Tags
#Pinarayi Vijayan, Co-le-b nexus in Kerala, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M)
ఎం కోటేశ్వరరావు
కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్-ముస్లింలీగుతో చేతులు కలిపింది నిజమే అంటూ మరో బిజెపి నేత సికె పద్మనాభన్ అప్రూవర్‌గా మారారు.2001లో కూడా అలాంటి అవగాహన ఉందన్నారు. ముస్లింలీగు నేత కున్హాలీకుట్టి, దివంగత కేరళ కాంగ్రెస్ నేత మణి, తాను, తమ నేతలు పిపి ముకుందన్, కేరళ బిజెపి పర్యవేక్షకుడు దేవ ప్రకాష్ గోయల్ కాసరగోడ్‌లో సమావేశమై సహకరించుకొనే విషయాలను చర్చించినట్లు పద్మనాభన్ చెప్పారు. 1991 ఎన్నికల్లో తాను కాసరగోడ్ లోక్‌సభ స్ధానంలో పోటీ చేయగా తమ నేత మరార్ మంజేశ్వరం అసెంబ్లీకి పోటీ చేశారని, మరార్ విజయం సాధించేట్లు చూడాలని కాంగ్రెస్-ముస్లింలీగ్ ఒక అవగాహనకు వచ్చాయని తమకు తెలిపారని, అయితే రాజీవ్ గాంధీ హత్యతో అంతా తారుమారైందని పద్మనాభన్ మాతృభూమి న్యూస్‌తో చెప్పారు. ప్రతిసారీ కాంగ్రెస్ తమను మోసం చేస్తున్నదని చెప్పారు.అదింకే మాత్రం కుదరదన్నారు. 2001 ఎన్నికల్లో తాను మంజేశ్వరమ్ బిజెపి అభ్యర్దిగా ఉన్నపుడు జరిగిన సమావేశంలో సిపిఎం వ్యతిరేక ఓట్ల గురించి చర్చించామన్నారు.1991లో మాదిరి మోసం చేస్తే కుదరదని తాను స్పష్టం చేశానన్నాను. కాంగ్రెస్, ముస్లింలీగ్‌లకు తమ ఓట్లు కావాలని అయితే మైనారిటీలు దూరం అవుతారనే భయంతో వారు బయటకు చెప్పరని, ఇప్పుడు వారి జిమ్మిక్కులు తమ మీద పని చేయవని వారు గ్రహించి ఉంటారని పద్మనాభన్ చెప్పారు. మూడు పార్టీల మధ్య ఉన్న అవగాహన నిజమే అని సీనియర్ నేత ఓ రాజగోపాల్ కొద్ది రోజుల క్రితం నిర్దారించిన విషయం తెలిసిందే. తమ మధ్య కుమ్మక్కు లేదని ముస్లింలీగులో ప్రముఖుడిగా ఉన్న కున్హాలీకుట్టి చెబుతున్నారు. పద్మనాభన్‌తో సహా బిజెపి నేతలను తాను కలసినట్లు గుర్తు లేదన్నారు. బిజెపి-సిపిఎం కుమ్మక్కు గురించి తాము బయట పెట్టిన తరువాత దాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.
క్రైస్తవుల మీద దాడులు చేసిన వారు ఏసు పేరు చెప్పి ఓట్లడుగుతున్నారు : విజయన్
క్రైస్తవుల మీద దాడులు చేసిన వారే కేరళలో ఏసు క్రీస్తు పేరుతో ఓట్లడిగేందుకు వచ్చారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎద్దేవా చేశారు. కొద్ది పాటి వెండికోసం యూదులు ఏసుక్రీస్తును దెబ్బతీశారని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపధ్యంలో విజయన్ స్పందించారు. ఏసు క్రీస్తు, యూదులు అంటూ మాట్లాడుతున్నవారు క్రైస్తవులను ప్రయాణాలు, ప్రార్ధనలు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఒడిషాలోని కందమాల్ ప్రాంతంలో గ్రాహమ్ స్టెయిన్స్, ఆయన ఇద్దరు పిల్లలను సజీవదహనం చేసి హత్య చేసిన దారుణం వెనుక ఉన్న వారికి కేంద్రంలో మంత్రి పదవులిచ్చారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం తరువాత దేశంలో పాలక పార్టీల అండతో రెండు పెద్ద మారణకాండలు జరిగాయని ఒకటి 1984లో కాంగ్రెస్ నాయకత్వాన ఢిల్లీలో వేలాది మంది సిక్కులను చంపివేశారని, 2002లో గుజరాత్‌లో సంఘపరివార్ సంస్ధలకు చెందిన వారు ముస్లింలను ఊచకోశారని, అలాంటి పార్టీల వారు కేరళ వచ్చి తమకు అహింస గురించి బోధలు చేస్తున్నారని, గత ఏడాది జరిగిన స్ధానిక సంస్ద ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బిజెపిలకు చెందిన వారు ఆరుగురు కమ్యూనిస్టులను హత్య చేశారని వారు ఇప్పుడు శాంతిదూతలుగా ఫోజు పెడుతున్నారని విజయన్ అన్నారు. మన పొరుగునే ఉన్న మయన్మార్‌లో రోహింగ్యా మైనారిటీల మీద సైన్యం దాడులు చేసినపుడు మెజారిటీ మౌనంగా ఉందని , ఇప్పుడు మెజారిటీ పౌరుల మీదనే అదే మిలిటరీ విరుచుకుపడుతోందని, ఫాసిస్టులు ఎలా ప్రవర్తిస్తారో అందరూ తెలుసుకోవాలని విజయన్ చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ది గురించి చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్దంగా ఉన్నారా అంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సవాల్ విసిరారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ తాజా నివేదిక ప్రకారం అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా కేరళ ఉన్నట్లు, కాంగ్రెస్ పాలనలోని రాజస్దాన్‌లో పెద్ద ఎత్తున ఉందని తేలిందన్నారు. కేరళ పరిస్దితులను తెలుసుకోకుండా రాష్ట్ర నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని నోట కరుచుకొని జాతీయ నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారని విమర్శించారు.
2,224 దొంగబంగారం కేసుల్లో అధికారులు, బిజెపి నేతలకు సంబంధాలు !
తిరువనంతపురం విమానాశ్రయంలో రాయబార కార్యాలయ సంచుల్లో దొరికిన 30 కిలోల దొంగబంగారం గురించే మీడియా తరచూ ప్రస్తావిస్తున్నది. దాన్ని ముఖ్యమంత్రికి, ఇతర ఎల్‌డిఎఫ్ ప్రముఖులకు అంటకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని కేంద్రం చూస్తున్నది, దానికి కాంగ్రెస్ వంతపాడుతున్నది. సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కస్టమ్స్‌శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్‌ఆర్ గోస్వామి ఇచ్చిన సమాచారం మేరకు 2015 ఏప్రిల్ నుంచి 2021 ఫిబ్రవరి 28వరకు కేరళలోని నాలుగు విమానాశ్రయాలలో 2,224 కేసుల్లో 374.52 కోట్ల రూపాయల విలువగల 1327కిలోల బంగారం దొరికింది.
చిత్రం ఏమంటే ఈ కేసుల్లో ఏమి చేశారు అన్న ప్రశ్నకు బంగారాన్ని తీసుకువస్తున్నవారి మీద ఆరోపణలు మోపటం తప్ప అసలు ఆ బంగారం స్వంతదారుల మీద ఎలాంటి చర్యలూ లేవు. అత్యధిక సందర్భాలలో ఈ బంగారం గుజరాత్‌లోని మార్వాడీలకు చేర్చేందుకు ఉద్దేశించిందని తేలింది. వారందరికీ బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.ఈ కారణంగానే కేసులు నమోదు తరువాత అడుగు ముందుకు సాగటం లేదు. అసలు నేరగాండ్లలో ఒక్కరిని కూడా బయటకు లాగలేదు. యుఏయి నుంచి దౌత్యపరమైన సంచుల్లో వచ్చి పట్టుబడిన బంగారాన్ని పంపింది ఎవరు, ఎవరికోసం పంపారో కూడా గత తొమ్మిది నెలల్లో కేంద్ర సంస్దలు తేల్చలేకపోయాయి. మలప్పురం సమీపంలో కరిపూర్ విమానాశ్రయంలో దొరికిన దొంగబంగారానికి సంబంధించి ముగ్గురు సూపరింటెంట్లతో సహా 14 మంది కస్టమ్స్ అధికారులను సిబిఐ పట్టుకుంది.
కాంగ్రెస్ అబద్దాల యంత్రానికి చార్జింగ్ చేస్తున్న బిజెపి – ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన చర్చి !
కాంగ్రెస్‌లోని రమేష్ చెన్నితల అబద్దాల యంత్రానికి బిజెపి నేత సురేంద్రన్ చార్జింగ్ చేస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయాన్నే ఒక అబద్దాన్ని చెన్నితల తన యంత్రం నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఆ యంత్రానికి సురేంద్రన్ చార్జింగ్ చేస్తున్నారని అన్నారు.కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యుడిఎఫ్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడరని, కేరళలో ప్రత్యేకంగా తయారు చేసిన ఫెవికాల్ అంటించుకొని నోళ్లు మూసుకు వస్తారని బృందా ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితలకు బుర్ర సరిగా పని చేస్తున్నట్లు లేదని కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎంఎం మణి వ్యాఖ్యానించారు. అదానీ కంపెనీ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని చెన్నితల ఆరోపణ చేయటం ఆయన స్ధితిని వెల్లడిస్తున్నదన్నారు. ఎవరి దగ్గర నుంచి ఎంతకు విద్యుత్ కొనుగోలు చేసిందీ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉంది చూడవచ్చన్నారు. రాష్ట్రం కేంద్ర గ్రిడ్ నుంచి కొనుగోలు చేసింది తప్ప ప్రయివేటుగా చేయలేదన్నారు. యుడిఎఫ్ హయాంలో పది సంవత్సరాలకు కుదుర్చుకున్న అక్రమ ఒప్పందాలను రద్దు చేయాలన్నా కుదరలేదని మణి చెప్పారు. దానిలో షరతులు ప్రకారం రాష్ట్రం ఒప్పందం నుంచి వైదొలిగితే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. విమానాశ్రయంలో బంగారం దొరికితే రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయలేదని గతంలో రమేష్ చెన్నితల చేసిన వ్యాఖ్యలను బట్టే ఆయన బుర్రపని చేయటం లేదని తేలిందన్నారు.
కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా జోక్యం చేసుకొన్న చరిత్ర ఉన్న కేరళ చర్చి అధికారులు ఈ ఎన్నికల్లో కూడా అదేపనిలో నిమగమైనట్లు కనిపిస్తోంది. త్రిసూరు నుంచి వెలువడే ” కాథలికో సభ ” అనే పత్రికలో తాజాగా రాసిన వ్యాసంలో కాంగ్రెస్ ప్రస్తావన లేకుండా ఎల్‌డిఎఫ్, బిజెపిల మీద ధ్వజమెత్తటాన్ని చూస్తే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. పరోక్షంగా బిజెపి మతతత్వాన్ని విమర్శించటంతో పాటు దొడ్డిదారిన సిపిఎం కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కూడా పునశ్చరణ కావించటం ద్వారా ఎవరికి ఓటు వేయాలో సూచించినట్లయింది.
35 చోట్ల హౌరా హౌరీ పోటీ -ఓట్ల వ్యాపారులుగా మోడీ అనుచరులు !
ఏప్రిల్ ఆరవ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం నాడు ప్రచారం ముగియనుంది. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నూట నలభైకి గాను 35 చోట్ల హౌరా హౌరీ పోటీ జరుగుతోందని ప్రస్తుత సరళి వెల్లడిస్తోంది. తమకు బలం ఉందని భావిస్తున్న రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్-ముస్లిం లీగుతో కుమ్మక్కయిన కారణంగానే నామినేషన్ పత్రాలు సరిగా వేయకుండా తిరస్కరణకు గురయ్యేట్లు చూసుకుందని బిజెపి మీద విమర్శలు వచ్చాయి. అవి పోను ఐదు చోట్ల చావో రేవో అన్నట్లు బిజెపి అభ్యర్దులు పోటీ చేస్తున్నారు. నరేంద్రమోడీ అనుచరులుగా ఉన్న వారు ఓట్ల వ్యాపారంలో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో నీమమ్‌లో బిజెపి ఎలా గెలిచిందో మోడీ చెప్పాలని అన్నారు. రాజ్యసభ ఎన్నికల గురించి స్వతంత్ర నిర్ణయం తీసుకొనేందుకు ఎన్నికల సంఘానికి అధికారం ఉందని కేంద్ర మంత్రి వి. మురళీధరన్ చెప్పారు. కేరళలో ఏప్రిల్ 12న జరగాల్సిన మూడు రాజ్యసభ స్ధానాల ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసినదే. దాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ మీద స్పందించిన ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేది తెలుపుతామని హామీ ఇచ్చింది.