Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మాటలు కోటలు దాటతాయి గాని చేతలు గడప దాటవు అన్న సామెత తెలిసిందే. ప్రపంచంలో ఏ మిలిటరీని అయినా ఎదిరించగల సురక్షితమైన (నరేంద్రమోడీ) చేతుల్లో దేశం ఉందని బిజెపి నేతలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. నిజమే అని జనం కూడా నమ్మారు.నమ్మినవారెపుడూ చెడ్డవారు కాదు. కానీ తాజాగా అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ ఫిలిప్‌ డేవిడ్సన్‌ చెప్పినదాని ప్రకారం మంచుకొండల్లోని మన సైన్యానికి అవసరమైన చలిదుస్తులు కూడా అందించలేని స్దితిలో మన ప్రభుత్వం ఉందన్న అనుమానం కలుగుతోంది. చలి దుస్తులు, మంచులో ధరించాల్సిన పరికరాలు, కళ్లద్దాలు, బూట్లు, ఆహార కొరత ఉన్నట్లు కాగ్‌ కూడా తన నివేదికలో పేర్కొన్నది. దానిమీద రక్షణ మంత్రిత్వశాఖ వివరణ ఇస్తూ కాగ్‌ 2015-17 సంవత్సరాల వివరాల ప్రకారం అలా చెప్పిందని, ప్రధాన కార్యాలయాల్లో కొరత నిజమే గానీ రంగంలో ఉన్న సైనికులకు అందించామని పేర్కొన్నది. కానీ డేవిడ్స్‌న్‌ చెప్పింది గతేడాది ఉదంతం గురించి అన్నది గమనించాలి. అమెరికా నుంచి ఆయుధాలతో పాటు చివరకు దుస్తులను కూడా తెచ్చుకొనే దుస్దితిలో మన సర్కార్‌ ఉంది. నిజానికి అవి మనం తయారు చేసుకోలేనివి కాదు, సైనికులను చలికి వదలివేసే నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు.


అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు మార్చినెల తొమ్మిదిన హాజరై ముందుగానే తయారు చేసుకు వచ్చిన అంశాల ఆధారంగా మాట్లాడిన డేవిడ్స్‌న్‌ చెప్పిన వాటి సారాంశం ఇలా ఉంది.సరిహద్దు వివాదంలో భారత్‌కు అవసరమైన సమాచారం, చలి దుస్తులు, ఇతర సామగ్రిని అమెరికా అందించింది.ముందుకు వచ్చిన అనేక స్ధానాల నుంచి చైనా ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. సరిహద్దు ఘర్షణలకు చైనాయే కారణం.వివాదాస్పద సరిహద్దుల సమీపంలో నిర్మాణకార్యక్రమాలను చేపట్టిన చైనా దానికి మద్దతుగా దాదాపు 50వేల మంది సైన్యాన్ని దించింది. దానికి ప్రతిగా భారత్‌ కూడా సైన్యాన్ని మోహరించింది. ఇతరులతో సహకారం తమ స్వంత రక్షణ అవసరాలకే అని సరిహద్దు వివాదం భారతదేశ కళ్లు తెరిపించింది.ఇప్పటికీ భారత్‌ తమ అలీన వైఖరికి కట్టుబడి ఉన్నప్పటికీ అత్యంత సమీప కాలంలో చతుష్టయం(క్వాడ్‌ : అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌. ఈ కూటమిని చైనా తన వ్యతిరేక దుష్ట చతుష్టయంగా పరిగణిస్తోంది, పోటీగా తన అస్త్రాలను తీస్తోంది)లో మరింతగా భాగస్వామి అయ్యేందుకు అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా అమెరికా,జపాన్‌, ఆస్ట్రేలియాలకు ఇది కీలకమైన అవకాశం.భారత-అమెరికా సంబంధాలు, 21వ శతాబ్దిలో భాగస్వామ్యంలో ఎవరేమిటో నిర్వచించుకోవాల్సిన సమయం ఇదని భావిస్తున్నాను. సంబంధాలను మరింత సన్నిహితంగా మరియు గట్టిపరుచుకొనేందుకు ఒక చారిత్మ్రాక అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఇటీవలి కాలంలో రెండు దేశాలు పునాదుల వంటి మూడు ఒప్పందాలు చేసుకున్నాయి. మిలిటరీ సహకారాన్ని పెంచుకోవటం,అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తుల కొనుగోలును భారత్‌ పెంచుకోవటం, అమెరికాతో కలసి సంయుక్త విన్యాసాల నిర్వహణ.భారతదేశంతో రక్షణ సంబంధాలు వ్యూహాత్మకంగా తప్పనిసరి.” అన్నారు.


ప్రపంచాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని, తన కార్పొరేట్లకు యావత్‌ దేశాల మార్కెట్లను అప్పగించాలన్న అమెరికా వ్యూహత్మక ఎత్తుగడలో మన పాలకులు మన దేశాన్ని ఇరికించారన్నది డేవిడ్స్‌న్‌ చెప్పిన అంశాల సారం. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు అమెరికాను నమ్మి, దాని వెంట నడచి బాగుపడిన దేశం ఒక్కటైనా ఉందని ఎవరైనా చూపితే సంతోషం. సహకారం పేరుతో మన ఇరుగు పొరుగుదేశాలతో మనం లడాయి పెట్టుకొనేట్లు చేయటం, ఆ ముసుగులో తన ఆయుధాలను మనకు అంటగట్టటం, మన మిలిటరీలో చొరబడేందుకు సంయుక్త విన్యాసాల వంటివి నిర్వహించటం ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తాయో దేశభక్తులు(బిజెపి మార్కు కాదు) ఆలోచించటం అవసరం. ఈనెల 12న చతుష్టయ అంతర్జాల సమావేశం జరగనుండటం, ఆ తరువాత అమెరికా నూతన రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ త్వరలో మన దేశాన్ని సందర్శించనున్న తరుణంలో డేవిడ్సన్‌ ఈ విషయాలను వివరించారు.అంతకు కొద్ది రోజుల ముందు అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన ఒక మార్గదర్శక పత్రంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని, దాన్ని ఎదుర్కొనేందుకు భాగస్వాములతో కలసి పని చేయాలని పేర్కొన్నది. ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా తమ ముగ్గులోకి మనలను లాగే వైఖరిని అమెరికా కొనసాగిస్తూనే ఉందన్నది స్పష్టం. అందువలన పాత ప్రియుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు బ్రేకప్‌ చెప్పి(వదలివేసి) కొత్త ప్రియుడు జో బైడెన్‌ను కౌగలించుకొనే రోజు ఎంతో దూరంలో లేదని గ్రహించాలి.
అమెరికన్‌ కమాండర్‌ డేవిడ్స్‌న్‌ తమ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాలను చెప్పిన మరుసటి రోజే మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఏమి చెప్పింది ? చైనా అన్ని ప్రాంతాల నుంచి వెనక్కు పోలేదని డేవిడ్స్‌న్‌ చెప్పాడు. ఇది చైనా-మనకు తంపులు పెట్టే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.లడఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతం నుంచి పూర్తిగా సేనల ఉపసంహరణ పూర్తయిందని, మిగతా సమస్యలేవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు.


ట్రంపు కంపును మరింతగా పెంచాలనే జో బైడెన్‌ నిర్ణయించుకున్నారు. పాతికేండ్ల క్రితం చైనా ప్రభుత్వం పంచన్‌లామా నియామకం మత స్వేచ్చను దుర్వినియోగం చేయటమే అని బైడెన్‌ యంత్రాంగం తాజాగా ఒక ప్రకటన ద్వారా ట్రంప్‌ బూట్లలో దూరి నడవనున్నట్లు వెల్లడించింది. టిబెటన్‌ దలైలామా చైనా మీద విఫల తిరుగుబాటు చేసి 1959 మే 17న మన దేశానికి పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే. టిబెట్‌ బౌద్దమత చరిత్రను చూసినపుడు సంప్రదాయం ప్రకారం ఇద్దరూ వేర్వేరు ఆరామాలకు – తెగలకు అధిపతులు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వారు. ఒకరి అధికారాన్ని మరొకరు పరస్పరం గుర్తించుకుంటారు. అయితే దలైలామా తరువాత స్ధానం పంచన్‌లామాదిగా బౌద్దులు పరిగణిస్తారు. పదవ పంచన్‌ లామా 1989లో మరణించిన తరువాత ఎవరినీ నియమించలేదు. 1995లో దలైలామా ఒక ఐదేండ్ల బాలుడిని పదకొండవ పంచన్‌ లామాగా నియమించినట్లు ప్రకటించారు. దాన్ని టిబెట్‌ రాష్ట్ర ప్రభుత్వం, చైనా కేంద్ర ప్రభుత్వమూ గుర్తించలేదు. అతని స్దానంలో వేరొకరిని నియమించి, బాలుడిని, అతని కుటుంబాన్ని వేరే ప్రాంతంలో ఉంచారు. ప్రస్తుతం బాలుడు పెరిగి పెద్దవాడై డిగ్రీ చదువుకొని ఉద్యోగం చేస్తున్నట్లు చైనా పేర్కొన్నది తప్ప ఇతర వివరాలు తెలియవు. చైనా సర్కార్‌ నియమించిన పంచన్‌లామాను దలైలామా గుర్తించలేదు కనుక దలైలామాకు మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర దేశాలూ గుర్తించటం లేదు. మధ్యమధ్యలో ఆ వివాదాన్ని ముందుకు తెస్తూ రాజకీయాలు చేస్తుంటాయి. గతేడాది డిసెంబరులో ట్రంప్‌ (ఓడిపోయిన తరువాతే) చివరి రోజుల్లో టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఒక బిల్లును చట్టంగా మారుస్తూ సంతకం చేశారు.


ప్రస్తుత పద్నాలుగవ దలైలామా 62 సంవత్సరాలుగా మన దేశంలోనే ఉన్నారు. అయినా ఆయన స్దానంలో టిబెట్‌లో ఎవరినీ నియమించలేదు. కొత్త దలైలామాను నియమించబోతున్నారంటూ రెచ్చగొట్టే వార్తలను రాయిస్తూ ఉంటారు. అమెరికాతో కలసి గోక్కోవటం మొదలు పెట్టిన తరువాత గత (కాంగ్రెస్‌, చివరికి అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా ) పాలకులు కావాలని విస్మరించిన ఈ అంశాన్ని అమెరికాతో పాటు ఎందుకు గోకకూడదనేే ఆలోచన మన మోడీ సర్కార్‌కూ వచ్చిందని వార్తలు వచ్చాయి. బహిరంగ ప్రకటన చేయలేదు గానీ చైనాను రెచ్చగొట్టే చర్యలన్నీ చేస్తోంది. తాజాగా గాల్వన్‌ లోయ ఉదంతాల్లో టిబెటన్‌ తిరుగుబాటుదార్లతో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) పేరుతో ఏర్పాటు చేసిన అనధికార కిరాయి సాయుధ మూకను చైనీయుల మీదకు ఉసిగొల్పి పాపాంగాంగ్‌ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో గతేడాది ఆగస్టులో కొన్ని కొండలను ఆక్రమించుకొనేందుకు పంపటం, ఆ ఉదంతంలో కొందరు మరణించటం తెలిసిందే.

చతుష్టయ సమావేశం సాధించేది ఏమిటి ?


చతుష్టయ కూటమి ఏర్పాటు వెనుక అమెరికా ఎత్తుగడ ఏమిటో వారెన్నడూ దాచుకోవటం లేదు. తెలిసి వారి వలలో చిక్కుకొనే వారి గురించే ఆలోచించాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనాను ఈ కూటమిలోని అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ముప్పుగా పరిగణించలేదు. ఇప్పుడు ముప్పు సిద్దాంతం లేదా భయాన్ని ముందుకు తెస్తున్నాయి. నాలుగు దశాబ్దాల్లో ఈ నాలుగు దేశాలూ చైనా నుంచి ఎంతో లబ్దిపొందాయి-అదే సమయంలో దాని ఎదుగుదలకూ దోహదం చేశాయి. ఎవరి ప్రయోజనం కోసం వారు వ్యవహరించారు. ఈ క్రమంలో మొత్తంగా తేలిందేమంటే చైనా అర్ధికంగా అమెరికానే సవాలు చేసే స్ధాయికి ఎదిగింది ? నాలుగు దేశాలు అనుసరించిన దివాలా కోరు విధానాలు చైనాతో పోటీపడలేకపోయాయి. ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా చైనా ముప్పును ముందుకు తెస్తున్నాయి. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో తెగేదాకా లాగేందుకు భయపడుతున్నాయి. ఇదే సమయంలో ఎవరికి వారు స్వంత ప్రయోజనాలకు పెద్దపీట వేసి చైనాతో బేరసారాలాడుతున్నాయి. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. అందరమూ ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తూనే దెబ్బలాట-ముద్దులాట మాదిరి మరోవైపు ఎవరి సంగతి వారు చూసుకుంటున్నారు.


నిజానికి చైనా నుంచి ముప్పు వచ్చేట్లయితే చతుష్టయ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే చైనా ప్రధాన భాగస్వామిగా ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం( ఆర్‌సిఇపి )లో జపాన్‌,ఆస్ట్రేలియా ఎందుకు చేరినట్లు ? మన దేశంతో సరిహద్దులు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను పూర్తిగా పరిశీలించిన తరువాతే అనుమతి ఇవ్వాలని గత ఏడాది మన ప్రభుత్వం నిబంధనలను సవరించింది. అలాంటి పెట్టుబడులు పెట్టగలిగింది చైనా ఒక్కటే కనుక దాని పెట్టుబడులను అడ్డుకోవాలన్నది అసలు లక్ష్యం. తరువాత తత్వం బోధపడింది, చైనా పెట్టుబడులు రాకుండా గడవదు అని గమనించిన తరువాత ఆ నిబంధనలను సడలించి సమగ్రంగా పరిశీలించిన తరువాత కీలక రంగాలలో స్ధానికంగా చేయలేని వాటిని ఆమోదించవచ్చు అంటూ తలుపులు తెరిచారు. అంతకు ముందు మాత్రం పరిశీలించకుండా అనుమతించాలని ఎవరు కోరారు, ఎందుకు అనుమతించారు ? సమాధానం రాదు.


మన ఔషధ పరిశ్రమకు అవసరమైన ముడి సరకులు, కొంత మేరకు తయారైన దిగుమతులు చైనా నుంచి రాకుండా ప్రత్యామ్నాయం వెంటనే చూసుకొనే అవకాశం లేకనే ఆ పరిశ్రమ వత్తిడి మేరకు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరవటం వాస్తవం కాదా ? ఆసియా అభివృద్ది బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని అమలు చేసే పధకాల్లో చైనా కంపెనీలు కూడా టెండర్లను దక్కించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అసలు అప్పులు తీసుకోవటం మానుకోవచ్చుగా ? పైగా మోడీ ఏలుబడిలోకి వచ్చిన తరువాత అసలు బయటి నుంచి అప్పులే తీసుకోవటం లేదని తప్పుడు ప్రచారం ఒకటి. చైనా పెట్టుబడులు వస్తే దాని ముప్పు మనకు తొలిగినట్లుగానే భావించాలా ? అలాంటపుడు చతుష్టయంలో అమెరికాతో గొంతు కలిపి చైనా వ్యతిరేక ప్రగల్భాలు ఎందుకు ? చైనాతో సరిహద్దు వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకుంటామని ఇప్పుడు చెబుతున్నవారు సంఘర్షణ వరకు ఎందుకు తీసుకుపోయినట్లు ? అమెరికన్లకు చైనా మార్కెట్‌ను మరింతగా తెరిస్తే మిగిలిన మూడు దేశాలను దక్షిణ చైనా సముద్రంలో ముంచి అమెరికా తన దారి తాను చూసుకుంటుందనే జ్ఞానం ఆయా దేశాలకు ఉండవద్దా !

ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసి లబ్ది పొందింది అమెరికానా మిగిలిన సభ్యదేశాలా ? ఆ కూటమి తరువాత ఏ సభ్యదేశం మీద అయినా ఎవరైనా దాడి చేశారా ? ఆ పేరుతో ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నది అమెరికా, అందుకు మూల్యం చెల్లించింది ఐరోపా దేశాలు కాదా ? 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి లేదా తాజా కరోనా కల్లోలం నుంచి నాటో కూటమి దేశాలను అమెరికా ఏమైనా ఆదుకోగలిగిందా ? లేనపుడు మనలను ముందుకు నెట్టి ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ఎత్తుగడలో మనం ఎందుకు పావులుగా మారాలి ? మనల్నే రక్షిస్తున్నామని ఒక వైపు అమెరికా డేవిడ్సన్‌ చెబుతుంటే మన నాయకత్వంలో ఏర్పడే ఆసియా నాటో కూటమి అమెరికా ఆయుధాలను ఆయా దేశాలతో కొనిపించే దళారీగా మారటం తప్ప ఎవరి నుంచి ఎవరిని రక్షిస్తుంది ? యుద్దానికి ఎందుకీ ఉత్సాహం ?
నాలుగు సంవత్సరాల పాటు తన దేశాన్ని ఎలా బాగు చేసుకుందామా అనే ఆలోచనకు బదులు చైనాను ఎలా నాశనం చేద్దాం లేదా దారికి తెచ్చుకుందాం అనే యావలో గడిపిన డోనాల్డ్‌ ట్రంప్‌ చివరికి అమెరికాను ఏమి చేసిందీ చూశాము.కరోనా నివారణలోను, దాని పర్యవసానంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను నిలపటంలోనూ ఘోరంగా విఫలమయ్యాడు.కరోనా మహమ్మారికి అత్యధిక మంది పౌరులను బలిచ్చిన దుష్టుడిగా చరిత్రకెక్కాడు.


చైనా వస్తువులను బహిష్కరించండి, చైనా పెట్టుబడులను బహిష్కరించండి, అసలు చైనానే బహిష్కరించండి అన్నట్లుగా గతేడాది సరిహద్దు ఉదంతాల తరువాత ఎంత పెద్ద రచ్చ చేశారో, ఎవరు చేశారో చెప్పనవసరం లేదు. జనానికి చైనాను వ్యతిరేకించటమే అసలైన దేశభక్తి అని నూరిపోశారు.మీడియా తన రేటింగులకోసం మరింతగా రెచ్చిపోయింది. మరోవైపు జరిగిందేమిటి 2020లో అమెరికాను రెండవ స్ధానానికి నెట్టి చైనాతో ప్రధమ స్ధానంలో వాణిజ్యలావాదేవీలను జరిపారు మన అపర దేశభక్తులని ఎంత మందికి తెలుసు.కరోనా కారణంగా మొత్తం దిగుమతులు తగ్గాయి, దానిలో భాగంగానే 2019లో ఉన్న 85.5 బిలియన్‌ డాలర్లకు చేరలేదు గానీ 77.7 బిలియన్‌ డాలర్లతో చైనా మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా 2020లో ఉంది. మన ఎగుమతులు చైనాకు పెరిగాయి. ఇది తెలియని సామాన్యులు, అమాయకులు ఇంకా తెలిసినప్పటికీ మీడియా ఇంకా చైనా వ్యతిరేకతను వదిలించుకోలేదు.


గత నెలలో జరిగిన మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో అమెరికా – చైనాలలో ఏదో ఒక దాని వైపు తేల్చుకోవాలని జోబైడెన్‌ హెచ్చరించారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ దానిని పూర్వపక్షం చేస్తూ అన్ని రాజకీయ కార్యకలాపాలకు బహుముఖ విధానం అవకాశం కల్పించిందని అటువంటి సంస్దలను పటిష్టపరచాలని ఒక్కాణించారు.అంతకు ముందు అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా చైనా ఐరోపా యూనియన్‌ పెట్టుబడి ఒప్పందం చేసుకున్నాయి. అందువలన ఇప్పటికైనా చతుష్టయ కూటమి-దాని వెనుక ఉన్న అమెరికా స్వార్ధం, ఎత్తుగడలు, మన మీద తుపాకి పెట్టి చైనాను కాల్చ చూస్తున్న పన్నాగాన్ని మన పాలకులు గ్రహిస్తారా ?