Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


పుదుచ్చేరిలో పాగా వేసేందుకు బిజెపి చేసిన వాగ్దానం ఆ పార్టీకి ఆంధ్రప్రదేశలో ఎదురు తన్నిందా ? జరిగిన పరిణామాలను చూస్తే పెద్ద ఇరకాటంలో పడిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఐదు సంవత్సరాల క్రితం బీహార్‌ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ స్వయంగా ప్రత్యేక పాకేజ్‌లను ప్రకటించారు. తరువాత వాటికి అతీగతీ లేదు. ఇప్పుడు అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే పుదుచ్చేరి వాసుల విషయంలో జుమ్లా (అవసరార్దం అనేకం చెబుతుంటాం) కూడా కావచ్చు. తరువాత నిబంధనలు అంగీకరించటం లేదు, ఇతర రాష్ట్రాలు అభ్యంతర పెడుతున్నాయంటే చేసేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాను డిమాండ్‌ చేసిన పార్టీగా గొప్పలు చెప్పుకున్న బిజెపి తరువాత ఆ విషయంలో చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర ద్రోహిగా ప్రజల ముందు తన స్వరూపాన్ని వెల్లడించుకుంది. ప్రత్యేక హౌదా ముగిసిన అధ్యాయంగా, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హౌదాలేమీ ఉండవు అని చెప్పి ఓట్లు వేసినా వేయకపోయినా దానికే తాము కట్టుబడి ఉంటామని అది కూడా తమ ఘనతే అన్నట్లుగా వ్యవహరించింది. ఇప్పుడు పుదుచ్చేరిలో పాగా వేసేందుకు అక్కడి ప్రజలకు ప్రత్యేక హౌదా ఎరవేసింది. తమకు అధికారం అప్పగిస్తే ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంత హౌదా కల్పించి జమ్మూకాశ్మీరుకు ఇచ్చిన మాదిరి కేంద్ర పన్నుల వాటాను 25 నుంచి 40శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నది. అదే విధంగా కేంద్ర పధకాలకు గాను ప్రస్తుతం 70శాతం కేంద్ర పాలిత ప్రాంతం, 30శాతం కేంద్ర వాటాగా ఉన్నదానిని 30:70శాతాలుగా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. దీని మీద తెలుగుదేశం నేత లోకేష్‌ ట్వీట్లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హౌదాకోసం పోరాడుతుందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హౌదాకోసం ఒక్క ప్రభుత్వం, అధికారపక్షమే కాదు, ఎవరైనా పోరాడవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ అలాంటి నైతిక హక్కును కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌కు కావాలని కోరిన ప్రత్యేక హౌదాకు, పుదుచ్చేరికి ఇస్తామంటున్న హౌదాకు సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్దించుకున్నారు.
కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసిన కేంద్రం దానికి నలభైశాతం నిధులు ఇవ్వకపోతే అక్కడ దాని పరువు దక్కదు, తిరిగి రాష్ట్ర హౌదా ఇస్తామని చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మరొక రాష్ట్రం ఢిల్లీ. అక్కడ ప్రభుత్వానికి అధికారాలను తగ్గించి, లెప్టినెంట్‌ గవర్నరకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. అలాంటిది పుదుచ్చేరికి అధికారాలు, నిధులను ఎలా పెంచుతారు ? ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక ప్రాతిపదిక మరొక రాష్ట్రానికి మరొక ప్రాతిపదికా అన్న ప్రశ్న ముందుకు రానుంది. పుదుచ్చేరికి ఇలాంటి ప్రత్యేక హౌదా ఇచ్చేందుకు ప్రాతిపదిక ఏమిటి అన్నది ప్రశ్న. ఏ కమిటీ లేదా ఏ ఆర్ధిక సంఘం సిఫార్సులు దీనికి అవకాశం కల్పిస్తున్నాయి ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాకు బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామని చెప్పిన కేంద్రం ఇలాంటిదానినే ఎందుకు అమలు జరపకూడదు ? ఇప్పటికే ఇరకాటంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ పుదుశ్చేరి తరహా హౌదాకోసమైనా కేంద్ర తాట తీసేందుకు, తోలు వలిచేందుకు తన పవర్‌ను చూపుతారా ? పులిలా గాండ్రిస్తారా, పిల్లిలా మ్యావ్‌ అంటారా ?

ఏపిలో ముద్దులాట – తెలంగాణాలో దెబ్బలాట : నాగార్జున సాగర్‌లో పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఎవరికి ?

ఆంధ్రప్రదేశ్‌లో తమ కూటమి అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన రాష్ట్రంలో కొత్త రాజకీయ అంకానికి తెరలేపింది. దాని మీద పవన్‌ కల్యాణ్‌ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మరో మూడు సంవత్సరాల వరకు ఎన్నికలు లేకపోయినా ఇప్పుడే ప్రకటించటం గురించి చర్చ జరుగుతున్నది. స్ధానిక సంస్దల ఎన్నికలలో ఫలితాలు, విశాఖ ఉక్కు వంటి ఇతర అంశాలను చూసిన తరువాత బిజెపితో తెగతెంపులు చేసుకుంటామని కొద్ది రోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌ చేసినట్లు చెబుతున్న హెచ్చరికల నేపధ్యంలో సోము వీర్రాజు తిరుపతి ఎన్నికల ఆపద మొక్కుగా ఈ ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదన్నది ఒక అభిప్రాయం. పవన్‌ కల్యాణ్‌ అంటే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు సైతం ఎంతో ఇష్టమని, పవన్‌ కల్యాణ్‌ను ఎంతో గౌరవంగా చూడాలని వారు చెప్పారని వీర్రాజు చెప్పారు. బిజెపి ఎక్కడా ఇంత వరకు ఇంత ముందుగా లేదా ఎన్నికల సమయంలో గానీ ముఖ్యమంత్రి అభ్యర్దులను ప్రకటించలేదు, దానికి భిన్నంగా ఈప్రకటన చేయటం రాజకీయ అవకాశవాదం అంటున్నవారు లేకపోలేదు. తిరుపతిలో తమ అభ్యర్దిని రంగంలోకి దించకపోతే బిజెపికి మద్దతు ఇచ్చేది లేదని కాపు సామాజిక తరగతికి చెందిన కొన్ని సంఘాల నేతలు హెచ్చరించిన నేపధ్యంలో వారిని బుజ్జగించి ఏమార్చేందుకు ఈ ప్రకటన చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. రామాయణంలో పిడకల వేట మాదిరి సోము వీర్రాజు ప్రకటనకు వైసిపి అసంతృప్త ఎంపీ రఘురామ కృష్టం రాజు మరో వ్యాఖ్యానం చెప్పారు. తమ పార్టీలో ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్లుగా ఈ ప్రకటనతో జరిగేదేమీ లేదని, తిరుపతి ఎన్నికల నేపధ్యంలో సోము వీర్రాజు ఒక బిస్కెట్‌ వేశారని వైసిపి నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద వీర్రాజు ప్రకటన నవ్వుల పాలైందని, పవర్‌ స్టార్‌ పరువు తీసిందని కొందరి అభిప్రాయం. అసలు తమది పెద్ద పార్టీ అయితే ముఖ్యమంత్రి అభ్యర్దిగా పవన్‌ కల్యాణ్‌ అని ప్రకటించటానికి వీర్రాజు ఎవరని కొందరు జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బిజెపి-పవన్‌ కల్యాణ్‌ సంబంధాలు సజావుగా లేవన్నది స్పష్టం. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల రోజున పోలింగ్‌ జరుగుతుండగా తెరాస అభ్యర్ది సురభి వాణీ దేవికి మద్దతు ప్రకటిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసి ప్రకటనే అందుకు నిదర్శనం. ఎన్ని ఓట్లు ఉన్నాయి లేవు అన్నది పక్కన పెడితే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణా బిజెపి నేతలు తనను అవమానించారనే ఆగ్రహంతో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు.

రుణ ఊబిలో జగనాంధ్ర ప్రదేశ్‌ – నిజాలను ఎంతకాలం దాస్తారు ?

కొన్ని సంక్షేమ పధకాలకు ఏదో ఒక సాకుతో కోత పెట్టక తప్పని స్ధితి, అది ఇంకా పూర్తి కావాల్సిన మండల, జిల్లా పరిషత్‌, అదే విధంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల మీద పడకుండా చూసుకోవాల్సిన అగత్యం ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే ఓట్‌ఆన్‌ అకౌంట్‌తో అవన్నీ పూర్తయ్యేంత వరకు కాలక్షేపం చేద్దామనే ఆలోచనతో బడ్జెట్‌ను వాయిదా వేశారన్నది కాదనలేని సత్యం. దానికి అధికార పార్టీ ఏ సాకులు చెప్పినా అవి అతికేవి కాదు. అప్పుల గురించి కాగ్‌ చేసిన హెచ్చరిక, అది మీడియాలో చర్చకు దారి తీయటంతో ప్రభుత్వం తాజాగా సమాచార శాఖ ద్వారా ఒక పెద్ద వివరణ విడుదల చేసింది. దాన్ని రాసిన వారు ప్రభుత్వాన్ని సమర్ధించేందుకు ఎన్నో సాము గరిడీలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే రికార్డు స్ధాయిలో అప్పులు చేసింది, మేమెంత అన్నట్లుగా చివరకు అప్పులు తీసుకురాక తప్పటం లేదు, సమర్ధనీయమే అని సమర్ధనకు పూనుకుంది. పోనీ దీనిలో అయినా నిజాయితీ ఉందా ?

అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పుచేశాడన్నట్లు !


సమాచార శాఖ వివరణలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక పరిస్దితి కారణంగా కేంద్ర ప్రభుత్వమే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 18,48,655 కోట్లు అప్పు చేసింది. దేశ చరిత్రలో ఇంత మొత్తం అప్పు ఎన్నడూ చేయలేదు.కేంద్ర ప్రభుత్వ పని తీరు మొత్తం దేశానికి ఒక సూచిక.2014-19 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ అప్పు 56,48,471 కోట్ల నుంచి 84,68,085 కోట్లకు పెరిగింది. వృద్ది 49.92శాతం, వార్షిక వృద్ది రేటు 8.44శాతం. అదే రాష్ట్ర విషయంలో పైన చెప్పుకున్న కాలంలోనే 1,11,528 నుంచి 2,59,087 కోట్లకు పెరిగింది, వృద్ది 132.31శాతం, వార్షిక వృద్ది రేటు 18.36శాతం. ఇదంతా తెలుగు దేశం పాలనా కాలంలో జరిగింది.
కేంద్రంలో మోడీ 2.0, రాష్ట్రంలో వైసిపి 1.0 పాలనా కాలంలో అంటే 2019 మార్చి నుంచి 2021 మార్చినెల వరకు కేంద్ర అప్పులు 84,48,085 కోట్ల నుంచి 1,12,50,391 కోట్లకు, వృద్ది రేటు 32.86, వార్షిక వృద్ది రేటు 15.26శాతం ఉండగా రాష్ట్ర అప్పులు 2,59,087 నుంచి 3,48,998 కోట్లకు, వృద్ది రేటు 34.70, వార్షిక వృద్ది రేటు 16.06 శాతం ఉంది.
ఈ అంకెలతో ఎవరికీ పేచీ లేదు. వాటికి చెప్పే వ్యాఖ్యానాలే వివాదాస్పదం. సమాచార శాఖ విడుదల చేసిన అంకెలు వాస్తవమేనా ? ముఖ్యంగా వైసిపి రెండు సంవత్సరాల పాలనలో అప్పుగా పేర్కొన్న 3,48,998 కోట్ల రూపాయల అంకెలను ఏడాది క్రితం బడ్జెట్‌లోనే పేర్కొన్నారు. వాటిలో మార్పులేమీ లేవా ? సమర్ధనీయంగా పాలన ఉంటే అప్పులు తగ్గాలి, లేకపోతే పెరగాలి, పదిహేను నెలల నాటి అంకెలనే వల్లెవేస్తే కుదరదు. తెలుగుదేశం సర్కార్‌ చివరి ఏడాది రూ. 38,151 కోట్ల మేర అప్పులు తెచ్చింది. దాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌ తొలి ఏడాది ఆ మొత్తాన్ని 52వేల కోట్లకు పెంచారు. వర్తమాన సంవత్సరానికి 48,295 కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. కాగ్‌ చెప్పిన అంశాల ప్రకారం నవంబరు చివరి నాటికే రాష్ట్రం 73,811 కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. నెలకు 9,226 కోట్ల రూపాయల చొప్పున ఉంది, మొత్తం అప్పు 3,73,140 కోట్లుగా ఉంది,డిసెంబరు-మార్చినెలల మధ్య ఇదే తీరున అప్పులు తెస్తే మరో 37 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయవచ్చని అంచనా వేసింది. అంటే అప్పు నాలుగు లక్షల పదివేల కోట్ల చేరువలో ఉంటుంది. ఈ మొత్తంగాక వివిధ ప్రభుత్వ సంస్దలు తీసుకున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే హామీదారుగా ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణించాలి. అయితే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం విధించిన జిఎస్‌డిపిలో మూడుశాతం రుణ పరిమితి దాటలేదు అని లెక్కల్లో చూపేందుకు ఆ మొత్తాలను విడిగా చూపుతున్నారు. చంద్రబాబు నాయుడి సర్కార్‌ చేసిన పనినే జగన్‌ ప్రభుత్వం కూడా చేస్తోంది. అందువలన అప్పు నాలుగున్నరలక్షల కోట్ల వరకు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వెల్లడించకపోయినా మూడు నెలల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో వాటిని వెల్లడించకతప్పదు. అందుకే పాత అంకెలను వల్లెవేస్తే తరువాత విమర్శకులకు మరో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 54వేల 250 కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 11వేల కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌, 3,02,202, 67,171 చొప్పున మొత్తం 3,69,373 కోట్లకు పెంచింది. 2021 మార్చి నాటికి 3,48,998 అప్పు పెరుగుతుందని పేర్కొన్నది, వీటికి అదనంగా హామీగా ఉన్న అప్పును కలుపుకోవాల్సి ఉంది. లక్ష్యానికి మించి అదనంగా చేసిన అప్పు, ప్రభుత్వం హామీ ఇచ్చిన అప్పులు మొత్తం నాలుగున్నర లక్షల కోట్లు దాటటం ఖాయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2020వరకు నాలుగు సంవత్సరాలలో 27.92శాతంగా ఉన్న అప్పు 2021 మార్చి నాటికి 34.55 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగవచ్చు.
సమాచారశాఖ విడుదల చేసిన వివరణ పత్రంలో చెప్పినదాని ప్రకారం 2014-19 మధ్య రుణాల చెల్లింపు మొత్తం రు.25వేల కోట్లకు పెరిగింది. తెచ్చిన అప్పులను ఉత్పాదక ఖర్చుగా చేసి ఉంటే అనేక రంగాలు గణనీయంగా అభివృద్ది చెంది ఉండేవి, కాని అలా జరగలేదు అని పేర్కొన్నారు. తెలుగుదేశం అలా చేయలేదు సరే తమ రెండు సంవత్సరాల పాలనలో వైసిపి తెచ్చిన అప్పులను నవరత్న అనుత్పాదక సంక్షేమ పధకాలకు తప్ప ఇతరంగా ఏ ఉత్పాదక కార్యకలాపాల మీద ఖర్చు చేశారు, ఏమి సాధించారు అన్నదే ప్రశ్న.

నూతన ఎన్నికల కమిషనర్‌-పాత సవాళ్లు !


ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనరుగా మాజీ ప్రధాన కార్యదర్శి, తరువాత రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించారు.సాధారణంగా అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనరు నియామకం పెద్ద చర్చనీయాంశం కాదు. అనేక మంది కమిషనర్ల నియామకం-పదవీ బాధ్యతల విరమణ వార్తలు కూడా గతంలో తెలిసేవి కాదు. కేంద్రంలో టిఎన్‌ శేషన్‌, రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల కమిషన్లకు ఉన్న అధికారాలు ఎలాంటివో దేశానికి చూపించారు. గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వమూ-రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య జరిగిన ప్రచ్చన్న, ప్రత్యక్ష యుద్దంలో మొత్తం మీద ఎన్నికల కమిషనర్‌దే పై చేయి అన్నది స్పష్టం. కింద పడినా గెలుపు మాదే అన్నట్లుగా అధికార పార్టీ నేతలు ఎంతగా, ఎలా సమర్దించుకున్నా వాస్తవాలు, కోర్టు తీర్పులు దానినే నిర్ధారిస్తాయి. తమ ఇష్టాను సారంగా ఒక ఎన్నికల కమిషనరును తొలగించటం సాధ్యం కాదని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ముక్కు పగల కొట్టించుకుంది. కొత్త ఎన్నికల కమిషనరు ముందు అధికారపక్షం వైపు నుంచి గతం మాదిరి ఎలాంటి సమస్యలు తలెత్తకపోవచ్చు. అయితే ప్రతిపక్షాల నుంచి అలాంటి పరిస్దితిని ఆశించలేము. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పూర్తయిన తరువాత మధ్యలో మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప లోక్‌సభ, అసెంబ్లీ గడువు ప్రకారం మూడు సంవత్సరాల పాటు అసలు ఎన్నికల కమిషనరు గురించి వార్తలే ఉండకపోవచ్చు.
స్వేచ్చగా ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవటంతో జిల్లాపరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీని మీద పార్టీలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు మరింత నీరుగారి పోతారని భయపడుతున్నారు. ఎన్నికలలో పాల్గొనాలా ? బహిష్కరించాలా అన్న తర్జన భర్జనలో బహిష్కరించాలని మెజారిటీ తెలుగుదేశం నేతలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున బహిష్కరించినా పోటీలో ఉన్న కారణంగా ఎన్నికలైతే జరుగుతాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎదురైన పరాజయాల నేపధ్యంలో తమకు అంతకు మించి భిన్నమైన ఫలితాలు రావన్నది తెలుగుదేశం అభిప్రాయం అన్నది స్పష్టం.
ఇక ఎన్నికల కమిషనరు విషయానికి వస్తే గతేడాది నామినేషన్ల సమయంలో అధికారపార్టీ ప్రత్యర్ధుల మీద దాడి చేసి నామినేషన్లు వేయనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందనే ఆరోపణలు, విమర్శల మీద ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. గత ఎన్నికల కమిషనరు కొందరు పోలీసు, జిల్లా కలెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఒక వేళ గత కమిషనరు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే నూతన కమిషనరు విమర్శల పాలవుతారు, చర్యలకు ఉపక్రమిస్తే మరోమారు ప్రభుత్వంతో కయ్యం పెట్టుకోవాల్సి వస్తుంది. కేంద్రానికి గత కమిషనరు రాసిన లేఖలో తన రక్షణ విషయాలతో పాటు ఎన్నికల్లో అక్రమాల గురించిన ప్రస్తావన కూడా ఉన్నందున ఆ లేఖను వెనక్కు తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్న.