Tags
#Kerala Election scene, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala LDF, Kerala UDF, RSS discipline hypocrisy exposed
ఎం కోటేశ్వరరావు
కేరళలో అధికారం కోసం పోటీ పడే ఎల్‌డిఎఫ్-యుడిఎఫ్ అభ్యర్ధుల గురించి కసరత్తు చేశాయంటే అర్ధం ఉంది. బిజెపి, దాని మిత్రపక్షాలు కూడా అదే ఫోజు పెట్టటం పెద్ద ప్రహసనం. తీరా జరిగిందేమిటి ? ఒక 31 సంవత్సరాల యువకుడు టీవీ చూస్తుండగా బిజెపి అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. దానిలో తన పేరు రాగానే ఒక్కసారి తనను తానే నమ్మలేకపోయాడు. స్ధానిక బిజెపి నేతలు, చుట్టుపక్కల వారు అతనికోసం వాకబు చేశారు. నేనేమిటి బిజెపి తరఫున పోటీ చేయటం ఏమిటి ? కనీసం ఆ పార్టీ సానుభూతి పరుడిని కూడా కాదు, నన్ను కనీసం సంప్రదించకుండా నా పేరు ప్రకటించటం ఏమిటని అతను ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని మీడియాతో కూడా చెప్పాడు. అతని పేరు మణికందన్, ఎంబిఏ డిగ్రీ కలిగి ఉద్యోగం చేస్తున్న ఒక గిరిజన యువకుడు.అతని పేరును వైనాడ్ జిల్లా మనంతనవాడి నియోజకవర్గ అభ్యర్ధిగా ప్రకటించారు. బిజెపి కసరత్తు బండారం ఏమిటో ఈ ఉదంతం బయట పెట్టింది. ఎవ్వరేమనుకుంటే మాకేటి సిగ్గు అంటే ఇదే కదా !
ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్-బిజెపి మచ్చ: పినరయి విజయన్
ఇక ఆర్‌ఎస్‌ఎస్ నేతలు లేదా కార్యకర్తల క్రమశిక్షణ బండారం ఏమిటో కూడా ఈ ఎన్నికలు బయట పెట్టాయి.ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత, ఆర్గనైజర్ పత్రిక మాజీ సంపాదకుడు, బిజెపి జాతీయ శిక్షణా విభాగపు సహకన్వీనర్, ఆర్ బాలశంకర్‌కు అలపూజ జిల్లా చంగన్నూరు నియోజక సీటు ఇస్తామని బిజెపి చెప్పిందట.ఢిల్లీలో ఎక్కువ కాలం గడిపే బాలశంకర్ జనవరిలో రాష్ట్రానికి వచ్చి నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారభించారు. నరేంద్రమోడీ, అమిత్ షా చెప్పిన మేరకే తాను వచ్చానని మద్దతుదారులను కలిసినపుడు చెప్పారు. తీరా ఆ జిల్లా అధ్యక్షుడిని అక్కడ నిలిపారు. దానితో అగ్గిమీద గుగ్గిలంలా లేచిన బాలశంకర్ వీర శంకర్‌గా మారి ఇలాంటి నాయకత్వం ఉంటే కేరళలో మరో 30సంవత్సరాలున్నా పార్టీ అధికారంలోకి రాదు అని చిందులేశాడు. హిందూ, క్రైస్తవ మత సంస్ధల మద్దతు ఉంది, గెలిచే అవకాశాలున్నప్పటికీ పార్టీ నాయకత్వం సిపిఎంతో లాలూచీ పడి తనకు సీటు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్-సిపిఎం కుమ్మక్కయినట్లు బిజెపి చెబుతుంటే దాన్నే కాస్త మార్చి వెరైటీగా చెప్పారు. తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేయటంలో అందెవేసిన చేతులు చివరికి తమ పార్టీకే దాన్ని వర్తింప చేశాయి. రెండు చోట్ల పోటీ చేస్తున్న బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్ను ఒక చోట గెలిపించే విధంగా ,దాని బదులు చంగన్నూరులో సిపిఎంను గెలిపించే విధంగా కుమ్మక్కు అయ్యారని అరోపించారు. సీటు రాని కారణంగా ఆశాభంగం చెందిన బాలశంకర్ ఇతర నేతల వంటి వ్యక్తి కాదని అతన్ని రెచ్చగొట్టవద్దని కేంద్ర మంత్రి వి మురళీధరన్ వ్యాఖ్యానించారు. బాలశంకర్‌కు గెలిచేంత సీను ఉంటే అధిష్టానం సీటు ఇచ్చే ఉండేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. బాలశంకర్ ఆర్‌ఎస్‌ఎస్‌లో పెరిగిన వ్యక్తిగనుక తక్కువగా చూడవద్దని, అతనికి సీటు రాలేదు గనుక బిజెపి-సిపిఎం కుమ్మక్కు అయినట్లు ఇప్పుడు అసలు విషయం చెబుతున్నారని నీమమ్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి కె. మురళీ ధరన్ అన్నారు.
కాంగ్రెస్-బిజెపిలు ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ నేత బాలశంకర్ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజాస్వామ్యం ఒక అమ్మకపు సరకుగా మారింది. కాంగ్రెస్‌ను ఒక సాధనంగా చేసుకొని బిజెపి గోవా, పుదుచ్చేరి, త్రిపురవంటి చోట్ల ఎంఎల్‌ఏలను కొనుగోలు చేస్తున్నది. కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు బిజెపిలో చేరే దశకు ఆ పార్టీ చేరుకుంది. నీమమ్‌లో బిజెపికి వచ్చిన ఓట్లు ఏమయ్యాయి ? ఆ రెండు పార్టీల కుమ్మక్కుకు ఇది నిదర్శనం కాదా. అక్కడ కాంగ్రెస్ కొత్త అభ్యర్ధిని పోటీకి పెట్టింది. ఏం జరుగుతుందో చూద్దాం. మాకు ఎలాంటి ఆందోళనా లేదు అని విజయన్ అన్నారు. గతంలో కూడా బిజెపి సురేంద్రన్ రెండు చోట్ల పోటీచేశారని గుర్తు చేశారు. ఎల్‌డిఎఫ్ రెండో సారి అధికారంలోకి రావాలంటే బిజెపికి కొన్ని సీట్లు ఉండాలని అందుకే ఈ కుమ్మక్కని కాంగ్రెస్‌నేత, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఆరోపించారు. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు టోకున బిజెపికి అమ్ముడు పోతున్న నేపధ్యంలో తమకు కేరళలో 35 సీట్లు వస్తే చాలని బిజెపి నేత సురేంద్రన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొత్తం మీద బాలశంకర్ తమ పార్టీ మీద ధ్వజమెత్తి సంచలనం సృష్టించారు. క్రమశిక్షణ గల సంస్దగా ఆర్‌ఎస్‌ఎస్, దాని ఉత్పత్తిగా బిజెపిలో ఉన్న నేతల బండారం ఏమిటో ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అధికారం వచ్చే అవకాశం ఏమాత్రం లేని చోటే ఇలా ఉంటే ఏలుబడి ఉన్న చోట ఎలా కొట్లాడుకుంటారో ఊహించుకోవలసిందే.
పగెలుస్తాననే విశ్వాసం లేదు- ఏదో ప్రధాని అడిగారు కనుక పోటీలో ఉన్నా – నటుడు సురేష్ గోపి !
ఎన్నికలలో పోటీ చేయాలని నాకు ఇప్పటికీ లేదు. గెలుస్తాననే విశ్వాసం కూడా లేదు. పార్టీ నేతలు బలవంతం చేసి మూడు నియోజకవర్గాల పేర్లు చెప్పి ఏదో ఒకదానిని ఎంచుకోమంటే త్రిసూర్ అన్నాను. ప్రధాని నరేంద్రమోడీ అడిగారు గనుక పార్టీకి నిబద్దుడైన కార్యకర్తగా పోటీచేస్తున్నా అని సిని నటుడు సురేష్ గోపి చెప్పారు. స్వల్ప అస్వస్తత తరువాత ఆసుపత్రి నుంచి విడుదలైన గోపి విలేకర్లతో మాట్లాడారు. ముందు నాకు ఆరోగ్యం ముఖ్యం, విశ్రాంతి కావాలి, కరోనా వ్యాక్సిన్ వేయించుకొనేందుకు వీలుగా కోవాలి. తరువాతనే ప్రచారం చేస్తా అని చెప్పారు. బలవంతంగా లేదా బెదరించి ఇలాంటి వారిని ఎందరిని పోటీలోకి దింపుతున్నారో కదా !తాను కోరుకున్న సీటు ఇవ్వకపోతే అసలు పోటీ చేయను అని బిజెపి మహిళా నేత శోభా సురేంద్రన్ పార్టీని బెదిరించారు. దాంతో చివరకు ఆమె కోరుకున్న సీటునే ఇచ్చారు. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఉన్నట్లు మీడియా కథలు అల్లిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ ఆరోపించారు. అయితే రాష్ట్ర నాయకత్వంతో నిమిత్తం లేకుండానే అధిష్టానం ఆమెకు సీటు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు రోజు శోభ మాట్లాడుతూ సీనియర్ నేతలు రాజగోపాల్, కుమనం రాజశేఖర్‌లకు ఇవ్వని బహుమతిని రాష్ట్ర అధ్యక్షుడు సరేంద్రన్‌కు ఇచ్చారు. రెండు చోట్ల పోటీ చేస్తున్న సురేంద్రన్‌కు ఇది సువర్ణ అవకాశమని, రెండు చోట్లా గెలవాలని కోరుకుంటున్నా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శోభ గనుక పోటీలో ఉండేట్లయితే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినట్లు వచ్చిన వార్తలను కె.సురేంద్రన్ ఖండించారు. ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో ఎన్నికల్లో హెలికాప్టర్లలో తిరుగుతుంటే తాను పార్టీ సమకూర్చిన డబ్బుతో హెలికాప్టర్ ద్వారా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు.
విద్యారంగంలో కేరళ వెనుకబడిందన్న త్రిపుర బిజెపి సిఎం !
త్రిపుర ముఖ్యమంత్రి, బిజెపి నేత విప్లవ కుమార్ దేవ్ బిజెపి ఎన్నికల ప్రచారంలో విద్యాపరంగా కేరళ వెనుకబడిపోయిందని చెప్పారు. కేంద్ర పధకాలను వేగంగా అమలు జరుపుతున్న కారణంగా త్రిపుర అభివృద్ధిలో కేరళ కంటే ముందున్నదని చెప్పుకున్నారు. అసలు ఒక్క స్దానం కూడా లేకుండా అధికారానికి ఎలా రాగలదో బిజెపి త్రిపురలో చూపిందని, ఇక్కడ ఒక సీటు ఉన్నందున అధికారంలోకి రావటం ఒక సమస్య కాదన్నారు. కమ్యూనిస్టుల పాలనలో కేరళకు ఒరిగిందేమీ లేదన్నారు.
తిరువనంతపురం పట్టణంలోని నీమమ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ స్వయంగా పోటీకి దిగింది.గతంలో బిజెపి ఓ రాజగోపాల్‌తో కుమ్మక్కయి జెడియుకు సీటిచ్చి తన ఓట్లను బదలాయించి గెలుపుకు తోడ్పిడిందన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ కుమారుడు, ఎంపీ అయిన మురళీధరన్‌ను పోటీకి నిలిపింది. బిజెపికి అతను గట్టి పోటీదారు అని బిజెపి ఎంఎల్‌ఏ ఓ రాజగోపాల్ వ్యాఖ్యానించారు.తాను పోటీలో లేకున్నా పార్టీ అభ్యర్ది కుమనమ్ రాజశేఖర్‌కు మద్దతుగా ప్రచారం చేస్తా అని చెప్పారు. నీమమ్‌లో చూపిన ధైర్యాన్ని ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న ధర్మదోమ్‌లో ఎందుకు చూపలేకపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ప్రశ్నించారు.
విజయన్‌పై పోటీకి పిరికి బారిన కన్నూరు ఎంపీ, ఫార్వర్డ్ బ్లాక్ తిరస్కారం !
ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కన్నూరు జిల్లా ధర్మదోమ్‌లో పోటీ చేసేందుకు కన్నూరు ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె సుధాకరన్ వెన్ను చూపారు. అనేక మంది నేతలు, కార్యకర్తలు సుధాకరన్ అయితేనే విజయన్‌కు గట్టి పోటీ అని చెప్పగా తాను అందరి కోరికలను తీర్చలేనని అన్నారు. గట్టి పోటీ పెట్టవచ్చుకదా అని విలేకర్లు అడిగితే ఇదేమీ కుస్తీపోటీ కాదు, ఎన్నిక అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి ఈసారి ముందుకు రాలేదు. దీంతో కాంగ్రెస్ తన మిత్రపక్షమైన ఫార్వర్డ్‌బ్లాక్ పోటీ చేసేందుకు ఆ స్ధానాన్ని విడిచిపెడుతున్నట్లు ప్రకటించింది. అయితే తమ అభ్యర్ధి అక్కడ పోటీలో ఉండరని ఆ పార్టీ ప్రకటించటంతో కాంగ్రెస్ అభ్యర్ధివేటలో పడింది. గత ఎన్నికల్లో ఇక్కడ విజయన్ 57శాతం ఓట్లు తెచ్చుకొని ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ తన అభ్యర్దిని చివరి నిమిషంలో ప్రకటించే అవకాశం ఉంది.
సిపిఐకి రాజీనామా చేసి బిజెపి కూటమిలో పోటీ !
సిపిఐలో సీటు రాకపోవటంతో అలపూజ జిల్లాలో గతంలో జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడిగా పని చేసిన తంపి మెట్టుతార ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపి కూటమిలోని బిజెడిఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. కేరళలో సిపిఎంకు బి టీమ్‌గా సిపిఐ పని చేస్తున్నదని ఆరోపించారు. తాను చేసిన ఫిర్యాదులను పార్టీ పట్టించుకోనందున రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌డిఏలోని పిసి ధామస్ కాంగ్రెస్ ఆ కూటమికి గుడ్‌బై చెప్పి యుడిఎఫ్‌లోని కేరళ కాంగ్రెస్(జె)లో చేరారు. గతంలో నాలుగు సీట్లు ఇచ్చిన బిజెపి ఈ సారి ఒక్క స్దానం కూడా ఇవ్వకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నాలుగు సార్లు ఎంపీగా పని చేసిన, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన పిసి చాకో ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను ఎన్‌సిపిలో చేరి ఎల్‌డిఎఫ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఎన్‌సిపి నేత శరద్ పవార్‌ను కలిసి చెప్పారు. కేరళలో కాంగ్రెస్(ఐ), కాంగ్రెస్ (ఏ) వాటిని సమన్వయపరిచే కమిటీ తప్ప అసలు కాంగ్రెసే లేదని చాకో వ్యంగ్యబాణాలు వదిలారు.
తనకు సీటు ఇవ్వనుందుకు నిరసగా గుండు చేయించుకొని నిరసన తెలిపి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన లతికా సురేష్ కొట్టాయం జిల్లాలో యుడిఎఫ్ భాగస్వామ్య పక్షం కేరళ కాంగ్రెస్(జె) పోటీ చేస్తున్న ఎట్టుమనూర్‌లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దగనున్నారు. పావు గుండు నరేంద్రమోడీ, మరో పావు రాష్ట్రప్రభుత్వం, సగం గుండును పార్టీ తనకు సీటు ఇవ్వనందుకు నిరసగా చేయించుకున్నట్లు ఆమె చెప్పారు.
ఆహారకిట్ ఇతర రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వలేదు – బిజెపికి విజయన్ ప్రశ్న !
కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన ఆహార కిట్ కేంద్రం సరఫరా చేసిందే అని బిజెపి నేతలు ప్రచారం చేయటాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎద్దేవా చేశారు. అదే నిజమైతే అన్ని రాష్ట్రాలలో ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు.ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం వాటిని అందచేసింది, అదేమీ పెద్ద విషయం కూడా కాదు, ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ అందించాం. దాన్ని గురించి ప్రచారం కూడా చేయలేదు. అయితే కాంగ్రెస్, బిజెపికి చెందిన కొంత మంది ఇప్పుడు కిట్‌లోని సరకులన్నీ కేంద్రం ఇచ్చినవే అని తామే ఇచ్చినట్లు విజయన్ ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. నిజంగా కేంద్రమే ఇస్తే మిగతా చోట్ల ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని విజయన్ అన్నారు.
కేరళ ప్రభుత్వం కరోనా సాయంగా ప్రతినెలా అందచేస్తున్న ఆహార కిట్‌లో 17 నిత్యావసర వస్తువులు ఉన్నాయి.1. కిలో పంచదార, 2. పావు కిలో తేయాకు, 3.కిలో ఉప్పు, 4. కిలో పెసలు, 5. కిలో సెనగపప్పు, 6.పావుకిలో కందిపప్పు, 7.అరకిలో కొబ్బరి నూనె, 8.కిలో సన్‌ఫ్లవర్ నూనె, 9.రెండు కిలోల గోధుమ పిండి, 10.కిలో బొంబాయి రవ్వ, 11.కిలో మినప పప్పు, 12. వందగ్రాములు కారం, 13.వందగ్రాముల ధనియాల పొడి, 14.వంద గ్రాములు పసుపు, 15.వందగ్రాముల మెంతి పొడి, 16.వందగ్రాముల ఆవాలు, 17. రెండు సబ్బులు ఉన్నాయి.