Tags
#Pinarayi Vijayan, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala political scene
ఎం కోటేశ్వరరావు
” ప్రియమైన భక్తులారా నేను ఎన్నికలలో పోటీ చేయటం లేదు. దయచేసి నా పేరుతో ఓట్లు అడిగే వారు దొంగ భక్తులని తెలుసుకోండి. వారి గడ్డాలు, జులపాలు చూసి మోసపోకండి. మీ అయ్యప్ప, స్వామి శరణం ” అంటూ అయ్యప్ప బొమ్మతో పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు కేరళలో సంచలనం అయింది. స్వామి సందీపానందగిరి తన ఖాతాలో అయ్యప్ప స్వామి భక్తులతో మాట్లాడినట్లు పెట్టిన పోస్టు ద్వారా బిజెపి, గడ్డం పెంచుతున్న నరేంద్రమోడీని ఉతికి ఆరేసినట్లయింది. కేరళ ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ అయ్యప్ప నామ స్మరణతో ప్రసంగాలను ప్రారంభించి సుప్రీం కోర్టులో ఉన్న వివాదాన్ని పరోక్షంగా ముందుకు తెచ్చి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వెలువడ్డాయి. కేరళకు చేసిన అన్యాయానికి ప్రాయచిత్తంగా నరేంద్రమోడీ అయ్యప్ప నామ స్మరణతో క్షమించాలని వేడుకొని ఉంటారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చురక అంటించారు. అయ్యప్ప భక్తుల మీద పోలీసులను ప్రయోగించిన దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్ర మంత్రి చేసిన పాపం ఐదు వందల సంవత్సరాలు తపస్సు చేసినా పోదని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని, దాన్ని ప్రశ్నించిన వారి కాళ్లు ఇరగ్గొడుతున్నారని కన్నూరులో జరిగిన ప్రచారంలో ఆమె ఆరోపించారు. ఆదివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా అన్ని పార్టీలు ప్రధానంగా రోడ్డు షోలు నిర్వహించాయి. ప్రచార గడువు ముగియటంతో మైకులు, నాయకుల నోళ్లు మూతపడ్డాయి.
అదానీ విద్యుత్ కొనుగోలు -రమేష్ చెన్నితల అబద్దాలు !
అదానీతో ఒప్పందం చేసుకొని అత్యధిక రేట్లకు ఎల్‌డిఎఫ్ సర్కార్ సౌర విద్యుత్ కొనుగోలు చేసిందన్న ఆరోపణ చేసిన కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల తన మాటలను తానే మింగాల్సి వచ్చింది. మార్కెట్లో యూనిట్ రెండు రూపాయలకు విద్యుత్ లభిస్తుండగా పాతిక సంవత్సరాల పాటు అమలులో ఉండే ఒప్పందం ద్వారా యూనిట్‌కు రు.2.83 చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని వెయ్యి కోట్ల లబ్ది చేకూర్చే విధంగా అక్రమాలకు పాల్పడ్డారని, అదానీ ప్రత్యేక విమానంలో కన్నూరు విమానాశ్రయానికి వస్తే ఆయనతో కలసి ముఖ్యమంత్రి, ఇతరులు మంతనాలు జరిపారని చెన్నితల తప్పుడు ఆరోపణలు చేశారు. దాన్ని పట్టుకొని ఇతర కాంగ్రెస్ నేతలు పాడిందే పాడారు. అయితే వాస్తవాలు ఇలా ఉన్నాయి. కేరళ ప్రభుత్వం సౌరవిద్యుత్‌ను అసలు కొనుగోలు చేయలేదు. ఏప్రిల్, మే మాసాల్లో అదనపు విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ వేలం కేంద్రం ద్వారా రెండు వందల మెగావాట్ల సాంప్రదాయ విద్యుత్ కోసం బహిరంగ టెండర్లు పిలిచింది.దానిలో వంద మెగావాట్లు రోజంతా, మరో వంద మెగావాట్లు మధ్యాహ్నం రెండు నుంచి అర్ధరాత్రి వరకు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి గాను మొదటి వంద మెగావాట్లకు ఆరు కంపెనీలు టెండర్లు వేశాయి.వాటిలో జిఎంఆర్ కంపెనీ యూనిట్ రు.3.04కు సరఫరా చేస్తామని వేసిన ధర అతితక్కువగా ఉంది. అయితే ఆ కంపెనీ టెండరు ఖరారు అయిన తరువాత తాము 50మెగావాట్లకు మించి సరఫరా చేయలేమని చెప్పింది. అయితే అదే ధరకు తాము మిగిలిన 50మెగావాట్లను సరఫరా చేస్తామని అదానీ గ్రూప్ చెప్పగా విద్యుత్ బోర్డు ఆమేరకు దానికి అర్డరు ఇచ్చింది. రెండవ వంద మెగావాట్లకోసం కూడా ఆరు కంపెనీలు పోటీ పడ్డాయి. దానిలో కూడా జిఎంఆర్ కంపెనీ రూ.3.41తో అతి తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీనిలో కూడా తాము 50మెగావాట్లే సరఫరా చేస్తామని చెప్పటంతో మిగిలిన 50 మెగావాట్లను పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్‌కు ఇచ్చారు. ఇది వాస్తవం అని కావాలంటే ఫిబ్రవరి 15నాటి విద్యుత్ బోర్డు సమావేశ వివరాలు ఎవరైనా చూడవచ్చని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
డబ్బిచ్చి సర్వేలు చేయించుకున్న ఎల్‌డిఎఫ్ – రాహుల్ గాంధీ ఉక్రోషం ! ఇరకాటంలో కాంగ్రెస్ !!
మరోసారి ఎల్‌డిఎఫ్ అధికారంలోకి రానుందని చెప్పిన సర్వేలన్నీ డబ్బిచ్చి రాయించుకున్నవి తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. బిజెపిని సిపిఎం ఎన్నడూ వ్యతిరేకించదని అందుకే ఆ పార్టీ దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తి చేయాలని చెప్పింది గానీ సిపిఎం నుంచి విముక్తి చేయాలని అనలేదన్నారు. కేరళలో కాంగ్రెస్ ఎంఎల్‌ఏలను ఆర్‌ఎస్‌ఎస్ కొనుగోలు చేయలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా వ్యవహరిస్తున్నాయని, కేరళ దొంగబంగారం కేసులో వాస్తవాలు బయటకు రావన్నారు. కేరళలో గట్టిగా జోక్యం చేసుకోవటం లేదని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ ఇతర రాష్ట్రాలో జోక్యం చేసుకుంటే అదే సంస్ధలను విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి విజయన్ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో తమ వైఖరి అన్ని చోట్లా ఒకే విధంగా ఉందన్నారు.
కాసరగోడ్ జిల్లా మంజేశ్వరం నియోజకవర్గంలో యుడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్న ముస్లింలీగ్ అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు ఎస్‌డిపిఐ చేసిన ప్రకటన కాంగ్రెస్ కూటమిని ఇరుకున పెట్టింది. ఆ మద్దతు తీసుకుంటున్నదీ, తిరస్కరిస్తున్నదీ స్పష్టం చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. మంజేశ్వరంలో పోటీ చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ ఓటమికి తాము ముస్లింలీగుకు మద్దతు ఇస్తున్నట్లు ఎస్‌డిపిఐ ప్రకటించింది. దీని గురించి యుడిఎఫ్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమకు మంజేశ్వరంలో 7,800 ఓట్లు వచ్చాయని, వాటిని ముస్లింలీగుకు వేస్తే బిజెపి ఓడిపోతుందని తమ సర్వేలో తేలిందని ఎస్‌డిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ ఫైజీ చెప్పారు. మద్దతు గురించి తమకు తెలియదని ముస్లింలీగు నేత ఒకరు చెప్పారు.
వైనాడ్ జిల్లా మనంతవాడి నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటన సమయంలో ముస్లింలీగు పతాకాలు కనిపించకపోవటం ఒకచర్చగా మారింది. కాంగ్రెస్-బిజెపి మధ్య కుదిరిన అవగాహన ప్రకారం బిజెపి ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయిస్తారు. దానికి గాను ప్రచారంలో ముస్లింలీగు పతాకాలు కనిపించకూడదని బిజెపి షరతు పెట్టిందని సిపిఎం నేతలు పేర్కొన్నారు.
విదేశీ కంపెనీకి ఓటర్ల వివరాలు అందించినందుకు రమేష్ చెన్నితల మీద బిజెపి కేసు !
కేరళ ఓటర్ల వివరాలను సింగపూర్ కంపెనీకి వెల్లడించినందుకు గాను బిజెపి నేత జార్జి కురియన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేశారు. పౌరుల వ్యక్తిగత వివరాలను విదేశాలకు వెల్లడించటం తీవ్రమైన నేరమని, జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. ఓటర్ల మౌలిక సమాచారానికి ఎన్నికల కమిషన్ సంరక్షకురాలని, దాని అనుమతి లేకుండా విదేశీ సంస్ధకు సమాచారం అందించటం పౌరుల గోప్యతకు భంగకరమని పేర్కొన్నారు. రమేష్ చెన్నితల ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో 4,34,000 మంది రెండేసి ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించగా ఎన్నికల కమిషన్ ఆ సంఖ్యను 38వేలని పేర్కొన్నదని, 2017లో సుప్రీం కోర్టు విన్న పుట్టుస్వామి కేసు ప్రకారం రమేష్ చెన్నితల, కాంగ్రెస్ కమిటీ పౌరహక్కులను ఉల్లంఘించిందని కురియన్ పేర్కొన్నారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ ఫిర్యాదు చేయనప్పటికీ రమేష్‌చెన్నితల సమాచారాన్ని బహిర్గతపరిచారని విమర్శించారు. అయితే ఎన్నికల జాబితాను ఎవరైనా చూడవచ్చని తాను చేసిన దానిలో తప్పేమీ లేదని చెన్నితల సమర్ధించుకున్నారు. ఇప్పుడు అధికారికంగా ఫిర్యాదు చేసినందున ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
నేను ఈల వేశా చూడండి అంటున్న మెట్రోమాన్ !
నేను గానీ ఈల వేస్తే అని గారడీలు చేసే వ్యక్తి కబుర్లు చెప్పే మాదిరి మెట్రోమాన్‌గా సుపరిచితుడైన బిజెపి అభ్యర్ధి శ్రీధరన్ మాట్లాడుతున్నారు. తాను రంగంలోకి దిగిన కారణంగా బిజెపికి 30శాతం వరకు ఓట్లు వస్తాయని, కనీసం 40 సీట్లు, గరిష్టంగా 75 వచ్చినా ఆశ్చర్యం లేదని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నేను బిజెపిలో చేరిన తరువాత ఎంతో మంది ప్రముఖులు తనను చూసి పార్టీలో చేరారన్నారు. బిజెపి వ్యక్తిగా కాదు మెట్రోమాన్‌గా చూసి తనకు ఓటు వేయాలన్నారు. తమకు మెజారిటీ సీట్లు వస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ కూడా చెప్పారు. తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ మాట్లాడుతూ సర్వేలలో పేర్కొన్నదానికి భిన్నంగా తమకు జనం ఆదరణను ప్రకటించటాన్ని తాను చూశానని చెప్పారు.
దౌత్య సిబ్బంది ఉపయోగించే సంచుల్లో తెచ్చిన దొంగబంగారం కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులను ఇరికించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనపై వత్తిడి తెచ్చారని ఆ కేసులో నిందితుడైన సందీప్ నాయర్ రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. తప్పుడు ప్రకటనలు చేయించిన ఇడి అధికారుల చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయటమేగాక విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. ఆ కేసులను కొట్టివేయాలన్న ఇడి దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది.
మీ నిర్వాకం మీ అద్దాల్లోనే చూసుకోండి : విజయన్
ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ ఆర్ధిక పని తీరుతో రాష్ట్రాన్ని రుణ ఊబిలో దింపిందన్న ఆరోపణలు చేసిన కాంగ్రెస్, బిజెపిలు తమ ప్రభుత్వాల నిర్వాకాలను చూసి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చురకలంటించారు.రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 2019-20లో కాంగ్రెస్ పాలిత పంజాబ్‌కు 40.3, రాజస్దాన్‌కు 33.1, బిజెపి పాలిత ఉత్తర ప్రదేశ్‌కు 34.బీహార్‌కు 31.9, పశ్చిమ బెంగాల్‌కు 37.1శాతం అప్పులు ఉంటే కేరళకు 30.2శాతమే అన్నారు. 2006లో యుడిఎఫ్ పాలన పూర్తి అయిన సమయానికి 35శాతం అప్పు ఉంటే 2011లో ఎల్‌డిఎఫ్ దిగిపోయే నాటికి 31.8శాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరు అప్పులో ఊబిలో దించారో, ఎవరు తేల్చారో జనం చూస్తున్నారని అన్నారు.