Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


సిపిఎంను ఓడించేందుకు తాము గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, ముస్లింలీగుతో చేతులు కలిపిన మాట నిజమే అని కేరళలో ప్రధమ బిజెపి ఎంఎల్‌ఏ,91 సంవత్సరాల సీనియర్‌నేత ఓ రాజగోపాల్‌ వెల్లడించారు. గతంలో ఇదే విషయాన్ని సిపిఐ(ఎం) అనేక సార్లు చెప్పింది. ఇప్పుడు బిజెపి నేత నోటి నుంచి ఆ విషయం వెల్లడి కావటంతో మూడు పార్టీలు ఇరకాటంలో పడ్డాయని చెప్పవచ్చు. బిజెపి-సిపిఎం కుమ్మక్కు అయినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బాలశంకర్‌ చేసిన ఆరోపణ గురించి స్పందించాలని ఒక టీవీ ఛానల్‌ అడిగినపుడు రాజగోపాల్‌ గతం గురించి చెప్పారు.గతంలో అనేక సందర్భాలలో కొన్ని స్ధానాలలో మూడు పార్టీలు సహకరించుకోవటం బహిరంగ అంశమే. మూడు పార్టీలు కలసి వ్యవహరించపోయినా సిపిఎం ఓటమికి గాను బిజెపికి ఓట్లు పడేందుకు ఒకరికొకరు సహకరించుకున్నారు,ఒత్తపాలెం, మంజేశ్వరం వంటి నియోజకవర్గాలు వాటిలో ఉన్నాయి. ఆ మేరకు బిజెపికి లబ్ది చేకూరిందని రాజగోపాల్‌ వెల్లడించారు. ఈ విషయం కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసని, అలా లబ్దిపొందటం తప్పుకానేకాదని కూడా ఉద్ఘాటించారు. నీమమ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ది కె మురళీధరన్‌ బలమైన అభ్యర్ధి అని కూడా వ్యాఖ్యానించి పార్టీని, అక్కడ పోటీ చేస్తున్న కుమనం రాజశేఖర్‌ను కూడా ఇబ్బందిలోకి నెట్టారు. బిజెపి ప్రధాన శత్రువు కాదని గతంలో ముస్లిం లీగు చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గుర్తు చేశారు. బిజెపికి లబ్ది చేకూర్చేవిధంగా లీగు-కాంగ్రెస్‌ కుమ్మక్కు అయ్యాయన్నారు. గతేడాది స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా అదేవిధంగా జతకట్టారని అవవిత్ర కూటమిని ఓ రాజగోపాల్‌ నిర్దారించారని విజయన్‌ చెప్పారు. సిఎఎకు వ్యతిరేకంగా తొలుత ప్రకటించింది ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే అన్నారు. బిజెపి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉమ్మడిగా నిరసన తెలపాలని తాము కోరగా కాంగ్రెస్‌, లీగు తిరస్కరించాయని చెప్పారు. రాజగోపాల్‌ చెప్పిన అంశంపై బిజెపి, ముస్లిం లీగు, కాంగ్రెస్‌ మౌనందాల్చాయి.


ఓ రాజగోపాల్‌ చెప్పిన అంశాలతో దిక్కుతోచని బిజెపి సరికొత్త అవాస్తవాల ప్రచారానికి తెరలేపింది. బిజెపి-సిపిఎం కలసి పని చేయటం అందరికీ తెలిసిందేనని, ఇదేమీ కొత్తకాదని, తమ పార్టీనేత కెజి మరార్‌ గతంలో ఉడుమ నియోజకవర్గంలో పోటీ చేసినపుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్‌ ప్రధాన ఏజంట్‌గా మరార్‌ తరఫున పని చేశారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంటి రమేష్‌ పచ్చి అవాస్తవాలను చెప్పారు. 1977లో మరార్‌ ఉడుమలో పోటీ చేశారు. అప్పటికి అసలు బిజెపి పుట్టనేలేదు. జనతా పార్టీ అభ్యర్దిగా మరార్‌ పోటీ చేశారు. ఆ సమయంలో జనతా పార్టీలో ఎవరున్నారు అనేదానితో నిమిత్తం లేకుండా అత్యవసర పరిస్దితిని వ్యతిరేకించిన వారితో కూడిన ఆ పార్టీని సిపిఎం బలపరిచింది. అదే సమయంలో సిపిఎంను కూడా జనతా పార్టీ బలపరిచింది. 1977లో పినరయి విజయన్‌ వేరే నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేశారు.అందువలన మరార్‌కు ప్రధాన ఏజంట్‌గా ఉండే అవకాశమే లేదు. జనతా పార్టీలో అంతకు బిజెపి పూర్వరూపంగా ఉన్న జనసంఫ్‌ు తన మతతత్వ అజెండాను పక్కన పెట్టి విలీనమైన అంశం తెలిసిందే. తరువాత మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యత్వ వివాదం తలెత్తినపుడు తాము జనతా పార్టీకంటే ఆర్‌ఎస్‌ఎస్‌కే విధేయులమని ప్రకటించి బిజెపిని ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నడూ ఎక్కడా ఏ రూపంలోనూ బిజెపిని సిపిఎం బలపరచలేదు.


నాలుగు నియోజకవర్గాలలో సిపిఎం-బిజెపి కుమ్మక్కు అయినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత బాలశంకర్‌ చేసిన ఆధారం లేని ఆరోపణను ఆ సంస్ద నేతలే ఖండించారు. ప్రాంత కార్యవాV్‌ా గోపాలన్‌కుట్టి మాట్లాడుతూ బాలశంకర్‌ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించిన విషయం తనకు తెలియదని, దాని మీద ఎలాంటి వ్యాఖ్య చేయనని, అతని వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకుడిగా కొద్దికాలమే బాలశంకర్‌ పని చేశారని, ఆ మాటకు వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు కాని వారు కూడా సంపాదకులుగా పని చేశారని అన్నారు. బాలశంకర్‌ చెబుతున్న నాలుగు నియోజకవర్గాలలో ఇప్పుడు సిపిఎం ప్రతినిధులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని అందువలన బిజెపితో కుమ్మక్కు ఆరోపణకు అర్ధం లేదని సిపిఎం నేతలు చెప్పారు.


ధర్మదోమ్‌పై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ చేస్తున్న కన్నూరు జిల్లా ధర్మదోమ్‌లో పోటీకి ఎవరిని నిలపాలో మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్‌ ఎట్టకేలకు అభ్యర్దిని ఖరారు చేసింది. తొలుత అక్కడ ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్ది దేవరాజన్‌ను పోటీకి దింపాలని కాంగ్రెస్‌ సూచింది. అయితే ప శ్చిమబెంగాల్లో సిపిఎం నాయకత్వంలోని ఉన్న ఫ్రంట్‌లో ఉన్న తాము ఇక్కడ కాంగ్రెస్‌తో ఉన్నప్పటికీ విజయన్‌ మీద పోటీ చేసేందుకు తాము సుముఖంగా లేమని ఆ పార్టీ చెప్పటంతో కాంగ్రెస్‌ ఖంగుతిన్నది. ఎవరిని నిలపాలా అని తర్జనభర్జన పడుతున్నది. కాలేజీ రోజుల నుంచి విజయన్‌కు ప్రత్యర్ధిగా ఉన్న కన్నూరు ఎంపీ సుధాకరన్‌ను పోటీకి నిలపాలని పార్టీ అధిష్టానం సూచించింది. అయితే వత్తిడి చేయవద్దని, పూర్తిగా అంగీకారమైతేనే ఖరారు చేయాలని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నీమమ్‌, ధర్మదోమ్‌లో బలమైన అభ్యర్దులను దింపటం ద్వారా తాము బిజెపి-సిపిఎంలను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పేందుకు అవకాశం ఉంటుందన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడ.అధిష్టానం గట్టిగా కోరితే పరిశీలిస్తానని సుధాకరన్‌ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.తానుకానట్లయితే తన అనుచరుడు రఘునాధ్‌ను పోటీకి నిలపాలని ప్రతిపాదిస్తున్నారని మీడియా పేర్కొన్నది. చివరికి అదే జరిగింది. తాను ధర్మదోమ్‌లో పోటీ చేస్తే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుందని, ఐదు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు వీలుండదని సుధాకరన్‌ చెప్పుకున్నారు. ఇప్పటికిప్పుడు అక్కడ పోటీ చేయటం కుదరదని ఎంతో ముందుగానే నిర్ణయించి ఉంటే అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ఉండేవాడినని కూడా చెప్పారు.


తాను ఎవరి ముందు అయినా ఎలాంటి అభిప్రాయాలనైనా వ్యక్తం చేయగల ధైర్యం ఉందని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ తమ పార్టీనేతలకు సవాలు విసిరారు. అభ్యర్ధుల ఎంపికలో సుధాకరన్‌ ఆశాభంగం చెందినట్లున్నారు, ఆయనకు రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితి తెలియదని సిఎల్‌పి నేత రమేష్‌ చెన్నితల చేసి వ్యాఖ్యాల మీద సుధాకరన్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ ఒక లెక్కలోది కాదని, ఆయన మీద పోటీ చేస్తానని తాను సీటును కోరలేదని, తనను ఎవరూ అడగనూ లేదన్నారు. ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు, పార్టీ కోసం త్యాగం చేసేందుకు సిద్దమే అన్నారు. పార్టీ అభ్యర్ధుల ఎంపిక మీద తనకు సంతృప్తి లేదని, దీనికి తాను ఎవరినీ నిందించటం లేదని చెప్పారు. సుధాకరన్‌ చేసిన వ్యాఖ్యల మీద తాను స్పందించదలచ లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. సీట్ల ఎంపిక ఉమ్మడిగానే జరిగిందని, గెలుపు అవకాశాలనే పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎన్‌సిపిలో చేరిన పిసి చాకో కన్నూరు ఎంపీ సుధాకరన్‌తో సహా అనేక మంది పార్టీ నుంచి వెలుపలికి వెళ్లే విషయాలను తనతో చర్చించారని అన్నారు. తాను ఎల్‌డిఎఫ్‌ తరఫున రాష్ట్రవ్యాపితంగా ప్రచారం చేస్తానన్నారు. తానసలు ఇటీవల చాకోతో మాట్లాడలేదని సుధాకరన్‌ వివరణ ఇచ్చారు.


మహిళలకు ఓడిపోయే సీట్లిచ్చిన యుడిఎఫ్‌ !


మహిళలకు యుడిఎఫ్‌ ప్రకటించిన పది స్ధానాలలో గతంలో ఎనిమిదింటిలో ఓడిపోయినవే ఉన్నాయి. ఇదే సమయంలో ఎల్‌డిఎఫ్‌ కేటాయించిన 15 స్ధానాలకు గాను పది గెలిచిన స్ధానాలు ఉన్నాయి. ఐదింటిలొ ఓడిపోయిన రెండు చోట్ల ఏడువేలలోపే తేడా ఉంది. ప్రస్తుతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు స్దానాలో యుడిఎఫ్‌ ఈసారి వారికి మొండి చేయి చూపింది. మహిళలకు కేటాయించిన వాటిలో ఆరు చోట్ల గత ఎన్నికల్లో యుడిఎఫ్‌ పది నుంచి 43వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. స్దానిక సంస్దల ఎన్నికలలో మహిళలకు 50 శాతం స్దానాలను రిజర్వు చేశారు. గతేడాది జరిగిన ఎన్నికలలో గెలిచిన వారిలో 54శాతం మంది మహిళలు ఉండటం విశేషం. జమాయతుల్‌ ఉలేమా మహిళల పోటీ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నది. పాతిక సంవత్సరాల తరువాత ముస్లిం లీగు పోటీ చేస్తున్న 27 స్దానాలలో ఒకదానిలో మహిళను నిలిపింది.


శబరిమలను వివాదంగా ముందుకు తెచ్చే యత్నం !


శబరిమల దేవాలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ప్రభుత్వం అమలు జరిపింది తప్ప మరొకటి కాదని, దాని గురించి దేవాదాయశాఖ మంత్రి ఎందుకు విచారం ప్రకటించారో తనకు తెలియదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ఉన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును అమలు జరపక ఏమి చెయ్యాలని ప్రశ్నించారు. శబరిమల సమస్య మీద ముఖ్యమంత్రి తన వైఖరి ఏమిటో వెల్లడించాలని బిజెపికి మద్దతు ఇస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రకటనలో కోరింది. భక్తులకు తెలుసుకొనే హక్కుందని పేర్కొన్నది. శబరిమల సమస్య ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, దాని తీర్పు వెలువడిన తరువాత అందరితో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి విజయన్‌ గతంలోనే ప్రకటించినప్పటికీ ఎన్నికలలో దాన్నొక సమస్యగా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఎన్‌ఎస్‌ఎస్‌ ఈ ప్రకటన చేసిందని భావిస్తున్నారు. దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సుధాకరన్‌(సిపిఐ) పోటీ చేస్తున్న కజకోట్టమ్‌ నియోజకవర్గంలో బిజెపి అసంతృప్త నేత శోభా సురేంద్రన్‌ పోటీలో ఉన్నారు.
శబరిమల వివాదం ముగిసిన అంశమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కనం రాజేంద్రన్‌ చెప్పారు. ఈ వివాదాన్ని తమ మంత్రి లేవనెత్తలేదని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండటం కనీస మర్యాద అని ఆ వివాదాన్ని ప్రస్తావిస్తున్నవారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిపిఐ నుంచి వెళ్లిపోయి బిజెపి అభ్యర్దులుగా మారిన వారి గురించి అడగ్గా సీటురాని వా రు అలా చేస్తున్నారని బిజెపికి అభ్యర్దులే దొరకని స్ధితి అన్నారు.


ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చిన కేరళ కాంగ్రెస్‌(టి) తమ పార్టీని యుడిఎఫ్‌ భాగస్వామ్య పక్షమైన కేరళ కాంగ్రెస్‌(జె)లో విలీనం చేసినట్లు ఆ పార్టీనేత పిసి థామస్‌ ప్రకటించారు. అయితే అతని చుట్టూ కొంత మంది వ్యక్తులు తప్ప జనం లేరని ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌ (ఎం) నేత జోస్‌ మణి వ్యాఖ్యానించారు.బిజెపితో సంబంధాలను ఏర్పాటు చేసేందుకే యుడిఎఫ్‌లో చేరినట్లు మణి చెప్పారు. అసలు ఆ పార్టీకి రిజిస్ట్రేషన్‌ కూడా లేదని అన్నారు.నిజమైన కేరళ కాంగ్రెస్‌ ఏదో గత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనమే తేల్చారని అన్నారు. త్రిపురలో బిజెపి, ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మాదిరి కేరళలో ఈ ఎన్నికల్లో 70 స్ధానాలు వస్తాయని బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ జోశ్యం చెప్పారు.
కేరళ నుంచి రాజ్యసభకు ఏప్రిల్‌ 12న మూడు స్దానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో యుడిఎఫ్‌కు రెండు, ఎల్‌డిఎఫ్‌కు ఒకటి ఉన్నాయి. ఇప్పుడున్న బలాబలా ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు రెండు, యుడిఎఫ్‌కు ఒక స్దానం దక్కనుంది. యుడిఎఫ్‌లోని ముస్లింలీగు తన స్ధానానికి తిరిగి ప్రస్తుత అభ్యర్దినే ప్రకటించింది. రెండో స్ధానంలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం లేదు. ఎల్‌డిఎఫ్‌ తరఫున ప్రస్తుతం ఆలిండియా కిసాన్‌ సభలో ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న విజూ కృష్ణన్‌తో పాటు సిపిఎం సానుభూతి పరుడు చెరియన్‌ ఫిలిప్పును ఎంపిక చేయవచ్చని వార్తలు వచ్చాయి.