Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


గతంలో వెల్లడైన సర్వేలు, తాజాగా వెల్లడైన మాతృభూమి సర్వే కూడా ఎల్‌డిఎఫ్‌ విజయాన్ని నిర్ధారించిందని అయితే కార్యకర్తలెవరూ ఆదమరిచి ఉండరాదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ హెచ్చరించారు. ఎల్‌డిఎఫ్‌కు 75-83, యుడిఎఫ్‌కు 56-64 మధ్య, బిజెపికి రెండు వస్తాయని మాతృభూమి సి ఓటర్‌ సర్వే తాజాగా పేర్కొన్నది. అన్ని సర్వేల సారం ఎల్‌డిఎఫ్‌ కొనసాగింపేనని, సిపిఎం చెప్పింది నిజమని వెల్లడిస్తున్నాయని, అయితే గట్టిపోటీ జరగనున్నందున కార్యకర్తలు జాగరూకులై ఉండాలని బాలకృష్ణన్‌ చెప్పారు.
కేరళ విభాగం పని తీరుపట్ల కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. సామాజిక మాధ్యమంలో ఎల్‌డిఎఫ్‌ ఎంతో ముందున్నదని కాంగ్రెస్‌ కిలోమీటర్ల దూరం వెనుక ఉందని, చేస్తున్న ప్రచారం కూడా క్రమశిక్షణతో లేదని పద్దతి ప్రకారం జరగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. యుడిఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(మణి) బయటకు పోవటాన్ని తీవ్రంగా పరిగణించలేదని, పది సీట్లలో పోటీ చేస్తూ మిగిలిన జోసెఫ్‌ వర్గానికి పోటీ చేసేందుకు అసలు గుర్తే లేకపోయినా పట్టించుకోలేదని మండిపడింది. గత మూడు ఎన్నికల్లోనూ పార్టీకి 40సీట్లకు మించి రాలేదని, ఈ సారి 50 వస్తాయని ఏవిధంగా చెబుతున్నారని అడిగింది. ఎల్‌డిఎఫ్‌ కేవలం అభివృద్ధి నినాదంతో ముందుకు పోతుంటే దానికి ధీటుగా పార్టీ సమాధానం లేదని పేర్కొన్నట్లు వెల్లడైంది.ఫిరాయింపుల నిరోధక చట్టం వేటును తప్పించుకొనేందుకు నామినేషన్లు దాఖలు చేసే ముందు జోసెఫ్‌ వర్గానికి చెందిన ఎంఎల్‌ఏలు పిజె జోసెఫ్‌, మనోజ్‌ జోసెఫ్‌ ఎంఎల్‌ఏలుగా రాజీనామా చేశారు.

శబరిమల వివాదాన్ని ముందుకు తెచ్చే యత్నం !


ప్రస్తుతం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్న శబరిమల అయ్యప్ప దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ సమస్యపై లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి రెండూ ప్రయత్నిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే శబరిమల సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాన్నే తీసుకువస్తామని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఆ సమస్య ప్రస్తావనే లేకుండా అంతకు ముందు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రణాళికను వెల్లడించింది. ” మతశక్తులను ప్రతిఘటించేందుకు,ఓడించేందుకు దైవం పట్ల విశ్వాసం ఉన్నవారు కూడా ఒక ఐక్య సంఘటనగా ముందుకు రావాలి. అన్ని మతాల విశ్వాసుల నమ్మకాలను రక్షించేందుకు వామపక్ష ప్రజాతంత్ర సంఘటన అన్ని చర్యలూ తీసుకుంటుంది.ఏ మతం పట్ల విశ్వాసం లేని వారు కూడా ప్రశాంతంగా జీవించేందుకు వీలుకల్పిస్తుంది. ” అని పేర్కొన్నది. తమ ప్రభుత్వం పట్ల విశ్వాసులు ఎలాంటి సందేహాలను పెట్టుకోనవసరం లేదని, శబరిమల అంశంపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత దాని అమలు గురించి అందరితో చర్చించిన తరువాతే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదే పదే ప్రభుత్వ, సిపిఎం వైఖరినీ స్పష్టం చేస్తున్నారు. సమస్య సుప్రీం కోర్టులో ఉన్నందున ఈ అంశం అసలు చర్చనీయాంశమే కాదన్నారు. ఇది రాస్తున్న సమయానికి బిజెపి ఎన్నికల ప్రణాళిక ఇంకా విడుదల కాలేదు. అయితే దాని అజెండా బహిరంగమే కనుక శబరిమల అంశం లేకుండా ఉండదన్నది స్పష్టం. బిజెపికి మద్దతు ఇస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ శబరిమల అంశాన్ని ఎన్నికల్లో ముందుకు తెచ్చే యత్నాల్లో భాగంగా రాజధాని తిరువనంతపురంలో నామజపం పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. 2018లో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత కూడా నామజపం పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో బిజెపి, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు హింసాకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సంవత్సరం జరిగిన ఉదంతాలు తనతో సహా అందరినీ బాధించాయని, జరిగి ఉండాల్సింది కాదని దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన వ్యాఖ్యలను రచ్చ చేసి రాజకీయ లబ్ది పొందాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక శక్తులు చూస్తున్నాయి. సంక్షేమ-అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రానున్న ఐదు సంవత్సరాలలో అమలు జరపనున్న కార్యక్రమాలతో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది.

ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం !


కమ్యూనిస్టులను రెచ్చగొట్టటం, ప్రతిఘటిస్తే తమపై దాడులు చేశారంటూ యాగీ చేయటం కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ఎత్తుగడల్లో భాగం అన్నది విమర్శ. దాన్ని ఈ ఎన్నికల్లో కూడా అమలు జరిపేందుకు పూనుకున్నారు. తిరువాన్కూర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేయటానికి తిరస్కరించిన సిపి రామస్వామి అయ్యర్‌ చర్యకు నిరసనగా జరిగిన పోరు పున్నప్ర-వయలార్‌ పోరాటంగా ప్రసిద్ది పొందిన విషయం తెలిసిందే. నైజాం సంస్ధానంలో దోపిడీ నుంచి విముక్తికోసం కమ్యూనిస్టు పార్టీ పోరాడితే అదే సమయంలో కేరళలో 1946లో సంస్దాన విలీనం కోసం కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన పోరులో వెయ్యిమందికి పైగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, సామాన్య జనం మరణించారు.కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అలప్పూజలో ఒక స్మారక కేంద్రాన్ని నిర్మించారు. దాన్ని సిపిఎం-సిపిఐ రెండూ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా అలప్పూజ బిజెపి అభ్యర్ధి సందీప్‌ వాచస్పతి అక్కడికి వెళ్లి అంజలి ఘటించారు. కమ్యూనిస్టు అమరజీవులను గౌరవిస్తూ ఎవరైనా ఆపని చేస్తే అభ్యంతరం లేదు. కానీ భారతమాతాకి జై అనే నినాదాలతో కమ్యూనిస్టుల నాయకత్వాన పోరు పేరుతో అమాయక దళితుల, వెనుకబడిన తరగతుల వారి ప్రాణాలను బలిపెట్టారని, కమ్యూనిస్టునేతలు పారిపోయి అతి పెద్ద ద్రోహం చేశారంటూ చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టులను రెచ్చగొట్టేందుకు తప్ప మరొకందుకు కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. బిజెపి కుట్రను గ్రహించిన కార్యకర్తలు ఎంతో సంయమనం పాటించారని అభినందించారు. ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి మనోభావాలను బిజెపి గాయపరచిందని అన్నారు. స్మారక కేంద్రంలోకి అక్రమంగా చొరబడ్డారని సిపిఎం విమర్శించగా, సిపిఐ జిల్లా కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజెపి అభ్యర్ధి చర్యకు నిరసనగా సిపిఎం కార్యకర్తలు ప్రదర్శన జరుపుతుండగా వారిని రెచ్చగొట్టేందుకు పక్కనే ఉన్న మరొక నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్ది అనూప్‌ అంటోని పనిగట్టుకొని ప్రదర్శనవైపు రాగా కార్యకర్తలు కారును అడ్డుకున్నారు. దాన్ని తనపై దాడిగా చిత్రిస్తూ ఆసుపత్రిలో చేరటం వంటి నాటకానికి తెరలేపారని విమర్శలు వచ్చాయి. ఆంటోని కారు బానెట్‌ను కొందరు కొట్టారు తప్ప అతని మీద భౌతికదాడి జరగలేదని పోలీసులు ప్రకటించారు.

పినరయి విజయన్‌ ప్రచార తీరే వేరు !


ఎన్నికలలో పినరయి విజయన్‌ ప్రచార తీరు ఎందరినో ఆకర్షిస్తున్నది. రాజకీయంగా వ్యతిరేకించే మీడియా కూడా దాన్ని గుర్తించింది. విజయన్‌ కొన్ని సెకండ్ల పాటు ఒక సారి తన చేతి వాచ్‌ను చూశారంటే కార్యక్రమం ప్రారంభం లేదా ముగిసినట్లే లెక్క. పత్రికా గోష్టి అయినా, మరొక కార్యక్రమం అయినా నిర్ణీత ప్రకారం ముగియాల్సిందే.ప్రారంభం కూడా అంతే. పత్రికా గోష్టికి 45నిమిషాలు,దానిలో ప్రశ్నలు, సమాధానాలకు పదిహేను నిమిషాలు, ఎన్నికల ప్రసంగం 45నిమిషాల్లో ముగియాల్సిందే. నలభైమూడు నిమిషాలు అభివృద్ధి, ఇతర అంశాలను మాట్లాడిన తరువాత చివరి రెండు నిమిషాల్లో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులకు ఓటు ఎందుకు వేయాలో అభ్యర్ధిస్తారు. విజయన్‌ ప్రాంగణంలోకి రాగానే నినాదాలు, ఈలలు మోతలతో హౌరెత్తుతుంది. వేదిక మీదకు వస్తుండా అప్పటికే ఉన్న నేతలు గౌరవ సూచకంగా లేచి నిలుచుంటారు. వెంటనే ఒక చిన్న పాప వచ్చి గులాబి పువ్వు అంద చేసిన తరువాత పిడికిలి బిగించి అభివాదం చేస్తుంది. ముళ్లు ఏవైనా ఉంటే గుచ్చుకోకుండా విజయన్‌ దాన్ని జాగ్రత్తగా స్వీకరిస్తారు. విజయన్‌కు ప్రత్యేకంగా ఒక మైక్‌ను అమరుస్తారు, దాన్నే తరువాత సభలకూ తీసుకువెళతారు. సభికులు ఎంతో క్రమశిక్షణగా కూర్చుని వుపన్యాసాలను వింటారు. అనేక అంశాలపై కాంగ్రెస్‌ నేతలు ఉదయం ఒక విషయం చెబితే సాయంత్రం బిజెపి నేతలు వాటినే చెబుతారు. బిజెపి నేతలు ఉదయం చెప్పిన వాటిని కాంగ్రెస్‌ నేతలు సాయంత్రం చెబుతారు, రెండు పార్టీలు పరస్పరం ఈ విధంగా సహకరించుకుంటున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రెండు పార్టీల తీరుతెన్నులను వర్ణించారు.

మూడు చోట్ల బిజెపికి నామినేషన్ల ఎదురుదెబ్బ !


మూడు నియోజకవర్గాలలో బిజెపికి నామినేషన్ల సమయంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక తలసెరి, గురువాయూర్‌, దేవీకుళంలో సరిగా లేని కారణంగా నామినేషన్లను తిరస్కరించారు. మూడు చోట్లా డమ్మీ అభ్యర్దులు లేకపోవటం లేదా వారి నామినేషన్లు కూడా చెల్లలేదు. ఈ పరిణామంపై పార్టీ కేంద్ర నేతలకు ఏ కారణం చెప్పాలా అని తలలు పట్టుకుంటున్నారు. కన్నూరు జిల్లాలో గత ఎన్నికల్లో తలసెరిలో 22వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి ఈనెల 25న అక్కడ అమిత్‌ షా సభ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు అసలు అభ్యర్దే లేకపోవటంతో ఏమి చెయ్యాలో తోచని స్ధితిలో పడ్డారు.తలసెరి నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలుత సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన విఆర్‌ కృష్ణయ్యర్‌ సిపిఐ తరఫున 1957, 1960లో గెలిచారు. అప్పటి నుంచి మధ్యలో ఒకసారి సిపిఐ అభ్యర్ధి తప్ప ఇంతవరకు సిపిఎం నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారి మాజీ ముఖ్యమంత్రి ఇకె నయనార్‌, ఐదుసార్లు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియర్‌ బాలకృష్ణన్‌ ప్రాతినిధ్యం వహించారు. మిగతా అన్ని నియోజకవర్గాలలో సక్రమంగా నామినేషన్లు వేసిన బిజెపి తలసెరీలో తప్పులతడగా వేయటం వెనుక కాంగ్రెస్‌తో కుమ్మక్కును వెల్లడిస్తున్నదని సిపిఎం కన్నూరు జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ చెప్పారు. దేవీకుళంలో బిజెపి మిత్రపక్షమైన అన్నాడిఎంకెకు సీటు ఇవ్వగా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దాంతో అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్ధిని బలపరచాలని బిజెపి నిర్ణయించింది. తలసెరి, గురువాయూర్‌ సీట్ల గురించి హైకోర్టుకు ఎక్కింది.

ప్రత్యర్ధుల వలలో పడవద్దు -సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఎల్‌డిఎఫ్‌ సూచన !


ప్రత్యర్ధి పార్టీలు, వ్యక్తులు రెచ్చగొట్టేందుకు పూనుకుంటారని అందువలన వారికి సమాధానం ఇచ్చే పేరుతో వారి వలలో చిక్కుకోవద్దని ఎల్‌డిఎఫ్‌ తన సామాజిక మాధ్యమ కార్యకర్తలకు సూచింది. ప్రత్యర్ధులపై దూషణలకు పాల్పడవద్దని, అసలు వారి గురించి పట్టించుకోవద్దని, ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయాలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలను గుళికలుగా విడగొట్టి సులభంగా, వెంటనే చదువుకొనే విధంగా తయారు చేసి ప్రచారం చేయాలని పేర్కొన్నది. కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ నీమమ్‌ నియోజకవర్గంలో పోటీ చేయకుండా పుతపల్లికే పరిమితం కావాలని కొందరు కార్యకర్తలు ఆయన ఇంటి మీదకు ఎక్కి కిందికి దూకుతామని బెదిరించిన విషయం తెలిసిందే. దాని మీద ఊమెన్‌ చాందీ ఇంటి మీది పెంకులను మరమ్మతు చేసేందుకు యుడిఎఫ్‌ ప్రయత్నిస్తున్నదంటూ ఎద్దేవా చేస్తూ పెట్టిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాని ఎల్‌డిఎఫ్‌ కోరింది. అలాగే పున్నప్ర-వయలార్‌ కమ్యూనిస్టు అమరజీవుల స్మారకకేంద్రంలో ప్రవేశించిన బిజెపి అభ్యర్ధి జనం, కార్యకర్తల మనోభావాలను గాయపరచినప్పటికీ అతగాడిని తూలనాడుతూ కొందరు పోస్టులు పెట్టటం మంచిది కాదని, ప్రత్యర్ధుల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించింది.

మైనారిటీ మతాల సంతుష్టీకరణ పనిలో బిజెపి !


మైనారిటీ మతాల వారికి పూర్తి మద్దతు ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ చెప్పారు. జాకోబిన్‌ చర్చి వివాదంలో ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేమని, దగ్గరిదారులు లేవని అయితే ఆర్దోడాక్స్‌ వర్గానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ముస్లింలీగు, బిజెపి కుమ్మక్కయిన మాట నిజమే అని సీనియర్‌ నేత ఓ రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు బిజెపిని ఇరకాటంలో పడవేశాయి. ఆయనను విమర్శించలేని-సమర్ధించలేని స్దితిలో పడిపోయారు. తాను మాట్లాడే మాటలు వాటి విలువ ఏమిటో ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో రాజగోపాల్‌ తెలుసుకోవటం లేదని బిజెపి సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ వినియోగించటాన్ని ముకుందన్‌ తప్పుపట్టారు. సురేంద్రన్‌ ఇంకా ప్రజానాయకుడిగా ఎదగలేదు. హెలికాప్టర్‌ వినియోగాన్ని కార్యకర్తలు మెచ్చరు అన్నారు.