Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
వాగ్దానం చేసినట్లుగా నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకురావటంలో విఫలమైన బిజెపి నేతలు రైతాంగానికి సంతృప్తి కలిగించే సమాధానం చెబుతున్నారా ? తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఇతర పార్టీల మీద ఎదురుదాడి చేస్తున్నారా ? పసుపు బోర్డు కంటే సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ విస్తరణ కార్యాలయమే రైతులకు మేలు చేస్తుందని చెప్పటం ద్వారా రైతులను మరీ అంత అమాయకులుగా భావిస్తున్నారా ? ఒక్క సమస్య – వంద ప్రశ్నలు అన్నట్లుగా బిజెపి ముందుకు వచ్చాయి . చేసిన వాగ్దానాన్ని అదీ బాండ్‌ పేపర్‌పై రాసి ఇచ్చిన దాని సాధన లేదా వాగ్దానం అమలు గురించి ఎవరూ అడగ కూడదా ! అసలు పసుపు బోర్డు కథేమిటి ? బిజెపి నేతల ప్రచారంలో నిజానిజాలేమిటి ? తెలిసి కూడా రైతాంగం, సాధారణ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా ? ఒక్కో అంశాన్ని చూద్దాం !


బిజెపి నేత ధర్మపురి అరవింద్‌ పసుపు బోర్డు వాగ్దానాన్ని ఎందుకు ముందుకు తెచ్చారు ?


2019లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో మిగతా ప్రాంతాలతో పాటు నిజామాబాద్‌ మార్కెట్లో కూడా పసుపు ధరలు పడిపోయాయి. అప్పుడు కూడా అధికారంలో ఉన్నది నరేంద్రమోడీ సర్కారే.2018లో పసుపు ధరలు పెరగటంతో రైతాంగం పెద్ద మొత్తంలో సాగు చేశారు. దాంతో 2019 మార్కెట్‌ సీజన్‌లో అంతకు ముందు వచ్చిన ధర కంటే నాలుగో వంతు పడిపోయింది. రైతులు ఆందోళనలకు దిగారు. అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి. పసుపు రైతుల ఓట్లను కొల్లగొట్టాలంటే ధర రాకపోవటానికి బోర్డు లేకపోవటమే కారణమని, కేంద్రంలో అధికారంలో ఉన్నాము గనుక తనను గెలిపిస్తే బోర్టు ఏర్పాటు చేయిస్తానని ధర్మపురి అరవింద్‌ బాండ్‌ పేపర్‌ మీద రాసి రైతులను నమ్మించారు. దాన్ని ఊరూరా చూపి ఓట్లడిగారు. బోర్డు ఏర్పాటు ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రకటించటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు పసుపు బోర్డు కంటే సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయ ఏర్పాటే ఎక్కువ ప్రయోజనమని, అది పసుపు ఒక్కదానికే గాక అల్లం వంటి పంటల రైతులకు కూడా ఉపయోగమని చెబుతున్నారు.


పసుపు బోర్డు రాదని బిజెపి నేతలకు తెలియదా ? ఇప్పటికీ రైతులను మభ్యపరుస్తున్నారా ?


పూర్తిగా తెలుసు, అంత అమాయకులు కాదు. ముందే చెప్పినట్లు ఇప్పటికీ రైతులను మభ్యపరుస్తున్నారు. ఏలకుల కోసం 1968 నుంచి పని చేస్తున్న బోర్డును విస్తరించి పసుపుతో సహా 52 సుగంధ ద్రవ్యాల కోసం 1986లో ఒక చట్టాన్ని చేసి మరుసటి ఏడాది సుగంధద్రవ్యాల బోర్డును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అది సుగంధ ద్రవ్యాల దిగుబడులు పెంచటం, మార్కెటింగ్‌, ఎగుమతుల కోసం పని చేస్తున్నది. సుగంధ ద్రవ్యాల తరగతి కిందకు వచ్చే 52 పంటలలో మిర్చిది అగ్రస్దానం. గతంలో ఒకదానికి ఉన్న బోర్డును అన్నింటికీ విస్తరించినపుడు వాటిలో ఒకదానికి ప్రత్యేకంగా తిరిగి ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అవకాశాలు లేవు. మిర్చికి లేని బోర్డును పసుపు ఏర్పాటు చేసే అవకాశాలే లేవు. అయినా పసుపు రైతులను అమాయకుల కింద జమకట్టి బాండ్లను రాసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు అనుకోవటంలో తప్పులేదు. రైతులు ఎదుర్కొంటున్న ధరల అస్ధిరత సమస్య బోర్డు లేనందు వలన కాదు, ప్రభుత్వ విధానాలే పరిష్కారమని తెలియచెప్పాల్సిన వారు, తప్పుదారి పట్టించారు.


సుగంధ ద్రవ్యాలలో పసుపు వాటా ఎంత ?


పసుపు ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో మనదే అగ్రస్ధానం. సుగంధ ద్రవ్యాలన్నింటినీ మన దేశంలోనే వినియోగించే అవకాశం లేదు. విదేశాలకు ఎగుమతి చేయటం ద్వారా విలువై విదేశీ మారకద్రవ్యాన్ని రైతులు సమకూర్చుతున్నారు. నరేంద్రమోడీ ఏలుబడిలో కొన్ని సుగంధ ద్రవ్యాల ఎగుమతులు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా వస్తున్న ఆదాయం ఎలా ఉందో చూద్దాం. (2019-20 సంవత్సర అంకెలు ప్రభుత్వ లక్ష్యాలు, మిగిలినవి వాస్తవ అంకెలు. సరకు పరిమాణం టన్నులలో, విలువ కోట్ల రూపాయల్లో ఉంది.
సరకు సంవత్సరం సంవత్సరం సంవత్సరం సంవత్సరం సంవత్సరం
2015-16×××2016-17 ××× 2017-18 ×××2018-19××× 2019-20
టన్నులు- కోట్లలో×టన్నులు- కోట్లలో×టన్నులు- కోట్లలో×టన్నులు-కోట్లలో×టన్నులు-కోట్లలో
మిర్చి 3,47,500-3,997×4,00,250-5,070×4,43,900-4,256×4,685-5,411×4,84,000-6,221
జిలకర 97,970-1,531×1,19,000-1,963×1,43,670-2,418×1,80,300-2,885×2,10,000-3,225
పసుపు 88,500-921×1,16,500-1,242×1,07,300-1,035×1,33,600-1,416×1,36,000-1,215
మిరియాలు 28,100-1,730×17,600-1,143×16,840-820× 13,540- 568×16,250-519
ఏలకులు 6,100-525×× 4,630-541 ×× 6.440-664 ×× 3,710-417 ××3,190-493

ప్రాంతీయ విస్తరణ కార్యాలయం పసుపు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందా ?


ముందే చెప్పుకున్నట్లు బోర్డు పరిధిలోకి తెచ్చిన 52 సుగంధ ద్రవ్యాల కోసం పని చేసేందుకే ఆ బోర్డు పని చేస్తున్నది. అది సక్రమంగా పని చేస్తున్నదా లేదా అన్న అంశం మీద తేడాలుండవచ్చు తప్ప ప్రత్యేకంగా నిజామాబాద్‌ కార్యాలయం కొత్తగా చేసేదేమీ ఉండదు, ఇతర కార్యాలయాలకు మించి దానికి ప్రత్యేక అధికారాలేమీ ఉండవు. కార్యాలయ బోర్డును చూపి జనాన్ని మభ్యపెట్టటం తప్ప మరొకటి కాదు. ఈ కార్యాలయం ఏర్పాటు చేయక ముందే కొన్ని కొత్త రకాలను రూపొందించి రైతులకు అందచేశారు, చేస్తున్నారు, పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి.బోర్డు కంటే సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయం ద్వారా ఎక్కువ లబ్ది చేకూరుతుందని మరో అబద్దాన్ని చెబుతున్నారు. ఇది మరీ అన్యాయం నరేంద్రమోడీ కంటే ఒక ఎంపీకి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పటమే ఇది. మిర్చి, పసుపు వంటి పంటలకు అసలు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలనే ప్రకటించలేదు. అందువలన బోర్డు అయినా ప్రాంతీయ కార్యాలయం అయినా ఈ విషయంలో చేసేదేమీ లేదు.


పసుపు ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందా ? ధరలకోసం ఎంపీ పోరాటం చేశారా ?


బిజెపి నేతలు కొన్ని టీవీ చర్చలలో చెప్పిన అంశాలను చూస్తే ఎంత అలవోకగా అసత్యాలు చెప్పగలరో అర్ధం చేసుకోవచ్చు. పసుపు ఎగుమతులను నరేంద్రమోడీ సర్కార్‌ నిషేధించిన కారణంగానే ధరలు పెరిగాయంటూ మాట్లాడే మేక కథలు చెబుతున్నారు, అందుకోసం తమ ఎంపీ అరవింద్‌ పోరాటం చేశారని చెప్పుకుంటున్నారు. ధరలు పెరిగినందున రైతులు పాలాభిషేకం చేశారని చెబుతున్నారు. మొదటి విషయం పసుపు ఎగుమతులను కేంద్రం నిషేధించలేదు. మన పసుపును దిగుమతి చేసుకోకూడదని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించటంతో పక్కనే ఉన్న తమిళనాడు రైతులు నష్టపోయారని వార్తలు వచ్చాయి. ప్రపంచ నేతగా ఎంతో ప్రభావితం చూపుతున్నారని లేని గొప్పలను ఆపాదిస్తున్న వారు నరేంద్రమోడీ గారు కనీసం శ్రీలంక నిషేధాన్ని కూడా ఎత్తివేయించలేకపోయారన్నది అసలు నిజం. ధరల కోసం ఎంపీ చేసింది ఏమిటో రైతులకు ఎప్పుడూ, ఎక్కడా కనపడదు.పాలాభిషేకాలు చేయించుకోవటం ఈ రోజుల్లో ఎంతసులువో తెలిసిందే. దేశమంతటా పసుపు ధరలు పెరిగాయి. అన్నిచోట్లా ధర్మపురికి పాలాభిషేకాలు ఎందుకు చేయటం లేదు ? ఆంధ్రప్రదేశ్‌లో ఎంతవరకు అమలు చేస్తారో తెలియదు గానీ మిర్చికి క్వింటాలుకు రు.7,000, పసుపుకు రు.6,350 కంటే మార్కెట్లో ధరలు తగ్గితే ఆమేరకు తాము కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రపంచం దిగుమతి చేసుకొనే పసుపులో 80శాతం మనమే చేస్తున్నాము. దిగుమతుల ప్రశ్నేలేదు. ఇతన అనేక సుగంధ ద్రవ్యాలతో పాటు తమ దేశంలో పసుపు దిగుబడి పెంచే చర్యల్లో భాగంగా 2018 డిసెంబరు నుంచి మన పసుపు మీద కూడా శ్రీలంక నిషేధం విధించింది.అది తమిళనాడులో రాజకీయ అలజడులను కూడా సృష్టించింది. 2014 నుంచి బిజెపి మిత్రపక్షంగానే ఉంది. లంక నిషేధాన్ని ఎత్తివేయించాలని రెండు సంవత్సరాల నుంచి కోరుతున్నా నరేంద్రమోడీ ఆపని చేయించలేకపోయారు.
కాంగ్రెస్‌ పాలకులు పసుపు దిగుమతులు చేసి రైతాంగాన్ని దెబ్బతీశారా ?బిజెపి ఎంపీ కారణంగా ధరలు పెరిగాయా !
కాంగ్రెస్‌ అనేక తప్పులు చేసింది కనుక తమ వైఫల్యం ప్రతిదానికి గత కాంగ్రెస్‌ పాలకులే కారణం అని చెప్పటం బిజెపికి మామూలై పోయింది. అధికారానికి వచ్చి ఏడు సంవత్సరాలైంది కనుక ఆ పాచిపాటను మరీ ఎక్కువ సాగదీస్తే జనానికి చిరాకు తరువాత ఆగ్రహం వస్తుంది. గతంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పసుపు దిగుమతులు చేసి రైతులను దెబ్బతీసిందన్నట్లుగా కూడా ఎంపీ చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా ఎప్పుడు ఎంత దిగుమతి చేసుకుందో వివరిస్తే అసలు బండారం బయటపడుతుంది. మన దేశం ఎగుమతులు చేయటం తప్ప దిగుమతులు ఎన్నడూ లేవు. ఉంటే ఎవరైనా వివరాలు వెల్లడించవచ్చు.


పసుపు, చెరకు దోఫసలీ పంటల కిందకు వస్తాయి, అంటే సాగు వ్యవధి ఎక్కువగా ఉంటుంది. గతేడాది పడిన వర్షాలకారణంగా అనేక చోట్ల పంట దెబ్బతిన్నది.ఈ ఏడాది పంట ఉత్పత్తి నాలుగోవంతు పడిపోనుందన్నది వ్యాపారుల అంచనా దిగుబడి తగ్గనుందనే అంచనాతో రేట్లు పెరిగాయి తప్ప బిజెపి సర్కార్‌ లేదా ఎంపీ చేసిందేమీ లేదు. మన దేశంలోనే కాదు,ప్రపంచ వ్యాపితంగా పెరిగాయి. పెరిగిన ధరలతో రైతులు సంతృప్తి చెందారా అంటే అంతకు ముందు పతనమైన వాటితో పెరిగినపుడు కొంత సంతృప్తి ఉండటం సహజం. కానీ పెరిగిన ధరలెంత, వ్యవసాయ ఖర్చులెంత ? దానికి అనుగుణ్యంగా ధరలు పెరిగాయా ? ఒక వైపు ప్రధాని నరేంద్రమోడీ గారేమో ప్రభుత్వం వ్యాపారం చేసేందుకు కాదు అంటారు. మరోవైపు బిజెపి వారు వ్యాపారుల ధరలు తమవే అంటారు. ఒకే, వారి ప్రతిభే అనుకుంటే ఇంకా ధరలు ఎందుకు పెంచలేదు అనే ప్రశ్నకు వారు జవాబు చెప్పాల్సి ఉంటుంది.గతంలో ఇంతకంటే రైతులకు ఎక్కువ ధరలు వచ్చిన రోజులున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సమాచారం ప్రకారం 2008-09లో సగటు ధర క్వింటాలుకు రు.3,850 ఉంటే తరువాత రెండు సంవత్సరాలలో రు.11,000, 11,500లకు పెరిగింది, 2011-12లో పతనమై రూ.3,500, తరువాత నాలుగు సంవత్సరాలు రు.6,400 నుంచి రు.8,100కు పెరిగింది.2016-17లో రు.5,850,2017-18లో రు.5,575 పడిపోయాయి. ఈ కారణంగానే రైతుల్లో ఆందోళన తలెత్తింది. అదే పసుపు బోర్డు ప్రతిపాదన, వాగ్దానానికి దారి తీసింది. నరేంద్రమోడీ ఏలుబడిలో హెచ్చుతగ్గులకు కారణం ఏమిటి ? వీటికి కూడా కాంగ్రెస్‌ పాలనే కారణం అంటారా ? నేషనల్‌ కమోడిటీస్‌ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్సేంజ్‌లో (ముందస్తు మార్కెట్‌) లావాదేవీల సమాచారం ఎవరికైనా అందుబాటులో ఉంది. అనుమానాలు ఉన్న వారు చూసుకోవచ్చు. 2021 అంకెలు ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ధరలు
సంవత్సరం ××××× క్వింటాలు కనిష్ట ధరలు రూ.
2004-2007××× 2,800-2,460
2008 ××××××× 3,084-3,894
2009 ××××××× 5,254 -10,756
2010 ××××××× 12,730 – 14,232
2011 ××××××× 9,550 – 4,410
2012 ××××××× 3,460 – 5,400
2013 ××××××× 6,704 – 5,330
2014 ××××××× 6,478- 6,800
2015 ××××××× 7,998 – 9,656
2016 ××××××× 8,728 – 6,998
2017 ××××××× 5,974 – 7,758
2018 ××××××× 6,800 – 6,230
2019 ××××××× 6,298 – 6,134
2020 ××××××× 5,730 – 5,700
2021 ××××××× 8,108 – 8,778
మార్చి పందొమ్మిదవ తేదీన ఏప్రిల్‌లో అందచేయాల్సిన పసుపు ధర రు.7,890-8,220 మధ్య ఉన్నది, అదే మేనెలలో అందచేయాల్సిన దాని ధర రు.7,960-8,300 మధ్య ఉన్నది. (కొనుగోలు-అమ్మకం దారుల మధ్య వాస్తవంగా సరకు లావాదేవీలే జరగనవసరం లేదు. ఒప్పందానికి అనుగుణ్యంగా ధరల తేడాను చెల్లించటమే ముందుస్తు మార్కెట్లో సాధారణంగా జరుగుతుంది.ఏది వాటంగా ఉంటే దాన్ని కోరవచ్చు) ఈ ధరలకు అనుగుణ్యంగానే నిజామాబాద్‌, దుగ్గిరాల, కడప, ఈరోడ్‌, సాంగ్లీ వంటి మార్కెట్లలో ధరలు ఉంటాయి. నాణ్యతను బట్టి హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు. ముందస్తు – ఏరోజుకు ఆరోజు కొనుగోలు చేసే ధరల్లో కూడా తేడా ఉంటాయి. జనవరి మొదటి వారంలో ఉన్న ముందస్తు ధర రు.5,580 నుంచి 5,725 వరకు ఉన్న ధరలతో పోల్చితే తరువాత పెరిగింది. సరకు మార్కెట్‌కు వచ్చే దాన్ని బట్టి రాబోయే రోజుల్లో తగ్గవచ్చు, మరికాస్త పెరగవచ్చు. వీటిని చూపి అది తమ ప్రతిభే అని బిజెపి నేతలు చెప్పుకోవటమే విచిత్రం, విపరీతం. పసుపు బోర్డు గురించి పార్లమెంటులో తెరాస, కాంగ్రెస్‌ ఎంపీలు అడగటమే దేశద్రోహం అన్నట్లుగా బిజెపి ఎంపీ అరవింద్‌ విరుచుకుపడ్డారు. పేరుకు పసుపు బోర్డు అంశం మాట్లాడిందంతా సంబంధం లేని విషయాలు.నిండా మునిగిన వారికి చలేమిటి అన్న సామెత తెలిసిందే. పసుపు బోర్డు విషయంలో తెలంగాణా రైతాంగాన్ని నిండా ముంచిన వారికి చలేముంటుంది ! లేకపోగా ఎదురుదాడులకు దిగుతున్నారు !! ఇదే ప్రమాదకర పోకడ !!!