Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


బంగారం దొంగరవాణా వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, ఒక సీనియర్‌ నేత కుమారుడికీ సంబంధం ఉందని చెప్పవలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు తనమీద వత్తిడి తెచ్చినట్లు ఆ కేసులో నిందితుడిగా ఉన్న సందీప్‌ నాయర్‌ ఎర్నాకుళం జిల్లా జడ్జికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మూడు పేజీల ఆ లేఖ శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది. తాము చెప్పినట్లుగా మారి అప్రూవర్‌గా మారితే బెయిలుతో సహా ఇతరంగా అన్ని రకాలుగా సాయం చేస్తామని అధికారులు ప్రలోభపెట్టినట్లు దానిలో సందీప్‌ పేర్కొన్నాడు. దర్యాప్తు అధికారి రాధాకృష్ణన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొన్నాడు. ఇదే విధంగా డాలర్ల కుంభకోణంలో కూడా స్వప్నా సురేష్‌ను బెదిరించి ముఖ్యమంత్రి, స్పీకర్‌,ఇతరుల మీద తప్పుడు ప్రకటనలు చేయించటమేగాక వాటిని కస్టమ్స్‌ శాఖ కోర్టులో అఫిడవిట్‌గా ఇచ్చి ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రచార అస్త్రంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

అభ్యర్ధులెవరో తేల్చని కాంగ్రెస్‌- ప్రచారంలో దూసుకుపోతున్నసిపిఎం

సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది.కాంగ్రెస్‌ జాబితాను ఆదివారం నాడు వెల్లడించనున్నట్లు వార్తలు వచ్చాయి. బిజెపి తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. ఏవో అద్భుతాలు జరిగి తిరిగి అధికారానికి వస్తామనుకుంటున్న కాంగ్రెస్‌లో ముఠాకుమ్ములాటలంటే అర్ధం చేసుకోవచ్చు, ఉన్న ఒక్క సీటు కూడా వస్తుందో తెలియని బిజెపిలో కూడా కుమ్ములాటల కారణంగా జాబితాలను ప్రకటించలేకపోయారు. రాష్ట్ర అసెంబ్లీలోని 140 స్ధానాలలో తమకు 35వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తమ మనుషులు కాంగ్రెస్‌లో ఉన్నారని బిజెపి చెబుతున్నదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారానికి 71 స్ధానాలు కావాల్సి ఉండగా తమకు 35 వస్తే చాలని బిజెపి చెబుతున్నదంటే కాంగ్రెస్‌లో తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లుగా అనుకుంటున్నదని ఎద్దేవా చేశారు. అందువలన కాంగ్రెస్‌లోని బిజెపి వారికి ఓటు వేసి మోసం పోవటం ఎందుకని ఆ పార్టీ మద్దతుదారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారని విజయన్‌ చెప్పారు. ఈనెల 15న విజయన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
ఎనభై ఐదు స్ధానాలకు పోటీ చేస్తున్న సిపిఎం 23 మంది వెనుకబడిన తరగతుల వారికి సీట్లిచ్చిందని, వారిలో 20 మంది ఎజవా సామాజిక తరగతికి చెందిన వారే ఉన్నారని కేరళ కౌముది పత్రిక రాసింది. గత ఎన్నికలలో 92చోట్ల పోటీ చేసిన పార్టీ ఈ సారి తక్కువ చోట్ల బరిలో ఉన్నప్పటికీ వెనుకబడిన తరుగతులకు గతంలో మాదిరే సీట్లు ఇచ్చిందని పేర్కొన్నది.

ఎన్నికల్లో పోటీకి రాజకుటుంబీకుల తిరస్కరణ-బిజెపికి ఆశాభంగం !

శబరిమల అయ్యప్ప స్వామి బిజెపికి ఆశాభంగం మిగిల్చారు. ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ఎన్నికల్లో నిలిపి దాన్ని ఎన్నికల అంశంగా చేసి లబ్దిపొందాలని చూసిన బిజెపికి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. రాజకుటుంబీకులు తమ పార్టీ తరఫున పోటీ చేయాలని లేదా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనలను రాజకుటుంబం తిరస్కరించినట్లు కేరళ పత్రికలు రాశాయి. అయ్యప్ప విషయంలో రాజకీయాలకు తావులేదని, తాము పోటీ చేయాలనుకోవటం లేదని రాజప్రతినిధులు చెప్పారని పేర్కొన్నాయి. శబరిమల వివాద సమయంలో జరిగిన కొన్ని ఉదంతాలు జరిగి ఉండాల్సింది కాదని, తాను విచారపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన ప్రకటన మీద ప్రతిపక్షాలు రాద్దాంతం చేయాల్సిందేమీ లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లే, ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఏ విజయరాఘవన్‌ చెప్పారు. మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ బిజెపి, కాంగ్రెస్‌, నాయర్‌ సర్వీసు సొసైటీ పండలం రాచకుటుంబం ధ్వజమెత్తాయి. మంత్రి దాదాపు క్షమాపణ చెప్పారంటూ మీడియా వర్ణించింది. శబరిమల వివాదం సుప్రీం కోర్టులో ఉన్నదని దాని నిర్ణయం వెలువడిన తరువాత అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, విమర్శించదలచుకున్న వారికి స్వేచ్చ ఉన్నదని రామచంద్రన్‌ పిళ్లే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ అభ్యర్దుల ప్రకటనలో మల్లగుల్లాలు పడుతుండగా దాని భాగస్వామ్య పక్షమైన ముస్లింలీగ్‌ తాను పోటీ చేయనున్న 27కుగాను 25 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. పాతికేండ్ల తరువాత మొదటిసారిగా ఒక మహిళా అభ్యర్ధిని పోటీకి నిలిపింది. ఆర్ధిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఎంఎల్‌ఏలను పక్కన పెట్టి ఒక చోట ఒకరి కుమారుడికి సీటు ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 24 చోట్ల పోటీ చేసింది.

నీమమ్‌లో కాంగ్రెస్‌-బిజెపిలకు విషమ పరీక్ష !

రాజధాని తిరువనంతపురంలోని నీమమ్‌ స్ధానాన్ని మరోసారి గెలుచుకోవాలని బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. 2019లోక్‌ సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ పరిధిలో బిజెపికి 12వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. గతేడాది చివరిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో అది రెండువేలకు పడిపోయింది. అయితే అక్కడ బలమైన అభ్యర్దిని నిలిపి బిజెపితో తమకు లోపాయికారీ ఒప్పందం లేదని, ఆ పార్టీని నిఖరంగా ఎదిరిస్తున్నది తామే అని రాష్ట్ర ఓటర్ల ముందు కనిపించేందుకు కాంగ్రెస్‌ నానా తంటాలు పడుతున్నది. అభ్యర్దుల ఎంపిక కసరత్తు ఢిల్లీలోని కేరళ హౌస్‌కు మార్చారు. రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ లేదా ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల లేదా మరొక ముఖ్యనేత పోటీ చేస్తారనే లీకులను మీడియాకు వదిలారు. తిరువనంతపురం ఎంపీ శశిధరూర్‌ పోటీ చేయాలని రాహుల్‌ గాంధీ కోరినట్లుగా మరొక లీకు వార్త షికార్లు చేసింది. ధరూర్‌ గెలిస్తే అది జాతీయ స్ధాయిలో ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బిజెపితో కుదిరిన లోపాయికారీ ఒప్పందంలో భాగంగా తమ మిత్రపక్షమైన బలహీన జెడియుకు ఆ స్ధానాన్ని కేటాయించి తన ఓట్లన్నింటినీ బిజెపి అభ్యర్ధి ఓ రాజగోపాల్‌కు బదలాయించి గెలిపించింది. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన కె.కరుణాకరన్‌ ఆ స్దానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి రాజగోపాల్‌ పోటీ నుంచి తప్పుకోవటం, బిజెపితో తమకు ఎలాంటి ఒప్పందం లేదని నిరూపించుకొనేందుకు అక్కడ తమ అభ్యర్దిని నిలిపాలని నిర్ణయించింది.” నీమమ్‌ స్ధానం తమ గుజరాత్‌ అని బిజెపి అనుకుంటున్నది. తొందరెందుకు అది గుజరాత్‌ అవునో కాదో తేలుతుంది, అక్కడ బలమైన అభ్యర్ధిని నిలపాలని ఆలోచిస్తున్నామని” రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ చెప్పారు. నీమమ్‌లో పోటీ చేసేందుకు తనకు అభ్యంతరం లేదని పోటీలోకి దిగితే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుంది, రాష్ట్రంలో ఇతర చోట్ల ప్రచారం అవకాశం ఉండదు మీ ఇష్టం అన్నట్లుగా తన అసమ్మతిని తెలిపినట్లు తెలిసింది. తనను దెబ్బతీసినప్పటికీ తన షరతులను అంగీకరిస్తే పోటీ చేసేందుకు సిద్దమే అని ఊమెన్‌ చాందీ చెప్పారని, తనను గాకుండా వేరే వారిని చూడాలని శశిధరూర్‌ తప్పించుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి. రమేష్‌ చెన్నితల ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారని తనకు మరొక అవకాశం ఇవ్వాలని, ఒక వేళ అది జరగకపోతే హౌంమంత్రి పదవిని తాను సూచించిన వారికి ఇవ్వటంతో పాటు కొన్ని స్ధానాల అభ్యర్దుల ఎంపిక తనకే వదలాలని చాందీ షరతులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తాను కోరిన విధంగా తన అనుచరులకు సీట్లు కేటాయించకపోతే నీమమ్‌తో సహా తాను ఎక్కడా పోటీ చేయనని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అధిష్టానికి హెచ్చరిక చేశారంటే ముఠాల పెత్తనం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ముఠాల నేతలు తమకు అనుకూలమైన, ప్రత్యర్ధులను ఇరుకున పెట్టే కధనాలను మీడియాకు లీకులుగా వదిలారు. దీంతో నీమమ్‌ స్దాన అభ్యర్దిని మీడియా పదే పదే మార్చింది.

అమిత్‌ షా పోటీ చేసినా నీమమ్‌లో ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయం : సిపిఎం

ప్రతిష్టాత్మక స్ధానాల్లో ఒకటిగా మారిన నీమమ్‌ నియోజకవర్గంలో అమిత్‌ షా పోటీ చేసినా అక్కడ ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్ది శివన్‌ కుట్టి విజయం ఖాయమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. మాజీ ఎంఎల్‌ఏ శివన్‌కుట్టి అభ్యర్ధిగా ఉన్నందున తాను అక్కడ పోటీ చేయనని ఊమెన్‌ చాందీ, రమేష్‌ చెన్నితల కూడా కేంద్ర పార్టీనేతలకు చెప్పారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ మద్దతుతో బిజెపి గెలిచిందని ఈసారి ఓడిపోవటం, బిజెపి లేని అసెంబ్లీ ఖాయమని చెప్పారు.
కేరళలో ఈ సారి బిజెపి అధికారంలోకి రానున్నదని ముఖ్యమంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిన మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పారు. తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ది గురించి మాట్లాడతాను తప్ప వివాదాల జోలికి పోనన్నారు. గతంలో గెలిచిన నీమమ్‌ కాకుండా తొమ్మిది స్ధానాలను బిజెపి ఏ క్లాస్‌గా గుర్తించింది. వాటిలో ఎవరిని పోటీలోకి దించాలన్నది అధిష్టాన నిర్ణయానికి వదలివేసినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో అసమ్మతినేతగా పేరుమోసిన శోభా సురేంద్రన్‌ పేరును అసలు సిఫార్సు చేసిన జాబితాలోనే లేదని చెబుతున్నారు.
మిగతా పార్టీలు. ఇతర అంశాల విషయానికి వస్తే కొత్తగా ఎల్‌డిఎఫ్‌ వైపు వచ్చిన కేరళ కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటులో భాగంగా సిపిఎం ఆరు స్ధానాలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ సారి పార్టీ నిబంధనలకు అనుగుణ్యంగా సీనియర్‌ ఎంఎల్‌ఏలకు బదులు 38 చోట్ల కొత్త వారిని ఎంపిక చేశారు. దీంతో కొన్ని చోట్ల సిపిఎం కార్యకర్తలు అసమ్మతిని వెల్లడించినట్లు, ప్రదర్శనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సమస్యల గురించి కార్యకర్తలు, అభిమానులకు వివరించి సర్దుబాటు చేస్తామని సిపిఎం స్ధానిక నేతలు ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో సిపిఎం పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్న ఒక మహిళ ఎల్‌డిఎఫ్‌లోని కేరళ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటన వెలువడగానే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు స్ధానిక కమిటీ ప్రకటించింది. గతంలో ఆమె స్వతంత్ర అభ్యర్ధిగా సిపిఎం మద్దతుతో పోటీ చేశారు. మరొక పంచాయతీ అధ్యక్షుడు తనను అభ్యర్దిగా పరిగణనలోకి తీసుకోనందుకు నిరసనగా బిజెపి మిత్రపక్ష అభ్యర్దిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. కొన్ని చోట్ల సిపిఎంను కాపాడండి అనేపేరుతో ప్రత్యర్ధులు పోస్టర్లు వేసి పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. గతంలో కూడా కొన్ని చోట్ల అసంతృప్తి తలెత్తినప్పటికీ అది ఎల్‌డిఎఫ్‌ విజయానికి హాని కలిగించలేదు. తలెత్తిన అసమ్మతిని తొలగింప చేసి మిత్రపక్షాల అభ్యర్ధులకు ఎలాంటి హాని కలగకుండా చూసేందుకు పార్టీ పూనుకుంది.