా ఉంది.నువ్వు అడిగితే నేనూ ఇప్పుడే చెప్పలేను… ఇంకాస్త చూడాలి… సరే సందేహాలేమిటో అడుగు !


మూడు వ్యవసాయ చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమై వంద రోజులు దాటిపోయింది. దీనికి ప్రచారం ఎక్కువగా కల్పించింది గోడీ మీడియానా లేక మోడీ ప్రభుత్వమా ?
పెట్రోలు ధరల గురించి ధర్మ సంకటంలో పడిన మంత్రి నిర్మలమ్మ మాదిరి ఈ విషయంలో నన్ను సంకటంలో పడవేశావు కద నాయనా ! అయినా …. మనలో మాట….ఆశ్రమంలో దొంగ చెవులు ఉంటాయి. ప్రతి చోటా రహస్య కెమెరాలు అమర్చుతున్నారట. అందరు స్వామీజీలూ నిత్యానందమాదిరి ఉంటారనుకుంటున్నారు జనం, ఖర్మ ఖర్మ ! జరిగేది జరగకమానదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, వ్యతిరేక ప్రచారంతో పాటు గోడీ మీడియా రైతు ఉద్యమం గురించి అనుకూల ప్రచారమూ చేయక తప్పలేదు. మొత్తంగా చెప్పాలంటే రైతాంగ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది మోడీ ప్రభుత్వమే, దానికే నేను ఎక్కువ మార్కులు వేస్తా !


అదేంటి గురువుగారూ చెవులో చెబుతారేమిటి ? దీనిలో ఏముంది… బహిరంగ రహస్యమేగా !
నా మఠం, నా భక్తులు, నా శిష్యులతో మూడు ప్రవచనాలు-ఆరు ఆదాయాలు అన్నట్లుగా వెలుగొందుతున్నదానిని నువ్వు నాశనం చేసేట్లున్నావు…. టూలుకిట్లు, ట్వీట్లు ఇలాంటి పదాలను ఉచ్చరించాలంటేనే ఉచ్చపడుతోంది. ఎక్కడ కేసుల్లో ఇరికిస్తారో అని…


మీరు మరీను గురువుగారూ మనం వేసుకుంటున్నదీ కాషాయమేగా మనల్నీ జైల్లో పెడతారా ?
నీ బండబడ కాషాయం కాషాయం అని పదే పదే అనకు. చివరకు అది బూతులా మారేట్లు ఉంది. బేటీ బచావో అని పిలుపిచ్చిన వారు టూలుకిట్టుపేరుతో దిశ రవి అనే బేటీని జైలు పాలు చేసిన పెద్దలు… ఎంత కాషాయం వేసుకుంటే మాత్రం నిజాలు చెబితే వదులుతారా నాయనా ? ఫిప్టీ ఇయర్స్‌ ఇండిస్టీ ఇక్కడ…75 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యమంత్రి లాంటి పదవులకు అనర్హులు అని చెప్పారా ! ఆ సాకుతోనే కదా ముసలోడయ్యాడని అద్వానీని పక్కన పెట్టారు. ఒక ఏడాది అటూ ఇటూగా అంతే వయస్సున్న మరో ముసలోడు మెట్రో మాన్‌ శ్రీధరన్‌ను మాత్రం కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నారు, ఓట్లొస్తాయనుకుంటే ఎప్పుడేం చేస్తారో తెలియదు. ఈ వయస్సులో నాకు ఎందుకు చెప్పు ?


సరే సరే గురువుగారూ మీరుంటేనే కదా మేమూ పదికాలాల పాటు పచ్చగా కాదు కాదు కాషాయంగా ఉండేది ! రైతు ఉద్యమానికి ప్రచారం కల్పించటం గురించి వివరంగా సెలవిచ్చారు కాదు.!
నాయనా గాంధీని మోసిన రైలే గాడ్సేనూ మోసింది. అలాగే అమెరికా టైమ్‌ మాగజైన్‌ గతంలో నరేంద్రమోడీ ముఖచిత్రంగా ప్రచారం కల్పించింది. ఇప్పుడు అదే పత్రిక మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతాంగ ఉద్యమంలో మహిళలతో వంద రోజుల సందర్భంగా ముఖపత్ర కథనం ప్రచురించింది. దాని పాఠకులతో పాటు ఆ అంశాన్ని వార్తగా ప్రచురించిన దినపత్రికల ద్వారా మరింత ప్రచారం వచ్చింది. విధి వైపరీత్యంగాకపోతే ఏమిటి నాయనా ఇది !


నిజమే గురువుగారూ ! చూస్తుంటే రైతు ఉద్యమం గురించి ప్రస్తావించిన వారందరి మీద బస్తీమే సవాల్‌ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఇది ఎక్కడకు దారితీస్తుందంటారు ?
నాయనా శిష్యుడిగా ఇంకా ముదరాల్సిన వాడివి. భారత్‌, చైనా వంటి దేశాల్లో జరిగే పరిణామాలను ప్రపంచ మీడియా విస్మరించజాలదు ! తొలిసారిగా నరేద్రమోడీకి అతి పెద్ద సవాలు రైతుల నుంచి వచ్చిందంటూ ఏదో ఒక రూపంలో వార్తలు ప్రచురించని, దృశ్యాలను చూపని టీవీ ఛానల్స్‌ లేవంటే అతిశయోక్తికాదు నాయనా ? ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చిందంటే వేరు, దాన్ని దెబ్బతీసే సత్తా మోడీగారికి ఉంది. కానీ జనంతో, అందునా పెద్ద సంఖ్యలో ఉన్న రైతులతో పెట్టుకుంటే అంతే సంగతులు. ఇంకా తత్వం తలకెక్కినట్లు లేదు. అనుకున్నదొకటి అయింది ఒకటిలే బుల్‌బుల్‌ పిట్టా అన్నట్లు పరిస్ధితి తయారైంది. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటే ఇంక నువ్వెందుకు అంటూ కార్పొరేట్లు మోడీగారిని ఇంటికి పంపుతాయి. అమలు జరిపితే రైతులు అదే పని చేస్తారు. రిపబ్లిక్‌ దినోత్సవ అతిధిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రావాల్సింది రాలేదు. కరోనా అని చెప్పినా రైతు ఉద్యమం సాగుతున్నందున ముఖం చాటేశారని అందరూ అనుకున్నారు. నిజంగా ఆరోజు ఆయన వచ్చి ఉంటే జరిగిన పరిణామాలను చూసి ఏం చేసేవారో తెలియదు. రైతు ఉద్యమాన్ని బదనాం చేసేందుకు ప్రభుత్వం చేసిన కుట్ర ఎదురుతన్నిందని, ప్రపంచ వ్యాపితంగా పెద్ద ప్రచారం వచ్చింది కదా నాయనా ! మనలో మాట ఇది ప్రభుత్వం కల్పించినది కాదంటే ఎలా కుదురుతుంది చెప్పు ?


బోరిస్‌ జాన్సన్‌ అంటే గుర్తు వచ్చింది గురువు గారూ. త్వరలో ఆయన పర్యటన ఉందని ఆ సందర్భంగా రైతు ఉద్యమం గురించి చర్చించుతాం అని బ్రిటను మంత్రి నిగెలు ఆదాము గారు స్పష్టంగా చెప్పారని వచ్చిన వార్తలేమిటి గురువర్యా !
చదువు రాని వాడికి ఒక చోట-చదువుకున్న వాడికి మూడు చోట్ల అనే లోకోక్తి విన్నావా నాయనా ? సావధానంగా చెబుతా విను. ఒక చదువు రాని వాడు, చదువుకున్నవాడు ఒక రోడ్డు మీద నడుస్తున్నారు. ఇద్దరూ అనుకోకుండా పెంటను తొక్కారు. చదువు రాని వాడు ఛీ అంటూ కాలు కడుక్కొని వెళ్లిపోయాడు. అదే చదువుకున్నవాడు తొక్కిందేమిటో తెలుసుకోవాలనుకుని చేతికి రాసుకున్నాడు, వాసన ఏమిటో చూద్దామని ముక్కుదగ్గర పెట్టుకున్నాడట.
రైతు ఉద్యమం గురించి చర్చించాలంటూ గతంలోనే వంద మంది బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులు వారి ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు తెచ్చుకో. అలాగే కెనడాలో ఇదే అంశం మీద చర్చ జరిగింది. తాజా విషయానికి వస్తే మన దేశంలో పత్రికా స్వేచ్చ, భారత్‌లో నిరసన తెలుపుతున్న రైతుల రక్షణ గురించి చర్చించాలంటూ బ్రిటీష్‌ పార్లమెంట్‌ పిటీషన్ల కమిటీకి వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఇ-దరఖాస్తు చేశారు. చర్చకు తీసుకోవాలంటే అవసరమైన సంఖ్య కంటే ఎక్కువగా లక్ష మంది జనం వెబ్‌సైట్‌లో సంతకాలు చేశారు. దాని గురించి పార్లమెంట్‌ ప్రాంగణంలోని వెస్ట్‌ మినిస్టర్‌ హాలులో మార్చి ఎనిమిదవ తేదీ నాడు చర్చ జరిగింది. శిష్యా మన పార్లమెంట్‌ చేసిన వాటినే మనం పట్టించుకోవటం లేదు, అలాంటిది బ్రిటీష్‌ ఎంపీలు పార్లమెంటు వెలుప మన గురించి వారేమి చర్చిస్తే, ఏం చేస్తే మనకేంటి అని వదలి వేయకుండా దాన్ని మన హైకమిషన్‌ వారు దొరకబుచ్చుకొని సమగ్ర చర్చ కాకుండా తప్పుడు సమచారాన్ని ఏకపక్షంగా చర్చించారంటూ బ్రిటన్‌కు లేఖ రాసి రచ్చ చేశారు.


అదేంటి గురువా మన గురించి ఇతరులు చర్చించటం ఏమిటి ? అలా చేస్తే అభ్యంతరం తెలుపకూడదా ? తప్పేంటి ? మన అంతర్గత విషయాలను ఇతరులు చర్చించటం ఏమిటి ?
శిష్యా ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న పద్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నిజమే మన అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదు. ఇక్కడ చిన్న తర్కం మరిచిపోకూడదు. ప్రభుత్వాలు వేరు, పౌరులు వేరు.ఎంపీలు వేరు అలాగే ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాలు స్పందిస్తే అది జోక్యం కిందకు వస్తుంది. పౌరులకు, ఎంపీలకు అది వర్తించదు. దేన్ని గురించి అయినా వ్యాఖ్యానించవచ్చు.

అదేమిటి ఎంపీలకు బాధ్యత ఉండనవసరం లేదా మన ఎంపీలు ఎవరైనా అలా చేస్తే మన మోడీ గారు ఊరుకుంటారా గురువు గారూ !
అంతసీను లేదు నాయనా మంత్రులు బూతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి గారు అదుపు చేస్తున్నారా లేదు. మోడీ గారూ కూడా అంతే . తైవాన్‌ అనేది ఒక దేశం కాదు. చైనాలో తిరుగుబాటు రాష్ట్రం. అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది. దాన్ని మన దేశం అధికారికంగా గుర్తించలేదు, చైనాలో అంతర్భాగంగానే చూస్తున్నది. అయినా అక్కడి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి గతేడాది ఇద్దరు బిజెపి ఎంపీలు టిక్కెట్లు కొనుక్కొని తైపే వెళ్లేందుకు సిద్దమయ్యారు. కరోనా కారణంగా ఆగి అంతర్జాల సభలో పాల్గొన్నారు.
అలాగే చైనా వస్తువులను బహిష్కరించాలని మన మోడీ గారు ప్రధాని హౌదాలో పిలుపు ఇస్తే సమస్యలు వస్తాయి. ఆ పని చేయకుండా తన మాతృసంస్ధ సంఘపరివార్‌ దళాల ద్వారా నిత్యం అదే పారాయణం చేస్తుంటారు. ఇది తెలిసినప్పటికీ ప్రభుత్వానికి పార్టీకి తేడా ఉంది కనుక దాన్ని మన ప్రభుత్వ విధానంగా చైనా పరిగణించటం లేదు. ఇతర దేశాల పౌరులను, ఎంపీలను తప్పు పట్టే ముందు మనం అధికారికంగా అనధికారికంగా చేస్తున్నదేమిటో చూస్తే నేను చెప్పిన ఎప్పటికెయ్యది వర్తిస్తుంది.


అయితే గురువు గారూ బ్రిటన్‌ ఎంపీలను మీరు సమర్ధిస్తున్నారా ?
శిష్యా అల్లుడికి బుద్ది చెప్పిన మామ గడ్డికరిచినట్లుగా మనం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే ఇతరులూ దాన్ని పాటిస్తారు.మన కాశ్మీరు మాదిరే టిబెట్‌ చైనా అంతర్గత వ్యవహారం. తేడా ఏమన్నా ఉంటే మనం మనం తేల్చుకుంటున్నట్లుగా వారూ వారూ తేల్చుకుంటారు.కానీ మనం దలైలామాకు ఎందుకు ఆశ్రయం ఇచ్చాం, తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతులు ఎందుకు కల్పించాం. ప్రతిరోజు మన కాషాయ దళాలు టిబెట్‌ అంశం గురించి ఎక్కడో ఒకదగ్గర చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నాయి కదా ? అంతెందుకు శిష్యా పోయినేడాది మన మోడీ గారు అమెరికా వెళ్లి అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా సభలో సెలవిచ్చారే ! దాన్నేమందాం.


డోనాల్డ్‌ ట్రంప్‌ – మన నరేంద్రమోడీ జిగినీ దోస్తులు, తప్పేముంది గురువుగారూ !
దోస్తు అయితే మోడీ గారికి ఇల్లు, సంసారం లేదు గనుక హౌటలుకు తీసుకుపోయి తాగినంత తాగించి తిన్నంత పెట్టించమను. వారి దేశానికి పోయి ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే ఇప్పుడేమైందో చెప్పు. ఆ ట్రంపు కంపును ఎంత జిగినీ దోస్తు అయినా భరించగలడా ? జో బైడెన్‌ దగ్గరకు వెళ్లలేరు, వెళ్లినా ట్రంప్‌ మాదిరి కౌగలించుకోలేరు. రెండింటికీ చెడలా !
అదేంటి గురువు గారూ అంత మాట అంటారు, మన దగ్గరకు వచ్చే నరేంద్రమోడీ భక్తులెవరూ అలా అనుకోవటం లేదు కదా !
శిష్యా చెప్పుకుంటే సిగ్గు చేటు. కాశ్మీరు రాష్ట్రాన్ని, దాని ప్రత్యేక హౌదాను రద్దుచేసి అక్కడి నేతలను నిర్బంధించి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మన నేతలను, చివరికి ఎంపీలను కూడా పోనివ్వకుండా అడ్డుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కానీ మరోవైపు ఏం చేశారు ? ఐరోపా దేశాల నుంచి పార్లమెంట్‌ సభ్యుల బృందాన్ని ఆహ్వానించి వారికి రాచమర్యాదలు చేసి కాశ్మీరులో తిప్పి ఏం చూపించారు? ఎందుకు రప్పించారు. అక్కడ జనాన్ని అణచివేయలేదు అని ప్రపంచానికి చెప్పించుకొనేందుకే కదా ? తమ్ముడు తమ్ముడే ధర్మం ధర్మమే కదా శిష్యా ! మరి అదే దేశాల పౌరులు కాశ్మీరులో చీకటి రాజ్యం అని స్పందిస్తే జోక్యం అవుతుందా ?
అయినా మనలో మాట ! అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం, మా వ్యవసాయ చట్టాలను బయట చర్చించటం ఏమిటి అంటున్నాం కదా ! మన చట్టాలను మన పార్లమెంట్‌లోనే సమగ్రంగా చర్చించేందుకు అవకాశం ఇవ్వలేదనే విమర్శలు, అసలు చర్చించకుండానే మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించినట్లు రాసుకున్నాం కదా ! వాటిని వ్యతిరేకించే వారు రాజధానిలోకి రాకుండా చూసేందుకు రోడ్ల మీద మేకులు కొట్టాం కదా ? మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా మన దగ్గర ఇన్ని పెట్టుకొని ఎవరో మన గురించి ట్వీట్లు చేశారు, టూలుకిట్లు పంచారు అని రుసరుసలాడినా, బ్రిటన్‌ లేదా మరొక దాని మీద పడితే ఊరుకుంటారా, మరింత రెచ్చి పోరా నువ్వు చెప్పు !


అయితే గురువా తరువాత ఏం జరుగుతుందంటారు ?
నా బొంద మన నిర్వాకం అలా తగలడింది. పిలిచి మరీ తిట్టించుకున్నట్లయింది. బ్రిటన్‌ ప్రధాని మన దేశం వచ్చినపుడు ఈ అంశాలను కూడా ప్రస్తావిస్తామని బ్రిటన్‌ మంత్రి చెప్పారు. వ్యవసాయ సంస్కరణలు భారత అంతర్గత వ్యవహారమని ఒక వైపు చెబుతూనే రెండు దేశాల మధ్య ఉన్న సంబంధానికి ఇది ప్రేరేపక సమయం అయినప్పటికీ భారత దేశంతో జఠిలమైన సమస్యలను చర్చించటానికి ఏ విధంగానూ ఆటంకం కాదు అని కూడా చెప్పారు.
శిష్యా అంతటితో ఊరుకోలేదు. భారత్‌లో రైతుల నిరసనలు, వాటి గురించి వార్తలు బ్రిటస్‌ సమాజాల్లో ఆందోళనకరంగానూ అనిశ్చితంగానూ ఉన్నాయని, రెండు దేశాల మధ్య కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయన్నారు. ఓకే ఓకే అంటూ ఆమోదం- వ్యతిరేకత ఏమి తెలుపుతున్నారో కూడా తెలియకుండా చేతులెత్తే వెనుక బెంచీల్లోని ఎంపీలు, ఎంఎల్‌ఏల మాదిరి బ్రిటన్‌ పార్లమెంటులో కూడా అదే బ్యాచీకి చెందిన ఒక మహిళా ఎంపి తప్ప మన వ్యవసాయ చట్టాలను మిగతా పార్టీల వారెవరూ సమర్దించలేదట.


అంటే గురువు గారూ ఆమె అధికార పార్టీ కనుక మన ప్రభుత్వంతో మంచిగా ఉంటే పోలా అన్నారు లోపల ఆమె కూడా వ్యతిరేకంగానే ఉన్నారేమో ! అయినా గురువు గారూ అదేంటండీ మిగతా పార్టీలేవీ మోడీ గారు చెప్పిందాన్ని నమ్మటం లేదూ అంటే ! మన పలుకుబడి ఏమైనట్లూ ? పోనీయండి ఏదో ఒకటి అవుతుంది. చివరిగా ఒక్కటి చెప్పండి ! కాశ్మీరులో మానవ హక్కులకు భంగం కలిగించలేదని ప్రపంచానికి వెల్లడించేందుకు విదేశాల నుంచి ఎంపీలను రప్పించిన విషయం చెప్పారు. వ్యవసాయ చట్టాల గురించి, రైతుల ఆందోళన పట్ల అనుసరిస్తున్న తీరు గురించి కూడా నిజాలు చెప్పేందుకు అలాంటి ఆలోచన చేస్తారంటారా !
శిష్యా ఇప్పటికే పండుగాడి దెబ్బవంటి రైతుల ఆందోళనతో మన ప్రధాని, మంత్రులు మైండ్‌ బ్లాక్‌ అయి ఉన్నారు. ఇప్పుడు అలాంటి పని చేస్తే మన పరువు మరింత దిగజారుతుంది. నీకు పుణ్యముంటుంది నా దగ్గర అంటే అన్నావ్‌గానీ బయట నోరు జారకు, కాషాయం వేసుకున్నావని కూడా చూడరు. దేశ ద్రోహం కింద జైల్లో వేస్తారు జాగ్రత్త !