Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


సరిగ్గా ఎన్నికలకు ముందు ఒక పెద్ద ప్రచార బాంబు ప్రయోగం కేరళ ఓటర్ల మీద జరగబోతున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కాసరగోడ్‌ ఎన్నికల సభలో హెచ్చరించారు. అదేమిటి ? ఎలా ఉండబోతున్నది అనే చర్చ ఇప్పుడు మీడియాలో జరుగుతున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) విజయన్ను ప్రశ్నించాలని, విజయన్‌ కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడి చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ కోరారు. కొంత మంది రాబోయే రోజుల్లో పెద్ద బాంబు పేలబోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు ఎలాంటి బాంబులనైనా ఎదుర్కొనేందుకు మన నేల సిద్దంగా ఉందని, అలాంటి ప్రచారాల ఉద్దేశ్యం ఏమిటో జనానికి తెలుసునని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వాస్తవాల ముందు ఎంత పెద్ద అబద్దమైనా నిలవదని, నిజాలేమిటో బయటకు వచ్చేంత వరకే అలాంటివి ఉంటాయన్నారు. ఎన్నికల ప్రచార ముగింపులో అబద్దాలను ప్రచారంలోకి తెస్తే జవాబు చెప్పేందుకు అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారని, సమాధానం చెప్పేందుకు తగిన వ్యవధి ఉండదు, అబద్దాలు మనల్నేమీ చేయకపోయినప్పటికీ , వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీసే వాటి పట్ల ఎల్‌డిఎఫ్‌ కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయన్‌ కోరారు.


ప్రచార బాంబు ఏమై ఉంటుంది అన్న చర్చ అంశాల సారాంశం ఇలా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్దలు దొంగబంగారం, డాలర్ల కేసుల్లో అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాల మేరకు ముఖ్యమంత్రిని, ఇతర ప్రముఖులను ప్రశ్నించే అవకాశం ఉండవచ్చు. విచారణకు హాజరు కావాలని ఎన్నికలకు ముందు రోజు నోటీసులు జారీ చేయవచ్చు. వామపక్ష సంఘటన నేతల కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని కంపెనీలపై ఐటి, ఇతర దాడులు జరగవచ్చు. పెరియ ప్రాంతంలో జరిగిన జంట హత్యల కేసులో సిబిఐ సంచలనాత్మకంగా ఆరోపణలు చేయవచ్చు. ఇలా పరిపరి విధాల చర్చ జరుగుతోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్‌డిఎఫ్‌ అగ్రనేతలు, కార్యకర్తలు కుటుంబాల ఆత్మీయ సమావేశాలు, ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసే కార్యక్రమంలో ముమ్మరంగా నిమగమయ్యారు. ఏప్రిల్‌ ఆరవ తేదీ పోలింగ్‌ కనుక రెండు రోజుల ముందుగా బహిరంగ ప్రచార కార్యక్రమం ముగియనున్నది.


ముఖ్యమంత్రి చెబుతున్న బాంబు ఆ పార్టీలోనే పేల నున్నదని, కన్నూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలను విజయన్‌ పక్కన పెట్టారని వారి కోసమైనా ఇడి అధికారులు విజయన్‌ను విచారించాలని, ఆయన కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడులు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ అన్నారు. ఇడి కనుక విజయన్ను ప్ర శ్నించకపోతే మోడీ-అమిత్‌ షా తమ ప్రతిష్టను కోల్పోతారని చెప్పారు.

నీమమ్‌లో తెరిచిన బిజెపి ఖాతా మూత !


గత ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గంలో విజయం ద్వారా బిజెపి తెరిచిన ఖాతా ఈసారి మూసివేయక తప్పదని ముఖ్యమంత్రి విజయన్‌ చెప్పారు. గతం కంటే ఎల్‌డిఎఫ్‌ ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రానికి చేసిందేమీ లేకపోగా వివాదాల ఉత్పత్తిదారులు, పంపిణీదారులుగా తయారయ్యారన్నారు. ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్ధలు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించేందుకు సిద్దంగా లేవని, వారు ఎన్ని అవాస్తవాలు చెప్పినా అభివృద్ది గురించి జనానికి తెలుసునని, ఏప్రిల్‌ ఆరవ తేదీన తగిన జవాబు ఇస్తారని చెప్పారు. పినరయి విజయన్‌తో కేరళలో సిపిఎం అధికారం కుప్పకూలుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే త్రిపుర, బెంగాల్లో దాని ఖాతాను మూసివేశామని త్వరలో కేరళలో కూడా అదే జరుగుతుందన్నారు. దొంగబంగారం కేసులో అనుచితంగా వ్యవహరించిన ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులపై కేసు నమోదు చేశామని, అప్రూవర్‌గా మారిన సందీప్‌ నాయర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ పోలీసులు రాష్ట్ర హైకోర్టును కోరారు. ఇడి అధికారి రాధాకృష్ణన్‌ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తాను వ్యక్తిగతంగా వ్యహరించటం లేదని అందువలన తనపై నమోదు చేసిన కేసును తిరస్కరించాలని కోరారు.

దొంగ ఓట్లకు హైకోర్టు తెర – రమేష్‌ చెన్నితల నోటికి మూత !

దొంగ ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్ల గురించి కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చేసిన ఫిర్యాదులకు హైకోర్టు తెరవేసింది. అలాంటి ఓటర్లు ఎవరైనా వస్తే వారి ఫొటో, అఫిడవిట్‌ తీసుకొని నమోదు చేయాలని, వారి వేలు మీద వేసిన సిరా ఎండిపోయిన తరువాతే వారిని పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు పోనివ్వాలని హైకోర్టు పేర్కొన్నది. ఇలాంటి ఓట్ల గురించి తీసుకోదలచిన చర్యల వివరాలను కోర్టు పూర్తిగా అంగీకరించింది. ఈ తరుణంలో ఓటర్ల జాబితాలను సవరించటం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. అలాంటి ఓటర్ల వివరాలన్నింటినీ బహిరంగంగా ప్రకటిస్తామని రమేష్‌ చెన్నితల చెప్పారు. కోర్టు తీర్పు పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. రమేష్‌ చెన్నితల ఫిర్యాదు మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసిన ఎన్నికల కమిషన్‌ చర్యకు హైకోర్టు అడ్డుకట్టవేసింది. విద్యార్దులు, ఇతరులకు ప్రత్యేక కోటా కింద బియ్యం పంపిణీ చేయవచ్చని, అయితే దానిని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో కూడా రమేష్‌ చెన్నితలకు ఎదురుదెబ్బ తగిలింది.

ప్రధాని చౌకబారు ప్రచారం-క్రైస్తవ ఓటర్ల సంతుష్టీకరణ యత్నం !

ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారం సందర్బంగా చేసిన వ్యాఖ్యలు అక్కడి క్రైస్తవ ఓటర్లను సంతుష్టీకరించేందుకు చేసిన ప్రయత్నంగా భావించవచ్చు. కొంత వెండి కోసం యూదులు ఏసు ప్రభువుకు ద్రోహం చేశారని అలాగే బంగారం కోసం ఎల్‌డిఎఫ్‌ జనాన్ని మోసం చేసిందని నరేంద్రమోడీ చెప్పారు. ఒక ఐదు సంవత్సరాలు యుడిఎఫ్‌, మరొక ఐదు సంవత్సరాలు ఎల్‌డిఎఫ్‌ రాష్ట్రాన్ని దోచుకొనే విధంగా పంచుకున్నారని ఇప్పుడు బిజెపి వచ్చినందున అదింకేమాత్రం సాగదని మోడీ అన్నారు. పాలక్కాడ్‌లో పోటీ చేస్తున్న మెట్రో మాన్‌ శ్రీధరన్‌ అధికారం కావాలనుకుంటే రెండు దశాబ్దాల క్రితమే రాజకీయాల్లో చేరి ఉండేవారన్నారు. శబరిమల సమస్య రాష్ట్ర సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినవని , వాటిని కాపాడేందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ అరెస్టయ్యారని, ఆ సమయంలో యుడిఎఫ్‌ మౌనంగా ఉందని నరేంద్రమోడీ ఆరోపించారు. అనేకసార్లు వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నదని, దాని నాయకులనేక మంది గూండాల మాదిరి వ్యవహరించారని, బిజెపి అధికారానికి వస్తే వాటన్నింటికీ తెరపడుతుందని ప్రధాని అన్నారు.
కేరళలో తాము అధికారానికి వస్తే నెలకు ఆరువేల రూపాయల చొప్పున పేదవారికి అందచేస్తామని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నలభై ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు రాజకీయాల్లోకి రాని కారణాన్ని వివరిస్తూ అందరు గృహిణుల్లాగే తాను కూడా పిల్లల సంరక్షణ, ఇల్లు, వంట కోసం ఇంటికే పరిమితం అయ్యానని అన్నారు. నేను ఎప్పుడూ వంట చేయలేదని ఇల్లు శుభ్రం చేయలేదని అనుకోవచ్చు, కానీ నేనా పని చేశానని నమ్మండి అన్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే అధికారంలో ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

బిజెపి చౌకబారు ప్రచారం – గడ్డి పెట్టిన వరదల హీరో !

కేరళలో సంభవించిన అసాధారణ వరదల సమయంలో అనేక మందిని రక్షించిన మత్స్యకారుడు జైసాల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు బిజెపి చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ఇంటికి వచ్చిన బిజెపి అభ్యర్ది సత్తార్‌ హాజీ వరదల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొన్నందుకు అభినందించాలనుకుంటున్నామని చెపితే అంగీకరించగా వారి పార్టీ కండువా కప్పి ఫొటో తీసుకున్నారని, తాను చేసిన దానికి గతంలో అనేక పార్టీలు, సంస్దలు తనను అభినందించాయని, దానిలో భాగంగానే ఇది అనుకున్నాను తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారానికి దాన్ని వినియోగించుకుంటారని తాను భావించలేదన్నారు. బిజెపిలో చేరేది లేదు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. తాను సిపిఎం అభిమానినని, ఆ పార్టీ భావజాలంతో ఏకీభవిస్తానని చెప్పారు. తన పడవ ద్వారా వరద బాధితులను రక్షించిన వీడియో పెద్ద సంచలనం కలిగించి జైసాల్‌కు ఎంతో పేరు తెచ్చింది. తాజా ఎన్నికల్లో తిరురంగడి నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ది నియాల్‌ పులికలకమ్‌కు ధరావత్తు సొమ్ము చెల్లించి జైసాల్‌ తన అభిమానాన్ని ప్రదర్శించారు.