Tags
A.K Antony, BJP-Kerala, Kerala Assembly Elections 2021, Kerala CPI(M), Rajnath Singh, SITARAM YECHURY
ఎం కోటేశ్వరరావు
కేంద్రానికి రాష్ట్రాలు ఎంత దూరమో రాష్ట్రాలకు కేంద్రం అంతే దూరం అనే పాఠాన్ని చెప్పేందుకు కేరళ ప్రభుత్వం పూనుకుంది. గతంలో కూడా తన ఆధీనంలోని దర్యాప్తు సంస్దల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్షాల పాలనలోని రాజకీయ నేతలకు వ్యతిరేకంగా దాడులు చేయటం, తప్పుడు కేసుల్లో ఇరికించటం తెలిసిందే. దాన్ని విమర్శించిన బిజెపి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా వాటిని దుర్వినియోగం చేస్తోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్ దొంగబంగారం కేసులో ఉన్నారని వాంగ్మూలం ఇవ్వాలని లేనట్లయితే అంతు చూస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిందితులను బెదిరించినట్లు వార్తలు రావటమే కాదు స్వయంగా నిందితులే వెల్లడించారు. తప్పుడు వాంగ్మూలాలను ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా కస్టమ్స్, ఇడి అధికారులు కోర్టుకు సమర్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్ధల అధికారుల బెదిరింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందటంతో వాటి మీద న్యాయవిచారణ జరపాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది. ఒక వేళ ఇవ్వకపోతే ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసిన తరువాత కమిషన్ తన పని చేయనుంది.
స్వతంత్ర భారత చరిత్రలో కేంద్ర సంస్ధల అధికారుల తీరుతెన్నులపై ఒక రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదులు చేయటం, కొన్ని సందర్భాలలో దర్యాప్తుకు అనుమతి నిరాకరించటం తెలుసు గానీ విచారణ జరపటం ఇదే ప్రధమంగా కనిపిస్తోంది. అనూహ్యమైన ఈ పరిణామంతో దిమ్మదిరిగిన కేంద్ర మంత్రులు గుండెలు బాదుకుంటున్నారు. ఇది ఒక జోక్ అని ఒక విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ అంటే ఇది దురదృష్టకరం, రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్ధకే ఇది సవాలు అని రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ కేరళ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేంద్ర సంస్దలు చేసిన వినతిని రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది, నిలిపివేసేందుకు కూడా నిరాకరించింది. చివరకు ఇది ఏమౌతుందో తెలియదు గానీ కేంద్ర -రాష్ట్ర సంబంధాల సమస్యల్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు ఈ ఉదంతం ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంది. వామపక్ష ప్రభుత్వ చర్య తనకు ఆశ్చర్యం కలిగించలేదని హౌం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పరువు కాపాడుకొనేందుకు ఇలా చేశారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్దలపై విచారణ జరపటం రాజ్యాంగ వ్యతిరేకమని కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్ భావిస్తే మంత్రి తిరిగి మరోసారి రాజ్యాంగాన్ని చదువుకోవటం అవసరం అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం ఏ కేంద్ర సంస్ద కూడా సంబంధిత రాష్ట్ర అనుమతి లేకుండా వ్యవహరించరాదని, రాష్ట్రాలు తమ పరిధులకు లోబడి వ్యవహరిస్తాయని అన్నారు. ఎన్నికల సమయంలో నిందితుల ప్రకటనల పేరుతో దర్యాప్తు సంస్దలు నీచస్ధాయికి దిగజారి వ్యవహరిస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్ శివరామకృష్ణన్ వ్యాఖ్యానించారు. స్వ ప్రయోజనాల కోసం స్పీకర్ తన నివాసానికి తనను రమ్మన్నట్లుగా దొంగబంగారం కేసు ప్రధాన నిందితురాలు స్వప్ప సురేష్ చేసిందన్న ప్రకటనను ఇడి కోర్టుకు సమర్పించింది.
కేరళలో హిందూత్వ కోసం బిజెపి-కాంగ్రెస్ పోటా పోటీ !
కేరళలో హిందూత్వ పోటీలో కాంగ్రెస్-బిజెపి పోటీ పడుతూ జనాన్ని మత ప్రాతిపదిక మీద చీల్చేందుకు దోహదం చేస్తున్నాయని, వామపక్షాలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాయని, రాజకీయాలకు-మత విశ్వాసాలను వేర్వేరుగా చూస్తాయని, విశ్వాసాలు వ్యక్తిగత అంశంగా పరిగణిస్తామన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి విలేకర్లతో చెప్పారు.వివాదాలతో సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్-బిజెపి ప్రయత్నిస్తున్నాయని రెండూ కుమ్మక్కుతో వ్యవహరిస్తున్నాయని లేకుంటే తమకు 34 సీట్లు వస్తే చాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని బిజెపి ఎలా చెబుతుందని ప్రశ్నించారు. కేరళ నుంచి జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయటం పూర్తిగా రాజ్యంగ విరుద్దమని, రాజ్యసభలో తమ ప్రతినిధులను కలిగి ఉండటం రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. ఇలాంటి నిర్ణయాలను ఎన్నికల సంఘం ఏకాభిప్రాయంతో తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ లేదన్నారు.
బలంపై బిజెపి బడాయి- కాంగ్రెస్ పగటి కలలు !
అనేక రాష్ట్రాలలో అధికారానికి వచ్చిన మనం నేపాల్, శ్రీలంకల్లో కూడా విజయం సాధించాల్సి ఉందని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్లు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్రిపుర నేతలతో మాట్లాడిన సమయంలో షా ఈ విషయం చెప్పారని అన్నారు. అమిత్ షాకు బెంగాలీ లేదా త్రిపుర బిజెపి నేతలకు హిందీ తెలియకపోవటం వలనగానీ ఇలా అర్ధం అయి ఇంకేముంది ఇరుగుపొరుగు దేశాల్లో కూడా మనం పాగా వేయబోతున్నామని కార్యకర్తలను ఉబ్బించేందుకు చెప్పి ఉంటారు. కానీ కేరళలో మెట్రోమాన్ శ్రీధరన్ అచ్చమైన మళయాళంలో మాట్లాడుతూ బిజెపి పూర్తి మెజారిటీ లేదా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో నిర్ణయించే నిర్ణయాత్మక స్ధాయిలో సీట్లు సంపాదించనున్నదని చెబుతున్నారు. కేరళలో బిజెపి ఎదగకపోవటానికి ఒక కారణం అక్కడ అక్షరాస్యత ఎక్కువగా ఉండటం అని ఆ పార్టీనేత ఓ రాజగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే. ఏం జరుగుతుందో చూద్దాం ! ఎనభై ఎనిమిది సంవత్సరాల వయస్సున్న పెద్దమనిషి గనుక ఏం మాట్లాడినా కేరళీయులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
పగటి కలలు కంటున్న వారిలో బిజెపి పెద్దలే కాదు కాంగ్రెస్ నేతలు కూడా తీసిపోలేదు. తమకు వందసీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ముందస్తు ఎన్నికల సర్వేలను తాను నమ్మనని అన్నారు. సర్వేలు చేసే సంస్దల వారు కాంగ్రెస్ కార్యాలయానికి కూడా వచ్చి తనను కలసి కావాలంటే సర్వే చేస్తామని చెప్పారు. నాకు నమ్మకం లేదు వద్దు అన్నాను అని రామచంద్రన్ చెప్పారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ పిసిసి కార్యాలయంలోనే గుండు చేయించుకున్న విషయం గురించి అడగ్గా అన్ని పార్టీల్లో అలాంటివి జరుగుతుంటాయి. ఆమె సిపిఎం కుట్రకు బలైంది అన్నారు.
మరోవైపున మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తన ఆరోపణల పరంపరను కొనసాగిస్తూ ఏడు సీట్లలో బిజెపిని గెలిపించేందుకు సిపిఎం, దానికి ప్రతిగా తిరిగి అధికారం వచ్చే విధంగా బిజెపి సహకరించేట్లు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. ఓటమిని ఈ సాకుతో ముందే అంగీకరించారు. ఎన్నికల సిబ్బందిగా 95శాతం మందిని వామపక్ష ఉద్యోగ సంఘాలకు చెందిన వారినే రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.సుధాకరన్ ఆరోపించారు. ఎవరిని ఎక్కడ నియమించిందీ ముందు రోజే పార్టీకి జాబితాలు అందుతాయని కూడా అన్నారు.క సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను సిపిఎం కార్యకర్తలు సమకూర్చుతారని ఆరోపించారు. సిపిఎంకు బలమైన కేంద్రాలుగా ఉన్నచోట కేవలం మహిళా సిబ్బందినే నియమిస్తారని, వారు ఎన్నికల అక్రమాలను ప్రతిఘటించలేరని సుధాకరన్ చెప్పుకున్నారు. ఎన్నికలను సిపిఎం అదుపు చేస్తున్నదని అందువలన స్వేచ్చగా ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. చర్యలు తీసుకుంటామంటారే తప్ప ఎన్నికల కమిషనర్ అలా చేయటం లేదన్నారు.
కాంగ్రెస్ నేతకు మార్చి-మే నెలకు తేడా కూడా తెలియదన్న విజయన్ !
రేషన్ పంపిణీ గురించి ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించిన ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితలకు మార్చి-మే నెలల మధ్య ఉన్న తేడా కూడా తెలియనట్లుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎద్దేవాచేశారు.అధికారపక్షానికి ఓట్ల కోసం మేనెల రేషన్ కూడా ముందే ఇస్తున్నారని చెన్నితల ఫిర్యాదు చేశారు. పండుగల సందర్భంగా ఆలస్యమైన మార్చి, ఏప్రిల్ నెలల రేషన్ పంపిణీ చేస్తున్నాం తప్ప మే నెలది కాదని విజయన్ అన్నారు. ఏప్రిల్ 14న ఉన్న హిందూ పండగ విషు, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండుగల సందర్భంగా ఆహార కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఎన్నికల తరువాతనే వాటిని పంపిణీ చేయాలని కాంగ్రెస్ కోరింది. అయితే దీని మీద ఆయా సామాజిక తరగతుల్లో వ్యతిరేకత వ్యక్తం కావటంతో తాము పంపిణీ నిలిపివేయాలని కోరలేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ చెప్పుకోవాల్సి వచ్చింది. బియ్యం పంపిణీపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించటంతో ఆ సమస్యపై హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలుపు, నీలి రంగు కార్డుల వారికి కిలో పదిహేను రూపాయల చొప్పున ప్రత్యేకంగా పదేసి కిలోల బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయం ఎన్నికల ప్రకటనకు ముందే జరిగిందని, బియ్యం రావటం ఆలస్యం కావటంతో పంపిణీ వాయిదా పడిందని ప్రభుత్వం చెబుతోంది. ఆహార కిట్లను పంపిణీ చేస్తున్నది కేంద్రం తప్ప రాష్ట్రం కాదని బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్ అంటున్నారు. దొంగ ఓట్ల గురించి పదే పదే ఫిర్యాదులు చేసిన రమేష్ చెన్నితలకు పదే పదే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్వయంగా ఆయన తల్లికే రెండు చోట్ల ఓట్లు ఉన్న విషయాన్ని సిపిఎం కార్యకర్తలు బయట పెట్టారు. చిరునామా మార్పు గురించి దరఖాస్తు చేసినా ఎన్నికల సిబ్బంది మార్చలేదని చెన్నితల సంజాయిషీ చెప్పుకున్నారు. కజకోట్టమ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ లాల్‌కు కూడా రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని బయటపడింది. స్ధానిక సంస్దల ఎన్నికలలో కూడా సిపిఎం దొంగ ఓట్లతో గెలిచిందని, పోస్టల్ ఓట్లలో కూగా గోల్‌మాల్ జరుగుతోందని రమేష్ చెన్నితల కొత్త ఆరోపణ చేశారు. ఒకరికి ఒక చోట కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఉదంతాలలో ఒక చోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా చూడాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు కోరింది. దీంతో రమేష్ చెన్నితల ఆరోపణల పర్వానికి తెరపడింది.
గురువాయురూరప్ప సాక్షిగా ముస్లింలీగుకు బిజెపి ఓట్లు – ఆంటోని రంగంలోకి వస్తే బిజెపితో కుమ్మక్కే !
బిజెపి నేతలు కేరళ వచ్చినపుడల్లా గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇప్పుడు అక్కడ సిపిఎంకు వ్యతిరేకంగా ముస్లింలీగుకు, తెలిచేరిలో కాంగ్రెస్‌కు తన ఓట్లను బదలాయించేందుకు బిజెపి కుమ్మక్కు అయిందన్న విమర్శలు వచ్చాయి. కావాలనే బిజెపి తన అభ్యర్దులతో గురువాయూర్, తెలిచేరి నియోజకవర్గాలలో అసంపూర్ణంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయించి తిరస్కరణకు గురయ్యేట్లు చేసిందని వార్తలు వచ్చాయి. దీన్ని బలపరుస్తూ ప్రముఖ నటుడు త్రిసూరులో బిజెపి అభ్యర్ధి సురేష్ గోపి ఈ రెండు చోట్లా యుడిఎఫ్ విజయం సాధించనున్నదని, వారికి ఓట్లు వేయాలని చెప్పారు. గురువాయూరులో యుడిఎఫ్‌లోని ముస్లింలీగు అభ్యర్ధి గెలవాలని, తెలిచేరిలో సిపిఎం అభ్యర్ధి ఓడిపోవాలని అన్నారు. అయితే బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ అది సురేష్ గోపి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని పార్టీకేమీ సంబంధం లేదన్నారు. గోపి ప్రకటనతో ఇరుకున పడిన బిజెపి కేంద్ర మంత్రి మురళీధరన్ విలేకర్లతో మాట్లాడుతూ ఇలాంటి విషయాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన విషయాలనే పరిణనలోకి తీసుకోవాలన్నారు. ఇదేదో పొరపాటున నోరు జారిన వ్యవహారం కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. గురువాయూర్‌లో లీగ్ అభ్యర్ధి కెఎన్‌ఏ ఖాదర్ సిఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని బలపరిచారని, ఇప్పుడు బిజెపి ఓట్ల కోసం వేరే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి ఎకె ఆంటోని రంగంలోకి వచ్చారంటే కాంగ్రెస్-బిజెపి మధ్య కుమ్మక్కు ఒప్పందం ఉన్నట్లే అని విజయన్ అన్నారు. తనపై ఆంటోని ఆరోపణలు చేయటం సహజమని అందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం పాతిక సంవత్సరాల పాటు ఉంటుందని, సిపిఎం నాయకత్వం విజయన్‌తో ప్రారంభమై విజయన్‌తో అంతం అవుతుందని ఎకె ఆంటోని వ్యాఖ్యానించారు. ఈసారి గనుక అధికారానికి వస్తే ఆ పార్టీ అంతరిస్తుందని, తరువాత జనం కాంగ్రెస్‌కే ఓటు వేస్తారన్నారు. సిపిఎం రెండో సారి అధికారానికి రావటం ప్రమాదకరమని ఆంటోని చెప్పుకున్నారు.
మెట్రోమాన్‌కు శ్రీధరన్‌కు కోపం వచ్చింది !
నరేంద్రమోడీ ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ప్రకారం సానుకూలమైన ప్రశ్నలు వేసే జర్నలిస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రధానిగా ఇంతవరకు ఒక్క పత్రికా గోష్టి కూడా పెట్టని విషయం తెలిసిందే. కేరళలోని పాలక్కాడ్ నిజయోజకవర్గంలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మెట్రోమాన్ శ్రీధరన్‌కు విలేకరి ప్రశ్నలు కోపం తెప్పించి మధ్యలోనే వెళ్లిపోయారు. న్యూస్ లాండ్రి ( వార్తల ఉతుకుడు ) అనే ఆంగ్లవెబ్‌సైట్ విలేకరి గొడ్డుమాంస నిషేధం, లవ్‌జీహాద్‌ల మీద అభిప్రాయం ఏమిటని కోరగా అవన్నీ తుచ్చమైన అంశాలు వాటి గురించి నేను మాట్లాడను అన్నారు. బిజెపి దక్షిణాది-ఉత్తరాది నేతలు భిన్నంగా మాట్లాడుతున్నారు గనుక మీ అభిప్రాయం ఏమిటని మరోసారి అడగ్గా వాటి మీద స్పందించేంత అర్హత నాకు లేదన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌పై ఉన్న కేసుల గురించి అడగ్గా దొంగబంగారం కేసులతో వాటిని పోల్చరాదన్నారు.లవ్‌జీహాద్ మీద చట్టం తీసుకు వస్తామని బిజెపి చెప్పిన విషయం గురించి చెప్పండి అని అడగ్గా తీసుకురాకపోతే మరో సిరియా అవుతుంది, అయినా మీరు అన్నీ ప్రతికూల ప్రశ్నలు, అడిగినవే అడుగుతున్నారు, ప్రతివారినీ అడుగుతున్నారు అని విసుకున్నారు. జర్నలిస్టుగా ప్రశ్నలు అడగటం నా పని అని విలేకరి చెబుతుండగా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పను అంటూ లేచి వెళ్లిపోయారు.