Tags
#" Red " Tsunami in Malabar, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala LDF, Kerala UDF
ఎం కోటేశ్వరరావు
మలబార్ అంటే తెలుగు ప్రాంతాలలోని పెద్ద తరాలకు గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టుల అణచివేతకు వచ్చిన నాటి కాంగ్రెస్ పాలకులు పంపిన రిజర్వు పోలీసులే. అది గత చరిత్ర . ఇప్పుడు మలబార్‌లోని నాలుగు జిల్లాలైన కాసరగోడ్, కన్నూరు,వైనాడ్,కోజికోడ్ జిల్లాలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎర్ర సునామీతో కాంగ్రెస్ కొట్టుకుపోనుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ జిల్లాల్లో 27 సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌కు, కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 4, బిజెపికి ఒకటి దక్కనుందని కేరళలోని అగ్రశ్రేణి మీడియా సంస్ద మళయాల మనోరమ-విఎంఆర్ సర్వే పేర్కొన్నది. నాలుగు భాగాల సర్వేలో తొలి విడత వివరాలను ఆదివారం రాత్రి నుంచి వెల్లడించటం ప్రారంభించింది. ఫిబ్రవరి 15 మార్చి 15 మధ్య సేకరించిన అభిప్రాయాల మేరకు తమ విశ్లేషణ ఉన్నదని తెలిపింది. కోజికోడ్, వైనాడ్ జిల్లాల్లో అన్ని సీట్లు ఎల్‌డిఎఫ్‌కు రానున్నాయని, యుడిఎఫ్ అనేక సిట్టింగ్ సీట్లను కోల్పోనున్నదని పేర్కొన్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్న మంజేశ్వరం ఆ పార్టీకి దక్కనున్నదని తెలిపింది. ప్రస్తుతం అక్కడ ముస్లింలీగు ప్రాతినిధ్యం వహిస్తోంది. మలబార్ అంటే మళయాలీలు నివసించే కొండ ప్రాంతమని అర్దం.బ్రిటీష్ వారి పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆ ప్రాంతాన్ని మలబార్ జిల్లాగా ఏర్పాటు చేశారు. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కోస్తా ఆంధ్ర జిల్లాలో దానికి మద్దతుగా నిలిచిన కమ్యూనిస్టులను అణచివేసేందుకు నాటి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం ఆ జిల్లా కేంద్రంగా ఉన్న ప్రత్యేక పోలీసు దళాన్ని ఆంధ్ర ప్రాంతానికి రప్పించి దాడులను చేయించింది, వందలాది మందిని హతమార్చింది. పాత తరాలు నేటికీ వాటి దమనకాండను తలుచుకుంటాయి.
ఎల్‌డిఎఫ్‌కు సిపిఎం నేత ఎంఎ బేబీ హెచ్చరిక !
ప్రజలు ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తున్నమాట నిజం. ఇప్పుడు వెలువడుతున్న అనుకూలమైన సర్వేలు మనలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఇంకేముంది విజయం దక్కినట్లే అని అతివిశ్వాసానికి పోయి కార్యకర్తలు పాలుమాలుతారేమో అన్న ఆందోళన కలుగుతోంది, అలాంటి వైఖరి ఉండవద్దు అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ కార్యకర్తలను హెచ్చరించారు.
ప్రతిపక్ష స్ధానం కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే పోటీ !
ఎన్నికల సర్వేల పట్ల తమకు విశ్వాసం లేదని అయినా అన్ని సర్వేలు ఎల్‌డిఎఫ్ గెలవనున్నట్లు చెబుతున్నాయని తామైతే ఏ సర్వే నివేదిక కోసమూ ఎదురు చూడటం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కె.సుధాకరన్ సైతం రాష్ట్రంలో వామపక్ష పాలన కొనసాగుతుందని జోశ్యం చెప్పారని గుర్తు చేశారు. సర్వేలను చూసి కాంగ్రెస్ కళవళ పడుతున్నదని, వచ్చే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎవరుండాలో తేల్చుకొనేందుకు వివాద పడుతున్నారని చమత్కరించారు.
మీడియా సర్వేలతో కాంగ్రెస్ గగ్గోలు !
కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల నిత్యం ప్రభుత్వం మీద ఏదో ఒక బట్టకాల్చివేయటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా దొంగ ఓట్లను చేర్చించారనే ఆరోపణలు ప్రారంభించారు. తాజాగా మీడియా సంస్దల మీద అక్కసు వెళ్ల గక్కుతున్నారు. సర్వేల పేరుతో ఎల్‌డిఎఫ్ గెలవనుంది అంటూ యుడిఎఫ్ ఓటమికి మీడియా పని చేస్తున్నదని ధ్వజమెత్తారు. నిజానికి అదే మీడియా సహకారం, ప్రోత్సాహంతో స్ధానిక సంస్దల ఎన్నికలకు ముందు ఎల్‌డిఎఫ్‌పై ఎంత విష ప్రచారం చేశారో, దాన్ని ఓటర్లు ఎలా తిప్పికొట్టారో తెలిసిందే. తటస్ధం, పక్షపాతరహితంగా కనిపించే మీడియా అల్పబుద్దితో వ్యవహరిస్తోందని రమేష్ చెన్నితల ఆరోపించారు. తమను సిపిఎమ్మే నాశనం చేయలేకపోయిందని, మీడియా సర్వేలు కూడా ఆపని చేయలేవన్నారు. బెదిరింపులు, వాణిజ్య ప్రకటనలతో సిపిఎం మీడియాను బెదిరిస్తోందన్నారు. మీడియా సర్వేలను నిలిపివేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు చెన్నితల సోమవారం నాడు ఒక ఫిర్యాదును అందచేశారు. స్వేచ్చ, న్యాయంగా జరగాల్సిన ఎన్నికలను దెబ్బతీసేందుకు సర్వేలను వెల్లడిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలలో కీలకమైన తరుణంలో ఇలాంటి సర్వేల ద్వారా ఓటర్లను గందరగోళపరుస్తున్నారని, తప్పుడు సమాచారంతో తీవ్రంగా ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఓట్లమ్ముకొనే కాంగ్రెస్ నేతలు !
2016 ఎన్నికల్లో కాంగ్రెస్ నీమమ్ నియోజకవర్గంలో బిజెపికి ఓట్లను అమ్ముకున్నదని ఆ ఎన్నికల్లో యుడిఎఫ్ అభ్యర్ధిగా పోటీ చేసిన జెడి(యు) నేత వి. సురేంద్రన్ పిళ్లే చెప్పారు. తాను 1984 నుంచి యుడిఎఫ్‌ను గమనిస్తున్నానని కొన్ని సీట్ల కోసం యుడిఎఫ్ కొందరిని బలపశువులుగా వాడుకున్నదని వారిలో తానొకరినని చెప్పారు.భాగస్వామ్య పక్షాలకు సీట్లు కేటాయిస్తామని యుడిఎఫ్ చెబుతుందని అక్కడ ఓట్లను అమ్ముకుంటుందని అన్నారు. నీమమ్‌లో గతసారి గెలిచిన బిజెపి ఓ రాజగోపాల్ స్వయంగా ఈ అంశాలను చెప్పారన్నారు. ప్రస్తుతం అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ది కూడా దీన్ని గమనించాలని, ఆయనకు అన్నీ తెలుసు అన్నారు. ఓట్ల అమ్మకం వెనుక ఉన్న కొందరు నేతల గురించి తెలుసునని, త్రిముఖ పోటీలో సిపిఎంకు అవకాశాలు ఉన్నాయన్నారు.
మాకు గనుక అప్పుడు తెలివి ఉంటేనా…… అంటున్న కాంగ్రెస్ ఎంపీ !
కరోనా నిబంధనల కారణంగా లాక్‌డౌన్ సమయంలో తమ కార్యకర్తలు ప్రేక్షకులుగా మిగిలిపోయారని , కానీ డివైఎఫ్‌ఐ కార్యకర్తలు తెలివి తేటలతో కరోనా సమయంలో చురుకుగా ఉన్నారని కన్నూరు కాంగ్రెస్ ఎంపీ కె.సుధాకరన్ అన్నారు. సిపిఎం తన కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి ఆహారకిట్లు, పెన్షన్లు, ఔషధాలను అందించిందని, ఈ కార్యక్రమాల్లో డివైఎఫ్‌ఐ చురుకుగా ఉన్నదని, పౌరులకు సాయం చేసిందని అన్నారు.మహిళల పట్ల చిన్న చూపినందుకు నిరసగా, ముఠా తగాదాలతో విసిగిపోయి నందున కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు, ఏఐసిసి సభ్యురాలు కె సి రోజా కుట్టి ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా పార్టీలో పని చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
హైకోర్టులో బిజెపికి ఎదురు దెబ్బ ! అధికారానికొస్తే లవ్ జీహాద్ బిల్లు తెస్తారట !
తెలిచేరి, గురువాయూర్ నియోజకవర్గాలలో నామినేషన్ల తిరస్కరణకు గురైన ఉదంతంలో బిజెపికి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున రిటర్నింగ్ అధికారుల నిర్ణయాన్ని మార్చలేమని సోమవారం నాడు కోర్టు పేర్కొన్నది. మరో ఉదంతంలో ఒక నియోజకవర్గంలో సిపిఎం బలపరుస్తున్న ఒక అభ్యర్ధి సులేమాన్ హాజీ దుబారులోని తన రెండవ భార్య గురించి వివరాలు పేర్కొనలేదుకనుక నామినేషన్ అంగీకరించరాదన్న అభ్యంతరాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. న్యాయనిపుణుల సలహా తీసుకొన్న తరువాత నిలిపివేసిన నామినేషన్ చెల్లుబాటు అవుతుందని ప్రకటించారు.
తాము అధికారానికి వస్తే కేరళలో లవ్ జీహాద్ బిల్లు తీసుకువస్తామని బిజెపి కేంద్రమంత్రి డివి సదానంద గౌడ చెప్పారు. తిరువనంతపురంలో సోమవారం నాడు ఎల్‌డిఎఫ్‌పై ఆరోపణల పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ విషయాలన్నింటినీ తమ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని చెప్పారు.క్రైస్తవ మత పెద్దలను సంతుష్టీకరించి వారి మద్దతు పొందేందుకు బిజెపి నేత ఈ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. కేరళలో క్రైస్తవ యువతులను లక్ష్యంగా చేసుకొని లవ్ జీహాద్ జరుగుతోందని గత ఏడాది సిరియన్-మలబార్ చర్చి పెద్దలు చేసిన ఆరోపణలను సదానంద గౌడ ప్రస్తావించటమే దీనికి నిదర్శనం. ముస్లింలు – క్రైస్తవుల మధ్య తంపులు పెట్టి క్రైస్తవ ఓటర్లను ఆకర్షించాలన్నది బిజెపి ఎత్తుగడ. ఇప్పటికే జాకోబిన్ చర్చి వివాదంలో తలదూర్చి ఒక వర్గాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుంది. కర్ణాటకకు చెందిన బిజెపినేతల సారధ్యంలో కేరళ బిజెపి నేతలు ఇటీవల అనేక మంది బిషప్పులను కలసి మద్దతు ఇమ్మని కోరిన విషయం బహిరంగమే. కొందరు క్రైస్తవ పెద్దలు బిజెపికి మద్దతు ప్రకటించారు కూడా !
బిసిలకు కాంగ్రెస్ మొండిచేయి-రెట్టింపు సీట్లిచ్చిన సిపిఎం !
కల్లుగీత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకుంటారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు చేసిన కులపరమైన దూషణ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ వెనుకబడిన తరగతులకు మొండి చేయి చూపిందని అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణలో మీడియా పేర్కొన్నది.వెనుకబడిన తరగతులలో ఎజవాలకు 28, ఇతర వెనుకబడిన తరగతులకు 18 మొత్తంగా 46 సీట్లను ఎల్‌డిఎఫ్ కేటాయించింది. అదే యుడిఎఫ్ 14ఎజవా, 12 ఇతర వెనుకబడిన తరగతులకు కేటాయించింది. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి 55 స్దానాలలో ఎజవాలకు 43, ఇతర వెనుకబడిన తరగతులకు 12 కేటాయించింది. కేరళ కౌముది పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం వివిధ సామాజిక తరగతులకు మూడు ఫ్రంట్‌లు కేటాయించిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్రంట్ ×× బిసి ×× నాయర్లు×× ముస్లిం×× క్రైస్తవ
ఎల్‌డిఎఫ్ ×× 46 ×× 28 ×× 29 ×× 21
యుడిఎఫ్ ×× 26 ×× 28 ×× 39 ×× 28
ఎన్‌డిఏ ××× 55 ×× 45 ×× 3 ×× 6
యుడిఎఫ్‌లో ముస్లింలకు కేటాయించిన 39లో ముస్లిం లీగుకు చెందిన వారు 26, కాంగ్రెస్ 12, ఎల్‌డిఎఫ్‌లోని 29 మందిలో సిపిఎం నుంచి 21 మంది ఉన్నారు. నాయర్లలో కాంగ్రెస్ 28, సిపిఎం 15, బిజెపి 44 మంది ఉన్నారు. బిజెపిని నాయర్ సర్వీస్ సొసైటీ బలపరుస్తున్న విషయం తెలిసిందే.ఈ కారణంగానే గణనీయ సంఖ్యలో ఆ సామాజిక తరగతికి పెద్దపీట వేశారు. క్రైస్తవుల నుంచి కాంగ్రెస్ 18, సిపిఎం నుంచి 8 మంది ఉన్నారు.ఎల్‌డిఎఫ్ భాగస్వామ్యపక్షమైన కేరళ కాంగ్రెస్ పది స్ధానాలను కేటాయించింది.