Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసి ప్రచారం పర్వం వేడెక్కుతున్నది. రాజకీయ వేడి రాజుకుంటున్నది. ఒక దఫా సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌, మరోదఫా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారంలోకి రావటంగా ఉన్న రాజకీయ ఆనవాయితీకి తొలిసారిగా ఈ సారి తెరపడనున్నది. ఈ నేపధ్యంలో దీన్ని సహించలేని హిందూత్వ, క్రైస్తవ మత శక్తులు మరోసారి తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ముందుకు తెస్తున్నాయి. ఓటర్లను రెచ్చగొడుతున్నాయి. శబరిమల దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉండటంతో ఎవరైనా దాన్ని ప్రచార అంశంగా ముందుకు తెస్తే సమస్యలను ఎదుర్కొంటారు. వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారం చేపట్టనున్నదంటూ ఇప్పటి వరకు జరిగిన పదహారు సర్వేలలో ఒకటి మాత్రమే ఏ కూటమికీ మెజారిటీ దక్కదని చెప్పగా మిగిలిన వన్నీ ఎల్‌డిఎఫ్‌కు మెజారిటీ సీట్లు రానున్నట్లు పేర్కొన్నాయి. వీటిలో మొదటిది గత ఏడాది జూలైలో జరగ్గా మిగిలినవన్నీ ఈ ఏడాదిలోనే జరిగాయి. మొత్తం 140 సీట్లకు గాను అధికారం దక్కాలంటే 71 స్దానాలు తెచ్చుకోవాలి. పదహారు సర్వేల సగటు ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు కనిష్టంగా 76.3 సీట్లు గరిష్ట సగటు 82 రానున్నాయి. మెజారిటీలలో కనిష్టంగా 72 కాగా గరిష్టంగా 91 ఉన్నాయి. బిజెపి కూటమికి రెండు సర్వేలు 3-7 మధ్య వస్తాయని పేర్కొనగా మిగిలినవన్నీ ఒకటి రెండుగా తెలిపాయి.ఒక సర్వే మూడు వస్తాయని పేర్కొన్నది. గతేడాది చివరిలో జరిగిన స్ధానిక సంస్ధలలో పార్టీలకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఎల్‌డిఎఫ్‌కు 101 వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వెలువడింది. హంగ్‌ అని పేర్కొన్న సర్వే కూడా 68-78 మధ్య వస్తాయని పేర్కొన్నది.


ఈ ఎన్నికలలో 140 స్ధానాలకు గాను మొత్తం 957 మంది పోటీలో ఉన్నారు. ఫ్రంట్‌లు, పార్టీల వారీగా పోటీ చేస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌)లో పది పార్టీలున్నాయి. సిపిఐ(ఎం) మరియు అది బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధులు 86, సిపిఐ 25, కేరళ కాంగ్రెస్‌(ఎం) 12, జనతాదళ్‌ (సెక్యులర్‌) 4, ఎన్‌సిపి 3, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ 3, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ 3, కాంగ్రెస్‌(సెక్యులర్‌) 1, కాంగ్రెస్‌(బి) 1, జనాధిపత్య కేరళ కాంగ్రెస్‌ 1. యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(యుడిఎఫ్‌)లో ఎనిమిది పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్‌ 93,ముస్లిం లీగు 27, కేరళ కాంగ్రెస్‌ 10, ఆర్‌ఎస్‌పి 5, నేషనలిస్టు కాంగ్రెస్‌(కేరళ) 2, కేరళ కాంగ్రెస్‌(జాకబ్‌) 1,సిఎంపి 1,ఆర్‌ఎంపిఐ 1. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఏ) బిజెపి 115, భారత ధర్మ జనసేన 21, అన్నాడిఎంకె 2, కామరాజ్‌ కాంగ్రెస్‌ 1, జనాధిపత్య రాష్ట్రీయ సభ 1, డెమోక్రటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ 1. ఈ కూటమిలో కామరాజ్‌ కాంగ్రెస్‌, జనాధిపత్య రాష్ట్రీయ పార్టీలు రెండూ బిజెపి గుర్తుమీదే పోటీ చేస్తున్నాయి.


శబరిమలై వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన నాయర్‌ సర్వీసు సొసైటీ(ఎఎస్‌ఎస్‌) ఒక వైపు నుంచి మరో వైపు నుంచి లాటిన్‌ కాథలిక్‌ చర్చి పెద్దలు ఎన్నికల్లో తామేంటో చూపుతామంటూ ఎల్‌డిఎఫ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శబరిమల వివాదం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్నప్పటికీ హిందూత్వశక్తులు దాన్ని ఏదో ఒక రూపంలో ఎన్నికల అంశంగా చేసేందుకు పూనుకున్నాయి. విజయన్‌ ప్రభుత్వం జాలర్లకు హాని చేసేందుకు ప్రయత్నించిందంటూ వ్యతిరేకంగా ఓటు వేయాలన్న సందేశాలను చర్చి నేతలు ఇచ్చారు. ఈ సంస్దల యత్నాలు ఫలించబోవనే ధీమా ఎల్‌డిఎఫ్‌లో వ్యక్తమైంది. క్రైస్తవులు ప్రధానశక్తిగా ఉన్న కేరళ కాంగ్రెస్‌(ఎం) ఈ సారి ఎల్‌డిఎఫ్‌లో చేరటం మతశక్తులకు మింగుడు పడటం లేదు. మరోవైపు కొందరు బిజెపికి మద్దతు ఇస్తుండటంతో సామాన్య క్రైస్తవులలో మతాధికారులు ఇచ్చే పిలుపులకు పెద్దగా స్పందన కానరావటం లేదు. క్రైస్తవులు గణనీయంగా ఉన్న ప్రాంతాలలో సర్వేలు ఎల్‌డిఎఫ్‌ మెజారిటీనే సూచిస్తున్నాయి.


ఏకె ఆంటోని ముఖ్యమంత్రి విజయన్‌ పాద సేవ చేయాలి !


ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీద విరుచుకుపడుతున్న మాజీ ముఖ్యమంత్రి ఏకె ఆంటోని కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని సిపిఎం నేత, మంత్రి ఎంఎం మణి ప్రశ్నించారు. కరోనా సమయంలో గనుక కాంగ్రెసే అధికారంలో ఉంటే ఎందరో పౌరులు మరణించి ఉండేవారని అన్నారు. తమ స్వంత ప్రభుత్వాలను దెబ్బతీస్తున్నా బిజెపి గురించి నోరెత్తని ఆంటోనికి వామపక్ష ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. కరోనా సమయంలో కనిపించని ఆంటోని ముఖ్యమంత్రికి పాదసేవ చేయాలన్నారు. ఏ పార్టీకి ఎందరు నాయర్లను కేటాయించాలనే పంపిణీ హక్కులు ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమార్‌ నాయర్‌కు లేదని, ఆయన వాంఛలకు అనుగుణ్యంగా కొంత మంది ఓటు వేయవచ్చుగానీ మెజారిటీ నాయర్లు ఎల్‌డిఎఫ్‌ మద్దతుదార్లుగా ఉన్నారన్నారు.


బిజెపి ఓట్లు కావాలంటున్న చెన్నితల – వద్దు అంటున్న మరో కాంగ్రెస్‌ నేత !


బిజెపితో సహా తాము ఎవరి ఓట్లనూ వద్దు అనటం లేదని కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల ప్రకటించగా తమకు బిజెపి ఓట్లు అవసరం లేదని యుడిఎఫ్‌ కన్వీనర్‌, కాంగ్రెస్‌ నేత ఎంఎం హసన్‌ చెప్పారు. కన్నూరు జిల్లా తలసెరిలో గానీ మరోచోట గాని తమకు బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ఓట్లు అవసరం లేదని పదే పదే చెప్పామని, వెల్ఫేర్‌ పార్టీ(ముస్లిం మతతత్వ)తో ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ఎన్నికల జాబితా గురించి ఆరోపణలను కొనసాగిస్తున్న రమేష్‌ చెన్నితల తాజాగా మరొక చౌకబారు ఆరోపణను ఇసికి ఫిర్యాదుగా పంపారు. ఓటు వేసిన తరువాత వేలు మీద వేసే సిరాగుర్తును చెరిపివేసే రసాయనాలను అధికారపక్షం పంపిణీ చేసిందన్నది దాని సారం. ఆరోపణకు ఆధారాలు చూపాలని ఎన్నికల సంఘం కోరగా కొన్ని కేంద్రాల నుంచి తనకు ఫిర్యాదులందాయని చెన్నితల చెప్పారు. పలుచోట్ల దొంగ ఓట్లు చేర్పించారని సిపిఎం మీద రమేష్‌ చెన్నితల చేస్తున్న ఆరోపణలు ఆయనకే ఎదురు తగులుతున్నాయి. పెరుంబవూరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ఎల్దోస్‌ కున్నపల్లి, ఆయన భార్య మరియమ్మకు రెండేసి చోట్ల ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. కైపమంగళం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి సుబిన్‌కు మూడు చోట్ల ఓట్లు, గుర్తింపు కార్డులు ఉన్నట్లు బయటపెట్టిన సిపిఎం కార్యకర్తలు ఇప్పుడు ఎంఎల్‌ఎ, ఆయన భార్యకు రెండు చోట్ల ఉండటం గురించి ఏమి చెబుతారంటూ దీన్ని ఒక ప్రచార అంశంగా ముందుకు తెచ్చారు. రమేష్‌ చెన్నితల ఒక మహిళకు ఐదు చోట్ల ఓట్లు ఉండటాన్ని ఉదాహరణగా మీడియా ముందు చెప్పారు. అయితే సదరు మహిళ తాను కాంగ్రెస్‌ కార్యకర్తను అని చెప్పటంతో చెన్నితల నోట్లో వెలక్కాయపడింది.

ఇడిపై కేసు గురించి కేంద్ర బిజెపి మంత్రి గగ్గోలు !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఇతర ఎల్‌డిఎఫ్‌ నేతలను దొంగబంగారం కేసులో ఇరికించేందుకు నిందితులను బెదిరించి తప్పుడు ప్రకటనలు చేయించిన కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దానినే కోర్టుకు అఫిడవిట్‌గా సమర్పించి ఎన్నికల్లో దెబ్బతీసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు తనచేత బలవంతంగా ప్రకటన చేయించారని, ఇడి అధికారుల నుంచి ప్రాణహాని ఉందంటూ రాసిన లేఖ బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో తప్పుడు కేసు పెట్టిన ఇడి అధికారులపై కేరళ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దాన్ని ఎత్తివేయాలని ఇడి చేసిన వినతిని హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉదంతంపై విచారణ న్యాయవిచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇడిపై విచారణ కమిషన్‌ ఏర్పాటు, కేసు పెట్టటం ఏమిటంటూ కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ గగ్గోలు పెట్టారు. ఇది దేశంలో ఒక వింత అన్నారు.


దొంగబంగారం కేసులో నిందితురాలైన స్వప్న సురేష్‌ను ఇడి అధికారులు బెదిరించి వాంగ్మూలం తీసుకోవటాన్ని తాము విన్నామని ఆమెకు రక్షణగా ఉన్న ఇద్దరు కేరళ మహిళా పోలీసులు ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతంపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు నిర్ణయించింది. స్వప్న సురేష్‌కు రక్షణగా ఉన్న ఒక మహిళా పోలీసు అధికారి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయించాలని పోలీసులు నిర్ణయించారని వార్తలు వచ్చాయి. గతేడాది ఆగస్టు 12,13 తేదీలలో విధి నిర్వహణలో భాగంగా తాను స్వప్న వద్ద ఉన్నపుడు ఇడి అధికారులు ఆమెను బెదిరించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాంగ్మూలాన్ని నమోదు చేయటాన్ని తాను విన్నానని ఆ పోలీసు అధికారిణి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచారు. దాన్నే ఒక న్యాయమూర్తి ముందు నమోదు చేయాలని క్రైమ్‌ బ్రాంచికి న్యాయ విభాగం సలహా ఇచ్చింది.తమకు వ్యతిరేకంగా పోలీసు అదికారిణి ఫిర్యాదు, వాంగ్మూలం రాజకీయవత్తిడితో చేస్తున్నట్లు ఇడి ఆరోపించింది.


కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధుల సంస్ధ(కెఐఐఎఫ్‌బి)పై ఆదాయపన్నుశాఖ దాడి చేయటం దాదాగిరి తప్ప మరొకటి కాదని ఆర్ధిక మంత్రి థామస్‌ ఐజాక్‌ వర్ణించారు. అన్ని నిబంధనలను, చట్టాలను పాటిస్తున్న ఆ సంస్ధపై దాడులు చేయటం ద్వారా ఎలాంటి నష్టం చేయజాలరని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో నిర్మించిన అనేక ఆసుపత్రులు, విద్యా సంస్ధలను జనం చూస్తున్నారని, దాన్ని దెబ్బతీస్తుంటే రాష్ట్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే సంస్దను ఏర్పాటు చేశాము, రిజర్వుబ్యాంకు ఆమోదం తెలిపింది. దాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌-కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆదాయపన్ను శాఖ అడిగిన సమాచారం, పత్రాలను గతంలోనే సమర్పించినప్పటికీ అధికారం ఉంది కదా అని ఇప్పుడు మరోసారి దాడి చేయటం తప్ప మరొకటి కాదని చెప్పారు.ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లటానికి ఎవరు హక్కు ఇచ్చారని, దీని వెనుక కేంద్ర మంత్రుల ప్రోద్బలం తప్ప అధికారులదేమీ లేదన్నారు.


విజయాలతో మామా-అల్లుడు చరిత్రను సృష్టిస్తారా !


అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి విజయన్‌తో పాటు డివైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌ విజయం సాధిస్తే కేరళ అసెంబ్లీ చరిత్రలో అదొక రికార్డు అవుతుంది. విజయన్‌ అల్లుడు రియాజ్‌ అన్న విషయం తెలిసిందే. విజయన్‌ కన్నూరు జిల్లాలో పోటీ చేస్తుండగా రియాజ్‌ కోజికోడ్‌ జిల్లాలో పోటీచేస్తున్నారు. ఈ ఉదంతాన్ని మరికొన్ని చోట్ల జరుగుతున్న పోటీలలో బంధువులు పోటీ చేయటాన్ని చూపి సిపిఎంలో కూడా కుటుంబ పెత్తనం, వారసత్వం చోటు చేసుకున్నదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనికి ప్రాధాన్యత తప్ప బంధుత్వాలకు కాదు అన్న విషయం తెలిసిందే. అనేక కుటుంబాలలో సభ్యులందరూ పార్టీ పనిలో పూర్తి కాలం పని చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రియాజ్‌ విషయానికి వస్తే విజయన్‌ అల్లుడు గాక ముందే 2009 ఎన్నికల్లోనే సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈనెల 28న ముఖ్యమంత్రి కోజికోడ్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఐదు కేంద్రాల్లో ప్రచారంలో పాల్గొంటారు. వాటిలో రియాజ్‌ పోటీ చేసే బైపూరు ప్రత్యేకంగా లేదు. దానితో పాటు నాలుగు నియోజకవర్గాల ప్రచారాన్ని కోజికోడ్‌లోనే ఏర్పాటు చేశారు. రియాజ్‌ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.


బంధుగణం పోటీచేస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ వారే ఎక్కువగా ఉన్నారు. ఒక కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ కుమారులు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తుండగా దివంగత స్వతంత్ర ఎంఎల్‌ఏ కుమారుడు ఒకరు స్వతంత్ర అభ్యర్ధిగా ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ కుమారుడు,ఎంపీ అయిన మురళీధరన్‌, కుమార్తె పద్మజా వేణుగోపాల్‌ పోటీలో ఉన్నారు.ఎన్‌సిపి మాజీ మంత్రి సోదరుడు, ఎల్‌డిఎఫ్‌ కన్వీనరు విజయరాఘవన్‌ సతీమణి బిందు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్‌ అల్లుడు శ్రీనింజన్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులుగా ఉన్నారు. కేరళ కాంగ్రెస్‌ నేత దిగంగత మణి కుమారుడు జోస్‌ మణి ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తుండగా ఆయన బావమరిది, మాజీ అయ్యేఎస్‌ అధికారి జోసెఫ్‌ యుడిఎఫ్‌ అభ్యర్ధిగా వేరేచోట ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ముగ్గురు మాజీ మంత్రులు, ఒక మాజీ స్పీకర్‌ కుమారుడు కూడా యుడిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు.