ఎం కోటేశ్వరరావు
బంగ్లాదేశ్ విముక్తి జరిగి యాభై సంవత్సరాలు గడచిన సందర్భంగా అతిధిగా ఢాకా వెళ్లిన మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తాను బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో సత్యాగ్రహం చేసి జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. తనతో పాటు తన మిత్రులు కూడా ఉన్నారన్నారు. ఈ ప్రకటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రధాని అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ మండిపడింది. యాభై సంవత్సరాల నాడు జరిగిన విషయం- అది నిజమో కాదో తెలుసుకొనేందుకు ఇప్పుడున్నన్ని ఆధారాలు అప్పుడు లేవు. ప్రధాని అంతటి పెద్దాయన చెప్పారు గనుక అది పచ్చి అబద్దమని ఎవరైనా అంటే దాన్ని తేలికగా తీసిపారవేయలేము- అలాగని వాస్తవం అని కూడా చెప్పలేము. అప్పుడేం చేయాలి ? ఉన్న ఆధారాలను బట్టి ఏది నిజం ఏది అబద్దం అనే అంశాలను పాఠకుల ముందు ఉంచితే వారే ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ ప్రయత్నం అదే ! నరేంద్రమోడీ స్వయంగా నోరువిప్పితే తప్ప అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.
ప్రధాని ఏమి చెప్పారు ? ” అప్పుడు నాకు 20-22 సంవత్సరాలుంటాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం నేను, నా మిత్రులు సత్యాగ్రహం చేశాము, జైలుకు కూడా వెళ్లాము ” అని చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు స్వయంగా ఇచ్చిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ 1950 సెప్టెంబరు 17న జన్మించారు. బంగ్లా విముక్తి ఉద్యమ సమయంలో జనసంఘం 1971 అగస్టు నెలలో సత్యాగ్రహం నిర్వహించింది. అంటే అప్పటికి మోడీ వయస్సు 21 సంవత్సరాలు. ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే నరేంద్రమోడీ ఆ సమయంలో ఏమి చేస్తున్నారు ? తాను ఫలానా కాలేజీలో ఫలానా సంవత్సరంలో చదివాను అని నరేంద్రమోడీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. బిజెపి అనుకూల పత్రిక జాగరణ జోష్‌లో 2020 సెప్టెంబరు 17న షిఖా గోయెల్ రాసిన వ్యాసం ప్రకారం 1967లో గుజరాత్ ఎస్‌ఎస్‌సి బోర్డు నుంచి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పదిహేడవ ఏట తనకు వివాహం వద్దంటూ ఇల్లు వదలి రెండు సంవత్సరాలు దేశంలో వివిధ ఆశ్రమాలను సందర్శించారు. తరువాత వచ్చి అహమ్మదాబాద్‌లోని బస్టాండులో ఒక టీ దుకాణంలో పని చేశారు. 1970 ప్రారంభంలో ఏబివిపి శాఖను ఏర్పాటు చేశారు.1971లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా చేరారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సు ద్వారా రాజకీయ శాస్త్రంలో బిఏ డిగ్రీ పొందారు.1983లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ పట్టా తీసుకున్నారు. స్కూలు విద్య తరువాత రెండేండ్లు అక్కడా ఇక్కడా తిరిగిన వ్యక్తి ఏ కాలేజీలో చేరకుండా ఏబివిపి విద్యార్ధి సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ? వివాహం వద్దంటూ ఇల్లు వదలిన మోడీ భార్య అని స్వయంగా పేర్కొన్న యశోదాబెన్‌తో వివాహం ఎప్పుడు జరిగింది ?
అసలు మోడీ గారి డిగ్రీ పట్టా గురించి పెద్ద వివాదమే నడిచింది. ఆ వివరాల వెల్లడి దేశ భద్రతకు ముప్పు అన్నట్లుగా సమాచారహక్కు కింద అడిగిన వారికి వివరాలు ఇవ్వలేదు. వివాదం ముదరటంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ పట్టా అంటూ ఒకదానిని చూపారు. పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం కూడా తిరస్కరించింది. ఎట్టకేలకు 1978లో నరేంద్రమోడీ పరీక్షలను పూర్తి చేశారని, 1979లో డిగ్రీ పొందారంటూ వెల్లడించింది. అదే సమయంలో డిగ్రీపరీక్ష రాసేందుకు నమోదు చేసుకున్న సంఖ్య ” సిసి 594-74 అని పరీక్ష హాల్ టికెట్ నంబరు 16594 ” అని వెల్లడించింది. అంటే 1974లో దూరవిద్య ద్వారా డిగ్రీకోసం నమోదు చేసుకొని మూడు సంవత్సరాల పరీక్షలను ఒకేసారి రాసి పాసయ్యారని అని అనుకోవాలి. మిత్రులతో కలసి బంగ్లాదేశ్ కోసం సత్యాగ్రహం చేశాను, జైలుకు వెళ్లాను అని చెప్పారు. వివరాలు నమోదు చేయకుండా పోలీసు లాకప్‌లో ఉన్నానంటే నమ్మవచ్చు, కానీ జైలులో ఒక రోజు కూడా ఉంచరు. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఏ జైల్లో ఉన్నారో వివరాలు వెల్లడి అయ్యేంత వరకు దాని గురించి చెప్పే మాటలను నమ్మటం ఎలా ?
పశ్చిమ దేశాల్లో ప్రధానులు, దేశాధ్యక్షుల మీద బూతులు ప్రయోగించినా అక్కడ పెద్దగా పట్టించుకోరు. మన దేశంలో అలాంటి ప్రయోగం మీద తమకు మాత్రమే హక్కు ఉందనే శీలవంతులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించటమే దేశద్రోహం అంటున్న ఈ రోజుల్లో దేశ ప్రధాని నరేంద్రమోడీ మీద జోకులు పేలిస్తే ఏమౌతుందో నెటిజన్లు ఒక్కసారి ఆలోచించుకోవాలేమో. బంగ్లా విముక్తి ఉద్యమానికి మద్దతుగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన మోడీగారి మీద సామాజిక మాధ్యమంలో పేలిన జోకులు ఎలా ఉన్నాయో చూడండి.
” 1969లో చంద్రుడిపై కాలుమోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బృందంలో రహస్యంగా దూరి మోడీ గారు కూడా చంద్రుడి మీద కాలుమోపారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావటానికి ముందే పందొమ్మిదేండ్ల వయస్సులోనే మోడీ ఈ నాసా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలికట్ స్మార్ట్ సిటీలో కాలుపెట్టిన వాస్కోడాగామాను స్వాగతించింది నరేంద్రమోడీ గారే. దేశ తొలి సాధారణ ఎన్నికలు 1951లోనే నరేంద్రమోడీ గారు ఓటు వేశారు. ఏడాది వయస్సులో ఆయన వేసిన ఓటు ప్రధానిగా జవహర్‌లాల్ ఎన్నికలో కీలకపాత్ర పోషించింది. 1942లో తన ఆరాధ్య వ్యక్తితో కాన్‌సెంట్రేషన్ కాంపుల గురించి చర్చిస్తున్నప్పటి చిత్రం. మోడీ తన ఎంఏ చివరి పరీక్షా పత్రాన్ని రాస్తున్న దృశ్యం ” ఇలా ఉన్నాయి. వీటన్నింటి సారం ఒక్కటే నరేంద్రమోడీ సత్యాగ్రహం గురించి అతిశయోక్తులు చెప్పారని ఎద్దేవా చేయటమే !
అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, చరిత్రకారుడు అయిన శ్రీనాధ్ రాఘవన్ మాట్లాడుతూ మన దేశంలో ఎవరైనా బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాననటం హాస్యాస్పదం అన్నారు. అయితే నరేంద్రమోడీ జైలుకు వెళ్లానని చెప్పింది వాస్తవమేనంటూ సంఘపరివార్‌కు చెందిన వారు సమర్ధిస్తున్నారు.ఒక దేశంలోని మరో దేశంలో జరిగే ఉద్యమాలకు మద్దతు ప్రకటించటం సహజం. కానీ సత్యాగ్రహం చేసి అరెస్టయ్యామని చెప్పటమే అతిశయోక్తి. 1971లో బంగ్లాదేశ్‌లో విముక్తి ఉద్యమం ప్రారంభమైన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్, దాని రాజకీయ విభాగమైన జనసంఘం మద్దతు ఇచ్చాయి. ఒక దేశంలో జరుగుతున్న పరిణామాల మీద వెంటనే స్పందిస్తే లేదా ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తే రాబోయే పర్యవసానాల గురించి ప్రభుత్వం తటపటాయించింది, అది సహజం. అదే ప్రభుత్వం అనువైన సమయం రాగానే మిలిటరీ జోక్యం చేసుకున్నది. అమెరికా బెదిరింపులను కూడా లెక్క చేయలేదు. పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ అణచివేతలకు పాల్పడం ప్రారంభమై నెలలు గడుస్తున్నా మోడీ సర్కార్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటానికి కారణం ఏమిటి ? పర్యవసానాల గురించి తటపటాయింపే.
పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ పాలకులు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా అణచివేతకు పాల్పడినా, తాజాగా పార్లమెంట్, ప్రభుత్వాన్ని రద్దు చేసి జనాన్ని అణచివేస్తున్నా కనీసం జనానికి సానుభూతి మిలిటరీ చర్యలను తప్పు పట్ట లేదు బిజెపి. మరోవైపు ఉన్న శ్రీలంకలో ప్రత్యేక రాజ్యం కోసం ఆయుధాలు పట్టిన తమిళులకు మద్దతుగా బిజెపి ఎన్నడైనా సత్యాగ్రహం చేసిందా ? నేపాల్లో రాజరికానికి వ్యతిరేకంగా జనం ఉద్యమించినపుడు బిజెపి వైఖరి ఏమిటి ? అనేక దేశాల్లో జనసంఘ హయాంలో, బిజెపి హయాంలో విముక్తి పోరాటాలు జరిగాయి. వాటిలో ఏ ఒక్కదానికైనా మద్దతు ప్రకటించిన దాఖలాలు ఉన్నాయా ? అంతెందుకు ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అది వెంటనే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల మద్దతుతో పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని ఇప్పటికీ ఖాళీ చేసేందుకు మొరాయిస్తోంది. పాలస్తీనా అరబ్బులకు అసలు మాత్రదేశాన్నే లేకుండా చేశారు. వారు నివశించే ప్రాంతాలను సైనికశిబిరాలుగా మార్చి వేసిన దుర్మార్గాన్ని చూస్తున్నాము. అలాంటి ఇజ్రాయెల్‌తో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోకుండా నిరసన తెలుపుతుంటే మన బిజెపి సర్కార్ మిత్ర దేశంగా పరిగణిస్తున్నది. ఇదేమి ద్వంద్వ వైఖరి ? అలాంటి పార్టీ బంగ్లాదేశ్ విముక్తి కోసం ఉద్యమించి జైలుకు కూడా వెళ్లామని చెప్పుకుంటున్నదంటే దాని అసలు లక్ష్యం ఏమిటి ? నిజం ఏమిటి ?
బంగ్లాదేశ్ విముక్తి విషయంలో జనసంఫ్‌ు మద్దతులో చిత్తశుద్ది లేదు. బంగ్లా విముక్తి కంటే పాకిస్దాన్ రెండు ముక్కలు అవుతున్నదనే అంశానికే అది ప్రాధాన్యత ఇచ్చి అమెరికాను సంతృప్తి పరచేందుకు, నాటి సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహం వంటి హడావుడి చేసింది అన్నది స్పష్టం. నాడు బంగ్లాదేశీయులను ఊచకోత కోసిన పాక్ మిలిటరీకి మద్దతుగా అమెరికా తన సప్తమ నౌకాదళాన్ని బంగాళా ఖాతానికి తరలించిన అమెరికా దుర్మార్గాన్ని ఖండించిన పాపాన పోలేదు. ఒక స్వతంత్ర దేశ వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవాలంటే దానికి ఎంతో కసరత్తు అవసరం. అక్కడ అంతర్యుద్దం జరుగుతున్న సమయంలో ఏక్షణంలో అయినా జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి తలెత్తవచ్చని, అందువలన దాని గురించి బహిరంగంగా చర్చించవద్దని,దాని వలన జరిగే లాభం కంటే హానే ఎక్కువ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ జనసంఘంతో సహా ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశంలో చెప్పారు. అమెరికా సప్తమ నౌకాదళాన్ని దించిన నేపధ్యంలో సోవియట్ యూనియన్‌తో రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నారు. బంగ్లావిముక్తి ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటనలు చేయవద్దన్న సూచనను రాజకీయ ప్రయోజనం కోసం జనసంఘం ఉల్లంఘించింది. అది చేసిన సత్యాగ్రం బంగ్లాకు విముక్తి కంటే సోవియట్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఉద్దేశించింది అన్నది అసలు విషయం. బంగ్లాదేశ్ విముక్తిని గుర్తించకుండా ఉండేందుకే కుట్రతో మన ప్రభుత్వం సోవియట్‌తో రక్షణ ఒప్పందం చేసుకుందని ఢిల్లీలో జరిగిన సత్యాగ్రహ సభలో అతల్‌బిహారీ వాజ్‌పాయి ఉపన్యాసం చేశారని 1971 ఆగస్టు 12న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వార్తలో రాసింది. అందువలన బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో సత్యాగ్రహం అని చెప్పినా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది కనుక కొంత మందిని అరెస్టు చేసి ఉండవచ్చు తప్ప బంగ్లాకు మద్దతు కారణం అయితే కాదు. దానిలో నరేంద్రమోడీ పాల్గొన్నట్లు, అరెస్టయి జైలుకు పోయినట్లు ఆధారాలు అయితే లేవు.
దేశ విభజన సమయంలోనూ, బంగ్లా విముక్తి పోరాటం సమయంలో అనేక మంది అక్కడి నుంచి కాందిశీకులుగా ప్రాణాలు అరచేత పట్టుకు వచ్చిన వారిని అక్రమ చొరబాటుదారులంటూ తరువాత కాలంలో అసోం, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద రచ్చ చేసి మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపింది సంఘపరివార్ శక్తులు, వాటి రాజకీయ రూపం బిజెపి అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికీ దాన్ని ఎన్నికల అస్త్రంగా వినియోగిస్తున్నారు. అందుకే మోడీ పర్యటనకు నిరసనగా అక్కడి మతశక్తులతో పాటు పురోగామి వాదులు కూడా నిరసన వ్యక్తం చేశారు. మోడీ రాకను హర్షించిన వారెవరూ లేరు.
పెద్దల మాటను గౌరవించాలి. నిజమే, ఒక నాటికలో (బహుశా ‘ పంజా ‘ అనుకుంటున్నా) ఒక పాత్రధారి నేనూ స్వాతంత్య్ర సమర యోధుడనే అని చెప్పుకుంటాడు. అదెలా అంటే కొండా వెంకటప్పయ్య జెండా ఎగురవేస్తుంటే చూశా అంటాడు. అలాంటి పెద్దలను కాదు. పెద్దలనే వారు గౌరవ ప్రదంగా వ్యవహరించినపుడే మన్నించాలి. పెద్దలం కదా అని ఏది బడితే అది చెబితే నమ్మే రోజులు కావివి. కనుక పెద్దలూ మా రోజుల్లో లేదా ఆరోజుల్లో అని చెప్పేటపుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపధ్యంలోనే తన ప్రకటన మీద తలెత్తిన వివాదానికి ముగింపు పలకాల్సింది కూడా నరేంద్రమోడీయే. అది వ్యక్తిగతంగా ఆయనకే గౌరవం. తాను, తనతో పాటు ఉన్న మిత్రులు ఏ తేదీల్లో ఏ జైల్లో ఉన్నారో ఆధారాలు వెల్లడించటం కష్టమేమీ కాదు. దేశభద్రతకు వచ్చే ముప్పు అసలే ఉండదు. లేనట్లయితే ఆయన డిగ్రీ వివాదం మాదిరి దేశవ్యాపితంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా మచ్చగా మిగిలిపోతుంది. మీడియాలో దీని గురించి జరిగే చర్చ, సమాచారం సరిహద్దులు దాటకుండా ఉంటుందా ? ట్విటరైట్లను, ఫేస్‌బుకర్లను ఆపగలమా ? ఎవరి గడ్డిని వారికే తినిపిస్తారు !