Tags
2021 Myanmar coup d'état, Aung San Suu Kyi, Myanmar’s Military Coup, US double standards on coups
ఎం కోటేశ్వరరావు
మార్చి 27న మన పొరుగు దేశమైన మయన్మార్‌లో దేశ వ్యాపితంగా మిలిటరీ జరిపిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించారు. ఆ దుశ్చర్యను యావత్ సమాజం ఖండిస్తోంది, నిరసిస్తోంది. గత ఏడాది నవంబరు పార్లమెంటరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరి ఒకటవ తేదీ ఏడాది పాటు అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మయన్మార్ మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్దంలో 76 సంవత్సరాల క్రితం జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా మార్చి 27న మయన్మార్ సాయుధ దళాల ప్రతిఘటన ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ రోజున సాయుధ దళాల దినోత్సవం జరుపుతున్నారు. అదే రోజున నిరసనకారుల మీద జరిపిన కాల్పుల్లో 90 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సంఖ్య 114 అని, ఇంకా ఎక్కువ ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొత్తం మరణించిన వారు 510 మంది అని కొందరి లెక్క. మిలిటరీ చర్యల మీద యావత్ ప్రపంచంలో నిరసన వ్యక్తమైంది. ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది. ప్రపంచంలో మిలిటరీ అధికారానికి వచ్చిన చోటల్లా మానవహక్కుల ఉల్లంఘన, ప్రాణనష్టం పెద్ద జరుగుతున్నది. అమెరికా దాని మిత్రపక్షాలుగా ఉన్న ఐరోపా, మరికొన్ని దేశాలు మయన్మార్‌పై ఆంక్షలను ప్రకటించాయి.
ఒక దేశ అంతర్గత వ్యవహారాలు, పరిణామాలపై ఎంత వరకు స్పందించాలి, ఎంత మేరకు జోక్యం చేసుకోవాలి అన్నది ఒక ఎడతెగని, ఏకీభావం కుదరని సమస్య. ఇలాంటి సమస్యలు తలెత్తిన దేశాలన్నింటి పట్ల అన్ని దేశాలూ ఒకే వైఖరి తీసుకుంటే అసలు ఇలాంటి పరిణామాలు తలెత్తవు, ఒకవేళ జరిగినా మారణకాండకు అవకాశాలు పరిమితం.ఐక్య రాజ్యసమితి వంటి సంస్ధలు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలను నివారించలేకపోతున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన పరిణామాల సమయంలోనే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. గతవారాంతంలో జరిగిన పరిణామాల తరువాత దౌత్య, సంబంధాలన్నింటినీ పక్కన పెట్టింది.హింసా కాండ భయానకంగా ఉందని అధ్యక్షుడు జో బైడెన్ వర్ణించారు. మిలిటరీ తిరుగుబాటు అయినా, దానికి ప్రజాప్రతిఘటన అయినా అది అంతర్గత సమస్యగానే పరిగణించాల్సి ఉంది. మరో దేశం జోక్యం చేసుకొనే పరిస్ధితి తలెత్తినపుడు ఒకవేళ జోక్యం చేసుకుంటే అది సమర్దనీయమా కాదా అన్న చర్చ జరుగుతుంది. మార్చినెల 26వ తేదీన బంగ్లాదేశ్ విముక్తి 50సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ తాను రాజకీయ జీవితం ప్రారంభించినపుడు బంగ్లా విముక్తికోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లినట్లు ప్రకటించారు.దానిలో నిజమెంత అనేది ఒక అంశమైతే పాకిస్ధాన్‌లో ఒక భాగమైన నేటి బంగ్లాదేశ్‌లో నాటి పాక్ నియంతల మారణకాండకు స్వస్తి పలికేందుకు మన దేశం సైనిక జోక్యం చేసుకున్నది.దాన్ని ఎందరో హర్షించినా, పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు పూనుకుంది అనే పేరుతో మనలను బెదిరించేందుకు ముందుగానే అమెరికన్లు తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాతానికి దింపారు. అమెరికా చర్యను మాత్రం నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్ ఖండించలేదు. అమెరికా దాడి చేస్తే రక్షణ కోసం ఆ రోజు మన దేశం నాటి సోవియట్ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంది. జనసంఘం బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసింది తప్ప నిజానికి బంగ్లా మీద ప్రేమతో కాదు. ఏది ఏమైనా నాటి జోక్యం సరైనదే, అందువలన ప్రతి జోక్యాన్ని తప్పు పట్టలేము, అలాగని ప్రతి ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని సమర్ధించకూడదు. దేనికి దాన్నే విడిగా విచక్షణగా చూడాలి.
తాజా విషయాలకు వస్తే మయన్మార్ పరిణామాలపై అన్ని దేశాలూ ఒకే విధంగా స్పందించటం లేదు. మార్చి 27న మయన్మార్ మిలిటరీ దినోత్సవంలో పాల్గొని మన దేశంతో సహా ఎనిమిది దేశాల ప్రతినిధులు హాజరై సామాన్యుల రక్తంతో తడిచిన మిలిటరీ అధికారుల చేతులతో కరచాలనం చేశారు. పాకిస్ధాన్, రష్యా, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, లావోస్, థారులాండ్ ప్రతినిధులు కూడా వారిలో ఉన్నారు. మన సంఘపరివార్ సంస్దలు చెబుతున్నదాని ప్రకారం ఈ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు కనుక వెళ్లారని కాసేపు అనుకుందాం, మరి మన ప్రధాని మన ప్రతినిధిని ఎందుకు పంపినట్లు ? ముందే చెప్పుకున్నట్లు తాను పాక్ మిలిటరీ నియంత్రత్వానికి వ్యతిరేకంగా జరిగిన బంగ్లా విముక్తి ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రకటనకూ దీనికీ పొంతన కుదరటం లేదు. ఒక చోట మానవహక్కులను హరించటాన్ని ఖండిస్తారు-మరోచోట హరిస్తున్నవారితో కరచాలనం చేస్తారా ? ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు ? మయన్మార్ విషయంలో సత్యాగ్రహం చేయకపోయినా ఖండన ప్రకటన ఎందుకు చేయలేదంటే ఏమి చెబుతారు ? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే భారత్ మా రక్తంతో తడిచిన మిలిటరీతో కరచాలనం చేసేందుకు తన ప్రతినిధిని ఎందుకు పంపింది అని మయన్మార్ ప్రజాస్వామిక వాదులు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించారు. చైనాను కూడా వారే అదే ప్రశ్న వేయవచ్చు. ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి ఎంపీల కమిటీ కూడా భారత చర్యను ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మన దేశం కూడా సభ్యురాలే అయినప్పటికీ ఇంతవరకు హింసాకాండను ఖండించలేదు.ప్రస్తుతం మన దేశం భద్రతా మండలి సభ్యురాలిగా ఉండి,పొరుగుదేశం గురించి ఏమి చేసింది అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమివ్వాలా లేదా ?
దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్టవేస్తామంటూ బయలు దేరిన చతుష్టయ దేశాలలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలసి సాధారణ పరిస్ధితుల పునరుద్దరణ జరగాలని మన దేశం కోరింది. మరి మిగిలిన మూడూ మయన్మార్ మీద ఆంక్షలను విధించాలని అంటుంటే మన దేశం మౌనంగా ఉంది, అంగీకరించటం లేదు. మయన్మార్‌లో పరిణామాలు అంతర్గత విషయాలని చైనా, రష్యా బహిరంగంగానే ప్రకటించాయి. మయన్మార్‌లో మిలిటరీ చర్యలకు నిరసనగా ఆంక్షలను కఠినంగా అమలు జరుపుతామని ప్రకటించింది అమెరికా, దాని నాయకత్వంలో ఐరోపా పశ్చిమ దేశాలు అన్నది తెలిసిందే. ఆంక్షల వలన ఫలితం లేదని మన దేశం ఇప్పటికే ఈ దేశాలన్నింటికీ మన దూతల ద్వారా తెలిపింది.
మయన్మార్ ఎన్నికల్లో అక్రమాలు జరిగితే అక్కడి జనం వాటి సంగతి చూసుకుంటారు. మిలిటరీ జోక్యం చేసుకోవటాన్ని ఎవరూ హర్షించరు, ఖండించాల్సిందే. కానీ ఆంక్షలు విధించటానికి అమెరికా, పశ్చిమ దేశాలకు ఉన్న హక్కేమిటి ? ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన ప్రతి ఉదంతంలోనూ అదే విధంగా ప్రవర్తిస్తే పోనీ అదొక తీరు. అనేక దేశాల్లో వారే స్వయంగా మిలిటరీ నియంతలను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించటమే కాదు, పెద్ద సంఖ్యలో పౌరుల పాణాలను బలిగొన్న రక్త చరిత్ర మన కళ్ల ముందు ఉంది. తమ ప్రయోజనాలను ప్రపంచ ప్రయోజనాలుగా చిత్రించటంలో పశ్చిమ దేశాలు, వాటికి మద్దతు ఇచ్చే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో అమెరికా తదితర దేశాలు జోక్యం చేసుకొని సద్దాంతో సహా లక్షలాది మంది సామాన్య పౌరులను హత్య చేశారు. తరువాత అబ్బే ఎలాంటి మారణాయుధాల ఆనవాళ్లు లేవని అదే అమెరికా ప్రకటించింది. యెమెన్‌లో ప్రభుత్వం-దాన్ని వ్యతిరేకించే శక్తుల మధ్య అంతర్యుద్దం జరుగుతోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అక్కడి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయి. సౌదీ అరేబియాను తమ ప్రతినిధిగా నియమించి దాడులు చేయిస్తున్నాయి. వేలాది మందిని హతమార్చాయి. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద మూకలను రెచ్చగొట్టి ఆయుధాలు అందించి అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈజిప్టులో 2013లో జనరల్ శిసి తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేశాడు.దానికి నిరసనగా పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారులు రాజధాని కైరోలో నిరసన తెలుపుతున్న సమయంలో మిలిటరీ విరుచుకుపడి మారణకాండ సాగించింది.ఆధునిక చరిత్రలో అత్యంత దారుణమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతున్న రబ్బా చౌక్ మారణకాండ గురించి తెలిసిందే. 2013 ఆగస్టు 14న రబ్బాతో పాటు మరొక ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య వెయ్యి నుంచి రెండువేల ఆరువందల వరకు ఉంది.గాయపడిన వారు కొన్నివేల మంది ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు వేలాది మందిని హత్య చేశారు, తప్పుడు కేసులు పెట్టి ఉరితీశారు. డెబ్బయి వేల మంది రాజకీయ ఖైదీల కోసం 23 జైళ్లను ప్రత్యేకంగా నిర్మించిన అపర ప్రజాస్వామిక మిలిటరీ నియంతను బలపరించిది అమెరికా. అలాంటి నిరంకుశ పాలకుల చేతిలో జనం ఎంతో సుఖవంతంగా ఉన్నారంటూ టైమ్ వంటి పత్రికలు రాతలు రాశాయి. ఇప్పటికీ జనరల్ శశి నిరంకుశపాలన కింద ఈజిప్టు మగ్గిపోతూనే ఉంది. తమ తొత్తుగా ఉన్న కారణంగానే అమెరికా అన్ని రకాల మద్దతు ఇస్తోందన్నది స్పష్టం. ఎలాంటి ఆంక్షలు లేవు, ఎందుకని ? ఇది ద్వంద్వప్రమాణం కాదా ? తమకు అనుకూలంగా ఉండే మిలిటరీ పట్ల ఒక వైఖరి, లేని వారి పట్ల భిన్న వైఖరి.
అమెరికన్లు తమకు నచ్చని లేదా లొంగని పాలకులను తొలగించేందుకు చేసిన కుట్రలకు అంతే లేదు. ప్రతి ఖండంలో అలాంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. 1946 నుంచి 2000 సంవత్సరం వరకు కనీసం 81దేశాలలో పాలకులను మార్పు చేసేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. మిలిటరీ నియంతలను సమర్ధించింది, నియంతలుగా మారిన వారిని ప్రోత్సహించింది. బొలీవియాలో జరిగిన ఎన్నికల్లో ఇవో మోరెల్స్ విజయం సాధిస్తే అక్రమాలతో గెలిచారంటూ అక్కడి పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి మోరెల్స్, ఇతర నేతలను దేశం నుంచి బయటకు పంపారు. ఆ దుర్మార్గాన్ని అమెరికా నిస్సిగ్గుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు సమర్దించాయి. ఎలాంటి ఆంక్షలు విధించకపోగా అన్ని రకాలుగా సాయం చేశాయి. వెనెజులాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి తమ తొత్తును పాలకుడిగా గుర్తించాయి. అందువలన మయన్మార్‌లో ఆంక్షలు విధించటానికి వారికి ఉన్న అర్హత, హక్కేమిటి ? అమెరికా చర్యలను గనుక సమర్ధిస్తే లాటిన్ అమెరికాలో తమను వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోట ఆదే సాకుతో ప్రభుత్వాలను కూలదోస్తారు.
ప్రపంచ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంతో పాటు అనేక ఇతర అంశాలూ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. మయన్మార్ విషయానికి వస్తే అక్కడి నియంతల తీరుతెన్నులు ఒక పట్టాన అంతుబట్టవు. ప్రపంచ వ్యాపితంగా ప్రతి మిలిటరీ నియంత అమెరికా మద్దతు పొందిన వాడే. ఇక్కడ నియంతలను మాత్రం అమెరికా వ్యతిరేకిస్తోంది.మిలిటరీ నియమించిన మంత్రుల్లో కొంత మంది గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారున్నారు కనుక చైనాకు మిలిటరీ అనుకూలం అనే విధంగా కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. మిలిటరీ పాలనకు మద్దతుగా చైనా ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. 2015 ఎన్నికల్లోనే అంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చింది. గడచిన ఐదు సంవత్సరాలలో ఆ ప్రభుత్వం చైనాతో సన్నిహితంగానే మెలిగింది తప్ప మరొక విధంగా వ్యవహరించలేదు. గతేడాది ఎన్నికల్లో అదే పార్టీ తిరిగి విజయం సాధించింది. మిలిటరీ తిరుగుబాటుకు కొద్ది రోజుల ముందు ఈ ఏడాది జనవరిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ ఉన్నత స్దాయి ప్రతినిధి వర్గంతో మయన్మార్ పర్యటనకు వచ్చి సూకీతో భేటీ కావటం, ప్రభుత్వంతో ఆర్దిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులు అక్కడ ఉన్నందున శాంతియుత వాతావరణం ఉండాలనే కోరుకుంటుంది తప్ప మరొకటి కాదు.
చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ కార్యక్రమంలో మయన్మార్ కూడా ఉంది. అక్కడ మిలిటరీ అధికారాన్ని చేపట్టిన నేపధ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షలు ప్రకటించాయి. అందువలన అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే చైనా ఒప్పందాలు ఉన్నాయి గనుక మిలిటరీ పాలకులు అయినా మరొకరైనా ఉనికికోసం పెట్టుబడుల గురించి చైనా మీద ఆధారపడక తప్పదు. ఆ కారణంగానే గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారిని మంత్రులుగా నియమించి ఉండవచ్చు.చైనా కూడా మిలిటరీ చర్యలు అంతర్గత వ్యవహారమని భావిస్తున్నందున మన వైఖరిని ప్రశ్నిస్తున్నట్లుగానే బర్మీయులు చైనా వైఖరిని కూడా ప్రశ్నించవచ్చు. మయన్మార్ మిలిటరీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఒక పట్టాన అంతుపట్టదు. అంగ్‌సాన్ సూకీ తండ్రి అంగ్‌సాన్ బర్మా స్వాతంత్య్రసమర యోధుడు, సోషలిస్టు, కమ్యూనిస్టు.జపాన్ దురాక్రమణ నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. అప్పటికే పక్కనే ఉన్న చైనాలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో అంగ్‌సాన్ నాయకత్వంలో బర్మా కూడా కమ్యూనిస్టు దేశంగా మారుతుందనే భయంతో బ్రిటీష్ వారు చేసిన కుట్రలో భాగంగా అంగ్‌సాన్ నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తాన్ని హత్య చేశారు. మిలిటరీలోని కొందరు దీని వెనుక ఉన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన వారు అమెరికా, బ్రిటన్ ప్రోద్బలంతో చైనా చాంగ్‌కై షేక్ మిలిటరీకి బర్మాలో ఆశ్రయం కల్పించి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అస్దిరపరచేందుకు దాడులు చేయించిన చరిత్ర ఉంది. గత ఏడు దశాబ్దాలలో మయన్మార్‌లో మిలిటరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం నాలుగో వంతు మంది ఎంపీలు మిలిటరీ నియమించిన వారే, కీలకమైన శాఖల మంత్రులుగా కూడా వారే ఉంటారు. అదేమీ ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం కాదు. అంగ్‌సాన్ సూకీకి శాంతి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఆమె పాలనలోనే రోహింగ్యా మైనారిటీలపై దాడులు, దేశం నుంచి తరిమివేయాటాలు జరిగాయి. ఇప్పుడు ఆమే బందీ అయ్యారు. అందువలన నిరంకుశ, అప్రజాస్వామిక చర్యలకు ఎవరు పాల్పడినా ఖండించాల్సిందే. తమ విముక్తి కోసం తోడ్పడిన దేశ ప్రతినిధిగా మన ప్రధానిని బంగ్లాదేశ్ ఆహ్వానించింది. కానీ అదే బంగ్లాదేశ్ నుంచి శరణార్దులుగా, దేశ విభజన సమయంలో వచ్చిన వారి పట్ల బిజెపి అనుసరించిన వైఖరికి నిరసనగా నరేంద్రమోడీ రాకను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసిస్తూ ప్రదర్శనలు, జనం మీద కాల్పులు, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. అంతిమ నిర్ణేతలు ప్రజలే.