Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


లూయిస్‌ ఇనాసియో లూలా డ సిల్వా ! ప్రపంచానికి సుపరిచితమైన పేరు లూలా !! వామపక్ష బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు !!! న్యాయవ్యవస్ద,మీడియా, కార్పొరేట్‌శక్తులు కుమ్మక్కై ”ఆపరేషన్‌ కార్‌వాష్‌ ” పేరుతో చేసిన కుట్రలో జైలు పాలయ్యాడు. వేళ్లేటపుడు లక్షలాది ప్రజల మధ్య జైలుకు వెళ్లాడు. ఆయనకు శిక్ష విధించిన కోర్టుకు మోపిన ఆరోపణలను విచారించే అధికారమే లేదని, రాజధానిలోని మరో కోర్టుకు కేసులను బదలాయిస్తున్నామని, అక్కడ కేసులు తేలేంతవరకు లూలా దోషి కాదని తాజాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో విధించిన 26 సంవత్సరాల శిక్ష రద్దు, కోల్పోయిన రాజకీయ హక్కులు తిరిగి వచ్చాయి. ఈ తీర్పు పచ్చిమితవాది, నియంతగా ఉన్న అధ్యక్షుడు జైర్‌ బోల్సనారోను కుదిపివేసిందనే చెప్పాలి. తిరిగి ప్రభుత్వం కేసును తిరగదోడుతుందా, అది తేలేవరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేవి శేష ప్రశ్నలు. వచ్చే ఏడాది మధ్యనాటికి శిక్ష పడితే తప్ప ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో తిరిగి లూలా పోటీ చేయవచ్చు. తప్పుడు కేసులు మోపి జైలు పాలు చేసినపుడు ఒక వీరుడి మాదిరి వీడ్కోలు ఇచ్చిన జనం ఇప్పుడు కేసుల నుంచి బయటపడటంతో తమ ప్రియతమ నేత తిరిగి వచ్చాడంటూ నీరాజనం పట్టారు. లూలా తిరిగి వచ్చాడు అంటూ బ్రెజిల్‌ పాలకవర్గాలకు దడపుట్టించారు.


అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా తప్పుడు కేసులు పెట్టారు. ఇరవైఆరు సంవత్సరాల జైలు శిక్ష, రాజకీయ హక్కులను తొలగిస్తూ 2018లో కోర్టు తీర్పు చెప్పింది. దాని మీద పునర్విచారణ కోరగా అప్పీళ్లు తేలకుండా జైలులో ఉంచటం చట్టవిరుద్దం అని కోర్టు తీర్పు ఇవ్వటంతో 580 రోజుల తరువాత 2019 నవంబరులో లూలా విడుదల అయ్యాడు.శిక్ష విధించిన న్యాయమూర్తి మోరో పక్షపాత రహితంగా వ్యవహరించారో లేదో చెప్పాలని లూలా న్యాయవాదులు కోర్టును కోరారు. దాంతో ఐదుగురు న్యాయమూర్తులలో ఇద్దరు అవునని ఇద్దరు కాదని పేర్కొన్నారు. తాను కొత్తగా నియమితుడైనందున, కేసు గురించి తగినంత అవగాహన లేనందున తన అభిప్రాయాన్ని చెప్పజాలనని ఐదవ న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తులలో ఒకరైన ఎడ్సన్‌ ఫాచిన్‌ మార్చి ఎనిమిదవ తేదీన తీర్పు చెబుతూ లూలాకు వ్యతిరేకంగా నమోదు చేసిన నేరాలు వాటిని విచారించిన కోర్టు పరిధిలోనివి జరిగినవి కానందున విచారించే హక్కే లేదని కేసులను రాజధాని కోర్టుకు బదిలీచేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణలో ఉన్నట్లుగా పరిగణించి అర్హతలేని కోర్టు విధించిన శిక్షలు, రాజకీయ హక్కుల ఉపసంహరణ చెల్లదని తీర్పునిచ్చారు. లూలా నిర్దోషి అనిగానీ లేదా దోషి అని న్యాయమూర్తి నిర్దారించలేదు.అయినప్పటికీ రాజధాని కోర్టులో కేసు తేలేంతవరకు లూలా నిర్దోషిగానే ఉంటారు. అక్కడి నియమ నిబంధనల ప్రకారం 2022వ సంవత్సరం జూన్‌కు ముందుగా కేసుల్లో శిక్షపడితేనే పోటీ చేసేందుకు వీలు కాదని, అయితే అలా జరిగే అవకాశం లేదని తిరిగి కేసులు నమోదు చేసి విచారించేందుకు సంవత్సరాలు పడుతుంది కనుక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ తీర్పుతో 75 సంవత్సరాల లూలా తిరిగి రాజకీయ రంగంలోకి వస్తారని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే లూలా పోటీ చేస్తారా లేక పార్టీ తరఫున మరొకరిని నిలుపుతారా అన్నది వచ్చే రోజుల్లో మాత్రమే స్పష్టం అవుతుంది.


పులిట్జర్‌ బహుమతి పొందిన జర్నలిస్టు గ్లీన్‌ గ్రీన్‌వాల్డ్‌ నిర్వహిస్తున్న ఇంటర్‌సెప్ట్‌ బ్రెజిల్‌ అనే ఆన్‌లైన్‌ పత్రికలో న్యాయమూర్తి మోరో ఆపరేషన్‌ కార్‌వాష్‌ కుట్రదారులతో జరిపిన సంప్రదింపులు, సూచనలు, సలహాలు తదితర అంశాలన్నీ ప్రచురితమయ్యాయి.దాంతో మోరో 2020ఏప్రిల్లో రాజీనామా చేసి వెంటనే న్యాయశాఖ మంత్రి అవతారమెత్తాడు.తీర్పునకు ప్రతిఫలంగా ఈ బహుమతి పొందారు. నిజానికి పత్రికలో ఈ విషయాలు వెల్లడిగాక ముందే చార్జిషీటులోని పరస్పర విరుద్ద అంశాలు వెల్లడయ్యాయి. లూలాను విడుదల చేయాలనే ఉద్యమం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ పత్రికలో అనేక పత్రాలు వెల్లడి కావటంతో లూలా మీద కేసులు నిలిచేవి కాదని, విడుదల తధ్యమని అభిమానులు, ఇతరులు కూడా భావించారు.


సైన్సును నమ్మని బోల్సనారో మూర్ఖంగా వ్యవహరించి జనాన్ని కరోనా పాలు చేశాడు. దేశాన్ని అభివృద్ధిబాటలో నడుపుతాననే ఆకర్షణీయ వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన ఆ పెద్దమనిషి ఏలుబడిలో కరోనా సమయంలో 4.1శాతం తిరోగమనంలో ఉంది.1996 తరువాత ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ లేదు. అమెజాన్‌ అడవులను నాశనం చేసే విధంగా పర్యావరణ విధానాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అడవులు అంతరిస్తున్నాయి. చివరికి జోబైడెన్‌, ఐరోపా ధనిక దేశాలు కూడా బ్రెజిల్‌ ఉత్పత్తులను బహిష్కరిస్తామని, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాల్సి వచ్చింది.2019లో అధికారానికి వచ్చిన పచ్చి మితవాది బోల్సనారో ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. కరోనాను అరికట్టటంలో వైఫల్యం ఎంత దారుణంగా ఉందో ఏడాది కాలంలో నలుగురు ఆరోగ్యశాఖ మంత్రులను మార్చటమే పెద్ద నిదర్శనం. అమెరికా తరువాత కోటీ పదిహేనులక్షల కేసులు 2.8లక్షల మంది మరణాలతో రెండవ స్ధానంలో బ్రెజిల్‌ ఉంది ఉంది. ఆర్ధికంగా దిగజారటమే కాకుండా ఉద్యమాలను అణచివేయటంలో బోల్సనారో పేరుమోశాడు. గతేడాది అక్టోబరులో 41.2శాతం మంది మద్దతు ఇవ్వగా ఫిబ్రవరి 22న వెల్లడైన సిఎన్‌టి సర్వే ప్రకారం అది 32.9శాతానికి పడిపోయింది. మరింతగా దిగజారుతున్న ధోరణే తప్ప మరొకటి కాదు.


లాటిన్‌ అమెరికాలో రెండు దశాబ్దాల వామపక్ష పురోగమనంలో ఎదురు దెబ్బలు తగిలిన వాటిలో బ్రెజిల్‌ కూడా ఒకటి. వామపక్ష ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బ్రెజిల్‌ ప్రజాస్వామ్య ఉద్యమం(ఎండిబి) పార్టీ 2016లో ఆ ప్రభుత్వానికి ద్రోహం చేసింది. పాలకవర్గంతో చేతులు కలిపి అధ్యక్షురాలిగా ఉన్న దిల్మా రౌసెఫ్‌ మీద తప్పుడు ఆరోపణలు మోపి అభిశంసన ద్వారా ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఆ సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎండిబి నేత మిచెల్‌ టెమర్‌ అధ్యక్ష పీఠమెక్కి 2019 జనవరి ఒకటవ తేదీ వరకు పదవిలో కొనసాగాడు. అంతకు ముందు సంవత్సరం జరిగిన ఎన్నికలలో పోటీ చేయలేదు.2017లో జరిగిన ఒక సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం ఏడు శాతం మంది మాత్రమే టెమర్‌కు మద్దతు ఇవ్వగా 76శాతం మంది రాజీనామా చేయాలన్నారు. 2018 ఎన్నికలలో అతగాడు పోటీ చేయలేదు. వర్కర్స్‌ పార్టీ ప్రతినిధిగా రంగంలోకి దిగిన లూలాను తప్పుడు కేసులతో శిక్షించటంతో పోటీకి అనర్హుడయ్యారు. చివరి నిమిషంలో సావో పాలో మాజీ మేయర్‌ అయిన ఫెర్నాండో హదాద్‌ను పోటీకి నిలిపారు, ఓటర్లకు పెద్దగా పరిచయం లేకపోవటం, అంతకు ముందు దిగజారిన పరిస్ధితులను చక్కదిద్ది మంచి రోజులను తెస్తానన్న బోల్సనారో ప్రజాకర్షక వాగ్దానాల వరదలో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయింది. బోల్సరారో గద్దెనెక్కాడు.


వామపక్షాలు ఎన్నికల్లో ఓడిపోయి లేదా కుట్రతో మితవాద శక్తులు అధికారానికి వచ్చిన చోట అవి ఎన్నికల్లో పరాజయం పాలుకావటం తిరిగి వామపక్ష శక్తులు గద్దెనెక్కటం చూస్తున్నాము. అర్జెంటీనా, బొలీవియాలో అదే జరిగింది. ఈక్వెడోర్‌లో తొలి దఫా జరిగిన ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ది మొదటి స్దానంలో ఉన్నాడు. ఏప్రిల్‌ 11న జరిగే మలిదఫా ఎన్నికల్లో ఎలాంటి కుట్రలూ చోటు చేసుకోకపోతే విజయం సాధిస్తారనే వాతావరణం ఉంది.వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు తిరిగి పోటీ చేస్తాడని, అతగాడికి తగిన ప్రత్యర్ధి లూలా అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.బోల్సనారోను సమర్ధించేందుకు అవకాశం లేని వారు లూలాను కూడా అతగాడితో జమకట్టి ఆ ప్రమాదం పోతే ఈ ప్రమాదం వస్తుందనే పేరుతో ఇప్పటికే కధనాలను అల్లుతున్నారు. ఒక న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పు మీద పునర్విచారణ జరపాలని అటార్నీ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది. గత పాలకులు చార్జిషీట్లను సరిగా రూపొందించని కారణంగా బోల్సనారో సర్కార్‌ తిరిగి లూలాపై కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. నిజంగా జరిగితే అదేమీ ఆశ్చర్యం కలిగించదు. అలాంటి పరిస్ధితి లాలూను తిరిగి జైలుకు పంపితే మరొకరు అభ్యర్ధి అవుతారు.


తప్పుడు కేసులో తనను శిక్షించిన జడ్జి సెర్జియో మోరో ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడని తరువాత బోల్సనారో సర్కార్‌లో మంత్రి అయ్యాడని లూలా చెప్పారు.ఐదు వందల సంవత్సరాల చరిత్రలో న్యాయవ్యవస్దకు బలైన అతి పెద్ద బాధితుడనని చెప్పారు. మార్చి పదవ తేదీన వేలాది మంది తన మద్దతుదార్లతో ఎక్కడైతే ఒక లోహకార్మికుడిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించాడో అదే లోహకార్మిక సంఘకార్యాలయం వద్ద జరిగిన సభలో లూలా ప్రసంగించారు. కరోనా మహమ్మారితోపాటు దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని అన్నారు. గతంలో లూలాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామి అయిన అతిపెద్ద మీడియా సంస్ద గ్లోబో గ్రూప్‌తో పాటు కొందరు రాజకీయనేతలు కూడా తమ వైఖరిని మార్చుకోవటం అనేక మంది ఆశ్చర్యం కలిగిస్తున్నది. దానికి కారణం వామపక్షాల స్దానంలో అధికారానికి వచ్చిన మితవాద పక్షాలు ఎన్నికల్లో పరాజయం పాలై తిరిగి వామపక్షాలు అధికారానికి వస్తున్న ధోరణి ఒకటని చెప్పవచ్చు. గ్లోబో గ్రూపు మీడియా సంస్దలు లూలాకు శిక్ష వేసిన మోరోను హీరోగా చిత్రిస్తూ గతంలో ఆకాశానికి ఎత్తాయి. అలాంటిది ఇటీవల దేశ ప్రజాస్వామిక వ్యవస్దలో లూలా నిర్మాణాత్మక పాత్ర పోషించారంటూ సానుకూలంగా స్పందించాయి. దీని అర్ధం ఈ సంస్ధలతో సహా మొత్తంగా మీడియా మారు మనసు పుచ్చుకొని మారిపోయింది అని కాదు, విశ్వసనీయత మరింతగా దిగజారకుండా చూసుకొనే యత్నంలో భాగమే అని గుర్తించాలి. చివరకు పార్లమెంట్‌ స్పీకర్‌ ఆర్ధర్‌ లీరా కూడా న్యాయమూర్తి ఫాచీ ఇచ్చిన తీర్పును రాజకీయ వ్యవస్ద ఆమోదించాలని పేర్కొన్నారు. అంతే కాదు కార్‌వాష్‌ పేరుతో మోపిన కేసుకు దోహదం చేసిన వారిని శిక్షించకుండా వదల కూడదని కూడా చెప్పటం విశేషం. ఈ కేసును కుట్రపూరితంగా నమోదు చేశారనేందుకు అనేక ప్రభుత్వ అంతర్గత పత్రాలు బహిర్గతం కావటంతో లూలాపై మోపిన నేరారోపణలను ఎవరూ బహిరంగంగా సమర్దించలేని స్ధితి ఏర్పడింది.


లూలాపై కేసులు కొట్టివేసిన తీర్పు వెలువడిన తరువాత స్టాక్‌మార్కెట్‌ పతనమైంది. డాలరుతో స్ధానిక కరెన్సీ రియల్‌ మారకపు విలువ పడిపోయింది. లూలా తిరిగి దేశ రాజకీయాల్లో ముందుకు రావటం కార్పొరేట్లకు ఇష్టం లేదనేందుకు ఇదొక సూచిక. గతంలో ఎనిమిదేండ్లు అధికారంలో ఉన్న వర్కర్స్‌ పార్టీ అధినేత లూలా, తరువాత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అధికారంలో ఉన్న అదే పార్టీకి చెందిన దిల్మా రౌసెఫ్‌ హయాంలో సంక్షేమ పధకాలు అమలు జరిగాయి. తరువాత 2016లో అభిశంసన పేరుతో జరిపిన పార్లమెంటరీ కుట్రతో అధికారానికి వచ్చిన మిచెల్‌ టెమర్‌, నయా ఫాసిస్టు బోల్సనారో కార్మిక హక్కుల మీద దాడి చేశారు. ఆరోగ్యం, విద్య వంటి అనేక సంక్షేమ పధకాలకు కోతపెట్టారు. అనేక అక్రమాలకు తెరలేపారు, చట్టవిరుద్దమైన చర్యలను అనుమతించారు.అన్నింటికీ మించి కరోనా వైరస్‌ను అదుపుచేసే విషయంలో వ్యవహరించిన తీరును నేరపూరితమైనదిగా జనం భావిస్తున్నారు.అమెరికాలో ట్రంపు మాదిరే బోల్సనారో కూడా జనాన్ని పట్టించుకోలేదు.


లూలా సామాజిక, ప్రజా ఉద్యమాల నుంచి, ప్రజాస్వామిక సూత్రాల ప్రాతిపదికగా ఆవిర్భవించిన నిజమైన నేత. అదే బోల్సనారో దానికి భిన్నమైన వ్యక్తి.పచ్చిమితవాది, ప్రభుత్వ పదవుల్లో గతంలో నియంతలను బలపరిచిన మాజీ సైన్యాధికారులను అనేక మందికి స్ధానం కల్పించాడు.దేశ ప్రజాస్వామిక వ్యవస్ధలను దిగజార్చిన ఆచరణ ఉన్న వ్యక్తి.అమెరికా సామ్రాజ్యవాదుల నమ్మిన బంటుగా ఉన్నాడు.లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్న తరుణంలో లూలా రాజకీయ హక్కుల పునరుద్దరణ బ్రెజిల్‌ వామపక్ష శక్తులకు పెద్ద ఊరట,మరోసారి అక్కడ జయకేతనం ఎగరవేయవచ్చనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది.